12 - మహా రౌరవాది నరక వివరణము

జనకుడు:

సాదు వత్స త్వయాఖ్యాతం సంసార గహనం పరమ్  జ్ఞాన ప్రధాన సంభూతం సమాశ్రిత్య మహా ఫలం   తత్ర తే నరకా స్సర్వే యథా వై రౌరవ స్తథా   వర్ణితా స్తా న్సమాచక్ష్వ విస్తరేణ మహామతే  

జనకుడు:

కుమారా! నీవు జ్ఞాన ప్రదమగు మహా ఫలము నిచ్చు నట్టి యత్యంత సంసార గహనమును గురించి చక్కగా చెప్పితివి. మహామతీ! నీవు రౌరవాది నరకము లెన్నియో జెప్పితివి. వాటిని గురించి సవిస్తరముగా జెప్పుము.

పుత్రుడు:

 రౌరవ స్తే సమాఖ్యాతః ప్రథమం నారాకో మయా   మహా రౌరవ సంజ్ఞం తు శృణుష్వ నరకం ప్రతి   అగమ్యా గమనే యే చ అభక్ష్యా భక్షణే రతాః   మిత్ర ద్రోహ కరాశ్చైవ స్వామి విస్రంభ ఘాతకాః   వరదార రతాశ్చైవ స్వదార పరివర్జి నః   మార్గ భంగకరా యే చ తడాగా రామ భేదకాః  

కుమారుడు:

తండ్రీ! నీకు మొదట రౌరవ నరకము గురించి జెప్పితిని. ఇప్పుడు మహా రౌరవ నరకమును గురించి జెప్పెదము. పొంద గూడని స్త్రీలను బొందిన వారు, అభక్ష్య భక్షణ రతులు, మిత్ర ద్రోహులు, స్వామి విశ్వాస ఘాతకులు, పర స్త్రీ గమనము జేయువారు, స్వభార్యా త్యాగము జేయువారు, మార్గములు, చెరువులు, తోటలు, పాడు జేయువారు.

ఎతేన్యే చ దురాచారా దహ్యంతే తత్ర కింకరైః   యోజనానాం సహస్రాణి సప్త పంచ సమంతతః   తత్తాప తప్తా సా సర్వా ప్రోద్య ద్విద్యు త్సమ ప్రభా   విభా త్యతి మహా రౌద్రా దర్శన స్పర్శనాదిషు   తస్యాం బద్ధః రాభ్యాం చ వద్భ్యాం చైవ యమానుగైః   ముచ్యతే పాపకృ న్మధ్యే లుంఠ్యమాన స్స గచ్చతి   కాకై ర్భకై ర్వృకోలూకై ర్వృ శ్చికై ర్మశకై స్తథా   భక్ష్యమాణ స్తథా గృద్రై ర్ద్రుతం మార్గే వికృష్యతే   దహ్యమానః పిత ర్మాత ర్బ్రాత స్తాతే తి చాకులః   వద త్యసకృ దుద్విగ్నో న శాన్తి మధి గచ్చతి  

వీరే గాక యితరులగు దురాచారులగు పాపుల నచ్చటికి తీసికొని బోయి యమ దూతలు దహించు చుందురు. ఆ మహా రౌరవ నరకము బన్నెండు యోజనముల సమాన ప్రమాణము గలదియు, దాని భూమి తామ్ర మయ మగు నదిగా నుండును. ఆ తామ్ర భూమి క్రింద నగ్ని హోత్రుడుండి దహించు చుండును. ఆ తామ్ర మయ భూమి యగ్నిచే తప్తమై మెరుపుల వలె యన్ని దిక్కులను బ్రకాశించును. ఆ జ్వాలలను స్పర్శ చేయుటకు గాని జూచుటకు గాని యతి మహా రౌద్రమై భయంకరముగా నుండును. యమదూతలు పాపాత్ముల పాదములను, జేతులను గట్టి దాని యందు బడ వైతురు. పాపాత్ములు దాని యందు దొర్లు చుందురు. దాని లోపలికి బోవు చుందురు. మార్గ మందు కాక, బక, వృక, ఉలూక, వృశ్చిక, మశక, గృద్రములు కరుచు చుండ, మరియు భక్షించు చుండ, యమ దూతలు త్వరితముగా నీడ్చుకొని బోవు చుందురు. పాపాత్ము లిట్లు దహింప బడుచు, వ్యాకుల చిత్తులై, తల్లీ! తండ్రీ! అన్నా! అని యిట్లు పలుమార్లు బిలుచుచు రోదనము జేయు చుందురు. ఉద్విగ్న హృదయులై శాంతిని బొంద లేని వారగుదురు.

