36 - యోగ నిరూపణము

దత్తాత్రేయుడు:

జ్ఞాన పూర్వో వియోగో యో జ్ఞానేన సహ యోగినః సా ముక్తి ర్బ్రహ్మణా చైక్య మనైక్యం ప్రాకృతైర్గుణైః యోగే చ శక్తి ర్విదుషా యేన శ్రేయః పరం భవేత్ ముక్తి ర్యోగా త్తథా యోగః సమ్యగ్ జ్ఞానా న్మహీపతే సంగాదోషోద్భవం దుఃఖంమమత్వాసక్త చేతసామ్ తస్మా త్సంగః ప్రయత్నేన ముముక్షుః సంత్యజే న్నరః సంగాభావే మమేత్యస్యాః ఖ్యాతే ర్హానిః ప్రజాయతే నిర్మ మత్యం సుఖాయైవ వైరాగ్యా ద్దోష దర్శనమ్ జ్ఞానా దేవ చ వైరాగ్యం జ్ఞానం వైరాగ్య పూర్వకమ్ తద్గృహం యత్ర వసతి స్తద్భోజ్యం యేన జీవతి యన్ముక్తయే తదేవోక్తం జ్ఞాన మజ్ఞాన మనృథా

దత్తాత్రేయుడు:

యోగారూఢ పురుషులకు జ్ఞాన లాభముచే అజ్ఞానము యొక్క వియోగము కలుగును. అదియే “ముక్తి” అని చెప్పబడును. మరియు ప్రకృతి గుణముల యొక్క అనైక్యమే సాక్షాత్తు బ్రహ్మైక్యమని చెప్పబడు చున్నది. మహీపతే! యోగముచే మోక్షము, జ్ఞానముచే యోగము, మమతాసక్త చిత్తముచే దుఃఖము యొక్క ఆవిర్భావ మగు చున్నది. అందు వలన మోక్షము కోరు పురుషుడు ప్రయత్నా పూర్వకముగా దుస్సంగమును పరిత్యాగము చేయ వలెను. దుస్సాంగత్యమును పరి త్యాగము చేయుట చేత మమకారము తొలగి పోవును. మమతా రాహిత్యమే సుఖమునకు కారణము. వైరాగ్యముచే సంసారము యొక్క అసారమును, అనిత్యమును, తెలుసుకొన గలుగు చున్నాడు. జ్ఞానము వలన ఎట్లు వైరాగ్యము కలుగునో వైరాగ్యము చేత కూడా జ్ఞానము కలుగును. ఎచట నివసించునో అదియే గృహము. దేని చేత జీవించునో అదియే భోజనము. దేని వలన మోక్షము లభించునో అదే జ్ఞానము. దీని కంటే భిన్న మైనది, అజ్ఞానమని చెప్ప బడును.

ఉపభోగేన పుణ్యానాం పుణ్యానాం చ పార్థివః కర్తవ్యమితి నిత్యానా మకామ కరణా త్తథా అసంచయా దపూర్వస్య క్షయా త్పూర్వార్జితస్య చ కర్మణో బంధ మాప్నోతి శరీరం చ పునః పునః కర్మణా మోక్ష మాప్నోతి వైపరీత్యేన తస్య తు ఏతత్తే కథితం జ్ఞానం యోగం చేమం నిభోథ మే యం ప్రాప్య బ్రాహ్మణో యోగీ శాశ్వతా న్నాన్యతాం వ్రజేత్ ప్రాగే వాత్మాత్మనా జేయో యోగినాం స హి దుర్జయః కుర్వీత తజ్జయే యత్నం తస్యోపాయం శృణుష్వ మే ప్రాణాయామై ర్దహే ద్దోషా న్దారణాభిశ్చ కిల్బిషమ్ ప్రత్యాహారేణ విషయాన్థ్యానేనా నీశ్వరా న్గుణాన్

