51 - జంబూ ద్వీప వర్ణనము

క్రౌష్టుకి:

కతిద్వీపాః సముద్రా వా పర్వతా వా కతి ద్విజః కియంతి చైవ వర్షాణి తేషాం నద్యశ్చ కా? మునేః.

మహాభూత ప్రమాణం చ లోకాలోకం తధైవ చ పర్యాసం పరిమాణం చ గతిం చంద్రార్క యో రపి ఏతా త్ప్రబ్రూహి మే సర్వం విస్తరేణ మహామునేః

క్రౌష్టుకి:

ఓ మునిసత్తమా! ద్వీపములు, సముద్రములు, పర్వతములు, వర్షములు, మరియు నదులు, ఎన్ని యున్నవి? మహాభూత లోకాలోకముల ప్రమాణమెంత? మరియు సూర్య చంద్రుల వ్యాస పరిమాణము, చలనము ఏ విధముగా ఉండును? ఓ మహామునీ! అదంతయు విస్తార సహితంగా వర్ణించి చెప్పుము.

మార్కండేయుడు:

శతార్థకోటి విస్తారా పృథివీ కృత్స్నశో ద్విజః తస్యాః సంస్థాన మఖిలం కథయామి శృణుష్వ తత్ యే తే ద్వీపా మయా ప్రోక్తా జంబుద్వీపాదయో ద్విజః పుష్కరాంతా మహాభాగః శృణ్వేషాం విస్తరం పునః

మార్కండేయుడు:

ఓ ద్విజుడా! సమస్త భూమి విస్తారము యాబది కోట్ల యోజనములు. దాని యొక్క అన్ని స్థానముల సంబంధము గూర్చి చెప్పెదను వినుము. ఓ ద్విజుడా ! ఓ మహాభాగా ! జంబూ మొదలగు పుష్కరాంతమగు ఏ ద్వీపముల యొక్క విషయములన్నింటిని చెప్పితినో వాటిని తిరిగి సవిస్తరముగా చెప్పెదను.

ద్వీపాత్తు ద్విగుణోద్వీపో జంబుః ప్లక్షోథ శాల్మలిః కుశః క్రౌంచ స్తథా శాకః పుష్కర ద్వీప ఏవ చ లవణేక్షు సురాసర్పి ర్దది క్షీర జలాబ్దిభిః ద్విగుణై ర్ద్విగుణై ర్వృధ్యా సర్వతః పరివేష్టితాః జంబూ ద్వీపస్య సంస్థానం ప్రవక్షేహం నిబోధ మే లక్ష మేకం యోజనానాం వృత్తో విస్తార దైర్ఘ్యతః హిమవా న్హేమకూటశ్చ నిషదో మరు రేవచ నీలః శ్వేత స్తథా శృంగీ సప్త తద్వర్ష పర్వతాః ద్విలక్ష యోజనాయామౌ మధ్యే తత్ర మహాచలౌ తయో ర్దక్షిణతో యౌతు యౌ తథోత్తరతో గిరీ దశభి ర్దశభి ర్న్యూనైః సహస్రై స్తే పరస్పరమ్ ద్వి సాహస్రోచ్చ్రయాః సర్వే తావ ద్విస్తారిణశ్చ తే

జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు, ఇవి పూర్వ ద్వీపముల కంటే యదా క్రమముగా ద్విగుణములు కలిగి యుండును. లవణ, ఇక్షు, సురా, సర్పి, దథి, దుగ్ధ, జల, సముద్రములు ఒక దాని కన్నా నొకటి ద్విగుణములై వృద్ధి భావముచే అవి పరివేష్టితములై యున్నవి. జంబూ ద్వీపము యొక్క ఆకారము పరిమాణమును చెప్పుచున్నాను. విస్తార మందు, దీర్ఘ మందు, గుండ్రము నందు, సమముగా ఒక లక్ష యోజనములు పరిమాణమై యున్నది. హిమవాన్, హేమకూట, వృషభ, మేరు, నీల, శ్వేత, శృంగీ, పర్వతములు, ఈ ఏడు దాని వర్ష పర్వతములు. మధ్య స్థల మందు రెండు లక్షల యోజనములు విస్తృతము గల ఏ రెండు మహా గిరు లున్నవో, వానికి దక్షిణ, ఉత్తర దిక్కులందు ఏ రెండు రెండు గిరులున్నవో, అవి పరస్పరము దశ, దశ సహస్ర న్యూన సంఖ్యా యుక్తములై ఉన్నవి. మిగిలినవన్నీ రెండు వేల యోజనముల ఎత్తు, అదే విధముగా విస్తారము కలిగి యున్నవి.

