4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

69 - అధ్యాయము

మూ॥ నారద ఉవాచ:

శ్రీనారాయణ ఉవాచ :

అను! నారదుడిట్లన్నాడు: ఈపిదప రాధకేశవుల రహస్యమేమిటో చెప్పు. అస్పష్టమైన, నిగూఢమైన తత్వమును దానిని నాకు వ్యాఖ్యానించగలవు అనగా (1) శ్రీనారాయణుని వచనమిట్లా - ఓ నారద! పరమ అద్భుతమైన రహస్యాన్ని చెబుతాను, విను . వేదములలో, పురాణములలో, పురా విదులకు దాచతగిన దానిని చెబుతాను. (2) విభువు! స్వేచ్ఛామయుడు, భగవంతుడైన కృష్ణుడు తిరిగిన కాముడైనాడు. విదగుడు, విదగ్ధయైన (నేర్పరి) రమతో కూడి ఆతడు రమించాడు. (3) చతుష్టష్టికళల శక్తితో, కళావతియైన కాంత వలె, కామశాస్త్రములందు నిపుణమైన విదగ్ధయైన, ఆరసికేశ్వరి, (4) శృంగార లీలలందు నిపుణురాలైన, ఎల్లప్పుడు కామముగల ఆకాముకి, సుందర స్త్రీ లందే సుందరురాలైన, ఎల్లప్పుడు, స్థిరమైన యౌవనముగల ఆమె (5) తలిదండ్రులకు మనస్సంకల్పముతో కల్గిన కన్య, ధన్యురాలు, మాన్యురాలు ఐన ఆమానిని, శంభునకు శిష్యురాలు, జ్ఞానం కలది శతకల్పాంతముల కాలము జీవించే ఆమె (6)వేద వేదాంగములలో నిపుణురాలు, యోగనీతియందు విశారదురాలు, నానా రూపముల ధరించేది, సాధ్వి, సిద్ధయోగిని అని ప్రసిద్ధమైన ఆమె, (7) ఆకన్య దేవి, రాధిక, మాతతో సమానము, కాముకి కూడా. ఆ సుశీల స్వామిని గూర్చి రకరకాల భావములను ప్రకటించింది. (8) రాసరసమందు ఉత్సుకుడైన ఆతడు విశిష్టురాలైన ఆమెతో కూడి, రాసక్రీడయందు చతుః షష్టికళలకు సరితూగేట్టుగా శృంగారమాచరించాడు. (9) గోటికొనలతో పిరుదు భాగములను గిల్లి, ఆమె రొమ్ములను గోళ్ళతో గిల్లి చందనము సింధూరము చెదిరిపోగా, తలవెంట్రుకలు (కొప్పు) విడిపోయి ఉన్న ఆ సతిని (10) సుఖసంభోగమందు మునిగి, నగ్నంగా, శోకమూర్చితమై ఉన్న, శరీరమంతా గగుర్పాటు కలిగి, ఉన్న , ఆనిద్రాదేవిని చేరాడు (11) నిద్రిస్తున్న ఆమెను జూచి కృష్ణుడు, కృపానిధి, కృపతో, మాయకు ఈశుడైన ఆతడు, లోకములకు తెలియజేసే కొరకు, ఆమాయగాడు, మాయగా (అమాయకంగా) ఏడ్చాడు. (12) రాధను వక్షమందుంచుకొని మాటిమాటికి ముద్దాడాడు. కన్నీళ్ళతో స్నాతమైన, ఆప్రాణాధిష్ఠాతృదేవతను (13) ప్రాణాధికురాలైన ప్రియతమను వస్త్రములను ధరింపజేశాడు (వస్త్రములు కట్టాడు). ఆ వస్త్రములు వహ్నితో శుద్ధమైనవి. అతి సూక్ష్మమైనవి. అమూల్యమైనవి. విశ్వమందు లభింప శక్యముకానివి (14) కొప్పుముడివేశాడు (వెంట్రుకలు కూర్చాడు). కుంకుమ చందనములు ఇచ్చాడు (పెట్టాడు) ఆమె మెడయందు, శరీరమందు అమూల్యమైన రత్నహారము వేశాడు. (15) సీమంతము యొక్క క్రింద భాగమందు,స్వచ్ఛమైన చోట ఆమెకు సిందూరం పెట్టాడు. చందనపు చుక్కలతో కూడిన, దానిమ్మపువ్వు లాంటి ఆకారంలో సింధూరం పెట్టాడు (16) గండభాగమందు (చెక్కిలి) నానా చిత్ర విచిత్రములు కల పద్మకమును పెట్టాడు (పద్మం చిత్రించాడు). ఆమె పాదపద్మములందు, రత్నములతో చేసిన కాలిఅందెలను అలకంరించాడు. (17) పాదముల వేళ్ళగోళ్ళకొనలలో సుందరమైన లత్తుక పూశాడు. రకరకాలైన మంచి వేషములతో వెలిగిపోతున్న, నిద్రలో మునిగిన ఆమెను విభుడు (18) మోహంతో తనకిష్టమైన గాఢాలింగనమును చేశాడు (కౌగిలించుకున్నాడు) తిరిగి ముద్దాడి, తన వక్షమందుంచుకొని, (19) విరహంతో అధీరుడై, జగత్తులకు స్వామియైన, ఆకామి, నిద్రించాడు. ఈ మధ్యకాలంలో, లోకపితామహుడైన బ్రహ్మ.

