16 - దత్తాత్రేయ మాహాత్మ్య వర్ణనము

జనకుడు:

కథితం మే త్వయా వత్సః సంసారస్య వ్యవస్థితమ్ స్వరూప మాపి దేహస్య ఘటీ యంత్రవ దవ్యయమ్ తదేవ మేత దఖిలం మమావగత మీదృశమ్ కి మ్మయా పద కర్తవ్య మేవ మాస్మి వ్యవస్థితే

జనకుడు:

వత్సా! ఘటీ యంత్రముతో సమాన మగుచున్నదియు, అవశ్యము త్యాగము జేయ దగినదియు నగు సంసార స్థితిని, దేహము యొక్క స్వరూపమును గురించియు నాకు నీవు జెప్పితివి. ఈ ప్రపంచ మంతయు ఇట్టిదే యను జ్ఞానము కలిగినది. ఇట్టి పరిస్థితిలో నేను జేయ వలసిన కర్తవ్యమేమి? తెలుపుము.

పుత్రుడు:

యది మద్వచనం తాతః శద్ధధా స్యవిశంకిత తత్పరిత్యజ్య గార్హన్థ్యం వానప్రస్థ మనా భవ తమనుష్టాయ విదివ ద్విహాయాగ్ని పరిగ్రహమ్ ఆత్మన్యాత్మాన మాధాయ నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః ఏకాంత సేవీ వశ్యాత్మా భవ భిక్షు రతంద్రితః తత్ర యోగపరో భూత్వా బాహ్య స్పర్శ వివర్జితః

పుత్రుడు:

తండ్రీ! నా మాట యందు నీకు విశ్వాసమున్న యెడల, యెంత మాత్రము శంకించక, గృహస్థాశ్రమమును వదలి, వాన ప్రస్థాశ్రమము నందు మనస్సు గల వాడ వగుము. విధి ప్రకారముగా వాన ప్రస్థాశ్రమమును అనుష్టించి, అగ్ని పరిగ్రహమును త్యాగము జేసి, ఆత్మ యందాత్మను జేర్చి ద్వంద్వ రహితుడవు, నిష్పరి గ్రహుడవు గమ్ము. మరియు ఏకాంత వాసివి గమ్ము. ఇంద్రియముల నాత్మ వశ్యము జేయుము. అలసత్వ రహితుడవై భిక్షుకుడవు గమ్ము. ఈ ప్రకారము యోగ చిత్తుడ వగుము. ఇట్లయినచో బాహ్య స్పర్శ రహితుడ వగుదువు.

తతః ప్రాస్స్యసి తంయోగ దుఃఖ సంయోగ భేషజమ్ ముక్తి హేతు మనౌపమ్య మనాఖ్యేన మసంజ్ఞితమ్ తత్సంయోగా న్నతే యోగో భూయో భూతై ర్భవిష్యతి

అప్పుడు ముక్తి కారణము ఉపమా హీనము, వచనా తీతము, సంజ్ఞా రహితము, మరియు దుఃఖ సంయోగమునకు ఔషది రూప మగునట్టి యోగమును బొందగలవు. ఇట్టి యోగ ప్రాప్తిచే నీకు మరల పంచ భూతాత్మిక మగు శరీర సంయోగము లేనందున ముక్తి పొందెదవు.

జనకుడు:

వత్స యోగం సమాచక్ష్వ ముక్తి హేతు మతః పరమ్ యేన భూతైః పునర్భూతో నైదృక్ దుఃఖ మవాప్నుయామ్ యత్రాసక్తి పరస్యాత్మా మమ సంసార బంధనైః నేతి యోగః మయోగో పి తం యోగ మధునా వద సంసారాదిత్య తాపార్తి విప్లుష్య ద్దేహ మానసమ్ బ్రహ్మ జ్ఞానాంబు శీతేన సించ మాం వాక్యచారిణా అవిద్యా కృచ్చ సర్పేణ దష్టం తద్విష పీడితమ్

జనకుడు:

వత్సా! అటు లైనచో ముక్తి కారణ మగు నా యోగ స్వరూపమును నాకు జెప్పుము. ఏ యోగము నవలంభించుటచే భౌతిక పదార్థ సంగముచే మరల జనన మరణములు గలిగి, నాకు దుఃఖము గలుగ కుండునో, యోగ మార్గము తెలుపుము. సంసారమనే త్రాళ్ళచే బంధింప బడి యున్నాను. సంసార మందు జ్ఞాన హీనుడ నగుటచే నాసక్తి గలిగి యున్నాను. గావున యిట్టి నాకు ఆత్మ జ్ఞానమును బోధించుము. ఏ యోగముచే జననాది యోగములు లేకుండునో, అట్టి యోగ శాస్త్రమును నాకు తెలుపుము. నా శరీరము, నా మనస్సు, సంసారమనే సూర్యుని తాపముచే మిక్కిలి పీడింప బడుచున్నది. కుమారా! నీవు బ్రహ్మ జ్ఞాన రూపమగు చల్లని నీటితో మిశ్రితమగు నీ వచన రూప జలముచే నన్ను అభిషేకించుము. నాకు శాంతిని ప్రసాదించుము. అజ్ఞాన రూపమగు సర్పము నన్ను కాటు వేసినది. విష మెక్కినది. మృత ప్రాయుడవై యున్నాను.

స్వవాక్యా మృత దానేన మాం జీవయ పునర్మృతమ్ పుత్రా దార గృహ క్షేత్ర మమత్వ నిగడార్థితమ్ మాం యోచ యేష్ట సద్భావ విజ్ఞానోద్ఘాటనై శ్చిరమ్

నీవు, నీ వచన రూపమగు అమృతమును త్రాగించుము. నన్ను మరల బ్రతికించుము. కుమారా! నేను పుత్రులు, భార్యలు, గృహములు, ధనములు, క్షేత్రములు, అను యినుప సంకెళ్ళచే బంధింపబడి మహా దుఃఖమును బొండు చున్నాను. నీవు సద్భావయుక్త మగు విజ్ఞానమును నాకు కలుగ జేయుము. నన్ను సంసార బంధము నుండి విముక్తుని జేయుము.

పుత్రుడు:

శృణు తాత యథా యోగో దత్తాత్రేయేణ ధీమతా అలర్కాయ పురా ప్రోక్తః సమ్యక్ పృష్టేన విస్తరాత్

పుత్రుడు:

జనకా! మహాజ్ఞాన సంపన్నుడగు దత్తాత్రేయుడు చెప్పిన యోగ మార్గమును జెప్పెదను. వినుము. పూర్వము దత్తాత్రేయుడు అలర్కునికి చెప్పెను. అలర్కుడు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో లెస్సగా యడిగెను.

జనకుడు:

దతాత్రేయః సుతః కస్య కథం వా యోగ ముక్తవాన్ కశ్చాలర్కో మహాభాగో యో యోగం పరిపృష్టవాన్

జనకుడు:

కుమారా! దత్తాత్రేయుడు ఎవని కుమారుడు? ఆతడు జెప్పిన యోగ మార్గ మేమిటి? యోగ విధానము నడిగిన మహానుభావుడగు యలర్కుడు ఎవరు?

పుత్రుడు:

కౌశికో బ్రాహ్మణః కషితేత్ ప్రతిష్ఠానే భవత్ పురే సోన్య జన్మ కృతైః పాపైః కుష్ఠురోగాతురో భవత్ తం తథా వ్యాధితం భార్యా పతిం దేవమివా ర్చయత్

పుత్రుడు:

పూర్వము ప్రతిష్టాన మను పట్టణమున కౌశికుడు అను నొకానొక బ్రాహ్మణుడు ఉండెను. ఆ విప్రుడు పూర్వ జన్మ యందు జేసిన పాపములచే కుష్ఠు రోగముతో బాధ పడుతూ ఉండెను. భార్య అట్లు వ్యాధి పీడితుడగు ఆ భర్తను దేవుని వలె సేవించు చుండెను.

పాదా భ్యాంగాంగ సంవాహ స్నానాచ్చాదన భోజనైః శ్లేష్మ మూత్ర పురీషానృక్ ప్రవాహక్షాళనేన చ రహస్యేనోప చారేణ ప్రియ సంభాషణేన చ సతతం పూజ్యమానోపి తయాతీవ వినీతయా అతి తీవ్ర ప్రకోపత్వా నిర్భత్సయతి దారుణః తథాపి ప్రణతా సాథ్వీ తమమన్యత దైవవత్ తం తథాప్యతిభీభత్సం సర్వ శ్రేష్ఠ మమన్యత అచం కమణ శీలోపి స కదాచి ద్ద్విజోత్తమః ప్రాహ భార్యాం నయస్వేతి త్వం మాం తస్యా నివేశనమ్ యా సా వేశ్యామయా దృష్టా రాజమార్గే గృహే సతా

పాదాభ్యంజన, శరీర రక్షణ, స్నాన, ఆచ్చాదన, భోజనములు, శ్లేష్మ, మూత్ర, పురీష, ఆసృక్ ప్రవాహ, ప్రక్షాళనములు జేయు చుండెను. ఏకాంత సమయము లందు ప్రియ సంభాషణాద్యుప చారముల చేతను వినయ విధేయతలతో మిక్కిలిగా పూజా భావముతో ప్రవర్తించు చుండెను. ఇట్లు ఎల్లప్పుడు సేవించి నప్పటికిని, ఆ భర్త తీవ్ర కోపము గలవా డగుటచే దుర్మార్గుడై హింసించు చుండెను. అయినను ఆ సాధ్వి ఆతడిని దైవమని తలంచు చుండను. ఆమె అతి భయంకరు డయినను అందరి కంటె తన భర్తయే శ్రేష్టుడని తలచెను. ఒకానొక సమయమున నడుచుటకు కూడా శక్తి లేని యా బ్రాహ్మణుడు, భార్యను యిటుల యాజ్ఞాపించెను. నేను గృహ మందుండగా రాజ మార్గమున బోవుచున్న యొక వేశ్యను ఉదయమున జూచితిని. ఇప్పుడు రాత్రియైనది. గాన నీవు ఆ వేశ్య ఇంటికి యిప్పుడు తీసుకొని బోవలెను.

