89 - దేవతలకు దేవీ వర ప్రదానము

శ్రీదేవి:

ఏభిః స్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యః సమాహితః

తస్యాహం సకాలం బాధాం నాశయశ్యా మ్యసంశయమ్

మధుకైటభ నాశం చ మహిషాసుర ఘాతనమ్

కీర్తయిష్యంతి యే త ద్వధం శుమ్భ నిశుమ్భయోః.

అష్టమ్యాం చ చతుర్ధశ్యాం నవమ్యాం చైకచేతసః

స్తోష్యంతి చైవ యే భక్త్యా మమ మాహాత్మ్య ముత్తమమ్.

న తేషాం దుష్కృతం కించి ద్దుష్కరుతోత్థా న చాపదః

న భవిష్యతి దారిద్ర్యం న చై వేష్ట వియోజనమ్

శత్రుతో న భయం తేషాం దస్యుతో వా న రాజతః

న శాస్త్రానంతో యౌఘా త్కదాచి త్సంభవిష్యతి.

శ్రీదేవి:

ఈ స్తవములన్నింటిచే సావధాన చిత్తముతో ఏ మానవుడు నన్ను నిత్యము స్తుతించునో, నేను వారి సర్వ బాధలను పార ద్రోలెదను. ఇందు సందేహము లేదు. మధు కైటభ, మహిషాసుర, శుంభ నిశుంభుల యొక్క సంహార రూపమగు నా ఈ ఉత్తమ మాహాత్మ్యములు, ఏకాగ్ర చిత్తముతో, భక్తి యుక్తులై ఎవరు అష్టమీ, నవమీ మఱియు చతుర్దశి తిథులందు కీర్తించెదరో, లేక వినెదరో, వారికి కొంచెమైనను పాపము గాని లేక పాపముచే ఉత్పన్నమైన ఆపదలు గాని యుండవు. మఱియు దారిద్ర్యము గాని లేక ప్రియ జనుల యొక్క వియోగము గాని కలుగదు. శత్రువులచే గాని, చోరులచే గాని రాజులచే గాని ఏ ప్రదేశము నందునూ భయమూ ఉండదు. మరియు శస్త్రములు, అగ్ని, జలముల చేత కూడా ఎప్పుడునూ భయము ఉండదు.

తస్మా న్మమైత న్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితైః

శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం మహత్.

ఉపసర్గా నశేషాంస్తు మహామారీ సముద్భావాన్

తథా త్రివిధ ముత్పాతం మహాత్మ్యం శమయే న్మమ.

యత్రేత త్పఠ్యతే సమ్యక్ నిత్య మాయతనే మమ

సదా న త ద్విమోక్షామి సాన్నిధ్యం తత్ర మే స్థితమ్.

బలిప్రదానే పూజాయా మగ్ని కార్యే మహోత్సవే

సర్వ మ్మమైత చ్చరిత ముచ్చార్యం శ్రావ్యమేవ చ.

జానతాజానతా వాపి బలిపూజాం తథా కృతామ్

ప్రతీచ్చిష్యామ్యహం ప్రీత్యా వహ్ని హోమం తథా కృతమ్.

అందు చేత నా మహాత్మ్యమును సావధానులై చదువ వలెను. ఎల్లప్పుడు భక్తితో వినిననూ శుభములు చేకూరును. నా యీ మహాత్మ్యము సర్వోత్తమ మైనది. ఈ నా మాహాత్మ్యము మహామారి వలన ఉత్పన్నమగు సమస్త ఉపద్రవాలను మరియు మూడు విదాలగు ఉత్పాతములను శమింప చేయును. ఏ గృహము నందు నా ఈ మహాత్మ్యములను బాగుగా పఠించు చుందురో, నేను ఆ గృహమును పరిత్యజించను. మరియు దాని సమీపమున నేను నివసించుదును. బలి నిచ్చు సమయమున, పూజలు చేయు సమయమున, మరియు హోమ కార్యము చేయు సమయమున, ఇత్యాది మహోత్సవము లందు నా ఈ సంపూర్ణ చరిత్రను పఠించుచు మరియు శ్రవణము చేయ వలెను. మనుష్యులు తెలిసి గాని లేక తెలియక గాని ఏ కొంచెము బలి పూజలు చేయుదురో, లేక అగ్ని యందు హోమము చేయుదురో వానిని నేను ప్రసన్నతతో స్వీకరించుదును.

శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికా

తస్యాం మమైతన్మహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః.

సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సమన్వితః

మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః.

శ్రుత్వా మమై తన్మాహాత్మ్యం తథాచోత్పత్తయః శుభాః

పరాక్రమాంశ్చ యుద్దేషు జాయతే నిర్భయః పుమాన్.

రిపవం సంక్షయం యాంతి కల్యాణం చోపపద్యతే

నన్దతే చ కులం పుంసాం మాహాత్మ్యం మనుశ్రుణ్వతామ్.

శాంతి కర్మణి సర్వత్ర తథ దుఃస్వప్న దర్శనే

గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శ్రుణుయా న్మమ.

ఎవరు శరత్కాల మందు వార్షికముగా దేవీ మహాపూజ చేయుదురో, పూజా కాలమున హోమ కార్యము లందు నాదగు యీ సంపూర్ణ చరిత్రమును భక్తి యుక్తులై వినెదరో. అట్టివారు నా యనుగ్రహముచే సంపూర్ణములగు భాధల నుండి విముక్తు లగుదురు మఱియు, ధన, ధాన్య, పుత్రయుక్తు లయ్యెదరు ఇందులో సందేహము ఎంత మాత్రము లేదు. ఈ నా మహాత్మ్యమును, నా యవతార చరితములను వినిన పురుషుడు ఎట్టి భయము లేని వాడగును. వాని శత్రువులు నశించుదురు. శుభములు బడయును. నా మాహాత్మ్యమును వినిన పురుషులు ఆనందము బొందుదురు. కులములు వృద్ది జెందును. అన్ని శాంతి కర్మ లందును. దుఃస్వప్న దర్శనము లయినను భయంకరము లైన గ్రహ పీడా సమయము లందును నా మహాత్మ్యమును విన వలయును. శుభము కలుగును.

ఉపసర్గాః శమం యాంతి గ్రహ పీడాశ్చ దారుణాః

 దుఃస్వప్నం చ నృభి ర్దృష్టం సుస్వప్న ముపజాయతే.

బాల గ్రహాభి భూతానాం బాలానాం శాంతి కారకమ్

 సంఘాత భేదం చ నృణాం మైత్రీకరణ ముత్తమమ్.

 దుర్వృత్తానా మశేషాణాం బలహానికరం పరమ్

రక్షో భూత పిశాచానాం పఠనాదేవ నాశనమ్.

సర్వం మమై తన్మహాత్మ్యం మమ సంనిధి కారకమ్.

ఫల పుష్పార్ఘ్య ధూపైశ్చ గన్ధ దీపై స్తధోత్తమైః

విప్రాణాం భోజనైర్హోమైః ప్రోక్షణీయై రహర్నిశమ్.

ఈ సప్తశతీ మహాత్మ్యమును వినుటచే ఉపద్రవములు, దారుణములగు గ్రహ బాధలు శాంతించును. మనుష్యులకు దుఃస్వప్న ములు వచ్చినచో సుస్వప్న ములతో సమానమగు శ్రేష్ఠ ఫలముల నొసంగును. నా మహత్త్వము పూతనా, డాకినీ, శాకినీ, మొదలగు బాల గ్రహములచే పట్టుబడిన చాలకులకు శాంతిని కలిగించును. సమాజములో పరస్పరము మన స్పర్ధలు గలిగినచో ఉత్తమ రీతిగా మిత్ర భావమును గలుగ జేయును మరియు సమస్త దురాచారులగు వారి సంపూర్ణ బలమును నశింప జేయును. ఈ సప్తశతీ పఠనముచే రాక్షస, భూత, పిశాచములు నాశ మగును. ఈ నామ సామీప్యము కలుగును ఉత్తమము లైన ఫల, పుష్ప, అర్ఘ్య, ధూప, గంధ, దీప, బ్రాహ్మణ భోజన, హోమ, ప్రోక్షణీ యములతో మరియు ఇంకా అనేకము లయిన వివిధ భోగముల వలన ఒక సంవత్సర దీక్షతో త్రి కాలముల యందు పూజించుటచే ఎంత ఫలము కలిగి ప్రసన్నురాల నగుదునో. ఈ మాహాత్మ్యము కేవలము ఒక్కసారి వినుట చేతనే అంత ప్రసన్నురాల నగుదును.