పార్థివా! పుణ్య పాపముల యొక్క భోగముచే కామనా విహీనుడై నిత్య క్రియలను అనుష్టానము చేసిన పిమ్మట పూర్వో పార్జిత కర్మలు క్షయము అగును. మరియు అపూర్వ కర్మల యొక్క సంచయము లేనందున శరీర బంధనము లేకుండును. రాజా! ఈ విషయము నీకు వర్ణించితిని. ఇప్పుడు యోగమును గూర్చి చెప్పెదను వినుము. ఈ యోగ లాభము చేత శాశ్వతమగు బ్రహ్మత్వమును బొందును. అన్నిటి కంటె ముందుగా ఆత్మను ఆత్మచే జయించవలెను. ఆత్మ యోగులకు కూడ తెలియ శక్యము గానిది. ఆత్మను జయించుట యందు ప్రయత్నము చేయ వలెను. ఆ ఉపాయమును చెప్పెదను వినుము. ప్రాణాయామము లచే దోషములను, ధారణచే పాపములను, ప్రత్యాహారముచే విషయములను, ధ్యానముచే అనీశ్వర గుణములను దగ్ధము చేయ వలెను.

యథా పర్వత దాతూనాం ధ్మాతానాం దాహ్యతే మలమ్ తథేన్ద్రియ కృతా దోషా దహ్యంటే ప్రాణ నిగ్రహాత్ ప్రథమం సాధనం కుర్యా త్ప్రాణాయామస్య యోగవిత్ ప్రాణాపాన నిరోధస్తు ప్రాణాయామ ఉదాహృతః లఘు మధ్యోత్తరీయాఖ్యః ప్రాణాయామ స్త్రిదోదితః తస్య ప్రమాణం వక్ష్యామి తదలర్క శృణుష్వ మే లఘు ర్ద్వాదశ మాత్రస్తు ద్విగుణః స తు మధ్యమః త్రిగుణాభిస్తు మాత్రాభి రుత్తమః పరికీర్తితః నిమేషోన్మేషనే మాత్రా కాలో లఘ్వక్షర స్తథా ప్రాణాయామస్య సంఖ్యార్థం స్మృతో ద్వాదశ మాత్రికః

ఏ ప్రకారముగా అగ్ని హోత్రముచే పర్వత ధాతువుల మలమును దహించుటచే నిర్దోషత్వమును పొందు చున్నవో అట్లుగానే ప్రాణాయామముచే ఇంద్రియములచే చేయ బడిన సమస్త దోషములు దగ్ధము లగును. యోగ వేత్తయగు పురుషుడు ప్రథమముగా ప్రాణాయామమును సాధన చేయవలెను. ప్రాణము మరియు అపానము ఈ రెండు వాయువుల యొక్క నిరోధమే ప్రాణాయామమని చెప్పబడు చున్నది. ప్రాణాయామము లఘువు, మధ్యమము మరియు ఉత్తరీయము అని మూడు విధములు. అలర్కా! ఈ మూడు ప్రాణాయామముల యొక్క ప్రమాణము చెప్పు చున్నాను వినుము. లఘు ప్రాణాయామము ద్వాదశ మాత్రా కాలము. మధ్యమము దీనికి ద్విగుణము. (అనగా ఇరువది నాలుగు మాత్రలు) ఉత్తరీయము (ఉత్తమ ప్రాణాయామము) మధ్యమము కంటె త్రిగుణ మాత్రా యుక్తమని చెప్పబడు చున్నది. నిమేషము మరియు ఉన్మేషము ఈ రెంటి యొక్క సమయమును మాత్రా కాల మందురు. ఈ ప్రకారము పన్నెండు మాత్రల కాలమైనచో లఘు ప్రాణాయామము అగు చున్నది.

