4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

41 - రాధాకృష్ణ సంవాదము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు రాధతో ఇట్లనెను :

దేవా ఊచుః - దేవతలు పలికిరి :

అప్పుడు దేవతలాలోచించి బ్రహ్మ వద్దకేగి జగత్పతియైన బ్రహ్మకు అందరిట్లు నివేదించిరి. “ఓ జగత్తును సృష్టించు దేవా! నీ సృష్టిలో హిమవంతుడు రత్నములకు మూలము. అతడొక వేళ ముక్తినందినచో భూదేవి ఇక రత్నగర్భ ఎట్లగును? పర్వతరాజు భక్తితో స్వయముగా కూతురును శివునికి దానము చేసెనేని నారాయణ సారూప్య మోక్షము పొందును. అందులో సందేహము లేదు. నీవు హిమవంతుని ముందు శివుని నిందించి ఆ పర్వతునికి శివుని మీద వ్యతిరేక బుద్ధి కలుగునట్లు చేయుము. నీవు తప్ప ఈ పనికి సమర్దుడింకొకడు లేడు. ప్రభూ! త్వరగా శైల రోజు గృహమునకు పొమ్ము. దేవతల ఈ మాటలు విని బ్రహ్మ నీతిసారమును కర్ణముల కమృతము వంటిదియు ఐన ఉత్తమ వాక్యమునిట్లు పలికెను.


 

బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :

 “ఓ బిడ్డలారా! సంపదలకు వినాశ రూపమును ఆపదలకు విత్తనము వంటిదియు మిక్కిలి దుష్కరమునైన శివనింద చేయుటకు నేను శక్తిగలవాడను కాను. ఈ పనికి ఆ భూతనాథునినే (శివుడు) మీరు పంపుడు. అతడు ఆత్మనింద చేసికోగలడు. పరులను నిందించుట తన వినాశము కొరకే అగును. స్వనింద గొప్ప కీర్తికి కారణమగును” అన్న బ్రహ్మ వాక్కు విని - ఓ ప్రియరాధా! దేవతలతనికి నమస్కరించి శీఘ్రముగా కైలాసమునకేగి శివుని స్తుతించిరి, కరుణకు స్థానమైన శివునికి తమ అభిప్రాయమును విన్నవించిరి. అప్పుడా శంకరుడు నవ్వి వారినోదార్చి హిమవంతుని వద్దకేగెను.

దేవతలందరు మందిరమునకు శీఘ్రముగా వెళ్లి సంతసించిరి. కోరిక సిద్ధించిన సంతసము, సిద్ధించకున్న దుఃఖము కలుగును కదా!

తరువాత హిమవంతుడు బంధు వర్గములో పార్వతితో కూడి తన సభామధ్యములో సంతోషముతో కొలువు దీరీయుండెను. ఇంతలో అక్కడికి శివుడు బ్రాహ్మణ రూపము ధరించి హఠాత్తుగా చేరవచ్చెను. చేతిలో నొకదండమును గొడుగును కంఠమున సాలగ్రామమును ధరించి నుదుట మంచి తిలకము, చేత జపమాల ప్రకాశించుచుండగా ప్రశాంతమైన ముఖము కన్నులు గల్గియుండెను.

అతనిని చూచి తన వారితో బాటు హిమవంతుడు లేచి ఆ అపూర్వాతిథికీ భక్తితో సాష్టాంగ నమస్కారము చేసెను. పార్వతీదేవి కూడ బ్రాహ్మణరూపమున వచ్చిన తన ప్రాణనాథునకు భక్తితో నమస్కరించెను. ఆ విప్రుడందరికి ప్రీతితో ఆశీస్సులిచ్చెను. శైలరాజిచ్చిన ఆసనము మీద కూర్చుండి మధుపర్కము మొదలగు సత్కారములను ప్రీతి పూర్వకముగా స్వీకరించెను. తరువాత తామెవరని కుశల ప్రశ్నను హిమవంతుడు అడుగగా బ్రాహ్మణుడాదరముగా గిరిరాజుకిట్లు చెప్పెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

ఓయీ! నేనీ భూతలము మీద గడియారపు ములు తిరిగినట్లు మనోవేగముతో అంతట తిరుగుచుందును, నేనన్ని చోట్లకు పోగల్గుదును. గురువు వరము వలన నేను సర్వ విషయముల నెరుగుదును సుమా.

