127 - మరుత్త చరితము

మార్కండేయుడు:

గతి తాపస వాక్యం స శ్రుత్వా లజ్జాపరో నృపః

దిజ్ మాం చారార్ధ మిత్యుక్త్వా నిఃశ్వశ్య నగృహే ధనుః

తతః స త్వరితం గత్వా త మౌర్యస్యాశ్రమం ప్రతి

వవన్దే శిరసా వీరాం మాతరం పితు రాత్మనః

దృష్ట్వా చ తాపసా న్సప్త నాగై ర్దష్టాన్ మృతా న్భువి.

నినిన్దాత్మాన మసక్భత్ పురస్తేషాం మహీపతిః

ఉవాచ చైత దద్యాహం మద్వీర్య మవమాన్యతామ్.

యత్కరోమి భుజజ్ఞ్గానాం దుష్టానాం బ్రాహ్మణ ద్విషామ్

త త్పశ్యతు జగ త్సర్వం సదేవాసుర మానుషమ్.

మార్కండేయుడు:

తాపసుని వచనములు వినిన రాజు లజ్జితు డయ్యెను. “చారాంధుడను (త్రోవ తెలియని) నేను తిరస్కరింప వలసిన వాడను.” అని పలికి దీర్ఘమగు శ్వాసను వదలెను. ధనస్సును చేత బట్టెను. అతి శీఘ్రమున ఔర్యాశ్రమమునకు వెళ్ళెను. శిరస్సు వంచి పితా మహురాలగు వీరా దేవికి వందనము చేసెను.  మఱియు తాపస గణాలకు యథా విధిగా నమస్కరించెను. వారు కూడ ఆతనిని బాగుగా ఆశీర్వచనములతో స్తుతించిరి. పిమ్మట రాజు సర్ప దుష్టులై భూమిపై బడి మృతులైన ఏడుగురు తాపసులను జూచెను. మునుల ఎదుట మాటి మాటికి తనను తాను నిందించు కొనుచూ ఇట్లనెను. “ఈ దుష్ట భుజంగములు నా బలమును తిరస్కరించి, బ్రాహ్మణులను ద్వేషించు చున్నవి. నేను ఇప్పుడు వానికి ఏ గతిని పట్టించెదనో, (ఎట్టి అవస్థను కలిగించెదనో) దానిని దేవ, దైత్య, నరలోక హితముగా సంపూర్ణ జగత్తు చూచును గాక.”

మార్కండేయుడు:

ఇత్యుక్త్వా జగృహే కోపా దస్త్రం సంవర్తకం నృపః

నాశాయాశేష నాగానాం పాతాలోర్వీవిచారిణామ్.

తతో బజ్వాల సహసా నాగాలోకః సమస్తతః

మహాస్త్ర తేజసా విప్ర! దహ్యమానోనివారితః

హా హా తాతేతి హా మాత! ర్హాహా వత్సేతి సంభ్రమే

తస్మి న్నస్త్రకృతే వాచః పన్న గానా మథాభవన్.

కేచి జ్జ్వలద్భిః పుచ్చాగ్రైః ఫణై రన్యే భుజఙ్గమాః

గృహీత పుత్ర దారాశ్చ త్యక్తాభరణ వాసనః.

పాతాల ముత్సృజ్య యయుః శరణం భామినీం తదా

మరుత్త మాతరం పూర్వం యయా దత్తం తదాభయమ్.

