13 - పితా పుత్రా సంవాదము

అహం వైశ్య కులే జాతో జన్మ న్యస్మాత్తు సప్తమే  సమతీతే గవాం రోధం నిపానే కృతవా న్పురా  విపాకా త్కర్మణ స్తన్య నరకం భృశ దారుణమ్  సప్రా ప్తోగ్ని శుఖా పూర్ణ మయో ముఖ ఖగా కులమ్  యంత్ర పీడన గాత్రాసృ క్ప్రవాహోద్భుత కర్దమమ్  విక్రుష్యమాణ దుష్కర్మి తన్ని పాత రావాకులమ్  పాత్యమానస్య వే తత్ర సా గం వర్షశతం గతమ్  మహా తాపార్తి తప్తస్య తృష్ణా దాహాన్వితస్య చ  తత్రాహ్లాదాకరః సద్యః పవనః సుఖ శీతలః  కరంభ వాలుకా కుంభ మధ్యస్తే వై సమాగమః   

తండ్రీ! ఈ జన్మ నుండి పూర్వ మేడవ జన్మలో నేను వైశ్య కులము నందు బుట్టితిని. అప్పుడు నీళ్ళు ద్రావుచున్న గోవులను త్రాగకుండా నిరోధించితిని. ఈ కర్మ యొక్క ఫలముచే భయంకరమైన నరక మందు బడితిని. ఆ నరక మగ్ని శిఖలతో గూడుకొని, యినుప ముక్కులు గలిగిన పక్షులతో గూడి యున్నది. యంత్ర పీడనముచే పాపుల యొక్క శరీరము నుండి బయలు దేరుతున్న రక్త ప్రవాహ జనిత కర్ధమమై యుండెను. మరియు నచట జంపబడు చున్న పాపాత్ముల నా నరక మందు బడ వైచుటచే వారి యార్త నాదములతో నిండి యున్నది. నేనచ్చట మహా తాప పీడితుడనై సంతప్తుడనై, తృష్ణా దాహాన్వితుడనై నూరు సంవత్సరములు పైగా యా నరకమందు బడి యుంటిని. ఇట్లుండగా నొక రోజు తలవని తలంపుగా కరంభ వాలుకా కుంభ మధ్యము నుండి ప్రసన్న మైనట్టిది, సుఖ శీతల మైనట్టిది,యాహ్లాద కరమైనట్టిదియు గాలి వీచ సాగెను.

అకస్మాదేవ భో స్తాత నర రత్నం సమాగతమ్  తత్సంపర్కా దశేషాణాం నా భవ ద్యాతనా నృణాం  మమ చాపి యథా స్వర్గే స్వర్గినాం నిర్వ్రుతిః పరా  కిమేత దితి చాహ్లాద విస్తార స్తిమితేక్షనైః  దృష్ట మస్మాభి రాసన్న నరరత్న మనుత్తమమ్ యామ్యశ్చ పురుషో ఘోరో దండ హస్తోల్ల సత్ప్రభః  పురతో దర్శయ న్మార్గ మిత ఏ హీతి చ బ్రువన్  తతస్తే జంతవ స్సర్వే మత్వా తద్ధర్శనా త్సుఖమ్  ఊచుః ప్రాంజలయో భూపః క్షణ మాత్రం స్థితో భవ  త్వద్గాత్ర సంగీ పవనో హ్యాస్మాకం సుఖ కారకః  తతో సౌ నరకా భ్యాశే ఉపవిష్టః కృపాన్వితః   

 ఓ తండ్రీ! హఠాత్తుగా నచటి కొక నర శ్రేష్ఠుడు వచ్చెను. ఆయన యొక్క సంపర్కముచే సర్వ మానవులకు బాధలు శాంతించెను. నాకు గూడ స్వర్గ వాసులతో సమానమైన పరమానందము గలిగినది. ఇట్లుండుటకు కారణ మేమని యాహ్లాదముతో కళ్ళు తెరచుకొని చూచుచున్న మాకుత్త మోత్తముడగు నొకా నొక నర శ్రేష్ఠుడు మా సమీపము నందు గన్పట్టెను. భయంకరుడగు నొక యమ కింకరుడు వజ్రతుల్యమగు దండమును ధరించి “ఇటు రమ్ము” అని చెప్పి యాతనికి మార్గమును చూపించు చుండెను. అప్పుడక్కడ నున్న సర్వ జీవులాతని యొక్క దర్శనముచే సుఖము కలిగినదని దలచి, చేతులు జోడించి, నమస్కరించి “క్షణ మాత్ర మిచట తమరుండ ప్రార్థించు చున్నా” మని యనిరి. తమ శరీరము నుండి బయలు వెడలిన గాలి మాకు సుఖమును గలుగ జేయు చున్నది. అని యన అప్పుడా పురుషుడు దయ కలిగి నరక సమీపము నందు నిలిచెను.

