19 - కువలయాశ్వ చరితము, మదాలస వివాహము

తండ్రి:

గాలవేన సమం గత్వా నృప పుత్రేణ తేన యత్ కృతం తత్ కథ్యతాం పుత్రో విచిత్రాయుధ యోధినా

తండ్రి:

పుత్రులారా! మునివరుడగు గాలవ ముని వెంబడి బోయి రాజ కుమారుడు ఏమి జేసెను? జెప్పుడు. విచిత్ర ఆయుధ యోధియగు నాతని కథ వినవలెనని కుతూహలముగా ఉన్నది.

పుత్రులు:

స గాలవాశ్రమే రమ్యే తిష్ఠ భూపాల నందనః సర్వ విఘ్నోపశమనం చకార బ్రహ్మ వాదినామ్ వీరః కువలయాశ్వంతం వసంతం గాలవాశ్రమే మదావలేపోపహతో నాజానా ద్దానవాధమః తత స్తం గాలవం విప్రం సంద్యోపాసన తత్పరమ్ సౌకరం రూప మాస్థాయ ప్రదర్షయితు మాగమత్ ముని శిష్యై రథోత్క్రుష్టే శీఘ్ర మారుహ్య తం హయమ్ అన్వధావ ద్వారాహం తం నృపపుత్రః శరాసనీ

పుత్రులు:

భూపాల నందనుడగు ఋతధ్వజుడు మునీశ్వరుని మనోహరమగు యాశ్రమమున నివసించుచు బ్రహ్మవేత్తలగు మునీశ్వరులకు సమస్త విఘ్నములను నివారించు చుండెను. మదావలేపోప హతుడునగు నా దానవాథముడు గాలవుని యాశ్రమమున వీరుడగు కువలయాశ్వుడు నివసించు చున్నాడని ఎరుగడు. తరువాత నా దానవుడు సూకర రూపమును ధరించి ద్విజుడు సంద్యోపాసన తత్పరుడునగు నా గాలవ మహర్షిని తపో విఘ్నము జేయుటకు వచ్చెను. అనంతరము ముని శిష్యులు ఉచ్చైస్స్వరముతో హాహాకారములు సలుప సాగిరి. రాజ పుత్రుడు వారి ఆర్త ధ్వని విని శీఘ్రముగా హయము నారోహించి శరాసనములు ధరించి యా వరాహము వెంట పరుగిడెను.

ఆజఘాన చ బాణేన చంద్రార్థకార వర్చసా ఆక్రుష్య బలవచ్చాపం చారు చిత్రోప శోభితమ్ నారాచాభిహతః శీఘ్ర మాత్మత్రాణపరో మృగః గిరి పాదప సంబాధాం సోత్యక్రామ న్మహాటవీమ్ త మన్వధావద్వేగేన తురగో సౌ మనోజవః చోదితో రాజపుత్రేణ పితూ రాదేశకారిణా అతిక్రమ్యా థ వేగేన యోజనాని సహస్రశః ధరణ్యాం వివృతే గర్తే నిపపాత లఘుక్రమః తస్యానంతర మేవాథ సచాశ్వీ నృపతేః సుతః నిపపాత మహాగర్తే తిమిరౌఘ సమావృతే

మనోహరమగు చిత్రములతో నలంకరింపబడి యున్నదియు, బలము గలదియు నాగు ధనస్సును అర్థ చంద్రుని యాకార వర్చస్సులు గల బాణముతో నెక్కుబెట్టి యా రాక్షసుని మీదకు వైచెను. అప్పుడా దైత్యుడు అతని బాణము తగిలి నందున తట్టుకొన లేక బోయెను. ఆత్మరక్షణ తత్పరుడై పర్వత వృక్షయుత మగు మహాటవిని పారిబోవుచుండెను. పిత్రాజ్ఞా పరిపాలకు డగు నా రాజ పుత్రుడు అశ్వమును చోదన జేసెను. మనోవేగము గల యా యశ్వము వేగముగా నా రాక్షసుని వెంట నంటి పరుగెత్తెను. పరుగెత్తుటలో లాఘవము గల నా రాక్షసుడు అతి వేగముతో వేల కొలది యోజనములు పరుగెత్తి భూగర్భ మందున్న ఒక పెద్ద గోతిలోకి పోయెను. వానిని తరుముచు వచ్చుచున్న రాజ పుత్రుడు గూడ ఆశ్వ సహితముగా అంధకార బంధుర మగు నాగర్త మందు జొచ్చెను.

తతో నా దృశ్యత మృగః స తస్మి న్రాజసూనునా ప్రకాశం చ స పాతాల మపశ్య త్తత్ర చార్చిషా తతోపశ్యత్స సౌవర్ణం ప్రాసాద శాత సంకులమ్ పురందర పురప్రఖ్యం పురం ప్రాకారశోభితమ్ తత్ప్రవిశ్య స నాపశ్య త్తత్ర కంచిన్నరం పురే భ్రమతా చ తతో దృష్టా యోషి త్తత్ర త్వరాన్వితా సా పృష్టా తేన తన్వంగీ ప్రస్థితా క్వేతి కస్య వా నో వాచ కించిత్ ప్రాసాద మారురోహ చ భామినీ సోపశ్వ మేకతోబద్ధ్వా తా మేవానుససార వై విస్మయోత్ఫుల్ల నయనో నిఃశంకో నృపతేః సుతః

అట్లు వెంబడించి నను ఆ రాజకుమారునకు ఆ వరాహ రూపుడు కనబడక పారిపోయెను. పోగా పోగా పాతాళ లోకము గన బడెను. అక్కడ వెలుతురు ఉండెను. ప్రకాశవంతముగా నుండెను. అనంతరము సువర్ణమయము, ప్రసాద శతసంకులము, దేవేంద్ర పురముతో సమానమగు పట్టణమును జూసెను. ఆ రాజ కుమారుడు ఆ పట్టణము లోనికి బోయెను. అచ్చట మనుష్యుడొక్కడు కూడ కనబడ లేదు. ఇటు నటు తిరుగు చుండ, త్వరితముగా పోవుచున్న నొక వనితను జూచెను. రాజ కుమారుడు ఆమెను ఎక్కడికి పోవు చున్నావు? నీవు ఎవరి దానవు? అని యడిగెను. కాని ఏమియు నామె మాట్లాడ లేదు. తరువాత ఆమె యొక ప్రసాదము నారోహించెను. అప్పుడు ఆ కుమారుడు అశ్వము నొక చోట బంధించెను. విస్మయోత్ఫుల్ల నయనములతో నిశ్శంకముగా రాజ కుమారుడు ఆమెనే అనుసరించుచు వెంట బోయెను.

