మార్కండేయ మహా పురాణము
58 - స్వారోచిషే మన్వంతరే బ్రాహ్మణ వాక్యం
తేనాను లిప్త పాదోథ స ద్విజో ద్విజ సత్తమః హిమవంత మగా ద్ద్రష్టుం నానా ప్రస్రవణాన్వితమ్ సహస్రం యోజనానాంహి దినార్దేన వ్రజామి యత్ ఆయస్యామితి సంచిన్త్య తదర్దేనాపరేణ హి సంప్రాప్తో హిమ వత్పృష్టం నాటి శ్రాంత త్రానుర్ ద్విజః విచచార తతస్తత్ర తుహి నాచల భూతలే పాదాక్రాంతే న తస్యాథ తుహినేన విలీ యతా ప్రక్షాలితః పాదలేపః వరమౌషది సంభవః తతో జడగతిః సోథ ఇతశ్చేతశ్చ పర్యటన్ దదర్శాతి మనో జ్ఞాని సానూని హిమ భూభృతః
ఓ మునిసత్తమా! ఎప్పుడయితే ఆ అతిథి పాదముల యందు లేపనము చేసెనో, అప్పుడు ఆ బ్రాహ్మణుడు “దినము నందలి ప్రథమార్థమునకే వేల యోజనములు వెల్లుదునుమరియు అపరాహ్నమునకు అక్కడినుండి కూడ తిరిగి రాగలను” అని అనుకొనిన వాడై అనేక ప్రవాహములతో నిండి యున్న హిమాలయ పర్వతములు చూచుటకు వెళ్ళెను. ఆ ద్విజవరుడు సహజముగానే హిమాలయ పీఠమునకు చేరుకొని ఆ హిమాచల భూమి యందు విహరింప సాగెను. అచట చరించు చుండగానే పాదములకు అధిక శీతలము సోకుటచే పరమోషధముల యొక్క లేపనము పాదముల నుండి కరిగి పోయినది. అప్పుడు ఆ బ్రాహ్మణుని గతి జడత్వముగా నుండెను. అనంతరము అతడు ఇటునటు తిరుగుచు ఆ హిమాలయ పర్వతము యొక్క మనోహర మగు సాను ప్రాంత భాగములను చూడ సాగెను.
సిద్ధ గాంధర్వ జుష్టాని కిన్నరాభి రతాని చ క్రీడా విహార రమ్యాణి దౌవాదీనా మిత స్తతః దివ్యాప్సరో గణ శతై రాకీర్ణాన్య వలోకయన్ నాతృ ప్యత ద్విజ శ్రేష్ఠః ప్రోద్భూత పులకోమునేః క్వ చిత్ప్ర స్రవణా ద్భ్రష్ట జల పాత మనోరమమ్ ప్రనృత్యచ్చిఖి కేకాభి రన్య తశ్చ నినాదితమ్ దాత్యూహ కోయష్టి కాద్యైః క్వ చిచ్చాతి మనోహరైః పుంస్కోకిల కలాలాపైః శృతి హారిభి రన్వితమ్ ప్రఫుల్ల తారు గంధేన వాసితానిలవీ జితమ్ ముదాయుక్త సస దదృశే హిమ వంతం మహా గిరిమ్
అచట సిద్ధులు, గంధర్వులు, కిన్నెరులు విహరించు చుండిరి. మరియు ఆ పర్వత ఒడ్డున దేవతల క్రీడలకు విహరించుటకు అత్యంత రమణీయమగు ప్రదేశములు చేయ బడినవి. ఓ మునీ! ఆ ద్విజ శ్రేష్ఠుడు ఆ ప్రదేశమును వందల కొలది అప్సరసలతో నిండి యుండుట చూడ సాగెను. అనంతరము దేనిని చూచుట తోడనే అతని దేహము పులకించి పోయెనో, దాని వలన అతడు తన మనస్సును తృప్తి పరచ లేక పోయెను. ఆ బ్రాహ్మణుడు ప్రసన్న చిత్తముతో చూచుట ప్రారంభించెను. హిమాలయ పర్వతములు ఒక్కొక్క స్థానము నందు రాళ్ళపై నుండి జలరాశులు క్రిందకు పడుటచే సుందరముగా నున్నవి మరియొక చోట నెమళ్ళు కేంకారావముతో నాట్యము చేయు చుండెను. వాటి కేంకారావములతో శబ్దాయమానమై యున్నది. వేరొక చోట ఇతర అనేక పక్షులు పలు విధముల ధ్వనులు చేయుచున్నవి. మరియొక చోట అత్యంత మనోహరములగు దాత్యూహములు, వాన కోయిలలు, కోయష్టికములు, అను పక్షులు టిటిహరి (పెన్నడ పులుగు) అను మొదలగు పక్షులచే వ్యాప్తమై యున్నది. వేరొక చోట పుంస్కోకిలల మధురాలాపాలతో ప్రతి ధ్వనించు చున్నది. మరియొక చోట ఫల పుష్ప, గంధ సువాసితములతో వృక్షములు వాయువుచే వీచుచున్నది. ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా హిమవంతమను మహాగిరి యొక్క శోభను చూసి అత్యంత ముగ్దుడయ్యెను.
