4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

126 - అధ్యాయము

మూ॥ శ్రీనారాయణ ఉవాచ :

శ్రీభగవానువాచ :

రాధికోవాచ :

శ్రీనారాయణుడిట్లా –

గణేశపూజచేసి మాధవుడు యాదవులతో కూడా ఓనారద! దేవతలు, మునులు, ఇతరులు, దేవేరులు అందరితో కలసి (1) తన అంశగల దేవతలు, దేవేరులతో రుక్మిణి మొదలగు వారితో కలసి రమ్యమైన ద్వారకకు వెళ్ళాడు. స్వయంగా సిద్ధాశ్రమమందు ఉన్నాడు. (2) గోలోకమందున్న వారితో కూడి ప్రేమతో సంభాషణచేసి స్నేహితులైన గోపకులతో, నందునితో, తల్లిగోపిక యశోదతో సంభాషణ చేసి (3) తల్లితో, తండ్రితో సునీతి గల వారితో తగిన విధంగా మాట్లాడాడు. గోపాలురు, గోకులమందున్నవారు, బంధువర్గము అందరితో అప్పుడు ఇట్టన్నాడు. (4) శ్రీభగవానుడిట్లా – ఓతండ్రి! నందుడ! నంద ప్రజానికి వెళ్ళు, మాతండ్రి గారి ప్రాణమునకు ప్రియమైన ఓతల్లి! యశోద కీర్తిమంతురాల, మిక్కిలి ఆర్యురాల, నీవుకూడా వెళ్ళు. (5) మిగిలిన కాలాన్ని అనుభవించి, ఉత్తమమైన గోకులానికి వెళ్ళు. గోకులవాసులతో కూడా సాలోక్యముక్తిని ఇస్తాను. (6) అని పలికి భగవానుడైన కృష్ణుడు తండ్రి అనుమతితో రాధిక ఉన్నచోటికి వెళ్ళాడు. నందుడు గోకులానికి వెళ్ళాడు. (7) అందమైన, చిరునవ్వు నవ్వుతున్న ముత్యాల హారము ధరించిన రాధను చూచాడు. ఆమె పన్నెండేళ్ళ అమ్మాయిలా ఉంది. ఎప్పుడు స్థిరమైన యౌవ్వనం కలదానివలె ఉంది. (8) మూడు వందల కోట్ల గోపికలు ఆమె చుట్టూ ఉన్నారు. రత్నములతోచేసిన ఉన్నత ఆసనం పై ఆమె ఉన్నది. గోపికలు వెదురు కర్రలు చేత ధరించి ఉన్నారు. ఇప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. (9) దూరం నుండే శ్రీకృష్ణుని రాధ, ప్రాణవల్లభురాలగు ఆమె చూసింది. చిన్నపిల్లవాడి వేషము, మంచి వేషము, సుందరమైన వారికి