4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
20 - గోవత్సబాలక హరణ ప్రస్తావము
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఆనెను :
ఒకసారి శ్రీకృష్ణుడు బలదేవునితో బాటు తృప్తిగా ఇష్ట పదార్ధములు తిని త్రాగి శ్రీగంధము పరిమళ ద్రవ్యములు శరీరమున పులుముకొని గోపాలబాలురతో కలిసి బృందారణ్యముమునకేగెను. ఆ స్వామి క్రీడలయందాసక్తుడై వారితో నాడుకొనుచుండగా మేతమేయు చున్న గోబృందము (ఆవులు దూడలు) అక్కడి నుండి దూరముగా బోయెను. ఆటలలో మునిగియున్న వీరది గమనించకుండిరి.
శ్రీకృష్ణుని మహిమను తెలిసికొనుటకై సృష్టికార్యము వలన జగములకు ప్రభువైన బ్రహ్మ ఆవులను దూడలను గోపాల బాలకులను కూడ మొత్తము నెక్కడనో దాచి పెట్టెను. సర్వజ్ఞుడు సర్వము చేయగలవాడైన స్వామి బ్రహ్మ అభిప్రాయమును తెలిసికొని యోగీంద్రుడు కనుక తన యోగమాయాశక్తితో అపహరించిన దాచిపెట్టబడిన మొత్తము జీవకోటిని (ఆవులు దూడలు బాలకులు) మరల సృష్టించెను. సాయంకాలము వేళకు బ్రహ్మ మూలముగా సంభవించిన ఈ నటనాక్రీడయందు ఆసక్తి గల మనస్సుతో గో గణమును గోపాలురను కూర్చుకొని బలదేవునితో బాటు గృహమునకేగెను. ఇట్లా భగవంతుడు ప్రతిదినము మాయా సృష్టియైన గోగణమును గోపాలబాలురను వెంట తీసుకొని బలదేవునితో బాటు యమునా తీరమునకు పోయి వచ్చుచు ఒక సంవత్సరము నడిపెను.
బ్రహ్మ శ్రీహరి ప్రభావమును తెలిసికొని తాను చేసిన పనికి సిగ్గుతో తన తలవంచుకొని భాండీర వనములో మజ్జి చెట్టు క్రింద నివసించియున్న శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చెను. తన గణమైన నక్షత్రములతో కూడి పార్వణ చంద్రుడు (పున్నమినాటి చంద్రుడు) వెళ్లినట్లు గోగోపబాలుర నడుమ నున్న శ్రీకృష్ణుని దర్శించెను.
శ్రీహరి పీతాంబరము ధరించి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు సంతోషముతో చిరునవ్వు నవ్వుచు రత్న సింహాసనమందుండెను. రత్నాల భుజకీర్తులు రత్నాల కడియములు రత్నాల అందెలతోను వెలుగుచు రత్నాల కుండలముల (చెవికమ్మలు) కాంతితో తన కపోలములు గొప్పగా ప్రకాశింపగా కోటిమన్మధ సుందరుడు మనోహరమైన లీలలకు నెలవైన వాడుగా నున్న స్వామి చందనము అగురు కస్తూరి కుంకుమలచేత పూజింపబడిన మూర్తి గలవాడు. పారిజాత పుష్పమాలలతో అలంకరింపబడినవాడు క్రొత్తనైన మేఘము వలె నల్లని వాడు ఉదయించుచున్న నవ యౌవనము కలవాడు, మాలతీ పుష్పముల దండను ధరించి నెమిలి ఈకతో అలంకరింపబడిన కొండెకొప్పుతో, తన దేహ సౌందర్య కాంతితో అలంకరింపబడుచున్న అలంకారములు గలవాడు - శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని కాంతిని దొంగిలించినట్లున్న సుందర ముఖము కలవాడు - పండిన దొండపండు వంటి క్రింది పెదవిలో గరుత్మంతుని ముక్కు వంటి నాసిక (ముక్కు) తో - శరదృతువులో మధ్యాహ్న కాలమందలి వికసిత పద్మముల కాంతిని దొంగిలించు నేత్రములతో - ముత్యాల చాలును తిరస్కరించు మనోహరమైన పలువరుసతో - వక్షస్థలమున మిక్కిలి ప్రకాశించుచున్న కౌస్తుభమణితో - పరిపూర్ణతముడు శాంతుడు రాధాప్రియుడైన పరమాత్మ విరాజిల్లుచుండెను. అట్టి పరమ ప్రభువును బ్రహ్మదర్శించి మిక్కిలి విస్మయము పొంది ప్రణమిల్లెను. ఆ పరమేశ్వరుని దర్శించి దర్శించి మరల మరల నమస్కరించెను.
