47 – ఋషి, దేవ సర్గములు

మార్కండేయుడు:

తతోభిధ్యాయత స్తస్య జజ్ఞిరే మానసీ ప్రజాః తచ్చరీర సముత్పన్నైః కార్యై న్తైః కారణైః సహ క్షేత్రజ్ఞాః సమవర్తంత గా తేభ్య స్తస్య ధీమతః తే సర్వే సమవర్తంత యే మయా ప్రాగుదాహృతా దేవద్యాః స్తావరాంతాశ్చ త్రైగుణ్య విషయాః స్మృతాః ఏవ భూతాని సృష్టాని స్థావరాణి చరాణి చ యదాస్య తాః ప్రజాః సర్వా న వ్యవర్ధంత దీనుతః అథాన్యా న్మానసాన్ పుత్రా న్సదృశా నాత్మనో సృజత్ భృగుం పులస్త్త్యం క్రతు మంగిరసం తథా మరీచిం దక్ష మాత్రిం చ వసిష్టం చైవ మానసమ్

మార్కండేయుడు:

అనంతరము బ్రహ్మ తిరిగి చింతించుటచే అతని శరీరము నుండి కార్య కారణులగు మానస ప్రజలు ఉత్పన్నమైరి. ఆ బుద్ధిమంతుడగు బ్రహ్మ యొక్క గాత్రము నుండి సమస్త క్షేత్రజ్ఞులు ఉత్పన్న మయిరి. ఇంతేగాక ఇంకెవరు ఉత్పన్నమైరో, వారిని గూర్చి ఇంతకు ముందు చెప్పితిని. దేవతల నుండి స్థావర పర్యంతము అందరును త్రిగుణ యుక్తులు. ఈ విధముగాబ్రహ్మ స్థావర, జంగమ చరాచర జీవులను ఉత్పన్నము చేసెను. భృగు, పులస్త్య, పులహ,క్రతు, అంగీరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్టులను వీరు బ్రహ్మ యొక్క మానస పుత్రులు.

నవ బ్రాహ్మణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః తతోసృజ త్పున ర్బ్రహ్మా రుద్రం క్రోధాత్మ సంభవమ్ సంకల్పం చైవ ధర్మం చ పూర్వేషా మాపి పూర్వజమ్ సనందనాదయో యే చ పూర్వం సృష్టాః స్వయంభువా న తే లోకేషు సజ్టంతో నిరపేక్షాః సమాహితాః సర్వే తేనాగత జనానా వీతరాగా విమత్సరాః తెష్వేవం నిరపేక్షేషు లోకసృష్టౌ మహాత్మనః బ్రాహ్మణో భూ నమహా క్రోధ స్తతో త్పన్నోర్కసన్నిభః అర్థనారీ నరవపుః పురుషోతి శరీరవాన్ విభజాత్మానమి త్యుక్త్వా స తదాంతర్ధదే తతః

ఈ తొమ్మిది మంది బ్రహ్మ యొక్క మానస పుత్రులని పురాణముల యందు నిశ్చయింప బడిరి. అప్పుడు తిరిగి క్రోధాత్ముడగు రుద్రుణ్ణి ఉత్పన్నము చేసెను. ఆ తరువాత సంకల్పమును, ధర్మమును, ఉత్పన్నము చేసెను. అవి మొదటి నుండియే జన్మించెను. మరియు సనందనాదులను మొదటి సృష్టి యందే స్వయంభువగు బ్రహ్మ సృష్టించెను. వీరందరు భవిష్యత్తున జ్ఞాన సంపన్నులు, వీతరాగులు, మత్సరహితులు, నిరపేక్షులు, సమాధిమంతులు అయిరి. ప్రజా సృష్టి విషయమందు సంకల్పము లేదు. సృష్టి యందు ఈ విధముగా వారి నిరపేక్షను చూసి బ్రహ్మకు అత్యంత క్రోధము కలిగెను.ఆ క్రోధము నుండి భయంకర దేహ యుక్తుడు, సూర్యుని తేజస్సుతో సమానమగు ఒక పురుషుడు జన్మించెను. అతని దేహము నందలి అర్థ భాగము పురుషుడు, మిగిలిన సగ భాగము స్త్రీగాను ఉండెను. అనంతరము “నీ దేహమును విభజించుమని” చెప్పి బ్రహ్మ అంతర్థాన మయ్యెను.

