55 - భారతీయ కూర్మ నివేశము

క్రౌష్టుకి:

భగవన్కథితం సమ్యగ్భవతా భారతం మమ

సరితః సర్వతా దేశా యే చ తత్ర వాసంతి వై

కిం తు కూర్మస్త్వయా పూర్వం భారతే భగవాన్హరిః

కథిత స్తస్య సంస్థానం శ్రోతు మిచ్చామ్య శేషతః

కథం స సంస్థితో దేవః కూర్మరూపీ జనార్దనః

శుభా శుభం మనుష్యాణాం వ్యజ్యతే చతతః కథమ్

యథా ముఖం యథా పాదా స్తస్య తద్బ్రూహ్య శేషతః

క్రౌష్టికి:

ఓ భగవానుడా! నాకు భారత వర్షము గురించి చక్కగా వివరించి చెప్పితిరి. మరియు ఆ భారత మందలి ఏ నదులు, పర్వతములు, దేశములు, అందు ఎవరెవరు నివసించుదురో అవన్నియు వర్ణించితిరి. కాని తమరు ముందుగా చెప్పితిరి, భారత వర్షము నందు భగవంతుడైన హరి కూర్మ రూపముతో నివసించెనని. అతని స్థితి ఏ విధముగా నుండెడిది? అదంతయు చక్కగా వినవలెనని కోరికగా యున్నది. ఆ దేవ దేవుడు, జనార్ధనుడు ఏ విధముగా కూర్మ రూపము నందు నివసించెను? మరియు వాని ద్వారా మనుషుల యొక్క శుభా శుభములు ఏ విధముగా ప్రకాశించెను? హే భగవాన్! అతని ముఖము, పాదములు ఎట్లుండేడివి? ఆ కథ నంతయు చక్కగా వర్ణింపుడు.

మార్కండేయుడు:

ప్రాజ్ ముఖో భగవాన్దేవః కూర్మరూపీ వ్యవస్థితః

ఆక్రమ్య భారతం వర్షం నవభేదమిదం ద్విజః

నవధా సంస్థితేన్యస్య నక్షత్రాణి సమంత తః

విషయాశ్చ ద్విజశ్రేష్టః యే సమ్యక్తాన్ని భోధమే

మార్కండేయుడు:

హే భగవాన్! ఆ దేవ భగవానుడు కూర్మ రూపమును ధరించి ఈ నవధాషిన్నమగు అనగా నవ ఖండములలో విభజింప బడిన భరత వర్షమును ఆక్రమించుచూ తూర్పు ముఖముగా నివసించెను. నక్షత్రములు మరియు అన్నీ విషయములు కూడా నవ భాగము లందు విభజన పొంది ఆతనికి నాలుగు వైపులా నివసించెను. ఓ ద్విజవరా! ఆ వివరములు జాగ్రత్తగా వినుము.

వేది మద్రా రిమాండవ్యాః శాల్వానీసా స్తథా శకాః

ఉజ్జిహానా స్తథా వత్సః ఘోష సంఖ్యా స్తథా ఖసాః

మధ్యే సారస్వతా మత్స్యా శూరసేనాః సమాథురాః

ధర్మారణ్యా జ్యోతిషికా గౌరగ్రీవా గుదాశ్మకాః

వైదేహాకాః సపాంచాలాః సంకేతాః కంకమారుతాః

కాలకోటి సపాషండాః పారియాత్ర నివాసినః

కాపింజలాః కురోర్భాహ్యా స్తథైవో దుంబరా జనాః

గజా హ్వయాశ్చ కూర్మస్య జనా మధ్య నివాసినః

కృత్తికారోహిణీ సౌమ్యా ఏతేషాం మధ్యవాసినమ్

నక్షత్ర త్రితయం విప్ర శుభాశుభ విపాకదమ్

వేది, ముద్ర, అరి మాండవ్య శాల్వ, నీప, శక, ఉజ్జిహాన, ఘోష సంఖ్య, ఖస, సారస్వత, మత్స్య, శూరసేన మాథుర, ధర్మారణ్య, జ్యోతిషిక, గౌరిగ్రీవ, గుడాశ్మక, వైదేహక, పాంచాల, సంకేత, కంక మారుత, కాలకోటి, పాఖండులు, పారియాత్ర నివాసులు, కాంపిజల, కురుబాహ్య, ఉదుంబర, గజాహ్వ అను పేరు గల ఈ దేశము లన్నియు కూర్మము యొక్క మధ్య స్థల మందు నివసించును. కృత్తికా, రోహిణీ, మృగశిర ఈ మూడు నక్షత్రములు ఆ మధ్య భాగము నందలి మనుష్యులకు శుభా శుభ సూచనలు తెలియ జేయును.

