30 - శ్రాద్ధకల్పము

మదాలస:

ప్రతిప ద్దన లాభాయ ద్వితీయా ద్విపద ప్రదా వరార్థినీ తృతీయా తు చతుర్థీ శత్రు నాశినీ శ్రియం ప్రాప్నోతి పంచమ్యాం షష్ట్యాం పూజ్యో భవేన్నరః రాజాధిపత్యం సప్తమ్యా మష్టమ్యాం వృద్ధి ముత్తమామ్ స్త్రియో నవమ్యాం ప్రాప్నోతి దశమ్యాం పూర్ణ కామతామ్ వేదాం స్తథా ప్నుయా త్సర్వా నేకాదశ్యాం క్రియానరః ద్వాదశ్యాం జయలాభం చ ప్రాప్నోతి పితృపూజకః ప్రజాం ఋద్దిం పశూ న్వృద్ధిం స్వాతంత్ర్యం పుష్టి ముత్తమామ్ దీర్ఘ మాయు స్తథైశ్వర్యం కుర్వాణస్తు త్రయోదశీమ్ అవాప్నోతి న సందేహో శ్రాద్ధం శ్రద్ధాపరో నరః

మదాలస:

వత్సా! పాడ్యమి నాడు శ్రాద్ధము చేయుటచే ధన లాభము కలుగును. ఈ ప్రకారముగా విదియ యందు సంపత్తి లాభము, తదియ యందు వరప్రాప్తి, చతుర్థి యందు శ్రాద్ధము పెట్టినచో శత్రు నాశనమగును. పంచమి నాడు శ్రాద్ధము పెట్టుటచే శ్రీ లాభము, షష్టి యందు జన పూజ్వత్వము, సప్తమి నాడు రాజ్యాధిపత్యము, అష్టమి నాడు శ్రాద్ధము పెట్టుటచే వృద్ధి లాభము కలుగును. నవమి నాడు శ్రాద్ధ కర్మచే స్త్రీ లాభము, దశమి నాడు సమస్త కోర్కెలు సిద్ధించును. ఏకాదశి నాడు శ్రాద్ధకర్మచే సమస్త వేదముల యొక్క సమస్త వేదార్థ లాభము కలుగును. ఏ పురుషుడు ద్వాదశి తిథి నాడు పితృ శ్రాద్ధము చేయునో, వానికి జయ లాభము, సంతాన వృద్ధి, పశు వృద్ధి, మేధా లాభము, స్వాదీనతా లాభము, పుష్టి లాభము కలుగును. ఏ పురుషుడు త్రయోదశీ తిథి యందు యథా సంభవములైన అన్నాది పదార్థముల ద్వారా శ్రాద్ధ కర్మ చేయునో వానికి దీర్ఘాయుర్ధాయము, ఐశ్వర్యము కలుగును. సందేహము లేదు.

యథా సంభావితాన్నే నశ్రద్దా సంప త్సమన్వితః వికృత్యా పితరోయస్య మృతాః శాస్త్రేణ వా హతాః తేన కార్యం చతుర్దశ్యాం తేషాం తృప్తి మభీప్సతా శ్రాద్ధం కుర్వ న్నమావాస్యాం యత్నేన పురుష శ్శుచిః సర్వా న్కామా నవాప్నోతి స్వర్గ చానంత్య మశ్నుతే కృత్తికాసు పితౄ నర్చన్ స్వర్గం ప్రాప్నోతి మానవః అపత్యకామో రోహిణ్యాం సౌమ్యే తేజస్వితాం లభేత్ శౌర్య మార్ద్రాసు చాప్నోతి క్షేతాది చ పునర్వసౌ పుష్టిం పుష్యే సదాభ్యర్చ్య ఆశ్లేషాసు వరాన్సుతాన్ మఘాసు స్వజన శ్రైష్ట్యం సౌభాగ్యం ఫల్గునీషు చ