న చోక్తా వై పృథ క్స్త్రీత్వం పురుషత్వం తథాకరోత్ బిభేద పురుషత్వం చ దశథా చైకదాం తు సః సౌమ్యా సౌమ్యై స్తథా శాంతైః పుంస్త్వం స్త్రీత్వం చ స ప్రభుః బిభేద బహుదా దేవః పుటషై తైరమి శితైః తతో బ్రహ్మాత్మా సంభూతం పూర్వం స్వాయంభువం ప్రభుః శతరూపాం చ తాం నారీం తపోనిర్దూత కల్మషామ్ స్వాయంభువో మను ర్దేవః పత్నీత్వే జగృహే విభుః తస్మాచ్చ పురుషా త్పుత్రౌ శతరూపా వజ్రాయత ప్రియ పతో త్తానపాదౌ ప్రఖ్యాతా వాత్మకర్మభిః

ఆ పురుషుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞను పొందిన వాడై తన దేహమును రెండు భాగములు చేసెను. అందులో స్త్రీత్వము, పురుషత్వము వేరు వేరుగా పుట్టెను. అందు పురుషాకారమునకు సౌమ్యము, అసౌమ్యము, శాంతము, తెల్లని, నల్లని ఇత్యాది భేదములతో పదునొకండు భాగములుగా విభజించెను. ఓ ద్విజుడా! అటు పిమ్మట ప్రభువగు బ్రహ్మ పూర్వము జన్మించిన తనతో సమానమగు పురుషునకు “స్వాయంభువ మనువు” అను పేరు పెట్టి ప్రజాపాలకునిగా చేసెను. మరియు తపస్సుచే పాపరహితురాలగు నట్టి కామినికి “శతరూప” మని పేరు పెట్టెను. దేవా విహుడగు స్వాయంభువ మనువు ఆ శతరూపను తన భార్యగా చేసికొనెను. ఆ పురుషుడు శతరూప వలన ఇద్దరు పుత్రులను కనెను. ఆ ఇద్దరి పేర్లు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఆ ఇద్దరు తమ తమ కర్మల వలన విఖ్యాతి చెందిరి.

కన్యే ద్వే చ తథా కూతిం ప్రసూతిం చ తతః పితా దదౌ ప్రసూతిం దక్షాయ తథాకూతిం రుచేః పురా ప్రజాపతిః స జగ్రాహ తయో ర్యజ్ఞః సదక్షిణః పుత్రో జజ్ఞే మహాభాగః దంపతీ మిథునం తతః యజ్ఞస్య దక్షిణాయాం తు పుత్రా ద్వాదశ జజ్ఞిరే యామా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయంభువేంతరే తస్య పుత్రాస్తు యజ్ఞస్య దక్షిణాయాం సుభాస్వరాః ప్రసూత్యామ్చ తథా దక్ష శ్చతస్త్రో వింశతి స్తథా ససర్జకంయా స్తాసాం చ సమ్యజ్ నామాని మే శృణుః శ్రద్ధా లక్ష్మీ ర్ధృతి స్తుష్టిః పుష్టి ర్మేదా క్రియా తథా బుద్ధి ర్లజ్జా వపుః శాంతిః సిద్ధిః కీర్తి స్త్రయోదశీ పత్న్యర్థే ప్రతిజ గ్రాహ ధర్మో దాక్షాయణీః ప్రభుః

వీరుగాక ఆ శతరూపకు ఇద్దరు కన్యలు ఉత్పన్న మయిరి. ఆ ఇద్దరి పేర్లు ఆకూతి మరియు ప్రసూతి. తండ్రి స్వాయంభువు ప్రసూతి యను పేరు గల కన్యను దక్షునికి, ఆకూతి యను పేరుగల కన్యను ప్రజాపతి యగు రుచి అను వానికి సమర్పించెను. ఓ మహాభాగా! వారిలో ఒకరికి పుత్రుడు వేరొకరికి పుత్రిక కలిగిరి. వారి పేర్లు యజ్ఞుడు, దక్షిణ. వారిద్దరూ దాంపత్య భావమును పొందిరి. ఆ దక్షిణ యందు యజ్ఞుడి వలన ఏ పన్నెండు మంది పుత్రులు ఉత్పన్నమయిరి. వారు స్వాయంభువు మన్వంతర మందు “యాము” లను పేరు గల దేవతలుగా ప్రసిద్ధి కెక్కిరి. యజ్ఞ పురుషుని పుత్రులు మిక్కిలి తేజస్సు గలవారు, ఇక్కడ ప్రజాపతి వలన ప్రసూతి గర్భము నుండి ఇరువది నలుగురు కన్యలు జన్మించిరి. వారి పేర్లను బాగుగా వినుము. 1. శ్రద్ధా,2. లక్ష్మీ, 3. ధృతి, 4. తుష్టి, 5. మేధా, 6. క్రియ, 7. బుద్ధి, 8.లజ్జ,9. వపు, 10. శాంతి, 11. సిద్ధి,12. కీర్తి,13.పుష్టి అను ఈ పదముగ్గురు కన్యలను ధర్ముడు తన భార్యలుగా స్వీకరించెను.