ప్రథమేన జయే త్స్వేదమ్ మధ్యమేనా చ వేపధుమ్ విషాదం హి తృతీయేన జయే ద్దోషాననుక్రమాత్ మృదుత్వం సేవ్యమానాస్తు సింహశార్దూల కుంజరాః యథా యాంతి తథా ప్రాణో వశ్యో భవతి యోగినః వస్యం మత్తం యథేచ్చాతో నాగం నయతి హస్తివః తథైవ యోగీ చందేన ప్రాణం నయతి సాధితమ్ యథా హి సాదితః సి హో మృగాన్ హంతి న మానవాన్ తద్వ న్నిషిద్ద పవనః కిల్బిషం న నృణాం తనుమ్ తస్మా ద్యుక్తః సదా యోగీ ప్రాణాయామపరో భవేత్ శ్రూయతాం ముక్తి ఫలదం తస్యావస్థా చతుష్టయమ్

ప్రథమ ప్రాణాయామము వలన స్వేదము (చెమట), రెండవ దానిచే కంపము, మూడవ ప్రాణాయామముచే యదా క్రమముగా విషాదాది దోషములను జయించ వలసి యున్నది. సింహము, వ్యాఘ్రము, గజము, క్రమ శిక్షణచే సౌమ్యత్వమును ఎట్లు పొందు చున్నవో ఈ ప్రకారము గానే ప్రాణములు ప్రాణాయామము వలన యోగులకు వశములగు చున్నవి. మావటివాడు వశము చేసుకొనిన మదపు టేనుగును తన ఇచ్చాను సారముగా ఎట్లు నడిపించునో అట్లుగానే యోగి జనులు కూడా ప్రాణములను వశము చేసుకొనిన పిమ్మట తమ ఇచ్చాను సారముగా కార్యములను చేసుకొన గలుగు చున్నారు. క్రమ శిక్షణ కలిగిన సింహము మానవులను చంపక మృగములను చంపునో అట్లే ప్రాణ వాయువు యొక్క సాధనచే పాపములను నశింప చేసి శరీరమును నష్ట పరచకుండును. ఇందువలననే యోగులు సదా ప్రాణాయామ పరాయణులై యుందురు. ఆ ప్రాణాయామమునకు ముక్తి ఫలము నిచ్చునట్టి అవస్థా చతుష్టయము కలదు. ఇప్పుడు చెప్పెదను వినుము.

ధ్వస్తి ప్రాప్తి స్తధా సంవి త్ప్రాసాదశ్చ మహీపతే స్వరూపం శృణు చైతేషాం కథ్యమాన మను క్రమాత్ కర్మణా మిష్ట దుష్టానాం జాయంతే పరిసంక్షయః చేతసోపకషాయత్వం యత్ర సా ధ్వస్తి రుచ్యతే ఐహికా ముష్మికా కామాల్లోభ మోహాత్మకా స్వయమ్ నిరుధ్యాస్తే సదా యోగీ ప్రాప్తిః సా సార్వకాలికీ అతీతా నాగతా నర్థా న్విప్రకృష్ట తిరోహితాన్ విజానాతీన్దు సూర్య గ్రహాణాం జ్ఞాన సంపదా తుల్య ప్రభావస్తు యదా యోగీ ప్రాప్నోతి సంవిదమ్ తదా సంవి దితిఖ్యాతా ప్రాణాయామస్య సా స్థితిః

ప్రాణాయామము, ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్ మరియు ప్రసాదము అని నాలుగు విధములుగా ఉన్నది. ఇప్పుడు క్రమానుసారముగా వీని స్వరూపములను వర్ణించెదను వినుము. ఏ అవస్థ యందు మంచి చెడుల సమస్త క్రియల యొక్క ఫలము క్షయ మగునో మరియు చిత్తము యొక్క మాలిన్యము తొలగి పోవునో దానిని “ధ్వస్తి” అని అందురు. యోగ పురుషులు నగువారు ఏ పరిస్థితిలో లోభ, మోహాత్మకమగు ఐహికము మరియు ముష్మికములైన సమస్త కోరికలను నిరంతరము స్వయముగా నిరోధించు చున్నారో, ఆ అవస్థను “ప్రాప్తి” అని అందురు. యోగి జనులు ఏ స్థితి యందు జ్ఞాన సంపత్తి వశముచే చంద్ర, సూర్య, గ్రహ, నక్షత్రములతో సమానమగు జ్ఞాన సంపత్తిని పొందుదురో, మరియు అతీత, అనాగత అంతర్ధాన దూరాస్థములగు సర్వ విషయములను తెలుసుకోన గలుగు చున్నారో ఆ స్థితిని “సంవిత్” అని అందురు.