తాం మే ప్రావయ ధర్మజ్ఞే శైవ మే హృది వర్తతే దృష్టా సూర్యోదయే బాలా రాత్రి శ్చేయ ముపాగతా దర్శనానంతరం సామే హృరయాన్నాపసర్పతి యది సా చారు సార్వాంగీ పీనశ్రోణి పయోధరా నొప గూహతి తన్వంగీ తన్మాం ద్రక్ష్వతి వై మృతమ్ వామః కామో మనుష్యాణాం బహుభిః ప్రాప్య చేతసః మామా శక్తిశ్చ గమనే సంకులం ప్రతిభాతి మే త త్తదా వచనం శ్రుత్వా భర్తు కామాతురస్య సా తత్పత్నీ వ్యాకులా జాతా మహాభాగా పతివ్రతా గాఢం పరికరం బడ్డవాశుల్క మాదాయ చాధికమ్

నీవు ధర్మము తెలిసిన దానవు కదా! నీవు నన్ను ఆ వేశ్య కడకు తీసికొని బొమ్ము. ఆ వేశ్య నా మనస్సున నిలిచి యున్నది. నేను ఉదయ కాలమున యా వేశ్య యువతిని జూచితిని. ఇప్పుడు రాత్రి గూడ నయినది. ఆ వేశ్యను జూచి నప్పటి నుండి నా మనస్సు ఆమె నుండి తొలగి బోవుట లేదు. ఆ వేశ్య మనోహర సర్వాంగ సుందరి. పీనశ్రేణి పయోధర. నేను అట్టి తన్వంగిని యా లింగనము జేసికొననిచో నేను బ్రతుక జాలను. నీవు నన్ను జూడలేవు. నా మృత శరీరమును జూచేదవు. మన్మధుడు మనుష్యుల మనస్సులలో ప్రవేశించి క్రూర మయిన పనులు జేయు చుండును. నాకు బోవుటకు శక్తి లేదు. నాకు చాలా విషమ స్తితి ఏర్పడినది. అప్పుడామే తన స్వామి వచనమును వినెను. ఆతడు మిక్కుటమగు కామ వాంఛతో ఉండుట గ్రహించెను. సత్కులో త్పన్నురాలు, మహా సంభవురాలు, మహా పతివ్రత యగు నామె మహా వ్యాకులము జెందెను. ధైర్యము దెచ్చుకొనెను. నడుము బిగించెను. వేశ్య కిచ్చుటకు అధికముగా ధనమును తీసికొనెను.

స్కంధే భర్తార మారోప్య జగామ మృదు గామినీ నిశి మేఘావృతే వ్యోమ్ని చల ద్విద్యుచ్చ దృశ్యతే రాజమార్గే ప్రియం భర్తు శ్చికీర్షంతీ ద్విజాంగనా పథి శూలే తథా ప్రోత మచోరం చొర శంకయా మాండవ్య మతి దుఃఖార్త మంధకారే చ సద్విజః పత్నీ స్కంద సమారూఢ శ్చాలయామాస కౌశికః వామాంగే నాథ సంకృద్దో మాండవ్య స్త మువాచ హ యేనాహమేవ మత్యర్థం దుఃఖిత శ్చాలితో వృథా ఇత్థం కష్ట మనుస్రాప్తః స పాపాత్మా నరాథమః సూర్యోదయే వశః ప్రాణైః ర్వియోక్షతి న సంశయః

తన స్వామిని భుజము మీదికి ఎక్కించు కొనెను. మెల్ల మెల్లగా బోవుచుండెను. ఆకాశము మేఘావృతమై యుండెను.అందులో రాత్రి గూడ నగుటచే అంధకార బందురమై యుండెను. చంచలములగు మెరుపులు మార్గమును గనబర్చు చుండెను. ఆ ద్విజాంగన తన స్వామి యభీష్టము నెరవేర్చ వలయునని కోరుకొనెను. ఇట్లు బోవుచుండ రాజ మార్గమున దొంగ కాక బోయినను దొంగ యని శంకించి శూలమునకు గుచ్చబడి యున్నవాడును, అతి దుఃఖార్తుడు అగు మాండవ్య మహామునిని కటిక చీకటిలో భార్య భుజము మీద యున్న కౌశిక బ్రాహ్మణుడు మాండవ్య మహాముని పాదములను తాకెను. అందుచే మాండవ్యుడు చలించెను. వామాంగా సంచలనముచే మాండవ్యుడు క్రుద్దుడయ్యెను. పిమ్మట యాతని శరీర స్పర్శచే మహా దుఃఖము జెందెను. మరియు నిట్లనెను. ఇట్లు వ్యర్ధముగా కష్టమును గలిగించిన పాపాత్ముడగు నరాధముడు సూర్యోదయ మగు సరికి ప్రాణ త్యాగము జెందుగాక. సంశయము లేదు.

భాస్కరా లోకనాదేవ సవినాశ మవాప్స్యతి తస్య భార్యా తతః శ్రుత్వా తమ్ శాపమతి దారుణమ్

ప్రోవాచ వ్యధితా సూర్యో నైవోదయ ముపేష్యతి తతః సూర్యోదయా భావా దభవ త్సంతతా నిషా బహూ న్యహః ప్రమాణాని తతో దేవా భయం యముః నిఃస్వాద్యాయ వశట్కారం స్వదా స్వాహా వివర్జితమ్ కథన్ను ఖ్వలిదం సర్వం న గాచ్చేత్సంక్షయం జగత్ అహోరాత్ర వ్యవస్థాయా వినా మాసర్తు సంక్షయః త త్సంక్షయా న్నత్వయనే జ్ఞాయేతే దక్షిణోత్తరే

వాడు సూర్యుని చూడగానే నిస్సంశయముగ మరణము బొంద గలడు. అనంతరమా విప్రుని భార్య మహా దారుణమగు నా శాపములను వినెను. అత్యంత దుఃఖితము జెంది యిట్లనియె. ‘సూర్యుడు ఉదయించ కుండు గాక’. ఇట్లు ఆమె శపించుటచే సూర్యోదయము గాకుండెను. ఎల్లవేళలా రాత్రిగానే యుండెను. ఇట్లు చాలా రాత్రులు గడిచెను. పిమ్మట దేవతలు భయము జెందిరి. అప్పుడు వారు ఇట్లు తలచిరి. స్వాద్యాయ, వషట్కార స్వధా, స్వాహాదులు లోపమయినవి. ఈ జగత్తు ఇటులైనచో జగద్రక్షణ ఎట్లు జరుగును? లోక నాశము గాకుండుటకు మార్గామే మున్నది? అహో రాత్ర వ్యవస్థ లేనిచో మానవులు, ఋతువుల విభాగ ముండదు. ఋతు విభాగము లేనిచో ఉత్తరాయణ, దక్షిణాయనములు దెలియవు.

వినా చాయన విజ్ఞానం కాలః సంవత్సరః కుతః పతివ్రతాయా వచనా న్నోద్గచ్చతి దివాకరః సూర్యోదయ వినానైవ స్నానదానాదికాః క్రియాః అగ్నే ర్విహరణం చైవ క్రత్వభావస్య లక్ష్యతే న కాలేన వినా చేష్టి న్నచ యజ్ఞాదికాః క్రియాః నశ్యంతి సర్వభూతాని తమోభూతే చరాచారే నైవాప్యాయన మస్మాకం వినా హోమేవ జాయతే వయ మాప్యాయితా మర్త్యై ర్యజ్ఞ భాగై ర్యతోచితైః వృష్ట్యా దినాను గృహ్ణీమో మర్త్యా సస్యాభివృద్దయే నిష్పాదితా స్వౌషదీషు మర్త్యా యజ్ఞై ర్యజంతి నః

అయిన విజ్ఞానము లేనప్పుడు సంవత్సర కాలమెట్లు తెలియును? సూర్యుడు పతివ్రతా వాక్యముచే ఉదయించుట లేదు. భానుడు ఉదయించక పోవుటచే స్నాన, దానాది క్రియలు లేకుండెను. అగ్ని హోత్ర కర్మలు లేకపోయెను. సమస్త యజ్ఞములు అభావమయ్యెను. కాల జ్ఞానము లేనిచో ఇష్టులు యజ్ఞాది క్రియలు లేకుండెను. చరాచర ప్రపంచమంతయు అంధకార బంధర మగుటచే సమస్త ప్రాణులు నశించెదరు. హోమములు లేనిచో మనకు తృప్తి గలుగదు. మానవులు యథోచితము లగు యజ్ఞ భాగములతో మనకు తృప్తి గలుగజేయు చుందురు. మనము సంతోషించి వర్షాదులచే వారికి సంతోషము గలుగ జేయు చుందుము. సమస్త ఔషధులు గలుగుటచే వారు యజ్ఞములచే మనల పూజించు చుందురు.

ఏవం వయం ప్రయచ్చామః కామాన్ యజ్ఞాది వూజితాః అదో హి వయం వర్షామ వయం మర్థ్యా శ్చోర్ధ్వం ప్రవర్షిణః తోయ వర్షేణ వయం హవి ర్వర్షేణ మానవాః యేస్మాకం న ప్రయచ్చంతి నిత్య నైమిత్తికీః క్రియాః క్రతు భాగం దురాత్మనః స్వయం వాశ్నంతి లోలుపాః వినాశాయ వయం తేషాం తోయ సూర్యాగ్ని మారుతః క్షితిం చ సందూషయామః పాపానా మపకారిణామ్ దుష్ట తోయాది దోషేణ తేషాం దుష్కృత కర్మణామ్ ఉపసర్గాః ప్రవర్తంతే మరణాయ సుదారుణాః యే త్వస్మాన్ ప్రీణయిత్వాతు భుజంతే శేష మాత్మనా

ఈ ప్రకారము మనము యజ్ఞాది పూజలచే వారి వారి కోర్కెల నిచ్చు చుందుము. మనము క్రిందికి జలమును వర్షించు చుందుము. మానవులు పైకి ఘృతమును వర్షించు చుందురు. మనము జల వర్షము చేతను మనుజులు ఘ్రుత వర్షము చేతను అన్యోన్యము సంతుష్టిని బొందు చుందుము. దురాత్ములగు కొందరు నిత్య నైమిత్తి కాది కర్మలను మనకు సమర్పించరు. లోభ బుద్ధులై యజ్ఞ భాగములను స్వయముగా ననుభవించెదరు. మనము అట్టి వారలను నాశనము చేయుదుము. వారిని నశింప జేయుటకు భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అను ఈ పంచ భూతములను ( కల్మషము గల వానిని చేయుదుము.) పృథి వ్యాది పంచ భూతములు దూషితము లగుటచే దూషిత జలాదులను సేవించుదురు. మనకు యపకారము జేయునట్టి యా పాప కర్ములకు దుష్టము లైన జలాది భోగములచే రోగముల పాలగుదురు.

