25 – వర్ణాశ్రమ ధర్మములు

పుత్రుడు:

తన్మాతు ర్వచనం శ్రుత్వా సోలర్కో మాతరం పునః ప్రప్రచ్చ వర్ణ థర్మాంశ్చ థర్శాన్యే చా శ్రమేషు చ

పుత్రుడు:

ఇట్లు తల్లి చెప్పిన మాటలు విని అలర్కుడు మరల వర్ణ ధర్మమును మరియు ఆశ్రమ ధర్మములను గూర్చి అడుగ సాగెను.

అలర్కుడు:

కథితోయం మహాభాగే రాజ్య తంత్రా శ్రిత స్త్వ్యయా మమ థర్మో హ మిచ్చామి శ్రోతుం వర్ణాశ్రమాత్మకమ్

అలర్కుడు:

అమ్మా! మహాభాగే! నీవు రాజ ధర్మములను మాత్రమే చెప్పితివి. ఇప్పుడు నేను వర్ణ ధర్మములను, ఆశ్రమ ధర్మములను వినుటకు వాంచించు చున్నాను.

మదాలస:

దాన మధ్యయనం యజ్ఞో బ్రాహ్మణస్య త్రిథోదితః ధర్మో నాన్య శ్చతుర్థోస్తి కర్మ స్తస్యాపదం వినా యాజనాధ్యాపనే శుద్ధ స్తథా పుత్రః ప్రతిగ్రహః

ఏత త్సమ్య క్సమాఖ్యాతం త్రితయం చాస్య జీవికా దాన మధ్యయనం యజ్ఞాః క్షత్రియస్యాప్యయం త్రిధా ధర్మః ప్రోక్తః క్షితే రక్షా శస్త్రాజీవశ్చ జీవికా

మదాలస:

వత్సా! దానము, అధ్యయనము, యజ్ఞము ఈ మూడును బ్రాహ్మణ ధర్మములై యున్నవి. వీటి కంటే ఐరిక్తముగా నాల్గవ ధర్మము లేదు. ఆపత్కాలము నాడు మాత్రము అన్యధర్మ ముండును. శుద్ధ భావముతో యజ్ఞము చేయించుట, అధ్యాపనము, ప్రతిగ్రహము ఈ మూడు బ్రాహ్మణ జాతికి జీవనా ధారముగా చెప్పబడినవి. దానము, అధ్యయనము, యజ్ఞము చేయుట ఈ మూడు క్షత్రియ ధర్మములు. మరియు ప్రజారక్షణము, శాస్త్ర విద్య ఈ రెండు క్షత్రియులకు జీవనాధారము.

దానమధ్యయసం యజ్ఞో వైశ్య శ్యాపి త్రిథె వ సః వాణిజ్యం పాశు పాల్యం చ కృషిశ్చైవాస్య జీవికా దానం యజ్ఞోథ శుశ్రూషా ద్విజాతీ నాం త్రిధా మయా వ్యాఖ్యాతః శూద్ర ధర్మోపి జీవికా కారు కర్యజా తద్వ ద్ద్విజాతి శుశ్రూషా పోషణం క్రయ విక్రయైః వర్ణ తర్మాస్త్విమే ప్రోక్తాః శ్రూయతా మాశ్రమా శ్రయాః స్వవర్ణ ధర్మా త్సంసిద్దో నరః ప్రాప్నోతి నచ్యుతః ప్రయాతి నరకంప్రేత్య ప్రతిశిడ్డ నిషేవణాత్ యావత్తు నోపనయనం క్రియతే వై ద్విజన్మనః కామ చేష్టోక్తి భక్షస్తు తావ ద్భంవతి పుత్రక

వైశ్యునకు కూడా మూడు ధర్మము లున్నవి. దానము, అధ్యయనము, యజ్ఞము మరియు పశు పాలనము, వాణిజ్యము. వ్యవసాయము వారికి జీవనాధారము. దానము, యజ్ఞము, పైమూడు వర్ణముల వారిని సేవించుట ఈ మూడు సూద్రజాతి ధర్మములు. శిల్పకర్మ, విప్రసేవ, పశుపోషణ, క్రయ విక్రయము ఇవి వీరికి జీవనాధారము . ఇవి వర్ణ ధర్మములు. నీకు చెప్పితిని. పిమ్మట ఆశ్రమ ధర్మము లను చెప్పెదను వినుము. తమ తమ వర్ణ ధర్మముల ప్రకారముగా నడుచుకొనుట చేత మానవులు మోక్షమును పొందుదురు. వర్ణ ధర్మములకు విరుద్ధముగా ప్రవర్తించినచో నరకమునకు బోవుదురు. పుత్రా! బ్రాహ్మణునకు ఉపనయన సంస్కారము కానంత వరకు ఇచ్చానుసారముగా ఆహారాదుల యందు ప్రవర్తించ వచ్చును.

