మార్కండేయ మహా పురాణము
106 - భాను స్తవము
క్రౌష్టుకి:
భగవన్ కథితః సమ్య గ్భానోః సంతతి సంభవః
మాహాత్మ్య మాదిదేవస్య స్వరూపం చాతి విస్తరాత్.
భూయోపి భాస్వతః సమ్య ఙ్మాహాత్మ్యం మునిసత్తమ!
శ్రోతు మిచ్చా మ్యహం తన్మే ప్రసర్నో వక్తు మర్హసి.
క్రౌష్టుకి:
హే భగవన్! మీరు భానునికి సంతానము కలుగుట, మఱియు ఆ మహాత్మ్యమును, స్వరూపమును విస్తారముగా చక్కగా వర్ణించి చెప్పితిరి. కాని ఓ ముని సత్తమా! భాస్కరుని మాహాత్మ్యము ఇంకనూ విన వలెనని కోరు చున్నాను కృప జూపి దాని నంతయు చక్కగా వర్ణించి చెప్పుడు.
మార్కండేయుడు:
శ్రూయతా మాదిదేవస్య మహాత్మ్యం కథయామి తే
వివస్వతో యచ్చకార పూర్వ మారాధితో జనైః.
దమస్య పుత్రో విభ్యాతో రాజాభూ ద్రాజ్యవర్ధనః
స సమ్య క్పాలనం చక్రే పృథివ్యాః పృథివీపతిః
ధర్మతః పాల్యమానం తు తేన రాష్ట్రం మహాత్మనా
వవృధేనుదినం విప్ర! జనేన చ ధనేన చ.
మార్కండేయుడు:
ఆది దేవుడగు వివస్వానుడు పూర్వ కాలమున జనుల చేత ఆరధింప బడి ఏమేమి చేసెనో, అట్టి ఆ మాహాత్మ్య విషయము నంతయు నీకు చెప్పెదను. మహాకీర్తి గల వాడును, “దముడు” అను వాని కుమారుడును అగు “రాజ్య వర్దునుడు” అను నతడు రాజై బాగుగా పృద్వీ పాలనము చేయు చుండెను. ఓ విప్రా! ఆ మహాత్మునిచే స్వధర్మ యుక్తముగా పరిపాలన జరుగు చుండగా, అను దినము దేశము, ధనము, జనము, వృద్ది నొందు చుండెను.
హృష్ట పుష్ట మతీవాసీ త్తస్మీ న్రాజ! న్నశేషతః
నిర్భయః సకల శ్చోర్య్వాం పౌర జానపదో జనః.
నోపసర్గో న చ వ్యాధి ర్న చ వ్యాళోద్భవం భయమ్
న చావృష్టి భయం తత్ర దమపుత్రే మహీపతౌ.
స ఈజే చ మహాయజ్ఞై ర్ధదౌ దానాని ఛార్ధినామ్
స ధర్మస్యావిరోధేన బుభుజే విషయా నపి.
తస్యైవం కుర్వతో రాజ్యం సమ్య క్పాలయతః ప్రజాః
సప్త వర్ష సహస్రాణి జగ్ము రేక మహా ర్యథా.
విదూరధస్య తనయా దాక్షిణాత్యస్య భూభృతః
తస్య పత్నీ బభూవాథ మానినీ నామ మానినీ.
మరియు అతడు రాజైన పిమ్మట ఇతర రాజ గణాలు, భూమి, పౌర జన గణాలు నిర్భయులై అత్యంత పుష్టిని, తుష్టిని గలిగి యుండిరి. దమ పుత్రుడైన ఆ రాజ్యవర్దన మహీపతి యొక్క శాసన కాలమున ఎవరికినీ వ్యాధులు ఉపసర్గలు (మారి, తెగుళ్ళు మొదలగు నవి) కానీ సర్పాది క్రూర జంతువులచే భయము కాని, వర్షాభావముచే భయము గాని కలిగెడిది కాదు. అతడు గొప్ప గొప్ప యజ్ఞములు చేసెను. ఆర్థి గణాలకు దానములు చేసెను. ధర్మమునకు విరుద్దము గాని విషయముల ననుభవించు చుండెను. ఈ విధముగా రాజ్య కార్యములను, రాజ్య పాలనము చేయుచు ఆయన ఏడు వేల సంవత్సరములు ఒక దినముతో సమానముగా గడిపెను. “విదూరథు” డను పేరు గల దక్షిణ దేశపు రాజు యొక్క కుమార్తెయు, మానవతియు నగు “మానిని” యను నామె భార్యగా నయ్యెను.
కదాచి త్తస్య సా సుభ్రూః శిరసోభ్యంజనాదృతా
పశ్యతో రాజలోకస్య ముమోచాశ్రూణి మానినీ.
