మార్కండేయ మహా పురాణము
20 – తాళకేతు మాయ, మదాలస మరణము
నాగ పుత్రులు:
తత కాలే బహుతిథే గేటు రాజా పునః సుతమ్ ప్రాహ గచ్చాశు విప్రాణాం త్రాణాయ చర మేదినీమ్ అశ్వ మేతం సమారుహ్య ప్రాతః ప్రాతర్ధినే దినే ఆబాధా ద్విజముఖ్యానా మన్వేష్టవ్యా సదైవ హి దుర్వృత్తాః సంతి శతశో దానవాః పాప బుద్ధయః తేభ్యోన స్యా ద్యథా బాధా మునీనాం త్వ తథా కురు స తథోక్త స్తథా పిత్రా తథా చక్రే నృపాత్మజః పరిక్రమ్య మహీం కృత్సాం వవందే చరణౌ పితుః అహన్యహని సంప్రాప్తే పూర్వాహ్ణే నృపనందనః తతశ్చ శేషం దివసం తథా రేమే సుమథ్యయా
నాగ పుత్రులు:
ఇట్లు చాలా కాలము గడచెను. ఒక రోజున సుతుని జూచి రాజు మరల యిట్లనియె. కుమారా! బ్రాహ్మణ రక్షణార్థమై భూమండలమును సంచరించుము. త్వరగా బొమ్ము. నీవు ప్రతి దినము ప్రాతః కాలమున నీ గుఱ్ఱము నారోహించి బ్రాహ్మణ శ్రేష్ఠుల కున్నట్టి బాధల నన్వేశించ వలెను. దుష్ట ప్రవర్తన గలవారు, పాప బుద్ధులగు దానవులు వందల కొలది గలరు. నీవు మునులకు వారి వలన బాధ లేకుండు నట్లు చేయుము. రాజ కుమారుడు తండ్రి యట్లు చెప్పిన పిమ్మట ఆ ప్రకారముగానే సమస్త భూమండలమును తిరిగి వచ్చి, జనకుని చరణములకు ప్రణమిల్లెను. నృపపుత్రుడు ప్రతి రోజు పూర్వాహ్ణమున పృథివీ పర్యటనము జేయుచు, శేష సమయమున సుమధ్య యగు మదాలసతో విహరించు చుండెను.
ఏకదా తు చరన్ సోథ దదర్శ యమునా తటే పాతాలకేతో రనుజం తాళ కేతుం కృతాశ్రమమ్ మాయావీ దానవః సోథ మునిరూపం సమాశ్రితః స ప్రాహ రాజపుత్రం తం పూర్వ వైరా మనుస్మరన్ రాజపుత్రః బ్రవీమి త్వాం తత్ కురుష్వ య దీచ్చసి న చ తే ప్రార్థనా భంగః ప్రాయః సత్య ప్రతిశ్రవః యక్షే యజ్ఞేన ధర్మాయ కర్తవ్యాశ్చ మయేష్టయః చింతయే తత్ర కర్తవ్యా నాస్తి మే దక్షిణా యతః తతః ప్రయచ్చ మే వీర దక్షిణార్థే స్వభూషణమ్ యదేట త్కంఠ లగ్నం తే రక్షా చేమం మమాశ్రమమ్
ఆ రాజ నందను డీప్రకారము సంచరించు చుండగా నొకానొక సమయమున పాతాలకేతుని తమ్ముడగు తాలకేతు డనువాడు యమునా తీరమున ఆశ్రమము నిర్మించుకొని యుండుట చూసేను. మాయావి యగు నీ దానవుడు ముని రూపమును ధరించి యుండెను. వాడు పూర్వ వైరమును దలచుకొని యా రాజ కుమారునితో నిట్లు పలికెను. రాజపుత్రా! నేను చెప్ప బోవునది మంచిది యని నీకు దోచినచో దానిని చేయుము. సత్య ప్రతిజ్ఞా! నీ వెప్పుడు ప్రార్థనా భంగ మెవ్వరికి చేయలేదు. రాజ కుమారా! నేను యజ్ఞము చేయవలసి యున్నది. ధర్మసిద్ధికై నే నభిలషించిన యిష్టులు (యజ్ఞాంగ విశేషములు) మరియు నగ్ని సంచయము జేయుదును. కాని నావద్ద యజ్ఞ దక్షిణ యిచ్చుటకు నేమాత్రము ద్రవ్యము లేదు. అందువలన నో వీర కుమారా! దక్షిణ కొరకు నీ కంఠమందు ధరించిన సర్వ భూషణములను నాకు ఇమ్ము. యజ్ఞ సంపూర్తి యగు నంత వరకు ఈ నా ఆశ్రమమును రక్షింపుము.