కృతోపనయన స్సమ్య గ్బ్రహ్మచారీ గురో ర్గ్రుహే వసేత తత్ర ధర్మోస్య కథ్యతే త న్నిబోధ మే స్వాధ్యాయోథాగ్ని శుశ్రూషా స్నానం భిక్షాటనం తథా గురో ర్నివేద్య తచ్చాద్య మనుజ్ఞా తేన సర్వదా గురోః కర్మణి సోద్యోగః సమయ క్ప్రీత్యుపపాదకః తేనాహుతః పఠే చ్చైవ తత్పరో నాన్య మానసః ఏకం ద్వౌ సకలా న్వాపి వేదా న్ప్రాప్య గురో ర్ముఖాత్ అనుజ్ఞాతో వారం దత్త్వా దక్షిణాం గురవే తతః గార్హస్థ్యాశ్రమ కామస్తు గృహస్థాశ్రమ మావసేత్ వానప్రస్థాశ్రమం వాపి చతుర్థం వేచ్చయాత్మనః

ఉపనయనమైన పిమ్మట బ్రహ్మచారియై గురు కులమందు నివసించి యేయే ప్రకారంబుగా బ్రహ్మచారి ధర్మముల నాశ్రయించ వలెనో వాటిని చెప్పెదను వినుము. స్వాధ్యాయనము, అగ్ని శుశ్రూష, స్నానము, భిక్షాటనము, భిక్షను గురువునకు నివేదించుటయు , తిరిగి గురువు యొక్క ఆజ్ఞానుసారముగా భోజనము చేయుటయు, గురువు గారి పనులను చేయుటయు, గురువునకు సంతోషము కలిగించుటయు, గురువు పిలిచినప్పుడు ఏకాగ్ర చిత్తముతో చదువు కొనుటయు, ఇవన్నియు బ్రహ్మచారి ధర్మములై యున్నవి. ఒకటి గాని, రెండు గాని, నాలుగు వేదములను గాని గురువు ముఖముగా అధ్యయనము చేసి, గురు చరణములకు నమస్కరించి, గురువాజ్ఞను బొంది, గురు దక్షిణ సమర్పించ వలెను. పిమ్మట గృహస్త ధర్మము నందు ఇచ్చయున్న యెడల గృహస్థాశ్రమ మందు ప్రవేశినచ వలెను. లేనిచో వానప్రస్థాశ్రమమును గాని, సన్యాసాశ్రమమును గాని ఇష్టాను సారముగా స్వీకరించ వలెను.

తథైవ వా గురో ర్గేహే ద్విజో నిష్ఠా మవాప్నుయాత్ గురో రభావే తత్పుత్రే తచ్చిష్యే తత్సుఖం వినా శుశ్రూషు ర్నిరభీమానో బ్రహ్మచర్యా శ్రమే వసేత్ ఉపావృత్త స్తత స్తస్మా ద్గృహ స్థాశ్రమ కామ్యయా తతో సమానర్షి కులాం తుల్యాం భార్యా మరోగిణీమ్ ఉద్వహే న్న్యాయతో వ్య గాం గృహస్థాశ్రమ కారణాత్ స్వకర్మణా ధనం లబ్ద్వా పితృ దేవాతిథీం స్తథా సమయ క్సంప్రీణయే ద్భక్త్యా పోషయేచ్చాశ్రితాం స్తథా భృత్యాత్మజాన్ జామయోథ దీనార్థి పతితా నపి యథాశక్త్యాన్న దానేన వయాంసి పశవ స్తథా