తద్రశ్రు బిందవో గాత్రే యదా తస్య మహీపతేః
తదా వీక్ష్యాశ్రువదనాం తా మపృచ్చాత మానినీమ్.
నిఃశబ్ద మశ్రు మొక్షేణ రుదంతీం తాం విలోక్య వై
కిమేత దితి పప్రచ్ఛ మానినీం రాజ్యవర్ధనః
పృష్టా సా తు తల స్తేన భర్ర్తా ప్రాహ మనస్వినీ
న కించి దితి తాం భూయః పప్రచ్ఛ స మహీపతిః.
ఒక నాడు చక్కని కనుబొమలు గల మానిని రాజ పురుషుల ఎదుట రాజు యొక్క శరీరమునకు తైలము రాయుచు కన్నీరు కార్చెను. ఆ కన్నీరు రాజు యొక్క శరీరముపై బడెను. అప్పుడు రాజవర్ధనుడు మానిని అశ్రు పూరిత నేత్రములతో నుండుట చూచి దాని వృత్తాంతము నడిగెను. కాని ఆమె ఏమి ప్రత్యుత్తర మీయ లేదు. కేవలం కన్నీరు కార్చుచూ నిశ్శబ్దముగా రోదించ సాగెను. అది చూచి రాజ్య వర్ధనుడు తిరిగి మానినిని ఇట్లడిగెను. ఇది ఏమి? నీ వెందులకు దుఃఖించు చున్నావు? మనస్విని యగు మానిని భర్త ఇట్లు ప్రశ్నించుటచే కేవలము “ఏమి లేదు” అని మాత్రమే జవాబిచ్చెను. అయినను రాజు ఊర కుండక మాటి మాటికి అడుగు చుండెను.
బహుశః పృచ్చత స్తస్య భూభృతః సా సుమధ్యమా
(న కించి దితి ప్రోవాచ సా భూయో రాజ్య వర్ధనమ్
కిమే తదితి పప్రచ్ఛ మానినీం పార్దివః పునః
బహుశః ప్రేరితా తేన సా భర్త్రా తత్ర భామినీ)
దర్శయామాస పలితం కేశభారాంతరోద్భవమ్.
ఏత త్పశ్యేతి భూపాల! కిమిన్య న్మన్యుకారణమ్
మామాతి మందభాగ్యాయా జహాసాథ నృప స్తతః.
స విహస్యాహ తాం పత్నీం శృణ్వతాం సర్వభూభృతామ్
పౌరాణాంచ మహీపాలా యే తత్రాసన్ సమావృతాః.
శోజేనాలం విశాలాక్షి! రోరితవ్యం న తే శుభే
జన్మర్ది పరిణామాద్యా వికారః సర్వ జంతుషు.
రాజు ఆ సుమధ్యను చాలా సార్లు అడిగెను. కాని ఆమె రాజ్యవర్ధనునితో ఏమియ చెప్ప లేదు. రాజు తిరిగి మాటి మాటికి ప్రశ్నించుటతో అప్పుడు రాజునకు అతని శిరస్సు నందలి కేశముల నుండి ఒక తెల్లని కేశమును తీసి చూపెను. ఓ రాజా! దీనిని చూడుము. అంత కంటే దుఃఖ కారణము ఏముండును? ఇది నా దురదృష్టము అనెను. అది విని రాజు పెద్దగా నవ్వ సాగెను. అతడు నవ్వుచూ, నవ్వుచూ ఆచటకు వచ్చి యున్న రాజు గణాలు, పౌర గణాలు వినుచుండ భార్యతో నిట్లు పలికెను. ఓ విశాలాక్షీ! కల్యాణి! రోదింపకుము సమస్త జంతువుల యందును జన్మ, వృద్ద, పరిణామాది వికారములు కనుపించును, అందు వలన దీనికై దుఃఖించుట నిష్ప్రయోజనము.
అధీతాః సకలా వేదా ఇష్టా యజ్ఞాః సహస్త్రశః
దత్తం ద్విజానాం పుత్రాశ్చ సమత్పన్నా వరాననే!.
భుక్తా భోగా స్త్వయా సార్ధం యో మర్త్యై రథి దుర్లభైః
సమ్యక్చ పాలితా పృథ్వీ శౌర్యం యుద్దే ష్వనుష్టితమ్.
భవంతు కేశాః పలితా వలయః సంతు యే శుభే!
శైధిల్యం యే తు యే కాయః కృతకృత్యోస్మి మానిని!
మూర్ద్ని యద్దర్శితం భద్రే! భవత్యా ఫలితం మమ
చికిత్సా మేవ తస్యాహం కరోమి వన సంశ్రయాత్.
