107 - భాను మహాత్మ్యము

మార్కండేయుడు:

తతః ప్రసన్నో భగవా న్భాను రాహాఖిలాన్ జనాన్

వ్రియతాం యదభిప్రేతం మత్తః ప్రాప్తం ద్విజాదయః!

తత స్తే ప్రణిపత్యోచు ర్విప్రక్షత్రాదయో జనాః

ససాధ్వస మశీతాంసు మవలోక్య పురః స్థితమ్

మార్కండేయుడు:

పిమ్మట భగవానుడగు భానుడు ప్రసన్నుడై ఆ ప్రజ లందరితో నిట్లనేను. ఓ ద్విజులారా! మీరు నా వలన ఏమి పొంద వలెనని కోరు చున్నారు, దానిని తెలుపుడు. అప్పుడు బ్రాహ్మణ క్షత్రియాది జనులు ససంభ్రమముగా ఉష్ణాంశుని సమ్ముఖముగా చూచి ప్రణామము చేసి వరదాత యగు ఆ జగదీశ్వరునితో నిట్లు పలికిరి.

ప్రజలు:

భగవ! న్యది నో భక్త్యా! ప్రసన్న స్తిమిరాపహ!

దశ వర్ష సహస్రాణి తతో నో జీవతాం నృపః

నిరామాయో జితారాతిః సుకోశః స్థిరయౌవనః.

ప్రజలు:

ఓ భగవన్! ఓ తిమిహారీ! మీరు మా భక్తికి ప్రసన్నత చెందిన యెడల మా రాజగు రాజ్య వర్ధనుడు రోగ రహితుడు విజిత శత్రువు, పూర్ణ కోశుడు స్థిర యౌవనుడై పదివేల సంవత్సరములు జీవించును గాక.

మార్కండేయుడు:

తథేత్యుక్త్వా జలాద్ భాస్వా నదృశ్యో భూ న్మహామునే!

తేపి లబ్ధ వరా హృష్టా సమాజగ్ము ర్జనేశ్వరమ్.

మార్కండేయుడు:

ఓ మహామునీ! అప్పుడు భగవానుడు ఆ ప్రజ లందరితో “తథాస్తు” అని పలికి అంతర్ధానమయ్యెను.

యదా వృత్తం చ తే తస్మై నరేంద్రాయ న్యవేదయన్

వరం లబ్ద్యా సహస్రాంశోః సకాశా దఖిలం ద్విజ!

తచ్చృ త్వా జహృషే తస్య సా పత్నీ మానినీ ద్విజ!

ప్రహర్షం పరమం యాతా హర్షో ద్గత తనూరుహా

స చ రాజా చిరం దద్యౌ నాహకించిచ్చ తం జనమ్

తతః సా మానినీ భూపం హర్షాపూరితమానసా

 దిష్ట్యాయషా మహీపాల! వర్ధస్వే త్యాహ తం పతిమ్.

తధా తయా ముదా భర్తా మానిర్యాధ సభాజితః

నాహ కించి న్మహీపాల శ్చింతా జడ మనా ద్విజ!

సా పునః ప్రాహ భర్తారం చింతయాన మధోముఖమ్

కస్మా న్న హర్ష మభ్యేషి పరమాభ్యుదయే నృప!.

ఓ ద్విజుడా! నరేంద్రుని భార్య మానిని ఈ విషయము విని అత్యంత ఆనందమును పొందెను. హర్షాతిరేకముతో శరీరము పులకించి పోయెను. కాని రాజు మాత్రము వారితో ఏమియు పలుకక చాలా కాలము వరకు చింతించు చునే యుండెను. పిమ్మట మానిని ప్రసన్న చిత్తురాలై భర్తతో నిట్లు పలికినది, “ఓ మహీపాలా! సమృద్దమగు ఆయిష్యముతో మీరు వృద్ది నొందుదురు గాక ఓ ద్విజుడా! ఆనంద చిత్తురాలగు మానినిచే ఈ విధముగా అభినందింప బడినను రాజు వ్యాకుల చిత్తుడై ఏమీ జవాబు ఇవ్వ లేదు. అప్పుడు మానిని శిరస్సు వంచుకొని చింతా క్రాంతుడైన భర్తతో ఇట్లు పలికెను. ఓ రాజా! ఇంత ఆనందకర మగు సమయములో కూడ మీ రెందులకు సంతోషమును పొందుట లేదు?