పృషధ్వజోం జనశ్చైవ జమ్బ్వాఖ్యోమానవాచలః

శూర్పకర్ణో వ్యాఘ్రముఖో ముర్వరః కర్వలూశనః

తథా చంద్రేశ్వరాశ్చైవ ఖశాశ్చ మగధా స్తథా

శిబయో మైథిలాః శుభ్రా స్తథా వదన దంతురాః

ప్రాగ్జ్యోతతిషా సలౌహిత్యాః సాము దాః పురుషాదకాః

పూర్ణోత్కటో భద్రగౌర స్తథో దయగిరిర్ద్విజ!

కాశయో మేఖలా ముష్టా స్తామ్రాలిప్తై పాదపాః

వర్థమానా కోశాలాశ్చ ముఖే కూర్మ స్య సంస్థితాః

రౌద్రం మునర్వ సుఃపుష్యో నక్షత్ర త్రితయం ముఖే

పాదే తద్దక్షిణే దేశాః క్రౌష్టుకే వదతః శృణు

వృషధ్వజ, అంజన, జంబు, మానవాచల, శూర్పకర్ణ, వ్యాఘ్రముఖ, ముర్వర, కర్వటాశన, చంద్రేశ్వర, ఖశ, మగధ, శని, మిథిల, శుభ్ర, వదన దంతుర, సమస్త పర్వతములు గల పాగ్జ్యోతిష, సాముద్రక, పురుషాదక, పూర్ణోత్కట, భద్రగౌర, ఉదయాచల, కాశయ, మేఖల, ముష్ట, తామ్రలిప్త, ఏకపాదప, వర్ధమాన, కోశలములు, ఇవన్నియు కూర్మ రూపుడగు భగవానుని యొక్క ముఖము నందు ఉన్నవి. ఆర్ద్రా, పునర్వసు, పుష్యమీ ఈ మూడు నక్షత్రములు కూడ ముఖము నందు ఉండును.. వానికి దక్షిణ పదమందు ఏ దేశము లున్నవో ఓ క్రౌష్టుకి! వానిని వర్ణించెదను వినుము.