దృష్ట్వాచై నం ద్విజసుతో హిమవంత మహాచలమ్ శోద్రక్షామీతి సంచినత్య మతిం చక్రే గృహం ప్రతి విభ్రష్ట పాద లేపోథ చిరేణ జడిత క్రమః
చింత యామాస కిమిదం మయా జ్ఞానా ననుష్టితమ్ యది ప్రలేపో న ష్టోమే విలీవో హిమ వారిణా శైలోతి దుర్గమ శ్చాయం దూరం చః మిహాగతః ప్రయాస్యామి క్రియాహాని మగ్ని శుశ్రూష ణాదికమ్ కథమత్ర కరిష్యామి సంకటం మహాదాగతమ్ ఇదం పరమిదం రమ్య మిత్య స్మిన్వర పర్వతే సక్త దృష్టి రహం తృప్తిం నయాస్యే బ్ద శతైరపి
ఆ తరువాత బ్రాహ్మణ కుమారుడు హిమవంతమను పేరు గల మహాచలమును చూచి తన మనస్సులో ఇట్లు అనుకొన సాగెను. “తిరిగి రేపు ప్రాతః కాలమందు వచ్చి చూచెదను.” అని నిశ్చయించుకొని గృహమునకు వెళ్ళుటకు సిద్ధ మయ్యెను. అక్కడ ఆలస్యమయి నందున పాద లేపనము కరిగి పోవుటచే జడుడుని వలె కదల లేని వాడై ఆ బ్రాహ్మణుడు ఇట్లు చింతింప సాగెను. “నేను అజ్ఞానముతో ఏమి చేసితిని? ఎప్పుడు నా పాదములకు ఈ శీతల జలముతో నష్టమై పోయినదో, అప్పుడు ఇక్కడి నుండి వెళ్ళుట చాలా కష్టము. ఈ పర్వతము మహా దుర్గము. నా గృహము చాలా దూరములో నున్నది. ఇప్పుడు నాకు గొప్ప సంకటము ప్రాప్తించినది. ఇక్కడ అగ్ని శుశ్రూషణాది కార్యములు ఏ విధముగా చేయుదును? అట్లు చేయని యెడల నిత్య క్రియలన్నియు నష్టమై పోవును. ఇది రమణీయ మైనది. అని ఈ విధముగా ఈ శ్రేష్ఠ పర్వత మందు ఆసక్తి కల వాడనై నూరు సంవత్సరము లైనను నేను తృప్తి పొందలేను.
