110 - వంశానుచరితా మందు నాభాగోపాఖ్యానము

మార్కండేయుడు:

కారుషాః క్షత్రియాః శూరాః కర్రుశాస్యాభవ సుతాః

తే తు సప్త శాతం వీరా స్తేభ్య శ్చాన్యే సహస్రశః.

దిష్ట పుత్రస్తూ నాభాగ స్థితః ప్రథమ యౌవనే

దదర్శ వైశ్య తనయా మతీవ సుమనోహరామ్.

తస్యాం సందృష్ట మాత్రాయాం మదనాక్షిప్త మానసః

బభూవ భూపతనయా నిఃశ్వాసాక్షేప తత్పరః.

తస్యాః స గత్వా జనకం పవ్రే తాం వైశ్య కన్యకామ్

తతోనంగ పరాధీన మనో వృత్తిం నృపాత్మజమ్.

తం చాహ స పితా తస్యాం రాజపుత్రం కృతాంజలిః

బిభ్య త్తస్య పితు ర్విప్ర! ప్రశ్రయావసతం వచః.

మార్కండేయుడు:

మహావీరులు కారూష క్షత్రియ గణాలు కరుషుని పుత్రులు. వారి సంఖ్య ఏడు వందలు. మరియు ఆ కారూషు లందరి వలన ఇంకా వేల కొలది వీరులు ఉత్పన్న మైనారు. దిష్ట పుత్రుడు నాభాగుడు ప్రథమ యౌవన సమయ మందు ఒక దినమున అతి సుందరముగా మున్న ఒక వైశ్య కన్యను చూచెను. రాజ కుమారుడు కేవలము ఆమెను చూచి నంతనే అత్యంత కామాసక్త మనస్కుడై దీర్ఘ నిశ్వాసను విడుచుచూ. ఆమె తండ్రి సమీపమునకు వెళ్లి ఆ వైశ్య కన్య నిమ్మని ప్రార్ధించెను. కామముచే పరాధీన ప్రవృత్తుడైన రాజ కుమారుని జూచి, ఓ విప్రా! ఆమె తండ్రి మహారాజగు దిష్టునకు భయపడి చేతులు జోడించి కామాసక్త చిత్తుడై యున్న రాజ నందనునితో వినయావనతుడై ఇట్లనెను.

భవంతో భూభుజో భత్యా వయం వః కరదాయకా

కథం సంబంధ మాసమై రాస్మాభి రభివాంఛసి.

“మీరు రాజ పుత్రులు, మరి మాది మీకు పన్ను చెల్లించు కులము. మీరు ఇట్టి అసమానులతో సంబంధము నకు ఎట్లు అభిలషించు చున్నారు?”

రాజపుత్రుడు:

సామ్యం మానుష దేహస్య కామా మొహాదిభిః కృతమ్

తథాపి కాలే తై రేవ యోజ్యతే మానుషం వపుః.

తథైవ చోపకారాయ జాయంతే తస్య తాన్యాపి

అన్యాని చాన్యే జీవన్తి భిన్న జాతిమతాం సతామ్.

తథాన్యాన్యప్యాయోగ్యాని యోగ్యతాం యంతి కాలతః

యోగ్యా న్యాయోగ్యతాం యాంతి కాలవశ్యా హి యోగ్యతా.

ఆప్యాయ్యతే యచ్చరీర మహారాదిభి రీప్సితైః

కాలం జ్ఞాత్వా తథా భుక్తం తదేవ పరిశుష్యతే.

రాజ పుత్రుడు:

విధాత మానవుణ్ణి దేహములో కామ క్రోధాదులను సమాన భావముతోనే నిర్మించెను. కాని సదా ఈ కామ క్రోధాదులు మానువుని నుండవు. ఒక్కొక్క సమయములో ఉత్పన్న మగు చుండును. మఱియు విభిన్న జాతుల మనుష్యులు యందును కామ క్రోధాదులు ఉపకారిగా నుండినచో అనగా మనుష్య గణాలు కామ క్రోధాదులను అవలంభింపనిచో అన్య భావములను అవలంభింతురు. కామ క్రోధాదులు, మరియు ఇంకను ఏదేని యోగ్యము లగునపుడు కాలము ననుసరించి యోగ్యము లగును. మఱియు యోగ్యములు అయోగ్యము లగును. అందు వలన యోగ్యత అనునది కాలమునకు అను గుణముగా నుండును. ఆహారాది ఇష్టమగు పదార్ధములచే ఎట్టి దేహమును తృప్తి పరచు చున్నామో. అట్టి దేహము కూడా స్థిరము గాదు, కేవలము యోగ్యతా నియమాలను పాడు చేయునట్టి కాలము భుక్తము చేసి దానిని శుష్కింప చేయును.

