125 - మరుత్త చరితము

మార్కండేయుడు:

తతః స రాజపుత్ర మాదాయ దయితం సుతమ్ పత్నీం చానుగతో విప్రః గంధర్వై రాయయౌ పురమ్ స పితు ర్భవనం ప్రాప్య వవందే పితూ రాదరాత్ చరణౌ సా చ తన్వంగీ హ్రీమతీ నృపతేః సుతా తదాహ రాజపుత్రోసౌ గృహీత్వా బాలకం సుతమ్ ధర్మాసనగతం భూపం రాజ్ఞాం మధ్యే కరంధమమ్ ముఖం పౌత్రస్య పశ్యైత దుత్సంగస్థస్య యన్మయా కిమిచ్చకే ప్రతిజ్ఞాతం తుభ్యం మాతుః కృతే పురా ఇత్యుక్త్వా పితు రుత్సంగే తం కృత్వా తనయం తతః యథావృత్త మశేషం స కథయామాస తస్య తత్

మార్కండేయుడు:

ఓ విప్రా! అటు పిమ్మట రాజ పుత్రుడు తన ప్రియ పుత్రుని తీసుకొని భార్యా సహితుడై తన నగరమునకు చేరుకొనెను. నగరమునకు వచ్చు సమయమున గంధర్వులు పాద చారులై వారి ననుసరించిరి. అతడు తండ్రి గృహమునకు చేరుకొని భక్తి సహితముగా తండ్రి గారి చరణములకు వందన మొనరించెను. తన్వంగియగు రాజ కన్య లజ్జా భావముతో శిరస్సు వంచి ప్రణామము చేసెను. పిమ్మట రాజ పుత్రుడు బాలుడగు తన పుత్రుని తీసుకొని రాజుల మధ్యన ధర్మాసనముపై కూర్చొని యున్న తండ్రియగు కరంధమునితో ఇట్లు పలికెను. “నేను పూర్వము తల్లి ఆచరించిన కిమిచ్చక వ్రత సమయమందు మీతో చేసిన ప్రతిజ్ఞా ప్రకారము పౌత్రుని మీ ఒడి యందుంచుకొని పౌత్రుని ముఖమును జూడుడు” అని జెప్పి తండ్రి ఒడిలో పుత్రుని ఉంచెను. మరియు అతనితో జరిగిన వృత్తాంతము నంతయు వర్ణించెను.

స పరిష్వజ్య తం పౌత్రమ్ ఆనందాశ్రావితేక్షణః సభాగ్యోస్మీ త్యధాత్మానం ప్రశశంస పునః పునః తతః సోర్ఘ్యాదినా సమ్యగ్ గంధర్వా న్సముపాగతాన్ సంమానయామాస ముదా విస్మృతాన్యప్రయోజవః తతః పురే మహా నాసీ దానందః పౌరవేశ్మసు అస్మాకం సంతతి ర్జాతా నాథస్యేతి మహామునే హృష్ట పుష్టే పురే తస్మిన్ గీత వాద్యై ర్వరాంగనాః విలాసిన్యోతి చార్వంగ్యో ననృతు ర్లాస్య ముత్తమమ్ రాజా చ ద్విజముఖ్యేభ్యో రత్నాని చ వసూని చ గావో వస్త్రాణ్యలంకారా నదదా ద్ద్రుష్ట మానసః

రాజు ఆనందాశ్రు పూరిత నేత్రములతో ‘పౌత్రుని ఆలింగనము చేసుకొని సౌభాగ్యవంతుడ నైతిని’ అని ఇట్లు మాటి మాటికి తనను తానూ ప్రశంసించు కొనసాగెను. అటు పిమ్మట ఆనందముతో ఇతర కార్యములను మరచి, వచ్చి యున్న గంధర్వులను అర్ఘ్యాదులచే సన్మానించెను. ఓ మునీ! ఆ సమయమున నగర మందలి సమస్త పౌరుల గృహ మందును మమ్ములను రక్షించు నట్టి రాజునకు సంతానము కలిగెనని మహదానందముతో ఉత్సవమును జరుపుకొను చుండిరి. ఆనందముతో నిండిన ఆ నగరములో సుందర విలాసినీ గణాలు గీత వాద్య సంగీతములలో ఉత్తమమగు నృత్యములను చేయ సాగిరి. రాజు హర్ష చిత్తుడై గుణశాలురగు బ్రాహ్మణులకు ధన, రత్న, వస్త్ర, ఆభరణాదులు మరియు గోవులను దానము చేసెను.