ఓ వరాననా? నేను సంపూర్ణ వేదములను అధ్యయనము చేసితిని. వేల వేల యజ్ఞములను సంపన్నము చేసితిని బ్రాహ్మణులకు అర్ధాది దానములు, పుత్రో త్ఫథానము, నీ సాంగత్యముతో మానవులకు అతి దుర్లభములై అనుభవించుటకు యోగ్యములకు విషయములను అనుభవించితిని. చక్కగా, న్యాయ పూర్వకముగా, పృధ్వీ పాలనము, యుద్దము నందు శౌర్యము మరియు ప్రియ మిత్రులతో హాస్య, పరిహాసములు, వన విహారములు, మొదలగు అనేక కార్యములను చేసితిని. ఓ భద్రా! నేను అనుభవించని సుఖము మరేమున్నదని నీవు నా తెల్లని (నెరసిన) కేశమును చూచి భీతి చెందు చున్నావు. ఓ భద్రా! నా కేశములు తెల్ల బడినవి. శరీరము శిధిలా వస్తాను పొందినది. దీని వలన హాని ఏమియు లేదు. ఎందు చేత ననగా ఓ మానినీ! నేను ఇప్పుడు అన్ని కార్యములను నెరవేర్చి కృత క్రుతుడ నైనాను. ఓ భద్రా! నా శిరస్సు నందు పండిన కేశములకు నేను వనము నాశ్రయించి దానికి చికిత్స చేయుదును.
బాల్యే బాల క్రియా పూర్వం తద్వ త్కౌమారకే చ యా
యౌవనేచాపి యా యోగ్యా వార్ధక్యే వనసంశ్రయః.
ఏవం మాత్పూర్వజై ర్భద్రే! కృతం త్వ త్పూర్వజైశ్చ యత్
అతో న తేశ్రు పాతస్య కించి త్పశ్యామి కారణమ్.
ఆలం తే మన్యునా భద్రే! నన్వభ్యుదయకారి యే
దర్శనం పలితస్యాస్య మారోదీ ర్నిష్ప్ర యోజనమ్.
ఓ భద్రా! బాల్యావస్థ యందు బాల క్రీడలు, కౌమారావస్థ యందు మఱియు యౌవన మందును విద్యా భ్యాసము విషయ భోగాది కార్యములు సంపాదించి, వృద్దావస్థ యందు వనము నాశ్రయించుట ఉచితము. ఓ భద్రా! నా పూర్వీకులు నీ పూర్వీకులు ఇదే విధముగా చేయుచు వచ్చు చుండిరి. అందు వలన నీ కన్నీటికి కారణ మేమియు కనిపించుట లేదు. ఓ భద్రా! శోకమును వీడుము. నాకు ఇట్లు పండిన వెంట్రుకలు కనిపించుట భాగ్యోదయ కారణమే. అందు వలన నిష్ప్రయోజన మగు దుఃఖమును వీడుము అనెను.
మార్కండేయుడు:
తతః ప్రుణమ్య తం భూపాః పౌరాశ్చైవ సమీపగాః
సామ్నా ప్రాచు ర్మహిపాలా మహర్షే! రాజ్యవర్ధనమ్.
న రోదితస్య మన్యా తవ పత్న్యా నరాధిప!
రోదితవ్య మిహాస్మాభి రధవా సర్వజంతుభిః.
మార్కండేయుడు:
ఓ మహర్షీ! పిమ్మట సమీపమున నున్న నృపులు, పౌర గణాలు, రాజ్యవర్దనునికి నమస్కరించి వినయముతో నిట్లనిరి. నరాదిపా! మీ భార్య మీ వెంట నంటి యుండును, గాన మీ భార్య దుఃఖించ వలసిన యవసరము లేని మాట నిజమే! కాని మేమే గాక భూతములు గూడ నీవు లేని కారణమున దుఃఖించ వలసిన అవసరము సంప్రాప్త మైనది.
త్వం బ్రవీషి యథా నాథ! వనవాసాశ్రితం వచః
పతంతి తేన నః ప్రాణా లాలితానాం త్వయా నృప!.
సర్వే యాస్యామహే భూప! యది యాతి భవా న్వనమ్
తతోశేషక్రియా హానిః సర్వ పృథ్వీ నివాసినామ్.
భవిష్యతి న సందేహ స్త్వయి నాథ! వనాశ్రయే
స చ ధర్మోవఘాతాయ యది తత్ప్రవిముచ్యతామ్.
సప్తవర్ష సహస్రాణి త్వయేయం పాలితా మహీ
తత్సముత్థం మహాపుణ్య మాలోకయ నరాదిప!.
