74 - వైవస్వత మన్వంతర వృత్తాంతము

మార్కండేయుడు:

మార్తండస్య రవే ర్భార్యా తనయా విశ్వ కర్మణః సంజ్ఞా నామ మహాభాగ! తస్యాం భాను రజీజనత్ మనుం ప్రఖ్యాత యశస మనేకజ్ఞాన పారగమ్ వివస్వతః సుతో యసమా త్తస్మా ద్వైవస్వతస్తు సః సంజ్ఞా చ రవిణా దృష్టా నిమీలయతి లోచనే యత స్తతః సరోషోర్కః సంజ్ఞా నిష్ఠుర మబ్రవీత్ మయి దృష్టే సదా యసమా త్కురుషే నేత్ర సంయమమ్ తస్మా జ్జనిష్యతే మూఢేః ప్రజా సంయమనం యమమ్

మార్కండేయుడు:

ఓ మహాభాగా! విశ్వకర్మ యొక్క సంజ్ఞా అను పేరు గల కుమార్తె మార్తాండ దేవుని భార్య. ఆమె గర్భము నందు భాస్కరుని వీర్యముచే, విఖ్యాత ఖ్యాతి గలవాడు జ్ఞాన సంపన్నుడు అగు మనువు జన్మించెను. ఈతడు వివస్వానుని పుత్రుడగుటచే ఈ మనువు వైవస్వత మనువు అను పేరుతో ఖ్యాతి పొందెను. సూర్యదేవుడు చూచుట తోడనే సంజ్ఞాదేవి రెండు నేత్రములను మూసుకొను చుండెడిది. ఈ కారణముచే సూర్య దేవుడు ఒక దినమున కోపించిన వాడై ఆమెను ఇట్లు నిష్ఠుర వచనములు పలికెను. ఓ మూర్ఖురాలా! ఏ విధముగా నీవు సదా నన్ను చూచి నేత్రములు మూసుకొను చున్నావు గాన నీకు ప్రజా సంయమ పరాయణుడైన యముడు జన్మించును గాక.

మార్కండేయుడు:

తతః సా చపలాం దృష్టిం దేవీ చక్రే భయాకులా విలోలిత దృశం దృష్ట్వా పూనా రాహ చ తాం రవిః

మార్కండేయుడు:

అప్పటి నుండి ఆ సంజ్ఞాదేవి భయ కంపితురాలై సూర్యుని చంచల దృష్టితో చూడ సాగెను. అప్పుడు రవి చంచల నేత్రురాలగుట చూచి తిరిగి ఇట్లు పలికెను.

యస్మా ద్విలోలితా దృష్టిర్మయి దృష్టే త్వయాధునా తస్మా ద్విలోలాం తనయాం నదీం త్వం ప్రసవిష్యసి

“ఇప్పుడు నన్ను ఎట్లు చంచల మగు దృష్టితో చూచు చుంటివో, అట్లే నీకు చంచల చిత్తమగు నదీ రూపిణి యగు కన్య జన్మించు గాక”.

మార్కండేయుడు:

తత స్తస్యాం తు సంజజ్ఞే భర్తృశాపేన తేన వై యమశ్చ యమునా చేయం ప్రఖ్యాతా సుమహానదీ సాపి సంజ్ఞా రవే స్తేజః సేహే దుఃఖేన భామినీ అసహంతీ చ సా తేజ శ్చింతయామాస వై తదా కిం కరోమి క్వ గచ్చామి క్వ గతాయాశ్చ నిర్వృతిః భవే న్మమ కథం భర్తా కోప మర్కశ్చ నైష్యతి ఇతి సంచిన్త్య బహుదా ప్రజాపతి సుతా తదా బహు మేనే మహాభాగా పితృ సంశ్రయ మేవ సా

మార్కండేయుడు:

అనంతరము ఈ విధముగా భర్త శాప మిడిన పిమ్మట ఆమె గర్భము నుండి యముడు జన్మించెను. మరియు యమునా అను పేరు గల విఖ్యాతమగు మహానది కూడా జన్మించెను. సంజ్ఞాదేవి అను పేరు గల ఆ కామిని అప్పటి వరకు దుఃఖముతో రవి యొక్క తేజస్సులు సహించినది. కాని ఇక ఆ తేజస్సును సహింప లేని కారణముచే ఇట్లు చింతింప సాగెను. ఏమి చేయుదును? ఎచ్చటకు పోవుదును? ఎటకు పోయిన నివృత్తి కలుగును? మరియు ఏ విధముగా నా భర్త కోపమునకు వశీభూతురాలను కాకుండును? ప్రజాపతి యొక్క కుమార్తెయు మహాభాగ యగు సంజ్ఞాదేవి ఈ విధముగా అనేక విధాల యోచించి తండ్రి గృహమునకు వెళ్ళుటయే మేలుగా తలచెను.

తతః పితృగృహే గంతుం కృతబుద్ధి ర్యశస్వినీ చాయామయీ మాత్మతనుం నిర్మమే దయితాం రవేః తాం చోవాచ త్వయా వేశ్మన్యత్ర భానో ర్యథా మయా తథా సమ్య గపత్యేషు వర్తితవ్యం యథా రవౌ పృష్టయాపి న వాచ్యం తే తథైవ ద్గమనం మమ సైవాస్మి నామ సంజ్ఞేతి వాచ్య మేత త్సదా పచః

ఆ యశస్విని తండ్రి గృహమునకు వెళ్ళుటకు నిశ్చయించి తన దేహము నుండి రవి కొరకు ప్రియురాలిని తన ఛాయచే శరీరమును సృష్టించెను. మరియు ఆ ఛాయతో ఇట్లు చెప్పెను. ఈ సూర్యని గృహమున నేనేట్లుంటినో, నీవునూ అట్లే యుండవలెను. మరియు పుత్రుల యెడల, భర్తయగు సూర్యుని యెడల నా వలెనే వ్యవహరించ వలెను. భానుడు అడిగి నప్పుడు కూడ నేను ఇట్లు వెళ్లినట్టు చెప్పరాదు. అంతేకాదు “సంజ్ఞను నేనే” అని సదా ఈ మాటనే చెప్ప వలెను.

ఛాయారూప యగు సంజ్ఞ:

ఆకేశగ్రహణా ద్దేవిః ఆశాపాచ్చః వచ స్తవ కరిష్యే కథయిష్యామి వృత్తం తు శాప కర్షణాత్ ఇత్యుక్తా సా తదా దేవీ జగామ భవనం పితుః దదర్శ తత్ర త్వష్టారం తపసా దూత కల్మషమ్

ఛాయారూప యగు సంజ్ఞ:

ఓ దేవీ! ఎప్పటి వరకు అతడు నా కేశములను గ్రహింపడో మరియు శాపము నివ్వడో అప్పటి వరకు నేను నీ వచనానుసారము కార్యములు చేయుదును. కాని శాపము మరియు కేశాకర్షణ జరిగి నప్పుడు సంపూర్ణ వృత్తాంతమును చెప్పుదును. చాయా సంజ్ఞ ఇట్లు పలికిన పిమ్మట సంజ్ఞా దేవి తండ్రి గృహమునకు వెళ్ళెను. మరియు అచట తపస్సు చేయుటచే పాప రహితుడైన విశ్వకర్మను చూసెను.

