38 - యోగి చర్యా కథనము, అష్ట సిద్దులు

అలర్కుడు:

భగవ న్యోగి శ్చర్యాం శ్రోతు మిచ్చామి తత్త్వతః బ్రహ్మ వర్త్మ న్యనుసర న్యథా యోగీ న సీదతి

అలర్కుడు:

భగవానుడా! యోగుల యొక్క ఆచారము మరియు బ్రహ్మ మార్గము పొందుటకు అనుకూలమగు ధర్మమును చెప్పుము. బ్రహ్మ మార్గము చెడకుండ ఉండు నట్టి ధర్మమును చెప్పుము.

దత్తాత్రేయుడు:

మానా పమానౌ యా వేతౌ ప్రత్యుద్వేగ కరౌ నృణామ్ తా వేవ విపరీతార్థౌ యోగినః సిద్ధి కారకౌ మానా పమానౌ యా వేతౌ తావేనాహు ర్విషా మృతేః

అవమానోఽమృతం తత్ర మానస్తు విషమం విషమ్ చక్షుః పూతం న్యసే త్పాదం వస్త్ర పూతం జలం పిబేత్ సత్య పూతాం వాదే ద్వాణీం బుద్ధి పూతం చ చింతయేత్ ఆతిథ్య శ్రాద్ధ యజ్ఞేషు దేవయాత్రోత్సవేషు చ  మహాజనేషు సిద్ద్యర్థం న గచ్చే ద్యోగవి త్క్వచిత్

దతాత్రేయుడు:

మానము, అవమానము అను ఈ రెండు మానవునికి ప్రీతి మరియు ఉద్వేగమునకు కారణములు. యోగికి ఈ రెండు విపరీతము లైనచో సిద్ధికి కారణములగును. అనగా మానమును అవమానముగాను, అవమానమును మానముగా తలచుట సిద్ధికి కారణమగును. మానావమానము లీ రెండును అమృత విషములుగా చెప్ప బడినవి. అవమానమును అమృతము గాను, మానమును విషము గాను యోగి అయిన వాడు తలంచ వలెను. చక్షుః పూతమైన స్థల మందు పాదముంచ వలెను. వస్త్రముచే వడ పోసిన నీరు త్రాగ వలెను. సత్యముచే పవిత్రమైన వచనములు పలుక వలెను. పవిత్రమైన బుద్ధితో ఆలోచించ వలెను. యోగి అగు పురుషుడు ఆతిథ్య, శ్రాద్ధ, యాత్రా, మహోత్సవములకు ఎన్నడును పోకూడదు. సిద్ధి కొరకు మహా జనుల సమీపమునకు కూడా పోరాదు.

వ్యస్తే విభూమే వ్యజ్గారే సర్వస్మి న్భుక్తవజ్జనే అటేత యోగవి ద్భైక్ష్యం న తు తేష్వేవ నిత్యశః యదైవ మవమన్యంతే జనాః పరిభవన్తి చ తథాయుక్తశ్చ రేద్యోగీ సతాం వర్మ న దూషయన్ భైక్ష్యం చరే ద్గృహస్థేషు యాయావర గృహేషు చ శ్రేష్టా తు ప్రథమా చేతి వృత్తి రస్యోపదిశ్యతే అథ నిత్యం గృహస్థేషు శాలినేషు చారు ద్యతిః శ్రద్ధదానేషు దాన్తేషు శ్రోత్రియేషు మహాత్మసు అత ఊర్థ్వం పునశ్చాపి అదుష్టాపతితేషు చ భైక్ష్య చర్యా వివర్ణేలు జఘన్యా వృత్తి రష్యతే

యోగి గృహస్థుని గృహమునకు అగ్ని విహీనమై, దూమ రహితమై భోజనము చేసి నిశ్చింతగా నున్న సమయ మందు భిక్షకు వెళ్ళ వలెను. గృహస్థుడు తిరస్కారము, అవమానము చేయునట్లుగా వెళ్ళ వలెను. ప్రతి నిత్యము వెళ్ళిన గృహమునకే వెళ్ళ రాదు. ఈ ప్రకారముగా సాధు జనుల యొక్క మార్గమును చెడ గొట్టక యోగి సంచరించ వలెను. నిత్యము గృహస్థుల గృహము లందు, ముష్టి ఎత్తుకొని జీవించు గృహము లందు యోగ భిక్ష చేయ వలెను. ఇది యోగికి ప్రధాన వృత్తి అని చెప్పబడినది. ఏ గృహస్థుడు లజ్జా శీలములు గలవాడో, శ్రద్ధా, చాతుర్యము గలవాడో, శ్రోత్రియుడు, మహాత్ముడి యున్నాడో అట్టివారి గృహమందు యోగి భిక్ష చేయ వలెను. వర్ణాంతర మందు భిక్ష చేయుట నీచ వృత్తి యనబడును. పతితులు కానివారి గృహమందు, మరియు సవర్ణుల యందు భిక్ష చేయ వలెను.