అన్యైశ్చ వివిథైర్భోగైః ప్రదానై ర్వత్సరేణ యా

 ప్రీతి ర్మే క్రియతే సాస్మి న్సకృ దుచ్చరితే శ్రుతే.

శ్రుతం హారతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి

 రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ.

యుద్దేషు చరితం యన్మే దుష్టేదైత్య నిబర్హణమ్

తస్మిఞ్ఛృతే వైరికృతం భయం పుంసాం నజాయతే.

యుష్మాభిః స్తుతయో యాశ్చ యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః

బ్రహ్మాణా చ కృతా యాస్తాః ప్రయచ్చంతి శుభాం గతిమ్

అరణ్యే ప్రాంతరే వాపి దావాగ్ని పరివారితః

దుస్యుభి ర్వా యుతః శూన్యే గృహీతో నాపి శత్రుభిః

నా యొక్క మాహాత్మ్యమును వినుటచే సమస్త పాపములు హరించును. ఆరోగ్యమును కలుగ చేయును. నా జన్మ వృత్తాంతము కీర్తించుట చేతనే భూతముల నుండి రక్షణ కలుగును. అటులనే నేను యుద్ద మందు దుష్టలగు దైత్యులను నాశనము చేసిన చరిత్రను వినుటచే పురుషులకు శత్రువుల వలన కలుగు భయము ఉండదు. మీరు చేసిన స్తోత్రములు, బ్రహ్మర్షులు చేసిన స్తోత్రములు, పఠించిన వారు శుభములను పొందుదురు. అరణ్యముల యందు, చొర బాధలు కలిగి నప్పుడు, మిత్రులు లేని ప్రదేశమున, శత్రువులు చుట్టు ముట్టి నప్పుడు, దావాగ్ని పీడితు లైనప్పుడు.

సింహ వ్యాఘ్రనుయాతో వా వనేవా వనహస్తిభిః

రాజ్ఞా కృద్దేన చాజ్ఞప్తే వధ్యే బన్ధ గతోపి వా

ఆఘూర్ణితో వా వాతేన స్థితిః పోతే మహార్ణేవే

పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృశదారుణే.

సర్వబాధాసు ఘోరాసు వేదానాధ్యర్దితోపి వా

 స్మర న్మమైత చ్చరితం నరో ముచ్యేత సంకటాత్

మమ ప్రభావా త్సింహ్యాద్యా దస్యవో వైరిణ స్తథా

 దూరాదేవ పలాయంతే స్మరత శ్చరితం మమ.

సింహ, వ్యాఘ్రములు, ఏనుగులు తరుము చున్నప్పుడు, కృద్దుడైన రాజు వధించుటకు ఆజ్ఞనిచ్చి నప్పుడు, ప్రాప్తించి నప్పుడు, మహా సముద్రములో చిన్న పడవపై కూర్చొని యుండ, పెనుగాలిచే సముద్రము కల్లోలిత మైనప్పుడు, భయంకర మగు సంగ్రామ మందు, శస్త్రములు మీద పడి నప్పుడు, ఇంత ఎందులకు? అనేక ఘోర విపత్తులు కలిగిననూ, మనుష్యుడు ఈ నా సంపూర్ణ చరిత్రను స్మరించినచో సంపూర్ణ మగు సంకటము నుండి విముక్తుడగును, ఏ మనుష్యులు నా చరిత్రను స్మరించు చున్నారో. నా ప్రభావముచే సింహాది క్రూర జంతువులు చోర, శత్రు గణములు దూరముగా పారి పోవుదురు.

ఋషి:

ఇత్యుక్త్వా సా భగవతీ చణ్డికా చణ్ణ విక్రమా

పశ్యతా మేవ దేవానాం తత్రైవాంతరదీయత.