తతోపశ్య త్సువిస్తీర్ణే పర్యం కే సర్వ కాంచనే నిషణ్ణాం కన్యకా మేకాం కామ యుక్తాం రతిం యథా విస్పష్టేందు ముఖీం సుభ్రూం పీన శ్రోణి పయోధరామ్ బింబాదరోష్టీం తన్వంగీం నీలోత్పల విలోచనామ్ రక్త తుంగ నఖాం శ్యామాం మృదు తామ్ర కరాంఘ్రికామ్ కరభోరుం సుదశనాం నీల సూక్ష్మ స్థిరాలకామ్ తాం దృష్ట్వా చారు సర్వాంగీ మనం గాంగ లతా మివ సోమన్య త్పార్థివ సుత స్తాం రసాతల దేవతామ్ సా చ దృష్ట్వైవ తం బాలా నీలకుంచిత మూర్ధజమ్ పీనోరు స్వం ధబాహుం త మమం స్త మదనం శుభా

ఆ రాజకుమారుడు ఆ స్థానము నందు ప్రవేశించి కాముకురాలు, రతితో సమానమైనది, చంద్రముఖి, పీనగ్రణి, మనోహరస్త నియు నగు నొక యువతిని, సువర్ణ రచిత పర్యంకము నందు కూర్చొని యున్న దానిని చూసెను. మఱియు నామె చంద్రుని వంటి ముఖము, చక్కని కనుబొమలు గలది, దొండ పండు వంటి యధరోష్టము గలది, నల్ల కలువల వంటి కనులు గలదియు , లతా తన్వియు, ఎర్రని యున్నతములైన గోళ్ళును, శ్యామయు, (అనగా శీతాకాలమున సుఖోష్ణము గాను, గ్రీష్మ కాలమున సుఖ శీతలము గాను, వసంత కాలమున సువర్ణ సమానమైన వర్ణము గల యువతిని శ్వామ యని చెప్పుదురు.) మృదువులును ఎర్రనివగు హస్తములు, పాదములు గలదియు, ఏనుగు తొండము వంటి యూరువులు గలదియు, మంచి పలువరుస గలదియు, నీలములు, సూక్ష్మములును, దృఢములు నగు ముంగురువులు గలదియును మఱియు అనంగాంగలత వంటిదియు సర్వాంగ సుందరియు నగు నా యువతిని జూచిన రాజ కుమారుడు ఆమెను రాసాతలాధిష్టాన దేవతగా తలంచెను. పిమ్మట శుభ లక్షణములు గల నా యువతియు నల్లని ఉంగరముల వలె నున్న కేశములు, బలసిన వక్ష స్థలము, భుజ స్కందములు గల ఆ రాజ కుమారుని చూచినంతనే మన్మధునిగా తలంచెను.

ఉత్తస్థౌ చ శుభాచారా చిత్తక్షోభ మావాప సా లజ్జా విస్మయ దైన్యానాం సద్య స్తన్వీ వశం గతా కోయం దేవోథ యక్షోను గంధర్వో వోరగోపి వా విద్యాధరోవా సంప్రాప్తః కృతపుణ్యా పాటి ర్నరః ఏవం విచింత్య బహుథా నిశ్వస్య చ మహీతలే ఉపవిశ్య తాతా భేజే సా మూర్చా మదిరేక్షణా సోపి కామ శరాఘాత మవాప్య నృపతేః సుతః తా మాశ్వాసయామాస న భేతవ్య మితి బ్రువన్ సా చ స్త్రీ యా తదా దృష్ట్వా పూర్వం తేన మహాత్మనా తాల వృంత ముపాదాయ పర్య వీజయ దాకులా

శుభాచార యగు నామె ఆ రాజకుమారుని చూడగనే లజ్జా విస్మయ దైన్యములకు వశమై, చిత్త వైకల్యమును పొంది దిగ్గున లేచెను. ఆమె ఇతనెవరు? యక్షుడా! గంధర్వుడా! నాగరాజా! విద్యాధరుడా! లేక పుణ్యవంతుడగు నరపతియా! ఈ ప్రకారము అనేక విధములుగా తలంచుచు నిట్టూర్పులు విడుచుచు, నేలపై కూర్చొని ఎర్రని చూపులు గల ఆ యువతి మూర్చ బొందెను. ఆ రాజ కుమారుడు కూడా మన్మధ బాణములచే పీడితుడై, ఆమెను భయపడ వలదని పలుకుచు ఆశ్వాసించెను. మహాత్ముడగు నా రాజ కుమారుడు ఇంతకు పూర్వము చూచినా స్త్రీ, వ్యాకులముతో తాటి యాకుల విసనకర్రను తీసికొని, మూర్చ పోయిన ఆ యువతికి వీచ సాగెను.

సమాశ్వస్తా తదా పృష్టా తేన సా మోహ కారణమ్ కించి ర్లజ్జాన్వితా బాలా తస్యై సఖ్యై న్యవేదయత్ సా చాస్మై కథయా మాస నృపపుత్రాయ విస్తరాత్ మోహస్య కారణం సర్వం తద్దర్శన సముద్భవమ్ యథా తయా సమాఖ్యాతం తద్వ్రుత్తాంతం చ భామినీ

అపుడు అతడు ఆమెను ఓదార్చెను. మోహ కారణము అడిగెను. ఆమె కొంచెము సిగ్గుతో నతని కేమియు చెప్పలేక తన చెలికత్తెకు తెలిపెను. అపుడు, ఆ భామినియు నతడడిగిన పిమ్మట అతని దర్శనము వలన కలిగిన మోహమును కారణమును సవిస్తారముగా తెలియ జెప్పెను. ఆమె స్నేహితురాలు జెప్పిన ప్రకారముగా ఆ వృత్తాంతము నంతయు జెప్ప సాగెను.