మార్కండేయుడు:

ఆ రాజు ఈ విధముగా పలికి పాతాళ వాసులగు సమస్త నాగ కుల వినాశనార్ధము క్రోధముచే ‘సంవర్తక’ మను అస్త్రమును గ్రహించెను. ఓ విప్రా! ఆ సమయమున సంపూర్ణ నాగ లోకములు ఆ మహాస్త్రము యొక్క తేజస్సుచే వెంటనే జాజ్వల్య మానమై నివారించుటకు శక్యము గాని విధముగా దగ్ధమగు చుండెను. ఈ అస్త్ర ప్రయోగము వలన భయముచే ఉద్విగ్నములైన పన్నగ గణాలు హా తల్లీ! హా తండ్రీ! హా వత్సా! అని ఆర్త నాదములు చేయ సాగెను. కొన్నింటికి తోకలు, కొన్నింటికి పడగలు కాలి పోయెను. మఱియు కొన్ని నాగులు వస్త్ర ఆభారణాదులను పరిత్యజించి స్త్రీ, పుత్రా సమేతముగా, పాతాలమును వదలి మరుత్తుని తల్లి యగు ‘భామిని’ని ఆశ్రయించిరి. ఎందుకనగా పూర్వము ఆమె వారికి అభయ ప్రధానము చేసి యుండెను.

తా ముపేత్యోరగాః సర్వే సప్రణామం భయాతురాః

 స గద్గద మిదం ప్రోచుః స్మర్యతాం నః పురోదితమ్.

ప్రణమ్యాభర్ధితం పూర్వం యదస్మాభీ రసాతలే

తస్య కాలోయ మాయాత స్త్రాహి వీరపజాపతి!

పుత్రో నివార్యతాం రాజ్ఞి! ప్రాణైః సంయోజ్య మస్తు నః

 దహ్యతే సకలో లోకో నాగానా మస్త్రవహ్నినా.

ఏవం సందహ్య మానానా మస్మాకం తనయేన తే

 త్వా మృతే శరణం నాన్య త్కృపాం కురు యశస్విని.

భయాతురులై సమస్త సర్ప గణాలు ఆమె సన్నిధికి చేరి ప్రణామ పూర్వకముగా గాద్గాదిక వచనములతో ఇట్లు పలికిరి.  “పూర్వము రసాతలమున ప్రణామ, అర్చనాదులచే మేము నిన్ను ఏమని ప్రార్ధించితిమో దానిని స్మరించెదవు గాక. ఓ వీర మాతా! అది ఇప్పుడు ఉపస్థిత మైనది. దీని నుండి మమ్ములను రక్షింపుము. ఓ రాజ్ఞీ! నీ పుత్రుని నివారించి, మాకు ప్రాణ దానము చేయుము నాగ లోకము లన్నియు వాని అస్త్రాగ్నిచే దగ్ధ మగు చున్నవి. ఓ యశస్వినీ! నీ పుత్రుడు మమ్ములను ఈ విధముగా దగ్ధము చేయు చున్నాడు. అందు వలన నీవు దక్క అన్యు లేవరునూ శరణ మిచ్చు వారు లేరు. మాపై కృప జూపుము.”

మార్కండేయుడు:

ఇతి శ్రుత్వా వచ స్తేషాం సంస్మృత్యాదౌ చ భాషితమ్.

భర్తార మాహ సా సాధ్వీ ససం భమ మిదం వచః.

మార్కండేయుడు:

సాధ్వి యగు భామిని ఆ సర్పములు వచనములు విని పూర్వము ఇచ్చిన తన అభయ వాక్యములను స్మరించుకొని భర్తతో సంభ్రమముగా ఇట్లు పలికెను.

భామిని:

పూర్వమేవ తవాఖ్యాతం పాతాలే య ద్భుజజ్ఞమైః

ప్రోక్త మభ్యర్ధనాపూర్వం మమాసీ త్తనయం ప్రతి.

త ఇమేభ్యాగతా భీతా దహ్యన్తే తస్య తేజసా

మా మేతే శరణం పూర్వం దత్త మేభ్యో మయాభయమ్.

యే మాం శరణ మాపన్నా స్తే త్వాం శరణ మాగతాః

అపృథగ్దర్మచరణా యాతాహం శరణం తవ.