బ్రహ్మోవాచ :

బ్రహ్మఉవాచ:

అను ॥ శివుడు, శేషుడు మొదలగు దేవతలతో, మునీంద్రులతో కూడా వచ్చాడు. వచ్చి, శిరస్సు వంచి నమస్కరించి, చేతులు జోడించి స్తుతించాడు.(21) సామవేదమందు చెప్పిన స్తోత్రముతో పరిపూర్ణతముడైన విభుని ఇట్లా స్తుతించాడు.(22) బ్రహ్మవచనమిట్లో - ఓ జగదీశ! జయము, జయము. (దేవతలతో నమస్కరింపబడే చరణములు కలవాడ నిర్గుణుడ! నిరాకారుడ! స్వేచ్చా మయుడ! భక్తులకు అనుగ్రహించేవాడ! శాశ్వతమైనవిగ్రహము (శరీరం) కలవాడ! గోపవేషము ధరించినవాడ! మాయావి మాయకు ఈశుడ! సువేష! సుశీల! శాంత! అన్ని విధముల మనోహరమైనవాడ!దాంతుడ! (స్వేచ్ఛ) మిక్కిలిగా జ్ఞాన ఆనంద స్వరూపుడ! పరునికన్న పరతరుడ! ప్రకృతికి పరమైనవాడ! అన్ని అంతరాత్మల రూపుడ! నిర్లిప్త (అంటని) సాక్షిస్వరూపుడ! వ్యక్తుడ! అవ్యక్త స్వరూప! నిరంజనుడ! (భూ) భారమునుదించేవాడ! కరుణాసముద్ర! శోకసంతాపమును మింగేవాడ! జర, మృత్యువు, భయము, మొదలైనవి హరించేవాడ! శరణాగతునకు పంజరమైనవాడ! భక్తులను అనుగ్రహించుటకై చెదిరిన మనస్సు కాలవాడ! భక్తుల పై వాత్సల్యము కలవాడ! భక్తులనే కూర్చిన ధనముగలవాడ! ఓం! నీకు నమస్కారము (23) అన్నింటికి అధిష్టాతవైనదేవ! అని పలికి సంతోషింపచేసేకొరకు, దీనిని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. మూర్ఛితుడు కూడా ఐనాడు. (24) అని బ్రహ్మ చేసిన స్తోత్రాన్ని ఎవడు శ్రద్ధగా వింటాడో, అతనికి సర్వ అభీష్టముల సిద్ధిఔతుంది, అనుమానం లేదు. (25) పుత్రులులేనివాడు పుత్రులపొందుతాడు ప్రియలేనివాడు ప్రియను పొందుతాడు. ధనహీనుడు, పరిపూర్ణమైన ధనమును పొందుతాడు, సత్యము. (26) ఈలోకంలో సుఖమనుభవించి, చివర హరిదాస్యాన్ని పొందుతాడు. ముక్తికి కూడా లభించనంతగా, నిశ్చలమైన భక్తిని పొందుతాడు. (27) జగత్తునకు ధాతయైన బ్రహ్మ స్తుతించి, మళ్ళీమళ్ళీ నమస్కరించి, మెల్లమెల్లగా లేచి, భక్తితో తిరిగి ఇట్లన్నాడు. (28) బ్రహ్మ వచనమిట్లా - ఓ దేవ! దేవులందరికి ఈశుడ! పరమ ఆనందమునకు కారణమైనవాడ! లే. ఆనందం కలవాడ! నిత్యం ఆనందం కలవాడ! నందనందన! నీకు సమస్కారము. (29). ఓ నాథ! నందుని ఆలయానికి వెళ్ళు. వృందావనమును విడిచి పెట్టు.సుదాముని శాపాన్ని, నూరు సంవత్సరాల పరిమితమైనదాన్నిస్మరించు. (30) భక్తుని శాపవశంగా (అడ్డంకి) నూరు సంవత్సరాలు ప్రియను వదులు. తిరిగి ఈమెను పొంది గోలోకానికి వెళ్తావు. (31) ఓ దేవ! పితృగృహమునకు వెళ్ళి అక్కడికి వచ్చిన అక్రూరుని చూడు. నీకు చిన్నాన్న, అతిథి. మాన్యుడు. ధన్యుడు, వైష్ణవుడు, ఈశ్వరుడు. (32) ఓ భగవన్! ఇప్పుడు, అతనితో కలసి మధురాపురికి వెళ్ళు. శంభుని ధనుస్సు విరిచేయి. ఓ హరి! శత్రుగణాన్ని భగ్నం చేయి. (33) దురాత్ముడైన కంసునిచంపు. తండ్రిగారిని, తల్లిని, మేల్కొలుపు. ద్వారక నగర నిర్మాణం చేయి. భూభారాన్ని తగ్గించు. (34) శివుని, వారణాసిని కాల్చు. ఓవిభు! ఇంద్రుని గృహంకాల్చు. యుద్ధంలో శివుని ఆధిక్యాన్ని తగ్గించు. బాణుని భుజములను కత్తిరించు. (35) ఓ నాధ! రుక్మిణిని హరించు, నరకుని వధించు. పదహారువేల స్త్రీలను పెళ్ళాడు. (36) ప్రాణసమమైన ప్రియను విడిచి పెట్టు. ఓవ్రజేశ్వరా! ప్రజమునకు వెళ్ళు. నీకు మేలు జరుగని, లే లే రాధ లేవకముందే, (37) అని ఇట్లా పలికి బ్రహ్మ ఇంద్రుడు దేవతలు వీరితో కూడి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. శేషుడు, శంకరుడు వెళ్ళారు. (38) దేవతలు కృష్ణుని పై పుష్పచందనవర్షాన్ని కురపించారు, ప్రీతితో భక్తితో చేశారు. అప్పుడు అశరీరవాణి పలికింది - ఇట్లా (39) చంపతగిన కంసుని చంపు. నీ తలిదండ్రులను విడిపించు. భూభారం తగ్గించు, ఓ నారద! అని ఈవిధంగానే అన్నారు.

