మార్కండేయ మహా పురాణము
4 - చతుర్వ్యూహావతార వర్ణనము
మార్కండేయుడు:
ఏవం తే ద్రోణ తనయాః పక్షిణో జ్ఞానినో భవన్
వసంతి హ్యచలే వింధ్యే తానుపాస్వ చ పృచ్చ చ
ఇత్ర్యుషే ర్వచనం శ్రుత్వా మార్కండేయస్య జైమినిః జగామ వింధ్య శిఖరం యత్ర తే ధర్మ పక్షిణః తన్నగాసన్న భూతశ్చ శుశ్రావ పఠతాం ధ్వనిమ్ శ్రుత్వా చ విస్మయావిష్ట శ్చింతయామాస జైమినిః స్థాన సౌష్టవ సంపన్నం జిత శ్వాస మవిశ్రమమ్ విస్పష్ట మపదోషం చ పఠ్యతే ద్విజ సత్తమైః వియోనిమపి సంప్రాప్తా నేతాన్ముని కుమారకాన్ చిత్రమేత దహం మన్యే న జహాతి సరస్వతీ
మార్కండేయుడు:
ఓ జైమినీ మహర్షి! ఈ ప్రకారముగా ద్రోణుని కుమారులగు ఆ పక్షులు జ్ఞానము కలిగిన వైనవి. ఆ ధర్మ పక్షులు వింధ్య పర్వత మందు నివసించు చున్నవి. గాన నీవు వారిని సేవించి నీ సందేహముల నడుగుము. జైమిని మహర్షి మార్కండేయ మహాముని చెప్పిన మాటలను విని, ధర్మ పక్షులు నివసించు చున్న, వింధ్య పర్వతమునకు వెళ్ళెను. వింధ్య పర్వత సమీపమునకు వెళ్ళగానే ధర్మ పక్షులు చదువుతున్న వేద ద్వని వినబడెను. జైమిని మహాముని అత్యంత విస్మయము జెంది ఇట్లు దలచెను. ఏమి యాశ్చర్యము? ఈ విప్ర కుమారులు పక్షి రూపములు బొందియు కూడ స్వర వర్ణోచ్చారణ విధి ప్రయుక్తముగ స్పష్టము గాను దోష రాహిత్యము గాను నిరంతర వేద పారాయణము చేయు చున్నారు. ఈ ద్విజ కుమారులు తిర్యగ్యోనిలో జన్మించిననూ సరస్వతీ దేవి వీరిని వదలలేదు. ఇది మరియు విచిత్ర మైనదిగా నేను దలచు చున్నాను.
బంధువర్గ స్తథా మిత్రం యచ్చేష్ట మ పరం గృహే । త్యక్త్వా గచ్చతి తత్సర్యం న జహాతి సరస్వతీ ॥ ఇతి సంచింతయన్నేవ వివేశ గిరికందరం ప్రవిశ్య చ దదర్శాసౌ శిలాపట్ట గతాన్ ద్విజాన్ పఠతస్తాన్ సమాలో క్యా ముఖదోష వివర్జితాన్ సో థ శోకేన హర్షేణ సర్వానే వాభ్యభాషత స్వ స్త్యస్తు వో ద్విజశ్రేష్టా జైమినిం మాం నిభోదత వ్యాసశిష్య మనుప్రాప్తం భవతాం దర్శనోత్సుకమ్ మస్యుర్న ఖలు కర్తవ్యో యత్పిత్రా తీవ మన్యునా శప్తాః ఖగత్వమాపన్నాః సర్వథా దిష్టమేవ తత్ స్ఫీతద్రవ్యే కులే కేచి జ్జాతాః కిల మనస్వినః ద్రవ్యనాశే ద్విజేంద్రాస్తే శబరేణ సుసాన్త్వితాః
బంధు వర్గము, మిత్రులు, సమస్త వస్తువు లన్నియు, నభీష్టము లైననూ వదిలి బెట్టి బోవును. వాగ్దేవత మాత్రము వదలక వెంట వచ్చునని దీని వలన తెలియు చున్నది. ముని శ్రేష్ఠుడగు జైమిని మహర్షి ఇట్లు తలంచుచూ, పర్వత గుహ సమీపమునకు వెళ్లి, శిలా ఫలక మందున్నట్టి ద్విజ బాలకులను చూచెను. సర్వ దోషములు లేని వేద పాఠమును చేయుచున్న వారందరినీ జూచి, జైమిని శోకహర్శములు గలవాడై ఇట్లు పలికెను. ఓ ద్విజ శ్రేష్టులారా! మీకు శుభమగు గాక. నేను వ్యాస శిష్యుడను. జైమినియను వాడను. మీ దర్శనము చేయ వలయునని యుత్సాహముతో నిచ్చటికి వచ్చితిని. అత్యంత కోపముతో మీ జనకునిచే శపింపబడి నందులకు పక్షి రూపులయితిరి. దుఃఖించ దగినది గాదు. అంతయూ ప్రారబ్ద ఫలమై యున్నది. చూడుడు! కొందరు మహాత్ములు ధన, మాన, విషయ సమృద్ధి గల వంశములో జన్మించెదరు. తిరిగి ఆ ద్రవ్యము నాశమగు సరికి వారే శబరులచే నాదరింప బడుచున్నారు.