వనే వసన్మహారాజ! త్వం కరిష్యసి యత్తపః
తన్మహీపాలనస్యాస్య కళాం నార్హంతి షోడశీమ్.
ఓ రాజా! మీరు మాకు పరిపాలకులు. మీరు వన వాసమునకు వెళ్ళ వలెనని పలికిరి. కాని అట్లు చేయుట వలన మీచే లాలింప బడిన మా ప్రాణములు నిలువవు. మీరు వనములకు వెళ్ళినచో మేము కూడా వచ్చెదము. ఓ నాథా! మీరు వనవాసు లైనచో పృధ్వీ వాసులకు నిస్సందేహముగా శ్రౌత స్మార్తాది అశేషము లగు క్రియా కలాపములకు హాని సంభవించును. నాధా! నీవు వనమునే ఆశ్రయించినచో ధర్మమునకు విఘాతము గలుగ గలదు. సందేహము లేదు. గాన ఆ ప్రయత్నమును మాన గోరు చున్నాను. ఓ నరాధిపా! మీరు ఏడు వేల వత్సరములు భూమిని పాలించిరి. దాని వలన ఎట్టి మహా పుణ్యము కలిగెనో చూడుడు. ఓ మహారాజా! మీరు వనములకు బోయి తపస్సు చేసినను, అది ఈ పృథ్వీ పాలన యొక్క షోడశ భాగమునకును సమానము కాదు.
రాజు:
సప్తవర్ష సహస్రాణి మమేయం పాలితా మహీ
ఇదానీం వనవాసస్య మమ కాలోయ మాగతః.
మమావత్యాని జాతాని దృష్ట్వామేపత్య సంతతీః
స్వల్పై రేవ మహోభి ర్మే హ్యంతకో న సహిష్యతి.
రాజు:
నేను ఏడు వేల సంవత్సరములు ఈ భూమిని పరిపాలించితిని. ఇప్పుడు నాకు వన వాసము నకు యుక్తమగు సమయము ఉపస్థిత మైనది నాకు పుత్రులు జన్మించిరి. ఇప్పుడు ఆ పుత్రుల యొక్క సంతానము చూచి యున్నాను. యముడు కొన్ని రోజుల వరకు అల్ప కాలము గూడ సహింప లేడు. (అనగా వెంటనే ఆయువు పూర్తి యగును.)
యదే తత్పలితం మూర్ని తద్విజానీత నాగరాః
దూత భూత మనార్యస్య మృత్యో రత్యుగ్ర కార్యణః.
సోహం రాజ్యే సుతం కృత్వా భోగాం స్త్యక్త్య వనాశ్రయః
తప స్తప్స్యే సమాయంతి న యావ ద్యమసైనికాః.
ఓ నగర వాసులారా! నా శిరస్సు నందు మీరు చూసిన తెల్లని కేశములు ఉగ్ర కర్మయు, అనార్వుడు నగు మృత్యువు యొక్క దూతగా తెలుసు కొనుడు. అందు వలన నేను పుత్రుని రాజ్యాభిషిక్తుని చేసి భోగములను పరిత్యజించి వనము నందు నివసించుచూ యముని దూతలు వచ్చు వరకు తపస్సు చేయుదును.
మార్కండేయుడు:
తతో యియాసుః స వనం దైవజ్ఞా నవనీపతిః
పుత్రరాజ్యాభిషేకాయ దినలగ్నా న్యపృచ్చత.
శ్రుత్వా చ తే తు నృపతే! ర్వచో వ్యాకుల చేతసః
దినం లగ్నం చ హోరాశ్చ న విద్మః శాస్త్ర దృష్టయః.
ఊచుశ్చ తం మహేపాలం దైవజ్ఞా భాష్పగద్గదమ్
జ్ఞానాని నః ప్రణష్టాని శ్రుత్వై తత్తే వచో నృప!.
మార్కండేయుడు:
అని రాజు పలికి వనములకు పోవలె నని స్థిర నిశ్చయుడై జ్యోతిష్కులను కుమారుని యొక్క రాజ్యా భిషేకమునకు లగ్న దినమును అడిగెను. జ్యోతిష్క గణాలు శాస్త్ర దృష్టి గలవారై నను రాజు వచనములు విని వ్యాకుల చిత్తులైన కారణమున లగ్న దినమును చూచుటలో అసమర్దులై, గాద్గదిక స్వరమున రాజుతో నిట్ల పలికిరి. ఓ రాజా! మీ వచనములు వినుటతో మా జ్ఞాన మంతయు నష్ట మయ్యెను.
తతోన్య నగరేభ్యశ్చ భృత్యై రాష్ట్రేభ్య ఏవ చ
తతః స్తస్మాచ్చ నగరా త్ప్రాచుర్యేణాభ్యుపాగమన్.