సముద్రాంతః ప్రవిష్టాశ్చ షడస్మి న్వర్ష పర్వతాః దక్షిణోత్తరతో నిమ్నా మధ్యే తుంగా యథా క్షితిః వేద్యర్దే దక్షిణే త్రీణి త్రీణి వర్షాణి చోత్తరే ఇలావృత్తం తయో ర్మధ్యే చంద్రార్దాకారవ త్స్థితమ్ తతః పూర్వేణ భద్రాశ్వం కేతుమాలం చ పశ్చిమే ఇలా వృత్తస్య మధ్యేతు మేరుః కనక పర్వతః చతురాశీతి సాహస్ర స్త స్యోచ్చ్రాయో మహాగిరేః ప్రవిష్టః షోడశా థస్తా ద్విస్తారః షోడశైవ తు

దీనికి మధ్య సముద్ర మందు ప్రవిష్టము లైన ఆరు వర్ష పర్వతము లున్నవి. ఈ భూమి, ఉత్తర, దక్షిణముల యందు క్రిందకు మరియు మధ్య స్థల మందు ఎత్తు, వెడల్పు, భూమి వలెనె ఉండును. మూడు వర్షములు ఉత్తర మందు మూడు వర్షములు దక్షిణ మందు ఉన్నవి. ఈ రెండింటి మధ్య యందు ఇలావృత వర్షము అర్థ చంద్రాకారములో అవస్థితమై యున్నది. దానికి తూర్పు దిక్కు నందు భద్రాశ్వము, పశ్చిమ దిక్కు నందు కేతుమాలము ఉన్నవి. ఇలావృత్తము యొక్క మధ్య యందు కనక పర్వతమగు సుమేరు పర్వత మున్నది. ఈ మహా పర్వతము యొక్క ఎత్తు ఎనుబది నాలుగు వేల యోజనములు. పదునారు వేల యోజనములు భూమి యందు ప్రవిష్టమై అక్కడి నుండి పదునారువేల యోజనములు విస్తారము కలిగి యున్నది.

శరావ సంస్థిత త్వాచ్చ ద్వాత్రింశ న్మూర్ద్ని విస్తృతః శుక్లః పీతోసితో రక్తః ప్రాచ్యాదిషు యథాక్రమమ్ విప్రో వైశ్య స్తథా శూద్రః క్షత్రియశ్చ స్వవర్ణతః తస్యోపరి తథైవాష్టౌ పుర్యో ద్దిక్షు యథాక్రమమ్ తస్యోపరి సభా దివ్యాః పూర్వాదిషు క్రమేణ తు

ఇంద్రాది లోకపాలానాం తన్మధ్యే బ్రహ్మణః సభా యోజనానాం సహస్రాణి చతుర్దశ సముచ్చ్రితా అయుతోచ్చ్రాయ స్త స్యాథ స్తథా విష్కంభ పర్వతః ప్రాచ్యాదిషు క్రమేణైవ మందరో గంధమాదనః విపులశ్చ సుపార్శ్వశ్చ కేతు పాదప శోభితః కదంబో మందరే కేతు ర్జంబు ర్వై గంధమాదనే విపులే చ తతాశ్వత్థః సుపార్శ్వే చ వటో మహాన్ ఏకాదశ శాతా యామా యోజనానా మిమే నగాః

దీని శిఖరము శరావము (మూకుడు) తోను సమానముగా ముప్పది రెండు వేల యోజనములు వెడల్పు కలిగి ఉండును. ఈ గిరి యొక్క రంగు తూర్పు వైపున తెలుపు దక్షిణ దిక్కున పసుపు, పశ్చిమ దిక్కున నీలము, ఉత్తర దిక్కు ఎరుపు కలిగి ఉండును. దీనికి తూర్పు మొదలగు ఎనిమిది దిక్కుల యందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు క్రమానుసారముగా నివసించెదరు. దానిపైన తూర్పు మొదలగు దిక్కుల యందు ఇంద్రాది లోక పాలకుల యొక్క మరియు మధ్య స్థల మందు బ్రహ్మ యొక్క పదునాలుగు వేల యోజనములు విస్తారము గల సభలు శోభాయమానమై ఉండును. దీని క్రింద నాలుగు దిక్కుల యందు పదివేల యోజనముల ఎత్తు గలిగిన నాలుగు నిష్కంభ పర్వతము లున్నవి. వాని పేర్లు మందారము, గంధమాదనము, విపులము, సుపార్శ్వము. ఈ నాలుగు పర్వతముల పైన కేతువుతో సమానముగా నాలుగు వృక్షములు శోభాయ మానముగా నున్నవి. అనగా మందర పర్వతము మీద కదంబ వృక్షము, గంధమాదన పర్వతము మీద నేరేడు వృక్షము, విపుల పర్వతము మీద రావి వృక్షము, సుపార్శ్వ పర్వతము మీద మఱ్ఱి వృక్షములు ఉన్నవి. ఈ పర్వతముల ప్రమాణము పదకొండు వందల యోజనములు.