చెలికత్తె:

విశ్వావసు రితిఖ్యాతో దివి గంధర్వరా ట్ప్రభో తస్యేయ మాత్మజా సుభ్రూ ర్నామ్నా ఖ్యాతా మదాలసా వజ్రకెతుహ్ సుతశ్చో గో దానవోరి విదారణః పాతాళకేతు ర్విఖ్యాతః పాతాలాంతర సంశ్రయః తేనేయ ముద్యానగతా కృత్వా మాయం తమోమయీమ్

చెలికత్తె:

రాజకుమారా! స్వర్గము నందు “విశ్వావసుడు” అను పేరు గల ప్రసిద్ధుడు నగు నొక గంధర్వ రాజు గలడు. మంచి కనుబొమలు గల ఈ సుందరి అతని కుమార్తె. ఈమె పేరు మదాలస. ఈమె యొక రోజు ఉద్యానవనము నందు ఆటలాడు కొను చుండెను. ఈ సమయమున “వజ్ర కేతుడు” అను దానవుని కుమారుడు పాతాళవాసి, ఉగ్రమూర్తి, శత్రు విదారకుడు నగు, పాతాళ కేతుడు అను పేరుతొ ప్రసిద్ధి బొందిన దుర్మార్గుడు తమో మయమగు మాయను ( అనగా చీకటి) సృష్టించెను.

అపహృత్య సమానీతా బాలేయం దుష్ట బుద్ధినా ఆగామిన్యాం త్రయోదశ్యా ముద్వక్ష్యతి కిలాసురః స తు నార్హతి చార్వంగీం శూద్రో వేదశ్రుతిం యథా అతీతే చ దినే బాలాం చాత్మవ్యాపననోద్యతామ్ సురభిః ప్రాహ నాయంత్వా ప్రాప్స్యతే దానవాధమః మర్త్య లోకమను ప్రాప్తం య ఏనం భేత్స్య తే శరైః స తే భర్తా మహాభాగే హ్యచిరేణ భవిష్యతి అహం త్వస్యాః సఖీ నామ్నా కుండలేతి మనస్వినీ సుతా వింధ్యవతః పత్నీ వీరపుష్కర మాలినః తే భర్తరి శుంభేన తీర్థా త్తీర్థ మనువ్రతా

పిమ్మట దుష్టబుద్ది యగు నా దానవుడు ఈమెను అపహరించి తీసికొని వచ్చెను. రాబోవు త్రయోదశి దినమున ఆ రాక్షసుడు ఈమెను వివాహము జేసుకొన బోవు చున్నాడు. శూద్రుడు వేదం శ్రవణమునకు అర్హుడు కానట్లు ఆ రాక్షసుడు ఈ మనోహరాంగికి తగిన వాడు గాడు. ఈమె నిన్నటి దినమున ఆత్మహత్య జేసికొనుటకు ప్రయత్నించెను. ఆ సమయ మందు గోమాత యగు సురభి ఆమెతో “ఈ దానవాధముడు నిన్ను బొందలేడు. భూలోకమునుండి వచ్చిన వాడు ఇతనిని బాణములచే జంప గలడు. మహానుభావులారా! అతడు నీకు త్వరలోనే భర్త కాబోవు చున్నాడు” అని పలికెను. నేను ఈమె యొక్క స్నేహితురాలను. నేను కుండల యను పేరు గలదానను. వింధ్య వంతుని యొక్క కుమార్తెను. వీరుడైన పుష్కరమాలి యొక్క భార్యను. శంభాసురుడను దానవుడు నా భర్తను జంపెను. నా భర్త యొక్క క్షేమము కొరకు నేను ప్రతి తీర్థము నందు దిరుగు చున్నాను.

చరామి దివ్యయా గతయా పరలోకార్థ ముద్యతా పాతాలకేతు ర్డుష్టాత్మా వారాహం వపు రాస్థితః కేనాపి విద్దో బాణేన మునీనాం త్రాణ కారణే తథాహం తత్వతో న్విష్వ త్వరితాహ మిహాగతా సత్యమేవ స కేనాపి తాడితో దౌష్ట్య మాచర ఇయం చ మూర్చా మగమ ద్యేన తత్కారణం శృణుః త్వయి ప్రీతిమతీ బాలా దర్శనాదేవ మానవః దేవా పుత్రోపమే చారు వాక్య రూపాదిశాలిని భార్యా చాన్యస్య విహితా యేన విద్ధః స దానవః ఏతస్మా త్కారణా న్మోహం మహానట మియ మాగతా  

నా భర్తకు పరలోక సుఖము కలుగుటకై ఆకాశ గమనముచే తీర్థ యాత్రలు జేయుచు సంచరించు చున్నాను. దుష్టాత్ముడగు పాతాళ కేతుడు ఇప్పుడు సూకర రూపమును ధరించి యున్నాడు. ముని రక్షణ కొరకు ఒక మహా పురుషుడు వానిని బాణముతో గొట్టెను. అప్పుడు నేను ఆ విషయమును అన్వేషణ జేయదలచి త్వరితముగా ఇచ్చటికి వచ్చితిని. అన్వేషించగా యథార్థము తెలిసినది. ఆ దానవాధముని నిజముగానే యొక పురుషుడు నొక బాణముతో గొట్టెను. ఇప్పుడు ఈమె మూర్చబోయి నందులకు కారణమును వినుము. మాన రక్షకుడవగు రాజకుమారా! నిన్ను జూచినంతనే ఈ కన్య దేవ కుమారునితో సమానుడవును, మనోహరములైన వాక్య రూపములు గల నీ యందు ప్రీతి గలదయ్యెను. ఎవడు ఈ దానవుని దండించునో ఆ పురుషునికి అతిరిక్తముగా ఇంకొకడు ఈమెను భార్యగా బొంద జాలడు. ఈ కారణముచే ఈమె మహా మోహమును బొందినది.