ఇత్థం మమైషాభిమతా తనయా దీయతాం త్వయా

అన్యధా మచ్చరీరస్య విపత్తి రుపలక్ష్యతే.

అదే విధముగా నీ కన్య యందు నాకు కోరిక కలిగినది. ఆమెను నాకు ఇమ్ము. లేనిచో నా శరీర నాశనమును చూచెదవు.

వైశ్యుడు:

పరతంత్రా వయం త్వం చ పరతంత్రో మహీభుజః

పిత్రా తేనాభ్యనుజ్ఞాత స్త్వం గృహాణ దదా మయమ్.

వైశ్యుడు:

“నేను పరాధీనుడను. మఱియు మీరును రాజు యొక్క ఆధీనములో నున్నారు. అందు వలన మీరు మీ తండ్రి గారి అనుజ్ఞ తీసికొని స్వీకరింపుడు. నేను నాకన్య నిచ్చెదను.”

రాజ పుత్రుడు:

ప్రష్టవ్యా సర్వకార్యేషు గురవో గురువర్తిభిః

న త్వీదృశీ ష్వకార్యేషు గురూణాం వాక్య గోచరః.

క్వ మన్మథ కదాలాపో గురూణాం శ్రవణం క్వ చ

విరుద్ద మేత దన్యత్ర ప్రష్టవ్యా గురవో నృభిః

రాజ పుత్రుడు:

గురు జనుల ఆజ్ఞ యందున్న మనుష్యులకు అన్ని విషయములను గురువు నడుగుట ఉచితము. కాని ఇట్టి విషయమును గురువునకు తెలుప కుండుటయే మంచిది. ఎక్కడ కామ కథా ప్రసంగము? ఎక్కడ గురు జనుల శ్రవణ గోచరత్వము? ఈ రెండింటి యందు చాలా అంతరము మున్నది అందు వలన అది విరుద్దము. అట్టి విషయము తప్ప మిగిలిన అన్ని కార్యము లందు గురువు యొక్క ఆజ్ఞను తీసుకొన వలెను.

వైశ్యుడు:

ఏవ మేత త్స్మరాలాప న్తవాయం పృచ్చ మా గురుమ్

అహం పృచ్చామి నాలాపో మమ కామ కథాశ్రయః.

వైశ్యుడు:

మీరు చెప్పినది నిజము. గురువు గారి ఆజ్ఞను పొందుట మీ పక్షమున కామ కథ యగును. నేను ఈ విషయమును అడిగెడను. అప్పుడు కామ కథ అన్న అభిప్రాయము నాకు లేదు గదా!

మార్కండేయుడు:

ఇత్యుక్తః సోభవ న్మౌనీ రాజపుత్రః స చాపి తత్

తత్పిత్రే సర్వ మాచష్ట రాజ పుత్రస్య యన్మతమ్.

తత స్తస్య పితా విప్రాన్ బుచీకదీన్ ద్విజోత్తమాన్

ప్రవేష్య రాజపుత్రం చ యథాఖ్యానం న్యవేదయత్.

నివేద్య చ తతః ప్రాహ మునీ నేవం వ్యవస్తితే

యత్క ర్తవ్యం తదాదేష్టు మర్హంతి ద్విజసత్తమాః!

మార్కండేయుడు:

ఎప్పుడయితే వైశ్యుడు ఈ మాట చెప్పెనో, అప్పుడు రాజపుత్రుడు మౌనమును దాల్చెను. ఆ

సమయమున వైశ్యుడు రాజపుత్రుని సంపూర్ణ మగు నభిప్రాయమును రాజుతో చెప్పెను. అప్పుడు రాజు ఋచీకుడు మొదలగు ద్విజ శ్రేష్టులను పిలిపించి కుమారుని గూడ రప్పించి పూర్వోక్త సమస్త విషయములను నివేదించెను. ఓ ద్విజ శ్రేష్టులారా! మీరు ఈ విషయము నందు నాకు ఏది కర్తవ్యమో దానిని ఆదేశించుటకు అర్హులు, అని పలికెను.