రత్నమాలో వాచ

అని ఈధంగా భూతభావనుడు (విష్ణువు, సృష్టికర్త) భగవంతుడు అ మాటలను విని భగవతియైన రాధను వదలి మెల్లమెల్లగా లేచాడు. (41) తిరిగి తిరిగి (ఎదిరి) చూస్తూ, హరి కొద్దిదూరం వెళ్ళాడు. గృహసమీపంలో ఉండే, చందన వనమందు కొద్దికాలమున్నాడు. (42) ఇంతలో రాధ నిద్ర నుండి లేచినది. ఆమె తన పడకనుండి లేచింది. శాంతుడు, కాంతుడు, ప్రాణవల్లభుడు ఐన హరిని చూడనందువల్ల (కన్పించ) (43) హానాథ! రమణ! ప్రాణేశ! ప్రాణవల్లభ! ప్రేష్ఠ! (మిక్కిలి ఇష్టమైనవాడ) ప్రాణచోర! ప్రియతమ! ఎక్కడికెళ్ళావు, అని పలికింది. (44) కొంచెం సేపు వెతికి, మాలతివనంలో తిరిగింది. కొంచం సేపు కూర్చున్నది. క్షణంలోనే లేచింది, అంతలోనే భూమి పై పడుకుంది. (45) క్షణంలో చాలా పెద్దగా ఏడ్చింది. మాటిమాటికి ఏడ్చింది. రా,రా, ఓనాథ అని ఈ విధంగా మాటిమాటికి పలికింది.(46) సంతాపంతో, విరహానలముతో బాగా తపించి మూర్చపోయింది. గడ్డితో కప్పబడిన(ఉన్న) భూమిపై చచ్చిన దానివలె పడిపోయింది. (47) ఓ బ్రహ్మా! వేలనూర్లకొలది గోపికలు అక్కడకొచ్చారు. కొందరు చేతుల్లో చామరాలు ధరించారు. కొందరు చందన ద్రవాన్ని తెచ్చారు.(48) వారిమధ్యలో ప్రియమైన చెలికత్తె ఆ రాధను వక్షమందుంచుకొని, ప్రియమిత్రురాలును చనిపోయిన దానినిగా చూచి (భావించి) ప్రేమవిహ్వలయై (అస్వాధీన) ఏడ్చింది. (49) బురద పైన నీరుగల పద్మదళములనుంచి, నిశ్చేష్టయే చనిపోయిన దానిలా ఉన్న ఆరాధను ఉంచింది. (50) అక్కడ గోపికలు అందమైన, తెల్లని చామరములతో సేవిస్తున్న చందన ద్రవము కలిగిన, నిగనిగలాడే వస్త్ర ముగల సతిని (51) ప్రాణవల్లభను ఆమెను, అక్కడికి వచ్చి కృష్ణుడు చూచాడు. బలిష్టులైన గోపికలు వారించగా, ఓ నారద! ఆమెను చూచాడు. (52)రాజుగారి భయం మొదలగువానితో, అపరాధం చేసినవాడు, దండనీయుడు ఎట్లా తీసుకుపోబడుతాడో అట్లా తీసుకెళ్ళారు. కృపానిధి వచ్చి, రాధను వక్షమందుంచుకొన్నాడు. (53) చైతన్యవంతురాలిని చేయసాగాడు. బోధనలతో బోధింపసాగాడు. దేవి, చైతన్యాన్ని పొంది, ప్రాణవల్లభుని చూచింది. (54) దేవి సుస్థిరురాలైంది. విరహజ్వరాన్ని విడిచింది. ఆకాంత! తనకాంతుణ్ణి ఇష్టమైన విధంగా ఆతని శరీరాన్ని కౌగిలించుకుంది. (55) మధుసూదనుడు రకరకాలైన శృంగారములు చేశాడు. రాధను, తన వక్షమందుంచుకొని రత్నతల్పమందున్నాడు. (56) రాధకు సఖి, నేర్పరి, అందరితో గౌరవింపబడేది, రత్నమాల కృష్ణునితో మధురంగా, నీతిసారముగల, ఉత్తమమైన మాటలను ఇట్లా అంది. (57) రత్నమాల వచనమిట్లా - పరిమాణంలో సుఖం కల్గించేదాన్ని చెబుతాను. ఓ కృష్ణ విను. హితమైనది., యదార్థమైనది. నీతి సారముగలది. దంపతులకు ప్రీతికారణమైనది చెప్తాను. (58) వేద పురాణముల నీతి యందు, కామశాస్త్రములందు సమ్మతమైనది, లౌకిక వ్యవహారములందు ప్రశంసించతగినది, మంచికీర్తినిచ్చేది (59) చెప్తాను. స్త్రీలకు తల్లి ఎట్లాగో బంధువులలో భాత అట్లా ప్రియమైనవాడు. ఆ పైన పుత్రుడు ప్రియమైనవాడు. పుత్రునికన్నను పతి ప్రియమైనవాడు.

