4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
50 - దూర్వాసదర్పభంగము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను:
ప్రియురాలా! మహామునియు రుద్రుని అంశతో జన్మించిన వాడును యోగమునభ్యసించుట వలన అధిక తేజస్సు గలవాడును ఐన దుర్వాసమహర్షి యొక్క దర్పభంగమును చెప్పెదను వినుము. ఒకసారి అంబరీష మహారాజు ద్వాదశీవ్రత మాచరించి (ఏకాదశినాడు పవసించి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి తాను భుజించుట ఇది విష్ణువ్రతము) అనేక బ్రాహ్మణులను భుజింపజేసి తాను పారణ చేయుటకు (ఆహారము స్వీకరించి వ్రతము ముగించుటకు) ఆరంభించెను. ఇంతలోనక్కడికీ ఏకాదశీవ్రత నియమము గల దుర్వాసముని ఆకలి దప్పులతో బాధపడుచు వచ్చి “ఓ మహానుభావా! (భాగ్యశాలి) నాకు భోజనము పెట్టుము” అని రాజుతో పలికెను.
ఆ రాజు భక్తితో ఆ మునికి అమృతమును పోలిన పరమాన్నమును అర్పించెను. ముని తనకిచ్చిన పాయసములో వెండ్రుక ఉండుట చూచి రాజును శపించబూనుకొనెను. తన శిరస్సు నుండి ఒక జడను ఊడబెరికి నేలమీద పడవేసెను. ఆ జడనుండి ప్రళయము వలె అంతకుడు, మండుచున్న అగ్నిజ్వాల వంటివాడు ఏడుతాడిచెట్లంత పొడవు గలవాడునగు ఒక పురుషుడు ఉద్భవించెను. అతడు కోపముతో రాజులలో శ్రేష్ఠుడైన అంబరీషుని చంపుటకు పూనుకొనెను. అది చూచీ అందరు కంఠములు దవడలు పెదవులెండిపోగా భయముతో వణికిపోయిరి. మిక్కిలి భయపడిన రాజు నా పాదపద్మములను స్మరించెను. అట్లు నాపాదములు స్మరింఛనంతలోనే అన్ని విఘ్నములు ఉపశమీంచెను.
ఇంతలో నివారించుటకు సాధ్యము కానిది తేజన్సులో నాతో సాటియైనది కోటి సూర్యుల తేజస్సును పోలినదైన సుదర్శన చక్రము హఠాత్తుగా ఆ సభలో ఆవిర్భవించి కృత్యాపురుషుని ఖండించి వేసి దుర్వాసముని మీదికి పరుగెత్తాను.
విష్ణుచక్రము పర్వతములు సముద్రములతో కూడిన మొత్తము భూమండలమును ఉత్తమమైన మేరు పర్వతమును మొత్తము భూమీని త్రిప్పి ఆముని వెంట పరుగెత్తాను. భయపడి మనస్సు చెదరి దీనుడై తలమీది వెండ్రుకల ముడి ఊడిపోయి పరుగెత్తుచున్న ముని వెంటపడి - తన తేజస్సుతో సూర్యుని కప్పిపుచ్చి గొప్ప వెలుగును కల్గించగా - ఋషిమండలమును (లేదా సప్తవాయు మండలములను) కైలాసమును క్షేమకరమైన బ్రహ్మలోకమును భ్రమించిన బ్రాహ్మణుడు వైకుంఠనాధుని శరణుపొందిసు.
దయా సముద్రుడైన విష్ణువు తన పాదపద్మముల మీదపడి శరణాగతుడైన దుర్వాస మునిని చూచి దయతో ఆ బ్రాహ్మణునికి అభయమిచ్చెను. (సుదర్శన భయము తీర్చెను). ఇట్లు నారాయణుని వరము (అనుగ్రహము)తోనే ఆ ద్వీజుడు ప్రాణభయమన్న జ్వరము లేనివాడయ్యెను. అప్పుడు శ్రీహరిని స్తుతించి స్వామి ఆజ్ఞననుసరించి తిరిగి అంబరీషుని గృహమున కేగెను. అప్పుడే రాజు వచ్చిన మునికి పొయసము భుజింపజేసి బంధువులతోను భార్యలతోను కూడి ద్వాదశీపారణను (ఏకాదశీ ఉపవాసపు చివర చేయు భోజనమును) ఆచరించెను. దుర్వాసమునీ భుజించిన పిదప రాజు నాశీర్వదించి తన నివాసమున కేగెను.
భక్తుల రక్షణార్థము నాచేత చక్రము ఆజ్ఞాపించి ఉంచనైనది. ప్రళయమందందరు నశింతురు కానీ నా భక్తుడు నళింపడు. అందరు దేవతలు నా ప్రాణములు భక్తులో నాకు ప్రాణముల కంటే అధికులు. నీవు (రాధ) లక్ష్మీదేవి సావిత్రీ సరస్వతి బ్రహ్మ శివుడు అనంతుడు (నాగరాజు – స్వామిశయ్య) ధర్మదేవుడు బ్రాహ్మణులు గోపికలు గోపాలురు అందరును నాకు మీక్కిలి ప్రియులు. వారందరికంటే భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. భక్తుని కంటే ప్రియమైనవాడు వేరొకడెవడును లేడు. భక్తుల రక్షణకొరకు సుదర్శన చక్రమునిచ్చి కూడ నాకు ప్రసిద్ధిగానీ ప్రీతీగాని లేవు. అందుకే వారిని దర్శించుట కొరము స్వయముగా నేను పోవుచున్నాను.
ఓ సురేశ్వరీ! నా వలన దుర్వాసముని యొక్క దర్పభంగకథ వింటివి. ఓ భాగవతీ! ఇంకేమి వినగోరుచున్నావో ఆజ్ఞాపించుము అనెను.
శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :
ఓ జగత్తునకు గురువైన స్వామీ! పురాణ రహస్యమైన ధన్వంతరి యొక్క దర్పభంగమును గురించి చెప్పుము. దానిని వినుటకు నాకు మిక్కిలి ఆసక్తిగా నున్నది.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను:
రాధ మాటలు విని మధువను రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు వినుటకింపైనదియు ప్రాచీనమైనదియునగు కథను చెప్పుటకారంభించెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన దుర్వాసముని యొక్క గర్వభంగమనెడి ఏబదియవ అధ్యాయము సమాప్తము.