యావ ద తర్జలే దేవం వరుణం యాదసాం పతిమ్ వైదికై ర్వారుణైర్మం త్రైః ప్రజానాం పుష్టి హేతుకైః అభిష్టూయ త్వరాయుక్తః సమభ్యేమీతి వాదినమ్ తం ప్రణమ్య తతః ప్రాదాత్ స తస్మై కంఠ భూషణమ్ ప్రాహ చైనం భవాన్ యాతు నిర్వ్యలికేన చేతసా స్థాస్యామి తావ దత్రైవ తవాశ్రమ సమీపతః తవాదేశా న్మహా భాగః యావదాగమనం తవ న తే త కశ్చి దాబాధాం కరిష్యతి మయి స్థితే విస్రబ్ద స్త్వం మునిశ్రేష్ఠ కురుష్వ చ మనోగతమ్ ఏవముక్త స్తత స్తేన స మమజ్జ నదీ జలే
నేను జలము లందుండి, ప్రజా క్షేమములను గలుగ జేయు వేదమందలి వారుణ మంత్రములచే, జల జంతువులకు ప్రభువగు వరుణ దేవుని గూర్చి తపస్సు జేసి వచ్చెదను. అంతవరకు నా యాశ్రమమును రక్షించు చుండుము. నేను శీఘ్రముగనే వచ్చెదను. అని చెప్పిన యా కపట మునికి నమస్కరించి, యా రాజపుత్రుడు కంఠ భూషణము నిచ్చెను. మరియు నా రాజకుమారుడు వానిని జూచి, మహానుభావా! నా యందు విశ్వాసముంచి పొండు. మీ యాశ్రమ సమీపముననే యుండెదను. మీ యాజ్ఞానుసారముగా మీరు తిరిగి వచ్చు వరకు యిచ్చటనే యుండెదను. మీ ఆశ్రమమున కేవిధమైన బాధ లుండవు. మునిశ్రేష్టా! మీరు ఎంత మాత్రము శంకించక, నిశ్చల మనస్సుతో తల పెట్టిన యజ్ఞమును జేయుడు అని చెప్పెను. ఇట్లా మాయా ముని యగు తాళకేతుడు, రాజ నందనుడు చెప్పిన మాటలను వినిన పిమ్మట నదీ జలమందు మునిగెను.
అరక్షత్సోపి తస్యైవ మాయా విహిత మాశ్రమమ్ గత్వా జలాశయా త్తస్మా త్తాలకేతుశ్చ తత్పురమ్ మదాల సాయాః ప్రత్యక్ష మన్యేషాం చైత దుక్తవా వీరః కువలయాశ్వో సౌ మామా శ్రమ సమీపతః కేనాపి దుష్ట దైత్యేన కుర్వ రక్షాం తపస్వినామ్ యుధ్యమానో యథాశక్తి నిఘ్నన్ బ్రహ్మ ద్విషో యుధి మాయా మా శిత్య పాపేన భిన్నః శూలేన వక్షసి వ్రి యమాణేన తేనేదం దత్తం మే కంఠ భూషణమ్ ప్రాపితశ్చాగ్ని సంయోగం తరు వేశ్మసు తాపసైః కృతార్త హేషా శబ్దో వై త్రస్తః సాశ్రువిలోచనః
ఆ రాజనందను డతని మాయారచిత మగు నాశ్రమమును రక్షించు చుండెను. తాలకేతు డచ్చటి జలాశయమున మునిగి యచ్చటి నుండి బయలుదేరి శత్రజిత్తు యొక్క నగరమునకు వచ్చెను. ఆ రాక్షసుడు మదాలస సమీపమునకు వచ్చెను. అచ్చట యనేక మంది యితర జనులు గూడ నుండిరి. వారందరి సమక్షమున వారితో వీరుడగు కువలయాశ్వుడు నా యాశ్రమ సమీపమున చంపబడెనని యనెను. కువలయాశ్వుడు బ్రహ్మ ద్వేషులగు రాక్షసులతో యధా శక్తి పోరాడుచు తాపస జన రక్షణ జేయుచుండ నొక రాక్షసుడు జంపెను. పాపియగు నా రాక్షసుడు మాయ నాశ్రయించి కువలయాశ్వుని శూలముతో వక్ష స్థలమున బొడిచెను. కువలయాశ్వుడు మరణించు చున్న సమయమున నీ కంఠ భూషణమును నాకిచ్చెను. అచ్చటి తాపస జనులు, నేను కలసి యాతని శరీరమును దహించితిమి. కువలయాశ్వుడు చనిపోవు నపుడు కన్నీటి జలములు గలవాడై భయము జెంది ఆర్తనాదము జేసెను.