కళింగ వంగ జఠరాః కోశలా ముషికా స్తథా

చేదయశ్చోర్థ్వ కర్ణాశ్చ మత్స్యాంద్రా వింధ్యవాసినః

విదర్భా నారికేలాశ్చ ధర్మ ద్వీపా స్తథైలికాః

వ్యాఘ్రగ్రీవా మహాగ్రీవా స్త్రైపురాఃశ్మ శ్రుధారిణః

కైష్కింద్యా హైమకూటశ్చ నిషధాః కటక స్థలాః

దశార్ణా, హారేకా నాగనా నిషదాః కాకులా కాః

తథైవ పర్ణశబరాః పాడే వై పూర్వ దక్షిణే

ఆశ్లేషర్క్షం తథా పైత్య్రం పాల్గున్యః ప్రథమ స్తథా

నక్షత్ర త్రితయం పాద మాశ్రితం పూర్వ దక్షిణమ్

లంకా కాలాజినాశ్చైవ శ్చైవ శైలికా వికటా స్తథా

మహేంద్ర మలయాద్రౌ చ దర్దురే చ వసంతియే

కర్కోటకవనే యే చ భృగుకచ్చా స్సకొంకణాః

సర్వాశ్చైవ తథా భీరా వేణ్యాస్తీర నివాసినః

అవంతయో దాస పురా స్తథైవా కారిణో జనాః

మహారాష్ట్రాస్స కర్ణాటా గోనర్దాశ్చిత్ర కూటకాః

చోలాః కౌలగిరాశ్చైప క్రౌంచ ద్వీప జటాధరాః

కావేరీ ఋష్యమూకస్థా నాసిక్యాశ్చైవ యే జనాః

శంఖ శుక్త్యాది వై దూర్య శైల ప్రాంత చరాశ్చయే

తథా వారిచరా కోలాశ్చర్మ పట్ట నివాసినః

గణ బాహ్యాః పరాకృష్ణా ద్వీపవాస నివాసినః

సూర్యాద్రౌ కుముదాద్రౌ చ తే వసన్తి తథా జనాః

రౌద్ర స్వనాస్సపిశికా స్తథయే కర్మ నాయకాః

దక్షిణాః కౌరుషాయే చ ఋషికాస్తా పసాశ్రమాః

ఋషభాః సింహళాశ్చైవ తథా కాంచీ నివాసినః

త్రిలంగాః కుంజర దరీకచ్చ వాసాశ్చ యేజనాః

తామ్రపర్ణీ తథా కుక్షి రితి కూర్మస్య దక్షిణః

కళింగ, వంగ, జఠర, కోశల, మూషిక, చేది, ఊర్ధ్వకర్ణ, మత్స్య, ఆంధ్ర మొదలగు దేశములు వింధ్య పర్వతములకు సమీపమున ఉన్నవి. మరియు విదర్భ, నారికేఫ, ధర్మద్వీప, ఐలిక, వ్యాఘ్రగ్రీవ, మహాగ్రీవ, త్రైపుర, శ్మశ్రుధారీ, కైష్కింధ, హైమకూట, నిషధ, కటకస్థల, దశార్ణహారిక, నగ్న నిషధ, కాకులాలక దేశములు మరియు పర్ణ, శబర ఇత్యాది సమస్త దేశములు మరియు ఆశ్లేష, మఘా పూర్వా ఫాల్గునీ నక్షత్రములు. ఈ మూడు నక్షక్రాములు అతనికి తూర్పు దక్షిణ పాద మందు నివసించును. లంక, కాలాజిన, శైలిక, నికట, మహేంద్ర, మలయా, దద్దుర పర్వతస్థములగు సమస్త జనపదాలు, కర్కటక వనస్థిత మగు సంపూర్ణ దేశములు, భృగుకచ్చ, కొంకణ, ఆభీర, వేణ్యా నదుల తీరమందు ఉన్న అన్ని దేశములు. అవంతి, దాశపుర, ఆకారీ, మహారాష్ట్ర, కర్నాట, గోనర్ద, చిత్రకూట, చోళ, కొలగిరి, కౌశ్చ ద్వీప, జటాధర, కావేరీ, ఋష్వమూకము నందు స్థితమగు నాసిక యందలి సంపూర్ణ దేశములు. శంఖ శుక్తి ఇత్యాది వైదూర్య శైలములు సమీపమున నున్న వారిచర, కోలచర్మపట్ట, గణబాహ్య, కృష్ణా ద్వీపాదుల యందు నివాసులగు మనుష్యులు, సూర్యాద్రి, కుముదాద్రి ఈ రెండు పర్వతముల యందు నివసించు మానవులు మరియు రౌద్ర శబ్దము గల పశిక, కర్మ నాయక, దక్షిణ కౌరుషా, ఋషికా తాపసాశ్రమ, ఋషభ, సింహళ, కాంచీ నివాసులు త్రిలంగ, కుంజర, దరీ, కచ్చస్థిత మగు మనుష్యులు మరియు తామ్ర పర్ణీ ఇవన్నియు కూర్మము యొక్క దక్షిణ కుక్షి యందు స్థిరములై ఉన్నవి.

ఫాల్గున్యశ్చోత్తరాహ స్తశ్చిత్రా చర్క్షత్రయం ద్విజ

కూర్మస్య దక్షిణే కుక్షౌ బాహ్యపాద స్తథా పరమ్

కాంబోజాః పహ్లవాశ్చైవ తథైవ వడవా ముఖాః

తథా చ సింధు సౌవీరాః సానర్తా వనితా ముఖాః

ద్రావణాస్సార్గిగాః సూద్రాః కర్ణ ప్రాఘేయ బర్బరాః

కిరాతాః పారదాః పాండ్యా స్తథా పారశవాః కలాః

ధూర్తకాః హైమగిరికా స్సిందు కాల కవైరతాః

సౌరాష్ట్రా దరతాశ్చైవ ద్రావిడాశ్చ మహార్ణవాః

ఏతే జనపదః పాదే స్థితా వై దక్షిణే పరే

స్వాత్యో విశాఖా మైత్రం చ నక్షత్ర త్రయ మేవ చ

ఉత్తరా పాల్గుణ, హస్త, చిత్ర ఈ మూడు నక్షత్రములు కూర్మమునకు దక్షిణ మందు విరాజిల్లు చున్నవి. బాహ్యపాడ, కాంబోజ, పహ్లవ, వడవాముఖ,సింధు, సౌవీర, అనర్త వనితాముఖ, ద్రావణ, సార్గిగ, శూద్ర కర్ణ, ప్రాఘేయ, బర్బర, కిరాత పారద, పాండ్య పారశవ, కళ, థూర్తక, హైమగిరిక, సింధు, కాలక, వైరత, సౌరాష్ట్ర, దరద, ద్రావిడ మరియు మహార్ణవములు ఈ సంపూర్ణ జనపదాలు. కూర్మము యొక్క దక్షిణ పదమందు నివశించును. స్వాతి, విశాఖ, అనూరాధ ఈ మూడు నక్షత్రములు ఈ దేశమునకు శుభాశుభ సూచనలు తెలియ చేయును.