కిన్నరాణాం కలాలాపాః సమన్తా చ్చ్రోత్ర హారిణః ప్రఫుల్ల తరు గంధాశ్చ ఘ్రాణ మత్యంత మృచ్చతి సుఖ స్పర్శ స్తథా వాయుః ఫలాని రసవంతి చ హరంతి ప్రసభం చేతో మనోజ్ఞాని సరాంసి చ ఏవం గతే తు పశ్యేయం యది కించిత్త పోనిధిమ్ స మమోపదిశే న్మార్గం గమనాయ గృహం ప్రతి
ఆహా నాలుగు వైపులా నుండి చెవులకు ఇంపుగా, మధురముగా కిన్నెరుల సుఖదాయకమైన ఆలాపనలు వినిపించు చున్నవి. పుష్పించిన వృక్షముల నుండి సుగంధమును పొంది నాసిక తృప్తి పొందినది. ఇచ్చటి వాయువు యొక్క సుఖ స్పర్శ, సమస్త ఫలములు, సరస మనోహరమగు సరోవరముల యందు నా మనస్సు ఆకర్షింప బడుచున్నది. ఇప్పుడు ఈ విధముగా కొద్ది సేపు గడపిన పిమ్మట ఎవరయిన తపోధనులు కనిపించిన యెడల, వాని వలన గృహమునకు వెళ్ళు ఉపాయమును తెలుసు కొనెదను.
మార్కండేయుడు:
స ఏవం చింతయ న్విప్రో బభ్రామ చ హిమాచలే భ్రష్టపాదౌ షది బలో వైక్లబం పరమం గతః తం దదర్శ భ్రమంతం చ ముని శ్రేష్ఠం వరూథినీ వరాప్సరా మహాభాగా మౌలేయా రూపశాలినీ
మార్కండేయుడు:
పాదములకు పూయ బడిన ఔషద శక్తి నష్టమై పోవుటచే అధిక దుఃఖము కలవాడై ఆ ద్విజవరుడు ఈ విధముగా చింతించుచు హిమాలయము లందు చరింప సాగెను. ఆ సమయమున వరూథిని అను పేరు గల మౌలేయ రూప శాలిని మహాభాగ అప్సరసలలో శ్రేష్టురాలునగు ఆమె ఆ ముని శ్రేష్ఠుడు చరించుట చూచెను.
తస్మి న్ద్రుష్టే తత స్సాభూ ద్ద్విజ వర్యే వరూథినీ మదనా కృష్ణ హృదయా సా నురాగాహి తత్క్షణాత్ చిన్తయా మాసకోన్వేష రమణీయ తమా కృతిః సఫలం మే భవే జ్జన్మ యది మాం నావ మన్యతే ఆహోస్య రూప మాధుర్య మహోస్య లలితా గతిః అహోగంభీరతా దృష్టేః కుతోస్య సదృశోభువి దృష్టా దేవా స్తథా దైత్యాః సిద్ధ గంధర్వ పన్నగాః కథమేకోపి నాస్త్యస్య తుల్య రూపో మహాత్మనః యథాహ మస్మి న్మయ్యే ష సానురాగ స్తథా యది భవేదత్ర మయా కార్య స్తత్క్రుతః పుణ్య సంచయః
ఆ ద్విజవరుని చూచుట తోడనే కామ బాణములచే పీడిత హృదయురాలై ఆ వరూథిని వెంటనే అతని యందు అనురాగము గలదయ్యెను. మరియు ఇట్లు అనుకొన సాగెను. “ఈ మనోహర ఆకృతి గల పురుషుడు ఎవరు? ఈతడు నన్ను అనాదరణ చేయనిచో నా జన్మ సఫల మగును. ఆహా! ఏమి ఇతని రూప మాధుర్యము? ఏమి మనోహర గతి విధి? ఏమి ఆ దృష్టి గాంభీర్యము నందలి చమత్కారము? భూమండల మందు ఈతడికి సమాన పురుషుడు ఎవరు? దేవ, దైత్య, సిద్ధ, గంధర్వ, పన్నగులు మొదలగు వారి నెందరినో చూచితిని. కాని వారిలో ఈ మహాత్మునితో సమానమగు రూపముల వాని నెవరినీ చూడలేదు. ఏ విధముగా నేను ఇతని ఎడల ప్రీతి గల దాని నైతినో, అట్లే అతడు కూడ నా యందు అనురక్తు డైనచో నా పూర్వ జన్మ కృత పుణ్య ఫలము ప్రాప్తించినదను కొనవచ్చును.