యావజ్జీవం చ తన్వగీ దుఃఖ మేవోపభోక్ష్యతి త్వయ్యస్యా హృదయం రాగి భర్తా చాన్యో భవిష్యతి యావజ్జీవ మతో దుఃఖం సురభ్యా నాన్యథా వచః అహం త్వస్యాః ప్రభో ప్రీత్యా దుఃఖితాత్ర సమాగతా యతో విశేషో నైవాస్తి స్వసఖీ నిజదేహయోః యద్వేషాభిమతం వీరః పాటి మాప్నోతి శోభనా తతస్త్వహం తవః కుర్యాం నిర్వ్యలీకేన చేతసా త్వం తు కోవా కిమర్థం వా సంప్రాప్తోత్ర మహీపతే దేవో దైత్యోను గంధర్వః పన్నగః కిన్నరోపి వా నహ్య త మానుష గతి రణ చేదృజ్మానుషీ గతిః

ఈమె హృదయము నీ యందు లగ్నమై యున్నది. ఇతరుడు భర్త యైనచో ఈ తన్వంగి జీవితాంతము దుఃఖమునే యనుభవించ గలదు. ఇతరుడే భర్త యైనచో జీవిత పర్యంతము దుఃఖమును బొంద వలసి వచ్చునని సురభి కూడా జెప్పెను. ఆమె మాట సత్యము. రాజకుమారా! ఈమె యందలి స్నేహముచే దుఃఖిత చిత్తముతో ఈమె సమీపమునకు వచ్చితిని. ఎందువలన యనగా నా శరీరము నా స్నేహితురాలి శరీరము ఒక్కటియే గాన దుఃఖించు చుంటిని. ఈమె అదృష్టవంతు రాలైనచో యభిమతుడగు భర్తను బొందును. అప్పుడు నేను నిశ్చల చిత్తరముతో తపస్సు చేసుకొను చుందును. మహామతీ! తమరెవరు? ఎందులకు ఇచ్చటికి వచ్చితిరి? తమరు దేవా, దైత్య, గంధర్వ, కింపురుషులలో ఎవరై యుందురు? కాక పోయినచో మనుష్య మాత్రు డిచ్చటకు రాజాలడు. మరియు మనుష్యునకు నీ యట్టి శరీరము ఉండదు.

తత్త్వ మాఖ్యాహి కోసి త్వం యథైవా వితథం మయా

తమరెవరో సత్యము జెప్పుడు. నేను నా వృత్తాంత మంతయు సత్యముగా జెప్పితిని గదా!

కువలయాశ్వుడు:

యన్మాం పృచ్చసి ధర్మజ్ఞే కస్త్వం కిం వా సమాగతః తచ్ఛృనుష్వామల ప్రజ్ఞే కతయామ్యాదిత స్తవ రాజ్ఞః శత్రుజితః పుత్రః పిత్రా సంప్రేషితః శుభే ముని రక్షణ ముద్దిశ్య గాలవాశ్రమ మాగతః కుర్వతో మామ రక్షాం చ మునీనాం ధర్మచారిణామ్ విఘ్నార్థ మాగతః కోపి శౌకరం వాపు రాస్థితః మయా స పద్దో బాణేన చంద్రార్దాకార వర్చసా అవక్రాంతో తివేగేన తమస్యనుగతో హయీ పపాత సహసా గర్తే సక్రోథోశ్వశ్చ మామకః

కువలయాశ్వుడు:

ధర్మము తెలిసినదానా! నీవెవరవు? ఎచట నుండి వచ్చితివి? యని నన్ను యడుగు చుంటివి. ధర్మ బుద్ధి గలదానా! క్రమముగా మొదటి నుండి నీకు నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. శుభ స్వరూపురాలా! నేను శత్రుజిత్తు యను మహారాజు కుమారుడను. నా తండ్రి పంపుటచే నిట్లు వచ్చితిని. ముని రక్షణను జేయ తలంచి గాలవాశ్రమమునకు వచ్చితిని. నేను ధర్మచారులగు మునుల సంరక్షణ జేయు చుండగా, విఘ్నము జేయుట కొరకు వరాహ రూపమును ధరించి యొకడు వచ్చెను. నేను అర్థ చంద్రాకార బాణముతో వానిని గొట్టితిని. అప్పుడు వాడు అతి వేగముతో చీకటిలో పరుగెత్తెను. వానిని నేను ఆశ్వారోహుడనై యనుసరించితిని. వాడు ఒక గోతిలో దూకెను. నా యశ్వము గూడ క్రోధముతో యా గోతి యందు దూకెను.

సోహ మశ్వం సమారూడ స్తమస్తేకం పరిభ్రమన్ ప్రకాశ మాసాదితవాన్ దృష్ట్వా చ భవతీ మయా పృష్టా చ న చ మే కించి ద్భవత్యా దత్త ముత్తరమ్ త్వం చైవాను ప్రవిష్టోహ మిమం పాసాద ముత్తమమ్ ఇత్యేత త్కథితం సత్యం న దేవోహం న దానవ న పన్నగో న గంధర్వః కిన్నరో వా శుచిస్మితే సమస్తాః పూజ్యపక్షా వై దేవాద్యా మామ కుండలే మనుష్యోస్మి విశంకా తే న కర్తవ్యాత్ర కర్హిచిత్

అప్పుడు ఆశ్వారోహుడనైన నేను ఒంటరిగా చీకటిలో దిరుగు చుండ వెలుతురు గనిపించెను. అప్పుడు నేను నిన్ను జూచితిని. నేను నిన్ను అడిగితిని. నీవు ఏ కొంచెమును సమాధానమును చెప్పలేదు. అప్పుడు నేను నిన్ను అనుసరించి ఈ యుత్తమమగు ప్రాసాదమును ప్రవేశించితిని. ఇది నా వృత్తాంతము. నేకు క్రమముగా జెప్పితిని. సత్యము జెప్పు చున్నాను. ఓ శుచి స్మితురాలా! నేను దేవా, పన్నగ, గంధర్వ, దానవ, కింపురుషులలో నెవ్వడను గాను. కుండలా! నాకు సమస్త దేవాదులు పూజ్యులు. నేను మనుష్యుడను. నీవు ఏ మాత్రము శంకిప వలదు.