ఓ పర్వతరాజా! లక్ష్మితో సమానురాలై ప్రకాశించుచున్న ఈ నీ కూతురును శంకరునికీయగోరుచున్నావని తెలిసికొంటిని. అతని  కులమేదో తెలియదు. అతనికొక ఆశ్రయము (ఇల్లు) లేదు. ఎవరితో సంగము లేదు. ఒక రూపము లేదు. గుణములు లేవు, భూతనాథుడు, శ్మశానముల వెంట తిరుగును. యోగివలె నుండును. దిగంబరుడు. అతని శరీరమున అన్ని సర్పములే, భస్మమే అతనికలంకారము. కిరాతవేషముతో నుండును. సృష్ఠి సంహారకుడు. మృత్యువెప్పుడో తెలియని ఆయుస్సు కలవాడు. అజుడు. అనాధుడు. ఈ సంసారములో అతనికొక బంధుపు లేడు, అతని శిరస్సున కరిగిన బంగారు వన్నె గల జడలుండును. వట్టి నిర్థనుడు. వయస్సెంత ఉన్నదో తెలియని కడు వృదుడు. మార్పు లేనివాడు. అందరి నాశ్రయించి తిరుగుచుండును. నాగములే అతనికి హారములు. అతడు భిక్షుకుడు సుమా.

. “ఓయీ వినుము. జ్ఞానులలో శ్రేష్ఠుడు సత్కులమున పుట్టినవాడునైన, సారాయణుడు పార్వతిని దానమిచ్చుటకు నీకు తగిన పాత్రుడు. పెద్ద బలగము గలవాడు. చిరునవ్వు ముఖమున వెలుగువాడు. పిలుపు విన్నంతలోనే చేరవచ్చును. నీవు లక్ష పర్వతములకు రాజువు. ఆ శివునికైతే ఒక చుట్టము లేడు. . ఈ సంబంధ విషయమై బంధువుల నడుగుము. మేనకను (భార్య) ప్రశ్నింపుము. ప్రయత్నించి అందరి నడుగుము. ఓ బంధూ! పార్వతిని మాత్రము అడుగకుము. రోగికి ఔషధము రుచించదు. మాటి మాటికి తినగూడని (రోగము పెంచు) పదార్థమే ఇష్టమగును. పార్వతి స్థితి అటున్నది”, అని పలికి ఆ బ్రాహ్మణుడు సంతోషముగా స్నాన భోజనములు చేసి తన కైలాసమునకు శాంతముగా. చేరబోయెను. బృందావన విహారమే వినోదమైన ఓ రాధా! బ్రాహ్మణుని మాటలు వినగనే మేనాదేవి మనస్సు మిక్కిలి తాపపడుచుండగా దుఃఖము వలన కన్నులలో నీరు గ్రమ్మగా భర్తతో నిట్లు పలికెను.

మేనకోవాచ - మేనక ఇట్లనెను :

 “ఓ పర్వతరాజా! పరిణామము (మార్పు, చివరలో సుఖము కల్గించు నా మాటను వినుము. అదేమన్నచో నా కూతురును అట్టి వరునకు ఈయను. ఒకవేళ నిర్బంధించి ఇత్తునందువా? ఆ పరిస్థితిలో సమస్త భోగములను వదిలివేసి విషము భక్షింతును. బిడ్డను మెడకు కట్టుకొని ఘోరమైన అరణ్యములకు పోదును” అని పలికి ఆమె పార్వతిని చేత బట్టుకొని కోపముతో కోప గృహమునకేగెను. ఆహారము వదలి దుఃఖించుచు నేలమీద పండుకొనెను.

ఇంతలో అక్కడికి వసిష్ఠ మహర్షి తన తోబుట్టువులైన భృగు పులస్త్యాది ప్రజాపతులతో గూడి వచ్చెను. వారితో బాటు అరుంధతీ దేవియు వచ్చెను. పర్వతరాజు వారందరికి నమస్కరించి స్వర్ణపీఠముల పై కూర్చుండ బెట్టి భక్తితో షోడశోపచార పూజ చేసెను. ఆ ఋషులందరు ఆ సభలో సుఖాసనముల మీద సుఖముగా విశ్రమించిరి, అరుంధతీ దేవి వెంటనే మేనా పార్వతులున్న ప్రదేశమునకు పోయి శోకములో మునిగి శయనించి యున్న మేనాదేవిని చూచెను. అప్పుడా సాధ్వి నెమ్మదిగా మధురము హితము అగు వచనములు పలికెను.

అరుంధత్యువాచ - అరుంధతి పలికెను :

“సాధ్వీ! మేనకా! లెమ్ము. నేనరుంధతిని నీ యింటికి వచ్చితిని. పితృదేవతలు మనఃసంకల్పముతో సృష్టించిన కన్యనుగా బ్రహ్మ కోడలిగా నన్ను తెలిసికొనుము", అరుంధతి యొక్క కంఠస్వరము విన్న వెంటనే మేనక లేచి తేజస్సుతో లక్ష్మీవలె వెలుగుచున్న ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి. ఇట్లు పలికెను.