తేషాం పుణ్యతమా ల్లోకాన్వితరామో మహాత్మనామ్ త న్నాస్తి సర్వ మేతద్ది నచోపాయ వ్యవస్తితమ్ కథ న్ను దివా సంగః స్యా దన్యోన్య మవ దన్సురాః తేషా మేవ సమేతానాం యజ్ఞ వ్యుచ్చిత్తి శంకినామ్ దేవానాం వచనం శ్రుత్వా ప్రాహ దేవః ప్రజాపతిః తేజః పరం తేజసైవ తపసా చ తప స్తథా ప్రశామ్య త్యమరా స్తస్మా చ్ఛృణుధ్వం వచనం మమ పతివ్రతాయా మహాత్మ్యా న్నో ద్గచ్చతి దివాకరః తస్య చా నుదయా ద్దాని ర్మర్ద్యానాం భవతాం యథా తస్మా త్పతివ్రతా మాత్రే రానసూయా తపస్వినీమ్

మేమట్టి మహాత్ములకు, సమస్త పుణ్య మయములగు స్థానముల నిచ్చు చుందుము. ఇప్పుడు వారి కెవ్విధమగు నాధారము లేదు. ఉపస్థితి లేదు. దీని కుపాయము తోచకున్నది. యజ్ఞాది కర్మలు నశించునని యాందోళన జెందుచున్న దేవతలు పరస్పర మిట్లు చెప్పుకొనసాగిరి. దిన సాంగత్యము మరల యెట్లు జరుగునో కదా! బ్రహ్మ దేవుడు దేవతల మాటలను విని యిట్లు జెప్పెను. దేవతలారా! తేజస్సుచే తేజస్సు, తపస్సుచే తపస్సు శాంతించును. అందువలన దేవతలారా! నా మాట వినుడు. పతివ్రతా ప్రభావముచే సూర్యుడు పైకి వచ్చుట లేదు. సూర్యోదయము కానిచో మానవులకు దేవతలగు మీకు హాని కలుగును. గావున యత్రి మహర్షి భార్య మహా తపస్విని మహా పతివ్రత యగు యనసూయా దేవిని ప్రార్థించుడు.

ప్రసాదయత పత్నీం భానో రుదయ కామ్యయా

అమరులారా! సూర్యోదయము గావలయునను కోరికతో అత్రి పత్నిని ప్రసన్ను రాలిని గావించు కొనుడు.

పుత్రుడు:

సాతైః ప్రసాదితా గత్వా ప్రాహేష్తః వ్రియతా మితి అయాచత దినం దేవా భవత్యితి యథా పురా

పుత్రుడు:

అప్పుడు దేవతలు వెళ్లి ఆమెను ప్రసన్నురాలిని జేసుకొనిరి. పిమ్మట యామె ప్రసన్నురాలై మీకేమి గావలయునో కోరుడని బల్కెను. దేవతలు యథా ప్రకారముగా పగలు గావలయునని యాచించిరి.

అనసూయ:

పతివ్రతాయ మహాత్మ్యం న హీయేత కథం త్వితి సంమాన్యతాం తథా సాద్వీం తథా ప్రేష్యామ్యహం సురాః యథా పునరహో రాత్ర సంస్థాన ముపజాయతే యథా చ తస్యాః స పతి ర్నశాపా న్నాశమేష్యతి

అనసూయ:

దేవతలారా! పతివ్రతా ప్రభావ మెప్పటి కయినను క్షీణించదు. సురలారా! ఆ సాధ్విని గౌరవించి పంపెదను. తిరిగి అహోరాత్రములు గలుగు నట్లు జేసెదను. ఆమె భర్త శాపముచే నశింపకుండ జేసెదను.

పుత్రుడు:

ఏవ ముక్తా సురాం స్తస్యా గత్వా సా మందిరం శుభా ఉవాచ కుశలం పృష్టా ధర్మం భర్తు స్తథాత్మనః కచ్చి న్నందసి కళ్యాణి స్వ భర్తుః సుఖదాయినీ

పుత్రుడు:

మంగళ ప్రదురాలగు నామె దేవతలతో నట్లు జెప్పి యామె గృహమునకు బోయెను. ధర్మ దేవతకు నీ భర్తకు నీకు కుశలమే నా యని యడిగెను. భర్తృ సుఖమును గోరు కళ్యాణీ! ఆనందముతో యుంటున్నావా?

కచిచ్చాఖిల దేవేభ్యో మన్యసే భ్యధికం పతిమ్ భర్తుః శుశ్రూషణా దేవ మయా ప్రాప్తం మహత్ఫలమ్ సర్వ కామ ఫలా వ్యాప్తిః పత్యుః శుశ్రూషణాత్ స్త్రీయాః పంచర్ణాని మనుష్యేణ సాధ్వి దేయాని సర్వదా తథాత్మ వర్ణ ధర్మేణ కర్తవ్యో ధన సంచయః ప్రాప్తశ్చార్థ స్తథా పాత్రే వినియోజ్యో విధానతః నత్యార్జవ తపో దాన దయాయుక్తో భావేత్సదా క్రియా చ శాస్త్ర నిర్దిష్టా రాగ ద్వేష వివర్జితా కర్తవ్యాహరహః శ్రద్ధా పురస్కారేణ స్వశక్తితః స్వజాతి విహితా నేవం లోకా ప్రాప్నోతి మానవః  

నీవు నీ భర్తను సమస్త దేవతల కన్న మిన్నయని తలంచు చున్నావా? భర్తృ సేవ జేయుట చేతనే నేను మహా ఫలమును బొందితిని. స్త్రీకి పతిసేవ వలన సర్వ కామ ఫలములు ప్రాప్తించును. ఎల్ల వేళలా మానవుడగు వాడు అయిదు ఋణములను దీర్చు కొనవలసి యున్నది. తన వర్ణ ధర్మ ప్రకారముగా విత్త సంచయము జేయవలెను. లభించిన ద్రవ్యమును విధి పూర్వకముగా సత్పాత్రులైన వారికి దానము జేయవలెను. ఎల్లప్పుడు సత్యము, మార్ధవము, తపస్సు, దానము, దయ వీటితో గూడి యుండ వలయును. మరియు ప్రతిదినము శ్రద్ధా పూర్వకముగా రాగ ద్వేషములను విడిచి బెట్టవలెను. యథా శక్తిగా సమస్త శాస్త్రోక్త క్రియల యొక్క యనుష్టానము జేయ వలెను. పురుషుడీ ప్రకారముగా తన శక్తి యొక్క యను సారముగా స్వజాతి విహిత ధర్మములను చేయువాడు ఉత్తమ లోకములను బొందును.

క్లేశేన మహతా సాద్వి ప్రాజావత్యాదికా క్రమాత్ స్త్రీయశ్చైవం సమస్తస్య నరై ర్దుఃఖార్జితస్య వై పున్యస్యార్థా పహారిణ్యః పతి శుశ్రూష యైవ హి నాపు స్తి స్త్రీణాం పృథ గ్యజ్ఞో నశ్రాద్ధం నా ప్యు పోతమ్ భర్తృ శుశ్రూషయై వైతా లోకా నిష్ఠా జయంతి హి తస్మా త్సాధ్వి! మహాభాగే!

పతి శుశ్రూషణం ప్రతి త్వయా మతిః సదా కార్యా యతో భర్తా పరా గతిః యద్దేవేభ్యో యచ్చ పిత్రాపుది కే భ్యః కుర్యా ద్భర్తా పుభ్యర్చనం సత్క్రియాం చ తస్యార్థ వై కేవాలా నన్య చిత్తా నారీ భుంక్తే భర్తృ శుశ్రూషయైవ

మరియు మహా క్లేశముచే క్రమముగా ప్రాజాపత్యాది పవిత్ర లోకములకు వెళ్ళుటకు సమర్థుడగు చున్నాడు. స్త్రీ లయితే కేవలము పతిసేవా మాత్రము చేతనే పురుషుని యొక్క దుఃఖోపార్జితము లైన అన్ని పుణ్యములలో నర్థ భాగమును పొందు చున్నది. స్త్రీలగు ప్రత్యేకముగా యజ్ఞములు గాని, శ్రాద్ధములు గాని, యుపవాసములు గాని, శాస్త్రమందు విధించ బడలేదు. ప్రతి శుశ్రూషచే భర్త చేసిన పుణ్యములో సగము బొందు వారయ్యెదరు. స్త్రీ పతి సేవా ప్రభావము చేతనే యభీష్టము లగు సర్వ లోకములకు బోవుటకు సమర్థురాలగు చున్నది. ఈ కారణముచే హే సాధ్వీ! హే మహాభాగే! నీవు పతి దేవుని సేవ యందెల్లప్పుడు ప్రయత్నము గల దానవగుము. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము, పరమ గతియునై యున్నది. జూడుము. భర్త యగు వాడు దేవత లను, పితృ దేవతలను, అతిధి గణములను సత్కార పూజాది పుణ్య కర్మలను జేయును. భార్య పతి సేవ చేతనే యనగా శ్రద్దా భక్తులచే నననస్య చిత్తురాలై సేవించినచో పతి జేసిన ఋణ్య మందు సగము బొందును.

పుత్రుడు:

తస్యా స్తద్వచనం శ్రుత్వా ప్రతి పూజ్య తదాదరాత్ ప్రత్యువాచాత్రి పత్నీం తా మనసూయా మిదం వచః

కుమారుడు:

అత్రి పత్నియగు యనసూయ జెప్పిన యీ వాక్యములను విని, ద్విజ రమణి యత్యంతాదరముతో నామెను పూజించి యిట్లు బల్కెను. హే! స్వభావ శుభ దాయినీ! యిప్పుడు నేను ధన్యురాలను. అనుగృహీతురాలను. దేవతలు గూడ నేడు నా యందు గ్రహ దృష్టిని బ్రసరింప జేసిరి. నీవు నేడు మరల నా స్వామి యందు శ్రద్ధను వృద్ధిని బొందించితివి.

ధన్యాస్మ్యను గ్రుహీతాస్మి దైవస్యా ప్యవలోకతః

యన్మే ప్రక్రుతి కళ్యాణి! శ్రద్ధాం వర్ధయసే పునః జానామేత్య న్న నారీణాం కచ్చిత్పతి సమా గతిః తత్ప్రీ తిశ్చోప కారాయ ఇహ లోకే పరత్ర చ పతి ప్రసాదా దిహ చ ప్రేత్య చైవ యశాశ్వినీ నారీ సుఖ మవాప్నోతి నార్యా భర్తా హి దైవతమ్ సాత్వం బ్రూహి మహా భాగే ప్రాప్తా యా మమ మందిరమ్ ఆర్యాయాః కిన్ను కర్తవ్యం మయార్యేణాపి వా శుభే

పతి ప్రసాదము చేతనే స్త్రీలు నీ లోకము నందును పర లోకము నందును సుఖములను అనుభవించు చున్నారు. కావుననే నారీ మణికి భర్త పరమ దైవమై యున్నాడు. స్త్రీకి పతితో సమానమైన వస్తువు లేదనియు, భర్త ప్రసన్ను డైనచో నీ లోక మందును పర లోక మందును ఉపకారమగు ననియు నాకు తెలియును. హే యశశ్వినీ! పతి ప్రసాదము చేతనే స్త్రీలు ఈ లోకమందును పరలోక మందును సుఖము లనుభవించు చున్నారు. గావుననే నారీ మణికి భర్త పరమ దైవమై యున్నాడు. హే మహాభాగే! హే శుభే! నా మందిరమునకు నీవు వచ్చితివి. పూజ్యురాలవైన నీకు నేను గాని, నా భర్త గాని జేయదగిన కృత్యము యున్న యెడల జెప్పుము.