యాన్తి ప్రసాదం యేనాస్య మనః పంచ చ వాయవః ఇంద్రియా ణీంద్రియార్థాశ్చ స ప్రసాద ఇతి స్మృతః శృణుష్వ చ మహీపాల ప్రాణాయామస్య లక్షణమ్ యుంజతశ్చ సదాయోగం యాదృ గ్విహిత మానసమ్ పద్మ మర్ధాసనం చాపి తథా స్వస్తిక మానసమ్ ఆస్థాయ యోగం యుంజీత కృత్వా చ ప్రణవం హృది సమః సమాసనో భూత్వా సంహృత్య చరణా వుభౌ సంవృతాస్య స్తధైవోరూ సమ్య గ్విష్టభ్య చాగ్రతః పార్ష్ణిభ్యాం లింగ వృషణా వస్పృశం ప్రాయతః స్థితః కించి రున్నామిత శిరా దంతైర్దన్తాన్న సంస్పృశేత్

ఎట్టి స్థితిలో యోగి యొక్క చిత్తము పంచ వాయువులు, ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క విషయ సమూహములు శుద్ధి లాభము కలిగిన వగునో ఆ స్థితిని “ప్రసాదము” అని పలుకుదురు. మహీపాలా! ఇప్పుడు ప్రాణాయామ లక్షణము మరియు యోగారంభ మందు ఏ విధముగా ఆసనము విహితమో చెప్పెదను వినుము. పద్మాసనము, అర్థాసనము, స్వస్తికాసనము ఈ మొదలగు ఆసనములను అవలంభించి హృదయ మందు ప్రణవ మంత్రమును జపించుచు యోగమును అనుష్టించ వలెను. శుద్ధ భావముతో సమమయిన ఆసన మందు కూర్చొని రెండు పాదములను ముడుచు కొని నోటిని మూసుకొని, రెండు తొడలను బాగుగా అగ్ర భాగ మందు ఉండునటుల జేసి నిశ్చల మనస్సుతో ఈ విధముగా ఉండవలెను. ఆ సమయ మందు హస్తములతో లింగమును, అండ కోశమును స్పృశించ కూడదు. శిరస్సు కొంచెము పైకి ఎత్త వలెను. మరియు దంతములచే దంతములను తాక రాదు.

స పశ్య న్నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్ రజసా తమసో వృత్తిం సత్త్వేన రజస స్తథా సంచాద్య నిర్మలే సత్త్వే స్థితో యుంజీత యోగవిత్ ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ప్రాణాదీ న్మన ఏవ చ నిగృహ్య సమవాయేన ప్రత్యాహార ముపక్రమేత్ యస్తు ప్రత్యాహరే త్కామా న్సర్వాఙ్గానీప కచ్చపః సదాత్మరతి రేకస్థః పశ్యత్యాత్మాన మాత్మని స బాహ్యాభ్య న్తరం శౌచం నిష్పాద్యా కంఠనాభితః పూరయిత్వా బుధో దేహం ప్రత్యాహార ముపక్రమేత్ ప్రాణాయామా దశ ద్వౌ చ ధారణా సాభిదీయతే

మరియు తన దృష్టి నాసిక యొక్క అగ్ర భాగము నందే ఉంచ వలెను. ఎటు వైపును చూడరాదు. ఈ అవస్థ యందు యోగ పురుషుడు రజో గుణముచే తామస వృత్తిని నాశనము చేసి కేవలము నిర్మల తత్వ మందు స్థితి గల యోగాభ్యాస మందు నియుక్తుడు కావలెను. ఇంద్రియ విషయముల నుండి మరియు మనస్సు, ప్రాణాదికములను నిగ్రహించి, తాబేలు ఏ ప్రకారముగా తన సమస్త అవయవములను ముడుచు కొనునో, ఆ విధముగా ప్రత్యాహార మందు ప్రవృత్తుడు కావలెను. ఈ విధముగా కామ సమూహమును ప్రత్యాహార పూర్వకముగా కేవలము ఆత్మ యందే ఎల్లప్పుడు ఆసక్తుడై ఉండుట చేత ఆత్మ ద్వారా ఆత్మ యొక్క దర్శనము ప్రాప్తించును. విచక్షుణుడైన యోగి కంఠము నుండి నాభి దేశ పర్యంతము బాహ్య అభ్యంతరిక శుద్ధి విధాన పూర్వకముగా దేహమును పరిపూర్ణము చేసి ప్రత్యాహార సాధనము చేయ వలెను. ప్రాణాయామము పది విధములుగా నున్నది. ధారణ రెండు విధములుగా చెప్పబడు చున్నది.

