2 - చటకోత్పత్తి కథనము

మార్కండేయుడు:

అరిష్టనేమి పుత్రో భూద్ గరుడో నామ పక్షిరాట్

గరుడస్యా భవత్ పుత్రః సంపాతి రితి విశ్రుతః తస్యా ప్యాసీత్ సుతస్సూరః సుపార్శ్వో వాయు విక్రమః  సుపార్శ్వ తనయః కుంతిః కుంతీ పుత్రః ప్రలోలువః

తస్యాపి తనయా వాస్తాం కంకః కందర ఏవ చ కంకః కైలాస శిఖరే విద్యుద్రూపేతి విశ్రుతమ్ దదార్శాంబుజ పత్రాక్షం రాక్షసం ధనదానుగమ్

ఆపానాసక్త మమల స్రగ్దామాంబర ధారిణమ్  భార్యా సహాయ మాసీనం శిలా పట్టే మేల్ శుభే

తద్ దృష్ట మాత్రం కంకేన రక్షః క్రోద సమన్వితమ్ ప్రోవాచ కస్మాదాయక స్త్వమితో హ్యండ జాధమః

స్త్రీ సన్నికర్షే తిష్ఠంతంకస్మాన్మా ముపసర్పసి  నైష ధర్మ స్సుబుద్దీనాం మిథో నిష్పా ద్యవ స్తుషు

మార్కండేయుడు:

అరిష్టనేమియను వానికి పక్షి రాజగు గరుత్మంతుడను కుమారుడుండెను. ఆ గరుత్మంతునకు సంపాతియను కుమారుడు గలడు. సంపాతికి వాయు దేవునితో సాటియగు పరాక్రమము, మహాశౌర్యము గల సుపార్శ్వుడు సుతుడు. సుపార్శ్వుని కుమారుడు కుంతి. కుంతి పుత్రుడు ప్రలోలుపుడు. ప్రలోలుపునకు కంకుడు, కందరుడు అను ఇద్దరు కుమారులు ఉండిరి. కంకుడొకనాడు కైలాస పర్వతమున, పద్మ పత్రముల బ్రోలు నేత్రములు కలవాడును కుబేరుని  అనుచరుడు అగు విద్యుద్రూపుడను రాక్షసుని జూచెను. పానాసక్తుడైన ఆ రాక్షసుడు తెల్లని పుష్ప మాలలు వస్త్రములు ధరించి భార్యా సహాయుడై శుభము, నిర్మలమగు శిలాఫలకము నందు గూర్చొని యుండగా చూసెను. కంకుడు చూచుటచే రాక్షసునకు కోపము వచ్చెను. “ఓరీ ఖగాధమా! నీవిచ్చటి కెందులకు వచ్చితివని” యనెను. భార్యా సహితుడనై యున్న నా సమీపమునకు వచ్చుట కేమి కారణము? బుద్ది మంతులగు వారు స్త్రీ పురుషు లుండు నట్టి ఏకాంత రహస్య ప్రదేశముల జొచ్చుట యధర్మము గాన సమీపించరు.

కంకుడు:

సా ధా రణోయం శైలేంద్రో యథా తవ తథా మమ అన్వేషాం చై వ జంతూనాం మమతా భావతోత్ర కా?

కంకుడు:

ఓరీ రాక్షసా! ఈ శైలేంద్రము అందరికి సర్వ సాధారణ మైనది. నీకెట్లో నాకునూ అంతే. మనకే గాదు, సర్వ జంతువులకును గూడ నంతియే. ఇచ్చట నీకీ మమకార మెందులకు?

మార్కండేయుడు:

బృవాణ మిత్థం ఖడ్గేన కంకం చిచ్చేద రాక్షసః క్షరత్ క్షతజ భీభత్సం విస్పురంత మచేతనమ్

కంకం వినిహతం శ్రుత్వా కందరః క్రోధ మూర్చితః  విద్యుద్ రూప వధాయాశు మన శ్చ క్రేండజేశ్వరః

స గత్వా శైల శిఖరం కంకో యత్ర హతః స్తితః  తస్య సంకలనం చక్రే భ్రాతుర్జ్యేష్టస్య ఖేచరః

కోపామర్ష వివ్రుత్తాక్షో నాగేంద్ర ఇవ నిస్వసన్ జగామాథ స యత్రాస్తే భ్రాత్రుహా త స్య రాక్షసః  పక్షవాతేన మహతా చాలయన్ భూధరా స్వరాన్