సముత్పత్య మహీపాలం తం యియాసుం మునే! వనమ్
ప్రకంపి శిరసో భూత్వా ప్రోచు ర్భ్రాహ్మణ సత్తమాః.
ప్రసీద పాహి నో రాజ! న్పాలితాఃస్మ యథా పురా
సీదష్యత్యఖిలో లోక స్త్వయి భూప! వనాశ్రయే.
త్వం కురుష్వ తథా రాజ! న్యదా నో సీదతే జగత్
యావ జ్జీవామహే వీర! స్వల్పకాల మిమే వయమ్.
నేచ్చామశ్చ భవ చ్చూన్యం ద్రష్టుం సింహాసనం విభో!
ఓ మునీ! తిరిగి క్రమానుసారము అన్యాన్య నగరములు మఱియు దేశములు ఆయా రాజధానుల నుండి అనేకానేక వృద్ద ద్విజ శ్రేష్ఠ గణములు వచ్చి, వనవాసము చేయుటకు ఇచ్చగించిన రాజుతో మస్తకము కంపించు చుండ ఇట్లు పలుక సాగిరి. ఓ రాజా! ప్రసన్నులు కండు. మమ్ముల నను గ్రహించి పాలింపుడు. ఓ భూపాలా! మీరు వనములకు వెళ్ళినచో మనుష్యు లందఱు దుఃఖితు లగుదురు. అందు వలన ఓ రాజా! దేని వలన సంపూర్ణ జగత్తంతయు దుఃఖమును పొందదో, అట్టి దానిని మీరు జేయుడు. ఓ వీరా! మేము మరి కొంత కాలము జీవించుదుము. ఆ సమయమున మీరు లేని శూన్య సింహాసనమును చూడలేము.
మార్కండేయుడు:
ఇత్యేవంతై స్తథాన్యైశ్చ ద్విజైః పౌర పురఃసరైః
భూపై ర్భూత్యై రమాత్యైశ్చ రాజా ప్రోక్తః పునః పునః.
వనవాస వినిర్భంధం నోపనంహరతే యదా
శ్రమిష్య త్యంతకో నేతి దదౌ స చ తదో త్తరమ్.
తతోమాత్యాశ్చ భూపాశ్చ పౌరవృద్దా స్తధా ద్విజాః
సమేత్య మంత్రయామాసుః కిమత్ర క్రియతా మితి.
తేషా మ్మంత్రయతాం విప్ర! నిశ్చయోయ మజాయత
అనురాగవతాం తత్ర మహీపాలేతిధార్మికే.
సమ్యగ్ ధ్యానపరా భూత్వా ప్రార్ధయామః సమాహితాః
తపసారాధ్య భాస్వంత మాయు రస్య మహీపతేః.
మార్కండేయుడు:
ఈ విధముగా బ్రాహ్మణ గణములు, పౌర సమూహములు, భూపాల బృందములు, అమాత్యులు, భృత్య గణములు, మొదలగు వారందరూ మాటి మాటికి ప్రార్ధించి నప్పటికిని, ఆయన వన వాసము చేయ వలెనను కోరికను విడువక ‘మీరు నన్ను క్షమింపుడు” అని మాత్రమే ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు బ్రాహ్మణులు, పౌర వృద్దులు, మంత్రులు, భృత్య గణములు, కలసి తమలో తాము ”ఇప్పుడేమి చేయ వలెను?” అని విమర్శించు కొనసాగిరి. ఓ విప్రా! ధార్మిక ప్రవరుడగు రాజు యెడల అనురాగము కల వారగు ఆ బ్రాహ్మణులు మొదలగు వారు ఇట్లు నిశ్చయించు కొనిరి. “మనము చక్కగా ధ్యానము నందు నిమగ్నులమై, తపస్సు చేసి భాస్కరుని ఆరాధించి, ఆయనను మన రాజుకు ఆయువు నిమ్మని కోరుదము గాక.”
తత్రైక నిశ్చయా! కార్యే కేచిద్గేహే చ బాస్కరమ్
సమ్గార్ఘ్యోపచారాధ్యై రుపహారైరపూజయన్.
అపరే మౌనినో భూత్వా ఋగ్జాపేన తదాపరే
యజుషా మధ సామ్నాం చ తోశాయాంశ్చక్రిరే రవిమ్.
అపరే చ నిరాహారా నదీపులిన శాయినః
తపాంసి చకృ రిచ్చంతో భాస్కరారాధానం ద్విజాః.
అగ్నిహోత్ర పరాశ్చాన్యే రవిసూక్తా న్యాహర్నిశమ్
జేపు స్తత్రాపరే తస్థు ర్భాస్కరే న్యస్త దృష్టయః.