తతః స బాలో వవృధేశుక్లపక్షే యథా శశీ పితౄణాం ప్రీతి జనకో జవస్యేష్టశ్చ సోభవత్ ఆచార్యాణాం సకాశా త్స ప్రాగ్వేన్ దాజాగృహే మునేః తతః శాస్త్రా ణ్యశేషాణి ధనుర్వేదం తతః పరమ్ కృతోద్యోగో యదాసోభూత్ ఖడ్గ కార్ముక కర్మణి అన్యేషు చ తథా వీరః శాస్త్రేషు విజితశ్రమః తతోస్త్రాణి స జగ్రాహ భార్గవాద్ భృగు సంభవాత్ వినయావనతో విప్రః గురోః ప్రీతిపరాయణః గృహీతాస్త్రః కృతీ వేదే ధనుర్వేదస్య పారగః నిష్ణాతః సర్వవిద్యాసు స బభూవ తతః పరః

అనంతరము ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి నొందుచు తండ్రికి ప్రీతి ప్రదుడై సాధారణ మనుష్యులకు గూడ ప్రియతము డయ్యెను. ఓ మునీ! ఆ బాలుడు యథా కాలమందు ఆచార్యుని వద్ద ప్రథమముగా వేదములను, అటు పిమ్మట ధనుర్విద్యలను నేర్చుకొనెను. ఆ బాలుడు ఎప్పుడయితే శాస్త్రము లన్నియు పూర్తి చేసెనో, అప్పుడు ఖడ్గ, ధనుర్విద్యల యందును ఇతర శాస్త్రముల యొక్క ప్రయోగము లందును పారంగతు డయ్యెను. ఓ విప్రా! అప్పుడతడు వినయముతో నమ్రుడై మరియు గురువునకు ప్రీతిపాత్రుడై భృగు వంశీయుడగు భార్గవుని వద్ద నుండి సంపూర్ణ అస్త్ర విద్యలను గ్రహించెను. ఇట్లు అతడు అస్త్రములను గ్రహించి ధనుర్వేదము నందు పారంగతుడై కృత కృత్యు డయ్యెను. మరియు ధనుర్విద్య లందు పారంగతు డగుటయే గాక ఇంకను సమస్త విద్య లందు ప్రవీణు డయ్యెను. ఆ కాలమున అన్నింటిలోనూ ఈతనిని మించిన వారు ఎవరూ లేకుండిరి.

విశాలోపి సుతా వార్తా ముపలభ్యాఖిలా మియామ్ హర్షనిర్భర చిత్తోభూ ద్దౌహిత్రస్య చ యోగ్యతామ్ అధ రాజా సుతసుతం దృష్ట్వా ప్రాప్తమనోరథః యజ్ఞా ననేకా న్నిష్పాద్య దత్త్వా దానాని చార్థినామ్ కృతశేషక్రియో యుక్తః సవర్ణై ద్దర్మతో మహీమ్ పరిపాల్యారివిజయీ బలబుద్ది సమన్వితః స యియాసు ర్వనం పుత్రా మవిక్షిత మభాషత పుత్రః వృద్దోస్మి గచ్చామి వనం రాజ్యం గృహాణ మే కృతకృత్యోస్మి నాస్త్యన్య త్కించిత్ త్వదభిషేచనాత్ సునిష్పన్న మతో రాజ్యం త్వం గృహాణ మయార్పితమ్