ఏవం తస్మా న్నరై ర్మోక్షో హ్యతి క్రాంతై రవాప్యతే   వర్షాయుతా యుతైః పాపం యైః కృతం దుష్ట బుద్దిభిః   తథాన్యస్తు తమో నామ సోతి శీతః స్వభావతః   మహా రౌరవవద్దీర్ఘ స్తథాతి తమసా వృతః   గోవధశ్చ కృతో యేన భ్రాతౄణాం ఘాత ఏవ చ   అబన్న బాల ఘాతీ చ నీయతే శీత సంకరే   శీతార్తా స్తత్ర దావంతి నారా స్ట మసి దారుణే

పరస్పరం సమాసాద్య పరిరభ్యా శ్రయంతి చ   దంతా స్తేషాం చ భజ్యంతే శీతార్తి పరికంపితాః   క్షుతృష్టా ప్రబలా తత్ర తథే వాన్యే ప్యుపద్రవాః  

ఎల్లవేళలా పాపములు జేయు దుష్ట బుద్ధులగు వీ రిట్లు వేల కొలది సంవత్సరము లను భవించిన పిదప నా నరకము నుండి విముక్తు లగుదురు. దీని తరువాత నంధకార బంధురమగు “తమ” మను నరకము గలదు. అది స్వభావముగా నత్యంత శీతలముగా నుండును. ఇది మహా రౌరవ నరకముతో సమానమగు ప్రమాణము గలదిగా నుండును. గోహత్య, భ్రాతృ హత్య, బాల హత్య జేసిన వారిని, యతి శీతలము, మహా దుఃఖదాయక మగు నీ నరకమున బడ వేయుదురు. దారుNమగు చీకటియు, మహా శీతలమగు నా నరకమున బడ వేయబడిన పాపులు చీకటిలో శీతార్తులై యిటు నటు పరుగిడు చుందురు. మరియు చలిచే నొకరి నొకరు గౌగిలించు కొని పరస్పరాశ్రయమును బొందుచు, నివసించు చుందురు. శీతార్తులై మిక్కిలి వణుకు చుందురు. మిక్కిలి చలి వలన దంతము లూడిపోవును.అచ్చట యాకలి దప్పులు మిక్కుటముగా నుండును. మరియు నితర యుపద్రవము లెన్నియో యుండును.

హిమ ఖండ వహో వాయు భిన త్త్య స్థీని దారుణః   మజ్జా సృ గ్గలితం తస్మా దశ్నువంతి క్షుదాన్వితాః   లేలిహ్యమానా భ్రామ్యంతే పరస్పర సమాగ మే   ఏ డం త త్రాపి సుమహాన్ క్లేస స్తమసి మానవైః   ప్రాప్యతే బ్రాహ్మణ శ్రేష్ఠః యావ ద్గుష్క్రుత సంక్షయః   నికృకంతన ఇతి ఖ్యాత స్తతో న్యో నరకోత్తమః   తస్మి న్కులాల చక్రాణి భ్రామ్య న్త్యవిరతం పితః   అదృష్టం దృష్టవ ద్భ్రూయా దశ్రుతం శ్రుత మేవ చ   ఏకాక్షరం గురుం యస్తు దురాచారో న మన్యతే   న శ్రుణోతి గురో ర్వాక్యం శాస్త్ర వాక్యం తథైవ చ  

మంచు గడ్డలు, దహించునట్టి దారుణ మగు చలి గాలిచే పాపుల ఎముకలు ముక్క చక్కలగును. మరియు వాటి నుండి మజ్జయు, రక్తమును స్రవించు చుండును. పాపు లత్యంత మగు నాకలి గొనియున్న వారగుటచే వాటిని భక్షింతురు. మరియు నొకరి యొక్క శరీరమును మరి యొకరు నాకుచుందురు. ఇటు నటు పరిగిడు చుందురు. ఈ ప్రకారమా తమో నరక మందున మహా దుఃఖము నను భవించు చుందురు. బ్రాహ్మణోత్తమా! యిట్లు పాప క్షయ మగునంత దనుక నా తమో నరకమున పాపులు క్లేశముల ననుభ వించు చుందురు. దీని తరువాత మరి యొకటి “నికృంతన” మను ప్రఖ్యాత మగు నొక ప్రధాన నరకము గలదు. తండ్రీ! యా నరకమున నిరంతరము కుమ్మరి సాలెలు తిరుగుచు నుండును. ఆ చక్రముల యందు పాపాత్ముల బడవైచి కర్తనము గావించు చుందురు. చూడక బోయినను చూచినట్లు, జూచినను జూడనట్లు జెప్పు వారీ నరకమున బడుదురు. ప్రణవ మంత్రోప దేశకుడగు గురుని భగవంతునిగా దలచని వాడు, గురు వాక్యములను శాస్త్ర వాక్యములను వినుపించు కొనని వాడు, నికృంతన మను నీ నరకమును బొందును.