ద్వే ధారణే స్మృతే యోగే యోగిభి స్తత్త్వ దృష్టిభిః తథా వై యోగ యుక్తస్య యోగినో నియతాత్మనః సర్వే దోషాః ప్రణశ్యంతి స్వస్థ శ్చైవోవజాయతే వీక్షతే చ పరం బ్రహ్మ ప్రాకృతాంశ్చ గుణాన్ పృథక్ వ్యోమాది పరమాణూశ్చ తథాత్మానా మకల్మషమ్ ఇత్థం యోగీ యతాహారః ప్రాణాయామ పరాయణః జితాం జితాం శనైర్భూమి మారోహేత యథా గృహమ్ దోషా న్వ్యాదీం స్తథా మోహ మాక్రాంతా భూ రనిర్జితా వివర్ధయతి నారోహే త్తస్మా ద్భూమి మనిర్జితామ్ ప్రాణానా ముపసం రోథా త్ప్రాణాయామ ఇతి స్మృతః

తత్త్వ దర్శులగు యోగి జనులు యోగాభ్యాస మందు రెండు విధములుగ “ధారణ” ను నిర్దేశించిరి. నియతాత్ముడు యోగ సాధనము చేయుట వలన, యోగి యొక్క సమస్త దోషములు నశించు చున్నవి. సమస్త ప్రాకృత గుణములను వేరుగా పర బ్రహ్మ దర్శన లాభము కలుగు చున్నది. ఈ ప్రకారముగా ఆకాశాది పరమాణువులు మరియు విశుద్ధ ఆత్మ యొక్క సాక్షాత్కారము కలుగు చున్నది. ఇట్లు యోగి ఆహార నియమముతో ప్రాణాయామ మందు ఆసక్తి గల వాడైనచో మెల్ల మెల్లగా యోగ భూమిని జయించిన వాడై తన గృహముతో సమానముగా దాని యందు ఆరూఢు డగును. ఇట్లు భూమిని జయించినచో దాని ద్వారా కామాది దోషములు వ్యాధి సమూహము మరియు మోహ వృద్ధులు లభించును. అందు వలననే జయించని భూమిని ఆరోహించ రాదు. దేని ద్వారా పంచ ప్రాణములు నిగ్రహింప బడుచున్నవో దానిని ప్రాణాయామమని చెప్పుదురు.

ధారణేత్యుతే చేయం ధార్యతే యన్మనో యయా శబ్దాదిభ్యః ప్రవృత్తాని యదక్షాణి యతాత్మభిః ప్రత్యాహ్రియన్తే యోగేన ప్రత్యాహార స్తతః స్మృతః ఉపాయ శ్చాత్ర కధితో యోగిభిః పరమర్షిభిః యేన వ్యాధ్యాదయో దోషా న జాయన్తే హి యోగినః యథా తోయార్ధిన స్తోయం యన్త్రనాలాదిభిః శనైః ఆపిబేయు స్తథా వాయుం పిబే ద్యోగీ జితశ్రమః ప్రాజ్నాభ్యాం హృదయే చాథ తృతీయే చ తథోరసి కంఠే ముఖే నాసికాగ్రే నేత్ర భ్రూమధ్య మూర్ధసు కించ తస్మా త్పరస్మి శ్చ ధారణా పరమా స్మృతా

