10 - మృత్యు దశా వర్ణనము

జైమిని:

సంశయం ద్విజ శార్దూల ఆవిర్భావ

తిరో భావౌ భూతానాం యత్ర సంస్థితౌ కథం సంజాయతే జంతుః కథం వా స వివర్థతే కథం వోదర మధ్యస్తః తిష్ట త్యంగ నిపీడితః నిష్క్రాంతి ముదరాత్ ప్రాప్య కథం వా వృద్ధి మృచ్చతి ఉత్క్రాంతి కాలే చ కథం చిద్భావేన వియుజ్యతే కృత్స్నో మృత స్తథాశ్నాతి ఉభే సుకృత దుష్క్రుతే కథం తే చ తథా తస్య ఫలం సంపాయం దత్యుత కథం న జీర్యతే తత్ర పిండీకృత ఇవాశయే స్త్రీ కోష్టే యత్ర జీర్యంతే భుక్తాని సుగురూ ణ్యపి

జైమిని:

ఓ ద్విజ శ్రేష్ఠులారా! సమస్త ప్రాణి కోట్లకు జనన మరణము లెందు వలన కలుగు చున్నవి? ఈ విషయమున నాకు సంశయము గలుగు చున్నది గాన యడుగు చున్నాను. దయ యుంచి జెప్ప గోరుచున్నాను. జీవు డెట్లు పుట్టు చున్నాడు? మరియు నే విధముగా వృద్ది పొందు చున్నాడు? ఇంతియే గాక శరీర బాధను సహించి స్త్రీ గర్భ మందే విధముగా నుండ గలుగు చున్నాడు? గర్భము నుండి వెలుపలికి వచ్చిన బిమ్మట నెట్లు వృద్ది బొందు తున్నాడు? మరణ కాలమున ప్రాణ వియోగమెట్లు గలుగు చున్నది? జీవుడు తనను మృత్యువు మ్రింగిన పిమ్మట పుణ్య పాపముల నెట్లుగా ననుభవించ గలడు? అటులనే పుణ్య పాపములు గూడ మరణించిన జీవున కెట్లు సుఖదుఃఖ ఫలములు ఇచ్చు చున్నవి? స్త్రీ గర్భ మందనేకములగు గురు పదార్థము లయినను భుజించినవి జీర్ణ మగుచున్నవి. అట్టిచో సామాన్యము గాను మృదువు గాను పిండా కారముగా నుండు జీవుడు గర్భాశయ మందెందుచే జీర్నమగుట లేదు?

భక్ష్యాణి తత్ర నో జంతు ర్జీర్యతే కథ మల్పకః కథం భోక్తా స సర్వస్య కర్మణ స్సుకృతస్య వై ఏత న్మే బ్రూత సకలం సందేహోక్తి వివర్జితమ్ తదేతత్ పరమం గుహ్యం యత్ర ముహ్యంతి జంత పః

జఠరాగ్ని యందు భుజించిన సమస్త పదార్థములు జీర్ణించుచున్నవి. (అనగా పక్వమగు చున్నవి.) అచ్చట యల్ప జీవుడగు నాత డెందుచే నశించుట లేదు. మరియు నాతడెట్లు సుకృత దుష్కృత కర్మ ఫలముల ననుభవించును? ఓ ద్విజ సోదరులారా! ఈ సంశయము లన్నియు నిస్సంశయము లగునట్లుగా జెప్ప గోరు చున్నాను. సమస్త జనులీ విషయము నందు సమ్మోహితు లగుచున్నారు.

పక్షులు:

ప్రశ్న భారో య మతుల స్త్వయా స్మాసు నివేశితః దుర్భావ్య స్సర్వ భూతానాం భావా భావ సమాశ్రితః తమ్ శృణుష్వ మహాభాగ యథా ప్రాహ పితుః పురా పుత్రః పరమ ధర్మాత్మా సుమతిర్నామ నామతః బ్రాహ్మణో భార్గవః కశ్చిత్ సుత మహ మహామతిః కృతోపనయనం శాంతం సుమతిం జడరూపిణమ్

పక్షులు:

ఓ మునిసత్తమ! జీవుల జనన మరణములకు సంబంధించినట్టి యీ ప్రశ్న చాలా రహస్యమైనది. మీరు మాయందు గొప్పదగు ప్రశ్న భారమును మోపినారు. సరే! కానిండు. చెప్పెదము. మహాభాగా! పూర్వ కాలమున పరమ ధర్మాత్ముడు సుమతి యను కుమారుడు తన తండ్రితో చెప్పిన ప్రకారము జెప్పెదము. వినుము. భృగు వంశీయుడు “మహామతి” యను పేరుగల బ్రాహ్మణుడు తన పుత్రునకు ఉపనయన సంస్కార మొనర్చెను. సుమతి యను పేరుగల తన కుమారుడు జడమతి గాను శాంతుడుగా నుండుటచే నా పుత్రునితో నిట్లు బలికెను.

వేదా నదీశ్వ సుమతేః యధానుక్రమ మాదితః గురు శుశ్రూషణే వ్యగ్రో భైక్షాన్న కృత భోజనః తతో గార్హస్థ్య మాస్థాయ చేష్ట్వా యజ్ఞా ననుత్తమాన్

ఇష్ట ముత్పాదయా పత్యం ఆశ్రయేథా వనం తతః వనస్థశ్చ తతో వత్స పరివ్రా డ్నిష్ప్రతిగ్రహః

ఏవ మాప్స్యసి తద్ బ్రహ్మ యత్ర గత్వా న శోచసి

కుమారా! సుమతీ! నీవు గురు సేవా నిరతుడవై భిక్షాన్నమును భుజించుచు క్రమానుసారముగా మొదటయన్ని వేదములను జదువుము. పిమ్మట గృహస్త ధర్మము నవలంభించి, యజ్ఞానుష్టానాదుల నొనర్చి, ఇష్టులైన పుత్రుల గని యనంతరము వానప్రస్థాశ్రమ ధర్మము నవలంభించుము. వత్సా! వానప్రస్థుడవైన తరువాత పరిగ్రహ రహితమైన సన్యాసాశ్రమమును స్వీకరించుము. అట్టి సన్యాసాశ్రమ స్వీకారముచే పునరావృత్తి రహితము దుఃఖ రహితము సచ్చిదానంద స్వరూప బ్రహ్మ జ్ఞానము బొందుదువు.