తాభ్యః శిషా యవీయస్య ఏకాదశ సులోచనాః ఖ్యాతిః సత్యథ సంభూతి స్మృతిః ప్రీతి స్తథా క్షమా సంతతి శ్చానసూయా చ ఊర్జా స్వాహా స్వదా తథా భృగు ర్భవో మరీచిశ్చ తథా చైవాంగిరా మునిః పులస్త్యః పులహశ్చైవ క్రతుశ్చ ఋషయ స్తథా వసిష్ఠోత్రి స్తథా వహ్నిః పితరశ్చ యథా క్రమమ్ ఖ్యాత్యాద్యా జగృహుః కన్యా మునయో ముని సత్తమాః శ్రద్ధా కామం శ్రీశ్చ దర్పం నియమం ధృతి రాత్మజమ్ సంతోషం చ తథా తుష్టి ర్లోభం పుష్టి రజాయత మేధా శ్రుతం క్రియా దండం నయో వినయ మేవ చ బోధం బుద్ధి స్తథా లజ్జా వినయం వపురాత్మజమ్ వ్యవసాయం ప్రజజ్ఞే వై క్షేమా శాంతి రసూయత సుఖం సిద్ధి ర్యశః కీర్తి రిత్యేతే ధర్మయోనయః కామా దాటి ముదం హర్షం ధర్మపౌత్ర మసూయత

మరియు మిగిలిన పదునొకండు సులోచనలగు కన్యలు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వదా అను పేర్లతో విఖ్యాతి పొందిరి. ఆ పదునొకండు కన్యలను భృగువు ఇత్యాదులు క్రమానుసారముగా స్వీకరించిరి. భృగువు, మహాదేవుడు, మరీచి, అంగీరసముని, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్టుడు, అత్రి, వహ్ని మరియు పితృగణాలు. ఈ మునులు, ఋషులు, ముని సత్తమ గణాలు ఖ్యాతి మొదలగు పదునొకండు మంది దక్షుని కుమార్తెలను యథా క్రమముగా స్వీకరించిరి. వీరిలో శ్రద్ధ కామమును, లక్ష్మి దర్పమును, ధృతి నియమమును, తుష్టి సంతోషమును, పుష్టి లోభమును, మేధ శ్రుతమను, క్రియ దండమును, బుద్ధి బోధను, లజ్జ వినయమును, వాపు వ్యవసాయమును, శాంతి క్షేమమును, సిద్ధి సుఖముమును, కీర్తి యశమును ఉత్పన్నము చేసిరి. వీరు ధర్ముని సంతానము కామము వలన అత్యానందము గల హర్షుడను పేరుగల పౌత్రుడు ధర్మునికి జన్మించెను.

హింసా భార్యా త్వధర్మస్య తస్యాం జజ్ఞే తథానృతమ్ కన్యా చ నిర్భతి స్తస్యాం సుతౌ ద్వౌ నరకం భయమ్ మాయా చ వేదనా చైవ మిథునం ద్వయ మేతయోః తయో ర్జజ్ఞేథ వై మాయా మృత్యుం భూతాపహారిణమ్

అధర్ముని భార్య పేరు హింసా. ఆమె గర్భము నుండి అనృతుడు జన్మించెను. అనృతుడు ఆ నిరృతి గర్భము నుండి నరకుడు, భాయుడు అను పేర్లు గలిద్దరూ పుత్రులు జన్మించిరి. మరియు మాయా, వేదన అను పేర్లు గల ఇద్దరు కన్యలను ఉత్పన్నము చేసెను. వీరు పరస్పరము దాంపత్య భావమును కలిగి యుండిరి. వారిలో మాయ ప్రాణులను సంహరించు మృత్యువు అను పేరు గల కుమారుని కనెను.

వేదనాత్మసుతం చాపి దుఃఖం జజ్ఞేథ రౌరవాత్ మృత్యో ర్వ్యాది జరా శోక తృష్ణా క్రోథాశ్చ జజ్ఞిరే దుఃఖోద్భవాః స్మృతా హ్యేతే సర్వే వాధర్మలక్షణాః నైషాం భార్యాస్తి పుత్రోవా సర్వేతే హ్యూర్ధ్వ రేతసః నిరృతిశ్చ తథా చాన్యా మృత్యోర్భార్యాభవ న్మునే అలక్ష్మీ ర్నామ తస్యాం చ మృత్యోః పుత్రా శ్చతుర్దశ అలక్ష్మీపుత్రకా హ్యేతే మృత్యో రాదేళ కారిణః వినాశకాలేషు నరాన్ భజంత్యేతే శృణుష్వ తేతాన్ ఇంద్రియేషు దశస్వేతే తథా మనసి చ స్థితాః స్వే స్వే నరం స్త్రియం వాపి విషయే యోజయంతి హి