మేనకోవాచ - మేనక పలికెను :

“అబ్బా! నేడేంత పుణ్యదినము?! పుణ్యజన్మనెత్తిన మాకెంతటి పుణ్యము! సృష్టికర్త కోడలు వసిష్ఠ మహర్షి భార్య మా యింటికి వచ్చుట!” అని త్వరతో గూడిన ఆదరముతో పలుకుచు - నేను నీ సేవకురాలను. బహుపుణ్యముల వలన జగత్సష్ట యొక్క సంబంధీని యగు ఈశ్వరి నౌ యింటికి వచ్చినదన్న భావముతో మేనక సాధ్వియగు అరుంధతికి పాదజలమిచ్చి స్వర్ణ పీఠముపై కూర్చుండ బెట్టెను. రుచికరమైన భోజనమును పెట్టెను. అరుంధతియు కన్యతో గూడి భుజించి సంభాషణ మొదలు పెట్టి శివునితో సంబంధము కలుపు వాక్యములను పలుకుచు మేనకకు నీతిబోధ చేసెను.

సభలో ఋషీశ్వరులు హిమవంతునితో మాట్లాడుచు శివునితో సంబంధము కూర్చునట్టి నీతిసారమైన శ్రేష్ఠ వాక్యమును పలికి బోధచేసిరి.

ఋషయ ఊచుః – ఋషలు పలికిరి :

 “ఓ పర్వతరాజా! శుభము కలిగించునట్టి మా వాక్యము వినుము. శివునికి పార్వతినిమ్ము. ఆ పని వలన లయకారకుడైన ఆ దేవునికి మామవుకమ్ము. నీవు ప్రయత్నించి ఆయాచకుడగు (ఇంతవరెవ్వనిని కూడ ఇది ఇమ్మని అడుగనివాడు) ఆ దేవేశునికి నీవే విన్నవించుము. యోగీశ్వరుడైన శంకరుడు ఈ వివాహ విషయములో నీకున్న శంకలను (సందేహములను) తీర్చుటి కోసము కన్యనిమ్మని అడుగుట కీష్టపడుచులేడు. బ్రహ్మదేవుని ప్రార్థన ననుసరించి అతడు నీ కన్యను స్వీకరించగలడు. నీ బిడ్డ తపస్సు చేసిన తరువాత శివుడట్టి అంగీకారమును తెలిపెను. ఈ రెండు కారణముల చేత ఆ యోగీంద్రుడు వివోహము చేసికొనును. ఇట్లు పలికిన ఋషుల మాట విని హిమవంతుడు నవ్వి కొంచెము భయపడుచు మిక్కిలి వినయముతో ఇట్లు పలికెను.

హిమాలయ ఉవాచ - హిమాలయుడు పలికెను :

రాజసంబంధమైన వస్తు సామగ్రి దేనిని కూడ శివునీదీదియని నేనెక్కడ చూడలేదు. చిన్న నిహాస గృహము కాని, ఐశ్వర్యము కాని తనపోరు బంధుజనులు అన్నవతనికేవి? దేనితోను సంబంధము లేని యోగికి బిడ్డనీయదగదు. మీరు బ్రహ్మపుత్రులు కదా! ఇంతవరకే నిశ్చయింపబడియున్న సత్యమును చెప్పుడు. కాలమునకు కట్టుబడి కానీ - ద్రవ్యలోభము వలన గాని - భయము వలన గాని - అజ్ఞానము వలన గాని - అయోగ్యుడు (తగినవాడు కాని) ఐన పురుషునికి బిడ్డనిచ్చినచో ఆ తండ్రి సూరేండ్లు నరకము పొందును. నేను కోరి శూలపాణికి నాకూతురునియ్యను. ఈ విషయములో యోగ్యమైన విధానమేదో దానిని ఆజ్ఞాపించుడు.

హిమవంతుని మాటవిని బ్రహ్మపుత్రుడైన వసిష్ఠ మహర్షి వేదవేదాంగము లెరిగిన విద్వాంసుడు కనుక వేదములో చెప్పబడిన దానినీ చెప్పబూనెను.

