4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
9 - నంద పుత్రోత్సవము
నారద ఉవాచ :
గోకులములో యశోదమందిరమున శ్రీకృష్ణునుంచి వసుదేవుడు తన గృహమునకేగెను. తరువాత నందుడేమీ చేసెను?
మహాప్రభువగు శ్రీహరి అక్కడ ఏమి చేసెను? ఆ ప్రభువచ్చట ఎన్ని సంవత్సరములుండెను? ఓ నారాయణమునీ! క్రమముగా నతని బాలక్రీడలను వర్ణించుము. పూర్వము గోలోకములో రాధతో చేసిన ప్రతిజ్ఞను ఏ విధముగా శ్రీహరి నెరవేర్చెను? బృందావనమనగా సెట్టిది? మండలమే విధమైనది? స్వామీ! రాసక్రీడను, జలక్రీడను చక్కగా వర్ణించి చెప్పుము. నందుడు యశోద రోహిణి ఏమి తపస్సు చేసిరి? శ్రీకృష్ణుని కన్న ముందు బలరాముడెక్కడ జన్మించెను? శ్రీహరి యొక్క ఆభ్యాసము (సమకాలము వాడు చూచి చెప్పిన సత్యకథ) అమృత ఖండము వంటిది. అపూర్వమైనది. విశేషించి కవి ముఖము నుండి క్రొత్త క్రొత్తగా వెడలిన ప్రతిపదము కలది. పరోక్ష వర్ణన వలన క్రొత్త వర్ణనలు గల కావ్యముత్తమమైనది. నీవు నేరుగా శ్రీకృష్ణాంశగలవాడవు. యోగీంద్రులలో గురువునకు గురువువు. కావున నీ రాసమండల క్రీడను స్వయముగా వర్ణించి చెప్పుము. ఏ వ్యక్తి ఎవని అంశమో వాడు ఆ మూలవ్యక్తి సుఖమును బట్టి సుఖము గలవాడగును. శ్రీహరి పాదములు నీచేతనే వర్ణింపబడినవి. మీరిద్దరు (నరనారాయణులు హరితో కలిసిన భాగములు నీవు నేరుగా గోలోకనాథుని అంశమువు. అతనితో సమమైన గొప్పదనముగలవాడవు.
నారాయణ ఉవాచ :
నారాయణముని ఇట్లు పలికెను :
ఓ నారదమునీ! బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు విఘ్నేశ్వరుడు ఆదీకూర్మము ధర్ముడు నేను నరుడు (నారాయణమహర్షి సోదరుడు} కుమారస్వామి ఈ మేము తొమ్మండుగురము శ్రీకృష్ణుని అంశగలవారము. ఏ ప్రభువును మేమే స్వయముగా ఎరుగజాలము. వేదము లెరుగజాలవు. అట్టి గోలోక నాధుని మహిమ వర్ణించనెవరి తరము! ఇక అతనిని గూర్చి విద్వాంసులేమెరుగుదురు?! ఆదివరాహము వామనుడు కల్కి బుద్ధుడు కపిల మహర్షి మత్స్యావతారమూర్తి వీరందరు స్వామీ అంశలే. ఇతరులు అతని కళలుగా ఉన్నవారని చెప్పబడిరి కదా!
ఆదికూర్మము నృసింహుడు శ్రీరాముడు శ్వేతద్వీపమందు విరాజిల్లు వ్యాపకమూర్తి అంశలు.
శ్రీవైకుంఠమున గోలోకమున నున్న స్వామియే స్వయముగా శ్రీకృష్ణుడయ్యెను కనుక శ్రీకృష్ణుడు పరిపూర్ణతముడు.
వైకుంఠలోకమున నున్న లక్ష్మీ మనోహరుడు రూపభేదమును బట్టి. నాలు హస్తములు గలవాడు. రాధావల్లభుడగు శ్రీకృష్ణుడు గోలోకమున గోకులమున తానుగా రెండు హస్తములు గలవాడాయెను.