నాయకుడిలా, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. (10) కొత్త మేఘమువలె (నీరిచ్చే మేఘం) శ్యామలవర్ణుడు, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు. ఒంటినిండా చందనం పూసుకున్నాడు, రత్నముల అలంకారములతో అలంకరింపబడ్డాడు. (11) తల పై మయూర పింఛాన్ని ధరించాడు. మాలతీ మాలతో అలంకరించుకున్నాడు. కొద్దినవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖం కలిగి ఉన్నాడు. భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు (12) వాడని, మనోహరమైన కమలాన్ని విలాసమునకై ధరించాడు, మురళిని చేతియందు కలిగియున్నాడు, చాలా ప్రశస్తమైన దర్పణం కలిగియున్నాడు. (13) అట్టి కృష్ణుని చూచి,వేగంగా లేచి, గోపికలతో పాటు, ఆదరంగా, చాలా భక్తితో నమస్కరించి పరమేశ్వరుని స్తుతించింది. (14) రాధిక ఇట్లా - ఈవేళ నాజన్మ సఫలమైంది. నా జీవనము మంచి జీవనమైంది, నీ స్నిగ్ధమైన ముఖచంద్రుణ్ణి,కళ్ళను, మనస్సును చూచానుకదా.(15) ఐదు ప్రాణములు నిగనిగనైనాయి. పరమాత్మ మంచిప్రియమైనవాడు. ఇద్దరికి ఆనందానికి మూలము. బంధు దర్శనము చాలా దుర్లభము కదా. (16) నేనుశోక సముద్రంలో మునిగి ఉన్నాను. విరహాగ్నితో కాలిపోయాను. నీచూపులనే అమృత వరంతో ఈవేళ బాగా తడుపబడ్డాను. మంచిశీలము (స్వభావము) కలిగింది. (17) నేను మంగళురాలను, మంగళాన్ని ఇచ్చేదాన్ని. నీతో కూడి శివబీజురాలినై నాను. నిన్ను చూడకుండా, నీవు లేకుండా శివస్వరూపురాలనైనా నిశ్చేష్టురాలనే, (18) నీవు దేహమందుంటే శరీరధారి శ్రీమంతుడు స్వయంగా శుచి, సర్వశక్తి స్వరూపురాలైనా, శివరూపురాలైనా నీవు వెళ్ళిపోతే అశుచి (19) సామాన్యంగా స్త్రీ పురుషుల విరహము చాలా భయంకరమైనది, ఓనాథ। పరమాత్మవిచ్ఛేదంతో శక్తులతో ప్రాణాలు వెళ్ళిపోతాయి.