ఋషులు:

రాజపుత్రానురాగ స్తే యద్యస్యాం వైశ్య సంతతౌ

తదాస్తు ధర్మ ఏవైష కిం తు న్యాయ క్రమేణ సః.

ముర్దాభిషిక్త తనయా పాణి గ్రహోత్సవః పురా

భవ త్వనంతరం చేయం తవ భార్యా భవిష్యతి.

ఋషులు:

రాజ పుత్రునితో రాజకుమారా! నీకు వైశ్య కన్య యందు అనురాగ మున్నచో ఇందు ధర్మ విరుద్ద మేమియు లేదు. అయితే న్యాయ క్రమముగా జరుగుట ధర్మమై యున్నది. ముందుగా మూర్దాభిషిక్త రాజ కన్యను వివాహమాడి ఆనంతరము ఈ వైశ్య కన్యను వివాహము చేసుకొన గలవు.

ఏవం న దోషో భవతి తథేమా ముపభుంజతః

అన్యథాఖ్యేతి తే జాతి రూత్కృష్టా బాలికానయాత్.

నీవు ఈ ప్రకారము ఈ కన్యను పొందిన యడల దోష ముండదు. లేనిచో బాలిక నపహరించిన కారణమున ఉత్తమ జాతి నుండి నీచ జాతిని పొంద గలవు.

మార్కండేయుడు:

ఇత్యుక్త స్తదపాస్యేవ వచ స్తేషాం మహాత్మనామ్.

వినిష్క్రమ్య గృహీత్వా థా ముద్యతాసి రథాబ్రవీత్.

రాక్షసేన వివాహేనా మయా వైష్యసుతా హృతా

యస్య సామర్ధ్య మత్రాస్తి స ఏతాం మోచయత్వితి.

తతః స వైశ్యస్తాం దృష్ట్వా గృహీతాం తనయాం దృతమ్

త్రాహీతి పితరం తస్య ప్రయయౌ శరణం ద్విజః

తతస్తస్య పితా కృద్ధ ఆదిదేశ బలం మహత్

హన్యతాం హన్యతాం దుష్టో నాభాగో ధర్మ దూషకః.

మార్కండేయుడు:

ఎప్పుడైతే ఆ మహాత్ము లందఱు యీ విధముగా తమ అభిప్రాయములను ప్రకటించినారో, అప్పుడు వారి మాటలను అంగీకరింపక అచట నుండి వెళ్లి ఖడ్గమును ధరించి ఆ కన్యను గ్రహించి వారితో ఇట్లు చెప్ప సాగెను. నేను యీ వైశ్య కన్యను రాక్షస వివాహ విదానముగా అపహరించితిని. ఎవరికైనా సమర్ధత యున్నచో ఈ కన్యను విడిపించు కొనుడు. ఓ బ్రాహ్మణోత్తమా! అప్పుడు వైశ్యుడు రాజ పుత్రుడు అపహరించిన కన్యను చూచి రాజ పుత్రుని తండ్రి వద్దకు బోయి రక్షించ మని శరణు బొందెను. పిమ్మట రాజ పుత్రుని తండ్రి అత్యంత కృద్దుడై ఈ ధర్మ దుష్యుడగు నాభాగుని వెంటనే వదింపుడు, అని సైన్యము నాజ్ఞాపించెను.

తత స్తద్యుయుదే సైన్యం తేన భూభృ త్సుతేన వై

క్రుతాస్త్రేణ తదాస్త్రేణ తత్ప్రాచుర్యేణ పాతితమ్.

స శ్రుత్వా నిహతం సైన్యం రాజపుత్రేణ భూపతిః

స్వయమేవ యయౌ యోద్దుం స్వసైన్య పరివారితః.

తతో యుద్ద మాభూ త్తస్య భూభుజః స్వసుతేన యత్

రాజపుత్రేణ శాస్త్రాస్రై స్తత్రాతిశయితః పితా.

తతోంతరిక్షా దాగాత్య పరివ్రాట్ సహసా మునిః

ప్రత్యువాచ మహీపాలం విరమస్వేతి సంయుగాత్.

త్వత్పుత్రస్య మహాభాగ! విధర్మోయం మహాత్మనః

తవాపి వైశ్యేన సహ న యుద్ధం ధర్మవ నృప!.