అనసూయ:

ఏతే దేవా సహేంద్రేణ మా ముపాగమ్య దుఃఖితాః త్వ ద్వాక్యాపుపాస్త సత్కర్మ దిన నక్త నిరూపణాః

అనసూయ:

హే సాద్వీ! నీ యొక్క వాక్యానుసారముగా అహర్నిశ విభాగము నశించినది. ఇందుచే సమస్త సత్క్రియలు నష్ట మైనవి. దీని కొరకు ఈ దేవతలంద రత్యంత దుఃఖితులై దేవరాజగు ఇంద్రునితో సహితముగా నా సమీపమునకు వచ్చిరి.

యాదంతేపు హర్నిశా సంస్థాం యథావద విఖండితామ్ అహం తదర్థ మయాతా శృణు చైత ద్వచో మయామ దినాభావః సమస్తానా మభావో యాగ కర్మణామ్ తదభావా త్సురా పుష్టిం నోవయాంతి తపస్విని అహశ్చైవ సముచ్చేదా దుచ్చేదః సర్వ కర్మణామ్ తదుచ్చేదా దానా వృష్ట్యా జగదుచ్చేద మేష్యతి తత్త్వ మిచ్చామి ధైర్యేణ జగ దుద్దర్తు మాపదః ప్రసీద సాద్వి లోకానాం పూర్వప ద్వర్తతాం రవిః

పూర్వపు మాదిరిగా అవిచ్చిన్న మైన పగళ్ళు రాత్రులను విభాగములు జరుగు చుండుటకు ప్రార్థించు చున్నారు. నే నిందు కొరకు నీ సమీపమునకు వచ్చితిని. నా మాటను వినుము. హే తపస్వినీ! దిన విభాగము లేనందున సమస్త యాగ కర్మలు శూన్య మయ్యెను. యజ్ఞములు లేనందున దేవతలకు పుష్టి లేక పోయెను. దిన వ్యవస్థ లేనందున సమస్త సత్కర్మలకు లోప మేర్పడెను. కర్మ లోపముచే అనావృష్టి సంభవించెను. అనావృష్టి వలన జగత్తంతయు నశించ గలదు. యిట్టి విపత్తు నుండి జగత్తును రక్షించ వలెనని నీవు దలంచినచో హే సాద్వీ! లోకములకు బ్రసన్ను రాలవు గమ్ము. సూర్య భగవానుడు గూడ పూర్వపు మాదిరిగా ఉదయించును.

బ్రాహ్మణి:

మాండవ్యేన మహా భాగే శప్తో భర్తా మమేశ్వరః సూర్యోదయే వినాశం త్వం ప్రాప్స్యసీ త్యతి మన్యునా

బ్రాహ్మణి:

హే మహా భాగే! మాండవ్య మహర్షి మహా క్రోధముతో నా భర్తను సూర్యోదయము కాగానే నీ భర్త మరణించును యని యిట్లు శాపమిచ్చెను.

అనసూయ:

యది తే రోచతే భద్రే తటస్త ద్వచనా దహమ్ కరోమి పూర్వ వద్దేహం భర్తారం వచనాత్తవ మయాపి సర్వథా స్త్రీణాం మహాత్మ్యం పరవర్ణిని పతివ్రతానా మారాధ్య మితి సంమానయామి తే

అనసూయ:

 నీ కభిలాష యున్నచో నీయొక్క పతి శరీరమును యథా ప్రకారముగా చేయ గలను. హే వర వర్ణినీ! పతివ్రతా స్త్రీల మహిమ నేను బాగుగా నెరుగుదును. పతివ్రతలు నాకు పూజనీయులు. అందు వలననే నిన్ను నేను గౌరవించు చున్నాను.

పుత్రుడు:

తథే త్యుక్తే తథా సూర్య మాజుహావ తపస్వినీ అనసూయార్ఘ్య ముద్యమ్య దశార్థ రాత్రే తదా నిశి తతో వివస్వాన్ భగవాన్ ఫుల్ల పద్మారుణా కృతిః శైలాది రాజ ముదయ మారురోహోరు మండలః సమానంతర మేవాస్యా భర్తా ప్రాణై ర్వ్యయుజ్యత పపాత చ మహీపృష్టేప తంతం జగృహే చ సా

పుత్రుడు:

బ్రాహ్మణ స్త్రీ నీవు చెప్పినట్లే చేయుమని చెప్పెను. తరువాత తపస్వియగు యనసూయ నర్ఘ్యము సూర్యుని పైకి చూపించి సూర్య దేవుని యావాహనము జేసెను. అప్పుడు పది దినములు క్రమానుగతముగా రాత్రి యాయెను. అనగా నా సమయము వరకు పది రాత్రుల ప్రమాణము గడిచెనని భావము. అనంతరము వికసించిన కమలముతో సమానమైన ఎఱ్ఱని యాకృతి గల సూర్య భగవానుడు ఉదయాచలము నారోహించెను. తక్షణమే బ్రాహ్మణి యొక్క భర్త మరణించెను. భూ భాగ మందు పడిపోవు చున్న తన భర్తను యామె పట్టుకొనెను.

అనసూయ:

న విషాద స్త్యయా భద్రే కర్తవ్యః పశ్య మే బలమ్ పతి శుశ్రూషయా వాప్తం తపసః కి చిరేణ మే తథా భర్తృ సమం నాన్య మపశ్యం పురుషం క్వచిత్ రూపతః ళీలతో బుద్ధ్యా వాజ్త్మా దుర్యాది భూషణైః తేన సత్యేన విప్రోయా వ్యాధి ముక్తః పునర్యుతా ప్రాప్తోను జీవితం భార్యా సహాయః శరదాం శతమ్ యథా భర్తృ సమం నాన్య మహం పశ్యామి దైవతమ్ తేన సత్యేన విప్రోయం పునర్జీవ త్వనామయః కర్మణా మనసా వాచా భర్తు రా రాధనం ప్రతి యథా మహోద్యయో నిత్యం తథాయం జీవతా ద్ద్విజః

అనసూయ:

ఓ మంగళ ప్రదురాలా! నీవు విషాదము జెందకుము. పతి సేవ జేత మాత్రమే నేను సంపాదించిన తపోబలము ఎంతదో యిపుడే నీకు చూపించెదను. నేను రూప, శీల, బుద్ధి, వాక్య, మాధుర్యాది సద్గుణములలో నా భర్త కంటే నితరుడెవ్వడూ సరితూగ జాలడు యని నేను నిశ్చయముగా నమ్మితిని. ఇట్లు నేను నిశ్చయమైన పతి భక్తి గలదాన నైనచో నీ బ్రాహ్మణుడు వ్యాధి విముక్తుడై, యువకుడై భార్యా సహితముగా నూరు సంవత్సరములు జీవించు గాక! నేను, నా భర్త సమస్త దేవతల కంటే యధికుడని తెలసికొని యున్నాను. ఈ సత్య ప్రభావముచే యీ బ్రాహ్మణుడు రోగ రహితుడై మరల జీవించు గాక! మనో వాక్కాయ కర్మలచే భర్తృ సేవను గురించి ఎల్లప్పుడు నా మనస్సు నిత్యముగా నుండిన దాన నైనచో, నీ ద్విజుడు జీవించు గాక!

పుత్రుడు:

తతో విప్రః సముత్త స్థౌ వ్యాధి ముక్తః పునర్యువా స్వాభాభి ర్భాసయ న్వేశ్మ బృందారక ఇవాజరః తతోపత త్పుష్ప వృష్టి ర్దేవ వాద్యాని సస్వనుః లేభిరే చ ముదం దేవా అనసూయా మాథా బ్రువన్

పుత్రుడు:

అనంతరమా బ్రాహ్మణుడు వ్యాధి రహితుడై, యువకుడై, జరా మరణములు లేని దేవత వలె దివ్య దేహ కాంతితో, గృహమును ప్రకాశింప జేయుచు లేచి నిలబడెను. తరువాత దేవతలు పుష్పములు వర్షించిరి. దేవ దుందుభులు మ్రోగెను. దేవతల యానందమునకు మేర లేదు. పిమ్మట దేవతలు పతివ్రతా శిరోమణి యగు అనసూయా దేవితో నిట్లు బలికిరి.

దేవతలు:

వరం వృణీష్వ కళ్యాణి దేవ కార్యం మహత్ కృతమ్ ఆదిత్యోదయ సద్భావా ద్వరం వరయ సువ్రతే త్వయా యస్మా త్తతో దేవా వరదాస్తే తపస్వినిః

దేవతలు:

ఓ కళ్యాణీ! నీవు దేవతలకు మహా కార్యమును జేసితివి. వరమును గోరుకొనుము. సుపుత్రురాలా! ఆదిత్యోదయ మైనందున వరము గోరు కొనుము. తపస్వినీ! దేవతలు నీకు వర మిచ్చుటకు కుతూహలులై యున్నారు.

అనసూయ:

యది దేవాః ప్రసనామే పితామహ పురోగమాః వరదా వర యోగ్యా యద్యహం హవతాం మతా తద్యాంతు మమ పుత్రత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరాః

అనసూయ:

బ్రహ్మాది దేవతలారా! మీరందరు నాయందు ప్రసన్న చిత్తులై వరమీయ దలచిరి. వర యోగ్యురాలనని నన్ను దలచినచో వరదులగు మీరు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు పుత్రులగు నట్లు వరము ప్రసాదించుడు.

యోగం చ ప్రాప్నుయాం భర్తృ సహితా క్లేశ ముక్తయే

మరియు నా పతి సమేతముగా క్లేశములను బోగొట్టు యోగము గలదాన నగునట్లు వరమీయ గోరు చున్నాను.