ఇత్యేవ మతి నిర్భంధం బాస్కరారాధానం ప్రతి
బహు ప్రకారం చకృ స్తే తం తం విధి ముపాశ్రితాః.
అనంతరము వారందరూ ఈ కార్యమును చేయుటకు ఏక నిశ్చయులై ఎవరింటిలో వారు అర్ఘ్రోపచారాది ఉపహారములతో భాస్కరుని పూజింప సాగిరి. కొందఱు మౌన వ్రత ధారులై మంత్రముల యొక్క జపాదుల చేతను, కొందఱు యజుర్వేదాను యాయులై, మరి కొందఱు సామవేదా మయాయులై జపాదులచే రవిని సంతోష పరచ సాగిరి. పిమ్మట కొంత మంది నదీ జలము లందు స్నానాదులు గావించి తపస్సు నాచరించుచూ పరిశ్రమ సహితులై ఆ భాస్కరు నారాధించు చుండిరి. కొందఱు అగ్నిహోత్ర తత్పరులై రాత్రి పగలును కూడ రవి సూక్తము జపమును చేయ సాగిరి. మరి కొందఱు భాస్కరుని యందే దృష్టిని నిలిపి నిలు చుండిరి. ఈ విధముగా వారు ఆయా ప్రసిద్దమగు విధుల ననుసరించి, అనేక ప్రకారములుగా నారాధించు టయందు దృఢ సంకల్ప చిత్తులై యుండిరి.
తధా తు యతతాం తేషాం భాస్కరారాధానం ప్రతి
సుదామా నామ గంధర్వ ఉపగమ్యేద మబ్రవీత్.
యద్యారాధన మిష్టం వో భాస్కరస్య ద్విజాతయః!
తదేత త్క్రియతాం యేన భానుః ప్రీతి ముపైష్యతి.
తస్మా ద్గురువిశాలాఖ్యం వనం సిద్ద నిషేవితమ్
కామరూపే మహాశైలే గమ్యతాం తత్ర వైలఘు.
తస్మి న్నారాధనం భానోః క్రియతాం సుసమాహితైః
సిద్దక్షేత్రం హితం తత్ర సర్వకామా నవాప్స్యధ.
వారు ఈ విధముగా సూర్యు నారాధించుట యందు అతిశయమగు ప్రయత్నమును చూచి “సుదాముడు” అను గంధర్వుడు అచటకు వచ్చి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణులారా! భాను నారాదించుటయే మీ అభీష్ట మయినచో, దేని వలన అతడు ప్రసన్ను డగునో, అట్టి కార్యమును చేయుడు. కామ రూప మహా పర్వతమున సిద్దులచే సేవింప బడుచున్న “గురు విశాల” మను వనము నకు వెళ్లి, అక్కడ సావధాన చిత్తులై భాను నారాధింపుడు. అట్లు చేయుటచే మీ వాంఛితము సిద్దించును. ఇట్టి కార్యములకు సిద్ద క్షేత్రమే అధిక ఫలదాయకము.
మార్కండేయుడు:
ఇతింతే తద్వచః శ్రుత్వా గత్వా తత్కననం ద్విజాః
దదృశు ర్భాస్వత స్తత్ర పుణ్య మాయతనం శుభమ్.
మార్కండేయుడు:
ఓ ద్విజోత్తమా! బ్రాహ్మణ గణములు గంధర్వుడు చెప్పిన వచనములు విని ఆ వనమునకు వెళ్ళిరి. మరియు నచట భాస్కర భగవానుని పవిత్ర మందిరమును చూచిరి.
తత్ర తౌ నియతాహారా వర్ణ విప్రాదయో ద్విజ!
ధూప పుష్పోపహారాఢ్యాం పూజాం చకృ రతంద్రితాః.
పుష్పానులేపనాద్వైశ్చ ధూపగంధాదికై స్తథా, జపహోమాన్న దానాద్యైః
వూజనం తే సమాహితాః కుర్యంత స్తుష్టువు ర్బ్రహ్మ! న్వివస్వంతం ద్విజాతయః
అప్పుడు బ్రాహ్మణులూ మొదలగు అన్ని వర్ణముల వారును ఆ ప్రదేశము నందు నియతాహారులై ఆలసింపక ధూప, పుష్పాదులచే భాస్కర దేవుని పూజించిరి. హే బ్రహ్మన్! అనులేపన, గంధ, పుష్ప, దీప, జప, హోమ, నైవేద్యాదులచే సావధాన చిత్తులై పూజించుచూ బ్రాహ్మణ గణాలు సూర్య దేవుని స్తుతింప సాగిరి.