దత్త్వా యాచంతి పురుషా హత్వా వద్యంతి చాపరే పాతయిత్వా చ పాస్యంతే త ఏవ తపసః క్షయాత్ ఏతద్ద్రుష్టం సుబహుశో విపరీతం తథా మయా భావా భావ సముచ్చేదై రజస్రం వ్యాకులం జగత్ ఇతి సంచింత్య మనసా న శోకం కర్తు మర్హథ జ్ఞానస్య ఫలమేతావ చ్చోకహర్షై రదృష్యతా తతస్తే జైమినిం సర్వే పాద్యార్ఘ్యాభ్యామపూజయన్ అనామయం చ పప్రచ్చుః ప్రణిపత్య మహామునిమ్ అథోచుః ఖగామాస్సర్వే వ్యాసశిష్యం తపోనిదిమ్ సుఖోపవిష్టం విశ్రాంతం పక్షానిల హతక్లామమ్
కొందరు దాత లైననూ యాచకులగు చుందురు. కొందరు పరులను హత్య చేసి ఇతరులచే చంపబడు చుందురు. కొందరు ఇతరులను జంపుటచే బంధింప బడుదురు. తపస్సు యొక్క క్షయము వలనిట్టి సంఘటనలు జరుగు చుండును. నేననేక పర్యాయములు అనేక సంఘటన లట్టివి జూచితిని. ఇట్లు భావాభావ విశేషములచే ప్రపంచమంతయూ నిరంతర వ్యాకుల మయమై యున్నది. ఇట్లుగా తలంచి మీరందరు దుఃఖించ కుందరు గాక. శోక హర్షముల యందు ధైర్యముగా నుండుటయే జ్ఞానమునకు ఫలము. పిమ్మట నా ధర్మ పక్షులందరూ ఆ జైమిని మహా మునిని పాద్యార్ఘ్యాదులచే పూజించి నమస్కరించిరి. కుశల ప్రశ్నను జేసిరి. తరువాత ఆ ధర్మ పక్షులు తమ రెక్కల గాలిచే శ్రమదీరి విశ్రాంతిగా సుఖముగా కూర్చొని యున్న వ్యాస శిష్యుడగు జైమిని మహర్షితో నిట్లు పలికిరి.
పక్షులు:
ఆద్యన స్సఫలం జన్మ జీవితంచ జీవితమ్ యత్పశ్యామ స్సురైర్వంద్యం తవ పాదాంభుజ ద్వయమ్
పక్షులు:
ఓ మహానుభావా! ఈ రోజున దేవతా వంద్యమగు మీ పాద కమల ద్వయము యొక్క దర్శన భాగ్య మచ్చినది. మా జీవితము సుజీవిత మైనది. మా జన్మ సఫల మైనది.