పుత్రుడు:

ఏవ మస్త్వితి దేవా స్తాం బ్రహ్మ విష్ణు శివాదయః ఉక్త్వా జగ్ము ర్యథా న్యాయ మనుమాన్య తపస్వినీమ్ తతః కాలే బహు తిథే ద్వితీయో బ్రాహ్మణః సుతః స్వ భార్యాం భాగవానత్రి రనసూయా మపశ్యత ఋతు స్నాతాం సువర్చాంగీం లోభానీయ తమాకృతిమ్ స కామో మనసా భేజే స ముని స్తా మనిందితామ్ తస్యాభి పశ్యత స్తాం తు వికారో యోభ్యజాయత తమపోవాహ పవన స్తిర్యగూర్ధ్వం చ వేగావాన్ బ్రహ్మ రూపం చ శుక్లాభం పతమానం సమంత తః  

పుత్రుడు:

అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు నీవు గోరిన ప్రకారము యిచ్చితి మనిరి. తరువాత తపస్విని యగు నా యనసూయను యథా న్యాయముగా గౌరవించి వారి స్థానములకు బోయిరి. పిమ్మట బహుకాలము గడచినంత బ్రహ్మ దేవుని రెండవ కుమారుడునగు, అత్రి భగవాను డొక రోజున సర్వాంగ సుందరి, మనోహర మూర్తి , తన పత్ని యగు ననసూయ దేవిని ఋతు స్నాత మయిన దానిని చూచెను. ఆ మునీశ్వరుడు కామునికి వశుడయ్యెను. అనిందితు రాలగు నామెను మానసికముగా సంభోగము గావించెను. ఆమెను మోహముతో జూచు చుండ నా మునికి వికారము గలిగెను. రేత స్ఖలన మయ్యెను. వేగ వంతుడగు వాయు దేవుడు మహర్షి తేజస్సును తీసికొని బోయెను. ఊర్ధ్వ తిర్యగ్భావ రూపములుగా ప్రవహింప జేసెను. బ్రహ్మ తేజ సంపన్నమగు తెల్లని కాంతి యన్ని వైపుల పడు చుండెను.

సోమ రూపం రజో రూపం దిశస్తం జగృహుర్దశ స సోమో మానసో జజ్ఞే తస్యా మత్రేః ప్రజాపతేః పుత్రః సమస్త తత్త్వానా మాయు రాధార ఏవ చ తుష్టేన విష్ణునా జజ్ఞే దత్తాత్రేయో మహాత్మనా స్వ శరీరాత్స ముత్పన్నః సత్త్వోద్రిక్తో ద్విజోత్తమః దత్తాత్రేయ ఇతి ఖ్యాతః సోనసూయా స్తనం పపౌ విష్ణు రేవావ తీర్ణోసౌ ద్వితీయోత్రేః సుతో భవత్ సప్తాహాత్ప్ర చ్యుతో మాటు రుద్రా త్కుపితో యతః హైహయేంద్ర ముపావృత్త మపరాధ్యంత ముద్ధతమ్ దృష్ట్వా త్రౌ కుపితః సద్యో దగ్దు కామః సహైహయమ్

రజో గుణ స్వరూపమగు నా తేజస్సు పడుచున్న సమయమున చంద్ర రూపముతో దశ దిశల యొక్క ఆశ్రయము బొందెను. సమస్త ప్రాణి జీవనాధారుడగు చంద్రుడు జన్మించెను. అనగా బ్రహ్మ రూపి యగు చంద్రుడు అత్రి ప్రజాపతి మానస రూపమున అనసూయ వలన జన్మించెను. సమస్త తత్వముల కాధారుడు, ఆయుర్ధాయ కారకుడు, మహాత్ముడగు విష్ణుమూర్తి గూడ నత్యంత సంతుష్టుడై తన యంశ ప్రధాన పూర్వకముగా సత్త్వ గుణావలంబి, ద్విజోత్తముడు నగు దత్తాత్రేయ రూపమున జన్మించెను. శ్రీ మహా విష్ణువు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి జెంది సత్త్వో ద్రిక్తుడగు ద్విజోత్తముడుగా స్వ శరీరము నుండి యుద్భవించెను. అనసూయా దేవి యొక్క స్తన్య పానము చేసెను. ఈతడు సాక్షాత్తు నారాయణుడే. అత్రి మహర్షి రెండవ సుతుడుగా యవతరించెను. దత్తాత్రేయుడని ఖ్యాతి బొందెను. తరువాత కుపితుడైన రుద్రుడు తల్లి గర్భము నుండి ఏడు రోజుల లోనే జన్మించెను. ఉన్మార్గ గామి యగు హైహయాధిపతి దుష్ట స్వభావముచే తను, అత్రి మహర్షిని యవమాన రూపమగు యపరాధము జేయుట చేతను, రుద్రుడు వీనిని జూచి కుపితుడై హైహయుని దగ్ధము జేయుటకై యవతరించెను.

గర్భవాస మహాయాస దుఃఖా మర్ష సమన్వితః దుర్వాసా స్తమసా యుక్తో రుద్రాంశః సోభ్య జాయత ఇతి పుత్రత్రయం తస్యా జజ్ఞే బ్రహ్మేశ వైష్ణవమ్ సోమో బ్రహ్మాభవద్విష్ణు ర్దత్తా తేయోభ్య జాయత దుర్వాసాః శంకరో జజ్ఞే వరదానా ద్దివౌ కసామ్ సోమః స్వరష్మిభిః శీతై ర్వీరు దౌషధి మానవాన్ ఆప్యాయయ సదా స్వర్గే వర్తతే ప ప్రజాపతిః దత్తాత్రేయః ప్రజాః పాతి దుష్ట దైత్య నిబర్హ ణాత్ శిష్టానుగ్రహ కృద్యోగీ జ్ఞేయశ్చాంశః సవైష్ణవః నిర్ధహత్యవమంతారం దుర్వాసా భగవా నజః

ఇంతియే గాక గర్భవాస దుఃఖమును సహించలేక బోయెను. ఇట్లు తమోగుణ ప్రదానమగు రుద్రాంశచే శ్రీ దుర్వాస మహర్షి యుద్భవించెను. ఈ ప్రకారముగా బ్రహ్మ, విష్ణు, శంకరుడు అను, ఈ మువ్వురు అనసూయా దేవికి పుత్రులుగా జన్మించిరి. బ్రహ్మ చంద్రుడాయెను. విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా బుట్టెను. శంకరుడు దుర్వాసుడుగా జనన మొందెను. దేవతల వర దానముచే నిట్లు జన్మించిరి. చంద్రుడు తన శీతల కిరణములచే లతలను, ఔషధులను మానవులను రక్షించును. ప్రజాపతి యగు చంద్రుడు ఇట్లందరినీ తృప్తి పరచును. ఎల్లప్పుడూ స్వర్గమందుండును. దతాత్రేయుడు దుష్ట దైత్యులను సంహరించి ప్రజలను గాపాడు చుండును. వైష్ణవాంశ యగు దతాత్రేయుడు శిష్టుల ననుగ్రహించెను. యోగ మార్గమును బోధించును. మహా యోగియని తెలియ వలెను. దుర్వాసుడు తన నవమానించిన వారిని దహించును.

రౌద్ర భావం సమాశ్రిత్య దృజ్మనో వాగ్భి రుద్దతః సోమత్వం భగవా నత్రిః పాన శ్చక్రే ప్రజాపతిః దతాత్రేయోపి విషయాన్ యోగస్థో దదృశే హరిః దుర్వాసాః పితరం త్యక్త్వా మాతరం చోత్తమం వ్రతమ్ ఉన్మత్తాఖ్యం సమాశ్రిత్య పరిబభ్రామ మేదినీమ్ ముని పుత్ర వరతో యోగీ దత్తాత్రేయో ప్యసంగితామ్ అభీప్సమానః సరసి నిమమజ్జ చిరం విభుః తథాపితం మహాత్మాన మతీవ ప్రియ దర్శనమ్ తత్యజు ర్న కుమారా స్తే సరసస్తీర సంక్షయాః దివ్యే వర్షశతే పూర్ణే యదా తేన త్యజంతితమ్

రుద్ర శరీరావలంబనము జేసిన వాడు గాన దుర్వాసుడు, మనో వాక్కులచే దృష్టి ప్రసరణముచే దుష్టులను సంహరించును. భగవానుడగు అత్రి మహాముని చంద్రునికి సోమత్వ పదవిని యిచ్చి ప్రజాపతిని జేసెను. విష్ణు వంశతో జనించిన దత్తాత్రేయుడు యోగ నిష్టుడయ్యెను. విషయము లన్నిటినీ దర్శించెను. దుర్వాసుడు తల్లి దండ్రులను వదలి యుత్తమ వ్రతము నవలంభించెను. ఉత్తమ వ్రత మవలంభించి ఉత్తమ భావముతో ప్రపంచమున తిరుగు చుండెను. ముని పుత్రులను గూడ త్యజించ దలచి మునియగు దత్తాత్రేయుడు చిరకాలము నీటిలో మునిగి యుండెను. అటులైనను నా ముని పుత్రులు ప్రియ దర్శనుడు మహాత్ముడగు నా యోగిని విడువరైరి. సరస్సు యొక్క ఒడ్డున నా ముని కుమారులు యోగిని వదలక నచ్చటనే యుండిరి. ఇట్లు నూరు దివ్య సంవత్సరములు గడచినను తీర సంశ్రితులై యా చోటనే యుండిరి.

తత్ప్రీత్యా సరస స్తీరం సర్వేముని కుమారకాః తతో దివ్యాంబర ధరాం సురూపాం సునితంబినీమ్ నారీమాదాయ కళ్యాణీ ముత్తతార జలాన్మునిః స్త్రీ సనికర్షిణం హ్యేతీ పరిత్యక్ష్యంతి మామితి మునిపుత్రా స్తతో యోగే స్థాస్యామీతి విచింతయ

తథాపి తే ముని సుతా న త్యజంతి యదా మునిమ్ తతః సహ తయా నార్యా మద్యపాన మథాకరోత్

సురాపాన రతం తేన సభార్యం తత్యజు స్తతః గీత వాద్యాది వనితా భోగ సంసర్గ దూషితమ్ మన్యమానా మహాత్మానం తయా సహ బహిష్క్రియమ్

ఆ మహాయోగి యందలి ప్రీతిచే ముని కుమారులందరా దతాత్రేయుని విడవ నందున, వారు తనను త్యాగము జేయు నట్టి యుపాయము జేసెను. దివ్యాంబర ధారిణి నితంబిని సురూపవతియు మంగళ ప్రదాత్రి యగు నొక యువతిని వెంట బెట్టుకొని సరస్సు నుండి పైకి వచ్చెను. మునీశ్వరుడు స్త్రీ సన్నికర్షతో నున్న నన్ను ముని పుత్రులు వదలి వేయుదురని దలచెను. ముని కుమారులు విడచి బోయినచో తాను యోగనిష్టతో నేకాంతముగా యుండ గలుగుదు నని తలంచెను. అయినను నా మునికుమారు లా దత్తాత్రేయుని వదల లేదు. తరువాత దత్తాత్రేయుడు ఆ యువతితో గలసి మద్యపానము చేసెను. అప్పుడు గూడ ముని పుత్రులు మహాత్మునిగా భావించి త్యజించ లేదు. ఆ ముని పుత్రులు గీత వాద్యాది రమణీ సంభోగ సంసర్గ మున్నను వికార రహితుడగుట వలన మహాత్ముడని తెలసి కొనిరి. ఆ యోగిని యాశ్రయించు కొనియే యుండిరి.