జఠరో దేవా కూటశ్చ పూర్వస్యాం దిశి పర్వతౌ ఆ నీల నిషదా నేతౌ పరస్పర నిరంతరౌ నిషదః పారియాత్రశ్చ మేరోః పార్శ్వేతు పశ్చిమే యథా పూర్వౌ తథా చైతా వానీల నిషదా యుతౌ కైలాసో హిమవాంశ్చైవ దక్షిణేన మహాచలౌ పూర్వ పశ్చాచ్చ తావేతా వర్ణవాంత ర్వ్యవస్థితౌ శృంగవాన్ జారుది శ్చైవ తథై వోత్తర పర్వతౌ యథైవ దక్షిణే తద్వ దర్ణవాంత ర్వ్యవస్థితౌ

తూర్పు దిక్కు యందు జఠర, దేవకూట పర్వతము లున్నవి. అవి పరస్పరము నీల, నిషద, పర్యంతము దీర్ఘములై ఉన్నవి. మేరు యొక్క పశ్చిమ పార్శ్వమందు నిషద, పార్శి యాత్ర లున్నవి. తూర్పు దిశతో సమానముగా ఇవి కూడా నీల, నిషద పర్యంతము విస్తృతమై ఉన్నవి. దక్షిణ దిక్కు యందు కైలాస హిమవాన మను పేర్లు గల మహా గిరు లున్నవి. ఇవి తూర్పు పశ్చిమముల యందు పొడవైనవై సముద్ర మందు ప్రవిష్టము లైనవి. ఉత్తర దిక్కు యందు శృంగావాన, జారుధి పర్వతములు ఉన్నవి. దక్షిణ దిక్కుతో సమానముగా ఇవి కూడా సముద్ర పర్యంతము విస్తృతములై ఉన్నవి.

మర్యాదా పర్వతా హ్యేతే కథ్యతేస్టౌ ద్విజోత్తమః హిమవ ద్దేమ కూటాది పర్వతానాం పరస్పరమ్ నవయోజన సాహస్రం ప్రాగుదగ్దక్షిణోత్తరమ్ మేరో రిలావృతౌ తద్వ దంతరే వై చతుర్దిశమ్ ఫలాని యాని వై జంబ్వా గంధమాదన పర్వతే గజదేహ ప్రమాణాని పతంతి గిరి మూర్ధని తేషాం స్రావా త్సభవతి ఖ్యాతా జంబూ నదీతీ వై యత్ర జాంబూనదం నామ కనకం సంప్ర జాయతే సా పరిక్రమ్య వై మేరుం జంబూ మూలం పునర్నదీ విశతి ద్విజ శార్దూల పీయమానా జనైశ్చ తైః

ఓ ద్విజోత్తమా! ఇవి ఎనిమిది గొప్పతనములు. అవి నీకు నేను చెప్పితిని. హిమవాన్, హేమకూటాది పర్వతముల యొక్క పరస్పరము తొమ్మిది వేల యోజనముల విస్తారము కలిగి ఉన్నవి. మరియు మేరు యొక్క ఈశాన్య ఆగ్నేయ దిక్కుల యందు, ఇలావృతము యొక్క మధ్యమ మందున ఈ పర్వతము లన్నియు ఉండును. గంధమాదన పర్వతము నుండి ఏనుగు దేహముతో సమానమగు జంబూ ఫలములు పర్వత శిఖరము నుండి పడు చుండును. వాటి నుండి రాసోత్పన్నమైన నదిని జంబూనది నుండి “జంబూ నద” మను పేరుతో స్వర్ణము ఉత్పన్నమైనవి. ఓ ద్విజశార్దూలా! మేరు పర్వతము యొక్క నాలుగు వైపులా పరిభ్రమిస్తు ఆ జంబూనది ఆ నేరేడు వృక్షము క్రింద నుండి ప్రవహించు చుండును. అక్కడ నివసించు మనుష్యులు ఆ నీటిని త్రాగుదురు.

భద్రశ్వేశ్వశిరో విష్ణు ర్భారాతే కూర్మ సంస్థితిః వరాహః కేతుమూలే చ మత్స్య రూప స్తథోత్తరే తేషు నక్షత్ర విన్యాసా దృషయః సమవస్థితాః చతుర్ష్వపి ద్విజ శ్రేష్ఠ గ్రహాభిభవ పాలకాః

భద్రాశ్వ మందు హయగ్రీవుడు భారత మందు కూర్మ రూపము, కేతుమాల యందు వరాహ రూపము, ఉత్తర మందు మత్స్య రూపముతో నారాయణుడు స్థితుడై ఉండును. ఓ ద్విజశ్రేష్టా! ఈ నాలుగు వర్షములందు, ఋషుల యొక్క స్థితి మరియు నక్షత్రముల యొక్క గమనాగమనము జరుగు చుండును. మరియు గ్రహముల మంచి చెడ్డల ఫలితములు కూడా కలుగు చుండును.