తన కుమార్తె గురించి అన్ని విషయములను విని దౌహిత్రుని యోగ్యతను విని విశాల రాజు కూడా హర్ష చిత్తు డయ్యెను. పౌత్రుని ముఖమును చూచుట తోడనే మనోరథములు సిద్దించి, శత్రువులను జయించు వాడు బల, బుద్ధి మంతుడు నగు కరంధముడు అనేకానేక యజ్ఞములను చేసి అర్థులకు అనేకములగు దానములు మరియు చక్కగా సత్కార్యములు చేసి బల, బుద్ధి పూర్వకముగా యథాధర్మముగా మహీపాలన చేయు చుండగా కొంత కాలము గడచిన పిమ్మట వనములకు వెళ్ల దలచి, పుత్రుడగు అవీక్షునితో ఇట్లనెను. “ఓ కుమారా! నేను వృద్దుడ నైతిని. ఇప్పుడు నేను వనమునకు వెళ్ళ వలయునని అభిలషించు చున్నాను. నా ఈ రాజ్యమును నీవు గ్రహింపుము. నేను అన్ని విషయము లందును కృతార్థుడ నైతిని. ఇప్పుడు నీకు రాజ్యాభిషేకము తప్ప ఇంకేమియు మిగుల లేదు. అందు వలన నీవు నాచే ఇవ్వబడు ఈ సుసంపన్న మగు రాజ్యమును గ్రహింపుము.”

ఇత్యుక్తః పితరం ప్రాహ సోవిక్షి పృథివ్యా న్నృపనందనః ప్రశ్రయావనతో భూత్వా బయాసు స్తపాసే వనమ్ నాహం తాతః కరిష్యామి పృథివ్యా పరిపాలనమ్ నాపైతి హ్రీ ర్మే మనసి రాజ్యేన్యం త్వం నియోజయ తాతేన మోక్షితో బద్ధో న స్వవీర్యా దహం యతః తతః కియా త్పౌరుషం మే పురుషైః పాల్యతే మహీ యోహం న పాలనాయాల మాత్మనోపి వసుంధరామ్ స కథం పాలయిష్యామి రాజ్య మన్యత్ర విక్షిప స స్త్రీసధర్మా పురుషో యశ్చాన్యేనావద్రుహ్యతే ఆత్మా మోహాయ భవతా బంధనా ద్యేన మోక్షితః

సోహం కథం భవిష్యామి స్త్రీసధర్మా మహీపతిః స్త్రియః పుమా న్భవే ద్భర్తా య సూరః స మహీపతిః

నృప నందనుడగు అవీక్షితుడు తండ్రి వచనములు విని తానూ కూడా వనములకు వెల్ల నిచ్చగించిన వాడై వినయముగా తండ్రితో నిట్లు పలికెను. “ఓ తండ్రీ! నేను భూమిని పాలింపను. ఇప్పటి వరకు మనస్సు నందు నాకు జరిగిన అవమానము దూరము కాలేదు. అందు వలన మీరు మరెవరి నయిననూ రాజ్య మందు వినియోగింపుడు. నేను బంధీనయి తండ్రిచే విడిపింప బడితిని. నా వీర్యముతో విడువబడ లేక పోతిని. అందుచే నాకు పౌరుష మేమున్నది? పౌరుషము కలవారే భూమిని పాలించెదరు. ఎప్పుడయితే నేను నన్ను రక్షించు కొనుట యందు అసమర్థుడ నైతినో, అప్పుడు నేను రాజ్యము నేవిధముగా పరిపాలించుదును? ఈ కారణముచే వేరొకరి కయినను ఈ రాజ్య భారము ఒప్ప గించుము. మంత్రణాశీలుడు, ధర్మ శీలుడు అయి నప్పటికిని ఏ పురుషుడు శత్రువుల వలన పరాజితు డయ్యెనో, అట్టి వాడు మోహమునకు వశీభూతుడగుటకు యోగ్యుడు గాడు. ఏ పురుషుడు ఆ ఆత్మను తండ్రిగారి యత్నముచే బంధ విముక్తుని చేసికొనేనో, అట్టి స్త్రీ జాతితో సమానమగు ధర్మము గల వాడనగు నేను ఏ విధముగా మహీపాలుడ నగుదును?”

తండ్రి:

న భిన్న ఏవ పుత్రస్య పితా పుత్ర స్తథా పితుః నాన్యేన మోక్షితో వీర! య స్త్వం పిత్రా వియోక్షితః

తండ్రి:

ఓ వీరా! తండ్రి పుత్రుని నుండి పుత్రుడు తండ్రి నుండి వేరు కాదు. అందువలన నా వలన విడువ బడుట పరాయి వానిచే విడువ బడినట్లు కాదు.