యాద్యేష మయి సుస్నిగ్దాం దృష్టి మధ్య నిపాతయేత్ కృత పుణ్యా న మత్తోన్యా త్రైలోక్యే వనితా తతః
ఈతడు నన్ను స్నిగ్ధ దృష్టితో చూచినచో, మూడు లోకము లందును నాతో సమానమగు పుణ్యాంగనలు ఇంకెవరుందురు?
మార్కండేయుడు:
ఏవం సంచిత యంతీ సా దివ్య యోషి త్స్మరాతురా ఆత్మానం దర్శయా మాస కమనీయ తరాకృతిమ్ తాంతు దృష్ట్వా ద్విజసుత శ్చారు రూపాం వరూథినీం సోపచారం సమాగమ్య వాక్యమేత దువాచ హ కాత్వం కమల గర్భాభే కస్య కిం వాను తిష్ఠసి బ్రాహ్మణో హ మిహాయాతో నగరా దరుణా స్పదాత్ పాదలే పోత్రమే ధ్వస్తో విలీనో హిమవారిణా యస్యాను భావా దత్రాహ మాగతో మదిరే క్షణే
మార్కండేయుడు:
దివ్యంగాన యగు ఆ వరూథిని కామాతురురాలై ఈ విధముగా చింతించుచు తన మనోహరమగు సంపూర్ణ అంగ ప్రత్యంగములను ఈ బ్రాహ్మణునికి చూపించెను. బ్రాహ్మణ కుమారుడు ఆ శోభాయ మానమగు, రూపవతి యగు వరూథినిని చూసి, చక్కగా పాద్యాది ఉపచారములు తీసుకొని, ఆమె వద్దకు వెళ్లి ఇట్లు పలికెను. ఓ సుందరీ! నీ వర్ణము కమల గర్భముతో సమానముగ మనోహరముగా నున్నది. నీవు ఎవరవు? ఇక్కడ ఏమి చేయు చున్నావు? నేను బ్రాహ్మణుడను. అరుణాస్పదము నుండి ఇక్కడకు వచ్చితిని. ఓ మదిరేక్షణా! నేను దేని ప్రభావమున ఇక్కడికి వచ్చితినో అట్టి ఔషధ లేపనము నా పదముల నుండి మంచులో కరిగి పోయినది.
వరూథిని:
మౌలే యాహం మహాభాగా నామ్నాఖ్యాతా వరూథినీ విచరామి సదైవాత్ర రమణీయే మహాచలే సాహం త్వద్దర్శ నాద్విప్ర! కామ వైక్లబ్యతాం గతా
ప్రశాది యన్మయా కార్యం త్వదదీ నాస్మి సాంప్రతమ్
వరూథిని:
ఓ మహాభాగా! నేను వరూథిని అను పేరు గల ప్రఖ్యాత అప్సరసను. ఎల్లప్పుడును ఈ రమణీయ పర్వతము నందు విహరించు చుందును. ఓ విప్రవరా! ఇప్పుడు నిన్ను చూసి నేను కామమునకు వశీభూతురాలనై నిందనీయురాల నైతిని. ఇప్పుడు నేనేమి చేయుదును? ఇప్పుడు నేను నీకు ఆధీనమైతిని.
