80 - మహిషాసుర వధ

ఋషి:

 నిహన్యమానం తత్సైన్య మవలోక్య మహాసురః

సేనానీ శ్చిక్షురః కోపా ద్యయౌ యోద్దు మథాంభికామ్

స దేవీం శరవర్షేణ వవర్ష సమరేసురః

యథా మేరుగిరేః శృంగం తోయ వర్షేణ తోయదః

తస్య చ్ఛిత్త్వా తతోదేవీ లీలయైవ శరోర్కరాన్

జఘాన తురగాన్ బాణై ర్యంతారం చైవ వాజినామ్

చిచ్చేద చ ధనుః సద్యో ధ్వజం చాతి సముచ్ఛితమ్

వివ్యాధ చైవం గాత్రేషు చ్ఛిన్నదన్వాన మాశుగః

స చ్ఛిన్నధన్వా విరథో హతశ్యో హత సారథి

అభ్యథావాత తాం దేవీం ఖడ్గ చర్మ ధరోసురః

ఋషి:

సమస్త సేనలు హతులగుట చూచి సేనాపతి యగు చక్షురుడు యుద్దము చేయుటకు కోపముతో అంబిక సమీపమునకు వచ్చెను. మేఘం ఏ ప్రకారముగా సుమేరు పర్వత శృంగ మందు జలమును వర్షించునో, ఆ రాక్షసుడు కూడా ఆ ప్రకారము దేవి మీద బాణములను వర్షింప సాగెను. కాని దేవి లీలా మాత్రమున వాని బాణముల నన్నింటిని ఛేదించి వేచెను. రథము మొక్క సారథిని ఆశ్వములను చంపి వేసెను మఱియు నా దేవి ఆ సమయమున వాడి ధనస్సును, ఎత్తైన ధ్వజమును విరుగ గొట్టి వాడి శరీర మంతయు బాణములచే తూట్లు పొడిచెను. గుర్రములు సారథి ఏమియు లేని వాడై ననూ కత్తి ఢాలు చేపట్టి దేవి పైకి ఉరికెను.

సింహ మాహత్య ఖడ్గేన తీక్ష్ణథారేణ మూర్ధని

ఆజఘాన భుజౌ సవ్యే దేవీ మప్యతి వేగవాన్

తస్యాః ఖడ్గొ భుజం ప్రాప్య సఫాల నృపనందనః

తతో జగ్రాహ శూలం స కోపా దరుణలోచనః

చిక్షేప చ తత స్తత్తు భద్రకాల్యాం మహాసురః

జౌజ్వల్యమానం తేజోభీ రవిబింబ మివాంబరాత్

దృష్ట్వా తదా పతచ్చూలం దేవీ శూల మముంచత

తేన తచ్చతథా నీతం శూలం స చ మహాసురః

హతే తస్మి న్మహావీర్యేమహిషస్య చమూపతౌ

ఆజగామ గజారూఢ శ్చామర స్త్రిదశార్ధనః

అత్యంత వేగముతో తన పదునైన కత్తిచే సింహము యొక్క శిరస్సుపై మోది దేవి యొక్క వామ భుజముపై గొట్టెను. ఓ రాజ కుమారా! ఆ రాక్షసుని యొక్క ఆ ఖడ్గము దేవి యొక్క హస్త స్పర్శ కలుగుటతోనే తునక లయ్యెను. అప్పుడు కోపముతో ఎర్రనైన నేత్రములు గల ఆ రాక్షసుడు శూలము గ్రహించి, పిమ్మట వాడు భద్రకాళి పై విసరెను. వెంటనే దేవి ఆ త్రిశూలమును తేజస్సుచే ప్రకాశించు చున్నట్టిది, ఆకాశము నుండి పడుచున్న రెండవ సూర్య బింబముతో, సమానముగా నుండుట చూచి తన శూలమును విసరెను. మహిషాసురుని సేనాపతి యగు మహా వీరుడైన చక్షురు డను ఆ రాక్షసుడు ఎప్పుడయితే మరణించెనో, అప్పుడు దేవతల శత్రువగు చామరు డను రాక్షసుడు ఏనుగు నెక్కి యుద్దము చేయుటకై దేవి సమ్ముఖమునకు వెళ్ళెను.