మరియు నరకము వలన దుఃఖము అను పేరు గల ఒక పుత్రుని వేదన ఉత్పన్నము చేసెను. ఈ మృత్యువుకు వ్యాధి, జరా, శోకము, తృష్ణా, క్రోధము, ఉత్పన్నమైనవి. ఇవన్ని దుఃఖము వలన ఉత్పన్నమై మహా అధర్ములైరి. వారికి భార్యా పుత్రులు ఎవరూ లేరు. ఎందుచేత ననగా వారందరూ ఎడారులు. ఓ మునీశ్వరా! నిఋృతి అను పేరు గలది మృత్యువునకు ఒక భార్య ఉన్నది. ఆమెను లోక మందు అలక్షీ అందురు. మృత్యువు ఆమె వలన పదునాల్గురు పుత్రులను ఉత్పన్నము చేసెను. ఆ మ్ర్యత్యువు యోక్క ఆజ్ఞావర్తులగు పుత్రా గణాలు “అలక్షీ పుత్రులు” అను పేరుతో విఖ్యాతి చెందిరి. వీరు వినాశ కాలమందు మానవుల యొక్క ఏ ఏ అంగములందు ఉందురో వాని పేర్లు చెప్పెదను వినుము. వీరు మొదటి పది మంది పది ఇంద్రియములందు నివసించెదరు. మరియు పదునొకండవ పుత్రుడు అందరి మనస్సుల పైన నివసించును. ఇతడే స్త్రీ, పురుషులను తన తన విషయములందు కలుపు కొనును.

అథేంద్రియాని చాక్రమ్య రాగ క్రోథాదిభి ర్ననాన్ యోజయంతి యథా హానిం యాన్త్యధర్మాదిభి ర్ద్విజః అహంకార గతాశ్చాన్యే తథాన్యే బుద్ధి సంస్థితాః వినాశాయ నరస్త్రీణాం యతంతే మోహ సంశ్రితాః తథైవాన్యో గృహే పుంసా దుః సహో నామ విశ్రుతః క్షుత్క్షామోదోముఖో నగ్న శ్చీరీకాక సమస్వనః స సర్వాన్ ఖాదితుం సృష్టో బ్రహ్మణా తమసో నిధిః దంష్ట్రాకరాళ మత్యర్థం వివృతాస్యం సుభైరవమ్ తమత్తు కామ మహేదం బ్రహ్మలోక పితామహః సర్వ బ్రహ్మమయః శుద్దః కారణం జగతోవ్యయః

ఓ ద్విజుడా! అనంతరము రాగము, క్రోధము, మొదలగు వాని ద్వారా సమస్త ఇంద్రియములను ఆక్రమించి అధర్మాది సహితముగా సంయోగము చేయుటచే ప్రాణులకు హాని కలుగును. మృత్యువు యొక్క పండ్రెండవ పుత్రుడు అహంకారమును ఆశ్రయించి వర్తించును. పదమూడవ పుత్రుడు ప్రాణుల యొక్క బుద్ధి యందు నిలిచి యుండును. అందుచే పురుషులు మోహితులై స్త్రీలను నాశనము చేయుటకు ప్రయత్నించుదురు. పదునాల్గవ అలక్ష్మీ యొక్క పుత్రుని పేరు దుఃస్సహుడు. యితడు పురుషుల ఇండ్ల యందు నివసించును. ఈ దుఃస్సహుడు ఎల్లప్పుడు క్షుదాతరుడు, అధోముఖము కలవాడు, నగ్నుడు, చెట్టు పట్టా ధరించువాడు. కాకి వలె శబ్దము చేయువాడు అయి ఉండెను. బ్రహ్మ పదార్థము లన్నింటిని భక్షించుటకే ఈ తపోనిధిని సృష్టించెనని తెలియు చున్నది. అనంతరము భయంకరమగు గడ్డము, నోరు తెరచుకొని అత్యంత భయంకర రూపముతో శబ్దము చేయుచు, అందరిని భక్షించుటకు ఉద్యుక్తుడైన దుఃస్సహుని చూచి లోక పితామహుడు, సర్వ బ్రహ్మ మాయ శుద్ధ జగత్కారణుడు, నాశము లేనివాడు అగు బ్రహ్మ ఇట్లు చెప్ప నారంభించెను.

