మార్కండేయ మహా పురాణము
37 - యోగసిద్ధి
దత్తాత్రేయుడు:
ఉప సర్గాః ప్రవర్తంతే దృష్టే హ్యాత్మని యోగినః యే తాం స్తే సంప్రవక్ష్యామి సమాసేన నిబోధ మే కామ్యాః క్రియా స్తథా కామాన్ మానుషా నభివాంచతి స్త్రియో దాన ఫలం విద్యాం మాయాం కుప్యం ధనం దివమ్ దేవత్వ మమరేశత్వం రసాయన వయః క్రియామ్ మరు త్ప్రపతనం యజ్ఞం జలాగ్న్యా వేశనం తథా శ్రాద్దానాం సర్వదానానాం ఫలాని నియమాం స్తథా తథోపవాసా త్పూర్తాచ్చ దేవతాభ్యర్చనాదపి తేభ్య స్తేభ్యశ్చ కర్మభ్య ఉపసృష్టోభివాంచతి చిత్త మిత్థం వర్తమానం యత్నా ద్యోగీ నివర్తయేత్
దత్తాత్రేయుడు:
ఆత్మ యొక్క దర్శనమై నపుడు యోగులకు ఏ విధమైన ఉపసర్గలన్నియు ఉత్పన్న మగునో వాటిని సంక్షిప్తముగా చెప్పెదను వినుము. ఆ సమయ మందు అనేక విధాలైన కోరికలు, క్రియలు మరియు మనస్సునకు సంబంధించిన నానా విధాల భ్రాంతిచే భోగాల ననుభవించ వలెనను కోరిక కలుగును. స్త్రీ, దానము, ఫలము, విద్యా, మాయ కూపము నందలి నీరు, ధనము, స్వర్గము, అమరత్వము, దేవేంద్రత్వము, నానా ప్రకారమగు రసాయనాలు, వాయు స్థానము లందు దూకుట, యజ్ఞము, జలము, మరియు అగ్ని ప్రవేశము, సమస్త శ్రాద్ధములు, దాన సమూహముల యొక్క ఫలములు మరియు నియమములు మొదలైన విషయము లందు యోగికి కోరికలు ఉత్పన్న మగును. ఆ కాలమందు అతడు ఉపవాసము పూర్తాది కర్మలు, దేవతార్చన, ఎప్పుడు ఎప్పుడు ఆయా కర్మలను చేయవలెనను కోరిక కలుగునో యోగి అప్పుడు యత్న సహితముగా ఆయా విషయముల నుండి చిత్తమును మరల్ప వలెను.
బ్రహ్మసంగి మనః కుర్వన్ నుపసర్గా త్ప్రముచ్యతే ఉపసర్గై ర్జితై రేభి రుపసర్గా స్తతః పునః యోగినః సంప్రవర్తంతే సాత్త్వ రాజస తామసాః ప్రాతిభ శ్శ్రావణో దైవో శ్రమావర్తౌ తధాపరౌ ప చైతే యోగినాం యోగ విఘ్నాయ కటుకోదయాః వేదార్థః కావ్య శాస్త్రార్థా విద్యశిల్పా న్యశేషతః ప్రతిభాంతి యదస్యేతి ప్రాతిభ స్సతు యోగినః శబ్ధార్థా నఖిలా న్వేత్తి శబ్ధం గృహ్ణాతి చైవ యత్ యోజనానాం సహస్రేభ్యః శ్రావణ స్సోభి ధీయతే సమంతా ద్వీక్షతే చా ష్టౌ స యదా దేవయోనయః ఉపసర్గం తమప్యాహు ర్దేవ మున్మత్త వద్భుదాః భ్రామ్యతే యన్నిరాలమ్భం మనోదోషేణ యోగినః