దశ వర్ష సహస్రాణి నీరుజః స్థిర యౌవనః

భావీ త్వ మద్య ప్రభృతి కిం తథాపి న హృష్యసే.

కింతు తత్కారణం బ్రూహి య చ్చింతాకృష్ణ మానసః

పరమాభ్యుదయేపి త్వం సంప్రాప్తే పృథివీపతే!.

మీరు రోగ రహితులు మరియు స్థిర యౌవనులు అయి ఉండి ఇప్పటికి నుండి పదివేల వత్సరములు జీవించి యుందురు. అయి నప్పటికీ మీ కేందులకు ప్రసన్నత కలుగుట లేదు? ఓ పృథ్వీ పతీ! ఇట్టి ఆనందకర మగు సమయము సంప్రాప్తమై నప్పటికీ ఏ కారణముచే మీరు చింతించు చున్నారు? ఆ కారణ మేమియో తెలుపుడు.

రాజు:

కద మభ్యుదయో భద్రే! కిం సభాజయసే చ మామ్

ప్రాప్తో దుఃఖ సహస్రాణాం కిం సభాజన మిష్యతే.

దశ వర్ష సహస్రాణి భవిష్యా మయః మేకకః

న త్వం తవ విపత్తౌ మే కిన్న దుఃఖం భవిష్యతి.

పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ తధాన్యా నిష్ఠ బాంధవాన్

పశ్యతో మే మృతాన్ దుఃఖం కిమల్పం హి భవిష్యతి?

రాజు:

 ఓ భద్రా! నాకేమి భాగ్యము కలిగినదని నీవు నన్ను అభినందించు చున్నావు? నాకు వేల కొలది దుఃఖములు అనుభవించ వలసి వచ్చినది. ఇట్టి స్థితిలో నీవు నన్ను అభినందించుట నాకు ఎట్లు సంతోషము గలుగ జేయును? నేనొక్కడను ఒంటరి వాడనై పదివేల సంవత్సరములు జీవించుదును కాని నీవు ఉండవు. కాబట్టి నీ వియోగము నాకు దుఃఖము కాదా? పుత్ర, పౌత్రులు మరియు ప్రియ బందువులు యొక్క మరణము చూచుట వలన నాకు ఆనందము కలుగునా? వీటి వలన నాకు అల్ప దుఃఖము సంభవించునా?

భృత్యేషు చాతిభ కైషు మిత్ర వర్గే తధా మృతే

భద్రే! దుఃఖ మపారం మే భవిష్యతి తు సంతతమ్.

యై ర్మదర్ధం తప స్తప్తం కృశై ర్ధమని సంతతైః

తే మరిష్యం త్యహం భాగీ జీవిష్యామీతి ధిక్కరమ్.

సేయ మాప ద్వారారోహే! ప్రాప్తా నాభ్యుదయో మమ

కధం వా మన్యసే న త్వం య త్సభాదయసేద్య మామ్.

ఓ భద్రా! భక్తుల, భృత్య గణాలు, మిత్రులు మరణించి నప్పుడు నాకు సదా అపారమగు దుఃఖము ననుభవించ వలసి వచ్చును, ఎవరు నా కొఱకు గాలిని పీల్చక తపస్సు చేసిరో, వారికి కూడ మరణము కలుగును. కాని నేను జీవించి యుండి సుఖ భోగముల ననుభవించు చుండును. ఇది నాకు నీచము గాదా? హే వరారోహే! ఎట్టి పదివేల వత్సరములు పరమాయువు నాకు కలిగినదో, అది నాకు ఆపద గానే తటస్థించినది. నా యెడల నిది భాగ్య దాయకము కాదు. ఈ విషయముల నాలోచింపక నీవు నన్నెందుల కిట్లు హర్షింప చేయుదువు.