భైక్ష్యం యవాగూం తక్రం వా పయో యావక మేవ వా ఫలం మూలం ప్రియంగుం వా కణ పిత్యాక సక్తవః ఇత్యేతే చ శుభాహారా యోగినాం సిద్ధి కారకాః తత్ప్రయుంజ్యా న్ముని ర్భక్త్యా పరమేణ సమాధినా అపః పూర్వం సకృ త్ప్రాశ్య తూష్ణీం భూత్వా సమాహితః ప్రాణాయేతి తతస్తస్య ప్రథమా హ్యాహుతి స్మృతా అపానాయ ద్వితీయా తు సమానేతి చాపరా ఉదానాయ చతుర్థీ స్యా ద్వ్యానాయేతి చ పంచమీ ప్రాణాయామైః పృథక్క్రుత్వా శేషం భుంజీత కామతః అవః పునః సకృ త్ప్రాశ్య ఆచమ్య హృదయం స్పృశేత్

యవాగు (గంజి), మజ్జిగ, పాలు, కొర్రలు, నూకలు, తెలక పిండి, సత్తు పిండి, ఈ వస్తువులను యోగి పురుషులు భిక్ష చేయవలెను. ఈ చెప్పిన వస్తువు లన్నియు పవిత్రాహారములు మరియు యోగ సిద్ధిని కలుగ జేయు ఆహారములని చెప్ప బడినవి. కావున ఆదరముతో భక్తి యుక్తుడై ఈ ఆహారములను తీసుకొన వలెను. యోగి భోజనమునకు ముందు మౌనమును పాటించి మొదట ఒకసారి జల పానము చేసి సావధానుడై “ప్రాణాయ స్వాహా” అని చెప్పి ఆహారము తీసికొన వలెను. ఇది ప్రథమాహుతి అని చెప్పబడు చున్నది. ఇట్లు క్రమముగా “అపానాయ స్వాహా” అని రెండవ ఆహుతి, “సమానాయ స్వాహా” అని మూడవ ఆహుతి, “ఉదానాయ స్వాహా” అని నాలుగవ ఆహుతి, “వ్యానాయ స్వాహా” అని ఐదవ ఆహుతి గ్రహించ వలెను. తరువాత ప్రాణాయామములతో వేరుగా చేసి తన ఇచ్చానుసారముగా భోజనము పూర్తి చేయవలెను. పిమ్మట ఒకసారి జలపానము చేసి ఆచమనాంతరము హృదయమును స్పృశించ వలెను.

ఆస్తేయం బ్రహ్మచర్యం చ త్యాగోలోభ స్తథైవ చ వ్రతాని పంచ భిక్షూణా మహింసా పరమాణి వై అక్రోదో గురుశుశ్రూషా శౌచ మాహార లాఘవమ్ నిత్యస్స్వాధ్యాయ ఇత్యేతే నియమః పరికీర్తితాః సారభూత ముపాసీత జ్ఞానం యత్కార్య సాధకమ్ జ్ఞానానాం బహుతా యేయం యోగవిఘ్నకరీ హి సా ఇదం జ్ఞేయ మిదం జ్ఞేయ మితి యస్తృషిత శ్చరేత్ అపికల్ప సహస్రేషు నైవ జ్ఞేయ మవాప్నుయాత్ త్యక్త సంగో జితక్రోధో లఘ్వాహారీ జితేంద్రియః విధాయ బుద్ధ్యా ద్వారాణి మనో ధ్యానే నివేశయేత్