నావాప దోషం యోగీశో వారుణీం స విబన్నపి అంతావసాయి వేశ్మాం తర్మాతరిశ్వా స్పృశన్నివ సురాం పిబ న్సపత్నీక స్తపస్తే పే స యోగవిత్ యోగీశ్వర శ్చింత్యమానో యోగిభి ర్ముక్తి కాంక్షిభిః కస్య చిత్త్వథ కాలస్య కార్తవీర్యో ర్జునో బలీ కృత వీర్యే దివం యాతే మంత్రిభిః సపురోహితైః పౌరైశ్చా త్మాభిశేకార్థం సమాహుతో బ్రవీదిదమ్ నాహం రాజ్యం కరిష్యామి మంత్రిణో నరకోత్తరమ్ యదర్థం గృహ్యతే శుల్కం తదనిష్పాదయ వృథా పణ్యానాద్వాదశం భాగం భూపారాయ వణిగ్జనః

ఆ యోగీశ్వరుడగు దత్తాత్రేయుడు తరుణీ సంభోగ మద్యపాన గీతావాద్యాది సంపర్గము గలిగినను చాండాల గృహ మందున్న వాయు దేవుని వలె దోషము జెందడు. యోగవేత్త యోగీశ్వరుడు నగు దత్తాత్రేయుడు సురా పానము తరుణీ సంభోగము జేయు చున్నను ముక్తిని గోరు యోగి జనులకు చింతనీయు డయ్యెను. కొంత కాలమునకు, బలవంతుడగు కార్తవీర్యార్జునుడు తండ్రియగు కృతవీర్యుడు స్వర్గస్థు డయిన పిమ్మట మంత్రులు పురోహితు లాతడిని రాజును జేయ దలచిరి. ఇట్లు పౌర జనులు గూడ రాజును జేయ దలచిరి. అప్పుడు వారితో నిట్లనియె. పురోహిత అమాత్య పౌరులారా! నేను నరక ప్రాప్తమగు రాజ్య పరిపాలనము జేయను. రాజ్య పాలన నిమిత్తము పన్ను తీసికొన వలసి యుండును. అట్లు తీసికొనుట దుర్లభము. పన్ను తీసికొని నప్పుడు రాజ్యమును ధర్మముగా పాలించ వలెను. వైశ్య జనము రాజునకు వస్తువులు విక్రయించి నందున వచ్చిన లాభములో పన్నెండు వంతులు పన్నుగా యీయవలెను.

దత్వాత్మ రక్షిభి ర్మార్గే రక్షితో యాతి దస్యుతః గోపాశ్చ ఘ్రుత తక్రాదేః షడ్భాగం చ కృషీవలాః దత్వాన్యద్ భూభుజే ర్దద్యు ర్యాది భాగం తతోధికీమ్ పణ్యాదీనా మశేషాణాం వణిజో గృహ్ణాత స్తతః అగ్నిహోత్రం తతస్సత్యం వేదానాం చైవ సాధనమ్ ఆతిథ్యం వైశ్వదేవం చ ఇష్ట మిత్య భిదీయతే వాపీ కూప తడాగాని తేవతా యతనాని చ అన్నప్రదాన మర్థిభ్యః పూర్త మిత్యభి ధీయతే ఇష్టా పూర్త వినాశాయ తద్రాజ్ఞ శ్చోర కర్మణః యదన్యైః పాలితో లోక స్తద్వ్రుత్త్యంతర సంశ్రితః

ఇట్లు ఇచ్చినందున చోర భయము లేకుండ రక్షక భటులు తమను రక్షించు చుందురు. మార్గమున సుఖముగా బోవుదురు. గొల్లవారు దదిఘృత తక్రాదుల విక్రయములో వచ్చిన లాభములో ఆరవ భాగము, రైతులు గూడ ఆరవ భాగము రాజుకు ఇవ్వవలసి యున్నది. ఇట్లు రాజునకు ఇచ్చి ఇది రెండవ వానికి ఇచ్చినచో అందరు వ్యాపారులు వస్తువులకు అధిక భాగము తీసికొన వలసి యున్నది. అగ్ని హోత్రము, తపము, సత్యము, వేదాధ్యయనము, ఆతిధ్యము, వైశ్య దేవము, ఈ కర్మలన్నిటికి “ ఇష్ట” మని చెప్పబడును. దిగుడు బావి, బావి, చెరువు, దేవాలయములు, ఆర్తులకు అన్నదానము,ఈ సత్కర్మలను “పూర్త” మని యందురు. అధికముగా పన్ను తీసికొనినచో నా రాజు చోరుడుగా చెప్పవలెను. ఇంతియే గాక ఇష్టా పూర్తముల పుణ్యము నశించును. మరియు రాజు పన్ను దీసి కొనుచు తానూ పాలించక యితర వృత్తి నవలంభించి యితరులతో పాలనము జేయించినచో నరకమునకు బోవును.

గృహ్ణతో బలిషడ్భాగం నృపతే ర్నరకో ధృవమ్ నిరూపిత మిదం రాజ్ఞః పూర్త్వై రక్షణ వేతనమ్ అరక్షం శ్చోరత శ్చోర స్తద్దనం నృపతే ర్భవేత్ తస్మాద్యది తప స్తప్తా ప్రాప్తో యోగిత్వ మీప్సితమ్ భువః పాలన సామర్థ్య యుక్త ఏకో మహీపతిః పృథివ్యా మస్త్రభృ న్నాద్యా ప్యహ మేవర్ది సంయుతః తతో భవిష్యే నాత్మానం కరిష్యే పాప భాగినమ్ తస్య తం నిశ్చియం జ్ఞాత్వా మంత్రి మధ్య స్థితో బ్రవీత్ గర్గో నామ మహా బుద్ధి రున్మిర్భూప వయోతిగః భక్త్యా తు కృపయా విష్టస్తం తోషయితు మర్హతి

 ఇట్లు ఆరవ భాగము పన్ను, రక్షణ వేతనములకు గాను దీసికొని పాలించని నృపతికి తప్పక నరకము గలుగును. పూర్వము రాజులకు ప్రజా రక్షణ కొరకే వేతన రూపముగా పన్నులు చెల్లించెదరని పండితులైన వారు నిరూపించిరి. రాజు ప్రజలను రక్షింపక పన్ను తీసికొనినచో దొంగిలించిన దోషము గలవాడగుటచే వానిని దొంగగా భావన జేయవలెను. అందువలన నేను తపస్సు జేసి యోగి నయ్యెదను. యోగినై మనోభీష్టమును బొందెదను. భూమిని పాలించుటకు సమర్థుడు గావలెను. శస్త్రాస్త్రములు గలవాడు, మాననీయుడు గావలెను. అట్టి సామర్థ్యము గలవాడి నైనప్పుడు వృద్ది బొందిన వాడినై రాజ్యము జేయగలను. లేని యెడల వ్యర్ధముగా నన్ను బాపము పంచుకొను వానినిగా జేసికొనను. ఇట్లు బలికిన వాడై తన నిశ్చయమును మంత్రి మధ్య యందుండి జెప్పెను. బుద్ధిమంతుడు, వృద్దుడు, ముని శ్రేష్ఠుడు గర్గా చార్యుడు యను పేరు గల యొక మహర్షి భక్తి కృపా పూర్వకముగా రాజుతో నిట్లు బలికెను.

యద్యేవం కర్తు కామస్త్వం రాజ్యం సమయ క్పశాసితుమ్ తతః శ్రుణుష్వ మే వాక్యం కురుష్వ చ నృపాత్మజః దత్తాత్రేయం మహాత్మానం సహ్యదోణీ కృతాశ్రమమ్ తమారాధయ భూపాలః పాటి యో భువనత్రయమ్ యోగ యుక్తం మహాత్మానం సర్వత్ర సమదర్శినమ్ విష్ణోరం శం జగద్ధాతు రవతీర్ణం ధరాతలే యమారాధ్య సహస్రాక్షః పాప్తవా పదమాత్మనః హృతం దురాత్మభిర్డైత్యై ర్జఘాన చ దితేః సుతా

రాజ కుమారా! నీకు జక్కగా రాజ్య శాసనము జేయ వలెనని కోరిక యున్నచో నేను జెప్పెదను వినుము. జెప్పినట్లు జేయుము. సహ్యాద్రి పర్వతమున ఆశ్రమము జేసికొని ఉన్నవాడు, ముల్లోకములను పాలించు వాడు, మహాత్ముడునగు దత్తాత్రేయ మహాముని యారాధన జేయుము. ఆ మహర్షి పరమ యోగి, మహానుభావుడు, సర్వ సమదర్శి, జగద్రక్షణ కొరకు నారయణాంశచే జనించి భూభాగ మందు అవతరించి యున్నాడు. ఆ మహాత్ముని యారాధన జేసి, సహస్ర వేతృడగు ఇంద్రుడు దైత్యులను సంహరించి దైత్యుల పహరించిన తన స్థానమును బొందెను.

అర్జునుడు:

కథ మారాధితో దేవై ర్దత్తాత్రేయః ప్రతాపవాన్  కథం వాపహృతం దైత్యై రింద్రత్వం ప్రాప వాసవః

అర్జునుడు:

దేవతలు ప్రతాపవంతుడగు దత్తాత్రేయ మహర్షిని యెట్లారాధించిరి? ఇంద్రుడెట్లు దైత్యులను సంహరించి తన పదవిని బొందెను?

గర్గ మహర్షి:

దైత్యానాం దేవతానాం చ యుద్ధమాసీ త్సుదారుణమ్ దైత్యానా మీశ్వరే జంభే దేవానాం చ శచీపతౌ తేషాం తు యుద్ధమానానాం దివ్యః సంవత్సరో గతః తతో దేవాః పరాభూతా దైత్యా విజయినోభవన్ విప్రచిత్తి ముఖైర్దేవా దానవై స్తే పరాజితాః పలాయన కృతోత్సాహా నిరుత్సాహా ద్విషజ్జయే బృహస్పతి ముపాగమ్య దైత్య సైన్య వదేప్సవః అమంత్రయంత సహితా వాలఖిల్యై సహర్షి భిః

గర్గ మహర్షి:

పూర్వము దేవతలకు, దానవులకు భయంకరమైన యుద్ధము జరిగెను. దేవతలకు ప్రభువు ఇంద్రుడు, దానవులకు రాజు జంభా సురుడు. వారిట్లు యుద్ధము జేయుచుండ సంవత్సర కాలము గడచెను. అనంతరము దేవతలు ఓడిపోయిరి. దైత్యులు జయించిరి. విప్రచిత్తి మొదలగు దానవులు దేవతలను జయించిరి. తరువాత దేవతలు శతృవులను జయించుటకు శక్తి లేక పలాయన పరాయణులైరి. దైత్య సైన్య వధ జేయ వలయునని కాంక్షించిరి. వాలఖిల్యాది మహర్షి సహితులై గురుడగు బృహస్పతి వద్దకు వచ్చి గురుని యడిగిరి.