సమస్తాచార విభ్రంశా ద్భ్రమ స్సపరికీర్తితః ఆవర్త ఇవ తోయస్య జ్ఞానావర్తో యదాకులః నాశయే చ్చిత్త మావర్త ఉపసర్గ సస ఉచ్యతే ఏతై ర్నాశితయోగాస్తు సకలా దేవయోనయః ఉపసర్గై ర్మహాఘోరై రావర్తన్తే పునః పునః ప్రావృత్య కంబలం శుక్లం యోగీ తస్మా న్మనోమయమ్ (శరీర మండలే దృష్ట్వా గురుజ్ఞానం తతో హి యత్ జ్ఞాన పూర్వోపి యో యోగో జ్ఞాతవ్యో వై విపశ్చితా )
మనస్సును బ్రహ్మ యందుంచినచో విషయముల నుండి విముక్తు డగును. వీటిని జయించినను మాటి మాటికి ఆదేశించు చుండును. ఈ సమస్త ఉపసర్గలను జయించిన పిమ్మట సాత్త్విక, రాజస, తామస భేదముల నుండి పరంపరా గతముగా విఘ్నములు వచ్చి యోగిని ఆక్రమించును. వానిలో ప్రాతిభ, శ్రావణ, దైవ, శ్రమ మరియు ఆవర్త అను ఈ ఐదు విధములైన ఉపసర్గలు యోగిని యోగ విఘ్నము కలిగించుట కొరకు భయంకర రూపముతో ఆవిర్భవించును. దేని వలన నిఖిల వేదార్థమగు సమస్త కావ్యములు , శాస్త్రార్థములగు విద్యలు మరియు శిల్పములు యోగి యొక్క చిత్తము నందు భాసిల్లునో వాటిని “ప్రతిభ” అందురు. దేని వలన సంపూర్ణ శబ్దము యొక్క అర్థము తెలియునో మరియు సహస్ర సహస్ర యోజనాల దూరము యొక్క శబ్దము కూడ వినబడునో దానిని “శ్రావణము” అని అందురు. దేని ద్వారా విగ్రహ రూపుడైన దేవతలతో సమానముగా యోగి ఉన్మత్తుని వలె ఎనిమిది దిక్కులను దర్శించునో పండితులు దానిని “దైవోపసర్గ” మని అందురు. దేని ద్వారా యోగి యొక్క చిత్తము సంపూర్ణ ఆచారాది శ్రమలతో మరియు మనస్సు యొక్క దోషముల కారణముచే నిరాలంబన భావనతో శ్రమ పడునో, దానిని “శ్రమ” అని చెప్పెదరు. దేని ప్రభావమున జలా వర్తములతో సమానముగా జ్ఞానా వర్తము వ్యాకులమగునో చిత్తమును నాశనము జేయునో దానిని “ఆవర్తోప సర్గము” అని చెప్పుదురు. యోగులు ఈ సమస్త ఉప సర్గముల ప్రభావముచే దేవ యోనులై ఈ మహా ఘోరములైన పంచోప సర్గలచే యోగ భ్రష్టులై మాటి మాటికి సంసార చక్రమందు తిరుగు తుందురు. ఈ కారణముచే యోగి మనోమయ రూపమగు తెల్లని కంబళిని కప్పుకొని (శరీర మండల మందు గురువు యొక్క జ్ఞానమును అవలోకనము చేయ వలెను. బుద్దిమంతులైన వారు జ్ఞాన పూర్వకముగా యోగము చేయవలెనని ఎరుంగ వలెను).
