128 - మరుత్త చరిత్రము

మార్కండేయుడు:

స తు తత్ర సుతం దృష్ట్వా గృహీత వర కార్ముకమ్ ధనుః శస్త్రం చ తస్యోగ్రం జ్వాలా వ్యాప్త దిగన్తరమ్ ఉద్గిరన్తం మహావహ్నిం దీపితాఖిల భూతలమ్ పాతాలా న్తర్గతం ప్రాప్త మసహ్యం ఘోర భీషణమ్ స తం దృష్ట్వా మహీపాలం భృకుటీ కుటిలాననమ్ మా కృధస్త్వం మరుత్తాస్త్ర ముపసం హ్రీయతా మితి ప్రాహాస కృచ్చామలుప్త వర్ణక్రమ ముదారదీః స నిశమ్య గురో ర్వాక్యం దృష్ట్వా తం చ పునః పునః గృహీత కార్ముకం పిత్రోః ప్రణిపత్య స గౌరవమ్ ప్రత్యువాచా పరాద్దా మే సుభృశం పన్నగాః పితః

మార్కండేయుడు:

అవీక్షితుడు అచటకు చేరుకొని ధనుర్దారియై శస్త్రమును సంధించి యున్న పుత్రుని చూచెను. అతని ఉగ్ర శస్త్రము జ్వాలలచే అన్ని దిక్కుల వ్యాపించి యుండెను. ఆ అస్త్రము నుండి వెలువడు చున్న మహావహ్నిచే భూమి దీప్తివంత మయ్యెను. మరియు అసహ్యము, ఘోరము, భీకరమగు ఆ యగ్ని పాతాళ లోకమున గూడ వ్యాపించెను. అవీక్షితుడు కనుబొమలు ముడివడి క్రోధముగా నున్న మరుత్త రాజును చూచెను. అప్పుడు అతనితో నిట్లు పలికెను. ‘ఓ మరుత్తా! అస్త్రమును ఉపసంహరించుము. క్రోధమును విడువుము.’ అనేక మారులు వారి వచనములతో వర్ణక్రమము లుప్తమవ్వ సాగెను. అప్పుడు ఆ ఉదార బుద్ధి తండ్రి యొక్క పలుకులు విని, మాటి మాటికి తండ్రిని చూచుచూ, చేతిలోని ధనుస్సును వదలకయే తల్లి దండ్రులకు నమస్కరించి సగౌరవంగా నిట్లు పలికెను. తండ్రీ! ఈ పన్నాగ గణాలు నాకు అపరాధులు.

శాసతీమాం మయి మహీం పరిభూయ బలం మమ సప్తాశ్రమ ముపాగమ్య దష్టా ముని కుమారకాః ఋషీణా మాశ్రమస్థానా మమీషా మవనీపతే మయి శాసతి దుర్వ్రుత్తై ర్దూషితాని హవీంషి చ జలాశయా స్తభాప్యేతైః సర్వ ఏవ హి దూషితాః తదేతత్కారణం కించిన్న పక్తవ్యం త్వయా పితః న నివారయితవ్యోహం బ్రహ్మఘ్నా న్ప్రతి పన్నగాన్

ఈ నాగులు నా శాసన కాల మందు నా బలమును లెక్క చేయక ఈ ఆశ్రమ మందు చేరి ఏడుగురు ముని కుమారులను కాటు వేసినవి. మరియు ఓ అవనీ పతీ! నా శాసన కాలమున ఈ దుర్వృర్తులగు సర్ప గణాలు ఆశ్రమ వాసులగు ఋషుల యొక్క అగ్నులను మస్త జలాశయములను కలుషితములను చేయు చున్నవి. అందు వలన ఓ తండ్రీ! మీరు ఈ విషయమున ఏమియును చెప్ప వద్దు. బ్రాహ్మణ ఘాతకులగు పన్నగముల యొక్క నిధన కార్యమును నివారింపకుడు.’

