4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
123 - అధ్యాయము
మూ॥ నారద ఉవాచ :
శ్రీకృష్ణ ఉవాచ :
నారదుడిట్లా - గణేశుని పూజకు చెందిన కథ పురాణములలో దుర్లభము. బ్రహ్మచెప్పగా విన్నాను. అది, సాధారణమైనది, సంక్షిప్తమైనది (1) అందరికి పూజ్యుడు ఈశ్వరుడు ఐన గణపతి మహిమను విస్తరంగా వినదలిచాను. ఆతడు యోగీంద్రులకు గురువైన వారికి గురువు. (2) ఇదివరలో దేవతలు సిద్ధాశ్రమంలో మహాపూజను చేశారు. ఇదివరలో అక్కడ రాధామాధ వులకలయిక తిరిగి జరిగింది. (3) నూరు సంవత్సరాలు గడిచాక శ్రీరాముని శాపమోక్షణం అయ్యాక తొలుత పూజను ఆతడు, రాధ ఎట్లా చేశారు, ఓముని! (4) సురేంద్రులు, బ్రహ్మ, విష్ణు శివాదులుండగా నాగేంద్రుడు శేషుడుండగా అనేకమైన నాగులుండగా (5) భూమిపై రాజేంద్రులు బలిష్ఠమైన అసురులుండగా, గంధర్వులు, రాక్షసులు, ఇతరులు ఇంకా బలవంతులుండగా ఎట్లాచేశారు. (6) ఓమహాభాగ! విస్తరంగా దానిని నాకు వ్యాఖ్యానించుటకు మీరేతగుదురు. అనగా (7) శ్రీకృష్ణుడిట్లా - ముల్లోకములలో పృథివిధన్యురాలు, మాన్యురాలు, పుణ్యవతి, సతి అక్కడ భారతవర్షము (దేశము) కర్మలకు ఫలమిచ్చేది శుభమైనది. (8) పుణ్యక్షేత్ర మైన భారతంలో ధన్యమైనది, కీర్తికరమైనది పూజించతగినది సిద్ధాశ్రమము. అది మహాపుణ్యక్షేత్రము, మోక్షాన్నిచ్చేది, శుభమైనది. (9) భగవాన్ సనత్కుమారుడు, అక్కడ సిద్ధుడైనాడు. విధాత స్వయంగా అక్కడక తపస్సుచేసి సిద్ధుడైనాడు. (10) యోగీంద్రులు మునీంద్రులు, సిద్ధేంద్రులు, కపిలాదులు, సిద్ధులైనారు. నూరు యజ్ఞములను ఇంద్రుడు అక్కడ చేసి సిద్ధిని పొందాడు. అందువలన సిద్ధాశ్రమమనేది అందరికి దుర్లభమైనది. ఓముని! అక్కడే ఎల్లప్పుడు గణేశునకు అధిష్టానము. (12) అమూల్య రత్నములతో, నిర్మింపబడ్డ గణేశ ప్రతిమను, శుభమైన దానిని వైశాఖ పూర్ణిమ యందు దేవతలు పూజిస్తారు. (13) నాగులు, మానవులు, దైత్యులు, గంధర్వులు, రాక్షసులు, సిద్ధేంద్రులు, మునీంద్రులు, యోగీంద్రులు, సనకాదులు (14) పూజచేస్తారు. శంభవు శంకరుడు, పార్వతితో కూడి అక్కడికి వచ్చాడు. గణములతో కార్తికేయుడు, స్వయంగా ప్రజాపతి బ్రహ్మవచ్చారు. (15) అక్కడికి నాగేంద్రులతో కూడా త్వరగా వచ్చాడు. అక్కడికి దేవతలంతా, మనువులు, మునులు వచ్చారు. (16) ఆనందించిన మనస్సుగలవారై పూజకొరకు ఆరాజులంతా వచ్చారు. ద్వారకా వాసులతో కూడా భగవాన్ కృష్ణుడు వచ్చాడు.