నీతః సోశ్వశ్చ తేనైన దానవేన దురాత్మనా ఏతన్మయా నృశంసేన దృష్టం దుష్కృత కారిణా యదత్రానంతరం కృత్యం కురుష్వోత్తర కాలికమ్ హృదయా శ్వాసనం చైతత్ గృహ్యతాం కంఠ భూషణమ్ నాస్మాకం హి సువర్ణేన కృత్య మస్తి తపస్వినామ్ ఇత్యుక్త్వో త్స్యజ్య తద్భూమౌ స జగామ యథాగతమ్ నిపపాత జన స్సోథ శోకార్తో మూర్చయా తురః క్షణేన చేతనాం ప్రాప్య సర్వా స్తా నృప యోషితః రాజపత్న్యశ్చ రాజా చ విలేపు రాతి దుఃఖితాః మదాలసా తు తద్ధ్రుష్ట్వా తదీయం కంఠ భూషణమ్
ఆ గుఱ్ఱమును గూడ నా దురాత్ముడగు దానవుడు తీసికొని బోయెను. దుష్కృత కారియగు నా పాపాత్ముడు చేసిన ఘాతుక కృత్యమును నేను చూచితిని. ఇప్పుడు మీరు చేయదగిన యుపకర్మలు చేయుడు. మీ హృదయ శాంతికై ఈ కంఠ భూషణమును తీసికొనుడు. మేము తపస్వులము కదా! మాకు సువర్ణముతో పని ఏమున్నది? ఇట్లు చెప్పి యా కంఠ భూషణములను భూమి యందుంచి యచ్చట నుండి వచ్చిన దారినే పోయెను. అనంతర మచ్చటి జనములు శోకార్తులై మూర్చలో మునిగిరి. ఆ రాజ స్త్రీలందరు కొంత సేపటికి మూర్చ దేరిరి. రాజు, రాజ భార్యలు, మహా దుఃఖముతో విలపించ సాగిరి. మదాలస భర్త యొక్క కంఠ భూషణమును జూచి దుఃఖించెను.