శ్రీరాధికోఉవాచ :

అని పలికి రాధికదేవి, పరమాత్మను, ఈశ్వరుడిని ఆనందంతో పాదములకు అర్చన చేసి, ఆతని ఆసనం పై కూర్చో పెట్టింది. (21) శ్రీమాన్, కృష్ణుడు రత్నసింహాసనమందు రాధతో సహ కూర్చున్నాడు. గోపికలు ఎల్లప్పుడు తెల్లని చామరలతో ఆతనిని సేవించారు. (22) చందన అను స్త్రీ వాసనగల చందనమును హరి శరీరమందు ఉంచింది. రత్నమాల అను గోపిక చిరునవ్వుతో, రత్నమాలను ఆతని కంఠమందుంచింది. (23) పద్మావతి అను స్త్రీ పద్మములతో పద్మపూజించిన పాదపద్మములందు, అర్ఘ్యమును, జలము, దూర్వా, పుష్పములు, చందనము ఇచ్చింది. (24) మాలతి అను గోపిక, హరి, తల పై మాలతీ మాలను ఉంచింది. పార్వతి అను స్త్రీ చంప పుష్పముల గుత్తిని ఇచ్చింది. (25) పారిజాత అను గోపిక పారిజాత పుష్పాన్ని హరికి ఆనందంతో ఇచ్చింది. కదంబమాల అను గోపిక కర్పూరంతో కూడిన తాంబూలాన్ని, వాసనగల చల్లని నీటిని, కదంబమాలను, శుభమైన దాన్ని ఇచ్చింది. (26) కమల అను గోపిక చాలా కోమలురాలు, వాడిపోని, కమలమును విలాసము కొరకు అమూల్యమైన రత్నపు అద్దమును హరిచేతికి ఇచ్చింది. (27) సుందరి అను గోపిక, వరుణుడు ఇదివరలో ఇచ్చిన,సుందరమైన రెండు వస్త్రములను సాక్షాత్తుగోరోచనపు కాంతిగలవానిని, హరికి ఇచ్చింది. (28) ఒక సుదాముఖి! మధురమైన, మధువుతో నిండిన, మధుపాత్రను, సుధతో నిండిన, సుధాపాత్రను భక్తితో ఆమె హరికి ఇచ్చింది. (29) ఒక గోపిక చందనము పూయబడిన, వాడని మాలతీ పుష్పమాలల సమూహంతో అలంకరింపబడ్డ పుష్పశయ్యను ఏర్పరచింది. (30) శ్రేష్ఠ వజ్రములతో నిర్మింపబడ్డ మందిరంలో, చాలా మనోహరమైన దానిలో శ్రేష్ఠమణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, వీటిహారములతో అలంకరింపబడ్డ (31) కుంకుమ కస్తూరి వీనితో పూయబడ్డ గాలితో సుగంధము (వాసన) కలదిగా చేయబడ్డ, నూర్లకొలది రత్న దీపముల వెలుతురులతో చక్కగా దీపాలు కూర్చబడిన (32) అనేక వస్తువులతో కూడిన ధూపములతో ఎల్లప్పుడూ ధూపం వేయబడిన, రతిని కల్గించే శయ్యను ఏర్పరచి నవ్వుతూ గోపికలు వెళ్ళిపోయారు. (33) చాలా అందమైన చాలా మనోహరమైన పడకను రహస్యంగా చూచి, మాధవుడు రాధతో కూడి రతి మందిరంలోకి ప్రవేశించాడు. (34) ప్రేమకు తగిన (స్మర) రకరకాల హాస్యమును, పరిహాసమును, మదనాతురులైన వారిద్దరు పడకయందు చేసుకున్నారు. (35) కృష్ణునకు మాలను, వాసనగల తాంబూలాన్ని ఇచ్చింది. శ్యాముని రొమ్ముపై కస్తూరి కుంకుమలతో కూడిన చందనం పూసింది. (36) ఆసతి మంచి చంపక పూలతో కూడిన మాల)ను తల పై ఉంచింది. సహస్ర దళములతో కూడిన క్రీడా (విలాసమునకై) పద్మమును చేతికిచ్చింది. (37) మురళిని హస్తం నుండి పారేసి, రత్నదర్పణాన్ని ఇచ్చింది. వాడిపోని, పారిజాతపు పూవును ముందుంచింది. (38) రహస్యంగా మధురమైనమాటను రాధ మధురంగా పల్కింది. ఈమె నవ్వుతోంది, ఆతడు నవ్వుతున్నాడు శాంతంగా మనోహరంగా, స్త్రీ మనోహరంగా ఉన్నాడు. (39) శ్రీరాధ ఇట్లా - మంగళములకు నిలయమైన వానిని మంగళమును గూర్చి, క్షేమ ప్రశ్నను వేయటం వ్యర్థం. అన్ని మంగళములకు బీజమైన, మంగళాన్నిచ్చే, మంగళ స్వరూపడైన వాడిని మంగళ ప్రశ్నవేయడం వ్యర్థం (40) ఐనా ఇప్పుడు కుశల ప్రశ్నవేయటం సమయానికి తగినదే. లౌకిక వ్యవహారమైనా వేదములకన్న బలవత్తరమైనది.