అను ॥ గోకులవాసులతో కూడినందుడు వచ్చాడు. గోలోకమందుండే శతకోటిగోపికలతో, (18) కోటిగజేంద్రములతో సమానమైన బలిష్టులైన చెలికత్తెలతో కూడా, కృష్ణుని ప్రాణఅధిదేవతయైన సుందరి రాధ వచ్చింది. (19) రాసక్రీడకు ఈశ్వరి, మంచి రసికురాలు, నూరు వత్సరములు గడిచాక, చక్కగా స్నానం చేసి, శుదురాలై మంచిపలువరుసగలిగి, ఉతికిన వస్త్రములు ధరించి (20) మంచి అదుపు కలిగి, ఆమె నిరాహారంగా మణిమండపానికి వెళ్ళి, పాదాబ్జములను చక్కగా కడుగుకొని, మనోహరమైన, లోకములలో పావనురాలైన ఆమె (21) శ్రీకృష్ణుని పొందాలనే కోరికగలిగి చక్కగా సంకల్పం చేసి గంగాజలంతో హేరంబుని, భక్తితో స్నానం చేయించింది. (22) తెల్లని పూలతో సామవేదోక్తముగా ధ్యానం చేసింది. నాలుగు వేదములకు మాత ధనమునకు, లోకములకు మాత (23) బుద్ధిరూపురాలు, భగవతి, జ్ఞానులకు జనని, పరురాలు, ధ్యానాత్మకుడైన తనపుత్రుని, ఆతనిని ఆపరురాలు ధ్యానం చేసింది. (24) సర్వుడు, లంబోదరుడు, స్థూలుడు, బ్రహ్మ తేజస్సుతో జ్వలిస్తున్నవాడు, గజవక్రుడు. అగ్ని వర్ణుడు, ఏకదంతుడు, అనంతకుడు (25) సిద్దులకు యోగులకు జ్ఞానులకు గురువునకు గురువు, మునీంద్రులు, దేవేంద్రులు, బ్రహ్మ ఈశ, శేష అను పేర్లుగల దేవతలచే ధ్యానింపబడేవాడు. (26) సిద్ధేంద్రులు, మునులు, సజ్జనులు వీరితో ధ్యానింపబడేవాడు. భగవంతుడు, సనాతనుడు, బ్రహ్మస్వరూపుడు, పరముడు, మంగళుడు, మంగళమునకు ఆలయము (27) సర్వవిఘ్నములను హరించేవాడు, శాంతుడు, అన్ని సంపదలనిచ్చేవాడు. భగసాగరాన్ని మాయా అనే తెప్పతో దాటటానికి కర్మలు చేసేవారికి కర్ణధారి (28) శరణాగతులైన దీనులను ఆర్తులను రక్షించడానికి ఆసక్తిగలవాడు, ధ్యానాత్మకుడు, సాధ్యుడు, భక్తులకు ఈశుడు భక్తవత్సలుడు ఆతనిని ధ్యానించాలి. (29) అనిధ్యానించి పూపును ఆసతి తిరిగి తన శిరస్సుయందు ఉంచుకొని, సర్వాంగ శోధనరూపమైన న్యాసమును వేదోక్తంగా ఆమె చేసింది. (30) తిరిగి ఆధ్యానంతోనే, శుభమిచ్చేదానితో, ధ్యానించి రాధ లంబోదరుని పాదపద్మమందు పుష్పమునుంచింది. (31) చల్లని, వాసనగల ఏడు తీర్దముల ఉదకముతో వానితో ఆతని పాదపద్మములపై పద్మమునుంచింది. ఆపాదములు పద్మాదులు అర్చించినవి. (32) దూర్వ అక్షతలు, తెల్లని పూలు, వాసనగల చందనపు నీరు వీనితో ఆతని తల పై అర్ఘ్యమిచ్చింది. స్వయంగా గోలోకవాసిని రాధ (33) చందనముతోకూడిన పారిజాతపుమాలను, నిగనిగలాడుతున్న సుందరమైన దానిని గణేశుని కంఠమందు, స్వయంగా రాసేశ్వరి ఆనందంతో వేసింది.
కస్తూరి కుంకుమలతో కూడిన వాసనగల మృదువైన చందనమును, బృందావనంలో ఆనందించే ఆమె, ఆతని సర్వాంగములందు వేసింది. (35) వాసనగల తెల్లని పూలను, వాసనగల చందనపు పూతను అతని పాదాంబుజముల పై, మహాపద్మాలయ, సతి ఉంచింది. (36) మంచివాసనగల ధూపమును, పవిత్రమైన వస్తువులతో కూడిన దానిని కృష్ణప్రియ, ఆజగదీశ్వరునకు ఇచ్చింది. (37) చీకటిని తొలగించడానికి కారణమైన నేతితో వెలిగించిన దీపమును ఆసురేశునకు, చాలా పురాతనురాలైన, ఆసనాతని ఇచ్చింది. (38) రకరకాలైన రమ్యమైన రుచికరమైన, చాలా మనోహరమైన నైవేద్యమును, పీల్చతగిన (చోష్యము) చర్వ్యము (నమలతగిన) నాకతగిన (లేహ్యము) తాగతగిన నాలురకాలైన ఆహారమును, అమృతంతో సమానమైనదానిని (39) బాగా పండిన పండ్లను ముల్లోకములలోనూ లభించనివానిని, మధురమైన మూలములను (గడ్డ) గ్రామమందుండేవి, అరణ్యమందుండేవి ఇచ్చింది. ఓ నారద! (40) అవిలెక్కింప రానంత సంఖ్య గలవి, నువ్వుల లడ్డులను, బాగా పండిన చాలా రమ్యమైన , రుచికరమైన, మంచిరసముగల, (41) యవలు గోధుమలు వీని పిండితో చేసిన పక్వమైన (ఉడికిన) పిండివంటలను, నేయిలో ముంచబడిన, శర్కరతో కూడిన రమ్యమైన వంటలను (42) స్వస్తిక ఆకారం గల, పెద్దవైన సుందరమైన లడ్డులను, రకరకాలైన పదార్థములు, చిన్నచిన్నముక్కలతో చేసిన పదార్థములు, పాడుకానివి, శర్కరతో కూడిన వానిని ఇచ్చింది. (43) నేతికాలువలు, పాలకాలువలు, తేనెకాలువలు, మనోహరమైనవి, బెల్లము పానకము, పెరుగుకాలువలు పాయసము కాలువలు (అంత అధికంగా అని) (44) పిండివంటల, స్వస్తికముల, అరటిపళ్ళ రాసులే ఇచ్చింది. తీయని వ్యంజనములతో కూడిన శుభమైన శాలిధాన్యము అన్నమును (వరిబియ్యం) (45) ఇవన్నీ, కృష్ణుని ప్రాణాధిదేవతయైన రాధ, ఆ సురేశునకు (గణపతి) ఇచ్చింది. వెలలేని రత్నములతో నిర్మించిన, రమ్యమైన,శ్రేష్టమైన సింహాసనాన్ని ఇచ్చింది. (46) విఘ్ననాశకునకు, విరజానది ఒడ్డుయందు నివసించే ఆమె రమ్యమైన, అమూల్యమైన, వహ్నితో శుద్ధమైన సూక్ష్మమైన రెండు వస్త్రములనిచ్చింది.