పుత్రులు:

తతః ప్రహృష్టా సాకన్యా సఖీ వదన ముత్తమమ్ లజ్జా జడ వీక్షమానా కించి న్నో వాచ భామినీ

పుత్రులు:

తండ్రీ! కన్యయగు మదాలస అత్యంత సంతుష్టురా లయ్యెను. లజ్జచే సుందరమగు సఖి ముఖమును సంతోషముతో చూచు చుండెను. సంతోషముచే ఏమియు చెప్పజాల కుండెను.

తత్సఖీపునరప్యేనాం ప్రహృష్టా ప్రత్యువాచ హ యథాప త్కతికం తేన సురభ్యా వచనా నుగమ్

అప్పుడు ఆమె చెలికత్తె అత్యంత ప్రసన్న చిత్తురాలై మదాలసతో “సఖీ! సురభి యొక్క వచనమును అనుసరించియే ఈతడు యథార్థమునే చెప్పెను”. అని పలికెను. పిమ్మట రాజ పుత్రునితో ఇట్లనెను.

కుండల:

వీర సత్య మసందిగ్ధం భవతాభిహితం వచః నాన్యత్ర హృదయం హ్యస్య దృష్ట్వా ధైర్యం ప్రయాస్యతి చ ద్రమేవాదికా కాంతిః సముపైతి రవిం ప్రభా భూతి ర్ధన్యం ధృతి ర్థీరం క్షాంతి రభ్యేతి చోత్తమమ్ త్వయైవ విద్దో సందిగ్ధం స పాపో దానవాథమః సురభిః సా గవాం మాతా కథం మిధ్యా వదిష్యతి?

తద్దన్యేయం సభాగ్యా చ త్వ త్సంబంధ మవేత్య వై  కురుష్వ వీరః యత్కార్యం విధినైవ సమాహితమ్

కుండల:

నీవు చెప్పినది యథార్థమై యున్నది. సందేహము లేదు. అట్లు గానిచో నిన్ను చూచి ఈమె హృదయము నీ యందు స్థిరముగా ఎట్లుండ గలదు? అధికమగు కాంతిని చంద్రుడే పొందును. తేజస్సును సూర్యుడు పొందును. ధన్యుడగు పురుషుడు ఐశ్వర్యమును పొందును. ధృతి ధీర పురుషుని పొందును. క్షాంతి ఉత్తమునకు లభించును. అందువలననే నీవు ఈ పాపాత్ముడగు దానవాధముని బాణముతో కొట్టితివి. ఈ విషయ మందు సందేహము లేదు. గోవులకు తల్లి యగు సురభి అసత్యము ఎట్లు చెప్పును? ఈ కారణమున నీ యొక్క సంబంధ లాభము బొంది ఈ నా స్నేహితురాలు ధన్యురాలు, భాగ్యవతి అయినది. విద్యుక్తముగా చేయవలసినది చేయుము.

పుత్రులు:

పరవా నహ మిత్యాహ రాజపుత్రః సదా పితుః సా చ తం చింతయామాస తుంబురుం తత్కులే గురుమ్ చాపి తత్క్షణా త్పాసప్తో నిగృహీత సామీ త్కుశః మదాలసాయాః సంప్రీత్యా కుండలా గౌరవేణ చ వ్రజ్వాల్య పావనం హుత్వా మంత్రవి త్కృత మంగళామ్ వైవాహికే విధౌ కన్యాం ప్రతిపాద్య యథాగతమ్ జగామ తపసే దీమాన్ స్వ మాశ్రమ వదం తతః సా చాహ తాం సఖీం బాలామ్ కృతార్థస్మి వరాననే సంయుక్తా మమునా దృష్ట్వా త్వా మహం రూపశాలినీమ్ తప స్తప్స్యే హ మతులం నిర్వ్యలీకేన చేతసా

పుత్రులు:

అప్పుడా రాజపుత్రుడు నేను పరాధీనుడను. తండ్రి యాజ్ఞ లేకుండ ఏ విధముగా ఈ కన్యను వివాహము చేసుకొనగలను? అపుడు కుండల రాజ కుమారునితో “ఇట్లు చెప్పకుము. ఈమె దేవకన్య గావున వివాహము చేసుకొను”మని చెప్పెను. అపుడు రాజపుత్రుడు సమ్మతించెను. కుండల అపుడు కులగురు వగు తుంబురుని స్మరించెను. ఆ తుంబురుడు గూడ మదాలస యందు యున్న ప్రీతి చేతను, కుండల యందలి గౌరవము చేతను తత్ క్షణమే సమిత్కుశలను గ్రహించి వారి యొద్దకు వచ్చెను. మంత్ర వేత్తయగు తుంబురుడు అగ్నిని జ్వలింప జేసెను. వైవాహిక విధిగా హోమము జేసెను. మంగళాచారములు నిర్వర్తించిన మదాలసను ఆ రాజ పుత్రునకు వివాహము జేసి స్వస్థానమునకు బోయెను. దీమంతుడగు తుంబురుడు తన ఆశ్రమమున తపస్సు జేసికొనుటకు బోయిన పిమ్మట సఖియగు కుండల మదాలసతో వరాననా! ఇప్పుడు నేను కృతార్థురాల నయితిని అని యనెను. నేను ఈ రాజ పుత్రునితో రూప శాలిని వయిన నీవు సంయోగము బొందుటను జూచి సంతసించితిని. ఇప్పుడు నేను నిశ్చల చిత్తముతో గొప్పగా తపస్సు జేసు కొనెదను.

తీర్థ్మాంబు ధౌత పాపా చ భవిత్రీ నేద్రుశీ యథా తం చః రాజపుత్రం సా ప్రశ్రయోపనతం వచః గంతుకామా నిజసఖీ స్నేహ విక్లబ భాషిణీ

నేను మరల ఇట్టి వైధవ్య స్థితిని బొందకుండు నట్లు తీర్థ జలము లందు స్నానమాడి పాపములను పోగొట్టు కుందును. అని మదాలసతో చెప్పి అభీష్ట స్థానమునకు పోదలచి తన చెలికత్తె యందలి స్నేహముచే వ్యాకుల చిత్తురాలై ఆ రాజపుత్రునితో వినయ పూర్వకముగా ఇట్లు చెప్పెను.

