59 - స్వారోచిష మన్వంతరము

మార్కండేయుడు:

ఏవం తు వదత స్తస్య ద్విజ పుత్రస్య పావకః

గార్హపత్య శ్శరీరే తు సన్నిధాన మథాకరోత్

తేన చాదిష్టిత స్సోథ ప్రభామండల మధ్యగః

వ్యదీపయత్ తం దేశం మూర్తి మానివ హవ్యవాట్

తస్యాస్తు సుతరాం తత్ర తాదృగ్రూపే ద్విజన్మని

అనురాగోభవ ద్విప్రం పశ్యంత్యా దేవ యోషితః

తతస్యోధిష్టిత స్టేన హవ్యవాహేన తత్క్షణాత్

యథాపూర్వం తథా గంతుం ప్రవృత్తో ద్విజ నందనః

జగామ చ త్వరాయుక్త స్తయాసాస్త్రం చిరీక్షితః

ఆదృష్టి పాతాత్త న్వంగ్యా నిశ్వాసోత్కంపి క ధరమ్

మార్కండేయుడు:

ఈ విధముగా పలుకు చుండగనే ఆ ద్విజ పుత్రుని శరీరము నందు గార్హపత్య అగ్ని ప్రవేశించెను. దానిచే ప్రభా మండల మధ్యవర్తుడై ఆ బ్రాహ్మణుడు మూర్తీభవించిన అగ్ని దేవుని వలె స్వయముగా ఆ దేశమును ప్రకాశింప చేయ సాగెను. ఓ విప్రా! ఎప్పుడయితే వరూథిని అను పేరు గల అప్సరస ఈ విధముగా ఆ బ్రాహ్మణుని రూపమును చూచెనో, అప్పుడు అత్యంత అనురాగముచే ఇంకనూ అధికముగ మోహితురాలైనది. ఎప్పుడు ఈ ద్విజ కుమారుని యందు అగ్ని దేవుని ప్రవేశము కలిగినదో వెంటనే అతడు పూర్వము వలె శక్తి మంతుడై  ప్రయాణించుటకు ప్రవృత్తు డయ్యెను. వరూథిని నిలిచి చూచు చుండగనే ఆ విప్ర కుమారుడు అత్యంత వేగముతో నడచి పోయెను. ఎపుడు ఈమెకు కనిపించ లేదో అపుడు ఆమె దీర్ఘముగా శ్వాస వదులుతూ కంపింప నారంభించెను.

తతః క్షణేనైవ తదా నిజగేహ మవాప్యసః

యథా ప్రోక్తం ద్విజ శ్రేష్ఠశ్చకార సకలాః క్రియాః

అథ సా చారుసర్వాంగీ తత్రా సక్తాత్మా మానసా

నిస్వా స పరమా నిన్యే దిన శేషం తథా నిశామ్

నిశ్వసన్త్య నపద్యాంగీ హాహేతి రుదతీ ముహుః

మంద భాగ్యేతి చాత్మానం నినింద మదిరేక్షణా

న విహారే న చాహారే రమణీయే న వా వనే

స కందరేషు రమ్యేషు సా బబంధ తదా రతిమ్

చకార రమమాణే చ చక్ర వాకయుగే స్పృహామ్

ముక్తా తేన వరారోహా నినింద నిజ యౌవనమ్

తదనంతర మందు ఆ ఉత్తమ బ్రాహ్మణుడు క్షణ కాలముననే తన గృహమునకు చేరుకొనెను. మరియు పూర్వోక్త ప్రకారముగా నిత్య నైమిత్తిక సంపూర్ణ క్రియలు చేయ నారంభించెను. అక్కడ సర్వాంగ సుందరి యగు ఆ వరూథిని ఆ ద్విజ వరుని యెడల అసక్త చిత్తురాలై దీర్ఘ శ్వాసలను విడుచు చున్నదై ఆ దినము యొక్క శేష భాగమును, మరియు ఆ రాత్రి అంతయు గడిపెను. మదిరేక్షణా, సర్వాంగ సుందరి యగు ఆ అప్సర హా హా కారము చేయుచూ, రోదించుచూ నిందించు కొన సాగెను. ఆహార విహారములు, రమణీయ వనములు, మనోహరములగు పర్వతముల యొక్క కందరములు ఉన్ననూ, వేటి వలననూ ఆమె సుఖమును పొంద లేక పోవుచున్నది. రెండు చకోరములు రమించుట చూచి ఆమెకు రమించుట యందు స్పృహ కలిగెను. కాని ఆమె ద్విజ వరునిచే త్యజింప బడెను. అందుచేత ఆమె తన యౌవనమును నిందించు కొన సాగెను.