బ్రాహ్మణులు:
దేవ దానవ యక్షణాం గ్రహాణాం జ్యోతిషా మపి
తేజసాభ్యధికం దేవం ప్రజామ శరణం రవిమ్.
దివి స్థితం చ దేవేశం ద్యోతయంతం సమంతతః
వాసుదా మంతరిక్షం చ వ్యాప్నువంతం మరీచిభిః.
ఆదిత్యం భాస్కరం భానుం సవితారం దివాకరమ్
పూషాణ మర్యమాణం చ స్వర్భానుం దీప్తదీధితిమ్.
బ్రాహ్మణులు:
“దేవ, దానవ, యక్ష, గ్రహము లందు అధికుడు, తేజస్వి యగు సూర్య దేవునకి మేము శరణా గతుల మైతిమి. ఎవడు ఆకాశము నందు స్థితుడై అన్ని దిక్కులను ప్రకాశింప చేయు చున్నాడో, మఱియు ఏ దేవేశ్వరుడు తన కిరణములచే వసుధను, అంతరిక్షమును వ్యాపింప చేయు చున్నాడో, ఎవడు భాస్కరుడు, సవిత, దివాకర, పుషా, ఆర్యమ, స్వర్భాను, దీప్త దీధితి,
చతుర్యుగాంత కాలాగ్ని దుష్ప్రేక్ష్యం వ్రలయాంతగమ్
యోగీశ్వర మనంతం చ రక్తం పీతం సితాసితమ్.
ఋషీణా మగ్ని హోత్రేషు యజ్ఞ దేహే ష్వవస్తితమ్
ప్రజామ శరణం దేవం తేజోరాశిం త మచ్యుతమ్.
అక్షరం పరమం గుహ్యం మోక్షద్వార మనుత్తమమ్.
చందోభి రశ్వరూపైశ్చ సకృద్యుక్తై ర్విహఙ్ఞ మమ్
ఉదయాస్తమనే యుక్తం సదా మేరోః ప్రదక్షిణే.
అనృతం చ ఋతం చైవ పుణ్యతీర్ధం పృధగ్విధమ్
విశ్వస్థితి మచింత్యం చ ప్రసన్నాః స్మ ప్రభాకరమ్.
యో బ్రహ్మ యో మహాదేవో యో విష్ణు ర్యః ప్రజాపతిః
వాయు రాకాశ మాపశ్చ పృథివీ గిరి సాగరాః.
యోగీశ్వరుడను పేర్లుచే పిలువబడు చున్నడో, ఎవడు నాలుగు యుగముల అంతము నందు దుర్నిరీక్ష్య కాలాగ్ని స్వరూపుడై యున్నడో, ఎవడు అనంత రక్త, పీత, శ్వేత కృష్ణుడై యున్నడో, ఎవడు ఋషులు యొక్క అగ్ని హోత్ర కాల మందు యజ్ఞ దేవాదిష్టితుడై యున్నాడో, ఎవడు అక్షరుడు, పరముడు గుహ్య స్వరూపుడు అయి ఉన్నడో. అత్యుత్తమ మోక్షమునకు ద్వార భూతు డగుచు బ్రహ్మ స్వరూపుడై యున్నాడో, ఎవడు త్రాటిచే బంధింప బడిన ఛందో రూపమగు అశ్వములచే ఆకాశ గామియై యున్నాడో, ఎవడు ఉదయాస్త గమనము లందు సుమేరు పర్వతమును ప్రదక్షిముణ చేయుట యందు సదా నియుక్తుడై యుండునో మరియు, ఎవడు మిధ్య, సత్యము, పుణ్య తీర్ధములు మొదలగు వేరు వేరుగా విశ్వ స్థితి స్వరూపుడై యున్నాడో, ఎవడు అదితి గర్భము నుండి ఉదయించి నాడో అట్టి అనంత, అచింత్య, ఆది దేవుడగు ప్రభాకరుని మేము ఆశ్రయించితిమి. ఎవడు బ్రహ్మయై యున్నాడో, ఎవడు విష్ణువై యున్నాడో, మఱియు ఎవడు ప్రజాపతి, వాయువు, ఆకాశము, జలము, పృథ్వి, సముద్రము, పర్వతములు,
గ్రహనక్షత్ర చంద్రాద్యా వానస్పత్యం ద్రుమౌషధమ్
వ్యక్తావ్యక్తేషు భూతేషు ధర్మాధర్మ ప్రవర్తకః
బ్రాహ్మీ మొహేశ్వరీ చైవ వైష్ణవీ చైవ తే తమః
త్రిథా యస్స స్వరూపం తు భాను ర్భాస్వాన్ ప్రసీదతు.