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠమహర్షి పలికెను:

“ఓ పర్వతుడా! లౌకిక విషయము గాని వైదిక విషయము గాని సర్వజ్ఞుడైన వ్యక్తి నిర్మలమైన తన జ్ఞాన నేత్రములో, అన్ని తెలిసికోగలుగును. శత్రువైనపోడు అసత్యమును హితము కల్గించనిదియు ఐన బోధను అప్పటికి ఏనువాని చెవికి ఇంపుగా దృఢముగా చెప్పును కాని హితమెప్పుడును చెప్పడు. ఇతరుల యందు దయగల వాడును ధర్మజుడునైన వ్యక్తి బంధువుకు చెవిలో పడుచున్నప్పటి నుండి ప్రీతిని కల్గించుచు తరువాత కూడ సుఖము కల్గించునట్టి ధర్మహితమును బోధించును. ఇంకొకడు బోధ వినుచున్నప్పుడే అమృతము వలె నుండి సర్వకాలములలో సుఖము కల్గించునదియు, సత్యసారమైనదీయు హితకరమును కోరబడినదియునైన శ్రేష్ఠ వాక్యముగా నుండును. ఈ విధముగా నీతిశాస్త్రమందు నిర్ధారణ చేయబడిన బోధ మూడు రకములుగా నుండును. ఈ మూడు. విధములలో నీకిష్టమైన దేదో చెప్పుము. నీకేది చెప్పుమందువు.

శంకరుడు బయటికి కనిపించు సంపదలు లేనివాడు. ఆ దేవేశ్వరుడు తత్త్వజ్ఞానమనెడి సముద్రములలో మునిగియున్న మనస్సు కలవాడు. సంపదలన్నవి మనుష్యుని దృష్టిలో పడుచునే భ్రమను కల్గించునవి, మెరుపుల కాంతివలె వెంటనే నశించునవి. అట్టి సంపదల మీద తన ఆత్మ యందే రమించు సదానందుడై యున్న ఆ యీశ్వరునికి కోరిక ఎక్కడిది? ఒక గృహస్తుడు తన కన్యను రాజ్య సంపద గళిలోకమును ద్వేషించు వానికిచ్చినచో కన్యాఘాతుకుడైన తండ్రియై తీరును. శంకరుడు దరిద్ర దుఃఖమనుభవించువాడని ఎవడు పల్కును. ధనపతియైన కుబేరుడతని సేవకుడు కదా కనుబొమల కదలికలో సృష్టి సంహారములను చేయు సమర్థుడా శివుడు.

ఎవడు నిర్గుణ పరమాత్మయో ప్రకృతి కతీతుడైన సర్వేశ్వరుడో, మరియు సర్వమునకీశ్వరుడో, సర్వజీవుల లోపల ఉండి కూడ ఏ దోషమంటని వాడో (నిర్లిప్తుడు) ఆ ఈశ్వరుడే సృష్టికర్మయందును సృష్టి సంహారమందును సమర్థుడు. ఆ విభుడు స్వయం స్వేచ్ఛామయుడు (తన ఇచ్ఛననుసరించి ప్రవర్తించువాడు) కనుక నీరాకారుడను సాకారుడును అగును. అతడు సృష్టి వ్యవహారములో సృష్టించుట రక్షించుట ఆంతమొనర్చుటలను కల్గించునట్టి బ్రహ్మ విష్ణువు శివుడు అన్న నామములు గల మూడు విధముల మూర్తులను (ఆకారములను) ధరించుచున్న ఈశ్వరుడు.

బ్రహ్మలోకమందలి బ్రహ్మ పాలసముద్రమందలి విషువు కైల సవాసి యైన శివుడు అందరును పరమాత్మయైన కృష్ణుని యొక్క విభూతులే (అతని నుండి విడదీయరాని మ ఖైశ్వర్య మూర్తులే). అట్టి శ్రీకృష్ణుడు ద్విభుజుడు (రెండు హస్తములు గలవాడు) చతుర్భుజుడు (నాలు హస్తములు గలవాడు) అని రెండు విధములై ఉన్నాడు. వైకుంఠమునందేమో చతుర్భుజుడు, గోలోకమందు ద్విభుజుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ స్వామి యొక్క అంశలే. కొందరు దేవతలా శ్రీకృష్ణదేవుని కళారూపులు (పదహారవ భాగము) మరికొందరు కళలోని భాగములు.

కృష్ణ పరమాత్మ సృష్టి చేయ సంకల్పించి ప్రకృతిని - (వ్యక్తరూపములో) నిర్మించను. నిర్మించిన ప్రకృతి గర్భమందు తన వీర్యమునుంచేను. దాని వలన నొక అందమేర్పడెను. ఆయండము లోపల మహావీరాట్పురుషుడేర్పడెను. అతడే శ్రీకృష్ణుని యొక్క షోడశాంశమైన మహావిష్ణువని తెలిసికొనుము. ఆ జల శాయియైన మహావిష్ణువు యొక్క నాభికమలమందు బ్రహ్మయు ఫాలము నుండి చంద్రశేఖరుడైన శంకరుడును ఎడమ ప్రక్క నుండి విష్ణువును నుద్భవించిరి. కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రాకృతికులు (ప్రకృతి పుత్రులు). ఇతర దేవాదులును ప్రాకృతికులే.