మణిమేఘ క్షురాద్రిశ్చ ఖంజయో స్తగిరి స్తథా

అపరాంతికానోహ్యశ్చ శాంతికా విప్రశ స్తకాః

కొంకణాః పంచ నదకా వామనా హ్యవరా స్తథా

తారక్షురాః హ్యంగతకాః శర్కరాః శాల్మవేశ్మకాః

గురుశ్వరాః పాల్గునకా వేణుమత్యాం చ ఏ జనాః

తథా పల్గులుకా ఘోరా గురుహాశ్చ కలా స్తథా

ఎకేక్షణా వాజికేశా దీర్ఘ గ్రీవా స్సచూలికాః

ఆశ్వకేశా న్తథా పుచ్చే జనాః కూర్మశ్య సంస్థితాః

ఐంద్రం మూలం తథాషాడా నక్షత్ర త్రయమేవ చ

మాండవ్యాశ్చండ ఖారాశ్చ ఆశ్వకాల నథా స్తథా

కుశాత్తా లడహాశ్చైవ స్త్రీ బాహ్యా బాలికా స్తథా

నృసింహా వేణుమత్యాం చ బలావస్థా స్తథాపపే

ధర్మబద్దా స్తథో లూకా పురుకర్మ స్థితా జనాః

తథా పల్గులుకా ఘోరా ఘరలా హేమ తారకాః

ఏకే క్షణా వాజికోశా దీర్ఘ పాదా స్తథైవ చ

వామేపరే జనః పాదే స్థితాః కూర్మశ్య భాగురే

మణిమేఘ, క్షురాద్రి, ఖంజ, అస్తగిరి, అపరాంతిక, నోహ్య, శాంతిక, విప్రశస్తక, కొంకణ, పంచనద, వామన, అవర, తారక్షుర, అంగతక, శర్కర, శాల్మ వేశ్మక, గురుస్వర, పాల్గుణక, వేణుమతి, నివాసులు, ఫల్గులుక, గురుహా, చకల, ఒక నేత్రము గలవారు, వాజికేశములు గలవారు, పొడవైన మెడ కలవారు, చులిక, ఆశ్వకేశ ఈ సమస్త దేశ నివాసులు కూర్మము యొక్క తోక యందు నివసింతురు. జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ ఈ మూడు నక్షత్రములు కూడా కూర్మము యొక్క తోక యందు నివసించును. మాండవ్య, చండఖార, అశ్వ, కాలనద, కుశాత్త, లడహ, స్త్రీ బాహ్య, బాలిక, నృసింహ, వేణుమతీ నివాసులు, బలావస్థ ధర్మబద్ద, ఉలూక, ఉరుకర్మ స్థితమగు మనుష్యులు మరియు ఫల్గులుక, ఘోర, ఘరల, హీమతారక, ఏకేక్షణ, జాజికోశ, దీర్ఘపాద అను పేర్లు గల ఈ దేశము లన్నియు భగవంతుడగు కూర్మము యొక్క వామ పాదమందు స్థితములై ఉన్నవి.