కుండల:

పుంభి రప్యమిత ప్రజ్ఞే నోపదేశో భవద్విధే దాతవ్యః కిముత స్త్రీభి రతో నోపదిశామి తే కింత్వస్యా స్తనుమధ్యాయా స్నేహాకృష్ణేన చేతసా త్వయా విశ్రంభితా చాస్మి స్మారయా మ్యరిసూదన భర్తవ్యా రక్షిత వ్యాచ భార్యా హి వతినా సదా ధర్మార్థ కామ స సిద్ధ్యై భార్యా భర్తుః సహాయినీ యా చ భార్యా చ భర్తా చ పరస్పర మనువ్రతౌ తదా ధర్మార్థ కామానాం త్రయాణా మాపి సంగతమ్ కథం భార్యా మృతే ధర్మ మర్థం వా పురుషః ప్రభో ప్రాప్నోతి కామ మర్థం వా తస్యా త్రితయ మహితమ్ తథైవ భర్తార మృతే భార్యా ధర్మాది సాధనే న సమర్థా త్రివర్గో యం దాంపత్యం సముపాశ్రితః దేవతా పితృ భృత్యానా మతిధీనాం చ పూజనమ్ న పుంభిః శక్యతే కర్తు మృతే భార్యాం నృపాత్మజ ప్రాప్తోపి చార్థో మనుజై రానీతోపి నిజం గృహమ్ క్షయ మేతి వినా భార్యాం కుభార్యా సంగ్రహేపివా కామస్తు తస్య నైవాస్తి ప్రత్యక్షే ణోపలక్ష్యతే

కుండల:

అపరిమిత బలశాలి వాగు రాజపుత్రా! ప్రాజ్ఞ పురుషులు కూడా నీవంటి పురుషునకు ఉపదేశము చేయుటకు సమర్థులు కారు. నేను స్త్రీని. ఉపదేశార్హత లేని దానను. కనుక నీ కుపదేశము చేయుట లేదు కాని తనుమధ్య యగు నీ నా స్నేహితురాలి యందలి స్నేహముచే ఆకర్షింప బడిన మనస్సు చేత నీకు విశ్వాసము కలుగుట కొరకు ఓ శత్రువులను చంపువాడా! నీకు కొంచెము జ్ఞాపకము చేయు చున్నాను. ఏమన, భర్త యగువాడు భార్యను ఎల్లప్పుడు భరించ వలెను. రక్షించ వలెను. భార్య భర్తకు ధర్మార్థ కామ సిద్ధికి సహాయకురాలగును. భార్యా భర్తలు పరస్పర మనుసరించు వారై యుండినచో ధర్మార్థ కామములను మూడు పురుషార్థములును సిద్ధించును. రాజపుత్రా! పురుషుడగు వాడు భార్య లేనిచో ధర్మమును గాని, అర్థమును గాని, కామమును గాని ఎట్లు పొంద గలడు? ఆమె యందు త్రివర్గము (అనగా ధర్మార్థ కామములు) స్వాధీనమై యున్నవి. అటులనే భార్యయు భర్త లేకుండా ధర్మాది సాధనము నందు సమర్థురాలు కాజాలదు.ఈ త్రివర్గము దాంపత్యము నాశ్రయించి యున్నవి. దేవతల యొక్కయు, తల్లి దండ్రుల యొక్కయు, అథితుల యొక్కయు, సేవకుల యొక్కయు పూజనము, రాజ కుమారా! భార్య లేనిచో పురుషులు చేయ జాలరు. మనుజులు ద్రవ్యమును సంపాదించి స్వగృహమునకు తీసుకొని వచ్చినప్పటికి భార్య లేనిచో ఆ ద్రవ్యము క్షీణించును. భార్య దుష్టురాలైనచో కూడా నశించును. భార్య లేనిచో కోరికలు కూడా సిద్ధించవు. ఇది ప్రత్యక్షముగా కానవచ్చు చున్నది.

దంపత్యోః సహధర్మేణ త్రయీ ధర్మ మవాప్నుయాత్ పుత్రాణాం యోని రస్యా వై నాన్యతో భార్యయా వినా పిత్రూన్ పుత్రై స్తథైవా న్న సాధనై రతిథీ నపి పూజాభి రామరా స్తదత్ సాధ్వీం భార్యాం నరోవతి స్త్రియా శ్చాపి వినా భర్త్రా ధర్మ కామార్థ సంతతిః నైవ తస్మా త్రివర్గోయం దాంపత్య మది గచ్చతి ఏతన్మయోక్తం యువయో ర్గామిష్యామి యథేప్సితమ్ వర్థత్వ మనయా సార్థం ధనపుత్ర సుఖాయుషా

దంపతులు సహ ధర్మము చేత త్రయీ ధర్మమును పొందుదురు. భార్య లేనిచో పుత్రులు సిద్ధించరు. భార్య లేనిచో పితృ పుత్రులకు అన్న సాధనములకు అథిదులకు, దేవ పూజలకు సమర్థుడు కాజాలడు. అందువలన ఉత్తమురాలగు భార్యను పురుషుడు రక్షించు చున్నాడు. అటులనే భర్త లేనిచో స్త్రీకి కూడ ధర్మ, కామ, అర్థ సంతానములు లేవు. అందువలన ఈ త్రివర్గము దాంపత్యమును ఆశ్రయించి యున్నవి. నేను ఈ విషయమును మీకు చెప్పితిని. నా అభీష్ట స్థానమునకు పోవుదును. ధన, పుత్ర, సుఖములతోను ఆయుశ్యము తోను ఈమెతో వర్ధిల్లుము.