ఓ రుక్మిణి కాంతుడ! క్షేమమా. సత్యభాకు ఈశుడ ఇప్పుడు క్షేమమా. ఆమె ఆజ్ఞతో మ హేంద్రునితో సమానంగా యుద్ధాన్ని అవలీలగా చేశావు. (42) పారిజాతపు చెట్టును స్వర్గంనుండి పెకిలించావు. అమరావతికి వెళ్ళి దేవతల జయించి చెట్టును ఆమెకిచ్చావని విన్నాను. (43) ఆ పారిజాతంతో పుణ్యకమనే వ్రతాన్ని చేసింది. సాధ్యుడవైన మనోహరుడవైన నిన్నే సంపూర్ణమందు దక్షిణగా ఇచ్చింది. (44) బ్రహ్మ, ఈశ, శేషులకు అసాధ్యుడవైన నీవు ఆమె కెట్లా సాధ్యుడవైనావు. అందరు స్త్రీల (భార్యల) కంటే సత్యభామను భరిస్తున్నావు. (45) రుక్మిణి యందు ప్రేమ, సౌభాగ్యము, అంతకు మించి గౌరవము. భయము అభిమానము ధన్యమైన సత్యభామ యందు ఎల్లప్పుడు అని విన్నాము. (46) ఓ జాంబవతీకాంతుడ! నాకు నిశ్చయమైన యదార్థమేమిటో చెప్పు. ఆ స్త్రీలందరిలో నీ ప్రేమ ఎవరి యందధికము. (47) శృంగారమందు, అన్ని భావములందు వారిలో రసికురాలు, పరురాలెవ్వరు. నీయందు మృదువుగా ప్రవర్తించేది (ప్రేమతో) తెలివికలది, ధన్యురాలు, చాలా మంచివ్రతము కలది. వారిలో ఎవతే ఉంది. (48) భర్త పై భావము యందు అనురక్తురాలైన భార్య భార్య, భార్యను రక్షించేవాడు నిజమైన భర్త. స్త్రీ పురుషులకు ప్రేమను మించినది ముల్లోకములలో మరొకటి లేదు. అదిచాలా దుర్లభము. (49) రసికురాలైన స్త్రీ, సతి, గుణవతి పతిని గుర్తిస్తుంది. గుణముల నెరిగిన, రసికుడైన, శూరుడైన, సుశీలుడైన వానిని ఎల్లప్పుడు మంచిరతియందు గుర్తిస్తుంది. (50) తుమ్మెద తేనె మీది ఆశతో పద్మం కొరకు దూరం నుండి పరుగెత్తుతుంది. కప్పకు, ఆసంగతి తెలియదు. దాని తల పై కాలు పెడుతుంది. (51) యంత్రము వాయించేవాడు సంగీతరసమెరుగును. యంత్రానికి తెలియదు. పాలరుచి తెలివికలవాడు గ్రహిస్తాడు. గంటెకో, గిన్నెకో తెలియదు. (52) సుఖమును అనుభవించే వారు బాగా పండిన పండు రుచిని తెలుసుకోగలరు. ఎప్పుడు ఒకేచోట ఉన్నటువంటి ఫలము గలవి (చెట్లు) కొంచెము కూడా తెలుసుకోలేవు. (53) కృషీవలుడు చాలా చల్లని నీటి రుచిని తెలుసుకుంటాడు. బావికాని, కుండకాని ఒకేచోట ఉన్నవి గుర్తించలేవు. (54) అన్నము యొక్క రుచికరమైన రసమును, పరమైన దానిని భోగులు తెలుసుకుంటారు. ఒక్కచోట ఉన్న పొలముకాని పాత్రగాని గ్రహించవు. (55) భోగ మెరిగినవాడు చందనము కోరేవాడు చందనపు వాసనను తెలుసుకోగలడు. బరువు మోసే గాడిదకాని, చందనపుగిన్నెకాని గ్రహించవు. (56) వేదములు కాని, బ్రహ్మ ఈశానాదులు కాని తెలుసుకోలేని వానిని, యోగులు, మునులు, సిద్ధులు తెలుసుకోలేని వానిని ఆడవారేమి తెలుసుకుంటారు. (57) నిత్యనూతనమైన సౌభాగ్యము,గౌరవము, ప్రేమ దుర్లభము. స్త్రీలకు, పరమైనది లేదు. క్షణంలో చూర్ణమౌతుంది. (58) ఓ ప్రభు! చాలా ఎక్కువైనది (ఎత్తైనది) పడిపోతుంది నిశ్చయము. వైష్ణవులను హింసించుట దూరం నుండే ఆపదలకు బీజము (59) శ్రీరాముని నేను శపించాను. ఆతడు నీ భక్తుడు, భక్తవత్సలుడు. శ్రీరాముని శాపంవల్ల నాకీ విపత్తి, ఓపుత్ర! (60) ఈశ్వరుడు ఎవనికి బంధువు, ఎవనికి, ప్రియమైనవాడు, ఎవరికి అప్రియుడు. ఎప్పుడూ భక్తితో ఆతనిని సాధించాలి. భక్తునకు ఆయన ఈశ్వరుడు (61) వానివాడే అని వేదం, వైదికులు, సజ్జనులు, పురాణములు చెప్తున్నాయి. మాధవుడు రాధకు సాధ్యుడు. ఆ భగవానుడు, అనే మాట నిష్పలమైనది.