ఏతే పాపా దురాచారా స్తత్రతై రయమ పూరుషైః   తేష్వా రోప్య నికృత్యం తే కాల సూత్రేణ మానవాః   యమాను గాంగులి స్తేన ఆపాద తల మస్తకమ్   న చైషాం జీవిత భ్రంశౌ జాయతే ద్విజ సత్తమః చిన్నాని తేషాం శతశః ఖండా న్యైకం వ్రజంతి చ   ఏవం వర్ష సహస్రాణి చిద్యంటే పాప కర్మిణః   తావ ద్యావ దశేషం వై తత్పాపం హి క్షయం గతం   అప్రతిష్ఠం చ నరకం శ్రుణుష్వ గదతో మమ   యత్రస్థై ర్నారకై ర్దుఃఖ మసహ్య మను భూయతే   స్వధర్మరత విప్రాణాం విఘ్నం యస్తు సమాచరేత్  

పాపాత్ములు దురాచారులు నగు నా మనుష్యులు నికృంతన నరకమందు బడ వేయ బడుదురు. మరియు కాలం సూత్రముచే చేదింప బడుదురు. యమ దూతల చేతి యందున్న కాల సూత్రము ద్వారా పాదముల నుండి మస్తక పర్యంతము నరక బడుచుందురు. మరియు నో ద్విజోత్తమా! యిట్లు కోసివేయ బడినను వారు జీవిత భ్రంశమును బొందరు. వారి శరీరము వందల కొలది ముక్క ముక్కలుగా ఖండింప బడినను, మరల యవి యన్నియు ఏకమగును. ఈ ప్రకారము పాపకర్ముడగు మనుష్యుడు వేయి సంవత్సరములు చేదింప బడుచుండును. నిశ్శేషముగా పాప క్షయమగు వరక నచ్చట నుందురు. ఇక “ అప్రతిష్ట” మను నరక విశేషమును జెప్పెదను. అప్రతిష్ట నరక మందున్న పాపాత్ములు సహింప శక్యము గాని దుఃఖము ననుభ వించు చుందురు. స్వధర్మరతు లగు ద్విజులకు విఘ్నము జేయు వారలీ నరకమును జెందెదరు.

స బధ్ధై ర్దారుణైః పాశై ర్నీయతే చక్ర సంకరే   తాన్యేవ తత్ర చక్రాణి ఘటీ యంత్రాణి చాన్యతః   దుఃఖస్య హేతు భూతాని పాప కర్మ కృతాం నృణామ్   చక్రే ష్వారోపితాః కేచి ద్బ్రామ్యన్తే తత్ర దానవః   యావాద్వర్ష సహస్రాణి న తేషాం స్థితి రన్తరా   ఘటీ యంత్రేషు చైవాన్యో బద్ధ స్తోయే యథా ఘటిః   భ్రామ్యంతే మానవా రక్త ముద్గిరంతః పునః పునః   అంత్రై ర్ముఖే విని ష్క్రాంతై ర్నేత్రై రగ్రావలంభిభిః దుఃఖాని తే ప్రాప్నువంతి యన్యసహ్యాని జంతుభిః   అసిపత్ర వనం నామ నరకం శృణు చాపరమ్  

మరియు వానిని దారుణ మగు త్రాళ్ళచే బంధించి చక్ర సంకర నరకమునకు తీసికొని బోయెదరు. అచ్చట చక్రములు ఘటీ యంత్రము లుండును. పాప కర్మలు చేసిన నరులకు నా యంత్రములు దుఃఖ హేతువులగును. వాటి యందు మానవుల బడ వైచి త్రిప్పు చుందురు. సాధారణముగా వేయి సంవత్సరముల దనుక వారందులో యుందురు. కొందరిని జలమందు ఘటీ యంత్రము వలె బందింపుదురు. పాపులు మాటి మాటికి రక్తమును వాంతి జేసుకొను చుందురు. కొంతమంది ప్రాణుల ముఖము నుండి నరములు బైటికి వచ్చు చుండును. నేత్రముల నుండి రక్త ధారలు స్రవించు చుండును.అచ్చట నా పాపులు సహింప రాని దుఃఖముల బొందు చుందురు. మరియొకటి “యసి పత్రవన” మను నరకమును గూర్చి జెప్పెదను వినుము.