ఇతనీ తేజస్సునే యోగిజనులు ఎల్లప్పుడు మనస్సున ధ్యానింతురు. భక్తులతనీ పాదపద్మములను ధ్యానింతును. తేజస్వి లేని తేజను ఎక్కడిది?
ఓ ద్విజుడా వినుము. ఏ కారణము వలన యశోదానందులు రోహిణియు శ్రీహరి (కృష్ణుడు) ముఖము దర్శించిరో ఆ మూలకారణము వర్ణింతును. వసువులలో శ్రేష్ఠుడైన ద్రోణుడనువాడు మంచి తపోధనుడు. అతడే నందుడుగా, ద్రోణుని ధర్మపత్నియగు ధరాదేవి {మంచీ తపస్వినీ} యశోదగా, సర్పముల తల్లియగు కద్రువ రోహిణిగా జన్మించిరి. వీరి జన్మచరిత్రను చెప్పుదును తెలిసికొనుము.
ఒకప్పుడు దంపతులైన ధరాద్రోణులు పుణ్యప్రదమైన భారత వర్షములో గంధమాదన పర్వతమునందు గౌతమాశ్రమ సమీపమున . పదివేల సంవత్సరములు తపస్సు చేసిరి. జన రహితమైన సుప్రభానదీ యొడ్డున శ్రీకృష్ణ దర్శనము కొరకు వారట్లు తపస్సు చేసిరి శ్రీహరిని దర్శించలేకపోయిరి. విరక్తి కలిగి వారు అగ్నికుండము చేసి అందులో పడి మరణించుటకు సిద్ధపడిరి. ఆ దంపతుల స్థితిని చూచి అశరీరవాణి ఇట్లు విన్పించెను. “పసువులలో శ్రేష్టుడా! ధ్యానమునకందనివాడును (విద్వాంసులకు కూడ} బ్రహ్మాది దేవతలచేత సమస్కరింపబడువాడును యోగీశ్వరుడునగు శ్రీహరిని దర్శించు భాగ్యము మీకిప్పుడు లేదు. ఇంకొక జన్మ భూమీ మీద పొంది గోకులమున పుత్రుని రూపమున శ్రీహరిని దంపతులగు మీరు దర్శించగలరు”. ఆ దేవవాణిని విని ఆ ధరాదేవియు ద్రోణుడును సుఖముగా తమ గృహమునకు పోయిరి.
భారతమున వారిద్దరు జన్మించి శ్రీహరి ముఖమును దర్శించిరి. వారే యశోదానందులు. వారి కథ నీకు చెప్పితిని, దేవతలకును తెలియని మిక్కిలి రహాస్యమైన రోహిణి చరిత్ర చెప్పెదను వినుము.
ఒకసారి దేవమాతయైన అదితి వసంతోత్సవ దినమునాడు వార్తాహరుని ద్వారా తన భర్తయగు కశ్యప ప్రజాపతిని ఆహ్వానించుచు విజ్ఞాపనము పం పెను. సుందరియగునాదేవి చక్కగా స్నానమాడి రత్నాభరణములు అలంకరించుకోని పలువిధములుగా మంచి వేషము కూర్చుకొని అద్దములో తన ముఖమును చూచుకొనెను. కస్తూరీ తిలకముతోబాటు సిందూరపు చుక్కబొట్టు, రత్నకుండలము శోభతోబాటు చెక్కిళ్లపై మకరికా పత్రరేఖలు, ఆభరణముల అలంకారము, ఏనుగు ముత్తెముతో కూడి మిక్కిలి మనోహరముగా నున్న తీర్చిన ముక్కు, శరదృతు పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖమండలము, శరత్కాలమందలి పద్మములవంటి కన్నులు, వంకరలు తిరిగియున్న బొమముడి, విచిత్రమైన కాటుకకొంత, పండిన దానిమ్మ వితులవంటి కాంతి గల పలువరుస చిరునవ్వుతో గూడి సుందరమై పండిన దొండపండు వంటి క్రింది పెదవితో ప్రకాశించుచు ఇట్లు మిక్కిలి కోరదగిన (చూచువారికి), మునీంద్రుల మనస్సులను మోహింపజేయునట్టి తన ముఖమును చూచుకొని మన్మథ బాణములచేత పీడింపబడీ భర్తవచ్చు మార్గమును. చూచుచు తన మందిరమున ఉండెను.