ఆషాడ శ్రవణే శ్చైవ ధనిష్టా యాత్ర సంస్థితా

కైలాసో హిమవాం శ్చైవ థనుష్మాన్వ సుమాం స్తథా

క్రౌంచాః కురుబకాశ్చైవ క్షుద్ర వీణాశ్చయే జనాః

రసాలయా స్సకై కేయ భోగ ప్రస్థాస్స యామునాః

అంతర్ధ్వీ పాస్త్రి గర్తాశ్చ అగ్నీజ్యా స్సార్ధనా జనాః

తథైవ స్వముఖాః ప్రాప్తా శ్చిబిడాః కేశధారిణః

దాసే రౌవాట ధానాః శవధానాస్త థైవ చ

పుష్కలాధమ కైరాటా స్తథా తక్షశిలా శ్రయాః

ఆంబష్టా మాలవా మద్రా వేణుకా స్సవదం తికాః

పింగళా గాన కలహా హూణాః కోహలకా స్తథా

మాండవ్యా భూతి యువకాః శాతకా హేమ తారకాః

యశో మత్యాహాః సగాంధారాః ఖరసా గరరశ యః

యౌధేయా దాసమేయాశ్చ రాజన్యాః స్యామకా స్తథా

క్షేమ ధూతాశ్చ కూర్మస్య వామకుక్షి ముపాశ్రితాః

ఉత్తరాషాడ, శ్రావణ, ధనిష్ఠ ఈ మూడు నక్షత్రములు కూడా ఆస్థానము నందే వున్నవి. కైలాసము, హిమాలయ ధనుష్మాన్, వసుమాన, క్రౌంచ, కురుబక, క్షుద్రవీణ, రసాలయ, కైకయ భోగప్రస్థ, యామున, అంతర్ద్వీప, త్రిగర్త, ఆగ్నీజ్య, అర్ధాన, ఆశ్వముఖ, ప్రాప్త, చిబిడ, కేశధారి, దాసేరక, వాటధాన, శవధాన, పుష్కల, అధమ, కైరాత, తక్షశిల, అంబాష్ట, మాళవ, మద్రా, వేణుక, వదంతిక, పింగళ, గానకలహ, హూణ,కోహలక, మాండవ్య, భూతియువక, శాతక, హేమతారక, యశోమత్య, గాంధార, ఖరస, గరరాశి, యౌధేయ, దాసమేయ, రాజన్య, స్యామక, క్షేమధూర్త అను పేర్లు గల ఈ దేశము లన్నియు కూర్మ రూపియగు భగవంతునికి వామ కుక్షి యందు వసించును.

వారుణం చా త నక్షత్రం తద్వత్ప్రోష్ట పదాద్వయమ్

యేన కిన్నర రాజ్యం చ పశుపాలం సకీచకమ్

కాశ్మీరకం తథా రాష్ట్ర మభిసార జన స్తథా

దసదాస్త్వం గణాశ్చైవ కులటా వన రాష్ట్రకాః

సైరిష్టా బ్రహ్మపురకా స్తథైవ వనబాహ్యకాః

కిరాత కౌశికా నందా జనాః పహ్లవ లోలనాః

దార్వా దామరకాశ్చైవ కురుటాశ్చాన్న దారకాః

ఏకపాదాః ఖాశా ఘోషాః స్వర్గభౌమాన వద్యకాః

తథా సయవనా హింగా శ్చీర ప్రావరణాశ్చయే

త్రినేత్రాః పౌరవాశ్చైవ గంధర్వాశ్చ ద్విజోత్తమ

పూర్వోత్తరంతు కూర్మస్య పాదమేతే సమాశ్రితాః

రేవత్యశ్చా స్విదైవత్యం యామ్యం చ ర్క్షమితిత్రయమ్

తత్రపాదే సమాఖ్యాతాం పాకాయ మునిసత్తమ

దేశేష్వేతేషు చైతాని నక్షత్రాణ్ఎపి వై ద్విజ

ఏతత్పీడా అమీదేశాః పిజ్యంతే యేక్రమోదితః

యా తి చాభ్యుదయం విప్రగ్ర హై స్సమ్యగా వస్థితైః

శతభిషా, పూర్వాభాద్ర, ఉత్తరా భద్రలు అక్కడి వారికి శుభా శుభములు తెలియ జేయును. కిన్నెరా రాజ్య, పశుపాల, కీచక, కాశ్మీర, ఆభిసార జన, దరద, అంగణ, కులట, వనరాష్ట్రక, సైరిష్ఠ, బ్రహ్మపురక, వనవాహ్యక, కిరాత, కౌశిక, నంద, పహ్లవ, లోలన, దార్వ, దామరక, కుర్త, అన్నదారక, ఏకపాద, ఖశ, ఘోష, స్వర్గ, భౌమ, అనవద్య, యవన, హింగ చిరప్రావరణ, తినేత్ర, పౌరవ, గంధర్వ ఈ సమస్త దేశములు కూర్మము యొక్క తూర్పు ఉత్తరముల యందు ఉన్నవి. రేవతి, అశ్వని, భరణి ఈ మూడు నక్షత్రముల వలన పై దేశముల యొక్క శుభా శుభములు తెలియ బడును. ఓ ముని సత్తమా! ద్విజోత్తమా! ఏ విధముగా నేను ఎన్ని దేశములలో ఎన్ని నక్షత్రములు ఉన్నవో ఎంత మంది మనుష్యులు ఉన్నారో ఎన్ని పర్వతములు ఉన్నవని చెప్పితినో ఓ విప్ర! ఆ దేశముల యందు క్రమానుసారముగా ఆ నక్షత్రములు చెడిపోవుటచే మనుష్యులకు పీడలు కలుగును. మరియు ఆ గ్రహములు ఎప్పుడు శ్రేష్ఠమగు గ్రహములతో కలియు చుండునో అపుడు మానవులకు సుఖము కలుగును.