బ్రహ్మ:

నాత్తవ్యం తే జగదిదం జహి కోపం శమం వ్రజః త్యజైనాం తామసీం పృత్తి మపాప్య రజసః కలామ్

బ్రహ్మ:

ఓ దుఃస్సహా! జగత్తును నీవు భక్షించుట ఉచితము గాదు. కోపమును వీడి శాంతమును పొందుము. ఈ తమో గుణమును త్యజించుము. మరియు రజో గుణము యొక్క అంశను కూడా వీడుము.

దుఃస్సహుడు:

క్షుత్క్షామోస్మి జగన్నాథ పిపాసుశ్చాపి దుర్భలః కథం తృప్తి మియాం నాథ భవేయం బలవాన్కథమ్?

కశ్చాశ్రయో మమాఖ్యాహి వర్తేయం యత్ర నిర్వృతః

దుఃస్సహుడు:

ఓ జగన్నాథా! నేను ఆకలిచే అత్యంత బాధచే కృశించి దాహము యొక్క బాధ చేత అత్యంత దుర్భలుడ నైతిని. ఓ నాథా! ఏ విధముగా తృప్తిని పొందుదును? ఏ విధముగా బలవంతుడ నగుదును? ఎవ్వరిని ఆశ్రయించి సుఖముగా నుందును? దయ ఉంచి నాకు చెప్పుడు.

బ్రహ్మ:

తవాశ్రయో గృహం పుంసాం జనశ్చాధార్మికో బలమ్ పుష్టి ర్నిత్య క్రియా హాన్యా భవాన్ వత్స గమిష్యతి లూతాః స్ఫోటాశ్చ తే వస్త్ర మాహారం చ దదామి తే క్షుత కీటావపన్నం చ తథా శ్వభి రవేక్షితమ్ భాగ్నభాండగతం తద్వ న్ముఖవాతోపశామితమ్ ఉచ్చిష్టాపక్వ మస్విన్న మవలీఢ మసంస్కృతమ్

బ్రహ్మ:

వత్సా! పురుషుల గృహములే నీకు ఆశ్రయము. అధర్మ పురుషులే నీకు బలము. మానవుల నిత్య కృత్యములకు హాని కలుగుటచే నీకు తృప్తి లాభము కలుగును. మొసలి యొక్క వల మరియు స్ప్రోటములే నీకు వస్త్రములు. ఇప్పుడు నీకు ఆహారము ప్రసాదించు చున్నాను. ఏ ప్రదేశమందు కీటకములు ఉత్పన్నమగునో, వేనిని కుక్కలు చూచునో, అట్టివి నీకు ఆహారము. మరియు ఏ పదార్థములు పగిలిన పాత్రయందు ఉంచ బడునో, లేక నోటితో ఊదుతూ చల్లబరచిన ఆహార పదార్థములు, లేక ఎంగిలి చేసిన, పక్వము కాని అన్న సంస్కారము లేని పదార్థములు.

భగ్నాస స్థితై ర్భుక్త మాసన్నగత మేవ చ విదిన్ముఖం సంధ్యయోశ్చ నృత్య వాద్య స్వనా కులమ్ ఉదక్యోపహృతం భుక్త ముదక్యా ద్రుష్టమేవ చ యచ్చోపఘాతవ త్కించి ద్భక్ష్యం పేయ మథాపి వా ఏతాని తవ పుష్ట్యర్థ మన్యచ్చాపి దదామి తే అశ్రద్ధయా హుతం దత్త మస్నాతై ర్యదవజ్ఞయా యన్నాంబు పూర్వకం క్షిప్త మనాత్మీకృత మేవ చ త్యక్త మావిష్కృతం యత్తు దత్తం చైవా తివిస్మయాత్ దుష్టం కృద్దాత్త దత్త చ యక్ష్మ ప్రాప్స్య సి తత్ఫలమ్ యచ్చ పౌనర్భవః కించి త్కరో త్యాముష్మికం క్రమమ్ యచ్చ పౌనర్భవా యోషి త్తద్యక్ష తవ తృపయే కన్యాశుల్కో పధానాయ సమపాస్తే ధనక్రియాః తథైవ యక్ష్మ పుష్ట్యర్థ మనచ్చాస్త్ర క్రియాశ్చ యాః యచ్చార్థ నిర్వృతౌకించి దధీతం యన్నసత్యతః తత్సర్వం తవ కామాశ్చ దదామి తవ సిద్ధయే గుర్విణ్యభిగమే సంధ్యా నిత్యకార్య వ్యతిక్రమే అసచ్చాస్త్ర క్రియాలాప దూశితేషు చ దుఃస్సహ తవాభిభిద సామర్థ్యం భవిష్యతి సదా నృషు పంక్తిభేదే వృథాపాకే పాకభేదే తథా కృతే నిత్యం చ గేహ కలహే భవితా వసతి స్తవ