వేగాత్ పయోద జాలాని విక్షిపన్ క్షత జేక్షణః  క్షణాత్ క్షయిత శత్రుస్స క్షాభ్యాపం క్రాంత భూధరః

మార్కండేయుడు:

ఆ రాక్షసుడు ఇట్లు పలుకు చున్న కంకుని శిరస్సును తక్షణమే కోపముతో ఖండించెను. శిరచ్చేదముచే నెత్తురు గారుట వలన భయంకరముగా నుండి కంకుడు అచేతనుడై మరణించెను. క్రోధ మూర్చితు డైన ఆతని సోదరుడగు కంధరుడు కంకుని మరణ వార్త విని విద్యుద్రూపుని సంహరింప నిశ్చయించెను. అనంతరము అన్నయగు కంధరుడు కంకుడు మరణించిన కైలాస పర్వత మందే యాతని అంత్య కర్మ జేసెను. పిమ్మట కంధరుడు కోపము చేతను, అసహనము చేతను, నేత్రములు పెద్దవి చేయుచూ, సర్పము వలె బుసలు గొట్టుచూ సోదర హంతకుడగు రాక్షసుడున్న చోటికి బోయెను. అతడు బయలు దేరిన సమయమున గొప్పదగు రెక్కల గాలిచే పెద్ద పెద్ద పర్వతములు కంపించెను. వేగము వలన సముద్ర జలములు కల్లోలము లయ్యెను. కంధరుడు ఎఱ్ఱ బడిన కన్నులు గలవాడై, క్షణ మాత్రములో కైలాస పర్వతము నాక్రమించెను.

పానాసక్త మతిం తత్ర తం దదర్శ నిశాచరమ్  ఆతామ్ర నక్త్ర నయనమ్ హేమ పర్యంక మాశ్రితమ్

స్రగ్ దామాపూరిత శిఖం హరి చందన భూషితమ్  కేతకీ పత్ర గర్భా భై ర్దంతై ర్ఘోర తరాన మ్

వామోరు మాశ్రితాం చాస్య దదర్శాయత లో చనమ్  పత్నీం మదనికాం నామ పుంస్కోకిల కల స్వనీమ్

తతో రోష పరీతాత్మా కంధరః కందర స్తితమ్  తమువాచ సుదుష్టాత్మ న్నేహి యుధ్యస్వ వై మయా

యస్మాజ్జ్యేష్టో మమ భ్రాతా విస్రబ్దో ఘాటిత స్త్వయా  తస్మాత్ త్వాం మదసంసక్తం నయిష్యే యమ సాధనమ్

పక్షి శ్రేష్ఠుడగు కంధరుడు పర్వతము యొక్క పై భాగమున సువర్ణ శయ్య నాసీనుడై మధ్య పానముచే ఎఱ్ఱని కన్నులు, ముఖము గల విద్యుద్రూపుడను రాక్షసుని జూచెను. ఆ రాక్షసుడు శిఖ యందు పూల మాలలు ధరించి శరీరమంతట మంచి గంధము బూసుకొని కేతకీ పత్రముల వలె తెల్లని దంత పంక్తితో ఘోర రూపమున ప్రకాశించు చుండెను. కంధరుడు పుంస్కోకిల కంఠ ద్వని కలిగి నట్టిదియు, విశాలమగు నేత్రములు గలదియు, రాక్షసుని ఎడమ తోడ యందున్న యతని భార్యయగు మదనికను గూడ చూసెను. అనంతరము పక్షి శ్రేష్టుడగు కందరు డత్యంత కోపముతో పర్వత గుహ యందు గూర్చొని యున్న రాక్షసుని జూచి “ఓరీ! దుష్టాత్ముడా! నాతో యుద్ధము జేయమనెను. నీవు మదోన్మత్తుడవై నాయన్న యగు కంకుని చంపితివి. ఇందు వలన ఇప్పుడు మద సంసక్తుడవగు నిన్ను యమ సదనమున కనిపెదను.

విస్వస్తఘాతినాంలోకా యే చ స్త్రీ బాల ఘాతినామ్  యాస్యసే నిరయాన్ సర్వాం స్తాం స్త్వ మధ్య మయా హతః

నాచే జంపబడి, విశ్వాస ఘాతకులు, స్త్రీ హత్యలు, బాల హత్యలు జేసిన పాపులు బోవు నరకమునకు బోయెదవు గాక.