బహుమానాచ్చ తేనాపి పూజితా విశ్వకర్మణాః

తస్టౌ పితృగృహే సా తు కంచి తకాల మనిందితా తత స్తాం ప్రాహ చార్వంగీం పితా నాతిచిరోపితామ్ స్తుత్వా చ తనయాం ప్రేమ బహుమాన పురఃసరమ్ త్వాం తు మే పశ్యతో వత్సే దినాని సుబహూన్యపి ముహూర్తార్థసమా విస్యుః కింతు ధర్మో విలుప్యతే బాందవేషు చిరం వాసో నారీణాం న యశస్కరః మనోరథో బాందవానాం నార్యా భర్తృ గృహే స్థితిః సా త్వం త్రైలోక్యనాథేన భర్త్రా సూర్యేణ సంగతా పితృగృహే చిరం కాలం వస్తుం నార్హసి పుత్రికేః

ఆ విశ్వకర్మ ఈమెను చాల గౌరవించి ఆదరించెను. అప్పుడు ఆనందితురాలగు సంజ్ఞా దేవి కొద్ది కాలము వరకు తండ్రి గారి గృహము నందుండెను. తిరిగి కొద్ది కాలమైన పిమ్మట తన కుమార్తెయగు ఆ సుందరితో ఆమె తండ్రి విశ్వకర్మ అత్యంత స్నేహ భావముతో మరియు అత్యంత గౌరవముతో ఉత్తమమగు వచనములతో ఇట్లు పలికెను. ఓ కుమారీ! నిన్ను చూచు చుండగా నాకు చాలా దినములు గడచి నప్పటికిని అర్థ ముహూర్త సమయముతో సమానముగా తోచు చున్నది. కాని దీని వలన ధర్మమూ క్షీణించును. బంధు గణముల ఇండ్ల యందు సదా నివసించుట స్త్రీలకు కీర్తి కాదు. స్త్రీలకు భర్త గృహము నందు నివసించుటయే బంధువుల అభిమతము. కుమారీ! త్రైలోక్య నాథుడగు సూర్యుడు నీ భర్త, నీవు వివాహ సూత్రముచే సూర్యుని పొందితివి. తండ్రి గృహమున ఎల్లప్పుడూ నివసించుట ఉచితము గాదు.

సా త్వం భర్తృగృహం గచ్చ తుష్ణోహం పూజితాసిమే పునరాగమనం కార్యం దర్శనాయ శుభే! మమ

అందువలన ఓ శుభా! ఇప్పుడు నీవు పతి గృహమునకు పొమ్ము. నేను సంతుష్టుడ నైనాను. మరియు నీవు కూడ నా వలన సమ్మానితురాల వైనావు. నన్ను చూచుటకు మరల వచ్చి వెళ్ళుదువు గాక.

మార్కండేయుడు:

ఇత్యుక్తా సా తదా పిత్రా తథేత్యుక్తా చ సా మునేః సంపూజయిత్వా పితరం జగామాథోత్తరా న్కురూన్ సూర్యతాప మనిచ్చంతీ తేజసా స్తస్య బిభ్యతీ తపశ్చచార తత్రాపి వడవా రూపధారిణీ సంజ్ఞేయమితి మన్వానో ద్వితీయాయా మహస్పతిః జనయామాస తనయౌ కన్యాం చైకాం మనోరమామ్ ఛాయాసంజ్ఞా త్వపత్యేషు యథా స్వే ష్పతివత్సలా తథా న సంజ్ఞా కన్యాయాం పుత్రయో శ్చాన్వవర్తత

మార్కండేయుడు:

ఓ మునీ! తండ్రి విశ్వకర్మ ఇట్లు చెప్పిన పిమ్మట ఆ సంజ్ఞా దేవి అట్లే అగు గాక అని చెప్పి తండ్రిని చక్కగా పూజించి ఉత్తర కురు దేశమునకు వెళ్ళెను. సూర్యుని తేజస్సుచే భయము చెందిన సంజ్ఞా దేవి సూర్యుని తాపము నందు అనిష్టురాలై అక్కడ ఆడు గుఱ్ఱము యొక్క రూపమును ధరించి తపస్సు చేయ నారంభించెను. ఇచట ‘ఈమె సంజ్ఞా దేవియే అని తలచి, దినపతి యగు సూర్యుడు రెండవ భార్య యందు ఇద్దరు పుత్రులను, మనోహరమగు ఒక కన్యను ఉత్పన్నము చేసెను. కాని చాయా సంజ్ఞ ఏ విధముగా తన సంతానము ఎడల స్నేహవతియై యున్నదో, సంజ్ఞ యొక్క సంతానమగు ఇద్దరు పుత్రుల యందు, కన్య యందు అట్లు స్నేహముగా నుండుట లేదు.

