56 - ఉత్తర కురు కథనము

మార్కండేయుడు:

ఎవంతు భారతం వర్షం యథావ త్కథితం మునే! కృతం త్రేతా ద్వాపరం చ తాథా తిష్యం చతుష్టయమ్ అత్రైవైత ద్యుగానాం తు చాతుర్వర్ణ్యం చ వై ద్వజ చత్వారి త్రీణిద్వే చైవ తథైకం చ శరచ్చతమ్ జీపన్త్యత్ర నరా బ్రాహ్మన్ కృతంత్రేతా దిషు క్రమాత్ దేవా కూటస్య పూర్వస్య శైలేంద్రస్య మహాత్మనః పూర్వేణ యత్త్సితం వర్షం భద్రాశ్వం తన్నిబోధ మే శ్వేత పర్ణశ్చ నీలశ్చ శైవాలశ్చాచలోత్తమః కౌరంజః పర్ణశాలాగ్రః పంచైతే తు కులాచలాః తేషాం ప్రసూతి రన్యే యే బహవః క్షుద్ర పర్వతాః

మార్కండేయుడు:

ఓ మునీ! నేను ఈ భరత వర్షము నంతటిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించితిని. ఈ భరత వర్షము నందే సత్య యుగము, త్రేతా యుగము, ద్వాపర యుగము, కలి యుగము అను నాలుగు యుగములు నడుచు చున్నవి. మరియు ఈ ప్రదేశము నందే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల భేదము లున్నవి. ఇక్కడ సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగమను ఈ నాలుగు యుగముల యొక్క భేదము వలన మానవులు క్రమాను సారముగా నాలుగు వందలు, మూడు వందలు, రెండు వందలు, ఒక వంద సంవత్సరములు జీవించుదురు. తూర్పు దిక్కు నందున్న దేవకూటమను పేరు గల మహా పర్వతము యొక్క , తూర్పు దిక్కున ఏ వర్షము ఉన్నదో, దాని పేరు భద్రాశ్వ వర్షము. ఇప్పుడు దాని కథను వర్ణించెదను. శ్వేతపర్ణ, నీల, శైవాల, కౌరంజ, పర్ణశాలాగ్ర మను పేర్లు గల ఐదు శ్రేష్ఠమగు కులాచలములు ఈ వర్షము నందున్నవి. మరియు ఈ పర్వతముల నుండి ఉత్పన్నమైన అనేక చిన్న చిన్న పర్వతములు కూడా ఈ వర్షము నందున్నవి.

తైర్విశిష్టా జనపదా నానా రూపా స్సహస్రశః తతః కుముద సంకాశాః శుద్ధ సాను సుమంగళాః ఇత్యేవ మాదయోన్యేపి శతశోధ సహస్రశః సీతా శంఖావతీ భద్రా చక్రా వర్తాదికా స్తథా నద్యోథ బహ్వ్యో విస్తీర్ణాః శీతతోయేఘ వాహికాః అత్ర వర్షే నరాః శంఖ శుద్ధ హేమ సమప్ర భాః దివ్య సంగమినః పుణ్యా దశవర్ష శతాయుషః అధమోత్తమం నతేష్వస్తి సర్వే తే సమదర్శనాః తితిక్షాదిభి రష్టాభిః ప్రకృత్యాత్మ గుణైర్యుతాః తత్రాస్య శ్వశిరా దేవా శ్చకుర్భాహుర్జనార్ధనః శిరో హృదయ మేఢ్రాంఘ్రి హస్తైక్షి తయాన్వితః తస్యాప్య థైవం విషయా విజ్ఞేయా జగతః ప్రభో

ఈ వర్ష మందు కుముద సంకాశ శుద్దసాను సుమంగళ ఇత్యాది ఇతర శత సహస్ర జనపదములు చిన్న చిన్న పర్వతములతో నానా విధాలుగా అవస్థితమై యున్నవి. సీత, శంఖావతి, భద్ర, చక్రావర్తా మొదలగు అనేక అత్యంత శీతల జల వాహినులు విస్తరించి ఈ వర్షము నందు ప్రవహించు చున్నవి. ఈ వర్ష మందు ఏ మనుష్యులు జన్మింతురో వారందరు శంఖముతో నిర్మలమగు సువర్ణముతో సమానమగు తేజస్సు గలవారై యుందురు. మరియు శ్రేష్టమగు సాంగత్యము పవిత్రత గల వారై వేయి సంవత్సరములు జీవింతురు. వారిలో ఎవరును అధములు గాని ఉత్తములు గాని ఉండరు. ఎందుచేత ననగా అందరూ వారు సమ దర్శులై యుందురు. అక్కడి ప్రజలందరు స్వభావ సిద్దముగా సహన శీలత, మొదలగు ఎనిమిది గుణములచే గుణవంతులై ఉందురు. ఈ భద్రాశ్వ వర్షమందు భగవానుడు, చతుర్భాహుడగు, జనార్ధనుడు హయగ్రీవ రూపముచే శిరస్సు, హృదయము, చరణములు, హస్తములు, మూడు నేత్రములు గలవాడై ఉండును. ఆ ప్రభువగు జగదీశ్వరుని యొక్క సంపూర్ణ విషయము కూడ ఈ విధముగా ఎరుంగ వలెను.