పురుషః స తదా దృష్ట్వా యాతనా శత సంకులమ్  నరకం ప్రాహ తం యామ్య కింకరం కృపయాన్వితః 

అనంతర మా పురుషుడు యాతనా శత సంకుల మగు నరకమను జూచి కృప గలవాడై యా యమ దూతతో నిట్లు బలికెను.

పురుషుడు:

భో యామ్య పురుషా చక్ష్వ కిం మయా దుష్కృతం కృతమ్  యేనేదం యాతనా భీమం ప్రాప్తోస్మి నరకం పరమ్  విపశ్చి దితి విఖ్యాతో జనకానా మహం కులే  జాతో విదేహ విషయే సమయ జ్మనుజ పాలకః  చాతుర్వర్ణ్యం స్వధర్మస్థం కృత్వా సంరక్షితం మయా ధర్మతో ధర్మ కల్పేన మనునాత్ర యథా పురా  యజ్ఞై ర్మయేష్టం బహుభి ర్థర్మతః పాలిటా మహీ  నోత్సృష్ట శ్చైవ సంగ్రామో నాతిథి ర్విముఖో గతః 

పురుషుడు:

ఓ యామ్య పురుషా నేనేమి పాపము జేసితిని? ఏ పాపముచే భయంకరమగు నిట్టి నరకము ప్రాప్తించెను? చెప్ప గోరెదను. నేను విదేహ రాజ్యమున జనక మహారాజ వంశములో బుట్టితిని. పండితునిగా ప్రఖ్యాతి బడసితిని. ధర్మముగా ప్రజా పాలన జేసితిని. నేను ధర్మ బద్ధముగా చాతుర్వర్ణ్య ధర్మములు గాపాడితిని. ధర్మ రూపుడగు స్వాయంభువ మనువుతో సమానముగా నన్ని ధర్మముల జేసితిని. నేను యజ్ఞము లనేకము జేసితిని. ధర్మముగా భూమిని బాలించితిని. నేనెప్పుడు యుద్దమందు విముఖుడ గాలేదు. అతిథులు నిరాశ జెంది బోలేదు.

పితృ దేవర్షి భృత్యాశ్చ న చాపచరితా మయా  మహాతాపార్తి తప్తస్య తృష్ణా దాహార్తి తస్య చ  సర్వస్య జీవ భూతస్య కృతం త్రాణం సదా మయా  కృతా స్పృహా చ నమయా పరస్త్రీ విభావాదిషు  పర్వ కాలేషు పితర స్తిథి కాలేషు దేవతాః పురుషం స్వయ మాయాన్తి నిపాన మివ దేనవః యతస్తే విముఖా యాన్తి నిఃస్వస్య గృహ మేధినః  తస్మా దిష్టశ్చ పూర్తశ్చ ధర్మౌ ద్వావపి నశ్యతః  పితృ నిశ్వాస విఘ్నస్తం సప్త జన్మార్జితం ధనమ్  త్రిజన్మ ప్రభవం దైవో నిశ్వాసో హన్త్యసంశయమ్  తస్మా ద్దైవే చ పిత్రే చ నిత్యమేవ హితోభవమ్  సోహం కథమిమం ప్రాప్తో నరకం భృశ దారుణమ్ 

నేను పితృ దేవర్షి భ్రుత్యులకు గాని ఏమి యపచారము చేయలేదు. మహా తాపముచే తప్తులైన వారికి తృష్ణా దాహముచే వ్యాకులమైన వారికి రక్షణ గల్పించితిని. నేను సర్వ ప్రాణులను ఎల్లప్పుడు రక్షణ జేసితిని. పరస్త్రీల యందు గాని పర ధనముల యందు గాని యాసక్తిని బొందలేదు. పర్వ కాలములందు పితృ దేవతలు, తిథి కాలముల యందు దేవతలు గోవులు వచ్చునట్లు స్వయముగా నా యొద్దకు వచ్చిరి. దేవతలు, పితృదేవతలు గృహస్థుని యొక్క సమీపము నుండి నిరాశులై బోయినచో, యాతడు జేసిన యజ్ఞములు పూర్తములను రెండు ధర్మములు నాశన మగును. పితృ దేవతలు నిరాశులైనచో నేడు జన్మముల యొక్క పుణ్యము నష్టమగును. దేవతలు నిరాశు లైనచో, మూడు జన్మల పుణ్య ధనము నష్టమగును. ఇందులో సందియము లేదు. ఈ కారణముచే నేను దేవ పితృ కార్యము లందెల్లప్పుడు శ్రద్ధతో నుంటిని. ఇట్టి నేను ఏ కారణముచే నత్యంత దారుణ మగు నీ నరకమును బొందితిని?