బ్రాహ్మణుడు:
యేనోపాయేన గచ్చేయం నిజగేహం శుచి స్మితేః తన్మ మాచక్ష్వ కల్యాణి హానిర్వో ఖిల కర్మణామ్ నిత్య నైమిత్తికా నాం తు మహా హానిర్ ద్విజన్మనః భవత్య తస్త్వం హే భద్రే! మాముద్ధర హిమాలయాత్ ప్రశస్యతే న ప్రవాసో బ్రాహ్మణాం కదాచన అపరాధ్యతి మే భిరు దేశ దర్శన కౌతుకమ్
బ్రాహ్మణుడు:
ఓ శుచిస్మితా! నేను ఏ విధముగా నా గృహమునకు చేరుకొన గలనో అది నాకు చెప్పుము. ఓ కళ్యాణీ! పరదేశ మగుటచే ఇచట నాకు నిత్య నైమిత్తిక క్రియలకు హాని కలుగు చున్నది. బ్రాహ్మణులకు నిత్య నైమిత్తిక క్రియల యొక్క హాని మహా అనిష్ట కారకము. అందుచేత ఓ భద్రా! ఈ హిమాలయముల నుండి నన్ను పంపుము. బ్రాహ్మణులకు పరదేశము నందు ఉండుట ఎప్పుడును ప్రశంసనీయము కాదు. ఓ భీరూ! నేను ఏ అపరాధమును చేయలేదు. దేశములను చూడ వలెనను కుతూహలముతో పరదేశుడ నైతిని.
సతో గృహే ద్విజాగ్ర్యస్య నిష్పత్తి స్సర్వ కర్మణామ్ నిత్య నైమిత్తికానాం చ హాని రేవం ప్రవాసినః సాత్వం కిం బహునో క్తేన తథాకురు యశస్విని యథా నాస్తంగతే సూర్యే పశ్యామి నిజ మాలయమ్
గృహము నందుండు బ్రాహ్మణునకు నిత్య నైమిత్తిక సంపూర్ణ కర్మలు సంపన్న మగును. కాని పరదేశుడ నగుటచే వాటన్నింటికిని హాని కలుగు చున్నది. ఓ యశస్వినీ! ఇంత చెప్పనేల? ఇప్పుడు ఏ విధముగా సూర్యాస్తమయమునకు ముందుగా నా గృహమును చూడ గలనో నీవు దానిని చెప్పుము.
వరూథిని:
మైవం బ్రూహి మహాభాగః మా భూత్స దివసోమమ మాం పరిత్యజ్య యత్ర త్వం నిజగేహ ముపైష్యసి అహో రమ్యతర స్స్వర్గో స యతో ద్విజనందన అతో వయం పరిత్యజ్య తిష్టామో త్ర సురాలయమ్ సత్వం సహ మయా కాస్తః కాన్తేత్ర తుహినాచలే రమమాణో న మర్త్యానాం బాంధవానాం స్మరిష్యసి
వరూథిని:
ఓ మహాభాగా! ఏ దినము నీవు నన్ను వదలి నీ గృహమునకు చేరుకొందువో, ఆ దినము నాకు రాకూడదు. ఓ ద్విజ నందనా! స్వర్గము కూడా ఈ ప్రదేశము కంటే మనోహరముగా నుండదు. అందువలన నేను స్వర్గమును వదలి ఈ ప్రదేశము నందు నివసించుదును. ఓ కాంతుడా! ఈ రమణీయ హిమాచలము నందు నాతో విహరించుచూ నీవు నీ బంధువులను కూడా స్మరించ లేవు.
స్రజో వస్త్రాణ్య లంకారాన్ భక్ష్య భోజ్యాను లేపనమ్ దాస్యామ్యత్ర తథాహంతే తే స్మరేణ వశగా హృతా వీణా వేణుస్వనం గీతం కిన్నరాణాం మనోరమమ్ అంగాహ్లాద కరో వాయు రుష్ణాన్న ముదకం శుచి మనోభిలాషితా శయ్యా సుగంధ మనులేపనమ్ ఇహాసతో మహాభాగః గృహేకిం తే నిజోధికమ్ ఇహాసతో నైప జరా కదాచి త్తే భవిష్యతి త్రిదశానా మియం భూమి ర్యౌవనోప చ యప్రదా ఇత్యుక్త్వా సానురాగా సా సహసా కమలేక్షణా ఆలిలింగ ప్రసీదేతి వదన్తీ కల మున్మనాః
ఇచ్చట నీకు మాల్య, వస్త్ర, అలంకార, భక్ష్య, భోజ్య, అనులేపదాదులను కలుగ జేయుదును. ఎందుచేత ననగా కామాతురాలనై నేను నీకు వశీభూతురాల నైతిని. ఓ మహాభాగా! ఈ ప్రదేశము నందు నివసించుటచే వేణునాదము, కిన్నెరుల యొక్క మనోహరములగు సంగీతము, ఆహ్లాద జనితమగు వాయువు, ఉష్ణాన్నము, పవిత్ర జలము, అభిలషించు నట్టి శయ్య, సుగంధాను లేపనము, ఇవన్నియు నీకు సులభమగును. వీటన్నింటిని మించినవి నీ గృహమున మరేమున్నవి? మరియు ఇచ్చట నివసించుటచే నీకు ఎన్నటికిని ముసలితనము రాదు. ఎందుచేత ననగా ఇది దేవ భూమి. యౌవనమును వృద్ధి చేయునది. ఇట్లు చెప్పి అనురాగవతి యగు కమలముల వంటి నేత్రములు గల ఆ వరూథిని అత్యంత వ్యాకులత గలదై మధుర స్వరముతో “ప్రసన్నుడవు కమ్ము” అని పలుకుచూ ఆతనిని వెంటనే ఆలింగనము చేసు కొనెను.