కశ్యపుడు శ్రేష్ఠమైన రత్నసంపదతో ప్రకాశించు వక్షస్థలము గల కద్రువతో కూడియున్నాడన్న వార్తను విని సాధ్వియగు అదితి భర్త సమాగమము కొరకు వణకుచు హతాశయై (ఆశచంపబడి) కోపము పొందెను. ఐనను పతిమీదీ అనురాగములో అతనిని శపింపక కద్రువ నిట్లు శపించెను, ధర్మమునందు నిలిచియుండియు ధర్మమును నశింపజేసిన కద్రువ స్వర్గమున నుండదగదు. స్వర్గలోకము నుండి దూరముగా తొలగిపోవు గాక. మానవజన్మనెత్తుగాక.
ఆ కద్రువ వార్తాహరుని వలన శాపవార్త విని ఆమె కూడ దేవమాతయగు అదితికి భూలోకమున ముసలితనముతో కూడి యుండు మానవజన్మనెత్తుగాక అని శాపమొసగెను.
సర్పమాత యయిన కద్రువసు కశ్యపుడు “ఓ ప్రకాశించు చిరునవ్వుగలదానా! యోగ్యమైన కాలములో నాతో కలిసి భూలోకమున మనుష్య జన్మనెత్తుదువు. అప్పుడు శ్రీహరి ముఖమును దర్శింతువు కనుక శాపభీతి వదలుము. సుఖము పొందుము” అనీ ఓదార్చి అదితి గృహమున కేగెను.
జ్ఞానబలాది షడ్గుణ విరాజితుడు విభువైన కశ్యపుడు ఋతుస్నాతమైయున్న అదితి కామవాంఛను తీర్చెను. ఆ సందర్భముననే ఆమెకు దేవరాజైన మహేంద్రుడు జన్మించెను. అదితియే దేవకిగా కద్రువయే రోహిణిగా కశ్యపుడే శ్రీకృష్ణ జనకుడగు వసుదేవుడుగా జన్మించిరి. సారదా! ఇదీ దాచదగిన దేవరహస్యము దీనిని నీకిపుడు చెప్పితిని. ఊహకందని మహిమలు గలవాడును సహస్ర శీరములు గలవాడును ప్రభువునగు అనంతుని అంశతో జన్మించిన బలదేవుని కథను వినుము.
వసుదేవుని భార్యలలో శ్రేష్ఠురాలు ప్రియురాలు ఐనది రోహిణి. ఆమె భర్త ఆజ్ఞ వలన తన గర్భమున బడిన సంకరుని రక్షకోరకు కంసునికి భయపడి గోకులమునకు పోయెను. దేవకి ఏడవ గర్భమునే శ్రీహరి ఆజ్ఞననుసరించి విష్ణుమాయ గ్రహించి గోకులమున నున్న రోహిణి గర్భమున ప్రవేశ పెట్టి (కంసుని వ్యామోహపరచుటకే శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అనంతుడు దేవకి గర్భమున చేరి అటునుండి రోహిణిగర్భమునకు మార్చబడెను. అందుకే అతనికి సంకర్షణుడన్న పేరు కలెను) కైలాసమునకేగెను.
కొన్ని దినముల తరువాత నందమందిరమున రోహిణిదేవి మెరియుచున్న వెండి వంటి శరీర కాంతి గలవాడును చిరునవ్వుతో ప్రసన్న ముఖము గలవాడును బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్నవాడును కృష్ణాంశగల మహానుభావుడు నగు పుత్రుని గనెను.