పుత్రులు:

ఇత్యుక్త్వా స పరిష్వజ్య స్వ సఖీం తం నమస్య చ జగామ దివ్యయా గతయా యధాభిప్రేత మాత్మనః సోపి శత్రుజితః పుత్రా స్తా మారోప్య తురంగమమ్ నిర్గంతు కామః పాతాలాద్ విజ్ఞాతో దనుసంభవైః తతస్తైః సహసోత్క్రుష్టం హ్రియతే హ్రియతే త్వితి

పుత్రులు:

ఈ విధముగా చెప్పి తన చెలికత్తెను ఆలింగనము చేసికొని రాజ పుత్రునకు నమస్కరించి, ఆమె దివ్య గమనముచే అభీష్ట స్థానమునకు వెళ్ళెను. శత్రుజిత్తు యొక్క కుమారుడగు నాతను కూడా మదాలసను గుఱ్ఱముపై నదిష్టింప జేసి పాతాల లోకము నుండి బయలుదేర దలంచు చుండ దను పుత్రులగు దానవులు తెలుసుకొనిరి. వారు బిగ్గరగా ఎత్తుకొని బోవు చున్నాడని త్వరితముగా మాటి మాటికి అరవ సాగిరి.

కన్యారత్నం యదానీతం దివః పాతాలకేతునా తతః పరిఘ నిస్త్రింశ గదా శూల శారాయుధమ్ దానవానాం బలం ప్రాప్తం సహా పాతాళకేతునా తిష్ఠ తిష్టేటి జల్పంత స్తే తదా దానవోత్తమాః షర వర్షై సత్తా శూలై ర్వవర్షు ర్నృప నందనమ్ స తు శత్రుజితః పుత్రా సతత స్తా ప్రతి వీర్యవాన్ చిచ్చేద శర జాలేన ప్రహసన్నివ లీలయా క్షణేన పాతాల తల మసి శక్త్యృష్టి సాయకైః

స్వర్గము నుండి తీసికొని వచ్చిన కన్యా రత్నమును అపహరించు కొని బోవుట విని నంతనే, ఇనుప కట్ల గుదియలు, ఖడ్గములు, గదలు, శూలములు, శరములు మొదలగు నాయుధములతో గూడిన దానవ సైన్యమును వెంట బెట్టుకొని, పాతాలకేతుడు రాజ పుత్రుని మీదకి వచ్చెను. అప్పుడు ఆ దానవులు నిలువుము, నిలువుము అని అరచు చుండిరి. ఆ రాక్షసులు రాజ నందనుని మీద శూలములు వేయ సాగిరి. బాణ వర్షమును గురిపించు చుండిరి. అప్పుడు శత్ర జిత్తుని కుమారుడు వారలను లక్షించి బాణములు వేయ మొదలిడెను. నవ్వుచు లీలా పూర్వకముగా వారల సమస్త అస్త్రములను తన బాణములచే చేదించెను. ఆ సమయమున ఋతధ్వజుని బాణములచే పాతాళ ప్రదేశ మంతయు నిండి యుండెను.

చిన్నైః స చన్న మత్యర్థ మృతధ్వజ శరోత్కరైః తతోస్త్రం త్వాష్ట్ర మాదాయ చిక్షేప ప్రతి దానవన్ తేన తే దానవాః సర్వే సహ పాతాల కేతునా జ్వాలామాలాతి తీవ్రేణ స్ఫుట దస్తి చయా స్తదా నిర్ధగ్ధాః కాపిలం తేజః సమాసాద్యేవ సాగరా తతః స రాజపుత్రోరీ న్నిహత్యాసుర సత్తమాన్ స్త్రీరత్నేన సమం తేన సమాగచ్చ త్పితుః పురమ్ ప్రణిపత్య చ తత్సర్వం స తు పిత్రే న్యవేదయత్ పాతాల గమనం చైవ కుండలా యాశ్చ దర్శనమ్ తద్వ న్మదాలసా ప్రాప్తిం దానవై శ్చాపి సంగరమ్ వరశ్చ తేషా మస్త్రేణ నరాగమనం తథా ఇతిశ్రుత్వా పితా తస్య చరితం చారు చేతనః ప్రీతమా నభవ చ్చైనం పరిష్వజ్యా హ చాత్మజమ్ సత్పుత్రేణ త్వయా పుత్ర తారితోహం మహాత్మనా

ఋతధ్వజుని గొప్పవగు బాణములచే నత్యంతము భిన్నములైన ఆ రాక్షసుల యస్త్ర శస్త్రములచే పాతాళ మంతయు గప్పి వేయబడి యుండెను. పిమ్మట రాజ పుత్రుడు త్వాష్ట్రాస్త్రమును తీసికొని దానవులపై ప్రయోగించెను. జ్వాలా మాలా యుక్తము నతి భయంకరమగు ఆ త్వాష్ట్రాస్త్రము పాతాల కేతునితో గూడ ఆ దానవుల యందరి ఆస్థులను చేదించెను. పిమ్మట ఆ అస్త్రము క్షణ కాలములోనే కపిల మహర్షి తేజస్సుతో సగర పుత్రులు భస్మ మైనట్లుగా ఆ రాక్షసులందరు భస్మీ భూతులైరి. తరువాత, నా రాజ పుత్రుడు రాక్షసులను చంపి, అశ్వారోహుడై స్త్రీరత్నమగు మదాలసతో గూడి తండ్రి యొక్క నగరమునకు వచ్చెను. అతడు తండ్రికి నమస్కరించి జరిగిన వృత్తాంతము నంతయు నివేదించెను. తాను పాతాళమునకు బోవుట, కుండలా దర్శనము, మదాలసా ప్రాప్తి, దానవులతో యుద్ధము, ఆ దానవులను అస్త్రములతో జంపుటయు, తిరిగి వచ్చుటయు మొదలగు సమస్త వృత్తాంతము ను తెలియ బరచిన పిమ్మట మంచి మనసు గల ఆ పుత్రుని యొక్క చరిత్రమును విని, సంతోషించిన వాడై కుమారుని కౌగిలించు కొని యిట్లు పలికెను: “సద్భుద్ది గల నీ వంటి సత్పురుషుని చేత నేను తరించితిని.”