విరిగిన ఆసనము మీద కూర్చొనిన లేక ఇంటికి వచ్చిన అతిథులకు భోజనము పెట్టక, లేక దక్షిణ దిక్కున ముఖము ఉంచి, లేక సంధ్యా సమయమందు గాని, నృత్యము చేయు సమయమందు గాని, పాట పాడు సమయమందు గాని, వాద్య సమయమందు గాని, ఎవరు భోజనము చేయుదురో లేక రజస్వలా అయిన స్త్రీ చూసిన లేక తాకిన, ఎవరైన ఎంగిలి చేసిన దూషింప బడిన యట్టి అన్నమును భుజింతురో, ఈ పదార్థము లన్నియు నీకు ఆహార పదార్థములు. నీకు పుష్టి కారకములగును. ఓ దుఃస్సహా! నీ పుష్టి కొరకు ఇంకను ఇచ్చుచున్నాను. ఎవరు స్నానము చేయక, శ్రద్ధ లేక హోమము చేయుదురో ఏ అజ్ఞానులైన మనుష్యులచే ఇవ్వ బడునో, ఎవడు ఏ వస్తువులను జలముచే పవిత్రత చేయక ఇచ్చునో, ఎక్కడ వస్తువులు వ్యర్థముగా పడి యుండునో, ఎచ్చట పరిత్యజించుటకు విస్తారముగా పదార్థములు ఉండునో, వ్యాపించి ఉండునో, ఏ పదార్థములు అత్యంత ఆశ్చర్యమును, భయమును కలుగ జేయునో, ఏ పదార్థములు దుష్టులు, క్రోధితులు, ఆర్తులు, అగు మానవులు ఇచ్చెదరో, ఇట్టి వాటిని అన్నింటిని నీవు అనుభవింపుము. ఓ యక్ష్మా! నీకు అవి వశీభూతమై ఉండును. ఎవరు రెండవ వివాహము చేసుకొన్న స్త్రీకి కలిగిన పుత్రుడు పరలోక సంబంధమగు కార్యములు చేయునో, మరియు పునర్భవ యగు స్త్రీ ఏ కర్మలు చేయునో, వో యక్ష్మా! అవి నీకు తృప్తిని కలిగించును. ఏ కన్యను ధనమును తీసుకొన ధర్మక్రియలు చేయునో, ఇదే విధముగా ఏ క్రియలు అసత్ శాస్త్రము ద్వారా చేయుదురో అవి నీకు పుష్టిని కలిగించును. ఎవరు అర్థము ప్రాప్తించుటకు కార్యములు చేయుదురో, ఎవరు అసత్యము భోదింతురో, ఓ దుఃస్సహా! అవే నీకు పుష్టి యొక్క హేతువులు. ఇప్పుడు నీకు సిద్ధి కొరకు సమయము ఇచ్చు చున్నాను. వినుము. ఎప్పుడు మనుష్యుడు గర్భవతులగు స్త్రీలతో రమించెదరో, ఎప్పుడు సంధ్య లేక నిత్య కార్యములను అతిక్రమించెదరో, మరియు ఎప్పుడు మనుష్య గణాలు అసత్ శాస్త్రోక్త కార్యముల ద్వారా దూషింప బడుదురో ఓ దుఃస్సహా! అట్టి సమయమందు నీవు వారి యొక్క తిరస్కారము లందు సామర్థ్య లాభము పొందగలవు. ఎచ్చట పంక్తి భేదము కలుగునో, ఎచ్చట వ్యర్థముగా అన్నము తయారు చేయబడునో, అనగా తన కొరకు మాత్రమే భోజనము తయారు చేసుకోనునో, ఎచ్చట ఎల్లప్పుడూ కలహములు ఉండునో అచ్చట నీనివాసము ఉండును.

అపోష్యమాణే చ తథా భృత్య గో వాహనా దికే ఆస ధ్యాభ్యుక్షితాగారే కాలే త్వత్తో భయం నృణామ్ నక్షత్ర గ్రహ పీడాసు త్రివిదోత్పాతదర్శనే అశాంతిక పరా న్యక్ష్మ న్నరా నాభి భవిష్యసి వృథోపవాసినో మర్త్యా ద్యూత స్త్రీషు సదా రతాః త్వద్భాషణో పకర్తారో బైడాల వ్రతికాశ్చ యే అబ్రహ్మ చారిణాదీత మిజ్యా చావిదుషా కృతా తపోవనే గ్రామ్యభుజాం తథైవానిర్జితా త్మనమ్ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ స్వకర్మతః పరిచ్యుతానాం యా చేష్టా పరలోకార్థ మీప్సతామ్ తష్యాశ్చ యత్ఫలం సర్వం తత్తే యక్ష్మః భవిష్యతి అన్యచ్చ తే ప్రయచ్చామి పుష్ట్యర్థం సంనిబోధతత్