అతడు జన్మించగనే దేవతలానందించిరి. స్వర్గలోకమున ఆనకములు, మురజములు దేవదుందుభులు మ్రోగెను. దేవతలు సంతోషములో జయజయ ధ్వనులు చేసి శంఖములూదిరి. నందుడానంద పరవశుడై మిక్కిలి ఆదరముతో ఆ వసుదేవుని పుత్రునకు (రోహిణీ పుత్రునకు) జన్మోత్సవము చేయుచు బ్రాహ్మణులకనేక విధముల ధనమును దానమొనర్చెను. దాది శిశువు బొడ్డుకోసి బాలకుని స్నానమాడించెను. అప్పుడు యశోదాదేవియు సంతోషముతో బ్రాహ్మణులకు ధనమును గోపికలకు నానావిధ వస్తువులను నూనెను సిందూర కుంకుమను పంచిపెట్టెను. నాయనా నారదా! ఇట్లు నీకు యశోదానందుల పూర్వ జన్మతపస్సు హాలీ (సాగలీ ఆయుధముగా గల బలరాముడు) యొక్క జన్మకథ రోహిణీ చరిత్రము చెప్పబడినవి.
ఇపుడు నీవు కోరదగిన నందపుత్రుని యొక్క (శ్రీకృష్ణుని) జన్మోత్సవమును వినుము. కృష్ణ చరితము మంగళకరమైనది. జన్మచరణములు ముసలితనము అనువానిని తొలగించునది. ప్రపంచమున సారవంతమై మోక్షప్రదమై సుఖానందములిచ్చునది. సర్వవిధములైన అశుభములను నశింపజేసి హరి భక్తిని హరిదాస్యము నిచ్చునది. విష్ణు భక్తులకు ప్రాణాధారమైనది.
వసుదేవుడు శ్రీకృష్ణుని నందునియింట నుంచి అక్కడున్న బాలిను తీసుకొని సంతసముతో తన యింటికి (మధురకు) పోయెను. ఆ బాలిక చరిత్రము ఇంతవరకే చెప్పగా విని యుంటివి.
వసుదేవుడట్లు వెడలి పోగా ఇక ఇక్కడ గోకులములోని మంగళకరమైన కృష్ణ చరిత్రను వినుము, శుభప్రదమైన పురిటింట్లో యశోదానందులు భూమి మీద నున్న పుత్రుని చూచిరి. అతడు మిక్కిలి సుందరముగా నగ్నరూపముతో క్రొత్త మేఘము వంటి కాంతిలో ఇంటి పైకప్పును చూచుచుండెను. అతని ముఖము శరదృతువులోని నిండుపున్నమి నాటి చంద్రుని వలె నుండెను. కన్నులు నల్లకలువలవలే నుండెను. ఒకసారి ఏడ్చుచుండెను. మరియొకసారి నవ్వుచుండెను. పిల్లన గ్రోవి ధరించియుండెను. మనోహరమైన పాదములు చక్కని రెండు చేతులతో నున్న ఆ శ్రీహరిని (బాలుని) చూచీ యశోదానందులు మిక్కిలి హర్షము పొందిరి. వారికాపురిటిల్లు జయశ్రీతో కూడి జయగృహమయ్యెను.
దాది శిశువు యొక్క నరమును (నాభి) ఖండించి చల్లని నీట ఆ బాలుని స్నానమాడీంచెను. సంతోషముతో గోపికలు జయ జయనాదములు చేసిరి. గొప్ప పిరుదులు కదలుచున్న స్తనములు గల గోపికలందరు, బాలికలు, యశోద స్నేహితురాండ్రు బ్రాహ్మణుల భార్యలు నందునింటికి చేరవచ్చి సంతోషముతో బాలుని జూచిరి. ఆ తల్లికి ఆశీర్వాదములు చేసిరి. కొందరు బాలుని రూపమును తల్లి భాగ్యమును పొగడుచు పిల్లవానీని తమ ఒడిలోనికి తీసుకొనిరి. కొందరక్కడ కూర్చుండిరి.
