మార్కండేయ మహా పురాణము
26 - గృహస్థాశ్రమ ధర్మ నిరూపణము
అలర్కుడు:
యత్కార్యం పురుషేణేహ గార్హస్థ్య మనువర్తతా బంధశ్చ స్యా దకరణే క్రియాయాం యస్య చోచ్రితిః ఉపకారాయ యన్నౄణాం యచ్చ వర్జ్యం గృహే సతామ్ యథా చ క్రియతే తన్మే యథావ త్పృచ్చతో వద
అలర్కుడు:
జననీ! గృహస్థాశ్రమ మందున్న పురుషుని కర్తవ్యమేమి? ఏవి చేయక పోయినచో నరక ప్రాప్తి కలుగునో, ఏవి చేసిన మోక్ష లాభము కలుగునో, గృహస్థులకు ఏవి ఉపకారములో, ఏవి వర్ణింప దగినవో ఎట్లు చేయవలెనో వాటి నన్నిటిని అడుగు చున్నాను. గాన నాకు విపులముగా బోధిం పుము.
మదాలస:
వత్స! గార్హ్యస్థ్య మాస్థాయ నరః సర్వ మిదం జగత్ పుష్ణాతి తేన లోకాంశ్చ స జా త్యభివాంచితమ్ పితరో మునయో దేయా భూతాని మనుజా స్తథా క్రుమికీట పతంగాశ్చ వయాంసి పశవో సురాః గృహస్థ ముపజీవంతి తత స్తృప్తిం ప్యయాంతి చ ముఖం చాస్య నిరీక్షంతే అప్ నో దాస్యతీతి వై
మదాలస:
వత్సా! మనుష్యుడు గృహస్థాశ్రమమును అవలంభించి సమస్త జీవులను పోషించ వలెను. ఆ పుణ్య ప్రభావముచే తన కభీష్టమగు స్వర్గాది సర్వ లోకములు లభించును. పితరులు, మునులు, దేవతలు, భూతములు, మానవులు, కృమి, కీటక, పతంగ,పశు, పక్ష్యాదులు, అసురులు, ఇవి అన్నియు గృహస్థుని ఆశ్రయించి జీవనము సాగించు చుండును. “గృహస్థుడు మనకు అన్నము పెట్టును” అని ముఖమును నిరీక్షించు చుండును.
సర్వ స్యాదార భూతేయం వత్స దేను స్త్రయీ మాయీ యస్యాం ప్రతిష్టితం విశ్వం విశ్వహేతుశ్చ యా మతా ఋక్పృష్ఠా సౌ యజు ర్మధ్యా సామవక్త్ర శిరోధరా ఇష్టాపూర్త విషాణా చ సాదు సూక్త తనూరుహా శాంతి పుష్టి శకృన్మూత్రా వర్ణపాద ప్రతిష్టితా అజీవ్యమానా జగతాం సాక్ష్యయా నాపచీయతే స్వాహాకారో స్వధాకారో వషట్కారశ్చ పుత్రక హంతకార స్తథైవాన్య స్తస్యాస్తన చతుష్టయమ్ స్వాహాకారం స్తనం దేవాః పితరశ్చ స్వధామయమ్ మునయశ్చ వశట్కారం దేవా భూత సరే తరాః హంతకారం మనుష్యాశ్చ పిబ తి సతతం స్తనమ్ ఏవ మాప్యాయయత్యేషా దేవాడీ నఖిలం స్త్రయీ
పుత్రా! గృహస్థుడు వేదమయ మగు కామధేనువు రూపమున అన్నిటికి ఆధారభూతుడై యున్నాడు. అఖిల బ్రహ్మాండము ఈ కామధేనువు నందు ప్రతిష్టితమై యున్నది. ఈ కామదేనువే బ్రహ్మాండమునకు కారణమగు చున్నది. ఈ కామదేనువునకు ఋగ్వేదము వృష్ఠభాగము, యజుర్వేదము మధ్యభాగము, సామవేదము ముఖము మరియు కంఠము. ఇష్టాను సారముగా కొమ్ములు, సాదు సూక్తములు రోమములు, శాంతి పౌష్ఠిక కర్మలు మల మూత్రములు. ఈ నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములు ధేనువు యొక్క నాలుగు పాదములు. ఈ ధేనువునకు క్షయము లేదు. సమస్త జగత్తునకు మిక్కిలి ఆలంబన కలిగి జీవనాధార పోషణములు చేయుచు ఆక్షయముగా వృద్ధి పొందును గాని క్షీణించదు. కుమారా! ఈ ధేనువునకు స్వాహాకారము, స్వధాకారము ,వషట్కారము, హంతకారము అను పేర్లతో నాలుగు స్తనములున్నవి. ఈ నాలుగు స్తనముల నుండి, దేవతలు స్వాహాకారము, పితృ గణము స్వధాకారము, ఋషి గణము వషట్కారము, మనుష్యగణము హంతకారము, స్తన్య పానము చేయుదురు. వత్సా! ఇట్లు త్రయీమయ మగు ధేనువు దేవాదులందరికి తృప్తిని కలుగజేయు చుండును.