 కానిచో నైష్టిక బ్రహ్మచారియై గురు దేవుని గృహమందే నివసింప వలెను. గురువు లేనిచో అతని కుమారుని సమీపము నందు ఉండ వలెను. కుమారుడు లేనిచో గురువు యొక్క శిష్యుల సమీపము నందు ఉంది సేవా పరాయణుడై ఉండవచ్చును. కాని గురు పుత్ర, గురుశిష్య పుత్రుల వద్ద నుండ కూడదు. అభిమాన రహితుడై బ్రహ్మచర్యాశ్రమ మందు నివసించ వలెను. మరల గృహస్థాశ్రమ మందు ఇచ్చ కలిగిన యెడల గురువు గారి ఆశ్రమము నుండి తనకు అనురూపమైన కన్యను వివాహమాడ వలెను. కన్య రోగ రహితురాలు, అంగహీనురాలు, కుల గోత్ర సంపన్నురాలునై యుండ వలెను. స్వధర్మ కర్మల ద్వారా న్యాయానుసారముగా ద్రవ్యమును సంపాదించి భక్తి కలిగి యథా విధిగా తల్లిదండ్రులను దేవతలను అతిథి గణములను ఆశ్రిత జనులను సంతృప్తి పరచవలెను. దాసీ పుత్రులను, దీనులను, పతితులను, మరియు పక్షులను, పశువులను తన శక్తి ననుసరించి, అన్నదానము చేసి పోషించ వలెను.

ఏష ధర్మో గృహస్థస్య ఋతా వభిగమ స్తథా పంచ యజ్ఞ విధానం తు యథా శక్తి న హాపయేత్ పితృ దేవాతిథి జ్ఞాతి భుక్త శేషం స్వయం నరః భు జీత చ సమం భ్రుత్యై ర్యథా విభవ మాత్మానః ఏష తూద్దేశతః ప్రోక్తో గృహస్థ స్యాశ్రమో మయా వాన ప్రస్థస్య ధర్మం తే కథయా మ్యవథార్యతామ్ అపత్య సంతతిం దృష్ట్వా ప్రాజ్ఞో దేహస్య చానతిమ్ వానప్రస్థాశ్రమం గచ్చే దాత్మనః శుద్ధి కారణాత్ తత్రారణ్యోపభోగశ్చ తపోభి శ్చాత్మ కర్షణమ్ భూమౌ శయ్యా బ్రహ్మచర్యం పితృ దేవాతిథి క్రియాః

ఋతుకాల మందు స్త్రీ గమనము, శక్తి ననుసరించి పంచ యజ్ఞముల యొక్క అనుస్థానము చేయ వలెను. ఇవి గృహస్థునకు ముఖ్య ధర్మములు. గృహస్థుడు శక్తి ననుసరించి ఆదరముతో, పితృ గణములను, దేవతా గణములను, అతిథి గణములను, జ్ఞాతులను, భ్రుత్యులను భుజింప జేసిన పిమ్మట భుక్త శేషమును తాను భుజించ వలెను. నేను సంక్షిప్తముగా గృహస్థాశ్రమ ధర్మములను చెప్పితిని. ఇప్పుడు వానప్రస్థ ధర్మములను వివరించెదను. శ్రద్ధగా వినుము. బుద్దిమంతులైన పురుషులు అపత్య సంతానము చూచి, తన శరీరము యొక్క నాశానమును చూసి, ఆత్మను శుద్ధి చేసుకొనుటకు వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించ వలెను. అచట వనము లోని ఫలములను ఆహారముగా తీసుకొనుచు తపస్సు చేత ఆత్మా యొక్క ఉన్నతిని సంపాదించి, భూమి యందు శయనించి, బ్రహ్మచర్యానుష్టానము పితృ దేవతల యొక్క, అతిథిదేవుల యొక్క, పరిచర్యలు చేయ వలెను.

హోమ స్త్రీషవణస్నానం జటావల్కల ధారణమ్ మౌనాది కరణం చైవ వన్య స్నేహ నిషేవణమ్ ఇత్యేష పాప శుద్ధ్యర్థ మాత్మన శ్చోపకారకః వానప్రస్థాశ్రమ స్తస్మా ద్భిక్షోస్తు చరమోపరః చతుర్థస్య స్వరూపం తు శ్రుయతా మాళ్రమసు తమ్ యశ్చ ధర్మోస్య ధర్మజ్ఞైఃప్రోక్త స్తాతః మహాత్మభిః సర్వ సంగ పరిత్యాగో బ్రహ్మచర్య మకోపతా జితేంద్రియత్వ మావాసే నైకస్మి న్వసతి శ్చిరమ్ అనారంభ స్తథాహారే భిక్షాన్నం చిక కాలికమ్ ఆత్మజ్ఞానా వభోదళ్చ తథా చాత్మావలోకనమ్  