ఏ ఇంటిలో అన్నము తృణము ఇవ్వక గోవు, గుఱ్ఱము, మొదలైన పశువులు ఉండునో, వాటిని ఆకలిచే బాధింతురో, మరియు ఏ ఇంటి యందు సూర్యాస్తమయ మగుటకు ముందుగానే అసంధ్యా కాలమందు చీపురుతో శుభ్రము చేయబడదో, ఓ దుస్సహా! అక్కడి మానవులకు నీ వలన భయము కలుగును. నక్షత్ర గ్రహ పీడలు, త్రివిధమగు ఉత్పాతములు కన్పించినపుడు ఏ మానవుడు శాంతి జరపడో, అట్టి మనుష్యులను నీవు అభిభూతులను చేయుదువు. ఎవరు వృథాగా ఉపవాసము చేయుదురో, జూదమందు, స్త్రీల యందు, ఎవడు ఎల్లప్పుడూ ఆసక్తుడై ఉండునో, ఎవరు నీ యొక్క ఉపకారము గురించి సంభాషించెదరో, ఎవరు పిల్లి వలె తన ప్రయోజనమును సిద్ధింప జేసుకొనుదురో, ఏ ప్రజలు బ్రహ్మ చర్యము లేకుండ వేద పఠనము చేయుదురో, మరియు మూర్ఖులచే చేయబడు యజ్ఞము, తపోవనము నందు గృహస్థుని వలె చేయు కర్మలు, చంచల చిత్తముతో అజితేంద్రియుడు

మనవి: ఇక్కడ కొన్ని శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.

సూర్యుడు ఏ ఇంటి యందు శయ్యను చూడడో, ఏ ఇంటి యందు అగ్ని, జలము, వెలుగొందు చుండునో, ఏ ఇల్లు సూర్యుని ప్రకాశముచే ప్రకాశింప బడునో, అట్టి గృహము లక్ష్మి యొక్క స్థానము. ఏ ఇంటిలో చందనము, వీణ, దర్పణము, మధువు, ఘృతము, విషము, మరియు రాగి పాత్రలు ఉండునో, అట్టి గృహమును నీవు ఆశ్రయింప లేవు. ఏ ఇంటిలో ముళ్ళ చెట్టు, నిష్పావలత, ద్వితీయ వివాహం చేసుకొన్న స్త్రీ, పుట్ట కలిగి యుండునో, ఓ యక్ష్మా! అది నీ యొక్క గృహము. ఏ ఇంటిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలు, మూడు గోవులు, అంధకారము, కాష్టము, అగ్ని, ఉపస్థితమై ఉండునో, అట్టి ఇల్లు నీకు నివాసము. ఓ యక్ష్మా! ఏ ఇంటి యందు ఒక మేక, ఇద్దరు స్త్రీలు మూడు గోవులు, ఐదు దున్నపోతులు, ఆరు గుఱ్ఱములు, ఏడు ఏనుగులు ఉండునో ఆ ఇంటిని వెంటనే నాశనము చేయుము.

కుద్దాల దాత్ర పిటకం తద్వ త్త్సాల్యాది భాజనమ్ యత్ర తత్రైవ క్షిప్తాని తవ దద్యుః ప్రతిశ్రయమ్ మసలోలూఖలే స్త్రీణా మాస్యా తద్వదుంబరే అవస్కరే మంత్రణం చ యక్ష్మ తదుపకృత్తవ లఘ్యంతే యాత్ర ధాన్యాని వాక్వాపక్వాని వేశ్మని తద్వాచ్చాస్త్రాణి త త త్వం యథేష్టం చర దుఃసహ స్థాలీ పిధానే యత్రాగ్ని ర్దత్తో దర్వీఫలేన వా గృహే తత్ర హి రిష్టానా మశేషానాం సమాశ్రయః మానుషాస్థి గృహే యాత్ర దివారాత్రం మృత స్థితిః తత్ర యక్ష్మ తవ వాస స్తథాన్యేషాం చ రక్షసామ్