కాగతాహ మిమం శైలం దుష్టదైవ బలాత్కృతా

క్వచ ప్రాప్తస్స మేదృష్టే ర్గోచరం తాద్రుశో నరః

యదస్య స మహాభాగో నేమ్ సంగ ముపైష్యతి

తత్కామాగ్ని రవశ్యం మాం క్షపయిష్యతి దుస్సహః

రమణీయ మభూద్యత్త త్పుంస్కోకిల నివాదితమ్

తేన హీనం తదేవైత ద్దహతీ వాద్య మామలమ్

దుష్ట దైవమునకు వశీభూతురాలని నేను ఈ పర్వతమునకు వచ్చితిని. సర్వాంగ సుందరుడగు ఆ పురుష శ్రేష్ఠుడు నాకు కనిపించుట సంభవ మగునని నేనేమి ఎరుగుదును? ఈ సమయ మందు ఆ బ్రాహ్మణుడు నాతో సంగమించనిచో నేను దుఃస్సహమగు కామాగ్నిచే భస్మమై తప్పక జీవితమును పరిత్యజించెదను. ఇంతకు పూర్వము నాకు శ్రవణానందము కలిగించిన కోకిల శబ్దములు ఇప్పుడు ఆ ద్విజ వరుని విరహము వలని అగ్ని వలె నన్ను దగ్దము చేయు చున్నవి.

మార్కండేయుడు:

ఇత్థం సా మదనావిష్టా జగామ ముని సత్తమమ్

వవృథే చ తదా రాగ స్తస్యా స్తస్మి న్ప్రతిక్షణమ్

కలిర్నామ్నాటు గంధర్వః సానురాగో నిరాకృతః

తయా పూర్వమభూ త్సోథ తదవస్థాం దదర్శ తామ్

స చింత యామాస తదా కీం న్వేశా గజగామినీ

నిశ్వాస పవనమ్లాన గిరావత్ర వరూథినీ

మార్కండేయుడు:

ఈ విధముగా వరూథిని కామాసక్తురాలై వెంటనే మనస్సుచే ఆ ముని సత్తముని చూచెను. అప్పుడు అతని యందు ప్రతి క్షణము ఆమె యొక్క అనురాగము వృద్ధినొంద సాగెను. ఇంతకు పూర్వము ఈమె యందు అత్యంత అనురక్తుడైన కలి అను పేరు గల గందర్వుణ్ణి ఈమె (వరూథిని) నిరాకరించి యుండెను. ఆతడు ఇప్పుడు ఈమె యొక్క ఇట్టి అవస్థను చూచి, ఇట్లు యోచింప సాగెను. ఈ పర్వతము లందు ఈమె ఎవరో గజగామిని ప్రతి క్షణము నిశ్వాస పవన ఘాతముచే పరిమ్లానమగు చున్నది. ఈమె ఆ వరూథినియే.

ముని శాపక్షతా కిం నుకేనచిత్కిం విమానితా

బాష్పవారి పరిక్లిన్న మియం ధత్తేయతో ముఖమ్

తతః స దధ్యౌ సుచిరం తమర్థం కౌతుకా త్కలిః

జ్ఞాతవాంశ్చ ప్రభావేణ సమాధే స్స యథాతథమ్

పునః స చింతయామాస తద్విజ్ఞాయ మునేః కలిః

మమోప పాదితం సాదు భాగ్యైరే తత్పురా కృతైః

మయైషా సానురాగేణ బహుశః ప్రార్దితా సతీ

విరాకృతవతీ సేయ మద్య ప్రాప్యా భవిష్యతి

“ఏమి! ఈమె ముని శాప గ్రస్తురాలైనదా! లేక ఎవరయిననూ ఈమెను అవమానించితిరా! ఎందుచేత ననగా ఈమె ముఖము నందు కన్నీటి బిందువులు కనిపించు చున్నవి”. చాలాసేపు ఇట్లు యోచించిన పిమ్మట కలి కౌతూహలముచే ధ్యాన మగ్నుడై సంపూర్ణ యదార్థ వృత్తాంతమును తెలిసి కొనెను. ముని సంబంధమగు ఆ వృత్తాంతమును తెలిసికొని తిరిగి ఇట్లు తలపోయ సాగెను. “నేను ఇంతకు ముందు చేసిన పుణ్య ఫలముచే నేను అభిలషించిన కార్యము సిద్ధించినది. నేను అనురాగ యుక్తుడనై మాటిమాటికి ప్రార్థించిననూ నన్ను నిరాదరించిన ఆ వరూథిని ఇప్పుడు నాకు లభ్య మగును.

మానుషే సానురాగేయం తత్ర తద్రూప ధారిణీ

రంస్యతే సందిగ్ధం కింకాలేన కరోమి తత్

ఈ అప్సర మానవుని యెడల అనురాగవతియై యున్నది. ఇప్పుడు నేను ఆ ముని రూపమును ధరించినచో నా యందు కూడా నిస్సందేహముగా అనురాగావతి యగును. ఇప్పుడు ఆలస్యము చేయరాదు.