అవీక్షితుడు:

యద్యేభి ర్నిహతా విప్రా యాశ్యన్తి నరకం మృతాః మమైత త్క్రియతాం వాక్యం విరమాస్త్ర ప్రయోగతః

అవీక్షితుడు:

కుమారా! బ్రహ్మ హత్య చేసినచో వీరు మృతి చెందిన పిమ్మట నరకమును పొందుదురు. నీవు అస్త్ర ప్రయోగమును విరమించి నా పలుకులను గౌరవించుము.

మరుత్తుడు:

నాహ మేషాం క్షమిష్యామి దుష్టానా మపరాధినమ్ అహమేవ గమిష్యామి నరకం యది పాపినామ్ న నిగ్రహే యతా మ్యేషాం మాం నివారయ మావతః

మరుత్తుడు:

“ఈ పాపులను దండింపనిచో నేనును నరకమునకు పోవుదును. అందుకే ఓ తండ్రీ ! నన్ను వారింప వలదు. దుష్టులగు ఈ అపరాధులను నేను క్షమించను.”

అవీక్షితుడు:

మా మేతే శరణం ప్రాప్తాః పన్నగా మమ గౌరవాత్ ఉపసంహ్రియతా మస్త్ర మలం కోపేన తే నృప

అవీక్షితుడు:

ఈ పన్నగ గణాలు నన్ను శరణు పొందినవి. ఈ కారణముచే ఓ కుమారా! నా ధర్మమును రక్షించుట కైనను నీవు నీ కోపమును తగ్గించుకొని అస్త్రమును ఉపసంహరించుము.

మరుత్తుడు:

నాహ మేషాం క్షమిష్యామి దుష్టానా మపరాధినామ్ స్వధర్మ ముల్లంఘ్య కథం కరిష్యామి వచ స్తవ దండ్యే నిపాతయన్ దండం భూపః శిష్టాంశ్చ పాలయన్ పుణ్యలోకా నవాప్నోతి నరకాం శ్చాప్యుపేక్షణాత్

మరుత్తుడు:

నేను దుష్టులగు ఈ అపరాధులను క్షమించను. నా ధర్మమును విడిచి మీ వచనముల నెట్లు రక్షింప గలను? దండనీయులగు ప్రజలను దండించి, శిష్టులగు పురుషులను పాలించుటచే రాజునకు సమస్త పుణ్య లోకములు సంప్రాప్తించును. కాని అట్టి దానిని ఉపేక్షించుట వలన నరక ప్రాప్తి కలుగును.

మార్కండేయుడు:

ఏవ స బహుశః పిత్రా వార్యమాణో మ్బయా సహ నోపసంహరతే సోస్త్రం తతోసౌపున రబ్రవీత్ హింససే పన్నాగా న్భీతా న్మమైతా ఞ్చరణం గతాన్ వార్యమాణోపి తస్మా త్తే కరిష్యామి ప్రతిక్రియామ్

మార్కండేయుడు:

తండ్రి ఇట్లు మాటి మాటికి నివారించి నప్పటికీ పుత్రుడగు మరుత్తుడు తన అస్త్రమును ఉపసంహరించ లేదు. అప్పుడు తిరిగి అతడు పుత్రునితో ఇట్లనెను. ‘భీతి చెందిన ఈ పన్నగా గణాలు నన్ను శరణు బొందినవి. ఈ కారణముచే నేను నివారించి నప్పటకినీ నీవు వీటిని హింసించు చున్నావు. అందుచే నేను దీనికి తగిన ప్రతిక్రియ చేయవలసి యున్నది.’