యస్యర్క్షస్య పతిర్యో వై గ్రహ స్తద్బావతో భయం

తద్దేశస్య మునిశ్రేష్ఠ తదుత్కర్షే శుభాగమః

ప్రత్యేకం దేశ సామాన్యం నక్షత్ర గ్రహ సంభవమ్

భయంలోకస్య భవతి శోభనం వా ద్విజోత్తమా

స్వర్క్షైరశోభ నైర్జ్యంతో స్సామాన్యమితి భీతిదం

గ్రహైర్బవతి పీడోత్థ సుల్పాయా స మశోభనం

తథైవ శోభనః పాకో దుఃస్థి తైశ్చ తథాగ్రహైః

అల్పోపకారాయ నృణాం దేశజ్జైరుదితో బుధైః

ద్రవ్యే గోష్టేథ భృత్యేషు సుహృత్సు తన యేషువా

భార్యాయాం చ గ్రహే దుఃస్థే భయం పుణ్యవతాం నృణా

ఓ ముని శ్రేష్ఠా! ఏ నక్షత్రములకు ఎవరు అధిపతిగా నుండునో, అతడు భ్రష్టుడగుటచే వాని సంబంధమగు దేశము లండలి పురుషులకు దుఃఖము లేక భయము కలుగును. మరియు అవి శ్రేష్ఠ స్థాన మందున్నచో మనుష్యులకు శుభము కలుగును. ఓ ద్విజోత్తమా! ప్రత్యేక దేశములకే కాక అక్కడి మనుష్యులకు కూడా నక్షత్రములు లేక గ్రహ జనితములగు భయములు గాని శుభములు గాని కలుగు చుండును. సంపూర్ణముగా మానవు లందరకును, సమస్త దేశములకును, నక్షత్రములకు తమ తమ స్థానములు చెడిన యెడల అత్యంత భయము, దుఃఖము కలుగును. మరియు గ్రహములు వక్రించిన యడల ఎట్టి భయము కలుగునో అట్టి గ్రహ పీడను బాపు కొనుటకు బుద్ధిమంతులగు జ్యోతిష గణాలు మనుష్యులకు జప, తపాలు, దానాలు చేయుటకు ఆదేశము లిచ్చుదురు. గ్రహములు వక్రించిన యెడల పుణ్యాత్ములకు కూడా ద్రవ్య, గోష్ఠ, భృత్య, హిత, పుత్రా, స్త్రీ, మొదలగు వాని సహితముగా పీడ గలుగును.