బ్రాహ్మణుడు:
మా మాం స్ప్రాక్షీర్వ్రజాన్యత్ర దుష్టే యన్సదృశ స్తవ మయా న్యథా యాచితాత్వ మన్యథై వాభ్యుపైషి మామ్ సాయం ప్రాతర్హుతం హవ్యం లోకాన్యచ్చతి శాశ్వతాన్ త్రైలోక్య మేత దఖిలం మూఢే హవ్యే ప్రతిష్టితమ్ తము పాయం సమాచక్ష్వ యేన యామి స్వమాలయమ్
బ్రాహ్మణుడు:
ఓ దుష్టురాలా! నన్నుంటు కొనకుము. ఎవరు నీకు యోగ్యుడగునో అతని వద్దకు పొమ్ము. నా ప్రార్థనను నీవు విపరీతముగా తలచి నన్ను కలవాలనుకొను చున్నావు. ప్రాతః సాయం కాలము లందు హోమము చేయుటచే నిత్యమగు, సంపూర్ణ, శాశ్వత లోకములు ప్రాప్తించు చున్నవి. మూఢురాలా! ఈ సమస్త త్రైలోక్యములు హోమము ద్వారానే ప్రతిష్టితమగు చున్నవి. అందువలన దానిని నిర్వర్తించుటకు ఏ యుపాయముచే నేను నా గృహమును చేరుకుందునో దానిని వెంటనే చెప్పుము.
వరూథిని:
కిం తేనాహం ప్రియా విప్రః రమణీయో న కిం గిరిః గంధర్వా న్కిన్నారా దీంశ్చ త్యక్త్వా భీష్టో హాయ్ కస్త వ నిజమాలయ మవ్యస్మా ద్భవాన్యాస్యత్స సంశయమ్ స్వల్పకాలం మయాసార్థం భుంక్ష్వ భోగాన్సు దుర్లభాన్
వరూథిని:
ఓ విప్రుడా! నన్ను చూచి నీ వెందులకు ప్రసన్నుడ వగుట లేదు. ఈ హిమాలయములు రమణీయముగా నుండలేదా? గంధర్వ, కిన్నెరాదులే కాక ఇంకా ఏ పురుషుని నీవు ఇష్ట పడుదువో, నిస్సందేహముగా ఇచ్చటి నుండి నీవు ఆతని ఇంటికి పోగలవు. కాని ఈ సమయ మందు నాతో ఇక్కడ కొంచెము కాలము వరకు దుర్లభమగు సుఖమును అనుభవింపుము.
బ్రాహ్మణుడు:
అభీష్టా గార్హ పత్యాదాః సతతం మే త్రయోగ్నయః రమ్యం మమాగ్ని శరణం వేదీ విష్టరిణీ ప్రియా
బ్రాహ్మణుడు:
గార్హపత్యుడు, ఆహవనీయుడు, దక్షిణాగ్ని, అనుముగ్గురు అగ్నులు నాకు అభీష్టులు. అగ్ని గల గృహము నాకు రమణీయ స్థానము. విష్టరిణీ వేదియే నాకు ప్రియురాలై యున్నది.
