70 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము

మార్కండేయుడు:

మన్వంతరే తృతీయేస్మి న్నౌత్తమస్య ప్రజాపతేః దేవా నింద్ర మృషీం భూపా న్నిబోధ గదతో మమ స్వదామాన స్తథా దేవా యథానామాను కారిణః సత్యాఖ్యశ్చ ద్వితీయోన్య స్త్రిదశానాం తథా గణః తృతీయే తు గణే దౌవాః శివాఖ్యా మునిసత్తమః శివాః స్వరూపత స్తే తు శ్రుతాః పాప ప్రణాశనాః ప్రతర్దానాఖ్యశ్చ గణో దేవానాం మునిసత్తమః చతుర్థ స్తత్ర కథిత ఔత్తమస్యాంతరే మనోః వశవర్తినః పంచమేపి దేవా స్తత్ర గణే ద్విజ! యథాఖ్యాత స్వరూపాస్తు సర్వ ఏవ మహామునే

మార్కండేయుడు:

ఓ మునీ! ఔత్తమ ప్రజాపతి యొక్క మూడవ మన్వంతర మందలి ఇంద్ర, దేవతా ఋషులను గూర్చి చెప్పెదను వినుము. “స్వదామ”లను పేరు గల, దేవతలు నామాను రూపులగు ప్రథమ గణాలు. తమ తేజస్సుచే ప్రకాశించెదరు. మరియు దేవతల యొక్క ద్వితీయ గణాలు “సత్యు”లను పేరుతో విఖ్యాతి గాంచిరి. ఓ మునిసత్తమా! దేవతల యొక్క తృతీయ గణాలు “శివు”లను పేరుతో విఖ్యాతి చెందిరి. ఈ పేరును స్మరించుట తోడనే వారు పాపమును నాశనము చేసుకొని “శివ”యను పేరు లోని యథార్థమును సంపాదించెదరు. ఓ మునివరా! ఔత్తమన్వంతర మందు దేవతల యొక్క చతుర్థ గణాలు “ప్రదర్ధను”లను పేరుతో ప్రసిద్ధి చెందిరి. ఓ మహామునీ! పంచమ గణమందు “వశవర్తు”లను పేరు గల దేవత లున్నారు. వారందరు నామాను రూపులు, కార్యకారులు.

ఏతే దేవగణాః పంచ స్మృతాః యజ్ఞ భుజ స్తథా మన్వంతరే మనుశ్రేష్టే సర్వే ద్వాదశకా గణాః తేషా మింద్రో మహాభాగా స్త్రైలోక్య స్యేశ్వరో భవత్ శతం క్రతునా మహృత్య సుశాంతి ర్నామ నామతః యస్యోపసర్గ నాశాయ నామాక్షర విభూషితా అధ్యాపిమాన వై ర్గాథా గీయతే తు మహాతలే సుశాంతి ర్దేవరాట్ కాంతః సుశాంతి సంప్రయచ్చతి సహితః శివసత్యాద్యై స్తథైవ వశవర్తిభిః అజః పరరుచి ర్దివ్యో మహాబల పరాక్రమః పుత్రా స్తస్య మనో రాస న్విఖ్యాతా స్త్రిదశోపమాః

ఈ అయిదు దేవ గణములు యజ్ఞ భాగములను భుజించెదరు. మను శ్రేష్ఠ మగు ఈ మన్వంతర మందు పది రెండు దేవతా గణములు ఉన్నవి. ఆ దేవతలకు ‘సుశాంతి’ అను పేరు గల మహాభాగుడు, ఇంద్రుడు నూరు అశ్వమేధ యజ్ఞములు చేసి త్రైలోక్యములకు ప్రభువయ్యెను. ఆ దేవరాజగు సుశాంతి యొక్క నామాక్షర విభూషిత మగు ఈ గాధను పృథివీ తల మందు మనుష్య గణాలు ఇప్పటికినీ పాడుకొను చుందురు. తేజస్సు కలవాడును, దేవతలకు రాజునగు సుశాంతి, శివ సత్యాది దేవతలు సహితుడై సుశాంతిని ప్రసాదించును. ‘వశవర్తీ’ దేవగణాలు కూడా ఈ విధముగానే చేయుదురు. ఈ మనువునకు అజ, పరశుచి, దివ్య అను పేర్లు గల దేవతలతో సమానమగు విఖ్యాత మహాబల పరాక్రమ వంతులగు ముగ్గురు పుత్రులు ఉండిరి.

తత్సూతి సంభవై ర్భూమిః పాలితాభూన్నరేశ్వరైః యావ స్మన్వంతరం తస్య మనో రుత్తమ తే జసః చతుర్యు గానాం సంఖ్యాతా సాధికా హ్యేక సప్తతిః కృత త్రేతాది సంజ్ఞాని యాన్యుక్తాని పురా మయా స్వ తేజసా హి తపసో వరిష్టస్య మహాత్మనః తనయాశ్చాంతరే తస్మి న్సప్త సప్తర్ష యోభవన్ తృతీయా మేత త్కథితం తవ మన్వంతరం మయా

తామసస్య చతుర్ధంతు మనోరంతర ముచ్యతే వయోని జన్మనో యస్య యశసా ద్యోతితం జగత్ జన్మ తస్య మనో ర్బ్రహ్మన్ భ్రూయతాం గచతో మమ అతీంద్రయ మశేషాణాం మనూనాం చరితం తథా తథా జన్మాపి విజ్ఞేయం ప్రభావశ్చ మహాత్మనామ్

ఎప్పటి వరకు ఆ ఉత్తమ తేజస్సు గల మనువు యొక్క మన్వంతర ముండెనో, అప్పటి వరకు వాని వంశోత్పన్నులగు సంతానము రాజులై పృథ్విని పరిపాలించు చుండిరి. యుగ కథన కాల మందు సత్య, త్రేతా, ద్వాపర, కలి అను ఈ నాలుగు యుగములు చెప్పబడెను. ఈ నాలుగు యుగములందు కొంచెము అధికముగా మన్వంతర కాలము నిర్ధిష్టమైనది. తన తేజో బలముచే తపుడను పేరుగల మహాత్మునికి ఏడుగురు పుత్రులు ఔత్తమ మన్వంతర మందు సప్తర్షులుగా నుండిరి. నేను ఈ మూడవ మన్వంతరమును వర్ణించితిని. ఇప్పుడు తామస మనువు యొక్క నాలుగవ మన్వంతరమును చెప్పెదను. విభిన్న యోనులందు ఉత్పన్నమైన ఏ మనువుల యొక్క యశముచే జగత్తు ప్రక్రాశింప బడు చున్నదో, ఆ మనువు యొక్క జన్మ వృత్తాంతమును చెప్పెదను వినుము. ఈ మహాత్ములగు అనేక మనుగణాల యొక్క చరిత్రలు వారి జన్మ వృత్తాంతములు మరియు వారి ప్రభావములను చక్కగా తెలిసికొనవలెను.