రత్నమాలోవాచ :

అను నూరుగురు పుత్రులకన్న స్వామిప్రియమైనవాడు, సాధ్విమణులకు, ఇది సజ్జన సమ్మతమైనది. రసికులు, నేర్పరు రాండ్రకు భర్తకన్న పరమప్రియమైన వాడులేడు. (61) భర్తనేర్పరియైతే, విదగ్ధలకు (నేర్పరి) సుఖం కల్గిస్తాడు. లేనిచో విషతుల్యుడు. ఖలుడు, విసముడైతే (సమంకాకపోతే) విషతుల్యుడు (62) అసత్యమైన సంసారంలో దంపతుల పరస్పరప్రీతి, పరస్పరసమత, ప్రియమైనది సౌభాగ్యకరమైనది. ఈప్సితము, ఓవత్స! (63) దంపతుల మధ్య సమత్వంలేని ఇంట్లో అక్కడ అలక్ష్మి నివసిస్తుంది. అట్టి దంపతుల జీవనము విఫలము. (64) మంచిస్వామితో విభేదము స్త్రీలకు మిక్కిలి దుఃఖమిచ్చేది. శోకసంతాపములకు మూలము బ్రతుకు, మరణం కన్న మిన్న (65) కలలోగాని మెలకువలోగాని స్త్రీలకు భర్త ప్రాణములతో సమానము. ఈ లోకంలో పరంలోకంలోను స్త్రీలకు పతియే గురువు. (66) ఈమెనుండి నీవుకూడా దూరంకాగా ఓ నాథ! రాధిక మూర్చనందింది. గడ్డితో కప్పబడ్డ భూమి పై వెంటనే పడింది. త్వరగా భూమి పై పడింది. (67) నేను ఈమె ముఖం పై చల్లని మంచినీళ్ళను చల్లాను. అప్పుడు కొంచెం ఊరట కలిగింది ఈమెకు. చిన్నపిల్లలవంటి చైతన్యం (కొంచెం) కలిగింది. (68) ఒకసారి, ఓనాథ! అంటుంది. మరుక్షణం ఓ కృష్ణ అంటుంది. ఓ సఖీ అంటుంది. బాగా తపించిపోతూ కొద్ది సేపు ఏడుస్తుంది. మరుక్షణంలోనే మూర్చనందుతుంది. (69) రాధికశరీరము విరహాగ్నితో తపించిపోయింది. కాల్చిన ఇనుపచువ్వలా ఐంది. ముట్టరాకుండా, అగ్నిలా ఐంది. (70) కలలో, మెలకువలో, రాత్రింబగళ్ళు, ఇంట్లో, వనంలోను, నీటిలో, భూమి పైనా, ఆకాశంలో సూర్యచంద్రులవృద్ధిలో (71) రాధకు ఏమాత్రం భేదం లేదు. అన్ని వేళలా మృతతుల్యురాలు. జడాకృతిగా ఉంది. ఎప్పుడూ స్థానంలో ఉన్నట్లుగా, లోకమంతా విష్ణుమయమైనట్లుగా , ఎప్పుడూ చూస్తోంది. (72) నిగనిగలాడే (పచ్చి) బురదలో, తామరపూల యొక్క తడిగల దళాలు క్రిందపరచి, వాటితో చేసిన పడకయందు, విరహాతురమైన ఈమేను పడుకోబెట్టాము. (73) ఎప్పుడూ, తెల్లటి విసనకర్రలతో ఆమెను, ప్రియమైన చెలికత్తెలు సేవిస్తున్నారు. ఆమె వంటినిండా చందన ద్రవంపూశారు (తడిపారు). నిగనిగలాడే వస్త్రంకట్టారు. (74) ఈరాధ, శరీరస్పర్శమాత్రంతోనే బురదంతా ఎండిపోయింది. నిగనిగలాడే తామరదళాలు, క్షణంలో భస్మమైనాయి. (75) చందనం ఎండిపోయింది. చంపకం పువ్వులా దానిరంగు మారింది. వెంట్రుకల రంగులా, కాటుకలా నల్లగా ఐంది. ఓహరి! (76) అందమైన సిందూరబిందువు, ఆక్షణంలోనే నల్లబడింది. వేషము, విలాసము, లీల క్రీడ, అన్నిటిని విడిచి పెట్టింది. (77) రత్నమాల రాధనుచూచి, అప్పుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళి, రాధకుమేలు చేసే ఉత్తమమైన మాటను మధురంగా ఇట్లా చెప్పింది. (78) రత్నమాల ఇట్లా అంది - ఓ కృష్ణ! కమలాకాంత! నీవియోగంతో మాచెలి ఉంది. నీవు తొందరగా రాకపోతే తప్పకుండా ప్రాణాలు వదులుతుంది. (79) ఓ కృష్ణ! మనస్సులో ఆలోచించి సముచితమైంది చేయి. ఓ నీతి విశారద! కామినిహత్య కాకుండాచూడు. (80)