మయాప్యస్త్రా ణ్యవ్యాప్తాని న త్వ మేకోస్త్ర విద్భువి మమాగ్రతః సుదుర్వృత్తః పౌరుశంచ కియత్తవ తతః కార్ముక మారోప్య కోప తామర విలోచనః అవిక్షి దస్త్రం జగ్రాహ కాలస్య ముని పుజ్గవః తతో జ్వాలా పరీవార మరిసంఘఘ్న ముత్తమమ్ కాలాస్త్రం తు మహావీర్యం యోజయామాస కార్ముకే తత శ్చుక్షోభ జగతీ సంపర్తాస్త్ర ప్రతాపితా సాబ్ది శైలాఖిలా విప్రః కాలాస్యాస్త్రే సముద్యతే

భూమండల మందు కేవలము నీ వొక్కడవే అస్త్ర వేత్తవు గావు. నేను కూడా అనేక అస్త్రములను ఎరుగుదును. ఓ దుర్వృత్తుడా! నా ముందు నీ పౌరుష మెంత? ఓ ముని పుంగవా! అవీక్షితుడు ఈ విధముగా పలికి క్రోధముచే తామ్రాలోచనుడై ధనస్సుపై త్రాడును బిగించి కాలాస్త్రమును గ్రహించెను. ఓ విప్రా! ఈ కలాస్త్రమును ప్రయోగించుటకు ఉద్య మించిన సమయమున మరుత్తుని సంవర్తకాస్త్రముచే తపించి నట్టి పర్వతములు, సముద్ర యుక్తమగు సంపూర్ణ జగత్తు క్షోభించినది.

మార్కండేయుడు:

కాలాస్త్ర ముద్యతం పిత్రా మరుత్తః సోపి వీక్ష్య తత్ ప్రాహోచ్చై రస్త్ర మేత న్మే దుష్ట శాస్తి సముద్యతమ్

మార్కండేయుడు:

మరుత్తుడు కూడా ఆ ఎక్కు పెట్టిన కాలాస్త్రమును చూసి హెచ్చు స్వరముతో నిట్లు పలికెను. “నా యొక్క సంవర్తకాస్త్రము దుష్టులకు శాస్తి చేయుటకు ఉద్యుక్త మైనది.”

న త్వద్వాదాయ కాలాస్త్రం మయి ముంచతి కిం భవాన్ స్వధర్మచారిణి సుతే సదై వాజ్ఞాకరే తవ మయా కార్యం మహాభాగః ప్రజానాం పరిపాలనమ్ త్వయైవం క్రియతే కస్మా న్మద్వధాయాస్త్ర ముద్యతమ్

నిన్ను వధించుటకు కాదు. అయిననూ సత్య పథము నవలంభించు నట్టి మరియు సర్వదా మీ ఆజ్ఞలను పాలించు పుత్రుని యెడల మీరు దేని నిమిత్తము కాలాస్త్రమును విడుచు చున్నారు? ఓ మహాభాగా! ప్రజలను పాలించుటయే నా కర్తవ్యము. మీరు నా వినాశనార్థము ఏ విధముగా నిట్లు అస్త్రమును విడుచు చున్నారు?

అవీక్షితుడు:

శరణాగత సంత్రాణం కర్తుం వ్యవసితా వయమ్ తస్య వ్యాఘాత కర్తా త్వం న మే జీవ న్విమోక్షసే మాం వా హత్వాస్త్ర వీర్యేణ జహి దుష్టా న్మహోరగాన్ త్వాం వాహత్వా మహాస్త్రేణ రక్షిష్యామి మహోరగాన్ ధి క్తస్య జీవితం పుంసః శరణార్ధిన మాగతమ్ యో నారత మనుగృహ్ణాతి వైరిపక్ష మాపి ధృవమ్

అవీక్షితుడు:

నేను శరణాగత పురుషులను రక్షింప వలెనని సంకల్పించి నాను. ఈ కార్యమునకు నీవు విఘ్నమును కలిగించు చున్నావు. ఈ కారణమున నీవు జీవించి యుండగా నా నుండి రక్షణ పొంద లేవు. ఇప్పుడు నీవు అస్త్ర బలముచే నన్ను నాశనము చేసి పిమ్మట దుష్టులగు ఉరగ కులమును వధింపుము. లేదా నేనే నిన్ను అస్త్ర సహాయముతో వధించి సర్పములను రక్షించెదను. శత్రు పక్షము వారైననూ ఆర్తులై శరణు బొంది వచ్చినచో ఏ మనుష్యుడు ఆతనిని రక్షింపడో, అతని జీవితము వ్యర్థము.