మార్కండేయుడు:

 ఇత్యేవం పతగేంద్రేణ ప్రోక్తం స్త్రీ సన్నిదౌ తదా రక్షః క్రోధ సమావిష్టం ప్రత్యభాషత పక్షిణమ్ యది తే సహతో భ్రాతా పౌరుషం తద్ది దర్శితమ్  త్వామప్యద్య హనిష్యేహం ఖడ్గేనా నేన ఖే చరః

తిష్ట క్షణం యత్ర జీవన్ పతగాధమ యాస్యసి  ఇత్యుక్త్వాంజన పుంజాభం విమలం ఖడ్గ మాదదే

తతః పతగ రాజస్య యక్షాధిప భటస్య చ  బభూవ యుద్ధ మతులం యథా గరుడ శక్రయోః

తతః స రాక్షసః క్రోదాత్ ఖడ్గ మావిధ్య వేవత్  చిక్షేప పతగేంద్రాయ నిర్వాణాగార వర్చసమ్

మార్కండేయుడు:

స్త్రీ సన్నిధానమున పక్షి రాజు ఈ ప్రకారము పలుకగా ఆ రాక్షసుడప్పుడు క్రోదావిష్టుడగు పక్షి రాజుతో తిరిగి పల్కెను. ఓరీ! ఖేచరా! నీ సోదరుని జంపి నా పౌరుష మెట్టిదో చూపితిని. ఇప్పుడు నిన్ను కూడ నీ ఖడ్గము చేతనే జంపి వైచెదను. ఓరీ! అథమ పక్షీ! క్షణ మాత్రము నిలువుము. ఇక్కడ నుండి బ్రతికి పోజాలవు అని పలికి కాటుక వలె నల్లని నిర్మలమగు ఖడ్గమును గ్రహించెను. పూర్వము దేవేంద్ర, గరుత్మంతులకు జరిగినట్లు పక్షిరాజ, యక్షరాజ భటులకు మహా యుద్ధము జరిగెను. అనంతర మా రాక్షసుడు కోపముతో నిర్వాణాంగారము (బొగ్గు) వలె నల్లనిదగు ఖడ్గమును వేగముగా పక్షిరాజు మీదకు విసిరి వైచెను.

పతగేంద్ర శ్చ తం ఖడ్గం కించి దుత్క్రుత్య భూతలాత్  వక్రేణ జగ్రాహ తదా గరుడః పన్నగం యథా

వక్త్ర పాద తలై ర్భం క్త్వా చక్రే క్షోభ మతాండజః  తస్మిన్ భగ్నే తతః ఖడ్గే బాహు యుద్ద మవర్తత

తతః పతగ రాజెన వక్షస్యాక్రమ్య రాక్షసః  హస్త పాద కరై రాశు శిరసా చ వియోజితః

తస్మిన్ వినిహతే సా స్త్రీ ఖగం శరణ మభ్యగాత్ కించిత్ సంజాత సంత్రాసా ప్రాహ భార్యా భవామి తే

తామాదాయ ఖగశ్రేష్ఠః స్వకం గృహ మగాత్ పునః  గత్వా స నిష్కృతింభ్రాతు ర్విద్యుద్రూప నిపాతనాత్