ఏతద్వత్స చతుష్కం తు నర స్తన చతుష్టయే న నియుంజ్యా ద్యథాకాలం తేన స్యు స్తే విమానితాః దేవాదీ నఖిలాన్మేషు సంతర్పయతి మానవః తేషా ముచ్చేద కర్తా యః పురుషో త్యంత పాపక్రుత్ స తమస్యంధతామిస్ర తామిస్రే చ నిమజ్జతి యస్వైతాం మానవో ధేనుం స్వే ర్వర్త్సై రమరాదిభిః ప్రాప్య త్యుచితే కాలే స స్వరగా యోపపద్యతే తస్మా త్పుత్ర మనుష్యేణ దేవర్షి పితృ మానవాః
కుమారా! ఇట్లు ఈ నాలుగు వత్సములు నాలుగు స్తనముల పాలను పానము చేయును. కాలము ననుసరించి వినియోగించనిచో వేదమను గోమాతను అవమానించిన వారు అగుదురు. వేని వలన మానవుడు సమస్త దేవతలను సంతుష్ట పరచునో అట్టి వేద మాతను నష్ట పరచిన వాడు మహా పాపి యగును. అట్టివాడు అంధతామిస్రము, తామిస్రము అను రెండు రకముల నరకముల యందు పడును. ఏ మానవుడు దేవాదులకు స్వవత్సములతో యదా ప్రకారమున వేదమను గోమాత వద్ద స్తన్య పానము చేయించునో, అట్టి వాడు స్వర్గము పొంద గలడు. అందువలన కుమారా! ప్రతి నిత్యము యథా శక్తిగా గృహస్థుడు తన శరీరమును వలెనె దేవ, ఋషి, పితృ, మనుష్య, భూతాదులను పోషించ వలెను.
భూతాని చానుదివసం పోష్యాణి స్వతను ర్యథా తస్మా త్స్నాతః శుచి ర్భూత్వా దేవర్షి పితృ తర్పణమ్ ప్రజాపతే స్తథైవాద్భిః కాలే కుర్యా త్సమాహితః సుమనో గంధ ధూపైశ్చ దేవా నభ్యర్చ్య మానవః తతోగ్నే స్తర్పణం కుర్యా ద్దద్యాచ్చ బాలి మిత్యథ బ్రహ్మణే గృహ మధ్యే తు విశ్వే దేవేభ్య ఏవ చ ధన్వంతరిం సముద్దిశ్య ప్రాగుదీచ్యాం బలిం క్షిపేత్ ప్రాచ్యాం శక్రాయ యామ్యాయాం యమాయ బలి మహరేత్ ప్రతీచ్యాం వరుణా యాథ సోమాయోత్తర తో బలిమ్ దద్యా ద్ధాత్రే విధాత్రే చ బలిం ద్వారే గృహస్య చ
అందు వలన స్నానము చేసి శుచియై శ్రద్ధగా దేవా, ఋషి పితృ తర్పణములు చేయ వలెను మరియు ప్రజాపతికి తర్పణము చేయ వలెను. చందన, గంధ, ధూపాదుల ద్వారా దేవతలను అర్చించ వలెను. పిమ్మట అగ్ని కార్యము చేయ వలెను. తర్వాత బ్రహ్మను, విశ్వే దేవతలను ధన్వంతరిని ఉద్దేశించి గృహ మధ్య మందు ఈశాన్య దిశగా బలి ప్రదానము చేయవలెను. ఇంద్రునకు తూర్పున, యమునకు దక్షిణ దిక్కున, బలి ప్రదానము చేయ వలెను. పశ్చిమ దిక్కున వరుణునికి, ఉత్తర దిక్కున చంద్రునకు బలి ప్రధానము చేయ వలెను. గృహ ద్వార మందు ధాత, విధాతలను వారికి బలి దానము చేయ వలెను.
అర్యమ్ణేథ బహి ర్దద్యా ద్గృహేభ్యశ్చ సమంతతః నక్తంచరేభ్యో భూతేభ్యో బలి మాకాశతో హరేత్ పితౄణాం నిర్వపే చ్చైవ దక్షిణాభి ముఖః స్తితః గృహస్థ స్తత్పరో భూత్వా సుసమాహిత మానసః తత స్తోయ ముపాదాయ తేషా మాచమనాయ వై స్థానేషు నిక్షిపే త్ప్రాజ్ఞ స్తా స్తా ఉద్దిశ్య దేవతాః ఏవం గృహబలిం కృత్వా గృహే గృహపతి శ్శుచిః ఆప్యాయనాయ భూతానాం కుర్యా దుత్సర్గ మాదరాత్ శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ వయోభ్య శ్చావపే ద్భువి వైశ్వ దేవం హాయ్ నామైత త్సాయం ప్రాత రుదాహృతమ్
గృహము వెలుపల అన్ని వైపులను “అర్యముడు” అను వానికి బలి దానము చేయ వలెను. అనంతరము నక్తంచర భూతములను ఉద్దేశించి ఆకాశము నందు బలి హరణము చేయ వలెను. పితృ దేవతలను ఉద్దేశించి చేయు కార్యములు దక్షిణాభి ముఖముగా కూర్చొని చేయ వలెను. గృహస్థుడు ఏకాగ్ర చిత్తుడై ఆచమించి, ఉదకమును తీసుకొని ఆయా దేవతల నుద్దేశించి ఆయా స్థానములందు జల ప్రక్షేపణము చేయ వలెను. దీనినే వైశ్వ దేవ బలి అందురు. సాయం కాలమందు మరియు ప్రాతః కాలమందు ఈ బలి దానము చేయ వలసి యున్నది.
ఆచమ్య చ తతః కుర్యా త్పాజ్ఞో ద్వారావలోకనమ్ ముహూర్త స్యాష్టమం భాగ ముదీక్ష్యో హ్యతిథి ర్భవేత్ అతిథిం తత్ర సంప్రాప్త మన్నా ద్యేనోదకేన చ సంపూజయతే ద్యథా శక్తి గంధ పుష్పాదిభి స్తథా న మిత్ర మతిథిం కుర్యా న్నైక గ్రామ నివాసినమ్ అజ్ఞాత కుల నామానం తత్కాల సముపస్థితిమ్ బుభుక్షు మాగతం శ్రాంతం యాచమాన మకించనమ్ బ్రాహ్మణం ప్రాహు రతిథిం కుర్యా న్నైక గ్రామ నివాసినమ్ న పృచ్చే ద్గోత్ర చరణం స్వాధ్యాయం చాపి పండితః శోభనా శోభనా కారం తం మన్యేత ప్రజాపతిమ్
బుద్ధిమంతుడైన గృహ యజమాని ఈ విధముగా వైశ్వదేవ బలి దానము చేసిన పిమ్మట ఆచమనము చేసి ద్వారావ లోకనము చేయ వలెను. ముహూర్తము యొక్క అష్టమ భాగము (ఆరు నిమిషములు) వరకు అతిథి కొరకు నిరీక్షించ వలెను. అతిథి వచ్చిన తరువాత అతనిని శక్తి ననుసరించి జల, అన్నాదులతో మరియు గంధ పుష్పాదులతో పూజించ వలెను. మిత్రుని, ఒకే గ్రామము నందు నివసించు వానిని అతిథిగా ఎంచ కూడదు. ఏ పురుషుని యొక్క కుల నామములు తెలియ బడవో, ఎవడు ఆ సమయ మందు వచ్చునో, నిజముగా ఆహారము నందు అభిలాషచే ఎవడు వచ్చునో, ఎవడు అలసి వచ్చునో , ఏమాత్రము లేనివాడు యాచకుడై వచ్చునో, అట్టి బ్రాహ్మణుని పండితులు అతిథి యని చెప్పుదురు. శక్తి ననుసరించి బుద్ధిమంతుడైన గృహస్థుడు అతిథి యొక్క గోత్రము,వేదము, శాఖ, స్వాధ్యాయము మొదలగు వానిని ఏ మాత్రము అడుగ కూడదు. అతిథి రూపిగాని, కురూపి గాని ఎట్లున్నను అతనిని ప్రజాపతి రూపముగా భావించ వలెను.