బృహస్పతి:

దత్తాత్రేయం మహాభాగ మత్రేః పుత్రం తపోధనమ్ వికృతాచరణం భక్త్యా సంతోషయితు మర్హథ

బృహస్పతి:

దేవతలారా! మీరు విరుద్దాచరణ గల వాడయినను, తపోధనుడు, మహానుభావుడు అత్రి పుత్రుడు నగు దత్తాత్రేయ మహర్షిని భక్తితో సేవించి సంతుష్టుని జేయుడు.

సవో దైత్య వినాశాయ వరదో దాస్యతే వరమ్ తతో హనిశ్యథ సురాః సహితాన్ దైత్వదానవా

వరదాతయగు నా మహానుభావుడు దైత్య వినాశనము కొరకు వరము నిచ్చును. దేవతలారా! అనంతరము దైత్య సహితులగు దానవులను వధింప గలరు.

గర్గ మహర్షి:

హంతుం శక్తా న సందేహో దత్తాత్రేయ ప్రసాదతః ఇత్యుక్తాస్తే తదా జగ్ము ర్దత్తాత్రేయా శ్రమం సురాః దద్రుశుశ్చ మహాత్మానం క్షాంతం లక్ష్మ్యాసమన్వితమ్ ఉద్గీయమానం గంధర్వైః సురాపాన రతం మునిమ్ తే తస్య గత్వా ప్రణతిం చక్రుః సర్వార్థ సాధనీమ్ భక్త్యా తస్యోప జహ్రుశ్చ మద్యపస్య సురాధికమ్ తిష్ఠంత మనుతిష్ఠంతి యాంతం యాంతి దివౌకసః ఆరాధయామాసు రథః స్థితా స్తిష్ఠంత మాసనే

గర్గ ముని:

శ్రీ దత్తాత్రేయుని యనుగ్రహముచే వధించుటకు సమర్థు లగుదురు. సందేహము లేదు. ఇట్లు జెప్పగా నప్పుడు ఆ దేవతలు దతాత్రేయాశ్రమమునకు బోయిరి. దేవతలు ఆశ్రమమున దత్తాత్రేయుని జూచిరి. లక్షీ సమన్వితుడై మదిరాపాన రతుడై యుండెను. గంధర్వులు గానము జేయుచుండిరి. ప్రశాంత చిత్తుడై యుండెను. అప్పుడా దేవతలు సమీపమునకు బోయిరి. భక్తితో సర్వార్ధసాదని యగు వందన మాచరించిరి. మధ్యమును త్రాగు వాడు గాన మద్యము మొదలగు పదార్థములు దెచ్చి సమర్పించిరి. దేవతలు దత్తాత్రేయ ముని కూర్చొని యున్న చోట కూర్చొను చుండిరి. నిలబడియున్న నిలబడిరి. పోవుచున్న ఎడ ఆయన వెంటనే బోవు చుండిరి. ఆసనమున కూర్చునినచో దేవతలు క్రింద యుండి చేతులొగ్గి యారాధించు చుండిరి.

స ప్రాహ దేవాన్ ప్రణతాన్ దత్తాత్రేయః కిమిష్యతే మాటతో భవదభి ర్యేనేయం శుశ్రుషా క్రియతే మమ

అనంతరము దత్తాత్రేయ స్వామి త్రణతులైన దేవతల జూచి, “మీరు నా సమీపమున నుండి నన్ను శేవించు చున్నారు. నాకు శుశ్రూష జేయుచున్నా రెందులకు” అని యనియె.

దేవతలు:

దానవై ర్ముని శార్దూల జంభాద్యై ర్భూర్భు వారికమ్ హృతం త్రైలోక్య మాక్రమ్య క్రతు భాగాశ్చ కృత్స్న శః త ద్వదే కురు బుద్ధిం త్వం పరిత్రాణాయనో నఘః త్వత్ప్రసాదా దభీప్సామః పునః ప్రాప్తుం త్రివిష్టపమ్

దేవతలు:

ముని శార్దూలా! జంభాసురాది దానవులు మమ్ములను జయించిరి. భూర్భువాది ముల్లోకముల నాక్రమించిరి. సంపూర్ణ యజ్ఞ భాగము నపహరించిరి. పాప రహితుడా! తమరు వారిని వినాశనము జేయ ప్రార్థించు చున్నాము. మీరు వారిని వధించుట యందు బుద్ధిని నిలుపుడు. మమ్ములను రక్షించుడు. మీ యను గ్రహముచే మేము మరల మా స్వర్గమును బొందుదుము. ఇదియే మా కోరిక.

దత్తాత్రేయ స్వామి:

మద్యాసక్తోహ ముచ్చిష్టో న చైవాహం జితేంద్రియః కథ మిచ్చథ మత్తోపి దేవాః శత్రు పరాభవమ్

దత్తాత్రేయ స్వామి:

దేవతలారా! నేను మద్య పానము జేయువాడను. ఇంద్రియ నిగ్రహము లేని వాడను. నిరంతరము అపవిత్రుడను. ఇట్టి నేను ఎట్లు మీ శత్రువుల జయించుట గల్గును? నా వల్ల శత్రు జయము కల్గునని ఎట్లు దలంచితిరి?

దేవతలు:

అనఘస్త్వం జగన్నాథ! నలేప స్తవ విద్యతే

విద్యా క్షాళన శుద్ధాంత ర్నివిష్ట జ్ఞాన దీధితే           

దేవతలు:

ఓ జగన్నాథా! తమరు విద్యా ప్రక్షాళిత మగు పవిత్రాంతః కరణమున జ్ఞాన కిరణ సన్నివేశము గలవారు. గావుననే తమరు పాప రహితులు. ఏ విషయ వాసనలు మిమ్ముల నంటవు.

దత్తాత్రేయుడు:

సత్య మేత త్సురా విద్యా మమాస్తి సమదర్శి నః అస్యాస్తు యోషితః సంగా దహముచ్చిష్టతాం గతః స్త్రీ సంభోగోతి దుఃఖాయ సాతత్యే నోపసేవితః ఏమ ముక్తా స్తతో దేవాః పునర్వచన మబ్రువ

దత్తాత్రేయుడు:

దేవతలారా! యథార్థమును గ్రహించితిరి. నేను విద్యా వంతుడను, సమ దర్శనము గల వాడను, అయినను, ఈ స్త్రీ సంసర్గముచే నేను అపవిత్రుడనైతిని. ఏ మనగా ఈ యువతికి సంతతము శేవ జేయుచు, ఈ స్త్రీ సంభోగము జేయుచున్నాను. స్త్రీ సంభోగము సర్వ దుఃఖములకు పుట్టినిల్లు. దేవతలు ఈ ప్రకారముగా జెప్పిన మాటలను విని మరల నిట్లు జెప్పసాగిరి.

దేవతలు:

అనఘేయం మునిశ్రేష్ఠః జగన్మాతా నదుష్యతి యా సా విద్యా తవ విభో సర్వజ్ఞస్య హృది స్తితా యథాంశుమాలా సూర్యస్య ద్విజ చండాల సంగినీ న దుష్యతి జగన్నాథ తథేయం వర వర్ణినీ

దేవతలు:

ముని శ్రేష్టుడా! అనఘా! జగన్నాథా! ఈమె దూషితురాలు గాదు. ఈమె జగన్మాత. ప్రభో! సర్వజ్ఞుడవగు నీ హృదయ స్థితి యగు మహావిద్యా స్వరూపిణి. సూర్య కిరణములు బ్రాహ్మణ చండాల స్పర్శలచే దూషితములు గావు. అట్లు జగన్మాత యగు నీమె దూషితురాలు గాదు.

గర్గ మహర్షి:

ఏవ ముక్తా స్తతో దేవై ర్దత్తాత్రే బ్రవీదిదమ్ ప్రహస్య త్రిదశా సర్వా యద్యేత దృవతాం మతమ్

గర్గ మహర్షి:

ముని వరుడగు దత్తాత్రేయుడు దేవతలు జెప్పిన యీ మాటను వినెను. కొంచముగా నవ్వెను. నవ్వుతూ దేవతలతో నిట్లనెను. దేవతలారా! నన్ను మీరు అట్లు తలంచుట సంతోషము.

తదాహూయ సురా సర్వా యుద్ధాయ సురసత్తమాః ఇహానయత మద్ద్రుష్టి గోచరం మావిలం బ్యతామ్ మద్ద్రుష్టి పాత హుత భుక్ ప్రక్షీణ బల చేతసః యేన నాశ మశేషా స్తే ప్రయాంతి మతి దర్శనాత్

సుర సత్తములారా! మీరెల్లరు రాక్షసులను యుద్ధమునకు బిలచి యిచ్చట నా దృష్టి గోచరము జేయుడు. ఆలసింపకుడు. అసురలకు నా యొక్క దృష్టి ప్రసారమను యగ్నిచే బలమును తేజస్సును క్షీణ మగును. నా దర్శన మాత్రమున నిశ్శేషముగా తక్షణమే నాశన మగుదురు.

గర్గ మహర్షి:

తస్య తద్వచనం శ్రుత్వా దేవైర్దైత్యా మహా బలాః అ హివాయ సమాహుతా జగ్ముర్దేవ గణాశ్రమమ్ తే హన్యమానా దైతేయై ర్దేవాః సర్వే భయాతురః దత్తాత్రేయాశ్రమం జగ్ముః సమస్తాః శరణార్ధినః తమేవ వివిశుర్దైత్యాః కాలాయ తో దివౌకసః దద్రుశుస్తం మహాత్మానం దత్తాత్రేయం మహాలసమ్

గర్గ మహర్షి:

దేవతలు దత్తాత్రేయుడు జెప్పిన యీ మాటలు విని రాక్షసులను యుద్ధమునకు బిలిచిరి. మహాబలవంతులు నగు అసురులు, రణము జేయుటకు వచ్చి , దేవతల నాక్రమించిరి. అనంతరము రాక్షసులు దేవతలను పీడించ సాగిరి. దేవత లెల్లరు భయాతురులైరి. దత్తాత్రేయుని యాశ్రమమునకు వచ్చిరి. దత్తాత్రేయుని శరణు వేడిరి. దైత్యులు పారిపోవు చున్న దేవతలను బిలుచుచూ వారి వెంట బోయిరి. ఆశ్రమము లోనికి జొచ్చిరి. మద్య పానముచే మత్తుడై యున్న మహానుభావుడగు నా దత్తాత్రేయ స్వామిని జూచిరి.