కంధరస్య చ సా వేశ్మ ప్రాప్యేచ్చా రూపధారిణీ  మేనకా తనయా సుభ్రూః సౌపర్ణం రూప మాదదే

పక్షి రాజా ఖడ్గమును గరుత్మంతుడు సర్పమును గ్రహించు రీతిగా భూతలము నుండి కొంచెముగా పైకెగిరి ముట్టెతో పట్టుకొనెను. అట్లు పట్టుకొనిన యా ఖడ్గమును ముట్టెతో, కాళ్ళతో విరిచి క్షోభమును కలిగించెను. ఆ ఖడ్గమట్లు భగ్నమైన తదుపరి బాహు యుద్ధ మయ్యెను. అనంతరము ఆ పక్షి రాజు రాక్షసుని రొమ్మునెక్కి చేతులను, పాదములను, శిరస్సును దేహము నుండి వేరు చేసెను. అట్లా రాక్షసుడు చచ్చిన పిమ్మట వాని భార్యయగు “మదనిక” భయ వ్యాకుల చిత్తురాలై, ఖగరాజును శరణు బొందేను. నీకు భార్య నయ్యెదనని పలికెను. ఖగ శ్రేష్ఠుడగు నా కందరుడప్పు డామెను దీసికొని తన ఇంటికి వచ్చెను. ఇట్లు తన సోదరుడగు విద్యుద్రూపుని చంపుట వలన కలిగిన దుఃఖమునకు ప్రతీకారముగా ఆ రాక్షసుని చంపి సోదరునికి నిష్కృతి గావించెను. మేనకా తనయయగు మదనిక పక్షి రాజగు కంధరుని యింటికి పోయిన బిమ్మట స్వేచ్చా రూప ధారిణి యగుటచే తాను గూడ పక్షి రూపమును పొందెను.

తస్యాం స జనయామాస తార్క్షీం నామ సుతాం తదా  ముని శాపాగ్ని విపుష్టాం వపు మప్సర సాంవరామ్

తస్యా నామ తదా చక్రే తార్క్షీమితి విహంగమః మందపాల సుతాశ్చాసం శ్చత్వారో మితబుద్దయః  జరితారి ప్రభృతయో ద్రోణాంతా ద్విజ సత్తమః

తేషాం జఘన్యో ధర్మాత్మా వేదవేదాంగ పారగః  ఉపయేమే స తాం తార్క్షీం కంధరా నుమతే శుభామ్

కస్య చిత్త్వథ కాలస్య తార్క్షీ గర్భ మవాపహ  సప్తపక్షాహితే గర్భే కురుక్షేత్రం జగామ సా

కురుపాండవ యోర్యుద్దే వర్తమానే సుదారుణే  భావిత్వా చ్చైవ కార్యస్య రథమద్యే వివేశ సా

అప్పుడా కందరుడు పక్షి రూపధారిణి యగు ఆ మదనిక యందు, దుర్వాస శాపమను అగ్నిచే దగ్ధురాలు, అప్సరసలలో శ్రేష్ఠు రాలునగు వపువను నామెను పుత్రికగా గనెను. పక్షిరాజు ‘తార్క్షీ’ యని ఆమెకు పేరు పెట్టెను. ద్విజ సత్తములారా ఇట్లుండ, మందపాలుడను బ్రాహ్మణునకు నల్వురు కుమారులు గలరు. వారిలో “జరితారి” మొదటి వాడు. చివరి వాడు “ద్రోణుడు”. వారిలో నా ద్రోణుడు ధర్మాత్ముడు, వేద వేదాంగ నిష్ణాతుడు. కందరుని యనుమతముగా నా తార్క్షీయను నామెను వివాహము జేసికొనెను. కొంత కాలమునకు తార్క్షీ గర్భము ధరించెను. గర్భము ధరించిన మూడు మాసముల పదునేను రోజులగుచుండ నామె కురుక్షేత్రమునకు పోయెను. ఆ సమయమున అచట కౌరవులకు, పాండవులకు జరుగు మహా దారుణ యుద్ధము నందు, భవితవ్య మట్లుండుట వలన రథము యొక్క మధ్య భాగమున జొచ్చెను.

తత్రాపశ్యత యుద్ధం సా సర్వేషాం పృథివీక్షితామ్  శరశ క్త్యష్టిభిర్భీమం యథా దేవాసురం రణమ్

తత్రాపశ్యత్తదా యుద్ధం భగదత్త కిరీటినోః నిరంతరం శ రై రాసీ దాకాశం శలభై రివ

పార్థ కోదండ నిర్ముక్త మాసన్న మతి వేగవత్  తస్యా భల్ల మహిశ్యామం త్వచం చిచ్చేద జాఠరీమ్