క్షత్రియోహ మిమే భీతాః శరణం మా ముపాగాతాః అపకర్తా త్వ మే వైషాం కథం వధ్యో మే భవాన్

నేను క్షత్రియుడను. భీతావహులై ఇవి నన్ను శరణు బొందినవి. మరియు నీవు వీటికి అపకారము చేయు చున్నావు. అందు వలన నీవు నాచే వధింప బడుటకు యోగ్యుడవు ఎందుకు కావు?

మరుత్తుడు:

మిత్రం వా బాంధవో వాపి పితా వా యది వా గురుః ప్రజాపాలన విఘ్నాయ యో హన్తవ్యః స భూభృతా సోహం తే ప్రహరిష్యామి న క్రోద్దవ్యం త్వయా పితః స్వధర్మః పరిపాల్యో మే న మే క్రోధ స్తవోపరి

మరుత్తుడు:

మిత్రులు, తండ్రి లేక గురువు ఎవరైననూ ప్రజా పాలన యందు విఘ్నకారు లైనచో తప్పక వారు రాజుచే వధింప బడుటకు యోగ్యులు. ఈ కారణమున ఓ తండ్రీ ! నేను మీ మీదకు బాణములను వేశెదను. మీరు కోపగించకుడు. స్వధర్మ పరిపాలనయే నా కర్తవ్యము. మీపై నాకు క్రోధము లేదు.

మార్కండేయుడు:

తత స్తౌ నిశ్చితౌ దృష్ట్వా పరస్పర వధం ప్రతి సముత్పత్యాన్తరే తస్థు ర్మునయో భార్గవాదయః ఊచు శ్చైనం న మోక్తవ్యం త్వయాస్త్రం పితరం ప్రతి త్వయా చ నాయం హన్తవ్యః పుత్రః ప్రఖ్యాత చేష్టితః

మార్కండేయుడు:

ఇట్లు ఆ ఇద్దరు పరస్పరము వధించుటకు కృత నిశ్చయులగుట చూచి భార్గవాది మునులు వెంటనే అచటకు వచ్చి ఆ ఇద్దరి మధ్య నిలచిరి. మరియు మరుత్తునితో నిట్లు పలికిరి. “ నీవు కూడ విఖ్యాత కర్ముడగు ఈ పుత్రుని నాశనము చేయ రాదు.”

మరుత్తుడు:

మయా దుష్టా నిహన్తవ్యాః సన్తో రక్ష్యా మహీక్షితా ఇమే చ దుష్టా భుజగాః కోపరాదోత్ర మే ద్విజాః

మరుత్తుడు:

ఓ ద్విజులారా! నేను రాజును. దుష్టుల రక్షణ చేయుట నా ముఖ్య కర్తవ్యము. ఈ భుజంగములు దుష్టులు. అందువలన ఈ విషయ మందు నా దోష మేమున్నది?

అవీక్షితుడు:

శరణాగత సన్త్రాణం మయా కార్య మాయం చ మే అపరాధ్యః సుతో విప్రాః యో హన్తి శరణాగతమ్

అవీక్షితుడు:

ఓ విప్రులారా! శరణార్ధులై వచ్చిన వారిని రక్షించుట యే నా కర్తవ్యము. ఏ పుత్రుడు ఆ శరణార్ధులను నాశనము చేయు చున్నాడో, అతడు నాకు అపరాధి.