ఋషి:

ఈ ప్రకారముగా చెప్పి, చండ విక్రమురాలగు చండికా దేవి చూచు చుండగానే దేవతల యెదుట నుండి అంతర్ధాన మయ్యెను.

తేపి దేవ్యా నిరాతంకాః స్వాధికారా వ్యథా పురా

యజ్ఞ భాగ భుజః సర్వే చక్రు ర్వినిహతారయః

దైత్యశ్చ దేవ్యా నిహతే శుమ్భే దేవరిపౌ యుధి,

జగ ద్విద్వంసకే తస్మి న్మహోగ్రేతుల విక్రమే

 నిశుంభే చ మహావీర్యీ శేషాః పాతాల మాయయుః

ఏవం భగవతీ దేవీ సా నిత్యాపి పునః పునః

సమ్భూయ కురుతే భూప! జగతః పరిపాలనమ్

తాయై తన్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే

సా యాచితా చ విజ్ఞానం తుష్టా బుద్దిం ప్రయచ్చతి.

వ్యాప్తం తయైత త్సకలం బ్రహ్మాణ్డం మనుజేశ్వర!

మహాకాల్యా మహాకాలే మహామారీ స్వరూపయా.

అప్పుడు శత్రు రహితులైన దేవతలు నిర్భయముగా యజ్ఞ భాగముల భుజించుచూ, వారి వారి అధికారములను పూర్వము వలె నిర్వహించు చుండిరి. జగత్తును విధ్వంసము చేయుచున్న వాడును, అమిత పరాక్రమము కలవాడును, దేవతా శత్రువగు శుంభుడు మరియు మహా వీర్య వంతుడగు నిశుంభుడు ఎప్పుడు యుద్ద క్షేత్రమున దేవి యోక్క చేతిలో మరణము పొందిరో, అప్పుడు మిగిలిన రాక్షసులు పాతాల లోకమునకు పోయిరి. ఓ రాజా! భగవతి యగు నా దేవి నిత్య స్వరూపు రాలైననూ ఈ ప్రకారముగా మాటి మాటికి జన్మించి జగత్తును పాలించు చున్నది. ఆ భగవతియే విశ్వమును మోహింప జేయు చున్నది. ఆమెయే ఈ విశ్వమును పుట్టించు చున్నది. మఱియు ఆమెను ప్రార్ధించుటచే ప్రసన్నురాలై తత్త్వ జ్ఞానమును ఐశ్వర్యమును ప్రసాదించు చున్నది. మనుజేశ్వరా! ఈ సంపూర్ణ బ్రహ్మాండము ఆమె చేతనే వ్యాపింప బడి యున్నది. మరియు ప్రళయకాల మందు మహామారీ స్వరూప మగు మహాకాళిగా వ్యాపించి యుండును.

సైవ కాలే మహామారీ సైవ సృష్టి ర్భవ త్యజా

స్థితిం భూతానాం సైవ కాలే సనాతనీ

భవకాలే నృణాం వైహ లక్ష్మీ వృద్దిప్రదా గృహే

సైవాభావే తథాలక్ష్మీ ర్వినాశాయోపజాయితే

స్తుతా సంపూజితా పుష్పై ర్గంధ ధూపాదిభి స్తదా

దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభామ్.

ఆమెయే కాలమాసన్న మైనచో మహామారీ స్వరూప మగును. మఱియు ప్రపంచము ఉత్పత్తి చేయు సమయమున సృష్టి స్వరూపిణి యగును. మరియు రక్షణ కాలమందు ఆ సనాతన దేవియే ప్రాణులను రక్షించును. శుభ సమయము నందు మనుష్యుల గృహముల యందు లక్ష్మీ స్వరూపరాలై అనేక ములగు ఐశ్వర్యములను ప్రసాదించును. ఆమెయే అలక్ష్మీ స్వరూపురలై వినాశనమును కలుగ చేయును. ఆమెను స్తుతించుట చే మరియు గంధ, పుష్ప, ధూప, దీపాదులచే పూజించుటచే, ఆమె ధనమును, పుత్రులను ఇచ్చును. ధర్మ మందు బుద్దిని కలుగ చేయును. శుభ గతిని కలుగ చేయును.