77 - వైవస్వత మన్వంతర వృత్తాంతము

క్రౌష్టుకి:

స్వాయంభువాద్యాః కథితాః సప్తైతే మనవో మమ తదంతరేషు యే దేవా రాజానో మునయ స్తధా అస్మి న్కల్పే సప్త యేన్యే భవిష్యంతి మహామునే మనవ స్తా స్సమాచక్ష తథా దేవాదయశ్చ యే

క్రౌష్టుకి:

స్వాయంభువాది ఏడుగురు మనువుల విషయములను వారి మన్వంతరముల యందు ఏ ఏ రాజులు ఏ ఏ దేవతలు ఏ ఏ ఋషులుండిరో అవన్నియు మీరు నాకు చెప్పినారు. ఓ మహామునీ! ఈ కల్ప మందు ఇంకను ఏడుగురు మనువు లుందురు కదా! వారి విషయములను మరియు ఆ సమయమున ఏ దేవాదు లుందురో వారిని గూడ వర్ణింపుడు.

మార్కండేయుడు:

కథిత స్తవ సావర్ణి శ్చాయా సంజ్ఞా సుతశ్చ యః పూర్వజస్య మనోస్తుల్యః స మను ర్భావితాష్టమః రామో న్యాసో గాలవశ్చ దీప్తిమా న్కృప ఏవ చ ఋష్యశృంగ స్తథా ద్రోణ స్తత్ర సప్తర్షయో భవన్ సుతపా శ్చామితాభాశ్చ ముఖ్యాశ్చైవ త్రిధా సురాః వింశకః కథితా శ్చైషాం త్రయాణాం త్రిగుణో గణః

మార్కండేయుడు:

ఛాయా సంజ్ఞ యొక్క గర్భము నుండి ఉద్భవించిన పూర్వజుడైన వైవస్వత మనువుతో సమానుడగు ఏ సావర్ణి విషయమును నీకు చెప్పితినో అతడు ఎనిమిదవ మనువగును. ఈ మన్వంతరమున రామ, వ్యాస, గాలవ, దీప్తిమాన్, కృప, ఋష్యశృంగ, ద్రౌణి (అనగా అశ్వద్ధామ). ఈ ఏడుగురు సప్తర్షులుగా నుందురు. ఈ మన్వంతరమున సుతపా, అమితాభ ముఖ్యులను వీరు మూడు విధాల దేవతలు. ఈ దేవతలకు ప్రత్యేకముగా ఇరువది సంఖ్య గల మూడు గణాలున్నవి. ఈ మువ్వురు దేవతలకు మూడు గణములకు మొత్తము అరువది మంది దేవతలు గలరు.

తపస్తపశ్చ శక్రశ్చ ద్యుతి ర్జోతిః ప్రభాకరః ప్రభాసో దయితో ధర్మ స్తేజో రాష్మిశ్చ వక్రతుః ఇత్యాదికస్తు సుతపా దేవానాం వింశకో గణః ప్రభు ర్విభు ర్విభాసాద్య స్తథాన్యో వింశకో గణః సురాణా మమితానాం తు తృతీయ మాపి మే శృణు దమో దాంత ఋతః సోమో వింతాద్యాశ్చైవ వింశతిః ముఖ్యా హ్యేతే సమాఖ్యాతా దేవా మన్వంతరాధిపాః మారీచస్తైవ తే పుత్రాః కాశ్యపస్య ప్రజాపతేః భవిష్యాశ్చ భవిష్యంతి సావర్ణస్యాంతరే మనోః తేషా మింద్రో భవిష్యస్తు బలి ర్వైరోచని ర్మునేః

ఇందు తపస్తప, శాక్ర, ద్యుతి, జ్యోతి, ప్రభాకర, ప్రభాస, దయిత, ధర్మ, తేజ, రశ్మి, మరియు వక్రతులను ఈ సమస్త దేవతలు సుతపుని యొక్క ఇరువది సంఖ్య గల గణ మందురు. ప్రభు, విభు మరియు విభాసాది దేవతలు అమితాభుని యొక్క వింశక గణ మందు ఉందురు. ఆ తరువాత మూడవ గణము యొక్క విషయమును వినుము. దామ, దాంత, ఋత,సోమ, వింత ఇత్యాది దేవతలు ముఖ్యుడను పేరుగల వాని మూడవ వంశక గణము లోని వారు. ఈ మన్వంతరాధిపతు లందరూ మరీచి తనయు డైన ప్రజాపతి యగు కశ్యపుని సంతానము. వీరు ఈ సావర్ణిక మన్వంతర మందు దేవతలుగ నుందురు. మరియు ఓ మునీ! విరోచనుని పుత్రుడు బలి ఆ సమయ మందు వీరికి ఇంద్రుడుగ నుండును.

పాతాల ఆస్తే యోద్యాపి దైత్యః సమయ బంధనః విరజాచ్చార్వవీరశ్చ నిర్మోహః సత్యవా క్కృతిః విష్ణ్వాద్యాశ్చైవ తనయాః సావర్ణస్య మనో ర్నృపాః

ఆ దైత్య రాజు ఇప్పటికీ ప్రతిజ్ఞా పాశముచే బంధింపబడి పాతాళమున నివశించు చున్నాడు. సావర్ణి మనువు యొక్క విరజా, అరవ, వీర, నిర్మోహ, సత్యవాక్, కృతి మరియు విష్ణు ఇత్యాది పేర్లు గల పుత్రులు ఆ సమయ మందు రాజు లగుదురు.