పక్షులు :

ఇత్యేవ ముక్తో బహుశో జడత్వా న్నాహ కించన పితాపి తం సుబహుశః ప్రాహప్రీత్యా పునః పునః ఇతి పిత్రా సుత స్నేహాత్ ప్రలోభి మధురాక్షిరమ్ స చోద్యమానో బహుశః ప్రహస్యేద మథాబ్రవీత్

పక్షులు:

ఈ ప్రకారము తండ్రి యగు మహాపతి పుత్రుడగు సుమతితో ననేక పర్యాయములు జెప్పినను సుమతి జడుడగుటచే ఏమియు మాటలాడ లేదు. అయినను తండ్రియగు మహామతి పుత్ర స్నేహముచే మాటి మాటికి చెప్ప మొదలిడెను. తండ్రి యిట్లు పుత్ర స్నేహముచే ప్రేమతో మధురముగా మాటి మాటికి చెప్పుచుండ సుమతి నవ్వుచు నిట్లనియె.

తైత ద్భహుశోభ్యస్తం యత్త్వయా ద్యోపదిశ్యతే తథైవా న్యాని శాస్త్రాణి శిల్పాని వివిధాని చ జన్మనా మయుతం సాగ్రం మమ స్మృతి పథం గతమ్ ఉత్పన్న జ్ఞాన భోదస్య వేదైః కిం మే ప్రయోజనమ్ నిర్వేదాః పరితోషశ్చ క్షయ వృద్ధ్యుదయే రతాః శత్రు మిత్త కళత్రాణాం వియోగా స్సంగమా స్తథా మాతరో వివిధా దృష్టాః పితరో వివిధా స్తథా విణ్మూత్ర పిచ్చలే స్త్రీణాం తథా కోష్టే మయోషితమ్ పీడాశ్చ సుభృశం ప్రాప్తా రోగాణాం చ సహశ్రశః  

తండ్రీ! తమరిప్పుడు జెప్పిన వేదాధ్యయనాదులు శాస్త్రములు, శిల్పాది చతుష్షష్టి కళలు, మరి యింక ఎన్నో విద్యలు నేనెన్ని పర్యాయములు అభ్యసించితినో జెప్ప దరము గాదు. జనకా! నాకు పదివేల జన్మల నెత్తిన వృత్తాంతములు జ్ఞాపకములో నున్నవి. నే ననేక సుఖ దుఃఖములు, వృద్ధి క్షయములు, వివిధ నీచ మధ్యమ యుత్తమ జన్మల నెత్తితిని. ఇవన్నియు నాకు గుర్తుగా నున్నవి. జ్ఞానియగు నాకు వేదములతో ప్రయోజనమేమి కలుగును? నేను వివిధములగు మాతృ, పితృ, శత్రు, మిత్ర, పుత్ర, కళత్ర బాంధవుల సంయోగ, వియోగ, సుఖ దుఃఖముల వేల కొలది యను భవించితిని. బంధువులు, తల్లిదండ్రులు యెంత మంది ప్రాప్తించిరో నాకు జెప్ప శక్యము గాదు. వివిధములగు వారి నెందరినో జూచితిని మరియు నేను మల మూత్ర పూరితమగు స్త్రీల గర్భ కోష్టమం ఎన్ని వేల సార్లు నివసించితినో, వేల కొలది యెన్ని విధములగు రోగములచే బీడింప బడితినో జెప్ప నలవి గాదు.

గర్భ దుఃఖా న్యనేకాని బాలత్వే యౌవనే తథా వృద్ధ తాయాం తథాప్తాని తాని సర్వాణి సంస్మరే బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చాపి యోనిషు పునశ్చ పశు కీటానాం మృగాణా మథ పక్షిణాం తథైవ రాజ భృత్యానాం రాజ్ఞాం చాహవ శాలినామ్ సముత్పన్నోస్మి గేహేషు తథైవ తవ వేశ్మని భృత్యతాం దాసతాం చైవ గతోస్మి బహుశో నృణామ్ స్వామిత్వ మిశ్వరత్త్వం చ దరిద్రత్వం తథా గతః హతం మయా హత శ్చాన్యై ర్హతం మే ఘాతితం తథా దత్తం మమాన్యై రన్యేభ్యో మయా దత్త మనేకశః

నేను గర్భ దుఃఖములే గాక యనేకములగు బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యముల యందనుభవించిన వెన్నియో జ్ఞాపకములో నున్నవి. నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పశు, కీట, మృగ, పక్షి, యోనుల యందు జన్మించిన వన్నియు నాకు దెలియును. అటులనే యనేక మార్లు రాజ సేవకుడను, అనేక మార్లు యోద్ధ నైతిని. ఇప్పుడట్లుగానే నీ యింట జన్మించితిని. తండ్రీ నేననేక వారములు నరులకు భ్రుత్యుడను, దాసుడనైతిని. అనేక వారములు రాజును, మహారాజును దరిద్రుడనైతిని. నేనెంత మందినో జంపితిని. నన్ను గూడ జంపిరి. చంపించిరి. ఎన్నియో దానముల జేసితిని. ఎన్నియో దానముల ప్రతిగ్రహణము జేసితిని.