మార్కండేయుడు:

ఆత్మ ప్రభావేణ తతస్తస్య రూపం ద్విజన్మనః

కృత్వా చచార యత్రాస్తే నిషణ్ణా సా వరూథినీ

సా తం దృష్ట్వా వరారోహా కించిదు త్ఫుల్లలోచనా

సమేత్యప్రాహ తన్వంగీ ప్రసీదేతి పునః పున

త్వయా త్యక్తా న సందేహః పరిత్యక్ష్యామి జీవితమ్

తత్రా ధర్మాః కష్టతరః క్రియాలోపో భవిష్యతి

మయా సమేత్య రమ్యేస్మిన్ మహాత్మః న్వన కందరే

మత్పరి త్రాణజం ధర్మ మవశ్యం ప్రతి పత్స్యసే

మార్కండేయుడు:

ఆ తర్వాత కలి ఆత్మ ప్రభావముచే ఆ బ్రాహ్మణుని రూపము ధరించి ఎచట వరూథిని కూర్చుని ఉన్నదో ఆ ప్రదేశము నందు విహరించ సాగెను. ఆ తన్వంగి ముని వేషధారియై యున్న కలిని చూచి మునిగ భావించి ఆహ్లాదముతో ప్రపుల్ల నేత్రురాలై అతని సమీపమునకు వెళ్ళి “నా మీద ప్రసన్నత చూపు” మని మాటి మాటికి చెప్పా నారంభించెను. నీవు నన్ను విడిచి నట్లయితే నేను జీవితమును పరిత్యజించినచో మీకు అధర్మము కలుగును. మరియు ఆ అధర్మ కారణముగా క్రియా లోపము కలుగును. ఒకవేళ ఈ మహా కందరా యుక్తమగు హిమాలయ పర్వతముల యొక్క మనోహర గుహల యందు నాతో సంగమించి నన్ను రక్షించినచో, నన్ను రక్షించిన ధర్మము నీకు తప్పక ప్రాప్తించును.

ఆయుష స్సావ శేషమ్మే నూనమస్తి మహామతే

నివృత్త స్టేన సూనంత్వం హృదయాహ్లాద కారకః

“ఓ మహామతీ! ఇప్పటి వరకు నా యీ అవస్థలో మార్పు కలుగ లేదు. అందు చేత నీవు నివృత్తుడవై నా హృదయము నందు ఆనందానుభవము కలిగించితివి.”

కలి:

కిం కరోమి క్రియాహాని ర్భవత్యత్ర సతో మమ

త్వమప్యేవం విధిం వాక్యం బ్రవీషి తాను మధ్యమే?

తదహం సంకటః ప్రాప్తో యాద్బ్రవీమి కరోషితత్

యదిశ్యాత్సంగమో మేధ్య భవత్యా సః నాన్యథా

కలి:

“ఓ కుశోదరీ! నేనేమి చేయుదును? ఇచట ఉండుటచే నాకు క్రియాలోపము కలుగును. అయిననూ నీవు కూడా ఈ విధముగా ప్రార్థనా వచనములు పలికితివి. అందు వలన సంకటములు ప్రాప్తించి నప్పటికి నాకు నీ మాటలను సమ్మతింప వలసి వచ్చినది. కాని నేను చెప్పిన దానికి నీవు అంగీకరించినచో నా సంగమము కలుగ గలదు. లేనిచో జరుగుట దుర్లభము.”

వరూథిని:

ప్రసీదయద్బ్రవీషి త్వం తత్కరోమి న తే మృషా

బ్రవీవ్యె తడనాశంకం యత్తత్కార్యం మయాధునా

వరూథిని:

నీవు ప్రసన్నుడ వైనచో నీవు ఏది చెప్పినను అది చేయుదును. సందేహింప వలదు. నీవు చెప్పిన దానికి నేను తప్పక అంగీకరింతును.

కలి:

నాద్య సంభోగ సమయే ద్రష్టవ్యోహం త్వయా వనే

నిమీలిలౌక్ష్యాః సంసర్గ స్తవసుభ్రుః మయా సహ

కలి:

ఓ సుభ్రు! అయినచో నీవు ఇట్లు చేయవలెను. వనములో విహరించు సమయ మందు నీవు నన్ను చూడరాదు. నీవు కళ్ళు మూసుకొని నాతో సంగమించ వలెను.

వరూథిని:

ఏవం భవతు భద్రంతే యథేచ్చసి తతాస్తుతత్

మయాసర్వ ప్రకారం హి పశే స్తేయం తవాదునా

వరూథిని:

అట్లే యగు గాక! నీ కోరిక ప్రకారము అట్లే జరుగును. నేను ఇప్పుడు అంగీకరించు చుంటిని. అన్నీ విధాలుగా నీకు వసీభూతురాలు నైతిని. నీకు మంగళమగు గాక!