భిన్నే కోష్టే శశాంకాభం భూమా వండ చతుష్టయం  ఆయుషః సావ శేషత్వా త్తూల రాశావివాపతత్

తత్పాత సమకాలం చ సుప్రతీకాద్గజోత్తమాత్  పపాత మహతీ ఘంటా బాణ సంచిన్న బంధనా

అచ్చట నా తార్క్షీ సమస్త రాజులు శర, శక్తి మొదలగు ఆయుధములతో భయంకరముగా యుద్ధము జేయుట జూచెను. ఆ యుద్ధము దేవాసుర యుద్ధము వలె నుండెను. మరియు నచ్చట భగదత్తార్జునులు యుద్ధము జేయు చుండుట చూసెను. వారి బాణములచే నాకాశ మంతయూ ఎడము కాన రాకుండా శలభముల చేత కప్పబడిన దాని వలె నయ్యెను. అర్జున కోదండము నుండి యొక బాణము వెడలెను. అది నల్లని త్రాచుపాము వలె నుండి అతి వేగముతో వచ్చి అచట నున్న తార్క్షీ యొక్క గర్భచ్చేదము గావించెను. గర్భచ్చేదమైన వెంటనే నాలుగు అండములు భూమి మీద పడెను. అవి చంద్రుని బోలి యుండెను. ఆయుష్యము కలిగి యున్నందున ఆ అండములు దూది కుప్ప మీద బడినట్లు పడెను. ఆ అండములు క్రింద పడిన యదే సమయమున నొక ఏనుగు కంఠమందలి ఘంట నేలమీద పడెను. ఆ ఏనుగు పేరు సుప్రతీక మందురు. అది భగదత్తుని వాహనము. అర్జునుడా ఘంటను బాణముచే చేదించెను.

సమం సమంతా త్ప్రాప్తాతు ధరణీతలా  చాదయంతీ ఖమండాని స్తితాని పిశితోపరి హతే చ తస్మిన్నృపతౌ భాగాదట్టే నరేశ్వ రే  బహున్యహాన్య భూద్యుద్ధం కురు పాండవ సైన్యాయోః

వృత్తే యుద్ధే ధర్మ పుత్రే గతే శాంతనవాంతికమ్  భీష్మస్య గదతో శేషాన్ శ్రోతుం ధర్మాన్మహాత్మనః

ఘంటాగతాని తిష్టంతి యత్రాండాని ద్విజోత్తమ  ఆజగామ తముద్దేశం శామీకో నామ సంయమీ

స తత్ర శబ్దమశ్రుణో చ్చీచీకూచీతి వాశాతామ్  బాల్యాదస్పుటవాఖ్యానాం విజ్ఞానే పి పరే సతి

ఆ గంట పడుటచే భూమి బద్దలయ్యెను. ఆ నాలుగండముల మీద బడెను. వాటి కే మాత్రము హాని కలుగ కుండా రక్షణగా పైన గప్పి వైచెను. రాజైన భగదత్తుడు పిమ్మట యుద్ద మందు జనిపోయెను. పిమ్మట కౌరవ, పాండవ సైన్యముల పోరాటము చాలా రోజులు జరిగెను. అట్లు యుధ్ధము ముగిసిన తదుపరి ధర్మరాజు భీష్మాచార్యుని సమీపమునకు సమస్త ధర్మములను వినుటకు వెళ్ళెను. ఆ సమయమున ద్విజోత్తమా! శమీకుడను మునీశ్వరుడు గంటచే నాచ్చాదింపబడి రక్షణ బొండుచున్న, యా అండములున్న ప్రదేశమునకు వచ్చెను. ఆ మహర్షి యా గంటలో “చిచీకుచీ”యని కూయు చున్న శబ్దమును వినెను. ఆ పక్షి పిల్లలు గొప్ప విజ్ఞానము గలవైననూ చిన్న తనముచే వాక్యములు ప్రస్ఫుటముగా నుండెను.

అథర్షి శిష్య సహితో ఘంతాముత్పాట్య విస్మితః అమాతృపితృ పక్షాని శిశుకాణి దదర్శ సః

తాని తత్ర తథా భూమౌ శమికో భగవాన్మునిః  దృష్ట్వా స విస్మయా విష్టః ప్రోవాచా నుగాతాన్ద్వి జాన్

సమ్యగుక్తం ద్విజా గ్ర్యే ణ శుక్రేణోశనసా స్వయమ్  పలాయన పరం దృష్ట్వా దైత్య సైన్యం సురార్ధితమ్