తత్యాజ సుప్రియాన్ ప్రాణాన్ శ్రుత్వా వినిహతం ప్రియమ్ తతః పురే మహాక్రందః పౌరాణాం భవనే ష్వభూత్ యథైవ తస్య నృపతేః స్వగృహే సమర్తత రాజా చ తాం మృతాం దృష్ట్వా వినా భర్త్రా మదాలసామ్ ప్రత్యువాచ జనం సర్వం విమృశ్య స్వస్థమానసః న రోదిపత్యం పశ్యామి భవతా మాత్మన స్తథా సర్వేషామేవ సంచిత్య సంబంధానా మనిత్యతామ్ కిన్ను శోచామి తనయం కిన్ను శోచామ్యహం స్నుషామ్ విమృశ్య కృతకృత్యత్వా న్మంయే శోచ్యా వుభావపి మచ్చుశ్రూషు ర్మద్వాచనా ద్ద్విజ రక్షణ తత్పరః
తరువాత భర్త మరణ వార్త వినిన మదాలస వెంటనే ప్రియములైన ప్రాణములను వదిలెను. అప్పుడు రాజ భవన మందాక్రందన ధ్వని బయలు వెడలెను. అటులనే పట్టణమందు, పౌర గృహములందు రోదన ధ్వనులు వినిపించు చుండెను. అనంతరము శత్రుజిన్మహారాజు దుఃఖితుడై, వారందరి దుఃఖమును గూడ జూచెను. ఇంతియే గాక మదాలస భర్తృ వియోగాముచే ప్రాణ త్యాగము జేయుట జూచెను. రాజు దుఃఖముతో నిండియున్న తన మనస్సును విమర్శించు కొని స్థిమితము జేసుకొని సమీప మందున్న జనులతో, దుఃఖించకుడు, మీకు గాని నాకు గాని విమర్శించగా దుఃఖించ వలసిన యవసరము లేదని యనెను మరియు నిట్లనియె. విచారించగా దారా పుత్రాది సంబంధము లన్నియు నిత్యములు గావు గదా! అందుచే కుమారుని గురించి విచారించినను కోడలి గురించి విచారించినను ప్రయోజన మేముండును? బాగుగా నాలోచించిన వీరిద్దరూ కూడా సత్కర్మలు జేసి మరణించిరి గాన విచారించ నక్కర లేదు. నా కుమారుడు పిత్రాజ్ఞా పాలనము జేసెను. ద్విజ రక్షణ జేసెను.
ప్రాప్తో మేధ్య సుతో మృత్యుం కథం శోచ్యః స ధీమతామ్ అవశ్యం యాతి యద్దేహం తద్ద్విజానాం కృతే యది మమ పుత్రేణ సంత్యక్తం నన్వభ్యుదయకారి తత్ ఇయం చ సత్కులోత్పన్నా భర్తర్యేవ మనువ్రతా కథం తు శోభ్యా నారీణా భర్తు రస్య న్నదైవతమ్ అస్మాకం బాంధవానాం చ తథా న్యేషాం దయావతామ్ శోబ్యా హ్యేషా భావే దేపం యది భర్త్రా వియోగినీ యాతు భర్తృ వధం శ్రుత్వా తత్ క్షణాచాదేవ భామినీ భర్తార మసుయా తేయం న శోచ్యాతో విపశ్చితామ్ తాః శోచ్యా యావి యోగిన్యః సహ భర్త్రా కులాంగనాః
నా సుతుని శరీరము ముఖ్యముగా బ్రాహ్మణ రక్షణ కొరకే బలియైనచో, బుద్దిమంతు లగువారికి (చనిపోయిన నా కుమారుని గురించి) విచారింప వలసిన పని ఏమున్నది? గావున నా పుత్రుడు శరీర త్యాగము జేయుట యభ్యుదయ కాకియై యున్నది. ఈ కోడలయితే సత్కుల మందు బుట్టినది. భర్తతో అనుగమనము జేసినది. స్త్రీలకు భర్త కన్న వేరే దైవము గానరాదు. పతి దేవుని యనుసరించి పోయినందున యామెను గురించియు విచారింప వలసిన పనిలేదు. మాకు గాని మా బంధువులకు గాని దయావంతులైన యన్య మానవులకు గాని, పతి వియోగము జెందిన పిమ్మట జీవించి యుండిన యడల విచారింప వలసిన స్థితి ఏర్పడి యుండెడిది. అట్లు గాక పతి మరణ వార్త వినిన తత్క్షణమే ప్రాణ త్యాగము జేసినది. గావున పండితులగు వారికి భర్త ననుసరించి పోయిన ఈమెను గురించి దుఃఖింపవలసిన యవసరము లేదు. ఈమెకు భర్త వియోగము లేదు. భర్త వియోగము బొందియు జీవించి యున్నచో నట్టి కుల స్త్రీల జూచి మాత్రము విచారింప వలసి యున్నది.