ఆస్తేయము, బ్రహ్మచర్యము, త్యాగము, లోభము లేకపోవుట, అహింస ఈ ఐదు యోగికి పరమ వ్రతములు. క్రోధ సూన్యత,గురు శుశ్రూష, శౌచము, అల్పాహారము, నిత్యము వేదాధ్యయనము, ఈ ఐదు యోగికి నిత్య నియమ వ్రతములు. సారభూతము అయినవియు, కార్యసాధక మైనదియు నగు జ్ఞానము గురించి ఆలోచించ వలెను. ఇతర అనేక జ్ఞాన విషయముల గూర్చి చర్చించుట వలన యోగమునకు విఘ్నము కలుగును. ఈ యోగి “ఇవి తెలుసుకొనుట ఉచితము. ఇది తెలుసుకొన దగినది”. అని దాహము గొన్నవాని వలె తిరిగినచో వెయ్యి కల్పములకు గూడ ఙ్ఞేయమగు పదార్థము సంభవించదు. సంగ త్యాగము, క్రోధ జయము,లఘ్వాహారము, ఇంద్రియ జయము కలవాడై బుద్ధి యోగముచే విదానముగా చిత్తమును ధ్యానము నందుంచ వలెను.

శూన్యేష్వేవావకాశేషు గృహాసు చ వనేషు చ నిత్య యుక్త స్సదా యోగీ ధ్యానం సమ్య గుపక్రమేత్ వాగ్దండః కర్మ దండశ్చ మా నోదండశ్చ తే త్రయః యస్యైతే నియతా దండాః స త్రిదండీ మహాయతిః సర్వ మాత్మమయం యస్య సద సజ్జగా దీదృశమ్ గుణాగుణమయం తస్య కః ప్రియః కో నృపాప్రియః విశుద్ధ బుద్ధిః సమాలోష్ట కాంచనః సమస్త భూతేషు సమస్సమాహితః స్థానం పరం శాశ్వత మవ్యయం చ యతి ర్హి గత్వా న పునః ప్రజాయతే వేదా చ్చేష్టా స్సర్వయజ్ఞ క్రియాశ్చ యజ్ఞా జ్జాప్యం జ్ఞానమార్గశ్చ జప్యాత్ జ్ఞానా ద్ధ్యానం సంగ రాగ వ్యపేతం తస్మిన్ప్రాప్తే శాశ్వత్యసోవలబ్దిః సమాహితో బ్రహ్మపరో ప్రమాదీ శిచి స్తథైకాస్త రతి ర్యతేన్ద్రియః సమాప్నుయా ద్యోగ మిమం మహాత్మా విముక్తి మాప్నోతి తతః స్వయోగతః

నిర్జన ప్రదేశ మందు గాని, గుహ యందు గాని, వన మందు గాని, ప్రవేశించి నిత్య యుక్తుడై సర్వదా విధి పూర్వకముగా ధ్యానమును ప్రారంభించ వలెను. వాగ్ధండము, కర్మ దండము, మనో దండము, ఈ మూడు ఎవనికైతే వశమై యుండునో అట్టి వానిని “త్రిదండి” యని “మహాయతి” యని చప్ప బడును. ఈ సద సదాత్మకము, గుణా గుణ మయము, ద్రుశ్యమానమునగు జగుత్తును ఆత్మమాయముగా దలంచునో రాజా! ఆ యోగికి ప్రియాప్రియ భేదము లుండవు. విశుద్ధ బుద్ధి, బంగారము నందు మట్టిగడ్డ యందు సమాన బుద్ధి గలవాడు, సమస్త భూతము లందు సముడు సమాహిత చిత్తుడునగు యతి, సర్వాధారుడు. శాశ్వతుడు; అవ్యయుడు నగు బ్రహ్మను పొందును. మరల జన్మించడు. సమస్త వేదముల కంటే సర్వ యజ్ఞములు శ్రేష్ఠములు. యజ్ఞముల కంటే జపము శ్రేష్ఠము. జపము కంటె జ్ఞాన మార్గము శ్రేష్ఠము. జ్ఞానము కంటె సంగరాగ విహీన మైన ధ్యానము శ్రేష్ఠమై యున్నది. ఈ ధ్యాన యోగము లభించినచో శాశ్వత బ్రహ్మత్వమును పొందును. ఏ మహాత్ముడు సావధాన బ్రహ్మ పరాయణుడు, ఐకాంతికుడు, అనురాగి, జితేంద్రియుడునై, ఈ యోగమును అనుష్టించు చున్నాడో అట్టివాడు ముక్తిని పొందుచున్నాడు.