పితృ కోపాగ్ని రుద్భూతో యోనో దేహేషు వర్తతే సోధ్య శాంతింగతో విప్ర యుశ్మద్దర్శన వారిణా కచ్చిత్తే కుశలం బ్రహ్మన్నాశ్రమే మృగ పక్షిషు వృక్షే ష్వథ లతాగుల్మ త్వక్సారతృణ జాతిషు అథవా నైత దుక్తం హి సమ్యగస్మాభి రాదృతైః భవతా సంగమో యేషాం తేశామకుశలం కుతః ప్రసాదం చ కురుష్వా త్ర బ్రూహ్యా గమన కారణమ్ దేవానామివ సంసర్గో భవతో భ్యుద యోమహాన్ కేనాస్మద్భాగ్య గురుణా ఆనీతో దృష్టి గోచరమ్
మా పితృ దేవుని కోపముచే అగ్ని అత్యంత ప్రబలమై మా శరీరము లందున్నది. ఇప్పుడా కోపాగ్ని తమ సందర్శనమనే జలముచే శాంతి బొందినది. బ్రహ్మణ్యుడా! తమ ఆశ్రమ మందలి మృగ పక్షి గణములు, వృక్ష లతా తృణము లన్నియు కుశలమే కదా! అయిననూ మేమిట్లడుగుట అనుచితము. ఎందుచేత ననగా తమ సన్నిదాన మందున్న వాటికి అమంగళ మెట్లు కలుగును? ఇప్పుడు తమరు ఇచ్చటికి వచ్చిన కారణమేమి? దయ యుంచి తెలుప గోరు చున్నాము. దేవా గమనము వలె మీ రాక మాకు క్షేమ దాయకమగు చున్నది. మేము చేసికొనిన యోకానొక భాగ్య బలముచే తమ దర్శనము మాకు లభించినది.
జైమిని:
శ్రూయతాం ద్విజ శార్దూలాః కారణం యేన కందరమ్ వింధ్య స్యేహా గతో రమ్యం రేవావారిక ణోక్షితమ్ సందేహాన్ భారతే శాస్త్రే తా ప్రష్టుం గతవానహమ్
జైమిని:
ద్విజ శ్రేష్ఠులారా! ఏ కారణముచే రేవా నదీజల కణసిక్తమగు ఈ వింధ్య పర్వత మందలి మనోహరమగు కందరమునకు వచ్చితినో, చెప్పెద వినుడు. మహా భారత మందు కొన్ని సందేహములు ఉండుటచే నేను వాటిని మిమ్ముల నడుగుటకై వచ్చితిని.
మార్కండేయం మహాత్మనాం పూర్వం భ్రుగుకులోద్వహమ్ తమహం పృష్టవాన్ ప్రాప్య సందేహాన్ భారతం ప్రతి స చ వృష్టో మయా ప్రాహ సంతి వింధ్యే మహాచలే ద్రోణ పుత్రా మహాత్మాన స్తే వక్ష్యన్త్యథ విస్తరమ్ తద్వాక్య చోదిత శ్చేమ మాగతోహం మహాగిరిమ్ తచ్చృణుద్వ మశేషేణ శ్రుత్వా వ్యాఖ్యాతుమర్హథ
భృగు కుల దురంధురుడగు మహాత్ముడైన మార్కండేయ మహాముని సమక్షమునకు వెళ్లి మహా భారత మందలి సందేహముల నడిగితిని. ఇట్లడిగిన నాతో యాతడిట్లనెను. “వింధ్య పర్వత మందు మహానుభావులగు ద్రోణ ముని కుమారులున్నారు. నీవక్కడికి వెళ్ళి, వారి నడుగుము. వారు నీ ప్రశ్నలకు సవిస్తరముగా సమాధానము చెప్పగలరు.” నేను మార్కండేయ మహాముని చెప్పిన ప్రకారమే ఈ పర్వతమునకు వచ్చితిని. ఇప్పుడు మీరు నేనడగ బోవు నా అన్ని ప్రశ్నలను సంపూర్ణముగా విని, ఉన్నదున్నట్లుగా చెప్పి, సందేహముల నివారణ చేయుదురు గాక.
పక్షులు:
విషయే సతి వక్ష్యామో నిర్విశంక శ్శ్రుణుష్వతత్ కథం తన్న వదిష్యామో యదస్మద్భుద్ది గోచరమ్
పక్షులు:
చెప్ప దగినవైన యడల జెప్పేదము. తమరు నిశ్శంకముగా వినుడు. మా బుద్ధికి గోచర మైనచో తప్పక చెప్పెదము.చెప్పకెందుల కుండెదము?