తన్నివారయ పుత్రం త్వం మరుత్తం వచనా త్తవ

మయా చాభ్యర్ధితో వశ్యం శమ మభ్యువయాస్యతి.

భామిని:

“పాతాళము నందు భుజంగ గణాలు నా పుత్రుని విషయమున ఏమని ప్రార్ధించినవో, దానిని మీకు ముందుగా చెప్పి యుంటిని. ఆ భుజంగములే  ఇప్పుడు కుమారుని తేజస్సుచే దగ్ధమై పోవు చున్నవి. అందు వలన అవి భీతి చెంది నన్ను శరణమును బొందినవి. నేను కూడ పూర్వము వీటికి అభయము నిచ్చితిని. నాకు శరణా గతులైన వారు తప్పక మీకు కూడ శరణా గతులే. నేను గూడ అపృదగ్ధర్మాచరణ గల దాననై మిమ్ము శరణమును పొందితిని. అందు వలన మీరు పుత్రుడగు మరుత్తుని నివారింపుడు. మీ పలుకుల వలన మఱియు నా కోరిక పైన తప్పక శాంతించును.

రాజు:

మహాపరాధే నియతం మరుత్తః క్రోధ మాగతః

దుర్నివర్త్య మహం మన్యే తస్య క్రోధం సుతస్య తే.

రాజు:

ఈ నాగ దేవతలు అపరాధము చేసిన కారణముచే మరుత్తునికి క్రోధము కలిగినది. నీ పుత్రుని కోపము నివారించుట అసాధ్యమని తలచెదను.

నాగ దేవతలు:

శరణాగతా స్తవ వయం ప్రసాదః క్రియతాం నృపః!

క్షత్రస్యార్త పరిత్రాణ నిమిత్తం శత్ర దారణమ్.

నాగ దేవతలు:

ఓ రాజా! మేము మిమ్ములను శరణు కోరితిమి. మా యందు అనుగ్రహము జూపుడు క్షత్రియ గణాలు ఆర్తులగు మనుష్యులను రక్షించుట కొరకే అస్త్ర ధారణ చేయుదురు.

మార్కండేయుడు:

నాగానాం తద్వచః శ్రుత్వా భూతానాం శరణైషిణామ్.

తయా చాభ్యర్తితః పత్న్యా ప్రాహావీక్షి న్మహాయశాః

గత్వా బ్రవీమి తం భద్రే! తనయం త్వరయా తవ

వరిత్రాణాయ నాగానాం న త్యాజ్యాః శరణాగతాః.

నోపసంహారతే సోస్త్రం యది మద్వచనా న్నృపః

తదాస్త్రైవార యిష్వామి తస్యాస్త్రం తనయస్య తే.

మార్కండేయుడు:

మహా యశస్సు గల అవీక్షితుడు శరనార్దులగు నాగుల వచనములు విని మఱియు భార్యచే పార్ధింప బడిన వాడై ఇట్లు పలికెను. “ఓ భద్రా! నేను ఇప్పుడే నీ పుత్రుని సమీపమునకు వెళ్లి నాగులను రక్షించ మని, ఆతనితో చెప్పెదను. శరణా గతులను వదిలి పెట్టుట ఉచితము గాదు.” ఒక వేళ నీ పుత్రుడు మరుత్తుడు నా పలుకులు విని అస్త్రోప సంహారము చేయనిచో, నేను నా అస్త్రములచే ఆతని అస్త్రములను నివారించెదను.

మార్కండేయుడు:

తతో గృహీత్వా స ధను రవిక్షిత్ క్షత్రియోత్తమః

భార్యయా సహితః ప్రాయా త్త్వరావా న్భార్గావాశ్రమమ్.

మార్కండేయుడు:

పిమ్మట క్షత్రియ శ్రేష్ఠుడగు అవీక్షితుడు ధనుస్సు బాణములను గ్రహించి భార్యా సహితుడై వెంటనే భార్గవాశ్రమమునకు వెళ్ళెను.