అనిత్యం హి స్థితో యస్మా త్తస్మా దతిథి రుచ్యతే తస్మిం స్తృప్తే నృయజ్ఞోత్థా దృణా న్ముచ్యే ద్గృహాశ్రమీ తస్యాదత్త్వా తు యో భుంక్తే స్వయం కిల్బిష భుజ్ నరః స పాపం కేవలం భుంక్తే పురీషం చాన్య జన్మని అతిథి ర్యస్య భగ్నాశో గృహా త్ప్రతినివర్తతే స దత్త్వా దుష్కృతం తస్మై పుణ్య మాదాయ గచ్చతి అప్యంబు శాక దానేన యచ్చాప్యశ్నాతి స స్వయమ్ పూజయేత నరః శక్త్యా తేనై వాతిథి మాదరాత్ కుర్యాచ్చా హరహః శ్రాద్ధ మన్నా ద్యేనోదకేన చ పితౄ నుద్దిశ్య విప్రాంశ్చ భోజయే ద్విప్ర మేవ వా
ఎల్లప్పుడు ఉండువాడు కాడు కావున అతిథి యని చెప్పబడు చున్నాడు. అతిథి తృప్తి బొందిన యెడల అతిథి యజ్ఞము యొక్క ఋణము నుండి విముక్తుడగును. ఏ పురుషుడు అతిథికి అన్నమిడక తాను భుజించునో వాడు పాపమును భుజించిన వాడగును. అట్టివాడు మరుసటి జన్మమున పురీషమును భుజించు వాడగును. అతిథి ఎవరి గృహమందు నిరాశ చెంది తిరిగి పోవునో, ఆ అతిథి తన పాపమును అతనికిచ్చి, వాని పుణ్యమును తీసికొని పోవును. అతిథికి తాను జలమును గాని, శాకమును గాని ఏది భుజించునో అది సమర్పించి శక్తి ననుసరించి సాదరముగా అతనిని పూజించవలెను. నిత్యము జలము మరియు అన్నాదులచే శ్రాద్ధము పెట్టవలెను. మరియు పితరుల యొక్క ఉద్దేశ్యముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఒకనికయినను భోజనము పెట్ట వలెను.
అన్నస్యాగ్రం తదుద్దృత్య బ్రాహ్మణా యోపపాదయేత్ భిక్షాం చ యాచితాం దద్యా త్పరివ్రా ద్బ్రహ్మచారిణామ్ గ్రాస ప్రమాణా భిక్షా స్యా దగ్రం గ్రాస చతుష్టయమ్ అగ్రం చతుర్గుణం ప్రాహు ర్హంతకారం ద్విజోత్తమాః భోజనం హంతకారం వా అగ్రం భిక్షా మథాపి వా అదత్వాతు న భోక్తవ్యం యథా విభవ మాత్మనః పూజయిత్వాతిథీ నిష్టాఞ జ్ఞాతీ న్బంథూం స్తథార్థినః వికలా న్బాల వృద్దాంశ్చ భోజయే చ్చాతురాం స్తథా వాంఛతే క్షుత్పరీతాత్మా యచ్చాన్యోన్న మకించనః కుటుంభినా భోజనీయః స్వసమం సతి
అన్నము యొక్క పైభాగమును తీసి బ్రాహ్మణులకు అర్పణము చేయవలసి యున్నది. సన్యాసులకు మరియు బ్రహ్మచారులకు అడిగిన యెడల భిక్ష వేయ వలెను. ఒక గ్రాసమును భిక్షయని, గ్రాస చతుష్టయమును అగ్రమని, మరియు అగ్ర చతుష్టయమును హంతకారమని చెప్పబడు చున్నది. తన శక్తి ననుసరించి హంతకారముగా కాని, అగ్రముగా లేక భిక్షగా కాని ఇవ్వక, ఎప్పుడును స్వయముగా భోజనము చేయరాదు. అతిథి సత్కారము తర్వాత ఇష్టులైన జ్ఞాతులకు, బంధువులకు, యాచకులకు, వికలాంగులకు, బాలురకు, వృద్ధులకు మరియు ఆతురులకు భోజనము పెట్టవలెను. పరులెవరైన బీదవారు అన్నము యాచించిన యెడల వారికి కూడా ఆహారమును పెట్ట వలెను. సంపద ఉన్న యెడల తనతో సమానముగా వారిని భుజింప జేయ వలెను.