పితృ మాతృ సుహృద్ భ్రాతృ కళత్రాది కృతేన చ తుష్టో సకృత్ తథా దైన్య మశ్రు ధౌతాననో గతః ఏవం సంసార చక్రేస్మిన్ భ్రమతా తాత సంకటే జ్ఞాన మేతన్మ యా ప్రాప్తం మోక్ష సంప్రాప్తి కారకమ్ విజ్ఞాతే యత్ర సర్వోయం ఋగ్యజు స్సామ సంజ్ఞితః కియా కలాపో విగుణో న సమ్యక్ ప్రతిభాతి మే తస్మా దుత్పన్న భోదస్య వేదైః కిం మే ప్రయోజనమ్ గురు విజ్ఞాన తృప్తస్య నిరీహస్య సదాత్మనః షట్ ప్రకార క్రియా దుఃఖ సుఖ హర్ష రసైశ్చ యత్ గుణైశ్చ వర్జితం బ్రహ్మ తత్ ప్రాప్స్యామి పరం పదమ్

తల్లులు, దండ్రులు, స్నేహితులు, సోదరులు, భార్యలు, ఈ మొదలగు వారి వలన యెంతగా సంతోషముల ననుభవించితినో యటులనే దుఃఖ భాష్పములచే నా ముఖముల నెన్ని కడిగితినో జెప్పజాలను. తండ్రీ! నేనీ ప్రారబ్ధముల నీ ప్రకారము సంకట మయమగు సంసార చక్రమున క్రిందికి మీదికి నిరంతరము తిరిగి తిరిగి తుట్ట తుదకు మోక్ష ప్రాప్తిని కలుగ జేయు జ్ఞానమును బొందితిని. ఇట్లు జ్ఞాన లాభము కలుగుటచే ఋగ్యజు స్సామ సంజ్ఞక మగు సమస్త క్రియా కలాపము గుణహీనము, వ్యర్థమని తోచుచున్నది. అందువలన యిప్పుడు నాకు జ్ఞానము గలిగి యున్నందున వేదములతో నేమి ప్రయోజనము? నేను గురు విజ్ఞాన తృప్తుడను, నిరీహుడను. ఎల్లప్పు డానందాత్మ స్వరూపుడను. ఆరు విధములగు క్రియా, దుఃఖ, సుఖ, హర్ష, రస, గుణ వర్జిత రహితమును, పరమ పదమగు బ్రహ్మ పదవిని బొందుదును.

రస హర్ష భయోద్వేగ క్రోధా మర్షజ వాగురా విజ్ఞాతా నృ మృగ గ్రాహి సంఘ పాశ శకుతాలా తస్మాద్ యాస్యా మ్యహం తాత త్యక్వేమాం దుఃఖ సంతతిమ్ త్రయీ ధర్మ మాధర్మార్యం కిం పాప ఫల సన్నిభమ్

నేను రస, హర్ష, భయ , ఉద్వేగ, క్రోధ, అమర్షములచే వ్యాకులమై , నర, మృగ, శ్వాన, కృమి, కీటాదులచే యనేకము లగు బంధనములచే నీ జీవుని బంధించు చున్నవి. దుఃఖ రూపమగు సంసారమును బాగా దెలిసికొని యున్నాను. ఈ కారణముచే నో జనకా! నేనీ దుఃఖ రూప జనన మరణాది ప్రవాహము నుండి గట్టెక్కెదను. నాకు వేద ధర్మ మధర్మ బహుళము గాను, పాప ఫల మిచ్చు దాని వలె గన్పట్టు చున్నది. గాన నిస్త్రై గుణ్యుడనై నిస్సందేహముగా బ్రహ్మీ భూతుడ నయ్యెదను.

పక్షులు:

తస్య తద్వచనం శ్రుత్వా హర్ష విస్మయ గద్గదమ్ పితా ప్రాహ మహా భాగః స్వ సుతం హృష్టమానసః

పక్షులు:

కుమారుడగు సుమతి యొక్క యీ వాక్యమును విని మహాభాగుడు మహామతి ప్రసన్న చిత్తుడు హర్ష విస్మయ యుక్తుడు, గద్గద కంఠుడునై పుత్రునితో మరల నిట్లనియె.

పిత:

కిమేతద్ వదసే వత్స కుతస్తే జ్ఞాన సంభవః కేన తే జడతా పూర్వ మిదానీం చ ప్రభుద్దతా కిన్ను శాప వికారోయం ముని దేవ కృత స్తవ యత్తే జ్ఞానం తిరోభూత మావిర్భావ ముపాగతమ్

పిత:

వత్సా! నీవు ఏమి జెప్పు చున్నావు? ఇట్టి బ్రహ్మ జ్ఞానమెట్లు వచ్చినది? నీవు పుట్టినది మొదలు జడుని వలె నుంటివి. ఇప్పుడెచ్చటి నుండి యిట్టి జ్ఞానము బుట్టినది? నీకిట్టి బ్రహ్మ జ్ఞానము మునులు, దేవతలు గాని యిచ్చిన శాపముచే మరుగు బడి ఇప్పుడు వెలుగులోకి వచ్చినదా?

పుత్రుడు:

శృణు తాత యథా వృత్తం మమేదం సుఖ దుఃఖదమ్ యశ్చాహమాస మన్యస్మిన్ జన్మ న్యస్మత్ పరం తు యత్ ఆహిమాసం పురా విప్రో న్యస్తాత్మా పరమాత్మని ఆత్మ విద్యా విచారేషు పరాం నిష్ఠా ముపాగాతః సతతం యోగ యుక్తస్య సంతతాభ్యాస సంగమాత్ సత్ సంయోగాత్ సత్ స్వభావాత్ విచార విధి శోదనాత్ తస్మిన్నేవ పరా ప్రీతి రమ్మా సీద్ యంజత స్సదా ఆచారతాం చ సంప్రాప్తః శిష్య స దేహ హృత్తమః తతః కాలేన మహతా ఐకాంతిక ముపాగతః అజ్ఞానా కృష్ణ సద్భావో విపన్నశ్చ ప్రమాదతః

పుత్రుడు:

తండ్రీ! నా యొక్క సుఖ దుఃఖ ప్రదాయక మగు నీ మొదటి జన్మ వృత్తాంతము, అటులనే నే నన్య జన్మ మందెవరినై యుంటినో, అది యంతయు జెప్పెదను వినుము. నేను పూర్వ జన్మము నందొక బ్రాహ్మణుడను. ఆ బ్రాహ్మణ జన్మమున నేను పరమాత్మ యందు నిరంతరము జీవాత్మను లీనము జేసి ఆత్మ విద్య యందత్యంత నిష్ఠా లాభమును గడించితిని. ఎల్లప్పుడు యోగ యుక్తుడనై యుండుట చేతను సంతత సత్సంగతి నభ్యాసము గలిగి సత్స్వభావము, సద్విచారము విధి నిషేధముల జ్ఞానము గల వాడనైతిని. మరియు నిరంతరము పరమాత్మ యందు లగ్నమైన మనస్సు గల వాడనగుటచే నా జన్మము లోనే నత్యంత ప్రశాంత చిత్తముతో నున్నాను. శిష్య సందేహ నివారకమగు నాచార్య పదవిని గూడా పొంది యున్నాను. కొంత కాలము గడచినంత యేకాంతికత్వము బొందితిని. మరల యజ్ఞానములో బడి దుష్ట స్వభావుడనై ప్రమాదము వలన విపన్నుడ నైతిని.

ఉత్క్రాంతి కాలా దారభ్య స్మృతి లోపో న మేభవత్ యాప దబ్డం గతం చైవ జన్మనాం స్మృతి మాగతమ్ పూర్యాభ్యాసేన తేనైవ సోహం తాత జితేంద్రియః యతిష్యామి తథా కర్తుం న భవిష్యే యథా పునః జ్ఞాన దాన ఫలం హ్యేదత్ యజ్ఞాతి స్మరణ మమ న హ్యేత త్ప్రాప్యతే తాత త్రయీ ధర్మాశ్రితై ర్నరైః సోహం పూర్వాశ్రమా దేవ నిష్ఠా ధర్మ ముపాశ్రితః ఏకాంతిత్వ ముపాగమ్య యతిష్యా మ్యాత్మ మోక్షణే తద్ బ్రూహి త్వం మహాభాగః యత్తే సాంశయికం హృది ఏతావతా పితే ప్రీతి ముత్పాద్యా నృణ్య మాప్నుయామ్

అటులయినను నా మరణ కాలము దనుక నాకు స్మృతి లోపము గలుగ లేదు. అందు వలననే పుట్టినది యాదిగా ఎన్ని సంవత్సరములు గడచినవో యవి యన్నియు నాకు గుర్తులో నున్నవి. ఈ కారణముచే నో తండ్రీ! పూర్వాభ్యాస బలము వలన జితేంద్రియుడనై మరల నట్టి యత్నమును చేసెదను. మరల జన్మ లేకుండ జేసు కొనెదను. జ్ఞాన దాన ఫలముచే నా కిట్టి జాతి స్మరణ గల వాడనైతిని. ( అనగా సర్వ జనుల వృత్తాంతములు నాకు తెలిసి యున్నవి.) తండ్రీ! త్రయీ ధర్మాశ్రితులగు జనులిట్టి జాతి స్మరణము బొందజాలరు. నేను పూర్వ జన్మార్జిత నిష్ఠా ధర్మమునే యాశ్రయించి ఏకాంత భావము గల వాడనై ఆత్మ మోక్షము కొరకు ప్రయత్నించెదను. ఇందువలన నో మహాభాగా! తమ హృదయ మందే కొంచెము సంశయమున్నను దానిని తెల్పుడు. మీకున్న సందేహములు నివారణ చేయుటచే మీరు సంతోషము జెందుదురు. మీకట్లు సంతోషము గలుగ జేయుటచే నేను పితృ ఋణము తీర్చుకున్న వాడన య్యెదను.

పక్షులు:

పితా ప్రాహ తతః పుత్రం శ్రద్ధ ధత్ తస్య త్వదశ్చః భవతా యద్వయం పృష్ఠాః సంసార గ్రణాశ్రయమ్

పక్షులు:

అనంతర మందతని తండ్రియగు మహామతి కుమారుడగు సుమతి మాటలను విని, యాతని వాక్యముల యందు విశ్వాసము గలిగి, మీరు మమ్ముల నడిగిన జనన మరణ రూపమగు సంసార విషయములను కుమారుని యడిగెను.

పుత్రుడు:

శృణు తాత యథా వృత్త మనుభూతం మయాసకృత్ సంసార చక్ర మజరం స్థితి ర్యస్య న విద్యతే సోహం వదామి తే సర్వం తవైవా నుజ్ఞయా పితః ఉత్క్రాంతి కాలా దారభ్య యథా నాన్యో వదిష్యతి ఊష్మా ప్రకుపితః కాయే తీవ్ర వాయు సమీరితః భినత్తి మర్మ స్థానాని దీప్యమానో నిరింధనః ఉదానో నామ పవన స్తత శ్చోర్ద్వం ప్రవర్తతే భుక్తానా మంబు భక్ష్యాణా మధోగతి నిరోధకృత్  

పుత్రుడు:

జనకా నేను తమ యాజ్ఞచే సమస్త వృత్తాంతములను దెల్పెదను. అనిత్యమగు నీ సంసార చక్రములో బడి యనేక మారులు నే ననుభవించిన యథార్థ విషయములను జెప్పెదను. వినుము. తండ్రీ! నేను తమ యనుజ్ఞతో నా సమస్త వృత్తాంతమును జెప్పు చున్నాను. నేను జెప్పబోవు మృత్యు కాల మందు సంభవించు సంపూర్ణ సంఘటనల నెవ్వరును జెప్ప జాలరు. జనకా! జీవునికి మరణ కాలము సమీపించు సమయమున శరీర మందలి పిత్తము వృద్ధి జెంది, ఇంధనము లేక బోయినను తీవ్రమగు వాయు సంచారముచే మండు చున్నదై, మర్మ స్థానము లన్నింటిని భేదించుచు మరియు కంఠ దేశ మందుండు ఉదానమగు వాయువు దానిపై భాగమున నుండి భుజించిన ఆహారమును, త్రాగిన జలమును క్రిందికి బోకుండా నిరోధించి మల మూత్రములను రాకుండా నిరోధించును. అప్పుడు ప్రాణ వియోగమగును.