వయేభ్యో మునయ స్త్రాతా యేన సద్ధర్మ చారిణా మత్పూర్వైః ఖ్యాతి మానీతం మయా విస్తారితం పునః పరాక్రమవతా వీరః త్వయా తద్బహుళీ కృతమ్ యదుపాత్తం యశః పిత్రా ధనం వీర్య మథాపి వా తన్నహా పయతే యస్తు న నరో మధ్యమః స్మృతః త్వర్యా దధికం యస్తు పున రన్యత్ స్వశక్తితః నిష్పాదయతి తం ప్రాజ్ఞా వదంతి నరముత్తమమ్ యహ పిత్రా సముపాత్తాని ధన వీర్య యశాంసి వై న్స్యూనతాం నయతి ప్రాజ్ఞా స్తమహుః పురుషా ధమమ్ తన్మయా బ్రాహ్మణ త్రాణం కృత మాసీ ద్యథా త్వయా పాతాళ గమనం యచ్చ యచ్చాసుర వినాశనమ్ ఏత దభ్యధికం వత్స తేన త్వం పురుషోత్తమః తద్థన్యో స్య థవా న త్వహమేవ గుణాధికః త్వాం పుత్రా మీ దృశం ప్రాప్య శ్లాఘ్యం పుణ్యవతామపి న సత్ పుత్ర కృతా ప్రీతి మన్యః ప్రాప్నోతి మానవః పుత్రేన నాతి శయితో యః ప్రజ్ఞా దాన విక్రమైః

సద్ధర్మ చారివైన నీ చేత మునులు భయము నుండి రక్షింప బడిరి. నా చేత నిలుప బడిన మన పూర్వుల ఖ్యాతిని నీ వింకను విస్తరింప జేసితివి. పరాక్రమవంతుడవైన నీ చేత పూర్వార్జిత యశః కీర్తులు బహుళముగా జేయ బడినవి. తండ్రిచే సంపాదింప బడిన ధనము గాని, యశస్సు గాని, వీర్యము గాని మరియేది గాని ఏ పుత్రుడు నష్టము చేయ కుండునో, ఆ పుత్రుడు మధ్యమ పుత్రుడు అని చెప్పబడును. ఏ కుమారుడు పిత్రాదుల కంటె అధిక వీర్య శాలియై తన శక్తిచే ధన, వీర్య, యశస్సు లను వృద్ధి జేయునో యట్టి వానిని ప్రాజ్ఞులైన వారు ఉత్తమ పుత్రునిగా జెప్పుదురు. ఎవడు తండ్రి బొందిన ధన, వీర్య, కీర్తులను నశింప జేయునో యట్టి వానిని పండితులు పురుషాధమునిగా నెన్నుదురు. నే నెట్లు పూర్వము బ్రాహ్మణ రక్షణ జేసితినో, యా ప్రకారముగా నీవు గూడ ద్విజ రక్షణ జేసితివి. వత్సా! నీవు పాతాళ గమనము రాక్షస సంహారము జేయుటచే నా కంటె నధికుడవైతివి. అందువలన నీవు పురుషోత్తముడవు. ఇందు వలన నేను ధన్యుడను. పుణ్య వంతుల చేత కొనియాడ బడ దగిన నీ వంటి పుత్రుని పొంది నేను గుణాధికుడ నయితిని. నీవు గాదు నేనే గుణాధికుడను.ఏ పురుషుడు కుమారుని వలన ప్రజ్ఞా దాన పరాక్రమాదుల యందు అధికుడు గాడో, ఆ పురుషుడు పుత్రుడు కలిగినందు వలన ప్రీతిని పొందడు.

థిక్తస్య జన్మ యః పిత్రా లోకే విజ్ఞాయతే నరః యత్ పుత్రాత్ ఖ్యాతి మభ్యేతి తస్య జన్మ సుజన్మనః ఆత్మజ్ఞానీ యతో ధన్యో మధ్యో పిత్భ పితామహైః మాతృ పక్షేణ మాత్రా చ ఖ్యాతిం యాతి నరాథమః తత్ పుత్ర ధనవీర్యై స్త్వం వివర్ధస్వ సుఖేన చ గంధర్వ తనయా చేయం మా వియుజ్యతు వై త్వయా ఇతి పిత్రా బహువిధం ప్రియ ముక్త్వా పునః పునః పరిష్వజ్య స్వమావాసం సభార్యః స విసర్జితః స తయా భార్యయా సార్థం రేమే తత్ర పితుః పురే అన్యేషు చ తథోధ్యాన వన పర్వత సానుషు శ్వశూ శ్వశురయోః పాదౌ ప్రణిపత్య చ స శుభా ప్రాతః ప్రాత స్తత స్తేన ప్రణిపత్య సుమధ్యమా

ఏ పురుషుడు తండ్రిచే లోకము నందు ప్రఖ్యాతి పొందునో వాని జన్మ నింద్యము. ఏ పురుషుడు పుత్రుని ద్వారా ప్రఖ్యాతిని పొందునో అతని జన్మ సార్థకము. ఎవడు ఆత్మ జ్ఞానముచే ప్రసిద్ధిని పొందునో వాని జన్మమును ధన్యము. ఏ పురుషుడు పితృ పితామహులచే కీర్తిని బొందునో, వాడు మధ్యముడు. మాతృ పక్షము చేతగాని, తల్లి వలన గాని ప్రఖ్యాతిని బొందినచో వాడు నరాధముడని చెప్పవలెను. కావున వత్సా! ధన, బల, వీర్యములచే సుఖముగా వర్దిల్లుదువు గాక. గంధర్వ తనయ యగు నీ మదాలసను నీతో ఎప్పటికి వియోగము లేకుండు గాక. ఇట్లు రాజపుత్రుడు తండ్రిచే బహు విధములుగా మాటి మాటికి ప్రియ వాక్యములచే కొనియాడ బడి ఆలింగన పూర్వకముగా ననుపబడిన వాడై భార్యతో గూడి తన నివాసమునకు పోయెను. ఆ రాజ పుత్రుడు భార్యతో కలసి తండ్రి పట్టణము నందును ఆ విధముగా ఉద్యాన, వన, పర్వత సానువుల యందును విహరించ సాగెను. శుభ స్వరూపురాలు, సుమధ్యయు నగు నా మదాలస ప్రతి నిత్యము ప్రాతః కాలమున అత్త మామలకు, భర్తకు పాదాభి వందనము చేయుచు సుఖముగా నుండెను.