చతుర్ష్వపి హి వేదేషు ధర్మ శాస్త్రేషు చైవ హి సమస్తేషు తతాంగేషు యచ్చాన్య ద్వేదసంమితమ్ ఏతేషు గోతరో స్మాకం బుద్దే ర్భ్రాహ్మణ సత్తమ ప్రతిజ్ఞాంతు సమావోడుం తథాపి సహీ శక్నుమః తస్మాద్వదస్వ విశ్రబ్దం సందిగ్దం యద్ది భారతే వక్షామస్తవ ధర్మజ్ఞ న చేన్మోహో భవిష్యతి
నాలుగు వేదము లందు, వేదాంగము లందు, ధర్మ శాస్త్ర పురాణేతిహాసము లందు, వేద ప్రమాణము గల ఇంకను ఇతరములగు సమస్త శాస్త్రము లందును, మా బుద్దికి సమస్త విషయములు గోచరమగును. ద్విజ సత్తమా! వేద సమ్మితములగు వీటినన్నిటిని ఎరుగుదుము గాని ప్రతిజ్ఞ చేసి జెప్ప శక్తులము గాము. అందువలన తమరు సందేహించక భారతము లోని సందేహముల నడుగుడు. బుద్ధి మాంద్యము కలుగనిచో జెప్ప గలము.
జైమిని:
సందిగ్ధానీ హ వస్తూని భారతం ప్రతి యానిమే శృణుద్వమమలాస్తాని శ్రుత్వా వ్యాఖ్యాతు మర్హత కస్మాన్మానుషతం ప్రాప్తో నిర్గునోపి జనార్ధనః ।
వాసుదేవో ఖిలాదారః సర్వకారణ కారణమ్ ॥
జైమిని:
విమల చిత్తులారా! మహా భారత మందలి విషయములలో నాకు సందేహములు గలిగినవి. వాటిని మీరు విని, సంశయ నివృత్తి చేయుదురు గాక. నా మొదటి సంశయము ఏమన, సర్వ కారణ కారణుడు సమస్త బ్రహ్మాండముల కెల్ల నాదార భూతుడు వాసుదేవుడనగు జనార్ధనుడు మనుష్య జన్మను బొందుట ఏ కారణము వలన గలిగెను?
కస్మాన్మానుషతం ప్రాప్తో నిర్గునోపి జనార్ధనః ।
వాసుదేవో ఖిలాదారః సర్వకారణ కారణమ్ ॥
కస్మాచ్చ పాండు పుత్రాణా మేకా సా ద్రుపదాత్మజా । పంచానాం మహిషీ కృష్ణా సుమహానత్ర సంశయః ॥ భేషజం బ్రహ్మ హత్యాయా బలదేవో మహాబలః । తీర్ధయాత్రా ప్రసంగేన కస్మాచ్చక్రే హలాయుధః ॥ కథంచ ద్రౌపతే యాస్తే కృతధారా మహారథాః । పాండునాథ మహాత్మానో వధమాపు రనాథ వత్ ॥ ఏతత్సర్వం కత్యతాం మే సందిగ్ధం భారతం ప్రతి । కృతార్థోహం సుఖం యేన గచ్చేయం నిజమాశ్రమమ్ ॥
పంచ పాండవులకు ఒక్క ద్రౌపతియే భార్య యగుట ఏమి? ఇది మహా సంశయముగా నున్నది. మహా బలవంతుడు, హలాయుధుడు నగు బలరాముడు తీర్త యాత్రా సమయమున బ్రహ్మ హత్య నెందులకు చేసెను? ప్రాయశ్చిత్తము నెట్లు జేసి కొనెను? మరియు పాండవ సహాయము గలవారయ్యు, ద్రౌపతీ కుమారులు మహా రథులునగు పాండవేయులు అవివాహిత స్తితిలోనే దిక్కు లేని వారివలె ఎందు వలన చంప బడిరి? ఈ నాల్గు విషయములలో నా కత్యంత సందేహములు కలిగినవి. మీరీ భారత సంబంధ సంశయములకు యథార్థములగు సమాధానముల నిచ్చి నన్ను కృతార్థుని జేయుము. పిమ్మట సుఖముగా నా యాశ్రమమునకు వెళ్ళెదను.