అప్పుడు రాజు ఆజ్ఞచే సైన్యము రాజు కుమారునితో యుద్దమును ప్రారంభించెను. కాని రాజ కుమారుడు అస్త్రములచే ఆ సైన్యము లోని చాలా మందిని పడవేసెను. పిమ్మట రాజ పుత్రుని ద్వారా సైన్యము చని పోవుట విని భూపతి స్వయముగానే మరి కొంత సైన్యమును తీసుకొని యుద్దమునకు బోయెను. తండ్రి కొడుకులు యుద్దమున శస్త్ర అస్త్రాదులచే రాజ కుమారుని కన్నా తండ్రిదే పై చేయిగా నుండెను. అదే సమయమున ఆకాశము నుండి నారదుడు ప్రత్యక్షమై రాజుతో నిట్లు పలికెను మహీపాలా! యుద్దమును విరమించుము. ఓ రాజా! నీ కుమారుడు నిధర్ము డయ్యెను. అందు వలన వైష్యునితో నీ యుద్దము ధర్మము గాదు.

బ్రాహ్మణ్యా బ్రాహణః పూర్వం కుర్యన్ దార పరిగ్రహమ్

బ్రాహ్మణ్యా త్సర్వ వర్ణేషు న హాని ముపగచ్చతి.

తథైవ క్షత్రియ సుతాం క్షత్రియః పూర్వ ముద్వాహన్

ఇతరే చ తతో రాజం శ్చ్యవతే న స్వధర్మతః.

పూర్వం వైశ్యస్తథా వైశ్యాం వశ్చా చ్చూర్ర కులోద్భావామ్

న హీయతే వైశ్య కులా దయం న్యాయః క్రమోదితః.

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః సవర్ణా పాణి సంగ్రహమ్

అకృత్వాన్య భవా పాణేః వతంతి నృపః సంగ్రహాత్.

యస్యా యస్యా హి హీనాయాః కురుతే పాణి సంగ్రహమ్

అకృత్వా వర్ణ సంయోగం సోపి తద్వార్ణభా గ్భవేత్.

బ్రహ్మణుడు ముందుగా బ్రాహ్మణ స్త్రీని వివాహ మాడి పిమ్మట ఇతర వర్ణములు స్త్రీని గ్రహించి నప్పటికిని ఆతని బ్రాహ్మణత్వమునకు హాని కలగదు. అట్లే క్షత్రియుడును ముందుగా క్షత్రియ కన్యను వివాహ మాడి పిమ్మట వైశ్య, శూద్ర కన్యలను గ్రహించినచో తన ధర్మము నుండి విడువ బడడు. వైశ్యుడును అదే విధముగా ముందు వైశ్య కన్యను పరిణయమాడి తరువాత

శూద్ర కన్యను వివాహము చేసుకోన్నచో వైశ్య కులము నుండి పతితుడు గాడు. ఈ విధముగా క్రమానుసారముగా ప్రవర్తించుట ధర్మమని చెప్పబడి యున్నది. ఓ రాజా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ తమ వర్ణముల కన్యలను వివాహము చేసుకొనక ఇతర కన్యలను వివాహము చేసు కొన్నచో, ఏ హీన వర్ణజాతి యొక్క స్త్రీని పరిణయ మాడునో, అతడు పతితుడై ఆమె జాతినే పొందును. మరియు ముందుగా సవర్ణ జాతి యొక్క స్త్రీని పాణి గ్రహణము చేసుకొననిచో, అతడు దయాధికారి కాలేడు.

సోయం వైశ్యత్వ మాతన్న స్తవపుత్ర సుమ దధీః

నాస్యాదికారో యుద్దాయ క్షత్రియేణ త్వయా సహ.

పయ మేత న్న జానీమః కారణం నృపనందన!

యథా భవిష్యతీదం చ నివర్త రణ కర్మతః.

మంద బుద్ది యగు నీ కుమారుడు వైశ్యత్వమును పొందెను. నీవు క్షత్రియుడవు. అందు వలన నీతో ఇతడు యుద్దము చేయుటకు అధికారి గాడు. ఓ నృపనందనా! దీని వలన ఏ విధమగు కారణ ముత్పన్న మగునో, అది నే నేరుగను. ఇప్పుడు నీవు యుద్ద కర్మను విరమించుము.