ఆత్మన్య థాల్ప పుణ్యానాం సర్వత్రైవాతి పాపినామ్

నైకత్రాపి హ్యపాపానాం భయమస్తి కదాచన

దిగ్దేశజన సామాన్యం నృపసామాన్య మాత్మజమ్

నక్షత్ర గ్రహ సామాన్యం నరో భుం క్తే శుభా శుభమ్

పరస్పరాభి రక్షా చ గ్రహదౌ స్థ్యేన జాయతే

ఏతేభ్య ఏవ విప్రేంద్ర శుభహాని స్తథా శుభైః

యదేత త్కూర్మ సంస్థానం నక్షత్రేషు మయోదితమ్

ఏతత్తు దేశ సామాన్య మశుభం శుభమేవ చ

తస్మా ద్విజ్ఞాయ దేశార్క్షం గ్రహపీడాం తథాత్మనః

కుర్వీత శాంతిం మేధావీ, లోకవాదాంశ్చ సత్తమ

అల్ప పుణ్యము గల మానవులకు తమ దేహము లందు పీడ కలుగును. పాపులకు సర్వత్ర గ్రహ పీడా భయము కలుగును. కాని పుణ్యాత్ములకు సామాన్యముగా ఏ స్థాన మందును భయము కలుగదు. దిక్కులు, దేశములు, ప్రజలు, పుత్రులు, సుఖ దుఃఖము మొదలగునవి మానవులకు గ్రహ నక్షత్రాల అనుకూల, ప్రతి కూలముల ననుసరించి శుభా, శుభ ఫలితములు ప్రాప్తించును. ఓ విప్రేంద్రా! గ్రహముల యొక్క స్థితి బాగుగా నున్నచో మనుష్యులకు సుఖము లభించును. గ్రహములకు దుఃఖ స్థితి కలిగినచో మానవులకు అశుభములు కలుగును. ఎట్టి నక్షత్ర సహితముగా నేను కూర్మ భగవానుని సంస్థానమును గురించి వర్ణించి చెప్పితినో అతడు అన్ని దేశము లందును శుభా శుభములను ఇచ్చు వాడై యున్నాడు. హే ద్విజోత్తమా! ఈ కారణముచే బుద్ధిమంతులగు మానవులు చేయ వలసిన దేమనగా దేశములకు నక్షత్ర గ్రహముల వలన కలిగిన పీడలను తెలుసుకొని వాటికి శాంతి జరుప వలెను.

ఆకాశాద్దేవ తానాం చ దైత్యాద్యీనాం చ దౌర్హృదాః

పృథ్వ్యాం పతంతి తేలోకే లోకవాదా ఇతి శ్రుతాః

తాం తథైవ బుధః కుర్యా ల్లోకవాదాన్న హాపయేత్

తేషాం తత్కారణాన్నృణాం యుక్తో దుష్టాగమక్షయః

శుభోదయం ప్రహాణిం చ పాపానాం ద్విజసత్తమ

ప్రజ్ఞాహానిం ప్రకుర్యుస్తే ద్రవ్యాదీనాం చ కుర్వతే

తస్మాచ్చాన్తి పరః స్రాజ్ఞో లోక వాడార తస్తథా

లోకవాదాంశ్చ శాంతీశ్చ గ్రహపీడాసు కారయేత్

అద్రోహామీప వాసాంశ్చ శస్తం దేవాది వందనమ్

జపోహోమ స్తథా దానం స్నానం క్రోధాది వర్జనమ్

ఆకాశములో దేవతల యొక్క, దైత్యుల యొక్క శత్రువులు ఎప్పుడు స్వర్గము నుండి పడుడురో, వారు లోక వాదులను పేరుతో విఖ్యాతి పొందిరి. అందు వలన బుద్ధిమంతులగు మానవులు గ్రహాలు, లోకవాదులు, వీరిద్దరికీ శాంతిని చేయవలెను. ఎందుచేత ననగా మానవులకు వీరు పడుటచే ఇక్కడ శుభా శుభము ప్రాప్తించును. ఓ ద్విజ సత్తమా! ఎప్పుడు ఈ గ్రహాదులు అనుకూలముగా నుండునో, అప్పుడు శుభములు కలుగును, పాపమునకు హాని కలుగును మరియు ఎప్పుడు ఈ గ్రహాదులు విపరీతముగా నుండునో అప్పుడు ద్రవ్యమునకు గాని, బుద్ధికి గాని హాని కలుగును. ఈ కారణముచే లోకవాద రతులగు పురుషులకు పీడ కలిగిన యెడల లోక వాదులకు, గ్రహాలకు శాంతి తప్పక చేయ వలెను. మరియు ఆ సమయ మందు ఎవరికీ ద్రోహము చేయరాదు. ఉపవాసము చేయ వలెను. శాంతిస్తోత్ర పాఠమును చదువ వలెను. మరియు జపము, హోమము, స్నానము, దానము చేయ వలెను. క్రోధాదులకు దూరముగా నుండ వలెను.