తతో యేనాంబు దానాని కృతా న్యన్న రస స్తథా దత్తా స్స తస్య ఆహ్లాద మాపది ప్రతివద్యతే అన్నాని యేన దత్తాని శ్రద్ధా పూతేన చేతసా సోపి తృప్తి మవాప్నోతి వినాప్యన్నేన వై తదా యేనా నృతాని నోక్తాని ప్రీతి భేదః కృతో న చ ఆస్తిక శ్శ్రధ్ధదానశ్చ ససుఖం మృత్యు మృచ్చతి దేవ బ్రాహ్మణ పూజాయాం యే రతా నోనసూయవః శుక్లా వదాన్య హ్రీమంత స్తే నరా స్సుఖ మృత్యవః యోన కామాన్న సంరభా న్న ద్వేషా ద్ధర్మ ముత్స్రు జేత్ యథో క్తకారీ సౌమ్యశ్చ స సుఖం మృత్యు మృచ్చతి

ఎవరయితే జల దానము, అన్న దానము జేయుదురో వారికి మాత్రము మరణ సమయ మందిట్టి బాధ కలుగక పోగా ప్రసన్న మనస్కులై అనాయాస మరణ మందెదరు. ఎవరయితే శ్రద్ధా పూర్వకముగా పవిత్రమగు నస్సుతో అన్నదానము జేసేదరో వారప్పు డన్నము తినిన వారి వలె తృప్తి గలవారై యుందురు. ఎవడైతే యసత్యము బలుకడో, ప్రీతి గల వారికి స్నేహము జెడగొట్టడో, దేవుడున్నా డనునట్టి యాస్తిక బుద్ధి గలవాడో, భగవంతుని యందు శ్రద్ధా భక్తి విశ్వాసములు గలిగినవాడై యుండునో, అట్టి వానికి సుఖమగు సనాయాస మరణము గలుగును. మరియు దేవ బ్రాహ్మణ పూజా నిరతులు, అసూయా రహితులు, శుద్ధ చిత్తులు, మృదు మధురముగా మాటలాడు వారు, లజ్జ గలవారు సుఖమైన మరణ మందెదరు. మరియు కామ, క్రోధ, ద్వేషములకు వశుడై ఎవడు ధర్మమును త్యజించడో, ఎవడు జెప్పిన ప్రకారము జేయు వాడో, ఎవడు సౌమ్యముగా నుండునో, యట్టివాడు సుఖముగా ప్రాణ త్యాగము జేయును.

అవారి దాయినో దాహం క్షుదాం చానన్న దాయినః ప్రాప్నువంతి నరాః కాలే తస్మిన్ మ్రుత్యా వుపస్తితే శీతం జయంతి ధనదా స్తాపం చందన దాయినః ప్రాణఘ్నీం వేదానాం కష్టాం యే చానుద్వేగ కారిణః మోహాజ్ఞాన ప్రదాతారః ప్రాప్నువంతి మహద్ భయమ్ వేదనాభి రుద్రగాభిః ప్రపీడ్యంతే ధమా నరాః కూటసాక్షి మృపావాదీ యశ్చా స దనుశాస్తి వై తే మోహ మృత్యవ స్సరే తథాన్యే వేద నిందకాః విభీషణాః పూతి గంధాః కూట ముద్గర పాణయః ఆగచ్చంతి దురాత్మానో యమస్య పురుషా స్తదా

మరియు దప్పిక గొన్న వారికి జలదానము జేయని వారు, ఆకలి గొన్న వారికన్న దానము జేయని వారు, మృత్యు కాల మాసన్న మయినప్పు డాకలి దప్పికలతో బాధ పడుదురు. మరియు చలి కాలములో శీత బాధా నివారణ మనకు కట్టెల నిచ్చు వారికి మృత్యు కాల మందు వారిని చలి బాధించదు. చందన దానము జేయువారు తాపము జెందరు. ఎల్లప్పుడూ ప్రాణులకు భయము కలుగ జేయు వారికి, మృత్యు కాలమున యత్యంత భయము, మహోగ్రమగు వేదనలచే బాధలు కల్గును. అధర్మమును, అజ్ఞానమును, ఉపదేశించు నాతడు ప్రాణ త్యాగ సమయమున మహా దుఃఖముల చేతను, అజ్ఞానము జేతను మృత్యు వందును. మరియు దొంగ సాక్ష్యము జెప్పువాడు, అసత్యమాడు వాడు, వేద నిందకుడు, అధర్మ శాసనము జేయు వాడు, ఇట్టి వారందరూ మొహముచే ( అనగా అజ్ఞానముచే) మరణించెదరు. మరియు నట్టి పాపాత్ముల మరణ సమయమున, భయంకరులు, దుర్గంధులు, కూట ముద్గర హస్తులు, దురాత్ములు నగు యమ దూతలు వచ్చెదరు.