చిన్తయే త్పరమం బ్రహ్మ కృత్వా తత్ప వణం మనః యోగయుక్త స్సదా యోగీ లఘ్వాహారో జితేంద్రియః సూక్ష్మాస్తు ధారణా స్సప్త భూరాద్యా మూర్ద్ని ధారయేత్ ధరిత్రీ ధారయే ద్యోగీ తత్సౌక్ష్మ్యం ప్రతిపద్యతే ఆత్మానం మన్యతే చోర్వీం తద్గంధం చ జహాతి సః తథైవాప్సు రసం సూక్ష్మం తద్వ ద్రూపం చ తేజసి స్పర్శం వాయౌ తథా తద్వ ద్బిభ్రత స్తస్య ధారణామ్ వ్యోఘ్నః సూక్షాం ప్రవృత్తిం చ శబ్దం తద్వ జ్జహాతి సః మనసా సర్వ భూతానాం మన స్యావిశతే యదా మానసీం ధారణాంబిభ్ర న్మనః సూక్ష్మం చ జాయతే
మనస్సు నందు ఒక్క పర బ్రహ్మను మాత్రమే ధ్యానించుచు చింతన చేయుట యోగి యొక్క కర్తవ్యము. యోగ పురుషుడు జితేంద్రియుడై లఘు భోజుడై మరియు యోగ యుక్తుడై భూరాది ఏడు ప్రకారములైన సూక్ష్మములగు వాటిని మస్తిష్కము నందు ధారణ చేసినచో అతనికి దాని సూక్ష్మము తెలియును. అతడు ఈ విధముగా ఆత్మ చింతన చేయుట వలన ధరిత్రి యందలి బంధనములను తెంచుకొనుటకు సమర్థుడగును. ఈ విధముగా జలము నందు సూక్ష్మ రసము, తేజమందు రూపము, వాయువు నందు స్పర్శ మరియు ఆకాశ మందు సూక్ష్మ ప్రవృత్తి మరియు శబ్ద ధారణ పూర్వకముగా పరిత్యజించ వలెను. ఎప్పుడు మనస్సుచే సమస్త భూతముల యొక్క మనస్సు నందు ప్రవిష్టుడగునో అప్పుడు సూక్ష్మమగు మనస్సు ఉత్పన్న మగును.
తద్వ ద్భుద్ధి మశేషాణాం సత్వానా మేత్య యోగవిత్ పరిత్యజతి సంప్రాప్య బుద్ధి సౌక్ష్మ్య మనుత్తమమ్ పరిత్యజతి సూక్ష్మాణి సప్త త్వేతాని యోగవిత్ సమ్యగ్విజ్ఞాయ యోలర్క తస్యా వృత్తి ర్న విద్యతే ఏతాసాం ధారణానాం తు సప్తానా సౌక్ష్మ్య మాత్మవాన్ దృష్ట్వా దృష్ట్వా తతః సిద్ధిం త్యక్త్వా త్యక్త్వా పరాం వ్రజేత్ యస్మి న్మస్మింశ్చ కురుతే భూతే రాగం మహీపతే తస్మిం స్తస్మి న్సమాస క్తిం సంప్రాప్య స వినస్యతి తస్మా ద్విదిత్వా సూక్ష్మాని సంసక్తాని పరస్పరమ్ పరిత్యజతి యో దేహీ స పరం ప్రాప్ను యాత్పదమ్
ఈ విధముగా యోగ పురుషుడు సమస్త భూతముల యొక్క బుద్ధి యందు ప్రవిష్టుడై అత్యుత్తమ సూక్ష్మ బుద్ధి యొక్క స్వరూప లాభమును పొంది దానిని పరిత్యజించును. ఓ అలర్కా! ఏ యోగి సప్త ప్రకారములైన సూక్ష్మ భావాలను చక్కగా తెలుసుకొని పరిత్యజించునో, వాటిని తిరిగి జన్మలో గ్రహించ వలసిన పని లేదు. ఆత్మవంతుడైన పురుషుడు ఈ సప్త ప్రకారములైన సూక్ష్మ తత్త్వాలను మాటి మాటికి దృష్టి యందు గోచరింప జేసుకొనుచు మాటి మాటికి సిద్ధి గ్రహణ మైన పిదప విసర్జన చేయుచు పరమ గతిని పొందును. మహీపతి! అతడు ఏ ఏ భూతము లందు అనురాగము కలిగి యుండునో ఆయా భూతము లందు ఆసక్తి పరుడై వినాశనమును పొందును. అందువలన ఏ దేహి పరస్పర సంసక్తమగు భూత గణాలను తెలుసుకొని పరిత్యజించునో ఆ దేహి పరమ పద లాభమును పొందును.