ఎవరి తల్లి దండ్రులు యౌవనావస్థ యందే మరణింతురో లేక శస్త్రాఘాతములచే ప్రాణ త్యాగము చేయుదురో, అట్టి పితరుల తృప్తి కొరకు చతుర్ధశీ తిథి యందు శ్రాద్ధ కర్మ చేయ వలెను. పవిత్రుడై ప్రయత్న పూర్వకముగా అమావాస్య యందు శ్రాద్ధము చేయుటచే సర్వ కామములు సిద్ధించును. అక్షయమగు స్వర్గ సుఖము కలుగును. పితరులను అర్చించినచో మానవుడు స్వర్గ సుఖములను బొందును. సంతాన మందు కోర్కె గల వాడు రోహిణీ నక్షత్ర మందు శ్రాద్ధము పెట్ట వలెను. మృగశిరా నక్షత్ర మందు శ్రాద్ధము చేయుటచే తేజస్సు గల వాడగును. ఆర్ద్రా నక్షత్ర మందు శౌర్యము మరియు పునర్వసు నక్షత్ర మందు క్షేత్రాది లాభము కలుగును. పుష్యమి నక్షత్ర మందు పుష్టి, ఆశ్లేష యందు శ్రేష్టమగు పుత్రుడు, మఘా నక్షత్ర మందు స్వజనములో ప్రాదాన్యుడు మరియు పూర్వ ఫల్గుణీ నక్షత్ర మందు సౌభాగ్య లాభము కలుగును.

ప్రదానశీలో భవతి సాపత్య శ్చోత్తరాసు వై ప్రయాతి శ్రేష్ఠతాం సత్సు హస్తే శ్రాద్ధప్రదో నరః రూప యుక్తస్తు చిత్రాసు తథా పత్యా న్యవాప్నుయాత్ వాణిజ్య లాభదా స్వాతి ర్విశాఖా పుత్రా కామదా కుర్వంత శ్చానురాధాసు లభంతే చక్రవర్తితామ్ ఆధిపత్యం చ జ్యేష్టాసు మూలే చారోగ్య ముత్తమమ్ ఆశాదాసు యశః ప్రాప్తి రుత్తరాసు విశోకతామ్ శ్రవణేన శుభాం ల్లోకాన్ ధనిష్టాసు దానం మహత్ వేదవిద్యాం చాభిజితి భిషక్సిద్ధం చ వారుణే అజావికం ప్రోష్ఠపదే విద్యా గావ స్తథోత్తరే రేవతీషు తథా కుప్య మశ్వినీషు తురంగమాన్ శ్రాద్ధం కుర్వన్ స్తథాప్నోతి భరణీ ష్వాయు మత్తమమ్ తస్మా త్కామ్యాని కుర్వీత ఋక్షే ష్వేతేషు తత్త్వత్

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర మందు శ్రాద్ధము చేయుటచే దానశీలుడు, పుత్రవంతుడు అగును. హస్తా నక్షత్రము నందు శ్రాద్ధపరుడు అగు నరుడు సత్పురుషులలో శ్రేష్ఠుడగును. చిత్తా నక్షత్ర మందు రూపవంతుడు, పుత్రవంతుడు అగును. స్వాతి యందు వాణిజ్య లాభము, కామ్యార్థ సిద్ధి కలుగును. అనురాధ యందు ఉత్తమ మగు ఆరోగ్యము కలుగును. పూర్వాషాడ యందు యశః ప్రాప్తి, ఉత్తరాషాడ యందు శోకరాహిత్యము, శ్రావణమున శుభలోక ప్రాప్తి, ధనిష్టా నక్షత్ర మందు శ్రాద్ధ కర్మ చేసిన మహా ధన లాభము కలుగును. అభిజి న్నక్షత్ర మందు శ్ర్రాద్దానుష్టానముచే సమస్త వేదం విద్యను పొందును. శతభిషా నక్షత్ర మందు వైద్య శాస్త్రము సిద్ధించును. పూర్వా భాద్ర యందు అజావిక (గొర్రెలు, మేకలు) లాభము, ఉత్తారాభాద్ర యందు విద్యాప్రాప్తి, గోలాభము కలుగును. రేవతీ నక్షత్ర మందు సువర్ణ రజతాది లాభము, అశ్విని యందు అశ్వ లాభము, భరణి యందు శ్రాద్ధము చేయుటచే దీర్ఘాయుర్ధాయము కలుగును. ఈ కారణముచే తత్వము తెలిసిన పురుషుడు అన్ని నక్షత్రముల యందు కామ్య శ్రాద్ధము లన్నియు చేయ వలయును.