ప్రాప్తేషు దృక్పధం తేషు జాయతే తస్య వేపథుః క్రంద త్యవిరతం సోథ భ్రాతృ మాతృ సుతా నథ సాస్య వాగ స్ఫుటా తాత ఏకవర్ణా విభావ్యతే దృష్టిశ్చ భ్రామ్యతే త్రాసా చ్చ్వాసా చ్చుష్య త్య థాననమ్ ఊధ్వ శ్వాసాన్విత స్సోథ దృష్టి భంగ సమన్వితః తత స్సవేదనా విష్ట స్తచ్చరీరం విముంచతి వాయ్వగ్రసారీ తద్రూప దేహ మన్యత్ ప్రపద్యతే తత్కర్మజం యాతనార్థం న మాతృ పితృ సంభవమ్ తత్ ప్రమాణ వయోవస్థా సంస్థానైః ప్రాగ్భవం యథా తతో దూతో యమస్యాశు పాశైర్భాద్నాటి దాదుణైః దండ ప్రహార సంభ్రాతం కర్షతే దక్షిణాం దిశమ్

నరుడు మరణ కాలమున యమ దూతల దర్శనము కాగానే కంపించు చుండును. భ్రాతృ, మాతృ, పితృ, సతీ, సుతులను నిర్వి రామముగా బిలుచుచు రోదనము జేయు చుండును. తండ్రీ! ఆ సమయమున మాటలు స్పష్టముగా నుండవు. జ్ఞప్తి గూడ నుండదు. దృష్టి కంతయు నొకే వర్ణముగా గన్పించును. కండ్లు తిరిగి పోవుచుండును. మరియు భీతి,  ఆయాసములచే ముఖము శుష్కించును. అనంతరమా జీవుడు ఊర్ధ్వ శ్వాస గల వాడగును. దృష్టి భంగమగును. పిమ్మట ఘోర వేదనముతో నా శరీరమును విడిచి పెట్టును. తరువాత నిట్లు శరీరమును విడిచిన జీవుడు వాయు దేవున కగ్ర సారియై తాను జేసి కొనిన కర్మల వాళ్ళ గలిగిన నరక యాతనల ననుభవించుటకై, తల్లి, దండ్రి, యను వారక్కర లేకనే దేహమును ధరించును. పూర్వము జనిపోవు నప్పుడున్న రూపము, ప్రమాణము, వయస్సు, అవస్థా, సంస్థానములు గల వాడగును. తరువాత యమ దూతలు వానిని కఠినములగు త్రాళ్ళతో బంధించి దుడ్డు కర్రతో మోదుచూ, సంభ్రాంత చిత్తుడగు వానిని దక్షిణ దిక్కున కీడ్చుకొని బోయెదరు.

కుశ కంటక వల్మిక శంకు పాషాణ కర్కశే తథా ప్రదీప్త జ్వలనే క్వచి చ్చ్వభ్ర శతోత్కటే ప్రదీప్తా దిత్య తప్తేన దహ్యమానే తడంశుభిః క్రుష్యతే యమ దూతైశ్చ శివా సన్నాద భీషణైః విక్రుష్యమాణ స్సైర్ఘోరై ర్భక్ష్యమాణః శివా శతైః పయాతి దారుణే మార్గే పాప కర్మా యమ క్ష్యయమ్ చత్రోపానత్ ప్రదాతారో యే చ వస్త్రప్రదా నరాః తే యాంతి మనుజా మార్గం తం సుఖేన తతాన్నదాః విమానైః సోజ్జ్వలైః ర్యా తి భూమి దాన పదా నరాః ఏవం క్లేశా ననుభవ న్నవశః పాప పీడితః నీయతే ద్వాదశాహేన ధర్మరాజ పురం నరాః

మరియు నా యమ దూతలు పాపాత్ముడిని కుశ, కంటక, వల్మీక, శంకు, పాషాణ ములతో వ్యాప్తమై యుండు కఠిన ప్రదేశము లందు మండుచున్న మంటలందును, వందల కొలది గుంటల యందును బడవేయుచు బలవంతముగా నీడ్చుకొని బోయెదరు. కొన్ని చోట్ల సూర్యుడత్యుష్ట కిరణములచే దహించ, భయము గొలుపు నక్కల యరుపులతో నున్న యమ మార్గమున యమ దూతలు పాప జీవుని ఈడ్చుదురు. ఇట్లు పాప పురుషుడు వందల కొలది నక్కలు పీక్కొని తినుచుండ దారుణ మగు మార్గమున యమ దూతలు లాగుకొని పోవుచుండ యమ లోకమునకు బోవును. ఏ పురుషులు గొడుగు, పాదరక్షలు, వస్త్రము, అన్నము దానము జేయుదురో వారు సుఖముగా యమ మార్గమున వెళ్ళగలరు. ఏ నరులు భూదానమును జేయుదురో, యట్టివారు ప్రకాశవంత మగు విమానమున దిష్టించి సుఖముగా స్వర్గమును బోవుదురు. పాప పీడితుడగు నరుడీ ప్రకారము క్లేశానుభవముచే వివశుడై యుండ చని పోయిన పన్నెండవ రోజున యమలోకమునకు దూతలు తీసికొని పోవుదురు.

కళేబరే దహ్యమానే మహాంతం దాహ మృచ్చతి తాడ్య మానే తథైవార్తిం చీద్యమానే చ దారుణమే క్లిద్యమానే చిరతరం జంతుర్దుఃఖ మవాప్నుతే స్వేన కర్మ విపాకేన దేహాంతర గతోపి సన్ తత్ర యద్ బాంధవా స్తోయం ప్రయచ్చంతి తిలై స్సహ యచ్చ పిండం ప్రయచ్చంతి నీయమాన స్తదశ్నుతే తైలాభ్యంగో బాంధవానా మంగ సంవాహనం చ యత్ తేన చాప్యాయతే జంతు ర్యచ్చాశ్నంతి స్వబాంధవాః భూమౌ స్వపద్భి ర్నాత్యంతం క్లేశ మాప్నోతి బాంధవైః దానం దదద్భిశ్చ తథా జంతు రాప్యాయతే మృతః

 జీవుని కళేబరమును దహించగానే జీవున కత్యంతమగు దప్పిక బుట్టును. మరియు యమ దూతలు గొట్టుచుండ, యాత నా శరీరమును చేదించు చుండ, పాప జీవుడు దారుణ వేదన ననుభవించును. ఈ దేహమెప్పుడు నీటి యందు తడప బడుచున్నదో, అప్పుడు మరియొక దేహమును బొందినప్పటికిని, తాను జేసికొనిన కర్మ ఫలముచే నెల్ల వేళలా దుఃఖమునే యనుభవించు చుండును. బందువులా జీవుని యుద్దేశించి తిల తర్పణము, పిండ దానము జేయుదురు. వాటిని యమ దూతలు తీసికొని జీవున కిచ్చెదరు. ఇట్లిచ్చిన పిండములను, తిల తర్పణోదకమును, తిని, త్రాగి, తృప్తి జెందును. బంధువులు తైలా భృంగము, నలుగు పెట్టుకొనుట వర్ణించ వలెను. కారణ మేమనగా మృతునికి యా వస్తువులే భోజన మందు లభించును. మరియు బంధవులు క్రింద బరుండుటచే మృత్యువునకు క్లేశము దూరమగును. మరియు దానము చేయుటచే మృతుడు దుఃఖము లేని వాడై ప్రసన్న చిత్తుడగును.