కష్ట భ్రాంత్యా న గచ్చంతి గష్టదాః స్యుః కులాత్మనో భర్తు ర్వియోగ స్త్వనయా నాను భూతః కృతజ్ఞయా దాతారం సర్వ సౌఖ్యానా మిహ చాముత్ర చోభయోః లోకయోః కా హి భర్తారం నారీ మన్యేత మానుషమ్ న స శోచ్యో న చైవేహ నాయం తజ్జననీ న చ త్యజతా బ్రాహ్మణా ర్థాయ ప్రాణాన్ సర్వే సమ తారితాః విప్రాణాం మమ ధర్మస్య గతః స మహామతిః ఆనృన్య మర్ధ భుక్తస్య త్యాగా ద్దేహస్య మే సుతః మాతుః సతీత్వం మద్వంశ వైమల్యం శౌర్య మాత్మనః సంగ్రామే సంత్యజన్ ప్రాణాన్ సో వింద ద్ద్విజ రక్షణాత్
కొందరు కులస్త్రీలు కష్టమనుకొని భ్రాంతులై ప్రాణ నాథునితో బాటు ప్రాణ త్యాగము జేయరు గాని యట్టివారు తమకు తమ వంశము వారికి దుఃఖము కలుగ జేయుదురు. ఈ మదాలస కృతజ్ఞురాల గుటచే భర్తృ వియోగ దుఃఖానుభవము పొందలేదు. ఇహలోక పరలోకముల రెండింటి యందును సమస్త సుఖముల నిచ్చు భర్తను ఏ స్త్రీ యైనను మానవ మాత్రునిగా నెట్లు భావించును? నేను గాని, నా భార్య గాని, నా కుమారుడు గాని, నా కుమారుని భార్యగాని, నల్వురము విచారింప దగిన వారము గాము. కారణమేమన బ్రాహ్మణ రక్షణార్థమై నా కుమారుడు ప్రాణములు త్యజించుటచే మేము నల్వురము తరించిన వారమైతిమి. మహా బుద్ధియగు నా పుత్రుడు అర్థ భుక్తమగు దేహమును త్యాగము జేసినందున బ్రాహ్మణుల యొక్కయు, నా యొక్కయు మరియు ధర్మదేవత యొక్కయు ఋణము దీర్చుకొనెను. నా సుతుడు ద్విజ రక్షణ నిమిత్తమై సంగ్రామమున ప్రాణ త్యాగము జేయుటచే తన తల్లి యొక్క సతీత్వమును నా యొక్క వంశ నిర్మలత్వమును తన యొక్క శూరత్వమును, వీటి నన్నిటిని నిజమైనవని ధృవ పరచెను.
తతః కువలయాశ్వస్య మాతా భర్తు రనంతరమ్ శ్రుత్వా పుత్రవధం తాదృక్ ప్రాహ హృష్టా తు తపతిమ్ న మే మాత్రానమే స్వస్రా ప్రాప్తా ప్రీతి నృపే ద్రుశీ శ్రుత్వా ముని పరిత్రాణే హతం పుత్రం యదా మయా శోచతాం బ్రహ్మణానాం ఏ నిః స్వనేనా తి దుః ఖితాః మ్రియంతే వ్యాదినా క్లిష్టా స్తేషాం మాతా వృథా ప్రజా సంగ్రామే యుధ్యమానా ఏ భీతా గో ద్విజ రక్షణే క్షుణ్ణాః శస్త్రై ర్విపద్యంతే త ఏవ భువి మానవాః అర్థినాం మిత్ర వర్గస్య విద్విషాం చ పరాజ్ము ఖః యో న యాతి పితాతేన పుత్రీ మాతా చ వీరసూః
పిమ్మట కువలయాశ్వుని తల్లి పుత్ర వధను విని తన భర్త యనిన మాటలను విని, తాను గూడ సంతోషము చెందినదై భర్తతో సమానముగా నిట్లు పలికెను. రాజా! ముని జనరక్షణ చేయు సత్కార్యములో పుత్రుడు చనిపోయినా డను మాటలను విని నేను ఆనందమును చెందితిని. ఇట్టి సంతోషము నా తల్లి వలన గాని నా సోదరి వలన గాని లేదు. బంధు గణములు దుఃఖించు చుండ ఆయాస పడుతూ వ్యాధి పీడితుడై చనిపోయిన వాడు విచారింప దగిన వాడు. అట్టివాడు తల్లికి వ్యర్థ సంతానము. గో బ్రాహ్మణుల రక్షణ యందు, యుద్దమందు నిర్భయ చిత్తముతో యుద్ధము జేసి శస్త్రములచే చని పోయిన వారు మానవులు అని అనిపించు కొందురు. యాచకులకు మిత్ర వర్గములకు శత్రువులకు వెనుకకు తిరుగని వాడు ఎవడయి యుండునో అట్టి వాడిని కన్నవాడు తండ్రి అనిపించు కొనును. వాడే పుత్రవంతుడు. వాని తల్లి వీరమాత యగును. ఆమెయే పుత్రవతి.