మానిని:

మహారాజా! యధాత్థ త్వం తథైత న్నాత్ర సంశయః

మయా పౌరైశ్చ దోషోయం ప్రీత్యా నాలోకిత స్తవ

ఏవంగతేత్ర కిం కార్యం నరనాధ! విచింత్యతామ్

నాన్యధా భావి య త్ప్రాహ ప్రసన్నో భగవాన్ రవిః.

మానిని:

“ఓ మహారాజా! మీరు చెప్పినది నిజము ఇది మీకు దుఃఖ కరమగు విషయమే. ఇందు సందేహము లేదు. నేను, పౌర వర్గాల వారును మీ యెడల గల ప్రీతిచే ఇట్టి దోషమును గ్రహింప లేక పోయితిమి. ఓ నరనాథా! ఇప్పుడేమి కర్తవ్యమో దానిని విచారింపుడు. ఎందు వలన యనగా భగవానుడగు రవి ప్రసన్నుడై ఏమి పలికెనో అది అసత్యము గాదు.

రాజు:

ఉపకారః కృతః పౌరైః ప్రీత్యా భృత్యైశ్చ యో మమ

కథం భోక్ష్యా మ్యహం భోగాన్ గత్వా తేషా మనిష్కృతిమ్.

సోహ మద్య ప్రభృత్యద్రిం గత్వా నియత మానసః

(పౌరలోక హితార్ధం చ తోషయిష్యామి భాస్కరమ్

యధా పౌరా మమ కృతే బాంధవశ్చ సమంతతః)

ఆరాధనాయ దేవేశం తథాహ మాపి సాంప్రతమ్.

 తపస్తప్స్యే నిరాహారో భానో రారాధనోధ్యతః.

దశ వర్ష సహస్రాణి యధాహం స్థిర యౌవనః

తస్య ప్రసాదా ద్దేవస్య జీవిష్యామి నిరామయః

తథా యది ప్రజాః సర్వా భృత్యాస్త్యం చ సుతాశ్చ మే

పుత్రా పౌత్రా ప్రపౌత్రాశ్చ సుహృదశ్చ వరాననే!.

జీవంత్యేవం ప్రసాదం చ కరోతి భగవాన్ రవిః

తతోహం భవితా రాజ్యే భోక్ష్యే భోగాం స్తదా ముదా.

రాజు:

పౌరులు, భృత్య గణములు ప్రసన్న మనస్కులై నాకెట్టి యుపకారము చేసిరో అట్టి వారికి నేను ఏ ప్రత్యుపకారము చేయక ఏ విధముగా భోగముల ననుభవింతును? అందు వలన నేను ఇప్పటి నుండి పర్వతము పైకి వెళ్లి దుష్కరమగు తపస్సు చేసిన పురవాసుల యొక్క హితమునకై నేనును దుష్కర మగు తపస్సును చేయుదును. దేని కొఱకు నా నిమిత్తము పురవాసులు, బంధువులు ఆరాధన జరిపిరో, అట్టి కార్యము కొఱకు నేను కూడ వారి నిమిత్తమై ఆరాధన చేయుదును. సూర్య దేవుని ఆరాధించుటకు నిరహారముతో తపస్సు చేయుదును. ఏ విధముగా ఆయన ప్రసాదము వలన స్థిర యౌవనముతో, రోగ రహిత ముగా పదివేల వత్సరములు నేను జీవించి యుందునో ఓ వరాననా! అదే విధముగా నా ప్రజ లందఱు, భృత్యులు, నీవు, పుత్రికలు, పుత్రులు, పౌత్రులు, సుహృద్గణములు కూడ జీవించ వలెను. రవి భగవానుడు ఈ విధముగా అనుగ్రహించినచో నేను ప్రసన్న చిత్తుడనై ఈ రాజ్యమునకు రాజునై సమస్త రాజ్య సుఖము ననుభవించెదను.

న చేదేవం కరోత్యర్క స్తదాద్రౌ తత్ర మానిని!

తపస్తప్స్యే నిరాహారో యావ జ్జీవిత సంక్షయః.

మఱియు ఓ మానినీ! సూర్యుడీ విధముగా అనుగ్రహించనిచో ఎప్పటి వరకు నా ప్రాణములకు నష్టము కలుగ కుండునో. అప్పటి వరకు ఈ పర్వత మందే నిరాహారముతో తపస్సు చేయుదును.”