గోప్య ఊచుః

శ్రీకృష్ణ ఉవాచ :

గణములతో కూడిన శంభుని జయించి, బాణునిచేతులు ఖండించి, భార్యతోకూడిన రుక్మిణీ పౌత్రుణ్ణి తెచ్చావు. (63) అహో! నీవు రాగానే రుక్మిణి ఏమన్నది. నీ ప్రేమ సమానంగానే ఉన్నదా లేదా గౌరవం పెరిగిందా (64) నీవు కురుపాండవయుద్ధంలో కౌరవుల చంపించావు. పాండవుల కోసం రాజులుచచ్చారు. పరమాత్మకు సామ్యమెక్కడిది. (65) సాక్షాత్తు మహేంద్రునకు కల్గిన, కౌంతేయుడైన అర్జునునకు రాజుల సమూహం మధ్యలో ఉండి నీవే సారథివైనావు. (66) శుదుడైన, మహాత్ముడైన భక్తుడైన, ఆభీష్ముడు సిగ్గుపడుతూ, పెద్ద సభలలో నీతో ఏమన్నాడు. (67) బ్రహ్మ ఈశ, శేష అను పేర్లుగల దేవతలు కూడా ఎట్లాచూచారు. అందరు భక్తసింహాలు, మరణించారు. ఆతడేమీ మాట్లాడలేదు. (68) నాలుగు వేదాలలో అనిర్వచనీయుడు, పురాణ ఇతిహాసములలోనూ అనిర్వచనీయుడు ప్రకృతికి పరుడు, ఈశ్వరుడు. (69) నిర్గుణుడు, నిరీహుడు, నిర్లిప్తుడు, అన్ని కర్మలకు,కర్మలు చేసేవారికి సాక్షిరూపుడు, భక్తులను అనుగ్రహించేందుకు రూ పెత్తిన వాడు. (70) పరంబ్రహ్మ పరంజ్యోతి, పరమేశ్వరుడు, పరాత్పరుడు, అందరికి పరమాత్మ, సూతుడైన నరుని రథముయందున్నాడు. (71) వృద్ధురాలు, క్షత్రియస్త్రీ, సంతానంలేనిది, అధికంగా అవయవములు కలది, అట్టి కుఱ్ఱయువకురాలై, నీతో స్పృశింపబడి అనుభవింపబడింది, ప్రాక్తన కర్మవల్ల, (72) నీమేనమామ కంసుని, నీవు ఎందుకు చంపావు. రాగలదు (డు) అని చెప్పి వెళ్ళాను. తిరిగిరాలేదు. (73) యాదవులనందరిని చంపి, ద్వారకను విభజించి, నిన్ను బంధించి తీసుకెళ్ళటానికి వచ్చిన ఈశ్వరిని జనులు వారించారు. (74) అని పలికి దేవి రాధిక చాలా పెద్దగా ఏడ్చింది. వెంటనే మూర్ఛపోయింది. నిశ్వాసములేనిదైంది. (75) గోపికలు గవాక్షజాలములందుండి విన్నారు, చూచారు. చూచి అంతా వచ్చారు. రాధ చచ్చింది అని అన్నారు. (76) రాధికను ఉరము నందుంచుకొని గట్టిగా వారంతా దుఃఖించారు. ఓ ప్రభు। హరి। నరహరి। రక్షించు రక్షించు అనివారన్నారు. (77) గోపికలిట్లా – ఓకృష్ణ! నీవేంచేశావు, నీవేం చేశావు. మా రాధ నీవల్ల చనిపోయింది. రాధను బ్రతికించు. నీకు క్షేమమగుగాక. మేము అడవికి వెళ్ళిపోతాము. (78) లేకున్న స్త్రీ హంతకుడని మా ఆడవాళ్ళమంతా నీకు బిరుదిస్తాము. (79) గోపికల మాట విని రాధికమాటను విని, మాధవుడు అన్నాడు. అమృతం వంటి చూపుతో ఆమెను బ్రతికించాడు. ఓ నారద! (80) ఏడుస్తూ, ఆమానిని, సతి, దేవి, రాధిక లేచింది. రొమ్మున అదుముకొని ఆగోపికలు మాటిమాటికి ఆమెకు చెప్పసాగారు. (81) శ్రీకృష్ణుడిట్లా – ఓరాధ! ఆధ్యాత్మికమైన పరమైన జ్ఞానాన్ని భోదిస్తాను, విను. దీనిని విని, మూరుడైన రైతు వెంటనే పండితుడౌతాడు. (82) జాతి పరంగా నేను జగత్తునకు స్వామిని. రుక్మిణి మొదలగు స్త్రీలకు స్వామికావటానికేముంది. కార్యకారణ రూపంగా నేను విడివిడిగా వ్యక్తుడనౌతాను, ఓ రాధ!