యస్య సర్వమయస్యేద మఙ్గ భూతం జగత్ప్రభోః
స నః ప్రసీదతాం భాస్వా ఞ్ఙగతం యశ్చ జీవనమ్.
యస్త్యైక మక్షరం రూపం ప్రభామందల దుర్దృశామ్
ద్వితీయ మైందవం సౌమ్యం స నో భాస్వాన్ ప్రసీదతు.
తాభ్యాం చ తస్య రూపాభ్యా మిథం విశ్వం వినిర్మితమ్
అగ్నీ షోమమయం భాస్వాన్ స నో దేవః ప్రసీదతు.
చంద్ర, గ్రహ, నక్షత్రములు, వనస్పతులు, వృక్షములు, ఔషదులు మొదలగునవి ఎవని రూపమో ఎవడు వ్యక్తా వ్యక్త భూత సమూహములకు ధర్మాధర్మ ప్రవర్తకుడై యుండెనో. మరియు బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ అను భేదము వలన ఎవని స్వరూపము త్రివిధము లుగా నున్నదో, అట్టి భాస్కరుడు మాపై ప్రసన్నుడగును గాక. అన్ని పదార్దములు అనాది యగు ఏ జగత్ప్రభువు యొక్క ఒడిలో నున్నవో, ఎవడు జగత్తు యొక్క జీవన స్వరూపుడై యున్నడో. అట్టి భాస్కర భగవానుడు మా యడల ప్రసన్నత జూపును గాక. ఎవనికి అద్వితీయ ప్రకాశ ప్రభా మండల దుర్నిరీక్ష్యుడగు దివాకరుడు మరియు సౌమ్య సుధాకరుడు అను ఈ రెండు రూపము లున్నవో అట్టి భాస్కర దేవుడు మాపై ప్రసన్నత జూపును గాక. ఎవని యొక్క ఆ ప్రసిద్దము లగు రెండు రూపములతో ఈ అగ్నీ సోమ మయమగు విశ్వము నిర్మింపబడి యున్నదో, అట్టి భాస్కరుడు మాయందు ప్రసన్నుడగును గాక.
మార్కండేయుడు:
ఇత్థం స్తుత్యా తదా భక్త్యా సమ్య క్పూజా విధానతః
తుతోష భగవాన్ భాస్వాం స్త్రిభి ర్మాసై ర్ద్విజోత్తమ!
తతః స మండలా దుద్య న్నిజ బింబ సమప్రభః
అవతీర్య దదౌ తేభ్యో దుర్ధర్షో దర్శనం రవిః
తతస్తే స్పష్ట రూపం తం సవితారం మజం జనాః
పులకోత్కంపినో విప్రా భక్తినమ్రాః ప్రణేమిరే.
నమో నమస్తేస్తు సహస్రారశ్మే! సర్వస్య హేతు స్త్వ మశేష హేతు!
పారా త్వ మీడ్యోఖిల యగ్నదామ, ధ్యేయ స్తథా యోగవిదాం ప్రసీద.
మార్కండేయుడు:
ఓ ద్విజోత్తమా! ఈ విధముగా వారు ఎప్పుడయితే అత్యంత భక్తి సహితులై మూడు మాసముల వరకు స్తవపాఠ పూర్వకముగా పూజించిరో, అప్పుడు భాస్కర భగవానుడు సంతుష్టు డయ్యెను. మఱియు దుర్నిరీక్ష్యు డైనను ఆయన స్వయముగా మండలము నుండి వెలుపలికి వచ్చి తన ఉదయ కాలీన మండల ప్రభచే వారికి దర్శన మిచ్చెను. అప్పుడా ప్రజలు ఆతని స్పష్టమగు రూపమును చూచి పులకితులై, భక్తి నమ్ర సహితులై అనాది యగు ఆ సవితకు నమస్కరించి యిట్లనిరి. ఓ సహస్రరశ్మీ! నీకు నమస్కారము. నీవే సమస్త భూతములకు కారణుడవు. మఱియు అఖిల జగత్తునకు పతాక స్వరూపుడవు. అఖిల యజ్ఞేశ్వరా! నీవే పూజ్యుడవు. నీవే అన్ని యజ్ఞములకు స్వరూపుడవు, యోగి పురుషులకు ధ్యాన విషయుడవు. నీవు మాపై ప్రసన్నత జూపుము.”
Summary of chapter 106 of the Mārkandeya Mahā Purana is as follows:
Sūryadeva's divine consort Sanjñā, unable to endure His intense heat and brilliance, left her shadow Chāyā behind and departed to perform penance in the form of a mare. Her father Tvasshṭā, with Sūryadeva's consent, placed Sūryadeva on his celestial lathe and trimmed one-sixteenth of His blinding heat.