కృష్ణ పరమాత్మ నుండి సంభవించిన ప్రకృతి నాల్గువిధములైన రూపములను (ఆకారములను) ధరించెను. అతని అంశతో లీలతోను, సృష్టికొరకు, కళతోను ఇట్లు అనేక విధముల ఆమె (ప్రకృతి) క్రింది రూపములను ధరించెను. కృష్ణుని యొక్క వోంగము నుండి (శరీరము యొక్క ఎడమ భాగము నుండి) సంభవించిన రాధాదేవి రాసలోకనాయిక. అతని ముఖము నుండి ఉద్భవించిన వాణి (సరస్వతి) సంగీతమునకు అధిష్టాన దేవత, స్వామి వక్షస్థలము నుండి సంభవించిన లక్ష్మీదేవి సర్వసంపదల స్వరూపమైనట్టిది. దేవతల యొక్క తేజస్సు నుండి ఆవిర్భవించిన (స్వయముగా) శివ (పార్వతీదేవి) సర్వదానవులను సంహరించి దేవతలకు స్వర్గ సంపదనిచ్చెను. ఆమెయే పూర్వకల్పములో దక్షుని భార్య యొక్క గర్భమందు జన్మించి సతీదేవియన్న నామముతో వెలసెను. దక్షుడామెను శివునీకీయగా అతనిని పొంది -తన తండ్రి శివుని నీంద చేయగా విని సహించక యోగశక్తితో దేహత్యాగము చేసెను.

పితృదేవతల యొక్క మానస కన్యయైన మేనకాదేవి నీభార్య. ఆమె గర్భమందు ఆ జగదంబిక (సతీదేవి) జన్మించినది. ఓ హిమవంతుడా! ఈ శివాదేవి జన్మజన్మలకు శివుని పత్నియే. ప్రతికల్పమందు జ్ఞానులకు తల్లియైన ఈ శ్రేష్ఠురాలు బుధీరూపిణియై వెలుగుచున్నది. సర్వజ్ఞురాలగునీమె పూర్వజన్మల స్మృతి గలది. సిద్ధిరూపిణియై తనను సేవించినవారికి సర్వవిధ సిద్ధులనిచ్చును. ఈమె యొక్క {పూర్వజన్మకు సంబంధించిన) ఎముకలను చితాభస్మమును శివుడు స్వయముగా ఆదరముతో ధరించుచున్నాడు.


 

ఓ భద్రుడా! నీవే ఇష్టపూర్తిగా శివునికి నీకన్యనిమ్ము, అట్లుకాకున్నను స్వయముగా నామెయే తన కాంతుని వద్దకు పోగలదు. అది నీవు చూతువు, పూర్వజన్మయందెవనికి ఏ స్త్రీ ప్రియురాలో ఆమె ఆ వల్లభునే పొందుచున్నది. ఇది బ్రహ్మ నిర్ణయము, దోని నోటంకపరచుటకెవడు శక్తుడు కాడు. తత్త్వవేత్తయు ఆత్మారాముడునైన శంభుడు వివాహ విషయమై ఆసక్తి కలిగి లేడు. తారకుడను రాక్షసుని చేత పీడింబడిన సర్వదేవతలతనిని వివాహమాడుమని స్తుతించిరి. దేవతల బాధలను చూచి బ్రహ్మచేత ప్రార్థింపబడినవాడై కృపగల శంకరుడు దేవసభలో దయతో అగీకరించెను.

ఆ యోగీంద్రుడు దేవతల యొక్క అసంఖ్యాకమగు దుఃఖములను చూచి ప్రతిజ్ఞచేసి బ్రాహ్మణ వేషముతో నీ కూతురు (పార్వతి) తపస్సు చేసెడి స్థానమునకు వచ్చెను. ఆమెనోదార్చి వరమొసగి స్వగృహమున కేగెను. ఆ వార్త వినియే. ఇంద్రాది సర్వదేవతలు సంతోషముతో నొక్క చోటికి చేరవచ్చిరి. ప్రస్తుతము భగవంతుడైన నారాయణుడు బ్రహ్మ, ధర్ముడు, ఋషులు, మునులు, గంధర్వ యక్ష -రాక్షసులందరును సంతోషముతో నొక చోటచేరి ఈ కార్యమును గురించీ సమాలోచనము చేసిరి. మేమిక్కడికి వారిచేతనే పంపబడితిమి. మేము కూడ ఋణ విముక్తి కొరకు త్వరగా వచ్చితిమి. అరుంధతియు నీకు వివాహ విషయమై ప్రబోధించుటకు గొప్ప ఆసక్తి కలిగి - యున్నది. సర్వకాలము సుఖము కూర్చునట్టి ఈ శుభకార్యము (పార్వతీపరమేశ్వరుల వివాహము) ఇప్పుడు సంప్రాప్తించినది.