దేని ద్వారా మనోధారణ కలుగు చున్నదో దానిని “ధారణ” అని చెప్పుదురు. మరియు నియతాత్ముడగు పురుషుడు ఏ అవస్థ యందు ఇంద్రియ సమూహమును శబ్దాది విషయముల నుండి ప్రత్యాహరణము చేయు చున్నాడో దానిని “ప్రత్యాహారము” అని చెప్పుదురు. యోగ సిద్ధులైన పురుషులు ఈ విషయములో ఏ ఉపాయము నిరూపించిరో, ఆ ఉపాయము వలన యోగి యొక్క శరీర మందు వ్యాధులు మొదలగునవి ఆక్రమించవు. జలమును కోరువాడు ఏ ప్రకారము యంత్రాదుల వలన నెమ్మదిగా జల పానము చేయునో యోగ పురుషుడు కూడా అట్లే శ్రమ లేకుండ వాయు పానము చేయ వలెను. మొదట నాభి యందు తరువాత హృదయ మందు మరల వక్షస్థల మందు, తిరిగి కంఠ మందు క్రమముగా నాసాగ్ర మందు, లోచన మందు భూమధ్య మందు మూర్ధ ప్రదేశ మందు చివరకు ఆ పర బ్రహ్మ యందు మనోధారణ చేయ వలెను. (అనగా ఆత్మ దర్శనము చేయ వలెను).

దశైతాధారణాః ప్రాప్య ప్రోప్నో త్యక్షర సామ్యతామ్ నాథ్మాతః క్షుధితః శ్రాన్తో న చ వ్యాకుల చేతనః యుంజీత యోగం రాజేంద్ర యోగీ సిద్ద్యర్థ మాదృతః నా తిశీతేన చోష్ణే వై న ద్వంద్వేనా నిలాత్మకే కాలేష్వేతు యుంజీత న యోగం ధ్యాన తత్పరః స శబ్దాగ్ని జలాభ్యాశే జీర్ణగోష్టే చతుష్పదే శుష్క పర్ణచయే వీధ్యాం శ్మశానే ససరీసృపే సమయే కూపతీరే వా చైత్యవల్మీక సంచయే దేశే ష్వేతేషు తత్త్వజ్ఞో యోగాభ్యాసం వివర్జయేత్ సత్త్వస్యానుపపత్తౌ చ దేశకాలం వివర్జయేత్

ధారణ పది విధాలుగా చెప్పబడు చున్నది. ఈ పది విధాల ధారణా సిద్ధి వలన బ్రహ్మ సారూప్య లాభము కలుగును. ఓ రాజేంద్రా! యోగ పురుషులు సిద్ధి లాభము కొరకు అధిక భాషణము, బాధతో కూడుకొన్న అలసట మరియు చిత్త చాంచల్యమును దూరము చేసుకొని ప్రయత్నా పూర్వకముగా యోగాభ్యాసమందు ప్రవృత్తు లవ వలెను. అతి శీతలము, అతి గ్రీష్మముల యందు మరియు అతి వేగముగా వీచు పవన మందు, ధ్యాన తత్పరుడై యోగాభ్యాసము చేయరాదు. సశబ్ద స్థానము నందు, అగ్ని మరియు జల సమీపము నందు ప్రాచీన గోశాల యందు, నాలుగు దారుల కూడలి యందు, ఎండిన ఆకులతో నిండిన ప్రదేశ మందు, నదీ తీర మందు, సర్పాదులతో నుండు ప్రదేశ మందు, నూతి ఒడ్డునందు, చైత్య వృక్ష మందు, మరియు పుట్టల సమూహముతో నుండు గుట్టల యందు, తత్త్వ విదుడైన పురుషుడు యోగాభ్యాసము చేయ కూడదు. సాత్త్విక భావము చక్కగా సిద్ధించని యెడల అనగా ఏ ప్రదేశము నందు సాత్త్విక మగు వస్తువులు లభింపవో ఆ దేశ కాలములను పరిత్యజించ వలెను.