లాలనా ద్యుపభోగేషు విక్షేప మనువాసరమ్ మనుస్తత్ క్షాంతవా నస్యా యమ స్తస్యా న చ క్షమే తాడనాయ చ వై కోపా త్పాద స్తేన సముద్యతః తస్యాః పునః క్షాంతిమతా న తు దేహే నిపాతితః తతః శశాప తం కోపా చ్చాయాసంజ్ఞా యమం ద్విజః కిం చిత్ప్రస్ఫురమాణోష్టీ విచల త్పాణి పల్లవా పితుః పత్నీ మమర్యాదం యన్మాం తర్జయసే పదా భువి తస్మా దయం పాద స్తవాద్యైవ పతిష్యతి

నిత్యము లాలనాది ఉప భోగములు చేయుట యందు ఇద్దరి సంతానము నందు భిన్న భావము చూపు చుండెను. మనువైతే ఆమెను క్షమించెను. కాని యముడు ఆమె యొక్క విషమ భావములను క్షమించ లేదు. అతడు కోపమునకు వశీభూతుడై తన్నుటకు పాదమును ఎత్తెను. కాని ఓర్పు వహించి ఆమెను పాద తడన చేయక శాంతించెను. ఓ ద్విజుడా! అనంతరము ఆ ఛాయాసంజ్ఞ కృద్దురాలై తన చేయి నెట్టి పెదవులు కంపించు చుండ ఇట్లు శపించెను. “నేను నీ తండ్రి భార్యను. నా గౌరవమును చెరచి పాదముచే నన్ను అదలించితివి. ఈ కారణముచే ఇప్పుడే నీ పాదము పృథ్వి యందు పడు గాక.”

మార్కండేయుడు:

ఇత్యాకర్ణ్య యమః శాపం మాత్రా దత్తం భయాతురః అభ్యేత్య పితరం ప్రాహ ప్రణిపాత పురఃస్సరమ్

మార్కండేయుడు:

యముడు తల్లి ఈ విధముగా శపించుట విని భయాతురుడై తండ్రి సమీపమునకు వెళ్లి ప్రణమిల్లి ఇట్లు చెప్ప సాగెను.

యముడు:

తాతైవ న్మహ దాశ్చర్యం న దృష్టమితి కేనచిత్ మాతా వాత్సల్య ముత్సృజ్య శాపం పుత్రే ప్రయచ్చతి యథా మను ర్మమాచష్టే నేయం మాతా తధా మమ విగుణేష్వపి పుత్రేషు న మాటా విగుణా భవేత్

యముడు:

ఓ తండ్రీ! తల్లి స్నేహమును వీడి పుత్రునకు శాప మిచ్చెను. ఇది అత్యంత ఆశ్చర్యముగా నున్నది. ఎప్పుడునూ ఎవరూ ఈ విషయమును చూచి యుండరు. మనువు నాతో ఎట్లు చెప్పెనో, ఈ తల్లి అట్లు లేదు. పుత్రుడు అసద్గుణ యుక్తుడైనప్పటికి కూడ తల్లి ఎప్పుడును ఆతని ఎడల విపరీతముగా నుండదు.

మార్కండేయుడు:

యమ స్యైత ద్వచః శ్రుత్వా భగవాం స్తిమిరాపహః ఛాయా సంజ్ఞాం సమాహూయ పప్రచ్ఛ క్వ గతేతి సా సాచాహ తనయా త్వష్టు రహం సంజ్ఞా విభావసో పత్నీ తవ త్వయాపత్యా న్యేతాని జనితాని మే ఇత్థం వివస్వతః సా తు బహుశః పృచ్చతో యదా నా చచక్షే తతః క్రుద్దో భాస్వాం స్తాం శప్తు ముద్యతః

మార్కండేయుడు:

భగవానుడగు సూర్యుడు యముని వాక్యములు విని ఛాయాసంజ్ఞను సాదరముగా పిలిపించి “సంజ్ఞా దేవి ఎచటకు వెళ్ళెను”? అని అడిగెను. ఆమె ఇట్లు చెప్పెను. హే విభావసో! నేను విశ్వకర్మ యొక్క కుమార్తెను. మీ సంజ్ఞా దేవిని. నా గర్భము నుండియే మీకు సంతానము జన్మించెను. వివస్వానుడగు సూర్యుడు ఎప్పుడయితే ఈ విధముగా చాలా సార్లు అడిగినను ఆమె యదార్థము చెప్పలేదో, అపుడు సూర్య భగవానుడు కృద్ధుడై ఆమెకు శాప మిచ్చుటకు ఉద్యుక్తు డయ్యెను.

తతః సా కథయామాస యథావృత్తం వివస్వతః విదితార్థశ్చ భగవాన్ జగామ త్వష్టు రాలయమ్ తతః స పూజయామాస తదా త్రైలోక్య పూజితమ్ భాస్వంతం పతయా భక్త్యా నిజగేహ ముపాగతమ్ సంజ్ఞాం పృష్ట స్తదా తస్మై కథయామాస విశ్వకృత్ ఆగతైవేహ మే వేశ్మ భవతః ప్రేషితేతి వై దివాకరః సమాధిస్థో వడవా రూప ధారిణీమ్ తప శ్చరంతీం దదృశే ఉత్తరేషు కురుష్వథ సౌమ్య మూర్తిః శుభాకారో మమ భర్తా భవేదితి అభిసంధిశ్చ తపసో బుబుథేస్యా దివాకరః  

అప్పుడు ఏ ఏ విషయములను అడిగెనో అవన్నియు ఆమె వివస్వానునితో చెప్పెను. భగవానుడగు మార్తాండ దేవుడు విషయ మంతయు తెలిసికొని విశ్వకర్మ యొక్క గృహమునకు వెళ్ళెను. ఆ తరువాత విశ్వకర్మ తన గృహమునకు వచ్చిన త్రైలోక్య పూజితుడు, ద్యుతిమానుడు అగు సూర్యుని పరమ భక్తీ సహితముగా పూజించెను. అనంతరము ఎప్పుడు విశ్వకర్మను సూర్యుడు సంజ్ఞా దేవి యొక్క వృత్తాంతము అడిగెనో, అప్పుడు ఆయన ఇట్లు చెప్పెను. సంజ్ఞా దేవి నా గృహమునకు వచ్చినది. కాని నేను ఆమెను మీ గృహమునకే పంపితిని. అప్పుడు దివాకరుడు ధ్యానమగ్నుడై సంజ్ఞా దేవి ఉత్తర కురు దేశము నందు ఆడ గుఱ్ఱము రూపము ధరించి తపస్సు చేయుచుండుట చూచెను. మరియు దివాకరుడు “నా భర్త సుందరాకృతి మరియు సౌమ్య మూర్తి యగు గాక!” అన్న అభిలాషచే తపస్సు చేయుచుండుట గాంచెను.

శాతనం తేజసో మేధ్య క్రియ తామితి భాస్కరః తంచాహ విశ్వ కర్మాణం సంజ్ఞాయాః పితరం ద్విజః సంవత్సర భ్రమే స్తస్య విశ్వకర్మా రవే స్తతః తేజసః శాతనం చక్రే స్తూయ మానశ్చ దేవతైః

ఓ ద్విజుడా! భాస్కర భగవానుడు తిరిగి సంజ్ఞా దేవి యొక్క తండ్రి యగు విశ్వకర్మతో నా తేజస్సును క్షీణింప చేయుడని చెప్పెను. అప్పుడు విశ్వకర్మ దేవతలను స్తుతించి సంవత్సర భ్రమణ కారియగు ఆ రవి యొక్క తేజస్సును క్షీణింప చేసెను.