ఓ పర్వతరాజా! నీవు నీ ఇష్టపూర్తిగా పార్వతికి శివునకియ్యకున్నను వివాహము అట్లే జరుగవలెనన్న దైవసంకల్ప బలము చేత ఆది జరిగి తీరును. శ్రేష్టమైన రత్నములచేత నిర్మించబడిన రథమందు నారాయణునితో కూడి ఆ దేవుడు వచ్చును, ఆ వరుడు (పెండ్లి కుమారుడు) దేవతలలో శ్రేష్ఠుడు. యోగీంద్రులలో ఉన్నతుడు, జ్ఞానులకు పరమగురువు. అతనికి ఆదిమధ్యాంతములు లేవు. అతడు జన్మ జరామరణాది వికారములు లేనివాడు. ఆ శివుడు పార్వతి తపస్సు చేసెడి ప్రదేశమునకు పోయి వివాహమాడుదుని వరమిచ్చినాడు. ఈశ్వరుని వాసము దుర్లభము కాదు విఫలము (వ్యర్థము) కాదు. బ్రహ్మ మొదలు గడ్డి వేరు వరకు అంతయు నశించునదే. అస్థిరమే. కాని నశించిపోనట్టి సత్పురుషుల ప్రతిజ్ఞ దాట శక్యముకానిది సుమా!

దేవేంద్రుడొక్కడు పూసుకొని లీలగా పర్వతముల రెక్కలను ఖండించెను. పవనుడు (గాలి) ఒక ఆటగా మేరువు యొక్క శృంగమును (శీఖరమును) భంగము చేసెను. ఓ హిమాలయా! దేవతలతో యుద్ధము చేయగల వీరులు పర్వతములలో ఎవరున్నారు?  వాయువులచేత విసిరి వేయబడి పర్వతములు సముద్రములలో పడిపోగలవు. ఓ శైలేంద్రుడా! ఒక్కదాని గురించి సర్వసంపదలు నశించు స్థితి ఏర్పడునేని దొని నిచ్చివేసి మిగిలిన అన్నింటిని రక్షించుకొనవలెను. ఒక్క శరణాగతుని మాత్రము ఇచ్చివేయరాదు (వదిలిపెట్టరాదు) శరణాగతుని రక్షించుటకొరకు పుత్రులను భార్యను ధనమును ప్రాణములను కూడ ఇచ్చివేయదగునని నీతివేత్త లెరుగుదురు.

అనరణ్యుడన్న రాజు మంచి జ్ఞాని. ఒకసారి బ్రహ్మ శాపమగ్నుడై భయముతో దీనదశను పొందగా నీతిశాస్త్ర పండితులనికి తగిన బోధ చేసిరి. ఆ బోధ ననుసరించి ఆ రాజు తన కూతురును. బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ బ్రహ్మ శాపమునుండి విముక్తుడాయెను. తన సంపదలను రక్షించుకొనెను. నీవును అట్లే నీ సుతను శివునకిచ్చి సర్వ బంధు వర్గమును కాపాడుకొనుము. దేవతలను నీకు వశులనుగా చేసికొనుము. ఇట్లు పలికిన వసిష్ఠుని వచనములను విని పర్వతరాజు నవ్వి బాధపడుచున్న మనస్సుతో ఆ రాజవృత్తాంతమడిగెను.

 హిమాలయ ఉవాచ - హిమవంతుడను :

ఓ బ్రహ్మర్షి! అనరణ్యుడన్న రాజేంద్రుడెవరి వంశమున పుట్టెను? తన బిడ్డనిచ్చి సర్వసంపదల నెట్లు రక్షించుకొనెను?

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠుడనెను :

అనరణ్య మహారాజు మనువంశమున జన్మించినాడు. అతడు మంచి ధర్మాత్ముడు. ఇంద్రియములను జయించిన విష్ణుభక్తుడు. చిరకాలజీవి. మనువులలో మొదటివాడు అతిధర్మాత్ముడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. అతడు డెబ్బైయొక్క యుగములు ధర్మముగా రాజ్యపాలనము చేసెను. తరువాత భార్యయైన శతరూపతో కలిసి వైకుంఠ లోకము పొంది సామీప్యము దాస్యము అన్న మోక్షదశలు పొంది శ్రీహరి దాసుడయ్యెను. ఆ తరువాత మహానుభావుడైన స్వారోచిషుడు మనువయ్యెను. అతని కాలము గతింపగా ఉత్తముడు మనువయ్యెను, ఉత్తముడు గతించగా ధర్మాత్ముడైన తామసుడు మనువయ్యెను. ఆ తరువాత జ్ఞానులలో శ్రేష్టుడైన రైవతుడు మనువయ్యెను. ఆ తరువాత చాక్షుషుడు అతని తరువాత శ్రాద్ధదేవుడు ఏడవ మనువు. సావర్ణి అన్నవాడష్టమ మనువు. ఇతడు చైత్ర వంశోద్భవుడైన రాజు. పేరు సురథుడు. దక్షసావర్ణి తొమ్మిదవ మనువు, బ్రహ్మసావర్ణి పదియవ మనువు, పదకొండవ వాడు ధర్మసావర్ణి, ఇతడొక మహాముని. ఆ పిదప విష్ణు భక్తుడు జితేంద్రియుడైన రుద్రసావర్ణియు ఆ తరువాత దేవసావర్ణియు పిదప ఇంద్ర సావర్ణియు మనువులైరి. ఓయీ! ఇట్లు పదునాలురు మనువులు చెప్పబడిరి.