నందుడు పుత్రదర్శనము కాగానే సచేలస్నానము చేసి ఉతికిన రెండు వస్త్రములు ధరించి హార్షించిన మానసముతో లోకాచారక్రమముననుసరించి శాస్త్రవిధినీ ఆచరించెను. బ్రాహ్మణులను భుజింప చేసి మంగళ వాద్యములు మ్రోగుచుండగా పుణ్యాహవాచన మంగళము చేయించెను. వందిజనులకు ధనమిచ్చెను. ఆనంద పరవశుడై జాతి రత్నములను, పగడములు, వజ్రములు, ఏడు నువ్వుల రాసులను, నూరు బంగారు నాణెములను, పిండిని, ధాన్యరాశిని, వస్త్రములను, వేయి ఆవులను, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, శర్కర తేనె, పక్వాన్నము, లడ్డూలు, రుచిగల అప్పాలను, అన్ని పంటలు పండు భూమిని, వాయువేగము గల గుఱ్ఱములను, తాంబూలములను, సుగంధ తైలములను సద్ బ్రాహ్మణులకు దానమొనర్చి సంతసించెను.
పురుటింటిని రక్షించుట కొరకు (ష కీడు సోకకుండ) నందుడు రక్షామంత్రము లెరిగిన బ్రాహ్మణులను, ముదుసలులైన గోపికలను ఏర్పరచెను. వేదములను మంగళకారణమైన శ్రీహరి నామావళిని చదివించెను. భక్తితో సమస్త దేవతలను బ్రాహ్మణుల చేత పూజింపజేసెను. రత్నముల యలంకారములు అలంకరించుకొన్న ముదుసలి గోపికలు చిరునవ్వుతో త్వరగా నడచుచు నందునింటికి చేరవచ్చిరి. అనేక విధములుగా లెక్కలు గట్టి జాతకములు వ్రాయువారు, వాక్సిద్ధి గలవారు అగు జ్యోతిశ్శాస్త్ర పండితులు పుస్తకములు పట్టుకొని నందునింటికి వచ్చిరి. బ్రాహ్మణుల భార్యలు కొడుకులు బిడ్డలు వెంటరాగా యువతులు వృద్ధ స్త్రీలు సుందరీమణులు నందుని మందిరమునకు చిరునవ్వు వెలుగుచుండగా వచ్చిరి.
గోకుల నాథుడగు నందుడు తన యింటికి చేరవచ్చిన వారందరికి రత్నములను వివిధ ధనములను శ్రేష్ఠమైన వస్త్రములను వెండిని గోసహస్రములను ఆదరముగా దానమిచ్చి నమస్కరించి సంతోషముగా తన వినయమును ప్రకటించెను. వారందరతనికి ఆశీస్సులు సమకూర్చి లోకాతీతుడైన ఆ బాలుని దర్శించిరి. ఇట్లు నందుడు అన్ని కార్యములు నెరవేర్చను.
నందుడు గణములతో బాలుని శుభాశుభ భవిష్యత్తును (జాతక ఫలితమును వ్రాయించెను). ఇట్లు బోలుడు శుక్ల పక్షమున చంద్రుని వలె వృద్ధిపొందెను. నందుని యింట బలరాముడును తల్లిపాలు త్రాగుచు పెరిగెను. రోహిణియు నందుడొనర్చిన పుత్రోత్సవము చూసి సంతోషముతో తానును ఆ వచ్చినవారికి సిందూరమును, తెలమును తాంబూలములను, ధనమును దానమొనర్చెను. వారు తల్లికొడుకుల శిరస్సులపై ఆశీస్సులు (అక్షతలు) ఇచ్చి తమ గృహములకేగిరి. ఇట్లు ,యశోదానందులు రోహిణి ఆయింటిలో సంతోషముగా నుండిరి.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద నంవాదములో నందపుత్రోత్సవ మనెడి తొమ్మిదవ అధ్యాయము నమాప్తము.