నాసతో దర్శనం యోగే తస్మా త్తత్పరివర్జయేత్ దోషా నేతా ననాదృత్య మూడత్వా ద్యో యునక్తి వై విఘ్నాయ తస్య వై దోషా జాయన్తే తన్నిబోధ మే బాధిర్యం జడతా లోపః స్మృతే ర్మూకత్వ మంధతా జ్వరశ్చ జాయతే సద్య స్తత్త దజ్ఞాన యోగినః ప్రమాదా ద్యోగినో దోషా యద్యేతే స్యు శ్చికిత్సితమ్ తేషాం నాశాయ కర్తవ్యం యోగినాం తాన్నిబోధ మే స్నిగ్ధాం యవాగూ మత్యుష్ణాం భుక్త్వా తత్రైవ దారాయేత్ వాతగుల్మ ప్రశాంత్యర్థ ముదావర్తే తథోదరే యవాగూం వాపి పవనం వాయుగ్రంధిం ప్రతిక్షిపేత్

మరియు యోగ మందు చెడు విషయములను చూచుట మంచిది కాదు. అందు వలన దానిని వర్ణింప వలెను. ఏ పురుషుడు మూర్ఖత్వమునకు వశుడై ఈ అన్ని స్థానములను చక్కగా విచారణ చేయక యోగాభ్యాసమును మూర్ఖముగా చేయునో, అతడి యందు అనేక దోషములు ఉత్పన్నమై అతని పనుల యందు విఘ్నములను కలుగ జేయును. అవి చెప్పెద వినుము. ఆ యోగికి చెవిటి తనము, జడత్త్వము మూగ తనము, స్మృతి లోపము, అంధత్వము మరియు తక్షణ జ్వరము కలుగును. ప్రమాదవశమున ఈ అన్ని దోషములు ఆవిర్భవించిన యెడల వాటి యొక్క శాంతి కొరకు ఏ విధముగా చికిత్స చేయవలయునో అది కూడా వినుము. బాగుగా వేడి చేసిన యవాగును స్నిగ్ధము చేసి భక్షణ పూర్వకము ఉదరము నందు ధారణ చేయ వలయును. వాతము, గుల్మము, మరియు అజీర్ణము మరియు ఉదర రోగములు శాంతించుటకు యవాగును తప్పక తినవలెను. దీనిని భక్షించుట వలన వాయువు మరియు వాయు గ్రంథి రోగములు కూడా నశించును. (యవాగు అనగా గంజి)

తద్వత్కంపే మహాశైలం స్థిరం మనసి థారాయేత్ విఘాతే వచసో వాచం భాధిర్యే శ్రవణేంద్రియమ్ యథైవామ్ర ఫలం ధ్యాయే తృష్ణార్తో రస నేంద్రియమ్ యస్మి న్యస్మి నృజా దేహే తస్మిం స్తదుపకారిణీమ్ ధారయే ద్దారణా ముష్ణే శీతాం శీతే చ దాహినీమ్ కీలం శిరసి సంస్థాప్య కాష్ఠం కాష్ఠేన తాడయేత్ లుప్త స్మృతేః స్మృతిః సద్యో యోగిన స్తేన జాయతే ద్యావాపృథివ్యో ర్వాయ్వగ్నీ వ్యాపినా వాపి ధారయేత్ అమాను షాత్సత్వజాన్వా భాధా స్త్వితి చికిత్సితమ్ అమానుషం సత్వ మాన్త ర్యోగినం ప్రవిశేద్యది