నీయమాన స్స్వకం గేహం ద్వాదశాహం స పశ్యతి ఉపభుక్తే తథా దత్తం తోయ పిండాధికం భువి ద్వాదశాహాత్పరం ఘోర మవాసం భీషణాకృతిమ్ యామ్యం పశ్య త్యథో జంతుః కృష్య మాణః పురం తతః గతమాత్రోతి రక్తాక్షం భిన్నాంజన చయ ప్రభమ్ మృత్యు కాలాంతకాదీనం మధ్యే పశ్యతి వైయమమ్ దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ దారుణా కృతిమ్ విరూపై ర్భీశణె ర్వక్త్రై ర్వ్రుతం వ్యాధి శతైః ప్రభుమ్ దండాసక్తం మహా బాహుం పాశ హస్తం సుభైరవం తన్నిర్దిష్టాం తతో యాతి గతిం జంతు శ్శుభా శుభమ్

అతడు పండ్రెండవ దినమున తన ఇంటికి యమ దూతలు తీసికొని రాగ తన నుద్దేశించి ఇవ్వబడిన తిలోదక పిండాన్నములను భుజించును. పండ్రెండవ రోజు పూర్తి యైన దరువాత మరల యమ దూతలు తీసికొని పోగా అతి ఘోరము, భయంకరము గొప్పది, భీషణా కృతియగు లోహ మాయా యమపురిని జూచును. వెళ్లినదే తడవుగా, మృత్యు దేవత, కాలదేవత, అంతక దేవత ఈ మొదలగు పార్శదులతో గూడి ఎర్రటి నేత్రములు కాటుక కొండ వలె నల్లని ఛాయ గల యమధర్మ రాజును చూచును. ఆ యమధర్మ రాజు దంష్ట్రా కరాల వదనుడు, భ్రుకుటీ భంగముచే దారుణాకారముగా గన్పట్టు వాడు. విరూపులు వక్రాకృతులు భీషణులునగు వందల కొలది వ్యాధి దేవతలచే పరివృతమగు యమధర్మ రాజు నా పాపకర్ముడు జూచును. మరియు నా పాప జీవుడు యమ దండము ధరించిన వాడు, మహా బాహుడు, పాశ హస్తుడు మహాభైరవ ఆకారము గల వాడునగు యముని జూచును. మరియు నా జీవుడు యమధర్మ రాజు నిర్ణయించి ఆజ్ఞాపించిన సుకృత దష్క్రుతము లనుభవించును.

రౌరవే కూట సాక్షి తు యాతి యశ్చానృతీ నరః బ్రహ్మఘ్నో హత్యయా దష్టో గోఘ్నశ్చ పితృ ఘాతకః క్షేత్ర దారాపహారి చ సీమా నిక్షేప హారకః గురు పత్న్యభి గామీ చ కన్యా గామీ తథైవ చ తస్య స్వరూపం గదతో రౌరవస్య నిశామయ యోజవానాం సహస్రే ద్వే రౌరవో హి ప్రమాణతః జానుమాత్ర ప్రమాణశ్చ తతశ్శ్వభ్రః సుదుస్తరః తత్రాంగార చాయో పేతం కృతం చ ధరణీ సమమ్ జాజ్వల్య మాన స్తీవ్రేణ తాపితాంగార భూమినా తన్మధ్యే పాప కర్మాణం విముంచంతి యమాయేనుగాః స దహ్యమాన స్తీవ్రేణ వహ్నినా తత్ర ధావతి

తండ్రీ అబద్ద సాక్షమిచ్చు నాతనిని రౌరవమను నరక మందు బడ వేయుదురు. బ్రాహ్మణుని జంపిన వాడు, గోవుని జంపిన వాడు, తండ్రిని జంపిన వాడు రౌరవ నరక మనుభవించును. మరియు పొలమును, పర భార్య నపహరించిన వాడు, గట్లను గల్పు కొనువాడు, గురుపత్నీ గమనము, కన్యా గమనము జేయువాడు రౌరవ నరక మనుభ వించును. జనకా! ఆ రౌరవ నరకము యొక్క స్వరూపమును జెప్పెద వినుము. ఆ రౌరవ నరకము రెండు వేల యోజనముల పరిమితమగు పొడవు, నంతియే వెడల్పు గలదిగా నుండును. మరియు తొడల లోతు ప్రమాణము గలదియు, సుదుస్తర మగు గర్త ముండును. ఆగర్త మందు మృత్తికతో సమానమగు నిప్పులు, మరియు నా తీవ్రమగు నంగారములచే కాల్చ బడిన వాడై యా పాప కర్ముడెల్లప్పుడు గాలు చుండును. యమాను చరులు పాపాత్ములగు మనుష్యులను దాని యందు బడ వేయుదురు. అట్లు బడ వేయగా నా పాపాత్ముడు నా తీవ్రాగ్నిచే దహింపబడు చున్న వాడై ఇటు నటు పరుగెత్తు చుండును.