సోపి శక్తిం ముమోచాథ దేవ్యా స్తా మంబికా ద్రుతమ్

హుంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభామ్

భగ్నాం శక్తిం నిపతితాం దృష్వా క్రోథ సమన్వితః

చిక్షేప చామరః శూలం బాణై స్తదపి సాచ్ఛినత్

తతః సిహః సముత్పత్య గజకుంభాంతరే స్థితః

బాహుయుద్దేన యుయుధే తేనోచ్చె స్త్రిదశారిణా

యుధ్యమానౌ తత స్తౌతు తస్మా న్నాగా న్మగాహీం గతౌ

యుయుధాతేతి సంరబ్ధౌ ప్రహారై రతిదారుణైః

తతో వేగా త్సముత్పత్య నిపత్య చ మృగారిణా

కరప్రహారేణ శిర శ్చామరస్య పృథక్కృతమ్

తిరిగి ఆ రాక్షసుడు దేవిపైకి శక్తిని వదలెను. కాని ఆ శక్తి దేవి యొక్క హుంకార శబ్ధముచే ప్రభాహీనమై భూమి యందు పడెను. తన శక్తి విరిగి నేలపై బడుట చూచి చామరాసురుడు కృద్దుడై శూలమును విసరెను. దేవి తన బాణములచే చేదించి వేసెను. పిమ్మట దేవి యొక్క వాహన మగు సింహము ఎగిరి గజము యొక్క కుంభ స్థలము పైకి దూకినదై గుఱ్ఱముపై కూర్చొని యున్న దేవ శత్రువు లగు రాక్షసులతో గొప్పగా బాహు యుద్దము చేయ సాగినది. యుద్దము చేయుచున్న వారందరూ ఏనుగు మీద నుండి క్రిందకు దూకి పరస్పరము అత్యంత క్రోధమును చెందిరి. దారుణ ప్రహారములతో యుద్దము చేయ సాగినది. ఇట్లు కొద్ది సమయము యుద్దము చేసిన పిమ్మట సింహము ఆకాశమునకు ఎగిరి భూమి యందు దూకి తన పంజాతో బాదు చున్నదై చామరాసురుని శిరస్సును దేహము నుండి వేరు చేసెను.

ఉదగ్ర శ్చరణే దేవ్యా శిలావృక్షాదిభి ర్హతః

దంత ముష్టి తలైశైవ కరాలశ్చ నిపాతితః

దేవీ కృద్దా గదా పాతి శ్చూర్ణయామాస చోద్దతమ్

బాష్కలం భిండిపాలేన బాణై స్తామ్రం తథాంధకమ్

ఉగ్రాస్య ముగ్రవీర్యం చ తథైవ చ మహాహనుమ్

త్రినేత్రా చ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ.

బిడాలస్యాసినౌ కాయా త్పాతయామాస వైశిరః

దుర్ధరం దుర్ముఖం చోభౌ శరై ర్నిన్యే యమ క్షయమ్

కాలం చ కాలదండేన కాలరాత్రి రాపాతయత్

ఉగ్రదర్శన మత్యుగ్రైః ఖడ్గాపాతై రాతాడయత్

ఆసినై వాసిలోమాన మచ్చిద త్సా రణోత్సవే

గణైః సింహేన దేవ్యా చ జయక్ష్వేడా కృతోత్సవైః

జగదంబ ఉదగ్రుడు అను పేరు గల రాక్షసుని శిలా వృక్షాదులను వర్షించి చంపి వేసినది. పిమ్మట దంతములతో ముష్టి ఘాతములతో కరాళుడను రాక్షుసుని అంతము చేసినది. క్రోధముచే నిండి యున్న దేవి గదా ప్రహారములతో ఉద్ధతు డను పేరు గల రాక్షసుని చూర్ణము చేసినది. మఱియు బాష్కలుడను పేరు గల రాక్షసుని భిండిపాలము అను ఆయుధము చేతను, తామ్రుడు అంధకుడు అను ఇద్దరు రాక్షసులను బాణముల చేత వధించెను. మూడు నేత్రములు గల శ్రీదేవి త్రిశూలముతో ఉగ్రాస్యుని, ఉగ్రవీర్యుని, మహాహనువను ఈ ముగ్గురు రాక్షసులను చంపి వేసినది. ఖడ్గముతో బిడాలుడను అసురుని శిరస్సును దేహము నుండి ఖండించి పడ వేసెను. దుర్ధరుడు, దుర్ముఖుడు అను ఇద్దరు రాక్షసులను బలములతో యమ లోకమునకు పంపెను. మరియు కాళరాత్రి యగు ఆ దేవి కాలాసురుని కాల దండముతో నాశనము చేసెను. ఉగ్ర దర్శనుని ఉగ్రములగు ఖడ్గ ప్రహారములతో గొట్టెను. అసిలోముని ఖడ్గముతో యుద్ద క్షేత్రమున నాశనము చేసెను. అప్పుడు గణములు మరియు సింహము జయ పూర్వకముగా సింహ నాదములు చేసెను.

ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః

మహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్

కాంశ్చి త్తుండ ప్రహారేణ క్షురక్షేపై స్తథాపరాన్

లాంగూల తాడితాంశ్చాన్యాన్ శృంగాభ్యాం చ విదారితాన్

వేగేన కాంశ్చి దపరా న్నాదేనా భ్రమణేన చ

నిష్వాసపవనే నాన్యా న్పాతయామాస భూతలే

నిపాత్యా ప్రముథానీక మభ్యదావత సోసురః

సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తతోంబికా

సొపి కోపా న్మహావీర్యః క్షున్న మహీతలః

శృంగాభ్యాం పర్యతా నుచ్చై శ్చిక్షేప చ ననాదా చ

ఈ ప్రకారముగా తన సేన నశించు చుండుట చూచి మహిషాసురుడు తన సహజ రూపమైన మహిష రూపమును ధరించి దేవిని, దేవ గణములను భయపెట్ట సాగెను. కొందరిని తుండ ప్రహారముల చేతను. మరి కొందరిని డెక్కల చేతను, గాయ పరచ సాగెను. కొందరిని వేగము చేతను, కొందరిని గర్జనల చేతను, మరి కొందరిని భ్రమణముల చేతను, కొందరిని దీర్ఘముగా వదలు చున్న నాసికా పవనముల చేతను చంపి భూమి యందు వడవేసెను. ఈ ప్రకారము దేవి యొక్క ప్రమథ గణములను పడవేసి ఆ అసురుడు మహాదేవి యొక్క సింహమును చంప వలెనని ఇచ్చతో సింహము పైకి పరుగెత్తెను. అది చూచి అంబికా దేవి కోపించెను. మహావీర్య వంతుడు మహిషాసురుడు కూడా అంతకంత కృద్ధుడై డెక్కలతో భూమిలతో గీరుచు శృంగములతో పర్వతములను పైకి ఎగుర వేయుచు గర్జించెను.

వేగభ్రమణ విక్షుణ్ణా మహీ తస్య వ్యశీక్యత

తాంగూలేనాహత శ్చాబ్ధిః ప్లావయామాస సర్వతః

ధుత శృంగ విభిన్నాశ్చ ఖండం యాయు ర్ఘనాః

శ్వాసానిలా స్తాః శతశో నిపేతు ర్నభసోచలాః

ఇతి క్రోధ సమాధ్మాత మాపతంతం మహాసురమ్

దృష్వా సా చండికా కోపం తద్వాథాయ తదాకరోత్

సా క్షిప్త్వా తస్య వై పాశం తం బబంధ మహాసురమ్

తత్యాజ మహిషం రూపం సోపి బద్దో మహామృధే

తతః సింహోభవత్సద్యో యావత్తస్యాం స్యాంచికా శిరః

ఛిప త్తి తావ త్పురుషః ఖడ్గపాణి రదృశ్యత

వేగ భ్రమణములచే భూమి యంతయు చూర్ణ మయ్యెను, వాలముచే కొట్ట బడినదై సముద్రము నాలుగు దిక్కుల వ్యాపించెను. కంపించు చున్న కొమ్మలచే భిన్నము లైన మేఘములు ఖండ ఖండము లయ్యెను. దాని శ్వాస యొక్క పవనముల చేత వందల కొలది పర్వతములు ఆకాశమునకు ఎగిరి పడెను. ఈ విధముగా అత్యంత క్రోధముతో నిండి యున్న రాక్షసుడు సమీపముగా వచ్చుట చూచి దేవి కూడ కుపితురాలై ఆ సమయమున వాడిని చంపుటకు నిశ్చయించెను. దేవి పాశము వేసి ఆ రాక్షసుని బంధించెను. మహిషాసురుడు యుద్ద రంగము నందు మహిష రూపము వదలి, సింహ రూపమును ధరించెను. అప్పుడు అంబికా దేవి వాడి శిరస్సు ఖండించుటకు ప్రయత్నింపగా వాడు ఖడ్గ పాణియై పురుష రూపములో కనపడ సాగెను.

తత ఏవాశు పురుషం దేవీ చిచ్ఛేద సాయకైః

తం ఖడ్గ చర్మణా సార్ధం తతః సోభూ న్మహాగాజః

కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జ చ

కర్షతస్తు కరం దేవీ ఖడ్గేన నిరకృంతత

తతో మహాసురో భోయో మాహిషం వపు రా శితః

తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరమ్

తతః కృద్దా జగన్మాతా చండికా పాస ముత్తమమ్

పాపౌ పునః పునశ్చైవ జహాసాగుణలోచనా

ననర్ధ చాసురః సోపి బల వీర్య మదోద్దతః

విషాణాభ్యాం చ చిక్షేప చండికాం ప్రతి భూధరాన్

వెంటనే దేవి బాణములచే ఖడ్గ చర్మములతో సహా వాడిని ఖేదించెను. పిమ్మట వాడు ఏనుగు రూపమును ధరించెను, తొండముతో సింహమును లాగుచు గర్జింప సాగెను. లాగుచున్న వాడి తొండమును దేవి ఖడ్గముతో ఖండించెను. పిమ్మట నా రాక్షసుడు తిరిగి మహిష రూపమును ధరించిన వాడై ముల్లోకములను సచరా చరముగా క్షోభింప చేయ సాగెను. అటు పిమ్మట జగన్మాత యగు చండికా దేవి ఉత్తమ మగు మధు పానముచే ఎఱ్ఱని నేత్రములు కలదై మాటి మాటికి పానము చేయ సాగెను వికటాట్ట హాసము చేయ సాగెను. అప్పుడు బల వీర్య సంపన్ను డగు రాక్షసుడు కూడా గర్జించుచూ రెండు కొమ్ములతో చండికా దేవి పైకి పర్వతములను పడవేయుచుండెను.