ఏతా న్యేవ తు సంధాయ సప్త సూక్ష్మాని పార్థివ భూతాదీనాం వినాశోత్ర సద్భాపజ్ఞస్య ముక్తయే గంధాదిషు సమాసక్తిం సంప్రాప్య స వినశ్యతి పూనా రావర్తతే భూప సబ్రహ్మాపర మానుషమ్ సప్తైతా ధారణా యోగీ సమతీత్య యదిచ్చతి తస్మిం స్తస్మిం ల్లయం సూక్ష్మే భూతే యాతి నరేశ్వరః దేవానా మసురాణాం వా గంధర్వోరగ రాక్షసామ్ దేహేషు లయ మాయాతి సంగం నాప్నోతి చ క్వచిత్ అణిమా లఘియా చైవ మహిమా ప్రాప్తి రేవ చ ప్రాకామ్యం చ తథే శిత్వం వశిక్వం చ తథా పరమ్ యత్ర కామా వసాయిత్వం గుణా నేతాం స్తథైశ్వరాన్ ప్రాప్నో త్యప్టౌ నారా వ్యాఘ్ర పరం నిర్వాణ సూచకాన్ సూక్ష్మా త్సూక్ష్మతమో ణీయాం చ్చీ ఘ్రతం లఘిమా గుణః మహిమా శేష పూజ్యత్వా త్ప్రాప్తి ర్నాప్రాప్య మస్య యత్ ప్రాకామ్య మస్య వ్యాపిత్వా దీశిత్వాం చేశ్వరో యతః వశిత్వా ద్వశిమా నామ యోగినః సప్తమో గుణః యత్రేచ్చా స్థాన మాప్యుక్త యాత్ర కామావసాయితా ఐశ్వర్య కారణై రేభి ర్యోగినః ప్రోక్త మష్టదా ముక్తి సంసూచకం భూప పరం నిర్వాణ మాత్మనః తతో న జాయతే నైవ వర్ధతే చ వినశ్యతి
ఓ పార్థివా! ఈ సప్త విధుల సూక్ష్మములను అను సంధానము చేసి భూతాదు లందు విగత రాగు లైనప్పుడే సద్భావజ్ఞ పురుషుడై ముక్తి లాభమును పొందును. ఓ రాజా! గంధాదు లందు ఆసక్తుడైనచో నష్ట పడవలసి వచ్చును. మరియు అతనికి తిరిగి సంసార చక్రమందు పడి తిరుగ వలసి వచ్చును. ఓ నరేశ్వరా! యోగ పురుషుడు ఈ సప్త ప్రకారముల ధారణను అతిక్రమణ చేసి పోవుటకు ఇచ్చ కలిగినప్పుడు ఆయా సూక్షములగు భూతములందు లయమును పొందును. మరియు దేవతలు, దానవులు, గంధర్వులు, పన్నగములు, రాక్షసులు వీరి శరీర మందు విలీనమై పోవుదురు. కాని ఎవని యందును ఆసక్తి ఉండదు. అతడు అణిమా, లఘిమా, మహిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము మరియు కామావసాయిత్వము అను ఈ అష్టవిధ నిర్వాణ ప్రద, ఐశ్వరిక గుణాలకు అధికారి అగును. దేని ద్వారా సూక్ష్మము నుండి సూక్ష్మ తరమగునో దాని పేరు “అణిమ”, దేని ద్వారా సమస్త కోరికలు ప్రాప్తించునో (అనగా అన్ని కార్యములందు శీఘ్రమే ఉత్పన్నత కలుగుట) దానిని “లఘిమ” అని అందురు. దేని ద్వారా వ్యాపక శక్తి ఉత్పన్నమగునోదాని పేరు “ప్రాకామ్యము” దేని ప్రభావముచే ఈశ్వర రూపమగునో దానిని “ఈశిత్వ”మని అందురు. మరియు దేని ప్రభావముచే అన్ని వశీభూతము లగునో దాని పేరు “వశిత్వము” ఈ వశిత్వమే యోగి జనులకు ఏడవ గుణమని చెప్పబడెను. దేని ద్వారా తన ఇచ్చాను సారముగా ఇక్కడకు అక్కడకు గమనము చేయునో మరియు అన్ని కార్య సాధనములు కలుగునో దాని పేరు “కామవసాయితా”. ఈ ఎనిమిది ప్రకారముల గుణ ప్రభావముచే ఈశ్వరుని సమస్త కార్యములను చేయుటలో సమర్థత కలుగును. ఓ రాజా! ఈ అన్ని గుణములు ముక్తికి సూచనలు అయి ఉన్నవి. అనగా ఈ అన్ని గుణములు ప్రకాశించి నప్పుడే యోగి వెంటనే ముక్తి లాభము పొందునని తెలుసుకొన వలెను. నిర్వాణ లాభము కలుగుటకు సమయము ఆసన్న మైనదని, జన్మ గ్రహణము పొందవలసి రాదని, బుద్ధిని పొందవలసి రాదని మరియు వినాశనము కలుగదని గ్రహించ వలెను.