ఈ పదునాల్గురు మనువులు గడిచిపోగా సృష్టికర్తయగు బ్రహ్మకొక దినమాయెను. ఇక వారిలో ఇంద్రసావర్ణి వృత్తాంతము మొత్తము నా వల్ల వినుము. ధర్మాత్ముడును విష్ణువునందు శుద్ధభక్తిగల ఆ మనుశ్రేష్ఠుడు (ఇంద్ర సావర్ణి) డెబ్బది యొక్క యుగములు ధర్మముగా రాజ్యము పాలించెను. తరువాత అతడు సురేంద్రునికి రాజ్యమిచ్చి తపస్సు చేయుటకు వసమునకు పోయెను. సురేంద్రుని పుత్రుడు బుద్ధి బలము భుజబలము గల శ్రీనికేతుడు. అతని పుత్రుడు మహాయోగియైన పురీష తరువు. అతని పుత్రుడు మిక్కిలి తేజస్వియైన గోకాముఖుడు. అతని పుత్రుడు వృద్ధశ్రవసుడు వాని కొడుకు భానువు, అతనికి పుండరీకుడు, వాని కొడుకు జిహ్వలుడు. జిహ్వాలుని సుతుడు శృంగి, శృంగిపుత్రుడు భీముడు. అతని పుత్రుడు యశశ్చంద్రుడు. ఇతని కీర్తికి చంద్రుడోడిపోయెను. యశశ్చంద్రుని కీర్తిని సాధుపురుషులు దేవతలు ఇప్పటికీని గానము చేయుచున్నారు. అతని పుత్రుడు వరేణ్యుడు. వాని సుతుడు పురారణ్యుడు. పురారణ్యుని పుత్రుడు ధర్మాత్ముడైన ధరోరణ్యుడు. ఇతని పుత్రుడు జ్ఞానులలో శ్రేష్ఠుడును తపస్వి ఐన మంగళారణ్యుడు. ఇతడు పుత్రులు లేక తపము చేయుటకై పుష్కరమునకు పోయి అక్కడ సుదీర్ఘకాలము తపస్సు చేసి మహేశ్వరుని వరము పొందెను. ఆ వర ఫలముగా జితేంద్రియుడును విష్ణుభక్తుడుసైన అనరణ్యుడను కుమారుని పొంది వానీకి రాజ్యమర్పించి మరల తపస్సు చేయగోరి అరణ్యమున కేగెను.

రాజశ్రేష్టుడైన అనరణ్యుడు సప్తద్వీపములు గల భూమండలమంతటికీ ప్రభువై భృగువను పురోహితుని సహాయముతో నూరు యజ్ఞములను చేసెను. ఆ జ్ఞాని నూరు యజ్ఞముల వలన లభించనున్న ఇంద్రపదవిని నశించెడి తుచ్ఛపదవియని భావించి స్వీకరించలేదు, దీనితో అతడు ఇంద్రపదవీకై తహతహలాడు ఇంద్రుని - బలిచక్రవర్తిని లీలగా గెలిచెను. జ్వలించెడి అతని తేజస్సుతో దానవేంద్రులందరోడింపబడిరి. అట్టి అనరణ్యునికి నూరుగురు పుత్రులు కలిగిరి. లక్ష్మీదేవితో సమానురాలైన ఒక కన్య.అందరి మనస్సుల నానందపరచు సుందరి, పద్మ అను నామము కలది రోజుకు జన్మించెను. ఆమె క్రమముగా యౌవనవతి కాగా ఆ రాజేంద్రుడు కన్యనీయదగిన వరుని కొరకు ఒక చారుని పంపెను. ఇంతలో పిప్పలాదుడన్న మహర్షి ఒకసారి తన ఆశ్రమమునకు పోవుచు నిర్జనముగా నున్న తపోవనములో ఒక దృశ్యమును చూచెను. ఒక గంధర్వుడు మిక్కిలి కామముచేత మత్తుడై రాత్రీ పగలు తెలిసికొన లేక స్త్రీలయందు మగ్నమైన మనస్సుతో శృంగార రస సముద్రములో మునుగుచుండెను. ఈ ముని రాజది చూచి తాను కూడ మన్మథునికి వశుడాయెను.