ఋషులు:

ఇమే వదన్తి భుజగా స్త్రాసలోల విలోచనాః సంజీవయామ స్తా న్విప్రాన్ యే దష్టా దుష్ట పన్నగైః తదలం విగ్రహే చోభౌ రాజవర్యౌ ప్రసీదతామ్ ఉభా వపి వినిర్వ్యూఢ ప్రతిజ్ఞౌ ధర్మకోవిదౌ

ఋషులు:

“భయముచే చంచల నేత్రులగు భుజంగములు” ఏ బ్రాహ్మణులను దుష్ట పన్నగములు కాటు వేసినవో, మేము వారిని జీవింప చేయుదుమని చెప్పు చున్నవి. అందు వలన ఇప్పుడు యుద్దము చేయ వలసిన అవసరము లేదు. ప్రసన్నత చెందుము. మీరిద్దరును రాజ శ్రేష్ఠులు మరియు ఇద్దరును ఏ విధముగా ధర్మ వేత్తలో అట్లే పాలకులు కూడా అని పలికిరి.

మార్కండేయుడు:

సా తు వీరా సమభ్యేత పుత్ర మేత దభాషత మద్వాక్యా దేష తే పుత్రో హన్తుం నాగాన్ కృతోద్యమః

మార్కండేయుడు:

ఆ సమయమున వీరాదేవి అచ్చటకు వచ్చి పుత్రుడగు అవీక్షితునితో నిట్లనెను. నా వచనముల ననుసరించియే నీ పుత్రుడు సర్ప వినాశము చేయుటకు ఉద్యుక్తు డయ్యెను.

తన్నిష్పన్నం యదాః విప్రా స్తే జీవన్తి తథా మృతాః సంజీవన్తశ్చ ముచ్యంతే యద్యుష్మచ్చరణంగతాః

ఎప్పుడైతే మరణించిన బ్రాహ్మణులు తిరిగి జీవించెదరో, అప్పుడు ఈ కార్యము సంపన్న మయ్యెను. అందువలన నీ ఈ శరణార్థులు కూడ విముక్తులైరి.

భామిని:

అహ మప్యర్థితా పూర్వ మేభిః పాతాల సంశ్రయైః తన్నిమిత్త మయం భర్తా మయాత్ర వినియోజితః త దేతదార్యే నిర్వృత్త ముభయో రపి శోభనమ్ మమ భర్తుశ్చ పుత్రస్య త్వ త్పౌత్రస్యాత్మజస్య చ

భామిని:

పాతాళ వాసులగు ఈ సర్పములు పూర్వము నన్ను ఈ విధముగా అభయ మిమ్మని ప్రార్థించిరి. ఈ కారణమున నేను నా భర్తను ఈ విషయ మందు కోరితిని. ఇప్పుడు నా భర్త మరియు పుత్రుడు అనగా మీ పుత్రుడు మరియు పౌత్రుని వలన ఈ కార్యము అందమైన రీతిలో సంపన్న మైనది.

మార్కండేయుడు:

తతః సంజీవయామాసు స్తా న్విప్రాం స్తే భుజజ్గమాః దివ్యై రోషధిజాతైశ్చ విష సంహరేణ చ పిత్రో ర్ననామ చరణౌ స తతో జగతీపతిః మరుత్తశ్చ స తం ప్రీత్యా పరిష్వజ్యేత మబ్రవీత్

మార్కండేయుడు:

అనంతరము నాగ దేవతలు దివ్య ఔషదములచే విషమును హరించి ఆ బ్రాహ్మణులను బ్రతికించినవి. అటు పిమ్మట మహీపతి యగు మరుత్తుడు కూడా తల్లి దండ్రుల చరణములపై బడి నమస్కరించెను. అవీక్షితుడు మరుత్తుని ప్రీతిచే ఆలింగనము చేసుకొని ఈ విధముగా ఆశీర్వదించెను.