పక్షులు:
నమస్కృత్య సురేశాయ విష్ణవే ప్రభవిష్ణవే పురుషాయా ప్రమేయాయ శాశ్వతాయా వ్యయాయ చ చతుర్వ్యూహాత్మనే తస్మై త్రిగుణాయ చ వరిష్టాయ గరిష్టాయ వరేణ్యాయా అమృతాయ చ యస్మాదనుతరం నాస్తి యస్మాన్నాస్తి బృహత్తరం యేన విశ్వమిదం వ్యాప్త మజేన జగదాదినా ఆవిర్భావ తిరోభావ దృష్టా ద్రుష్ట విలక్షణమ్ వదంతి యత్సృష్ట మిదం తథైవా తే చ సంహృతమ్
ధర్మ పక్షులు:
సురేశ్వరుడు విష్ణువు, ప్రభవిష్ణువు పురుషుడు, అప్రమేయుడు, శాశ్వతుడు, నాశన రహితుడు నగు వాసుదేవునకు నమస్కరించి చెప్పెదము. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములను చతుర్వ్యూహములు గలవాడును, సగుణ, నిర్గుణ, స్వరూపుడును వరిష్టుడు,గరిష్టుడు,వరేణ్యుడు, అమృతుడునగు వాసుదేవునికి నమస్కరించి చెప్పెదము. సర్వ దేవతాదీశ్వరుడు, సర్వవ్యాపి, అత్యంత ప్రభావశాలి, పురుష రూపి (అనగా సకల శరీరము యందుండేడి యాత్మ) అప్రమేయుడు, శాశ్వతుడు, అవ్యయుడు నగు వాసుదేవునికి నమస్కరించి చెప్పు చున్నాము. (సృష్టి ప్రకరణ మందు సాంఖ్యాది యోగ శాస్త్ర ప్రసిద్ధములగు నహంకారాదిచే ఈ చతుర్వ్యూహముల యుత్పత్తి చెప్పబడి యున్నది. కొందరు ఇచ్చట చతుర్వ్యూహ శబ్దములకు జాగ్రుత్, స్వప్న, సుషుప్తి, తురీయము లర్థములని చెప్పుచున్నారు. విచారించినచో అర్థమునకు విశేష తాత్పర్యము గోచరించుట లేదు.) ఆ పరమాత్మ కన్నా అణువు లేదు, యతని కంటే మహత్తు లేదు. విశ్వమంతయూ వ్యాపించి యున్నవాడు, జనన రహితుడు, జగదాదియు నగు పరమాత్మకు నమస్కరించి చెప్పుచున్నాము. ఈ సంసార మందు ఆవిర్భావతిరోభావ, దర్శన, ఆదర్శనాది అన్ని కార్యములు ఆ పరమాత్మ వలన గల్గుచున్నవి. సృష్టి స్థితిలయ కర్త యగు నా పరమేశ్వరునికి నమస్కరించి చెప్పెదము.
బ్రాహ్మణే చాదిదేవాయ నమస్కృత్య సమాధినా ఋక్సా మాన్యు ద్గిరన్వ క్రైర్యః పునాతి జగత్రయమ్ ప్రణిపత్య తథైశాన మేకబాణ వినిర్జితైః యస్యా సురగణైర్యజ్ఞా విలుప్యంతే న యజ్వినామ్ ప్రవక్ష్యా మో మతం కృత్స్నం వ్యాసస్యా ద్భుత కర్మణః । యేన భారత ముద్దిశ్య ధర్మాద్యాః ప్రకటీ కృతాః ॥ ఆపో నారా ఇతిప్రోక్తా ముని భిస్తత్వ దర్శిభిః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః
నాల్గు వేదములను నాల్గు ముఖములతో నుచ్చరించిన వాడునగుచు ముల్లోకములను పవిత్రము చేయుచున్న ఆది దేవుడగు బ్రహ్మదేవుని ధ్యాన పూర్వకముగా నమస్కరించు చున్నాను. అసుర సైన్యము ఒక్క బాణముతో నిర్జించి యజ్ఞ విఘ్నము చేయుటకు ఆశక్తు లగునట్లు చేసిన దేవాది దేవుడగు మహాదేవుని చరణ కమలములకు నమస్కరించి చెప్పు చున్నాము. అత్యంతాద్భుత కర్మకారి యగు వ్యాస మహర్షిచే నుద్దేశించి ధర్మ, అర్థ, కామ, మోక్షాదులు ప్రకటింప బడినవి. అట్టి వ్యాసుని మతానుసారముగా అన్ని విషయములు లెస్సగా తమకు తెలుపుదుము. ‘నార’ అనగా జలము. ‘అయన’ మనగా నివాసము. మొదట జలమందే నివసించుటచే “నారాయణు”డని పెద్దలు చెప్పుదురు.