ఏ ఇంటి యందు కొడవలి, పీట, పళ్ళెము ఇత్యాది సమస్త పాత్రలు ఇటునటు విసర వేయబడి ఉండునో ఆ ఇంటి యందలి మనుష్యులు నీకు తన ఇంటి యందు ఆశ్రయము ఇచ్చుటకు ఇష్ట పడుదురు. ఓ యక్ష్మా! ఏ ఇంటి యందలి స్త్రీ రోకలి రోలు మీద లేక గడప మీద కూర్చొని ఉండునో మరియు ఇంటి వెనుక భాగమున ఉండు స్త్రీతో మాట్లాడుచు ఉందురో ఈ పనులన్నియు నీకు ఉపకారము కొరకై ఉన్నవి. ఏ ఇంటి యందు వండిన లేక వండని ధాన్యములను మరియు సత్ శాస్త్రము యొక్క అనాదరము కలుగునో, ఓ దుస్సహా! అట్టి ఇంటి యందున నీవు ఇచ్చానుసారముగా వ్యవహరింపుము. ఏ ఇంటి యందు పళ్ళెము మూయుట, గరిటతో ఇంటి యందలి స్త్రీ ఎవరికైనను నిప్పు ఇచ్చుట చేయునో, అట్టి ఇల్లు అన్ని అరిష్ఠములకు స్థానమై ఉన్నది. మనుష్యుల ఎముకలు, మృత పదార్థము, ఏ ఇంటి యందు పగలు రాత్రి ఉండునో, అక్కడ ఇతరములగు సమస్త రాక్షసులు నివసించెదరు.

అదత్వా భుజంతే యే వై బంధో పిండం తథోదకమ్ సపిండాన్ సోదకాంశ్చైవ తత్కాలే తా న్నరాన్ భజ యత పద్మమహా పద్మో సురభి ర్మోదకాశినీ వృషభై రావతౌ యత్ర కల్ప్యంతే తద్గృహం త్యజ అశస్త్రా దేవతా యత్ర సశస్త్రా శా హవం వినా కల్ప్యంతే మనుజై(ర) ర్చ్యా స్తత్పరి త్యజ మందిరమ్ పౌర జానపదై ర్యత్ర ప్రాక్ప్రసిద్ద మహోత్సవాః క్రియంతే పూర్వ వద్గేహే న త్వం తత గృహే చర శూర్పవాత ఘటా భోభిః స్నానం వస్త్రాంబు విప్రుషైః నఖాగ్ర సలిలై శ్చైవ తా న్యాహి హత లక్షణాన్

ఎప్పుడు మనుష్య బంధువులు సపిండము, సమానోదకుల పురుషులకు పిండము లేక జలదానము చేయరో అట్టి సమయ మందు నీవు వారిని భుజింపుము. ఏ ఇంటి యందు పద్మము, మహాపద్మము అనగా నిథి విశేషములు ఉండునో స్త్రీలు ఎల్లప్పుడు లడ్డులు భుజించు చుండురో, ఎద్దు, ఏనుగులు ఉండునో ఆ ఇంటిని నీవు విడిచి పెట్టుము. ఎక్కడ శస్త్రము లేని దేవతలు యుద్ధము లేకుండానే మనుష్యుల ద్వారా సశస్త్ర రూపము లందు కల్పింపబడి పూజింప బడుదురో, అట్టి మందిరములను నీవు త్యజించ వలెను. పూర్వము చెప్పిన ఎట్టి ఇళ్ళయందు పురవాసులుండు పురముల యందు సమస్త జనపదాలు పూర్వ ప్రసిద్దులగు మహాత్ముల సంయుక్తమై ఉండునో, అట్టి గృహములను త్యజించ వలెను. ఎవరు బాట యొక్క గాలి, కలశము యందలి నీరు, వస్త్రము పిండగా వచ్చు జలము, పాదాగ్రజలము తగిలిన నీటిచే స్నానము చేయుదురో అట్టి నీచ లక్షణము కలిగిన మనుష్యుల సమీపమునకు నీవు వెళ్ళుము.

దేశా చారా న్సమయా జ్ఞాతి ధర్మం, జపం హోమం మంగళం దేవతేష్టిమ్ సమ్యక్శ్ఛౌచం విధివల్లోక, వాదాన్పుం స స్త్వయా కుర్వతో మాస్తు సంగః

ఏ మనుష్యుడు దేశాచారము, సమయము, జ్ఞాతి, ధర్మము, జపము, హోమము, మంగళ కార్యములు, దేవ పూజలు, బాగుగా శౌచము, యథా విధి సమస్త లోకవాదములను ఆచరించునో అట్టి మానవులతో నీవు సాంగత్యము చేయరాదు.

మార్కండేయుడు:

ఇత్యుక్త్వా దుఃసహం బ్రహ్మా తత్రైవాంతరధీయతా

చకార శాసనం సోపి తథా పంకజ జన్మనః

మార్కండేయుడు:

ఓ ద్విజవరా! బ్రహ్మ దుస్సహునకు ఈ విధముగా ఆజ్ఞాపించి ఆ ప్రదేశము నుండి అంతర్ధాన మయ్యెను. దుస్సహుడు కూడ పద్మజన్ముడగు బ్రహ్మ యొక్క శాసనము ప్రకారము ప్రవర్తించు చుండెను.