కేతుమాలమతో వర్షం నిబోధ మామ పశ్చిమమ్ విశాలః కంబలః కృష్ణో జయంతో హరి పర్వతః విశోకో వర్ధమానశ్చ సప్తైతే కులపర్వతాః అన్యే సహస్రశ శ్శైలా యేషు లోకగణః స్థితః మౌలయస్తే మహాకాయాః శాకపోత కఠంభకాః అచ్చుల ప్రముఖాశ్చాపి వసంతి శతశో జనాః యే పిబంతి మహానద్యో వంక్షు శ్యామాం స్వకంబలామ్ అమోఘం కామినీం శ్యామాం తథైవాన్యా స్సహస్రశః

అనంతరము సుమేరు యొక్క పశ్చిమ దేశమందు స్థిరమై ఉన్న కేతుమాలా వర్షము యొక్క కథను వర్ణించెదను. ఈ వర్ష మందు ఏడు కుల పర్వతములు ఉన్నవి. వాని పేర్లు విశాల, కంబళ, కృష్ణ, జయంత, హరి పర్వత, విశోక, వర్ధమానములు. ఇవి కాక భూమి యొక్క మౌలి స్వరూపము మహాకాయములను ఇంకను వేల పర్వతము లున్నవి. వాని యందు అనేకులగు ప్రజలు నివసించెదరు. వానిలో మౌలి, మహాకాయ, శాకపోత, కరంభక, అచ్చ్యుల, ఇత్యాది పర్వతములలో అనేక ప్రాకారములు గల జనులు నివసింతురు. ఈ మానవులు ఏ మహా నదుల నీరు త్రాగుదురో, వాని పేర్లు వంక్షుశ్యామా, స్వకంబలా, అమోఘా, కామినీ, శ్యామా అట్లే ఇంకను కొన్ని వేల నదులు ప్రవహించు చున్నవి. వాటి జలమును త్రాగు చుందురు.

అత్రాప్యాయు స్సమం పూర్వై రత్రాపి భగవా న్హరి వరాహరూపీ పాదాస్య హృత్పృష్టే పార్శ్వత స్తథా (ముఖేనాపాదతశ్చైవ కంఠతః పుచ్చత స్తథా)

త్రినక్షత్రయుతే దేశే నక్షత్రాణి యుతాని చ ఇత్యేత త్కేతుమాలంతే కథితం మునిసత్తమ అతః పరం కురూన్వక్ష్యే నిబోధేహ మమోత్తరాన్ తత్ర వ్రుక్షా మధుఫలా నిత్య పుష్ప పలోపగాః వస్త్రాణి చ ప్రసూయంతే ఫలేష్వా భరణాని చ సర్వకామ పరదా స్తేహి సర్వకాల ఫలప్రదాః భూమి ర్మణి మయీ వాయుః సుగంధః సర్వదా సుఖః జాయంతే మానవాస్తత్ర దేవలోక పరిచ్యుతాః

అక్కడి ప్రజలకు కూడ ఆయుర్దాయము పూర్వము చెప్పినట్లు గానే యుండును. ఆ దేశము నందు భగవానుడగు హరి వరాహ రూపముతో విరాజిల్లు చుండును. ఆయన యొక్క చరణములు, హృదయము, ముఖము, వీపు, పార్శ్వము లందు ముఖనాశిక, కంఠ, దంత, పుచ్చము లందు త్రి నక్షత్ర యుక్తమై సంపూర్ణ దేశము నందు ఉండును. నక్షత్రములచే శుభాశుభములు తెలియు చుండును. ఓ ముని సత్తమా! ఈ విధముగా కేతుమాల యను పేరుగల వర్షమును కూడా నేను వర్ణించితిని. అనంతరము ఉత్తర కురు దేశము యొక్క కథను చెప్పెదను వినుము. ఈ సర్వ కాలముల యందు ఫలదాయక మైన వృక్షములు, వస్త్రములను ఉత్పన్నము చేయును. వాని ఫలముల నుండి అనేక విధములగు ఆభరణములు ఉత్పన్న మగును. అచ్చటి భూమి మణిమయమై, గాలి సుగంధ యుక్తమై ఎల్ల వేళలా సుఖ దాయకముగా ఉండును. దేవ లోకము నుండి భ్రష్టులైన మనుష్యులు అక్కడ జన్మింతురు.