వరూథిని:
అష్టావాత్మా గుణాయే హి తేషామా దౌదయా ద్విజః తాం కరోషీ కథం న త్వం మయి సద్దార్మ పాలకః త్వద్విముక్తా న జీవామి తథా ప్రీతిమతీ త్వయి నైత ద్వాదామ్యహం మిథ్యా ప్రసీద కులనందను
వరూథిని:
ఓ ద్విజుడా! ఎనిమిది విధాలగు ఆత్మా గుణములలో దయా గుణమే ప్రధానమైనది. మరి నీవు సద్ధర్మ పాలకుడవై యుండియు ప్రీతి దయ నా ఎడల ఎందులకు చూపుట లేదు? నేను నీ ఎడల ఎంతటి అనురాగతి నయివుంటి ననగా నీవు లేక జీవింప లేను. నేను అసత్యము చెప్పుట లేదు. నీవు నీ కులమునకు ఆనందము నిచ్చువాడవు. నా యెడల ప్రసన్నుడవు కమ్ము.
బ్రాహ్మణుడు:
యది ప్రీతిమతీ సత్యం నోపచారా ద్బ్రవీషీ మామ్ తదుపాయం సమాచక్ష్వ యేన యామి స్వమాలయమ్
బ్రాహ్మణుడు:
నీవు నా ఎడల నిజముగా ప్రీతి కలిగి ఉన్నట్లయితే మరియు నాతో ఏమి చెప్పితివో అవన్నియు అసత్యము కానిచో, నేను ఏవిధముగా నా గృహమునకు చేరుకుందునో దానిని నాకు చెప్పుము.
వరూథిని:
నిజమాలయ మప్యస్మాద్ భావాన్ యాస్య స్య సంశయమ్ స్వల్ప కాలం మయా సార్థం భుంక్ష్వ భోగా సుదుర్లభా
వరూథిని:
నీవు నిస్సందేహముగా ఈ ప్రదేశము నుండి నీ గృహమునకు పోగలవు. కాని ఇప్పుడు నాతో స్వల్ప కాలము వరకు దుర్లభమగు భోగములను అనుభవించి వెళ్ళుము.
బ్రాహ్మణుడు:
న భోగార్థాయ విప్రాణాం శస్యతే హి వరూథినీ ఇహ క్లేశాయ విప్రాణాం చేష్టా ప్రేత్య ఫల ప్రదా
బ్రాహ్మణుడు:
వరూథినీ! శాస్త్రానుసారముగా భోగములు బ్రాహ్మణులకు కాదు. కారణ మేమనగా, అట్టి భోగములు బ్రాహ్మణునకు ఇహ లోకమున క్లేశములు, పర లోకమున విపరీత ఫలములు సంభవించును.
వరూథిని:
సంత్రాణం మ్రియమాణాయా మమ కృత్వా పరత్ర తే పుణ్య స్త్యెవ ఫలం భావి భోగాశ్చ న్యత్ర జన్మని ఏవం చ ద్వయ మన్యత్ర తవో పచయ కారణమ్ ప్రత్యాభ్యానా దహం మృత్యుం త్వం చ పాప మవాప్స్యసి
వరూథిని:
నేను మృతి చెందిన దానివలె నుంటిని. నన్ను రక్షించుటచే నీకు పర లోక మందు ఆ పుణ్య ఫలము ప్రాప్తించును. మరియు మరు జన్మము నందు నీకు దాని ద్వారా అనేక భోగములు సంప్రాప్తమగును. పర లోకము నందలి మరియు జన్మాంతర మందలి భోగములు, ఈ రెండు విధాల పుణ్యముల ఫలము నీకు లాభదాయకము కాని నన్ను నిరాశ పరచినచో నేను మరణింతును. అప్పుడు నీవు కూడా పాపమునకు భాగస్థుడ వగుదువు.