తరువాత మిక్కిలి భగ్న మనస్సుతో భార్యాగ్రహాణము (వివాహాము)ను గూర్చియే విచారించుచుండెను. ఒకసారి పుష్పభద్రానదికి స్నానమునకు పోవుచు పిప్పలాదముని లక్ష్మీదేవి వలె మనస్సు నానందపరచు యువతీయగు పద్మ (రాజకన్య)ను చూచి ఆ సమీపమున నున్న జనులను ఈమె ఎవడో? ఎవని కన్య? అని ప్రశ్నించెను. వారు ఈమె పేరు పద్మ, అనరణ్యుని పుత్రిక అని నివేదించిరి. ముని  స్నానము చేసి తన ఇష్టదైవమగు రాధానాథుని పూజించి - వివాహేచ్ఛతో కన్యాభిక్షనడుకుటకు అనరణ్యుని సభాంగణమునకు పోయెను. రాజు మునిని చూచి భయభక్తులతో త్వరగా నమస్కరించి మధుపర్కము మొదలగు వాటిని సమర్పించి పూజించెను. ముని ఆ సత్కారమును స్వీకరించి కోరికతో నీ కన్యనిమ్మని అడిగెను.

ఏమి చెప్పుటకు శక్తి లేక రాజు మౌనముగా నుండిను, ముని మరల “రాజా! నీ కన్యను నాకిమ్ము” అని మరల యాచించెను. “లేనిచో క్షణములో నీ సర్వస్వమును భస్మముగా జేయుదును!” అనునంతలోనే ఆ ముని తేజస్సుతో అక్కడి వారందరు ఆచ్ఛాదింపబడిరి (తేజస్సు అందరిని కప్పివేసెను) రాజు ముసలితనమాక్రమించిన మునిని చూచి హాయని రోదించెను. అతని పట్టపురాణులందరు చేయదగినదిదియనీ సిశ్చయించుకొనలేక దుఃఖించిరి. మహారాణి మూర్చిల్లెను. కన్య తల్లి కనుక దుఃఖముతో వ్యాకులము పొంది అట్లయ్యెను. అప్పుడు పురోహితుడు పండితుడు నీతిశాస్త్రవేత్త కనుక రాజుకు రాజభార్యకు రాజపుత్రులకు ఉత్తమమైన కన్యకా నీతిని గూర్చి బోధ చేసెను.

 “రాజా! ఈనాడు గాని ఇంకొక దినమందు గాని బిడ్డ పరునికీ ఈయదగినదే కదా! ఈ బ్రాహ్మణునికి కాక ఎవనికో ఒక వరునికితవు కదా! ముల్లోకములలో ఈ బ్రాహ్మణుని కన్న కన్యనీయదగిన సత్పాత్రుడు నాకు కన్పించుట లేదు. ఈ రాజకన్య మూలమున నీ సర్వసంపదలు నశించిపోగలవు. కనుక ఈ మునికి నీ పుత్రికనిచ్చి సర్వసంపదలను కాపాడుకొనుము. ఒక్క శరణు పొందిన వారిని తప్ప ఇతరము దేనినైనను త్యజించి మిగిలిన సర్వమును లోకమున కాపాడుకోవలెను”, ఇట్టి పండిత వాక్యమును రాజు విని మాటి మాటికి దుఃఖించి చివరికి కన్యనలంకరించి ఆ మునీంద్రునికి దానమొనర్చెను. ముని తన భర్యను గ్రహించి సంతోషముతో తన ఆశ్రమమునకు పోయెను. రాజు దుఃఖముతో అందరిని వదిలి తపస్సు కేగిను. భర్తయొక్కయు కూతురు యొక్క వియోగముతో రాజు భార్య ప్రాణములు విడిచెను. రాజు లేనందున దు:ఖములతో పుత్రులు పౌత్రులు భృత్యులు అందరు మూర్ఛిల్లిరి. అనరణ్యుడు రాధినాధుని ధ్యానించుచు తపస్సు చేసి గోలోకమునకు పోయెను. (ముక్తుడయ్యెను). రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు మంచి కీర్తి శాలియై భూమండలమందలి ప్రజలను పుత్రులవలె పరిపాలించెను.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ప్రస్తుతము రాధాకృష్ణ సంవాదరూపమున నున్న నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.