పుత్రుడు:

హృదయం నాన్యథా నేతుం మయా శక్యం నరేశ్వర! హృదయే హ్రీ ర్మమాతీవ య స్త్వహం మోక్షిత స్వయా పిత్రోపాత్తాం శ్రియం భుజ్తే పిత్రా కృచ్చ్రా త్సముద్ధృతః విజ్ఞాయతే చ యః పిత్రా మానవః స్తోస్తు నో కులే స్వయ మార్జిత విత్తానాం ఖ్యాతిం స్వయ ముపేయుషామ్ స్వయం నిస్తీర్ణ కృచ్చ్రాణాం యా గతిః సాస్తు మే గతిః

పుత్రుడు:

ఓ నరేశ్వరా! నేను ఇప్పుడు మనోవేగమును వెనుకకు మరల్చ లేను. మీ ద్వారా విడిపింప బడుటచే నా హృదయ మంతయు అత్యంత లజ్జా భావము జాగరితమై ఉన్నది. ఏ పురుషుడు తండ్రి సంపాదించిన సంపత్తిని అనుభవించునో, ఆపద యందు తండ్రిచే విడువ బడునో, మరియు తండ్రి పేరు తోనే పరిచితు డగునో, వంశములో అట్టి పుత్రుని జన్మ లేకుండుటయే ఉత్తమము. ఎవడు స్వయముగా ధనపార్జన చేయునో, స్వయముగా ఖ్యాతిని బొందునో, మరియు స్వయముగా దుఃఖముల నుండి విడువ బడునో, అట్టి వాని కెట్టి స్థితి కలుగునో, నాకునూ అట్టి స్థితి కలుగు గాక.

మార్కండేయుడు:

ఇత్యాహ బహుశః పిత్రా యదాప్యుక్త్వాప్యసౌ మునేః తదా తస్య సుతం రాజ్యే మరుత్త మకరో న్నృపః సపిత్రా సమనుజ్ఞాతం రాజ్యం ప్రాప్య పితామహాత్ చకార సమ్య క్సుహృదా మానన్ద ముపపాదయన్ రాజా కరన్ద మశ్చాపి వీరా మాదాయ తాం తథా వనం జగామ తపసే యత వాక్కాయ మానసః తత్ర వర్ష సహస్రం స తవ స్తప్త్వా సుదుశ్చరమ్ విహాయ దేహం నృపతిః శక్రస్యాన సలోకతామ్ సాస్య పత్నీ తదా వీరా వర్షాణా మాపారం శతమ్ తప శ్చచార విప్రర్షే జటిలా మలపంకినీ సాలోక్య మిచ్చతే భర్తుః స్వర్గతస్య మహాత్మనః ఫల మూల కృతాహారా భార్గవాశ్రమ సంశ్రయా ద్విజాతి పత్నీ మధ్యస్థా ద్విజ శుశ్రూషణా దృతా

మార్కండేయుడు:

ఓ మునీ! తండ్రి పలుమారులు ప్రార్థించి నప్పటికీ ఆ రాజ పుత్రుడు అదే సమాధానము ఇచ్చేనో, అప్పుడు కరంధమ రాజు అతని పుత్రుడగు మరుత్తుని రాజ్యమునకు రాజుగా చేసెను. మరుత్తుడు తండ్రి ఆమోదముతో రాజ్యమును పితామహుని వలన పొంది సుహృద్గణాలను ఆనందింప చేయుచూ, బాగుగా రాజ్యము శాసింప సాగెను. మనో వాక్కాయములచే సంయమ చిత్తుడై తపస్సు చేయుటకు కరంధమ రాజు వీర యను తన భార్యను వెంట బెట్టుకొని వనమునకు వెళ్ళి పోయెను. అక్కడ కరంధమ రాజు వేయి వత్సరముల పర్యంతము కఠినమగు తపస్సు చేసి దేహ పరిత్యాగము చేసి ఇంద్ర లోకమును పొందెను. మరియు అతని భార్య యగు “వీర” ఇంకనూ నూరు సంవత్సరముల పర్యంతము జడలను పెంచుకొని తపస్సు చేయుచూ, స్వర్గమును పొందిన మహాత్ముడగు భర్త యొక్క సాలోక్యమును కోరు చుండెను. కంద మూలములను భుజించుచూ భార్గవుని ఆశ్రమ మందు ఉండెను. ద్విజాతి పత్నుల మధ్య నుండి ద్విజ శుశ్రూషా తత్పరురాలై యుండెను.