బ్రాహ్మణుడు:
పరస్త్రియం నాభిలాషే దిత్యూ చుర్గురవో మమ తేన త్వాం నాభివాంఛామి కామం విలప శుష్యవా
బ్రాహ్మణుడు:
పరస్త్రీని కోరవద్దని మా గురువు గారు చెప్పిరి. అందుచేత నీవు విలపించినను లేక యౌవన త్యాగము చేసినను సరే నిన్ను నేను కోరను.
మార్కండేయుడు:
ఇత్యుక్త్వాస మహాభాగః స్సృష్ట్వావః ప్రయతః శుచిః ప్రాహేదంప్రణిప త్యాగ్నిం గార్హపత్య ముపాంశునా భగవః న్గార్హ పత్యాగ్నేః యోనిస్వం సర్వ కర్మణామ్ త్వత్త ఆహవనీయోగ్ని ర్దక్షిణాగ్నిశ్చ నాన్యతః
మార్కండేయుడు:
వరూథినితో ఈ విధముగా పలికిన వాడై ఆ నియమ వంతుడగు మహాభాగుడు అగు బ్రాహ్మణుడు ఆచమనా నంతరము శుద్దుడై గార్హ పత్యడగు అగ్నికి ప్రణామ పూర్వకముగా ఉపాంశు జపము ద్వారా ఇట్లు పలుక నారంభించెను. హే భగవాన్! గార్హపత్య అగ్నీ నీవే అన్ని కర్మలకు బీజ స్వరూపుడవు. ఆవహ నీయ,దక్షిణ అను ఈ ఇద్దరు అగ్నులు నీ వలననే ఉత్పన్నమైరి. ఇతరులెవరును వారిని ఉత్పన్నము చేయువారు కారు.
యుష్మ దాప్యాయనాద్దేవా వృష్టి సస్యాదిహే తవః భవన్తి సస్యా ద్యఖిలం జగద్భవతి నాన్యతః ఏవం త్వత్తో భవత్యేత ద్యేన సత్యేన వై జగత్ తథా హమధ్య స్వంగేహం పశ్యేయం సతి భాస్కరే యథా వై వైదికం కర్మ స్వకాలేనోజ్ఘితం మయా తేన సత్యేన పశ్యేయం గృహస్థోథ దివాకాకరమ్ యథా చ న వరద్రవ్యే పరదారే చ మేషుతిః కదా చిత్సాభిలాషాభూ త్తథైత త్సిద్ధి మేతుమే
ఓ గార్హపత్య అగ్నీ! నీవు ప్రసన్నుడ వైతేనే దేవతలు వర్షాలు, ధాన్యములు, ఇత్యాదులను ప్రసాదింతురు. ధాన్యము వలననే జగత్తంతయు ప్రతిష్టితమై యున్నది. మరే విధముగాను ఉండుట అసంభవము. ఏ సత్యముచే ఈ జగత్తు నీ యందు ఈవిధముగా ఇమిడిపోయి ఉన్నదో, అట్టి సత్యము ద్వారా నేను వెంటనే సూర్యుడు ప్రకాశించు చుండగానే నా గృహమును చూచుదును గాక. ఏ సత్యము ద్వారా సంపూర్ణ వైదిక కర్మలు యథోచిత కాలములందు జరుగు చుండునో, అట్టి సత్యముచే నేను వెంటనే గృహవాసినై దివాకరుని చూచుడును గాక. ఏ సత్యముచే ఎట్టి సమయమునను నా మనస్సు పర ద్రవ్యముల యందు గాని, పరస్త్రీ యందు గాని అభిలాషిణి కాకున్నదో, అట్టి సత్యముచే నా యీ మనస్సు ఇప్పుడు ఈ విషయము నందు సిద్ధి లాభమును పొందు గాక.
Summary of chapter 58 of the Mārkandeya Mahā Purana is as follows:
Bhāratavarsha is allegorically depicted in the form of a giant divine Tortoise, Kūrma, resting upon the cosmic waters. Mārkaṇḍeya assigns various regions, kingdoms, tribes, and astrological constellations to the nine anatomical divisions of the Tortoise, providing precise geographic and predictive wisdom.