న గంతవ్యం నివర్తద్వం కస్మాద్వ్ర జత కాతరాః  ఉత్సృజ్య శౌర్య యశసీ క్వ గతా న మరిష్యథ

నష్యతో యుధ్యతో వాపి తావద్భవతి జీవితమ్ యావద్దాతా సృజ త్పూర్వం న యావన్మనసేప్సితం

ఏకే మ్రియంతే స్వగృహే పలాయంతోపరే జనాః  భుజంతోన్నం తథైవాపః పిబంతో నిధనం గతా

అనంతరము ఆ మహర్షి శిష్య సహితుడై యా గంటను పైకి ఎత్తెను. మాతృ పితృ హీనములే గాక రెక్కలు గూడా రాని యా పక్షి పిల్లలను జూచి అత్యంత విస్మయము చెందెను. భగవానుడగు నా శమీక మహాముని యచ్చట ఆ విధముగా నేలమీద బడియున్న యా శిశువులను జూచి విస్మయా విష్ణుడై తన వెంబడి యున్న ద్విజ బాలకులతో నిట్లనియె: విప్ర బాలకులారా పూర్వము ద్విజ శ్రేష్టుడగు శుక్రాచార్యుడు దేవతలకు భయపడి పారిపోవు చున్న దైత్య సైన్యమును చూసి మంచి వాక్యము లనుపదేశించెను. వాటిని చెప్పెద వినుడు. దైత్య సైనికులారా! పారిపోకుడు. వెనుకకు మరలుడు. భయపడి పారిపోవుట ఎందులకు? మీ శౌర్యము, కీర్తిని బోగొట్టు కొని యెక్కడికి బోయెదరు? మృత్యువును దప్పించుకొన గలరా? పూర్వము బ్రహ్మ దేవుడు మన కర్మ ననుసరించి తన మనస్సున యెట్లు తలచునో యంత వరకు యుధ్ధము చేసిననూ నశించము. అంత వరకు మరణ భయముండదు. కొందరు స్వగృహ మందు మరణింతురు. కొందరు పారిపోవుచూ, కొందరు భుజించుచూ, కొందరు త్రాగుచూ మరణించిరి.

విలాసిన స్తథైవాన్యే కామయానా నిరామయాః అవిక్షతాంగాః శస్త్రైశ్చ ప్రేత రాజ వశం గతాః

అన్యే తపస్యభిరతా నీతాః ప్రేతరాజభటానుగైః  ( ప్రేత నృపానుగైః ఇత్యపి పాఠః )

యోగాభ్యాసే రాతాశ్చాన్యే నైవ ప్రాపు రమృత్యుతామ్ శంబరాయ పురా క్షిప్తం వజ్రం కులిశపాణినా  హృదయే భిహతస్తేన తథాపి న మరుతో సురః

తేనైవ ఖలు వజ్రేణ తేనై వేంద్రేణ దానవాః  ప్రాప్తే కాలే హతా దైత్యా స్తక్షణా న్నిధనం గతాః

విదిత్వైవం న సంత్రాసః కర్తవ్యో వినివర్తత  తతో నివృత్తాస్తే దైత్యా స్త్యక్త్వా మరణజం భయమ్

ఇతి శుక్ర వచ స్సత్యం కృత మేభిః ఖగోత్తమైః  యే యుద్ధే పి న సంప్రాప్తాః పంచత్వ మతిమానుషె

అటులనే కొందరు విలాసముగా నున్నవారు, కాముకులు, ఆరోగ్యవంతులు, శాస్త్రములచే క్షత గాత్రులు కానివారు, కాలవశులై చనిపోయిరి. కొందరు తపోనిష్టులై ఉండగా, మరికొందరు యోగాబ్యాసరతులై యుండగా యమ భటులచే తీసికొని పోబడిరి. ఎవ్వరు మృత్యువును పొందక యుండలేక పోయిరి. పూర్వము వజ్రపాణియై దేవేంద్రుడు శంబరాసురుని వక్ష స్థలమునకు వజ్రాయుధమును విసిరి వైచెను. అయిననూ నా శంభరాసురుడు చావలేదు. కాల మాసన్నమగు సరికి యా దేవేంద్రుడే యా వజ్రాయుధముచే సకల రాక్షసులను తత్ క్షణమే చంపి వైచెను. కావున మీరీ విషయమును తెలిసికొని భయము జెందకుడు. కర్తవ్యమునకై వెనుకకు మరలుడు. ఇట్లు చెప్పిన పిమ్మట నా దైత్యులు మృత్యు భయమును వీడి వెనుకకు మరలిరి. అతి మానుషమగు నిట్టి కురు పాండవ యుద్ధమున గూడ మృత్యువును బొందని ఈ పక్షి శిశువులు శుక్రాచార్యుని వచనములను సత్య మొనర్చినవి.