శ్రీరాధికోవాచ :
అను ॥ శతశృంగమందుండే రాధిక పార్వతికొడుకునకు, శ్రేష్టమైన రమ్యమైన, కర్పూరాదివాసనగల తాంబూలమిచ్చింది. (48) వృషభానుని సుత అన్ని సంపదలనిచ్చే ఆతనికి, శుద్దమైన, చాలా పవిత్రమైన, మంచివాసనగల సప్తతీర్థముల నీటిని ఇచ్చింది. (49) ఆనందంతో ఆగోపీశ్వరి ఆతనికి తాగటానికి నీటిని ఇచ్చింది. అమూల్యమైన, దుర్లభమైన, స్వచ్ఛమైన శ్వేతచామరమును ఇచ్చింది. (50) పరేశుడు ఐన ఆతనికి, మూలప్రకృతియైన ఈశ్వరి, అమూల్యమైన రత్నములతో నిర్మించిన, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు వీనితో నిర్మించిన (51) తీర్చి దిద్దబడ్డ, పుష్పములు చందనముతో పూయబడిన మంచి పడకను ఏర్పరచింది. దాని పై తెల్లని సన్నని వస్త్రము అంతట పరచబడింది. (52) శివుని కొడుకు గణపతికి, కృష్ణుని వక్షఃస్థలమందుండే రాధిక, అడిగినవానినిచ్చే దూడతో కూడిన కామధేనువును ఇచ్చింది. (53) అనేకమైన వాటిని ఇచ్చి వృందపుష్పాంజలిని ఇచ్చింది. బీజాక్షరములతో కూడిన, ఉజ్జ్వలమైన దివ్యమైన ఈ మంత్రముతో (54) షోడశోపచారములను కాళింది నది ఒడ్డుయందుండే ఆమె ఇచ్చింది. ఓం గం గౌం విఘ్ననాశకుడైన గణపతికి స్వాహా. (55) అని ఇట్లాగే పదహారు అక్షరములు గల గణేశ మంత్రమును వేయిసార్లు ఆమె జపించింది. అది, పరమైనది కల్పతరువు వంటిది, వరమైనది. (56) భక్తితో తన తలను వంచి మిక్కిలి భక్తితో స్తుతించింది. స్తోత్రముతో ఆమె కళ్ళల్లో నీళ్ళొచ్చాయి, ఒళ్ళంతా పులకరించింది. కుతూహలం కలిగింది. (57) శ్రీరాధిక ఇట్లా - పరమైన స్థానము, పరమైన బ్రహ్మ పరేశుడు, పరమైన ఈశ్వరుడు. విఘ్నములను నశింపచేసేవాడు, శాంతుడు, పుష్టికలవాడు, మనోహరమైనవాడు, అంతములేనివాడు. (58) సుర, అసుర ఇంద్రులతో, సిద్దేంద్రులతో స్తుతింపబడిన పరాత్పరుని స్తుతిస్తున్నాను. సురపద్మదినేశుడు (దేవతలనే పద్మమునకు సూర్యుడు) మంగళమునకు ఆలయము, ఐన గణేశుని స్తుతిస్తున్నాను. (59) ఈ స్తోత్రము మహాపుణ్యప్రదమైనది. విఘ్నముల వల్ల కలిగే శోకమును నశింపచేసేది, పరమైనది. ప్రొద్దునలేచి చదివిన వారికి అన్ని విఘ్నములనుండి విముక్తి లభిస్తుంది. (60) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు 'నారాయణ నారద సంవాదమందు నూట ఇరువది మూడవ అధ్యాయము.