మార్కండేయుడు:

ఇత్యుక్తా సా తదా తేన తధే త్యాహ నరాధిపమ్

జగామ తేన చ సమం సాపి తం ధరణీ ధరమ్.

స తదాయతనం గత్వా భార్యాయ సహ పార్దివః

భానో రారాధనం చక్రే శుశ్రూషా నిరతో ద్విజ!.

నిరాహారా కృశా సా చ యథాసౌ పృథివీ పతిః

తేపే తప స్తథైవోగ్రం శీత వాతాతపక్షమా.

తస్య పూజయతో భానుం తప్యతశ్చ తపో మహత్

సాగ్రే సంవత్సరే యాతే తతః ప్రీతో దివాకరః.

సమస్త భృత్య పౌరాది పుత్రాణాం చ కృతే ద్విజః

దదౌ యథాభిలషితం వరం ద్విజవరో త్తమ!

మార్కండేయుడు:

అప్పుడా మానిని నరాదిపుని వచనములు విని “తథాస్తు” అని స్వీకరించినది మరియు భర్తతో పాటు ఆమె గూడ పర్వతమునకు బోయెను. ఓ ద్విజుడా! రాజు భార్యా సహితుడై పూర్వము చెప్పిన దేవాలయమునకు వెళ్లి భాస్కర సేవా తత్పరుడై భాను నారాధింప సాగెను. నరపతి ఏ విధముగా ఆహారము లేక దినదినము కృశించి పోవు చుండెనో, అట్లే రాణి యగు మానిని కూడ క్షీణ శరీరముతో శీత, వాత, ఆ తపములను సహించుచూ ఉగ్రమగు తపస్సు చేయ మొదలిడెను. ఓ ద్విజోత్తమా! ఈ విధముగా ఎప్పుడయితే వారు భానుని నరాధనతో, మహత్తర మగు తపస్సు చేసి ఒక సంవత్సర కాలము కన్నా నధిక సమయమును గడిపిరో, అప్పుడు దివాకరుడు ప్రసన్నుడై, సమస్త భృత్య గణములు పౌరులు మఱియు పుత్రాదుల కొఱకు అభిలషించిన వరము నిచ్చెను.

లబ్ద్యా వరం స నృపతిః సమభ్యేత్యాత్మనః పురమ్

చకార ముదితో రాజ్యం ప్రజా ధర్మేణ పాలయన్.

ఈజే యజ్ఞాన్ స చ బహూన్ దదౌ దానా న్యహర్నిశమ్

మాలిన్యా సహితో భోగాన్ బుభుజే చ స ధర్మవిత్.

దశ వర్ష సహస్రాణి పుత్ర పౌత్రాదిభిః సహ

భృత్యైః పౌత్రైః ప్రముదితః సోభవత్ స్థిర యౌవనః

తస్యేతి చరితం దృష్ట్వా ప్రమతి ర్నామ భార్గవః

విస్మయాకృష్ట హృదయో గాధా మేతా మగాయత.

అనంతరము రాజు వరమును పొంది తన గృహమునకు తిరిగి వచ్చెను. హర్ష చిత్తుడై ధర్మముగా ప్రజా పాలన చేయుచు రాజ్యము నేల సాగెను. ధర్మాత్ముడగు ఆ రాజు అనేక యజ్ఞములను పగలు, రాత్రియును సత్పాత్రులకు దానములను మఱియు పట్టమహిషి యగు మానినితో వివిధ భోగాలనూ అనుభవించెను. ఈ విధముగా ఆయన పుత్ర, పౌత్ర. భృత్య, పౌర గణాదులచే ప్రసన్న చిత్తముతో స్థిర యౌవనుడై పదివేల వత్సరములు గడిపెను. ఆ సమయమున భృగు వంశోత్పన్ను డగు “ప్రమతి” యను పేరు గల ఋషి ఆ రాజు యొక్క చరిత్ర విని అచ్చెరు వొందిన వాడై భాను మహాత్మ్యమును ఇట్లు కీర్తించెను.