సా చ తా స్ప్రహితాం స్తేన చూర్ణ యంతీ శరోత్కరైః

ఉవాచ తం మదోద్భూత ముఖరాగాకులాక్షరమ్

చండికా దేవి తన బాణములతో వాడు వేయుచున్న పర్వతముల నన్నింటిని చూర్ణము చేసి వాడితో ఇట్లు పలుక సాగెను. ఆ సమయ మందు మద్యపానము చేసి నందున చండికా దేవి యొక్క ముఖము రక్త వర్ణమును దాల్చెను అక్షరముల ఉచ్చారణము స్పష్టముగా వచ్చుట లేదు.

దేవి:

గర్జ గర్జ క్షణం మూఢః! మధు యావ త్పిలా మ్యహమ్

మయా త్వయి హతేత్రైవ గర్జిష్యం త్యాశు దేవతాః

దేవి:

“ఓరీ! మూఢుడా నే నెంత పర్యంతము మధుపానము చేయుదునో, అంత పర్యంతము గర్జించుము. నాచే నీవు శీఘ్రముగా వధింప బడిన పిమ్మట దేవత లందరూ ఈ స్థానముననే గర్జింప గలరు”

ఋషి:

ఏవ ముక్త్వా సముత్పత్య సారూఢా తం మహాసురమ్

పాదేనాక్రమ్య కంఠే చ శూలేనైన మాతాడయత్

తతః సోపి పదాక్రాంత స్తయా నిజముఖాత్తతః

అర్ధ నిష్క్రాంత ఎవాసీ ద్దేవ్యా వీర్యేణ సంవృతః

అర్ధ నిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానో మహాసురః

తయా మహాసినా దేవ్యా శిర శ్చిత్త్వ నిపాతితః

ఏవం స మహిషో నామ ససైన్యః ససు హృద్గణః

ఋషి:

“దేవి ఈ ప్రకారము పలికి ఎగిరి ఆ మహా రాక్షసుని పైకి దూకెను. వానిని తన పాదములతో నొక్కి పట్టి వాడి కంఠమును త్రిశూలముచే ఛేదింప సాగెను. పిమ్మట నా రాక్షసుడును దేవి పాదములచే నొక్కుట వలన ఆ దేవి యొక్క పరాక్రమ మున వాడు తేజోహీను డయ్యెను. మఱియు ఆతని ముఖ కాంతి క్షీణించెను. తదనంతరము క్షీణ కాంతి యుక్తుడై యుద్దము చేయుచున్న ఆ మహాసురుని దేవి గొప్పదగు ఖడ్గముచే శిరస్సు ఖండించెను.”

త్రైలోక్యం మోహ యిత్వా తు తయాదేవ్యా వినాశితః

త్రైలోక్యస్థై స్తదా భూతై ర్మహిషే వినిపాతితే

జయేత్యుక్తం తతః సర్వైః సదేవాసుర మానవైః

తతో హాహాకృతం సర్వం దైత్య సైన్యం ననాశ తత్

ప్రహర్షం చ పరం జగ్ముః సకలా దేవతా గణాః

తుష్టువు స్తౌం సురా దేవీం దివ్యై ర్మహర్శిభిః

జగు ర్గంధర్వపతయో ననృతు శ్చాప్సరో గణాః

ఈ విధముగా ఆ మహిషా సురుడు తన సైన్యము మరియు సుహృద్గణాల సహితముగా త్రైలోక్యములను మోహించి చివరకు దేవి యొక్క చేతిలో మరణించుటచే త్రైలోక్య దేవతలు మనుష్యులు మరియు పాతాళ వాసులగు బలి మొదలగు రాక్షసులు దేవికి జయ జయ ద్వానములు చేసిరి. అనంతరము హాహా కారాములు చేయుచున్న దైత్యుల యొక్క సమస్త సైన్యమును నాశనము చేసెను. అప్పుడు దేవత లందరు అత్యంత హర్షమును పొందిరి. దేవతలు, మహర్షులు దేవిని స్తుతింప సాగిరి. గంధర్వ పతులు గానము చేయ సాగిరి. అప్సరసలు నాట్యము చేయసాగిరి.