మానహా భవ శత్రూణాం చిరం పాలయ మేదినీమ్ పుత్ర పౌత్రైశ్చ మొదస్వ మా చ తే సన్తు విద్విషః తతో ద్విజై రనుజ్ఞాతౌ వీరయా చ నరేశ్వరౌ సమారూడౌ రథం సా చ భామినీ స్వపురం గతా వీరాపి కృత్వా సుమహ త్తపో ధర్మ భృతాం వరా భర్తుః సలోకతాం ప్రాప్తా మహాభాగా పతివ్రతా మరుత్తోపి చకారోర్వ్యాం ధర్మతః పరిపాలనమ్ వినిర్జితా రిషద్వర్గో భోగాంశ్చ బుభుజే నృపః తస్యపత్నీ మహాభాగా విదర్భ తనయా తథా ప్రభావతీ సువీరస్య సౌవీరీ చాభవ త్సుతా సుకేశీ కేతువీర్యస్య మాగధస్యా త్మజాభవత్ సుతా చ సింధు వీర్యస్య మద్రరాజస్య కేకయీ కేకయస్య చ సైరంద్రీ సింధు భర్తు ర్వపుష్మతీ చేదిరాజసుతా చాభూ ద్భార్యా తస్య సుశోభానా  

“శత్రువుల మానమును నాశనము చేయు వాడ వగుదువు గాక సదా భూమిని పాలింపుము. పుత్రా పౌత్రాదులచే సుఖముగా కాలమును గడుపుము. మరియు నీ శత్రువులు నాశనమును పొందుదురు గాక” పిమ్మట బ్రాహ్మణుల మరియు వీరి యొక్క ఆజ్ఞను పొంది రాజు లిద్దరు భామినిని రథముపై ఎక్కించుకొని తమ నగరమునకు వెళ్ళిరి. మరుత్త రాజు కూడ నలు దిక్కులా నున్న శత్రువులను ఓడించి, ధర్మానుసారముగా పృథ్వీ పాలన చేయుచూ అనేక భోగ సుఖము లనుభవించెను. విదర్భ కన్య మహాభాగ యగు ప్రభావతి, సువీరుని కన్యయగు సౌవీరీ, మగధీశ్వరుడగు కేతువీర్యుని కుమార్తె “సుకేశీ”, ముద్ర రాజగు సింధు వీర్యుని పుత్రిక, కేకయుని కుమార్తె “కేకయీ”, సింధు రాజు యొక్క పుత్రిక “సైందవీ” మరియు చేది రాజు యొక్క కన్య “వపుష్మతి” ఈ యందరు లలనామణులు అతనికి భార్యలైరి.

తాసాం పుత్రాస్తస్య చాస న్భూభృతోష్టాదశ ద్విజః తేషాం ప్రధానో జ్యేష్టశ్చ నరిష్యం తః సుతోభవత్ ఏవంర్యో మరుత్తోభూ న్మహారాజో మహాబలః తస్యా ప్రతిహతం చక్ర ద్ద్వీపేషు సప్తసు యస్య తుల్యోపరో రాజా న భూతో న భవిష్యతి సత్త్వ విక్రమ యుక్తస్య రాజర్షేరమితౌజసః తస్యై తచ్చరితం శ్రుత్వా మరుత్తస్య మహాత్మనః జన్మ చాగ్ర్యం ద్విజశ్రేష్ఠః ముచ్యతే సర్వ కిల్బిషైః

ఓ ద్విజుడా! ఈ భార్యల గర్భము నుండి ఆ రాజుకు పదునెనిమిది మంది పుత్రులు జన్మించిరి. వారిలో “నరిష్యంతు”డను పుత్రుడు జ్యేష్టుడు మరియు శ్రేష్టుడు. మహారాజు, మహా బలవంతుడు నగు మరుత్తుని వీర్యము ఎట్టిదన ఏడు ద్వీపము లందును అతని చక్రము అప్రహతిమై యుండెను. బల విక్రమశాలి, అమిత తేజస్సుడగు ఆ రాజర్షితో సమానుడగు వేరు రాజు పుట్ట లేదు. మరియు పుట్ట బోడు. ఓ ద్విజశ్రేష్టా! ఆ మహాత్ముడగు మరుత్తుని చరిత్ర విని నంతనే సంపూర్ణ పాపముల నుండి విముక్తిని పొందుదురు. మరియు మరణించిన పిమ్మట శ్రేష్ఠ మగు జన్మను పొందుదురు.