భాను భక్తే రహో శక్తి ర్యద్రాజా రాజ్యవర్ధనః

ఆయుషో వర్ధనే జాతః స్వజనస్య తథాత్మనః

ఇతి తే కథితం విప్ర! యత్ పృష్టోహం త్వయోదితః

ఆది దేవస్య మాహాత్మ్య మాదిత్యస్య వివస్వతః.

విప్రైత దఖిలం శ్రుత్వా భానో ర్మాహాత్మ్య ముత్తమమ్

పఠంశ్చ ముచ్యతే పాపైః సప్తరాత్ర కృతైర్నరః.

ఆరోగీ ధనవా నాఢ్యః కులే మహతి ధీసుతామ్

జాయతే చ మహాప్రాజ్ఞో యశ్చైత ద్దారయే ద్భుధః.

(యజతే చ మహాయజ్ఞైః సమాప్త వరదక్షిణః

శ్రుత్వా చరిత మేతద్ది సమానం లభతే ఫలమ్.)

మంత్రాశ్చ యేత్రాభిహితా భాస్వతో మునిసత్తమ

జపః ప్రత్యేక మేతేషాం త్రిసంధ్యం పాతకాపహః.

భాను దేవుని భక్తికి ఆశ్చర్యకర మగు శక్తి కలదు? దాని బలముచే రాజ్య వర్ధనుడను రాజు తనకు మఱియు తన ఆత్మీయులకు ఆయువును పెంపొందింప చేసెను. ఓ విప్రా! నీవు ఆది దేవు డగు వివస్వానుని మాహాత్మ్యము నందు ఏ విషయముల నడిగితివో, దానిని నీకు వర్ణించితిని. మానవులు భానుని ఈ ఉత్తమ మగు మహాత్మ్యము నంతయు బ్రాహ్మణుని ముఖము నుండి శ్రవణము చేసినను లేక పఠనము చేసిననూ సప్త రాత్రు లందు చేసిన పాపముల నుండి విడువ బడుదురు. ఏ మానవుడు భానుని ఈ మహాత్మ్యమును బుద్ది యందు ధరించునో, అతడు బుద్ధి మంతుల కులము నందు జన్మించి ధన వంతుడు, రోగము లేని వాడగును, మహా ప్రాజ్ఞుడు అగును. మరియు గొప్ప దక్షిణలు గల యజ్ఞములు చేయును. ఈ చరిత్రను వినిన వారు తనతో సమాన మగు త్రిసంధ్యల యందు జపించిననూ వారి పాతకము లన్నియు నశించును.

సమస్త మేతాన్ మాహాత్మ్యం యత్ర చాయతనే రవేః

పఠ్యతే తత్ర భగవాన్ సాన్నిధ్యం న విముంచతి.

తస్మా దేతత్త్వయా బ్రహ్మాన్! భానో ర్మాహాత్య్మ ముత్తమమ్

దార్యం మనసి జాప్యం చ మహత్పుణ్య మభీస్సతా.

సువర్ణశృంగీ మతిశోభానాంగీం పయశ్వినీం గాం ప్రదదాతి యో హి

శృణోతి చైతత్ర్యహ మాత్మవా న్నరః సమం తయోః పుణ్యఫలం ద్విజాగ్ర్య!.

ఏ దేవ మందిరము నందు ఈ రవి యొక్క సంపూర్ణ మహాత్యము పఠింప బడునో, భగవానుడు ఆ మందిర సమీపమును విడువడు. అందు వలన హే బ్రాహ్మన్! నీవును మహాత్తర పుణ్యము యొక్క అభిలాషచే భానుని ఈ ఉత్తమ మగు గొప్ప మహాత్మ్యమును మనస్సు నందు ధరించి జపించుము. ఓ ద్విజశ్రేష్టా! ఏ పురుషుడు సువర్ణముతో చేసిన కొమ్ములను తొడిగి ఒక అతి సుందర మగు, పాలిచ్చు నటువంటి గోవును దానము చేయునో, మఱియు పురుషుడు ఇంద్రియ నిగ్రహము కలవాడై మూడు రోజులు ఈ మహాత్మ్యమును వినునో, అట్టి ఆ యిద్దరి పుణ్య ఫలము సమానమని యెరుగ వలెను.