మిథునాని ప్రసూయంతే సమకాల స్థితాని వై అన్యోన్య మనురక్తాని చక్రవాకోప మాని చ చతుర్దశ సహస్రాణి తేషాం సార్ధాని వై స్థితిః చంద్రకాంతశ్చ శైలేంద్రః సూర్యకాంత స్తథాపరః తస్మి న్కులాచాలే వర్షే తన్మథ్యే చ నహానదీ భద్ర సోమా ప్రయాత్యుర్వ్యాం పుణ్యామల జలేధినీ సహస్రశ స్తథైవా న్యాన నద్యో పర్షేపి చోత్తరే తథాన్యాః క్షరవాహిన్యో ఘృతవాహిన్య ఏవ చ దద్నోహ్రదా స్తథా తత్ర తథాన్యే చాను పర్వతాః అమృతా స్వాదకల్పాని ఫలాని వివిథాని చ వనేషు తేషు రమ్యాణి శతశోథ సహస్రశః తత్రాపి భగవా న్విష్ణుః ప్రాక్చిరామత్స్య రూపవాన్

వారు చక్రవాకముల వలె పరస్పరము ప్రీతి కలిగి యుందురు. సమాన వయస్సు గల బాల బాలికలను ఉత్పన్నము చేయుదురు. వారు పదునాలుగు వేల సంవత్సరముల పర్యంతము జీవించి యుందురు. ఈ వర్షము నందు “చంద్రకాంకత”, “సూర్యకాంత” ములను పేర్లు గల రెండు శ్రేష్ఠమైన పర్వతము లున్నవి. ఆ పర్వతములందు పవిత్రము నిర్మలమగు జలములతో ప్రవహించు “భద్ర సోమ” అను పేరు గల మహానది పృథ్వి యందు ప్రవహించు చుండును. మరియు ఇంకను చిన్న చిన్న వేల నదులు అచ్చట ఉన్నవి. ఇంకను ఏ నదులున్నవో వానియందు కొన్ని క్షీర వాహినులు, కొన్ని ఘృత వాహినులు, మరికొన్ని దధి యుక్తమైనవి. మరియు ఈ ఏడు కుల పర్వతములే కాక ఇంకను చిన్న చిన్న పర్వతములు చాలా ఉన్నవి. ఈ ఉత్తర కురు దేశస్థములగు వందల వేల వనముల యొక్క మధ్య భాగము నందున్న సమస్త వృక్షముల యందు వివిధములైన స్వాదిష్టమగు ఫలములు పండు చుండును.

విభక్తో నవథా విప్రః నక్షత్రాణాం త్రయం త్రయమ్ దేశా స్తత్రాపి నవథా విభక్తా ముని సత్తమః చంద్ర ద్వీపః సముద్రే చ భద్రద్వీప స్తథాపరః తత్రాపి పుణ్యో విఖ్యాతః సముద్రాన్త ర్మహామునేః ఇత్యే తత్కథితం బ్రహ్మః న్కురుపర్షం మయోత్తరమ్ శృణు కింపురుషా దీని వర్షాణి గదతో మమ

ఈ ప్రదేశము నందు కూడా భగవానుడగు నారాయణుడు మత్స్య రూప ధారుడై తూర్పు దిక్కున మస్తకము ఉంచి నివసించును. ఓ విప్రుడా! ఈ ఉత్తర కురు దేశము నందు నక్షత్రములు తొమ్మిది భాగములుగా విభజింప బడి మూడు మూడుగా క్రమానుసారముగా స్థితి కలిగి యుండును. ఓ ముని సత్తమా! ఈ విధముగా అన్ని దేశములు కూడా తొమ్మిది భాగములుగా విభజింప బడి ఉన్నవి. హే మహామునీ! ఈ వర్షము నందు “చంద్ర ద్వీప”, “భద్ర ద్వీప” మను పేరుగల రెండు ప్రసిద్ధమగు ద్వీపములు ఉన్నవి. ఈ రెండును సముద్ర మధ్య భాగమునందు పవిత్రములై ఉన్నవి. హే బ్రాహ్మన్! నేను నీకు ఉత్తర కురు వర్షము యొక్క కథను చెప్పితిని. అనంతరము కింపురుషాది వర్షముల యొక్క విషయములను వివరించెదను వినుము.