నాపి క్షయమ వాప్నోతి పరిణామం న గచ్చతి చేదం క్లేదం తథా దాహం శోషంభూ రాదితో న చ భూతవర్గా దవాప్నోతి శబ్దాద్యై ర్హ్రియతే న చ న వాస్య సస్తి శబ్దాదాస్త ద్భోక్తాతైర్న యుజ్యతే యథా హి కోకః నాకం ఖండ మపద్రవ్యవ దగ్నినా దగ్ధదోషం ద్వితీయేన ఖండేనైక్యం వ్రజే న్నృపః న విశేష మవాప్నోతి తద్వ ద్యోగాగ్నినా యతిః నిర్దగ్ధ దోష స్తేనైక్యం ప్రయాతి బ్రహ్మణా సహ యథాగ్ని రాగ్నౌ సంక్షిప్తః సమానత్వ మనువ్రజేత్ తదాఖ్య స్తన్మయో భూతో న గృహ్యేత విశేషతః నరేణ బ్రహ్మణా తద్వ త్ప్రాపైక్యం దగ్ధకిల్బిషః యోగీ యాతి పృథ గ్భావం న కదాచి నృహీపతే యథా జలం జలే నైక్యం నిక్షిప్త ముపగచ్చతి తథాత్మా సామ్య మభ్యేతి యోగినః పరమాత్మని
క్షయమును పొందుట, దాని గురించి ఏదేని పరిణామము పొందుట, తిరిగి ఎప్పుడు భూరాది భూత వర్గముల నుండి చిన్న, భిన్న, క్లిన్న, దగ్ధ, శుష్కములు మొదలైనవి కూడ ఉండవు. శబ్దాదులన్ని దానిని అపహరించుటలో సమర్థత ఉండదు. శబ్దాది విషయముల సాంగత్యము తిరిగి దానికి ఏ సంబంధము ఉండదు. మరియు శబ్దాది భోక్త కూడా ఉండడు. మరియు వాని సాంగత్యముతో దాని స్పర్శ తిరిగి ఏమీ ఉండదు. మహీపతీ! ఏవిధముగా ఒక స్వర్ణ ఖండమును చెడు ద్రవ్యముతో సమానముగా వెలుపల దగ్ధము చేసి దోష రహితముగా చేసి నప్పుడు మరియొక స్వర్ణ ఖండముతో ఏకత్వము పొందునో, ఏ విధముగా గాని భేదము కనిపించదో, ఆ ప్రకారముగా యోగాగ్ని ద్వారా రాగ ద్వేషాది రూప దోషాలను భస్మము చేయుట వలన యోగి కూడ బ్రహ్మతో ఐక్యమగును. ఓ రాజా! ఏవిధముగా అగ్ని యందు అగ్నిని పడ వేయుట వలన సమానత్వము ప్రాప్తినచునో మరియ తాదాత్మ్యము, తన్మయము అగుచున్నదో మరియు దాని భేదము స్థిరముగా చేయబడదో ఈ విధముగా దోషములు దగ్ధము అయినప్పుడు యోగి బ్రహ్మ సాంగత్యముచే ఒకసారి సంయుక్తు డగుచో అప్పుడు తిరిగి అతనికి ఎప్పుడును వేరు భావమును పొందవలసి రాదు. జలము ఏ విధముగా నీటి యందు పడి సమాన భావమూ పొందు చున్నదో, యోగి పురుషుల యొక్క ఆత్మ కూడ అట్లే పరమాత్మ యందు విలీనమయి సామ్యతను పొందు చున్నది.
Summary of chapter 37 of the Mārkandeya Mahā Purana is as follows:
The dialogue between Jaḍa and his father explores the profound discrimination between the eternal Ātman and the transient physical body. The son explains that the self is neither the physical senses, nor the intellect, nor the subtle prāṇas, but the changeless witness of all states of waking, dreaming, and deep sleep.