వామపార్శ్వ స్థితా మిష్టా మశేష జగతః సుభామ్ భార్యాం చాన్య సుచార్వంగీం లక్షీ మిందు నిభాననామ్ నీలో త్పలాభ నయనాం పినశ్రోణి పయోధరామ్ సుదంతాం మధురా భాషా సర్వయోషి ద్గణైర్యుతామ్ దృష్ట్వా గ్రత స్తదా దైత్యాః సాభిలాష మనోభవాః న శేకు రుద్దతా దైత్యా మనసా వోడు మాసురాః త్యక్త్వా దేవా స్త్రీయం తాంతు హర్తుకామా హతౌ జసః ప్రేరితా స్తేన పాపేన హ్యాసక్తా స్తేతతో భవన్ స్త్రీరత్న మేత త్రైలోక్య సారం చేద్వితం భవేత్ కృత కృత్యా స్తతః సర్వే ఇతినో భావితం మనః

మరియు ఎడమ భాగమున నున్నదియు, సమస్త జగత్తునకు కోరిన కోర్కెల నిచ్చునదియు, మంగళములను గలుగ జేయు నదియు, చంద్ర బింబము వంటి ముఖము గలదియు, మనోహరాంగి యగు దత్తాత్రేయుని భార్యను జూచిరి. దైత్ములు నల్ల కలువల బోలు నేత్రములు గలదియు, పీనశ్రోణి పయోధరయు, సుమధుర భాషిణియు, చక్కని పలువరుస గలదియు, సంపూర్ణమగు స్త్రీ గుణములు గలదియును అగు లక్ష్మీ దేవిని జూచిరి. దానవులు ఎదుటగా నున్న లక్ష్మిని జూచి, యామె నపహరించ దలచిరి. ఉత్కటమగు మోహము గలవారైరి. కామవశు లైరి. మనస్సును నిగ్రహింపలేక బోయిరి. అప్పుడా యసురులు దేవతలను వదలిరి. లక్ష్మిని యపహరించ దలచిరి. పూర్వము జేసిన పాపకర్మ వారిని పాప కార్యమునకు ప్రేరేపించెను. ఆ ప్రేరేపణచే లక్ష్మి యందాసక్తులైరి. ఆ దైత్యు లిట్లను కొనసాగిరి. ఈ యువతి త్రిలోక సుందరి స్త్రీ రత్నము. త్రైలోక్య సారము అట్లుగా మనకు కనబడుచున్నది. మనమీ లలనా రత్నమును గ్రహించి నట్లయినచో కృతకృత్యుల మగుదుము. మన మనస్సు గూడ భావనా రహితమగును.

తస్మా త్సర్వే సముత్ క్షిప్య శిబికాయాం సురార్ధనాః ఆరోప్య స్వమధిష్టానం నయామ ఇతి నిశ్చితాః

అందువలన ఓ దానవులారా! సురార్దనులమైన మనము ఈ యోషి ద్రత్నమును పల్లకి యందు యెక్కించి మన చోటికి తీసికొని బోవుదము. అని నిశ్చయించిరి.

గర్గ మహర్షి:

సానురాగా స్తతస్తే తు మునే రంతిక మాగమ తస్య తాం యోషితం సాధ్వీం సముత్ క్షిప్య స్మరాతురాః శిబికాయాం సమారోప్య సహితా దైత్య దానవాః శిరస్సు శిబికాం కృత్వా స్వస్థానాభిముఖా యయుః దత్తాత్రేయ స్తదా దేవాన్ విహస్యేద మథా బ్రవీత్ దిష్ట్యా చ హంత దైత్యానా మేషా లక్ష్మీః శిరోగతా సప్త స్థానాన్యతి క్రమ్య లయమన్య ముపేష్యతి

గర్గ మహర్షి:

తరువాత సాను రాగము గల యా దైత్యులు దత్తాత్రేయుని సమీపమునకు వచ్చిరి. కామబాణ పీడితులగు నా రాక్షసులు సాధ్వీ లలామ యగు నా దత్తాత్రేయ పత్నిని ఎత్తుకొని వచ్చి, పల్లకి యందున కూర్చుండ బెట్టిరి. దైత్య దానవులందరూ యేకమైరి. సిరస్సుల యందు పల్లకిని యుంచుకొని తమ స్వస్థానములకు బో సాగిరి. అప్పుడు ముని వరుడగు దత్తాత్రేయుడు చిరునవ్వు గలవాడై దేవతలతో నిట్లనెను. దేవతలారా! మీకు భాగ్యమిచ్చినది, ఈ లక్ష్మీ దేవత రాక్షసుల నెత్తి యెక్కినది. ఏడు స్థానముల నతి క్రమించినచో లక్ష్మి వారలకు తొలగి పోవును.

దేవతలు:

కథయస్వ జగన్నాథ కేషు స్థానేష్వపస్థితా పురుషస్య ఫలం కింవా వ్రయచ్చత్యథ నస్యతి?

దేవతలు:

హే జగన్నాథా! లక్ష్మీ నివాస స్థానములు శలవిండు. ఏ ఏ స్థానముల యందు పురుషునకు శుభా శుభ ఫలములు జెందును?

దత్తాత్రేయుడు:

నృణాం పాదస్తితా లక్ష్మీ ర్నిలయం సంప్రయచ్చతి సక్త్నోశ్చ సంస్థితా వస్త్రం రత్నం నానావిధం వసు కలత్రదా గుహ్య సంస్థా క్రోడస్థా పత్యదాయినీ మనోరదా పూరయతి పురుషాణాం హృది స్థితా లక్ష్మీర్లక్ష్మీ వతాం శ్రేష్టా కంఠస్థా కంఠ భూషణమ్ అభీష్ట బిందు దారైశ్చ తథా శ్లేషం ప్రవాసిభిః మృష్టాన్నం వాక్య లావణ్య మాజ్ఞా మవితథం తథా ముఖస్తితా కవిత్వం చ యచ్చ త్యుదది సంభవా శిరోగతా సంత్యజతి తతోన్యం యాతి చాశ్రయమ్ సేయం శిరోగతా దైత్యా పరిత్యజతి సాంప్రతమ్

దత్తాత్రేయుడు:

లక్ష్మి పాద స్థాన మందున్నచో గృహమును ప్రసాదించును. తొడల యందున్నచో వస్త్రములు, రత్నములు, పలు విధములైన ద్రవ్యముల నిచ్చును. గుహ్య సంస్థ యగుచో సత్కళత్రము గలవాడగును. (క్రోడ వడి) యందున్న పుత్రుల నిచ్చును. హృదయ స్థాన మందున్న యడల పురుషుల మనోరథము లీడేర్చును. సర్వమునకు ప్రధాన భూతయగు లక్ష్మీ దేవి కంఠ స్థాన మందున్నచో లక్ష్మి యనుగ్రహము గల యట్టి వానికి కంఠ భూషణములు గలవాడగును. మరియు ప్రవాసులగు నభీష్ట బంధువుల సమాగమము, ప్రియతమా దారా పుత్రాదులతో వియోగము లేకుండుటయు గలుగును. క్షీర సముద్ర జాత యగు లక్ష్మి ముఖ స్థానమున నుండి నట్లైనచో మృష్టాన్నము, వాక్య లావణ్యము , ఆజ్ఞా సాఫల్యము, కవిత్వ లాభము గలుగును. లక్ష్మి శిరస్సు యందున్నచో నట్టి వానిని వదలి బోవును. అన్యుని యాశ్రయించును. ఇప్పుడీ లక్ష్మి యీ దానవుల శిరసున నుండుటచే వారిని త్యజించును.

ఆత్వానోన్ స్త్రాణి వధ్యంతాం తస్మాదేతే సురారయః న భేతవ్యం భృశం త్వేతే మయా నిస్తేజసః కృతాః పరదారా వామర్శాచ్చ దగ్ధ పుణ్యా హతౌజసః తస్మాదేతే భిహన్యంతాం భవద్భిరతి శుకితైః

అందువలన మీరు అస్త్ర శస్త్రములను గ్రహించి నిర్భయ చిత్తులై వారిని నాశనము జేయుడు. నా దృష్టి పాతముచే వారు తేజో హీనులైనారు. భయము జెందకుడు. బలాత్కారముగా పర భార్యా పహరణముచే వారి పుణ్యము నశించినది. ఈ కారణముచే మీరు ఎంత మాత్రము సంశయించక వారిని నాశనము జేయుడు.

గర్గ మహర్షి:

తతస్తే వివిధై రస్త్రై ర్వధ్వమానాః సురారయః శిరస్సు లక్ష్మ్యా ప్యాక్రాంతా వినేశురితి నఃశ్రుతమ్ లక్ష్మీ శ్చోత్పత్య సంప్రాప్తా దత్తాత్రేయం మహా మునిమ్ స్తూయమానా సురైః సేంద్రై ర్దైత్య నాశాన్ముదాన్వితైః ప్రణిపత్య తతో దేవా దత్తాత్రేయం మహా మునిమ్ జయ కృష్ణః జగన్నాథః దైత్యాంతకః హరః ప్రభోః

గర్గ మహర్షి:

పిమ్మట దేవతలు వివిధములగు శస్త్రాస్త్రములచే యుద్ధము జేయ సాగిరి. రాజ కుమారా! ఈ విధముగా శిరో భాగమున లక్షి నుంచుకొనుటచే దానవులు నశించి నట్లుగా వింటిని. తరువాత లక్ష్మీ దేవి వారి మస్తకముల నుండి దుమికినదై దత్తాత్రేయ సమీపమునకు వచ్చెను. పిమ్మట దైత్యులు చని బోవుటచే సంతోష చిత్తులగు ఇంద్రాది సమస్త దేవతలు మహాముని యగు దత్తాత్రేయుని స్తుతించిరి. దేవతలు మహర్షి యగు దత్తాత్రేయునికి నమస్కరించి యిట్లనిరి. హే కృష్ణా! హే జగన్నాథా! హే ప్రభో! తమకు జయమగు గాక!

నారాయణా చ్యుతా నంత వాసుదేవా క్షయా జరః త్వత్ప్రసాదాత్ సుఖం లక్ష్మీ రాజ్యం సంపజ్జ నోర్ధన శార్జధన్వం శ్చక్రపాణే! భక్తానాం నిత్య వత్సల ఇతి స్తుత్వా నాకపృష్టం యథా పూర్వం గతాః సురాః తథా త్వమపి రాజేంద్ర! యదిచ్చసి యథేప్సితమ్ ప్రాప్త మైశ్వర్య మతులం తూర్ణ మారాధయస్వతమ్

హే నారాయణా! హే అచ్యుతా! హే అనంతా! హే వాసుదేవా! హే అక్షయా! హే అజరా! హే జనార్ధనా! తమ యనుగ్రహముచే సుఖము, లక్ష్మీ రాజ్యము, సంపత్తిని మేము బొందితిమి. హే శార్జధన్వా! హే చక్రపాణీ! తమరు భక్తులైన వారికి నిత్యమగు వాత్సల్యము గలవారలై యున్నారు. అని స్తుతించి దేవతా జనులు వారి వారి యథా స్థానములకు బోయిరి. గావున నో రాజేంద్రా! నీవు కూడ మనోభిలషిత మగు నఖండైశ్వర్యమును బొంద దలచినచో శీఘ్రముగా ముని వరుడగు దత్తాత్రేయుని యారాధింపుము.