హోమము, మూడు వేళల యందు స్నానము, జడలు, నారచీరలు ధరించుట, నిరంతరమూ యోగాభ్యాసము మరియు వనములోని మిత్రులకు సేవలు చేయ వలెను. ఈ విధముగా పాప ప్రక్షాళన నిమిత్తము మరియు ఆత్మకు ఉపకారము చేయుట కొరకు వానప్రస్థాశ్రమమును ఆశ్రయించ వలెను. ఈ ఆశ్రయము పిమ్మట తుది ఆశ్రమమునగు సన్యాసము స్వీకరించ వలెను. ఓ కుమారా! మహాత్ములు, ధర్మజ్ఞులు అయిన పురుషులు ఈ నాల్గవ ఆశ్రమ స్వరూపమును చెప్పిన విధానమును చెప్పెదను వినుము. సర్వసంగ పరిత్యాగము, బ్రహ్మచర్యము రోషము లేకుండుట, ఇంద్రియ నిగ్రహము, ఒకే ప్రదేశ మందు చాల దినములు నివాసము చేయ కుండుట, కర్మను విడిచి భిక్షాటన వలన లభించిన అన్నముతో ఒక్కసారి మాత్రమే భోజనము చేసి ఆత్మ జ్ఞానమును తెలిసికొన వలెను మరియు ఆత్మ దర్శనము ఇవన్నియు చతుర్థాశ్రమము యొక్క కర్తవ్యములు.

చతుర్థే త్వాళ్రమే ధర్మో మయాయం తే నివేదితః సామాన్య మన్య వర్ణానా మాశ్రమాణాం చ మే శృణు సత్యం శౌచ మాహింసా చ అనసూయా తథా క్షమా ఆనృశంస్య మకార్పణ్యం సంతోష శ్చాష్టమో గుణః ఏతే సంక్షేపతః ప్రోక్తా ధర్మా వర్ణాశ్రమేషు చ ఏతేషు నిత్య ధర్మేషు నిత్యం తిష్టే త్సమంతతః స యాతి బ్రహ్మలోకం హాయ్ యావ డింద్రా ర్చతుర్దశ యశ్చోల్లంఘ్య స్వకం ధర్మం స్వవర్ణాశ్రమ సంజ్ఞితమ్ నరోన్యథా ప్రవర్తేత స దండ్యో భూభ్భతో భవేత్ యే చ స్వధర్మ సంత్యాగా త్సాపం కుఠ్వంతి మానవాః ఉపేక్ష్యత స్తా న్నృపతే రిష్టా పూర్తం ప్రయాత్యధః తస్మా ద్రాజ్ఞా ప్రయత్నేన సర్వే వర్ణాః స్వధర్మతః ప్రవర్తంతే న్యథా దండ్యాః స్థాప్యాశ్చైవ స్వకర్మసు

చతుర్థాశ్రమ మందు ఏ విధముగా ధర్మానుష్టానము చేయవలెనో వాటిని నీకు చెప్పితిని. ఇప్పుడు ఆశ్రమము యొక్క ఇతర సాధారణ కర్తవ్యములు ఏవయితే ఉన్నవో అవి వినుము. సత్యము, శౌచము, అహింసా, అసూయ లేకుండుట, క్షమా, ఆనృశంస్యము, కార్పణ్యము లేకుండుట మరియు సంతోషము ఈ ఎనిమిది గుణములు పర్ణాశ్రమముల ధర్మాలకు సాధారణ ధర్మములుగా చెప్పబడెను. నేను నీ సమక్షము నందు సంపూర్ణ వర్ణాశ్రమ ధర్మాలను సంక్షిప్తముగా వర్ణించితిని. ఎల్లరకు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించ వలసి యున్నది. ఏ పురుషుడు ఎల్లప్పుడు స్వధర్మ పరిపాలన చేయునో అతడు ఎప్పటి వరకు పదునాలుగవ ఇంద్రుని పతనము కలుగదో, అప్పటి వరకు బ్రహ్మ లోకములో నివసించును. ఏ మనుష్యుడు స్వీయ వర్ణాశ్రమ ధర్మాలను ఉల్లంఘించి ఇతరముల యందు దృష్టి కలిగి యుండునో, అతడు రాజు వలన శిక్షింప బడును. ఏ మనుష్యుడు స్వధర్మాలను విడిచి పాపానుష్టానము చేయునో అతనిని శిక్షింపక ఉపేక్షించిన యడల నరపతి యొక్క ఇష్టా పూర్వములకు వినాశనము కలుగును. ఈ కారణముచే నరపతి విశేష ప్రయత్నముతో సర్వ వర్ణముల వారిని తమ తమ ధర్మముల యందు ఉంచ వలెను. ఉపేక్షించినచో ఇష్టా పూర్తములు నశించి నరక లోకమునకు బోవును. మరియు దీనికి విరుద్ధముగా వ్యవహరించినపుడు వారిని శిక్షించి స్వకర్మల యందు ఉంచ వలెను.