అద్రోహం సర్వభూతేషు మైత్రీ కుర్వాచ్య పండితః

వర్జయే దసతీంవా చ మతివాదాం స్తథైవ చ

గ్రహపూజాం చ కుర్వీత సర్వపీడాసు మానవః

ఏవం శామ్యంత్య శేషాణి థోరాణి ద్విజసత్తమ

ప్రయతానాం మనుష్యాణాం గ్రహార్క్షో త్తన్య శేషతః

ఏష కూర్మోమయాఖ్యాతో భారతే భగవాన్విభుః

నారాయణో హ్యచింత్యాత్మా యత్ర సర్వం ప్రతిష్టితమ్

అత్రదేవాః స్థితాః సర్వే ప్రతినక్షత్ర సంశ్రయాః

తథా మథ్యేహుతవహః పృథ్వీ సోమశ్చ వై ద్విజ

మేషాదయ స్త్రయోమధ్యే ముఖే ద్వౌ మిథునాదికౌ

సర్వ భూతములతో వైరము లేక యుండ వలెను. పండితుడై అందరితో మిత్రత్వము కలిగి యుండ వలెను. అసత్యము చెప్పరాదు. అధికమగు వివాదములు చేయరాదు. ఓ ద్విజ సత్తమా! అన్ని పీడల యందును మానవులు గ్రహాలను పూజించుట ఉచితము ఎందు వలన ననగా ఈ విధముగా శాంతి, పూజలు చేయుట వలన ఘోరమగు పీడలన్నియు దూరమై పోవును. మరియు ఏ పురుషుడు పవిత్రుడై యుండునో, అట్టి వానికి కూడా గ్రహముల వలన శుభాశుభ ఫలితములు ప్రాప్తించును. ఈ విధముగా భరత వర్షము నందు ఈ కూర్మ రూపుడగు భగవానుడు వెలుగొందినాడు. ఆ వృత్తాంత మంతయు నేను నీకు వర్ణించి చెప్పితిని. ఈ నారాయణుడగు కూర్మము అచింత్యాత్మ గలవాడు. ఈతని యందు సమస్త దేవతలు, నక్షత్రముల యొక్క ఆశ్రయముతో నివసించుదురు. ఆతనికి మధ్య భాగ మందు అగ్ని, పృథ్వి, చంద్రుడు ఉండును. మేషాది మూడు రాశులు వాని మధ్య భాగ మందు నిలిచి యుండును. మిథునాది రెండు రాశులు వాని ముఖము నందుండును.

ప్రాగ్దక్షిణే తథాపాదే కర్కి సింహో వ్యవస్థితౌ

సింహ కన్యా తులాశ్చైవ కుక్షౌరాశి త్రయం స్థితమ్

తులాథ వృశ్చికశ్చోభౌ పాదే దక్షిణ పశ్చిమే

పృష్టే చ వృశ్చికే నైప సహధన్వీ వ్యవస్థితః

వాయువ్యే చాస్య వై పాదే ధనుర్ద్రాహదికం త్రయమ్

కుంభమీనౌ తథై వాస్య ఉత్తరాం కుక్షిమాశ్రితే

మీనా మేషౌ ద్విజ శ్రేష్ఠ పాదే పూర్వోత్తరే స్థితౌ

కూర్మేదేశా స్తథర్క్షాణి దేశేశ్వేతేషు వై ద్విజ

రాశయశ్చ తథర్క్షేషు గ్రహరాశిష్వ వస్థితాః

తస్మాద్గృహర్క్ష పీదాసు దేశ పీడాం వినిర్దిశేత్

తత్రస్నాత్వా ప్రకుర్వీత దాన హోమాదికం విధిమ్

స ఏష వైష్ణవః పాదో బ్రహ్మన్యధ్యే గ్రహస్యయః

(నారాయణాఖ్యో చింత్యాత్మా కారణం జగతః ప్రభుః)

కర్కట, సింహ రాశులు వానికి తూర్పు, దక్షిణ పాదముల యందు వసించును. సింహము, కన్య, తుల ఈ మూడు రాశుల వానికి కుక్షి యందు విరాజిల్లును. తుల, వృశ్చిక రాశులు దక్షిణ, పశ్చిమ పాదము లందున్నవి. వృశ్చిక, ధనురాశులు వానికి పృష్ఠ భాగ మందుండును. ధనుస్సు, మకరాది మూడు రాశులు వానికి వాయువ్య చరణ మందు, కుంభ, మీన రాశులు, అతనికి ఉత్తర కుక్షి యందుండును. హే ద్విజోత్తమా! హే విప్రా! తూర్పు, ఉత్తర చరణము లందు మీన, మేషములు స్థిరముగా నుండును. ఈ కూర్మము నందు దేశములు, దేశము లందు నక్షత్రములు. నక్షత్రము లందు రాశులు, గ్రహాలు, గ్రహాల యందు రాశులు స్థిరమై యున్నవి. ఈ కారణముచే గ్రహ నక్షత్రముల యొక్క పీడలు దేశము యొక్క పీడలని యెరుగ వలెను. దేశ పీడాదులు కలిగి నప్పుడు స్నానము చేసి దాన హోమాదులు సంపూర్ణ నియమములతో చేయ వలెను. ఏ విష్ణువు యొక్క చరణ స్వరూపుడగు బ్రహ్మ గ్రహాల మధ్య నివసించునో అతడే నారాయణుడు. (అచింత్యాత్ముడు, జగత్కారణుడు, జగత్తుకు ప్రభువు.)