యోజనానాం సహస్రం యో జ్వరి దగ్న్యా స్తృతావనిః   బ్రహ్మచారి వ్రతానాం చ తపశాం విఘ్నమా చరేత్   అసి పాత్ర వనం యాంతి యే సారో ద్వేగ కారిణః   తప్తాః సూర్య కరై శ్చండై ర్యత్రా తీవ సుదారుణైః   ప్రపతంటి సదా తత్ర ప్రాణినో నరకౌ కసః   తన్మధ్యే చ వనం రమ్యం స్నిగ్ధ పత్రం విభావ్యతే   పత్రాణి తత్ర ఖంగానాం ఫలాని ద్విజ సత్తమ   శ్వాసశ్చ తప్ర సబలాః స్వనన్త్య యుత శోభితః   మహా వక్త్రా మహా దంష్ట్రా వ్యాఘ్రా ఇవ భయానకాః   తతస్త ద్వన మాలోక్య శిశిర చ్చాయ మగ్చతః  

ఈ నరకము మండుచున్న యగ్నితో వ్యాప్తమై యున్న వేయి యోజనముల భూమి. బ్రహ్మచర్య వ్రత విఘ్నము, మరియు తపో విఘ్నము జేయు వారిని యిందు బడ వేయుదురు. మరియు నెల్లవేళల మానసికముగా బాధలు కలుగజేయు వారును, యీ అసిపత్ర వనమును బొందుదురు. ఈ అసిపత్ర వనము నందు మహా దారుణములు, ప్రచండములు నగు సూర్య కిరణములచే పాపులు మాడి పోవు చుందురు. నరక వాసులగు ప్రాణులు ఎల్లప్పుడచట చేసిన పాపములచే నందు బడుదురు. ఆ నరక మందతి మనోహరమగు వన మున్నది. అత్యంతము దత్త మగు నాకులతో నున్నట్లుగా భావింప బడు చుండును. మరియు నో ద్విజ శ్రేష్టా! ఆ యాకులన్నియు కత్తుల వలె నుండును. మరియు నచ్చట వేలకొలది బలీయము లును, చాలా పెద్దవగు కుక్కలతో శోభాయ మానముగా నుండును. మరియు నా కుక్కలు పెద్ద పులుల బోలు మహా వక్త్రములు, ఘోరములగు కోరలతో భయానకముగా నుండును.

ప్రయాన్తి ప్రాణి స్తత్ర తృట్తాప పరిపీడి తాః హా మాతః రావో తాతః ఇతి క్రందం తో తీవ దుఃఖితాః దవ్యా మానాం ఘ్రి యుగలా ధరణీ స్టేన వహ్ని నా తేషాం గతానాం తత్రసి పత్రపాతీ స మీరణః ప్రవాతి తేన ప్రాప్యనే తేషాం ఖడ్గా స్తథో పరి తతః పతంతి తే భూమౌ జ్వల త్పావక సంచ యే లేలిహ్య మానే చాతీవ వ్యాప్తా శేష మహీతలే సారమేయా స్తత శ్శీఘ్రం శాత యంతి శరీర తః తేషామంగాని రుదతాం త్వ చ శ్చాతీవ భీషణాః అసి పత్ర వనం తాతః మయై తత్కీర్తి తం తవ