స దేవో భగవాన్సర్వం వ్యాప్య నారాయణో విభుః చతుర్దా సంస్థితో బ్రాహ్మన్ సగుణోనిర్గుణ స్తథా ఏకా మూర్తిరనిర్దేశ్యా శుక్లాం పశ్యంతి తాం బుధాః జ్వాలామాలో పరుద్ధాంగీ నిష్టా సా యోగినాం పరా దూరస్థా చాంతికస్థా చ విజ్ఞేయా సా గుణాతిగా వాసుదేవా భిదానో సౌ నిర్మమత్వేన దృశ్యతే రూపవర్ణాదయస్తన్యా న భావాః కల్పనామయాః అస్త్యేవ సా సదా శుద్దా సుప్రతిష్టై కరూపిణీ
బ్రహ్మణ్యుడా! దేవాది దేవుడు భగవంతుడు నగు నారాయణుడు సగుణ నిర్గుణములను రెండు రూపములతో నాలుగు మూర్తులుగా విలసిల్లు చున్నాడు. రెండింటిలో నొకటిదగు నిర్గుణమూర్తి ఇట్టిదని వాక్కుచే నిర్దేశింప శక్యము గానిదియు, పండితులచే శుక్ల వర్ణమనియు, చూడబడు చున్నది. ఆ నిర్గుణ మూర్తి జ్వాలామాలోపరుద్దమై యోగి గమ్యమని చెప్పుదురు. మరియు త్రిగుణాతీతము, దూర మందును సమీప మందును ఉండునట్టి ప్రధాన స్వరూపమగు మొదటి మూర్తి యొక్క పేరు వాసుదేవ మూర్తియై యున్నది. ఈ వాసుదేవ మూర్తియందు మమత్వ మనునది లేశ మాత్రము లేదు. అట్టి వాసుదేవ మూర్తి యందు రూపవర్ణాది భావములన్నియు కేవల కల్పనామయములు. ఆ మూర్తి సర్వకాల మందు సుప్రతిష్టితము పరమ పవిత్రము శుద్ధమునేక మాత్ర రూపమై ప్రకాశించుచున్నది.
ద్వితీయా పృథివీం మూర్ధ్నా శేషాఖ్యా దారయత్యథః తామసీ సా సమాఖ్యాతా తిర్యక్త్వం సముపాశ్రితా తృతీయా కర్మ కురుతే ప్రజాపాలన తత్పరా సత్త్వోద్రిక్తా తు సాజ్ఞేయా ధర్మ సంస్థాన కారిణీ చతుర్ధీ జలమధ్యస్థా శేతే పన్నగ తల్పగా రసస్తస్యా గుణః సర్గం సా కరోతి సదైవ హి యా తృతీయా హరేర్మూర్తిః ప్రజాపాలన తత్పరా సాతు ధర్మ వ్యవస్థానం కరోతి నియతం భువి ప్రోద్దూతానసురాన్హంతి ధర్మ విచ్చిత్తి కారిణః పాతి దేవా న్సత శ్చాన్యాన్ ధర్మరక్షా పరాయణాన్
రెండవ మూర్తి పాతాళ లోక మందుండి సంకర్షణుడను పేరుతో సర్ప రూపమును ధరించి భూమిని మోయుచున్నాడు. ఇతనిని తామస మూర్తియని యందురు. భగవంతుడగు నారాయణుని ద్వారా సంపూర్ణ కర్మలు సమ్యక్ప్రకారముగా సాధింప బడుచున్నవి. ఆయన వలన ప్రజాపాలనాది సర్వ కార్యములు సంపాదింపబడు చున్నది. ధర్మ సంస్థాపన కారిణియగు నీ మూడవ మూర్తిని ప్రద్యుమ్న మూర్తియని పల్కుదురు. నాల్గవది యగు అనిరుద్ధ మూర్తి శేష శయ్యపై జలమందు శయనించుచు నివసించు చున్నది. ఆ మూర్తి రజోగుణాత్మికయై ఎల్లప్పుడూ సృష్టి కార్యము చేయు చుండును. నారాయణుని తృతీయ మూర్తి నియతముగా ప్రజాపాలన, సదా ధర్మ సంస్థాపన, చేయు చుండును. ఈ తృతీయ మూర్తి ధర్మ వినాశనము జేయు నసుర గణమును సంహరించును. ధర్మ పరాయణులయిన దేవతలను అన్యులగు సత్పురుషులను సదా రక్షించు చుండును.
యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భావతి జైమినే అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజత్య సౌ భూత్వా పరా వరాహేణ తుండేనా పో నిరస్యచ ఏకయా దంష్ట్ర యోత్ఖాతా నలినీవ వసుంధరా కృత్వా నృసింహ రూపంచ హిరణ్యకశి పుర్హతః విప్రచిత్తి ముఖాశ్చాన్యే దానవా వినిపాతితా వామనాదీం స్తథైవాన్యాన్న సంఖ్యాతు మిహోత్సహే అవతారాంశ్చ తస్యేహ మాథుర స్సాంప్రతం త్వయమ్ ఇతి సా సాత్త్వికీ మూర్తి రవతారా న్కరోతి వై ప్రద్యుమ్నేతిచ సా ఖ్యాతా రక్షా కర్మణ్య వస్థితా దేవత్వేథ మనుష్యత్వే తిర్యగ్యోనౌ చ సంస్తితా గృహ్ణాతి తత్స్వ భావం చ వాసుదేవేచ్చయా సదా ఇత్యేతత్తే సమాఖ్యాతం కృతకృత్యోపి యత్ప్రభుః మానుషత్వం గతో విష్ణుః శృణు ష్వా స్యోత్తరం పునః
జైమినీ మహర్షి! ఎప్పుడెప్పుడు ధర్మ హాని కలిగి యధర్మ వృద్ధి యగుచున్నదో యా మూర్తి యా సమయమున ధర్మోద్ధారణ చేయుటకై యవతరించు చుండును. ఈ మూర్తియే పూర్వము వరాహ రూపమును ధరించి దంతాగ్ర భాగాములచే జలమును నిరసించి, యొక దంష్ట్రచే భూమిని కమలమును వలె నుద్ధరించి, యథా ప్రకారముగా ప్రతిష్టించెను. మరియు నీ మూర్తి నరసింహ రూపమును ధరించి హిరణ్య కశిపుని సంహరించెను. ఇంతేగాక విప్రచిత్తి లోనుగా గల దానవులను వధించెను. అటులనే వామనుడు మొదలుగా గల యవతారములను ధరించెను. అవతారములను మేము లెక్కింప జాలము. ఆ మూర్తి ఈ సమయమున మధుర యందు శ్రీకృష్ణుడుగా నవతరించి యున్నాడు. ఈ ప్రకారముగా నా సత్వ గుణాత్మిక మూర్తి యొక్క యవతారములు జరుగు చుండును. ప్రద్యుమ్న ఖ్యాతి గల మూర్తి రక్షా కర్మ యందు ప్రవర్తించు చుండును. ఆ ప్రద్యుమ్న మూర్తి, దేవతల యందు, తిర్యగ్యోనుల యందు అవతరించుచు, వాసు దేవుని ఇచ్చానుసారముగా నెల్లప్పుడు నా యా స్వభావముల నవలంబించు చుండును. మే మీ వాసుదేవుని ప్రభావము తమ సమీపమున యంతయు వర్ణించినాము. ఇప్పుడు భగవానుడగు విష్ణుమూర్తి కృత క్రుత్యుడైననూ యే కారణముచే మనుష్య దేహమును బొందెనో దానికి సమాధానము జెప్పెదము వినుడు.
Summary of chapter 4 of the Mārkandeya Mahā Purana is as follows:
The wise birds declare the supreme glory of Bhagavān Vishṇu's divine descent into the mortal world to destroy demoniac forces and restore cosmic righteousness. Although Bhagavān Vishṇu is eternal, unmanifest, and beyond material attributes, He manifests through His divine māyā whenever Dharma declines and Adharma spreads across the realms. His descent as Bhagavān Kṛshṇa was ordained to relieve Earth of her heavy burden, slay oppressive kings, guide noble souls on the path of devotion, and re-establish Sanātana Dharma throughout Bhāratavarsha.