పదే పదే చ పాదోస్య శీర్యతే జీర్యతే పునః అహో రాత్రేణోధ్ధరణం పాద న్యాసం చ గచ్చతి ఏవం సహస్ర ముత్తీర్ణో యోజనానాం విముచ్యతే తతోన్యత్ పాప శుద్ధ్యర్థం తాదృ జ్నిరయ మృచ్చతి తత స్సర్వేషు నిస్తీర్ణః పాపీ తిర్యక్త్వ మశ్నుతే కృమి కీట పతంగేషు శ్వాపదే మశకాదిషు గత్వా గజ దృమాద్యేషు గోష్వశ్వేషు తథైవ చ అన్యాసు చైవ పాపాసు దుఃఖదాసు చ యోనిషు మానుష్యం ప్రాప్య కుబ్జోవా కుత్సితో వామనోపి వా చండాల పుల్కసా ద్యాసు నరో యోనిషు జాయతే

ఈ ప్రకారము వాని పాదములు మాటి మాటికి నిప్పులచే తగుల బడిపోవు చుండును. మరియు నష్టమగు చుండును. అహో రాత్రములలో నొక సారి పాదములు భూమి యందుంచు కొనుచు సమర్ధుడగును. ఈ విధముగా చరణముల భూమి యందుంచుచు నా రౌరవ నరకము నుండి వేయు యోజనములు ఉత్తీర్ణుడై యచ్చటి నుండి విముక్తుడగును. మరియు పాప శుద్ది కొరకు దీనితో సమానమగు మరియొక నరకమునకు బోవును. పాపి యగు నరుడీ విధముగా నన్ని నరకముల నుండి విముక్తుడై తిర్య గ్యోని యందు బుట్టును. తిరిగి క్రమముగా కృమి, కీటక, పతంగ, శ్వాపద (హింసాత్మక జంతువు ) మశ కాదుల యందు జన్మించును. ఇంక నా పాపి క్రమముగా పాప యోనుల జన్మించును.ఎద్దు ,గుఱ్ఱము, ఏనుగు, మరియు వృక్ష లతలు మొదలగు ననేక ప్రకారములగు కష్ట పాప జన్మల బొందును. చిట్ట చివరకు మనుష్య జన్మను బొందిననూ, పొట్టివాడు, నపుంసకుడు, కుత్సితుడుగా గాని చండాల పుల్క సాది పాప యోనుల యందు జన్మించును.

అవశిష్టేన పాపేన పుణ్యేన చ సమన్వితః తత శ్చారోహిణీం జాతిం శూద్ర వైశ్య నృపాదికామ్ విప్ర దేవేంద్రతా చాపి కదాచి దవరోహిణీమ్ ఏవం తు పాప కర్మాణో నరకేషు పతత్యదః యథా పుణ్య కృతో యాంటి తన్మే నిగదతః శృణు తే యమేన వినిర్దిష్టాం యా తి పుణ్యాం గతిం నరాః ప్రగీత గంధర్వ ణైః ప్రనృత్తా ప్సరసాం గణైః హార నూపుర మాధుర్య శోభితా న్యుత్తమాని చ ప్రయాంత్యాశు విమానాని నానా దివ్య స్రగుజ్జ్వలాః తస్మాచ్చ ప్రచ్యుతా రాజ్ఞా మన్యేషాం చ మహాత్మనామ్

తిరిగి యవశిష్ట మగు పుణ్య పాప కర్మచే గూడుకొని ఆరోహణ క్రమముగా శూద్ర వైశ్య క్షత్రియాది జాతులలో జన్మించును. తరువాత బ్రాహ్మణ జన్మ నెత్తి ధర్మా చరణచే దేవేంద్ర పదవిని గూడ బొంద గలడు. లేక యధర్మా చరణముచే నవరోహణ క్రమముగా నరకము లందు గూడ పడ గలడు. ఇప్పుడు నో తండ్రీ! పుణ్య కర్మ జేసిన నరుడే విధముగా బోవునో యా ప్రకారమును జెప్పెద వినుము. పుణ్యాత్ములగు మనుష్యులు గూడ ధర్మ రాజు నిర్ణయించిన పుణ్య లోకములకు బోయెదరు. పుణ్యాత్ములు బోవు సమయమున అన్ని వైపుల గంధర్వులు గానము జేయుచుందురు. అచ్చరలు నృత్యము జేయుచుందురు. మరియు హారనూపుర మాదుర్యములచే శోభితము లత్యుత్తములగు విమానములు సమీపమునకు వచ్చును. సమీపించిన విమానములు నానా విధ దివ్య మాలలచే నుజ్వలములై యుండును. వాటి యందు గూర్చొని బోయెదరు. ఇట్లు స్వర్గాది లోకములకు బోయి పుణ్య క్షయమగు సరికి రాజుల ఇండ్లలో గాని మహాత్ముల యిండ్లలో గాని యుందురు.

జాయంతే చ కులే తత్ర సద్ వృత్త పరిపాలకాః భోగాన్ సంప్రాప్నువం త్యగ్ర్యాం స్తతో యంతూర్ధ్వ మన్యథా అవరోహినీం చ సంప్రాప్య పూర్వవ ద్యాంతి మానవాః ఏతత్తే సర్వ మాఖ్యాతః యథా జంతు ర్విపద్యతే అతః శృణుష్వ విప్రర్షే యథా గర్భం ప్రపద్యతే

ఆ పుణ్యాత్ములు సత్కులము లందు బుట్టి సదాచార పరిపాలకు లైన మనుష్యు లగుదురు. మరియు ననేక ప్రకారము లగు భోగము లనుభవించి క్రమముగా నూర్ధ్వ గతుల నందెదరు. లేక వారు సామాన్య పుణ్యములు జేసిన వారైనచో యవరోహణ క్రమ విధి ననుసరించి సమస్త భోగముల ననుభవించెదరు. ఓ తండ్రీ! ప్రాణి సమూహ మెట్లు మృత్యువును బొందునది యంతయు తమకు వర్ణించితిని. విప్ర శ్రేష్ఠుడవగు తండ్రీ! ఇప్పుడు జీవము గర్భము నెట్లు పొందునో, దానిని వినుము.