శ్రీమంతం జ్ఞాతి మాసాద్య యో జ్ఞాతి రవసీదతి సీదతా యత్కృతం తేన తత్పాదం స సమశ్నుతే సాయం చైష విధిః కార్యః పూర్వోక్తం తత్ర చాతిథిమ్ పూజయేశ్చ యథాశక్తి శయనాసన భోజనైః ఏవ ముద్వహత స్తాత? గార్హస్థ్యం భార మాస్థితమ్ స్కందే విధాతా దేవాశ్చ పితరశ్చ మహర్షయః శ్రేయో భివర్షిణః సర్వే భవంత్యతిథి బాంధవాః పశు పక్షి మృగా స్తృప్తా యే చాన్యే సూక్ష్మ కీటకాః గాథాశ్చాత్ర మహాభాగస్వయ మత్రి రగాయత తాః శ్రుణుష్వ మహాభాగ గృహస్థా శ్రమ సంస్థితాః దేవా న్పితౄం శ్చాతిథీంశ్చ తద్వ త్సంపూజ్య బాంధవాన్ జామయశ్చ గురూంశ్చైవ గృహస్థే విభవే సతి శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ వయోభ్యశ్చావపే ద్భువిః వైశ్వదేవం హి నామై తత్కుర్యా త్సాయం తథా దినే మాంస మన్నం తథా శాకం గృహే యచ్చోప సాధితమ్ న చ తత్స్వయ మశ్నీయా ద్విధివ ద్యన్న నిర్వపేత్
ఏ జ్ఞాతి శ్రీమంతుడైన జ్ఞాతి ఉండి కూడా బాధ పడునో, వాని పాపమును శ్రీమంతుడు పొందు తున్నాడు. సాయం కాలమందు కూడా ఈ విధి ననుసరించ వలెను. అతిథి సూర్యుడస్తమయ కాలమందు వచ్చిన యెడల శక్తి ననుసరించి శయన ఆసనముల ద్వారా అతనిని గౌరవించ వలెను. పుత్రా! ఈ ప్రకారము తన భుజము మీద ఉంచబడిన “గృహస్థాశ్రమ ధర్మము” అను భారము మోయుటచే బ్రహ్మ మొదలుకొని దేవతలు, మహర్షులు, అతిథులు, బంధువులు, మరియు పశు పక్షులు,సూక్ష్మ కీటకములు మొదలగు వారందరు అత్యంత ప్రసన్నులై గృహస్థునకు క్షేమము కలుగ జేయుదురు. మాహాభాగా! మహానుభావు డైన అత్రి మహర్షి గృహస్థాశ్రమ సంబంధమగు గాధలను స్వయముగా చెప్పెను. వాటిని వినుము. సంపద ఉన్న యడల గృహస్థుడు దేవా, పితృ, అతిథి, బంధు, గురువులను పూజించవలెను. మరియు శ్వాన, శ్వపచ, పక్షుల నుద్దేశించి భూమి యందు బలి దానము చేయ వలెను. వైశ్వదేవమను పేరుగల ఈ బలి కర్మ పూర్వాహ్న మందు సాయం కాలమందు చేయ వలెను. మాంసము, అన్నము, శాకము మరియు గృహము నందలి ఏ వస్తువు లైనను ఈ నియమములు పూర్తి చేసు కొనకుండా తాను భుజింప రాదు.
Summary of chapter 26 of the Mārkandeya Mahā Purana is as follows:
As Queen Madālasā gives birth to her first three sons—Vikrānta, Subāhu, and Shatrumardana—she rocks their cradles while singing profound spiritual lullabies. Instead of worldly affection, she teaches them that the body is merely a temporary garment of panchabhūtas and that their true identity is pure, unblemished Ātman. Imbibing these non-dual teachings from infancy, all three princes renounce the kingdom in youth and attain liberation.