అను ॥ విశ్వములోని వారందరికి నేనొకడినే ఆత్మను జాతితో నేను స్వయంగా జ్యోతిర్మయుడను. అన్ని ప్రాణులలో వ్యక్తరూపంగా ఉన్నాను (వ్యక్తిగానున్నాను) బ్రహ్మమొదలు తృణాదుల వరకు అన్నిట ఉన్నాను. (84) ఒకడు తింటే మరోజనుడు సంతోషపడడు. ఆత్మయైన నాలోకి ఒకడుపోతే చచ్చినా, మరొకడు చక్కగా బ్రతుకుతాడు. (85) జాతిగానేను కృష్ణరూపుణ్. అందుకే స్వయంగా పరిపూర్ణుడను. గోలోకమందు గోకులమందు రమ్యమైన క్షేత్రమందు బృందావనమందు (86) రెండు చేతులతో, గోపవేషంతో శిశువుగా, స్వయంగా రాధ పతిని. గోపాలురు గోపికలు కామధేనువులు వీనితో కూడి (87) ఉంటాను. వైకుంఠంలో నాలుగు చేతులతో ఉంటాను రెండు రూపాలు నావి సనాతనుడను. లక్ష్మీ సరస్వతులకు కాంతుడను ఎల్లప్పుడూ శాంతివిగ్రహుడను. (88) మానసికమైన సింధుకన్య మర్త్యలక్ష్మికి భూమి పై పతిని. శ్వేతద్వీపమందు, పాలసముద్రమందు అక్కడా నాలుచేతులవాడినే, (89) నేను నారాయణ ఋషిని. నరుడు సనాతన ధర్మము. ధర్మాన్ని చెప్పేవాడు. ధర్మమందుండేవాడు. ధర్మమార్గాన్ని నడిపేవాడు (90) శాంతి, లక్ష్మీస్వరూపురాలు. ధర్మమందుండేది. పతివ్రత. ఇక్కడ ఆమెకు భర్తను నేను. ఈపుణ్యక్షేత్రమైన భారతమందు (91) సిద్ధికి ఈశుడను, సిద్ధిని ఇచ్చేవాడిని సాక్షాత్తు కపిలుడను. సతీపతిని. నేను రకరకాల రూపాలు ధరించేవాడిని, వ్యక్తి భేదంతో రూపాలు వేరు, ఓసుందరి! (92) ద్వారకలో రుక్మిణికి పతిని, ఎప్పుడూ నాలుచేతులవాడిని. శుభమైన సత్యభామ ఇంటియందు, నేను పాలసంద్రమందు పడుకునేవాడిని. (93) ఇతరుల ఇళ్ళలో నేను శరీర భేదంతో వేరువేరుగా ఉంటాను. నేను నారాయణ ఋషిని. ఈ ఫల్గుణుని సారథిని. (94) ఆ నరులలో ఋషి ధర్మపుత్రుడు నా అంశ. భూమిలో బలవంతుడు నన్ను పుష్కరక్షేత్రంలో తపస్సుతో సారథిగా కమ్మని ఆరాధించగా నేను సారథినయ్యాను. (95) నీవు గోలోకంలో గోకులంలో రాధికవుదేవివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. నీవే సరస్వతి. (96) నీవు మృత్యులక్ష్మివి. పాలసంద్రంలో పడుకునేవాని ప్రియవు. నీవు ధర్మపుత్రుని వధువువు. శాంతి, లక్ష్మీ స్వరూపురాలవు. (97) కపిలుని ప్రియకాంతవు. భారతదేశమందు భారతి అను స్త్రీవి. మిథిలలో నీవు సీతవు. నీఛాయ ద్రౌపదిపతి. (98) ద్వారవతిలో మహాలక్ష్మివి నీవు రుక్మిణి అను సతివి. పంచపాండవులకు నీవు ఒకకళగా ప్రియవు. (99) రావణునితో అపహరింపబడ్డ దానవు నీవు. నీవు రాముని భార్యవు. నీకెట్లా నానా రూపాలుగల దానవో ఛాయగా, కళగా ఉంటావో (100) అట్లానేనూ నానా రూపాలు గల వాడినే నా అంశంతో, నా కళాభాగంతో నేను పరిపూర్ణతముడను, పరమాత్మను పరాత్పరుడను. (101) అని నీకు ఈ ఆధ్యాత్మిక విషయమంతా ఓసతి! చెప్పాను. ఓ పరమేశ్వరి! రాధ! నా సర్వాపరాధములను క్షమించు (102) శ్రీకృష్ణుని మాటవినిరాధిక ఆనందించింది. గోపికలు ఆనందించి పరమేశ్వరునకు నమస్కరించారు (103) అని బ్రహ్మవైవర్తమహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నాదర సంవాద మందు నూట ఇరవై ఆరవ అధ్యాయము.