వాయ్వగ్నిథారణేనైనం దేహ సమస్తం వినిర్దహేత్

ఏవం సర్వాత్మానా రక్షా కార్యా యోగవిదా నృపః

మరియు కంపనము కలుగు నపుడు మనస్సు నందు గొప్ప భారము అను పర్వతమును దరించ వలెను. అనగా మనస్సు చంచలమగు నప్పుడు ప్రళయ కాలమందు స్థిరముగా నుండు మహా శిఖరమును ధరించ వలెను. వాక్కు యొక్క శక్తి విలుప్తమై నప్పుడు వాక్కును దరించ వలెను. మరియు శ్రవణ శక్తి నష్టమై నపుడు, తృష్ణార్తుడగు పురుషుడు ఏ విధముగా రసనేంద్రియ లాభము కలుగుటకు ప్రయత్నించునో ఆ విధముగానే శ్రవణేంద్రియములను ధారణా చేయుచు నుండ వలెను. ఈ విధముగా ఏ ఏ దేహము నందు వ్యాధులు కలుగునో ఆయా దేహము లందు తగిన ఉపకరణములు చేయ వలెను. ఉష్ణ మందు శీతలమును గ్రహించ వలెను. మరియు శీతల మందు ఉష్ణము సహాయకారిగా ఉండ వలెను. శిర మందు సూక్ష్మ కీలకమును స్థాపనా పూర్వకముగా కాష్ఠముచే ఆ కీలక కాష్ఠమును తట్టినచో, స్మృతిలేని రోగికి వెంటనే స్మృతి యొక్క శక్తి కలుగును. లేక స్మృతి శక్తి విలుప్తమై నప్పుడు ఆకాశము, భూమి, వాయువు మరియు అగ్నిని ధరింప వలెను. అమానుష సత్త్వము వలన జనితమైన విఘ్న సమూహములకు చికిత్సలు ఈ విధముగా నిర్దిష్టమై యున్నవి. యోగుల హృదయ మందు అమానుష సత్త్వము కలిగినప్పుడు అతడు వాయువు మరియు అగ్ని యొక్క ధారణ చేయుట వలన దానిని దగ్ధము చేయును. ఓ రాజా! ఈ విధముగా సర్వాంతః కరణముతో శరీరము యొక్క రక్షణ చేయుట యోగి అయిన పురుషునకు ఉచితమై యున్నది.

ధర్మార్థ కామ మోక్షాణాం శరీరం సాధనం యతః ప్రవృత్తి లక్షణాఖ్యానా ద్యోగినో విస్మయా త్తథా అలౌల్య మారోగ్య మనిష్టురత్వం గంధః శుభో మూత్ర పురీష మల్పమ్ కాన్తిః ప్రసాదః స్వరసౌమ్యతా చ, యోగప్రవృత్తేః ప్రథమం హి చిహ్నమ్ అనురాగం జనో యాతి పరోక్షే గుణ కీర్తనమ్ న భిభ్యతి చ సత్వాని సిద్దే ర్లక్షణ ముత్తమమ్ శీతోష్ణాదిభి రుత్వుగ్రై ర్యస్య బాధా న విద్యతే న భీతి మేతి చాన్యేభ్య స్తస్య సిద్ధిరుపస్థితా

ఎందువలన అనగా శరీరమే ధర్మ, అర్థ, కామ, మోక్షములను ఈ నాలుగు వర్గముల సాధనకు మూలము. ప్రవృత్తి స్వరూపము యొక్క వర్ణన, విస్మయము ఈ రెండు కారణముల వలననే యోగి యొక్క విజ్ఞానము నష్టమై పోవు చున్నది. అందుచేత ప్రవృత్తిని గుప్త రూపమున ఉంచ వలెను. అచంచలము, ఆరోగ్యము, అనిష్ఠురము, దేహము నందు సుగంధ ప్రసారము, మూత్రము మరియు పురీషము యొక్క అల్పము, కాంతి ప్రసాదము, మరియు మధుర స్వరము ఇవి అన్నియు యోగ ప్రవృత్తి యొక్క ప్రథమ చిహ్నములు. ఏ అవస్థ యందు మానవుడు అనురాగము చెంది పరోక్ష మందు అనగా వెనుక గుణములను తలచునో మరియు ఏ జీవికి భయ ప్రాప్తి కలుగదో, ఆ సమయము సిద్ధి యొక్క ఉత్తమ లక్షణమని తెలుసుకొన వలెను. అత్యధిక మగు ఉష్ణ, శీతల మందు ఎవరికి బాధ కలుగదో మరియు ఇతరుల వలన ఎవరికి భయము కలుగదో అతనికి సిద్ధి లాభము కలుగునని తెలిసి కొనుము.