క్వాండానాం పతనం విప్రాః క్వ ఘంటా పతనం సమమ్  క్వ చ మాంస వసారక్తై ర్భూమే రాస్తరణ క్రియా

కే ప్యేతే సర్వథా విప్రా నైతే సామాన్య పక్షిణః  దైవానుకూలతా లోకే మహాభాగ్య ప్రదర్శినీ

ఏవ ముక్త్వా స తాన్వీక్ష్య పునర్వచన మబ్రవీత్  నివార్తతాశ్రమం యాత గృహీత్వా పక్షిబాలకాన్

మార్జారా ఖుభయం యత్ర నై శామండజజన్మనామ్  శ్యేనతో నకులా ద్వాపి స్థాప్యంతాంతత్ర పక్షిణః

ద్విజాః కింవాతియత్నేన మార్యంతే కర్మభిః స్వకైః  రక్షంతే చా ఖిలా జీవా యథై తే పక్షి బాలకాః

ద్విజ బాలకులారా! మాంస వసారక్తములచే నాచ్చాదింప బడిన భూమి యందు, అండములు గంటయు నేక కాలమున బడుట యెంత యాశ్చర్యము? ఈ పక్షి శిశువు లేమైననూ సామాన్యము లైనవి గాదని తెలియు చున్నది. బాలకులారా! లోకమున దైవానుకూల మున్నచో మహా భాగ్యములు కలుగు చుండును. ఆ మునీశ్వరుడిట్లు చెప్పి ఆ ముని బాలకుల జూచి మఱియు నిట్లనియె. పక్షి బాలకులను తీసికొని ఆశ్రమమునకు మరలి పొండు. పిల్లులు, యెలుకలు, ముంగిసలు మరియు నితరములగు పక్షుల యొక్క భయము లేని ప్రదేశము నందుంచుడు. విప్ర బాలకులారా! అతి ప్రయత్నమూ చేసిననూ ప్రయోజనమే ముండును? జీవులు వారు వారు చేసికొనిన కర్మలచే పుట్టు చుందురు. ఇంత వరకీ పక్షి శిశువుల నెవరు రక్షించిరి?

తథాపి యత్నః కర్తవ్యో నరైస్సర్వేషు కర్మసు కుర్వ న్పురుషకారం తు వాచ్యతాం యాతి నో సతామ్

ఇతి ముని వర చోదితా స్తతస్తే, ముని తనయాః పరిగృహ్య పక్షిణ స్తాన్ తరువిత పసమాశ్రితాలి సంఘం, యయురథ తాపసరమ్య మా శమం స్వమ్ స చాపి వన్యం మనసాభికామితం, ప్రగృహ్య మూలం కుసుమం ఫలం కుశాన్ చకార చక్రాయుధరుద్రవేదసాం, సురేంద్ర వైవస్వత జాతవేదసామ్ అపాంపతే ర్గీష్పతివి త్తరక్షిణోః, సమీరణస్యాపి తథా ద్విజోత్తమః ధాతుర్విధాతు స్త్వథ వైశ్వ దేవికాః, శృతి ప్రయుక్తా వివిధాస్తు సత్ క్రియాః

అట్లని యూరుకొన రాదు. అన్ని కర్మల యందును మానవుడు గట్టి ప్రయత్నము చేసి తీరవలయును. మానవ ప్రయత్నము జేసిననూ కానిచో వాని దోష ముండదు. సత్పురుషులచే నిందింప బడడు. ఇట్లు మునివర చోదితులగు నా ముని కుమారులా పక్షి బాలకులను తీసికొని తరువిటప సమాశ్రితములయి యున్న తుమ్మెదల గుంపులు గలదియు, తాపస రమ్యమునగు వారి యాశ్రమమునకు బోయిరి. ఆ శమీక మహర్షియు, తన కభీష్టములగు వన మందలి ఫల,మూల, పుష్ప, కుశలను సేకరించి, యాశ్రమమునకు బోయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యమ, అగ్ని దేవుల నారాధించెను. మరియు నా ద్విజోత్తముడు వాయు, వరుణ, బృహస్పతి, కుభేర, ధాత, విధాతల పూజలు, వేదోక్త వైశ్వ దేవాది వివిధములగు సత్ క్రియలు జేసెను.