భగవానువాచ :

అను ! రత్నమాల మాటలు విని నవ్వి మాధవుడిట్లన్నాడు. హితమైనది, సత్యమైనది, నీతిసారము, పరిణామంలో సుఖమిచ్చేది ఆమాట (81) భగవంతుని వచనమిట్లా - నేను ఈశుణ్ణి నేను శక్తుణ్ణి, ఓ ప్రియే! ఈ నిషేధమును ఖండించగలను. ఐనా అసమర్ధుణ్ణి. ఓ రత్న! (రత్నమాల) నియయ (విధి) కారణంగా నేను చేయడం లేదు. (82) బ్రహ్మాండములన్నిటిలో ఒక మర్యాదను (నియమం) నేను స్థాపించాను. దాని ప్రకారమే మునులు, సురలు, నరులు కర్మ ఆచరిస్తున్నారు. (83) నూరు సంవత్సరాలు, కోరనటువంటిది ఈవిచ్ఛేదము, సుదాముని శాపంవల్ల కల్గింది. ఓ సుందరి!మా ఈ దంపతులకు విచ్ఛేదం కలిగి తీరుతుంది. (84) ఓ సుమధ్యమ! ఈమెకు నాతో విచ్ఛేదము, మెలకువలో కల్గుతుంది. నా వరం వల్ల కలలో ఎప్పుడు సంయోగం కల్గుతుంది. (85) నేనీమెకు ఆధ్యాత్మికత నిచ్చాను. ఈమెదుఃఖం తొలగిపోతుంది. రాధను మేల్కొలుపు. నీకు క్షేమం జరగని. నందుని ఇంటికి వెళ్తాను (86) అని పలికి జగన్నాథుడు నందుని ఇంటికి వెళ్ళాడు. ఓ నారద! చెలికత్తెలంతా రాధను మేల్కొలుపసాగారు. (87) ఇంటికివెళ్ళి తండ్రికి, తల్లికి నమస్కరించాడు. తల్లి ఒడిలో కూర్చో పెట్టుకొని నూతనమైన వెన్ననిచ్చింది. (88) తల్లి ఇచ్చిన తాంబూలాన్ని తిన్నాడు. చల్లని నీటిని త్రాగాడు. తల్లి దగ్గర జగన్నాథుడిట్లన్నాడు. (89) తెల్లని చామరములతో గోపాలగోపికలంతా సేవిస్తున్నారు, మాలలు, చందన తాంబూలములు వారు ఆనందంతో ఆతనికిస్తున్నారు. (90) అనిబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీకృష్ణగమన మనునది అరువది తొమ్మిదవ అధ్యాయము.