గర్భక్లేశః స్త్రియో మన్యే సాఫల్యం భజతే తదా యదారి విజయీ వా సంగ్రామే వా హత స్సుతః
ఏ కుమారుడు రణమందు చని పోవునో, లేక శత్రువును జయించి మరలి వచ్చునో, అట్టి కుమారుని కష్టపడి కనినందుకు ఆ తల్లి యొక్క గర్భ క్లేశము సఫల మగుచున్నది.
నాగపుత్రులు:
తతః స రాజా సంస్కారం పుత్రా పత్నీ మభయత్ నిర్గమ్య చ బహిః స్నాతో దదౌ పుత్రాయ చోదకమ్ తాలకేతుశ్చ నిర్గమ్య తథైవ యమునా జలాత్ రాజపుత్ర మువాచేదం ప్రణయా న్మధురం వచః గచ్చ భూపాల పుత్రః త్వం కృతార్థో హంకృత స్త్వయా వాంచితం తు కృతం కార్యం త్వయత్రా విచలే స్థితే వారుణం యజ్ఞ కార్యం చ జలేశస్య మహాత్మనః తన్మయా సాధికం సర్వం యన్మమాసీ దభీప్సి తమ్ ప్రణిపత్య స తం ప్రాగా ద్రాజపుత్రః పురం పితుః సమారుహ్య తమేవాశ్వం సుపర్ణానిల విక్రమమ్
నాగ పుత్రులు:
పిమ్మట రాజు, కుమారునికి, కోడలికి సంస్కారములు చేసెను. నగర బాహ్య ప్రదేశమునకు పోయి అచ్చటి జలముల స్నానము చేసి వారిద్దరికీ జల తర్పణాదులు చేసెను. ఇచ్చట దానవాధముడగు తాలకేతుడు ఆ ప్రకారముగా జలము నుండి బైటకి వచ్చి ప్రేమ యున్నట్లుగా మధుర వచనములతో రాజ పుత్రునితో నిట్లు పలుక జొచ్చెను. ఓ రాజకుమారా! నీ వలన నేను కృతార్థుడ నైతిని. నీవు నాయీ స్థానమందు స్థిరముగా నుండి నా యాశ్రమమును రక్షించుట వలన నా మనోభీష్టమును నెరవేర్చితివి. ఈ కారణముచే మహాత్ముడు జలాధిపతి యగు వరుణదేవుని యజ్ఞ కర్మయు పూర్తి యైనది. నా వాంచితము సిద్ధించినది. గాన రాజపుత్ర! ఇక నీవు వెళ్ళుము. తరువాత నా రాజపుత్రుడు మాయా మునికి నమస్కరించి గరుడానిల సమాన వేగముగల యశ్వము నధిష్టించి తన తండ్రి గారి పట్టణమునకు పోయెను.
Summary of chapter 20 of the Mārkandeya Mahā Purana is as follows:
The heroic history of Prince Kuvalayāshva, also named Ritadhvaja, unfolds as he defends holy hermits from the harassments of demonic forces. Riding his celestial steed Kuvalaya gifted by a divine sage, the prince descended into subterranean realms to combat the demon Pātālaketu. His valiant protection of Vedic sacrifices earned him universal praise and the gratitude of the hermit sages.