అచ్చట జీవులు యాకలి దప్పికలచే పీడితు లగుచు, హా తల్లీ! హా తండ్రీ! యని యార్త ధ్వనులు జేయుచు నత్యంత దుఃఖితులై బోవుచుందురు. అట్లచ్చటికి బోయిన జీవుల పాదములను భూమి యందున్న నిప్పుల కుప్పలు దహించు చుండును. ఆ యసి పత్ర వనమందలి గాలి మిక్కుటముగా వీచు చుండును. ఆ జీవుల మీద కత్తులు విసరి వేయుదురు. అప్పుడచ్చట నున్న మండుచున్న నిప్పుల కుప్పల గూల్చెదరు. అనంతర మచ్చట నతి భయంకరము లగు కుక్కలు వచ్చి యిట్లేడ్చు చున్న జీవుల సర్వాంగములను కరచి ముక్క ముక్కలు జేయును. ఇట్లు భీషణములగు కుక్కలు రోదనము జేయుచున్న వారి శరీర చర్మమును శరీరాంగములను భేదించును. తండ్రీ! దీనిని “యసిపత్ర వన” మని యందురు. దీని వృత్తాంతమును తమకు జెప్పితిని.

అతః పురం భీమతరం తప్త కుంభం నిబోధ మే   సమ న్తత స్తప్త కుంభా వహ్ని జ్జ్వాలా సమావృతాః జ్వల దగ్ని చాయోత్తప్తా స్తైలాయ శ్చూర్ణ పూరితాః   తేషు దుష్కృత కర్మాణో యామ్యైః క్షిప్తా స్త్వదో ముఖాః దూషయే ద్దర్మ శాస్త్రాణి యే చాన్యే తీర్థ దూషకాః   భుక్త భోగాం తు యో నారీ మిష్య మాణాం ప్రియాం   అదృష్టా మాపి దోషేణ త్యజతే మూఢ చేతనః   తే సమానీయ పంచ్య తే లోహ కుంభేషు శీఘ్రతః   క్వాథ్యంతే విస్ఫుట ద్గాత్రా జ్వల న్మజ్ఞా జలా విలాః   స్ఫుట త్క పాల నేత్రా స్థి చ్చిద్యమానా విభీషణైః

దీని తరువాత దీని కన్న భయంకరమగు “తప్తకుంభ” మను బేరు గల నరకమును గురించి జెప్పెదను. వినుడు. ఈ నరకమున అన్ని వైపులా మంట లెగయు చుండును. వహ్ని జ్వాలలచే మరుగు చున్న తైలము, లోహ చూర్ణ పరి పూర్ణమై తప్త కుంభము లుండును. అట్లు మరుగు చున్న బానలందు తల క్రిందుగా బడ  వేయుదురు. ఎవరు ధర్మ శాస్త్రములను దూషణము జేయుదురో, తీర్థ క్షేత్రముల బాడు జేయుదురో, ప్రియమైనది, శుభ చారిణి సర్వ సుఖములు భోగములను భవింప జేసిన యుత్తమురాలగు స్త్రీని యే దోషము కనబడక పోయినను మూఢ బుద్దియై త్యజించునో, యట్టి వారిని దీసుకొని వచ్చి శీఘ్రముగా తప్త లోహ కుంభముల బడవేసి యుడక బెట్టుదురు. ఆ సమయమున వారి శరీరములు పగిలి పోవు చుండును. మజ్జా జలమంతయు దహింప బడును. భయంకరము లగు గ్రద్దలు కపాల, నేత్ర, అస్థులను పొడుచుచు పెరికి వేయు చుండును.

గృధ్రై రుత్పాట్య ముచ్యంతే పున స్తేష్వేవ వేగితైః   పునః సిమ సిమాయంతే తైలే నైక్యం వ్రజంతి చ   ద్రవీభూతైః శిరోగాత్ర స్నాయు మాంస త్వగ స్థిభిః   తతో యామ్యై ర్భటై రాశు దర్వీఘట్టన ఘట్టి తాః   కృతా పర్తే మహా తైలే మథ్యంతే పాప కర్మిణః   ఏషతే విస్తరేణో క్త స్తప్తంభో మయా పితః  

మరియు నా గృద్రములు వారి శరీరములను ముక్కులతో కరచుకొని పైకి దీసుకొని పోయి వేగముతో మరల నా శరీరముల నందులోనే పడవేయును. వారి శరీరములు చిమ చిమలాడుతు నా తైలములో గలసి బోవును. తరువాత యమ దూతలు గూడ పెద్ద వగు గరిటలతో గలియబెట్టు చుందురు. జనకా! యీ విధముగా పాప కర్మలు పొగలు బారుచు సుడులు దిరుగు చున్న యా తైల కుంభముల యందెట్లు మదింప బడు చుండెదరో దాని నంతయు సవిస్తరముగా నీకు జెప్పితిని. దీనినే “తప్త కుంభ” నరకమని యందురు.