ఓ నారదా! తన హృదయ కమలమున ఏ రూపము బ్రహ్మకు కన్పించెనో అదియే బయట కన్పించెను. ఏ మూర్తి ముందు కన్పించెనో అదియే వెనుక వైపునను చుట్టును కన్పించెను. ఆ బృందావనమంతటను కృష్ణునితో సమమైన ఆకారమే చూచి ఆ జగత్కర్త ఆ రూపమునే ధ్యానించి ధ్యానించి అచ్చట నిలబడెను. ఆవులు దూడలు గోపాలబాలురు తీగలు చెట్లు పొదలు బృందావనమంతయు బ్రహ్మకు శ్యామసుందరువి రూపముగా కన్పించెను.
ఇట్లు మిక్కిలి ఆశ్చర్యమైన దృశ్యమునతడు చూచి మరల ధ్యానమొనర్చి ముల్లోకములలో కృష్ణుడు తప్ప దేనిని బ్రహ్మ దర్శించకుండెను. వృక్షములెక్కడ? పర్వతములేక్కడ? భూమి యెక్కడ? తానెక్కడ? జగత్తునకు బీజమెక్కడ? స్వర్గమెక్కడ? శ్రీకృష్ణుడెక్కడ? బ్రహ్మ తన దృష్టితో సర్వమును శ్రీహరి మాయగా దర్శించెను.
జగత్తులకు నాధుడైన కృష్ణుడేమి? అతని మాయ వలన నేర్పడిన విభూతులేమి? సర్వమును కృష్ణమయముగా దర్శించి ఆ బ్రహ్మ ఏమి పలుకుటకు (నిర్వచించుటకు) సమర్ధుడు కాకుండెను.
ఏమని స్తోత్రమొనర్తును? ఏమి చేయుదును? అని మనస్సున తలచి అక్కడ నిలిచి బ్రహ్మ మంత్రజపము చేయబూనుకొని సుఖమైన యోగాసనమున కుదురుగా కూర్చుండి చేతులు ప్రార్థనా ముద్దగా పట్టి శరీరము మొత్తము పులకలెత్తగా ఆనందబాష్పములతో మిక్కిలి దీనునివలె తనను భావించుకొనెను. ఇడ సుషుమ్న మధ్య పింగళ నలిని ధుర అనెడి ఆరు నాడులను ప్రయత్న పూర్వకముగా యోగధారణతో బంధించి మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరము మనోహరము విశుద్ధము పరమాజ్ఞ అను షట్చక్రములను బంధించి అతడు క్రమముగా వాయువును ఆరు చక్రములను లంఘింపజేసి బ్రహ్మరంధ్రమున దానిని బంధించెను. బంధింపబడిన మధ్యనాడీగతమైన వాయువును హృదయకమలమునకు తెచ్చి అటునిటు త్రిప్పి హృదయకమలమున మరల మధ్యానాడితో ప్రాణవాయువును సంయోగపరచెను (కుదురు పరచెను).
ఇట్లు యోగ సమాధి గతుడై చలన రహితుడై పూర్వము శ్రీహరి తన కనుగ్రహించి ఉపదేశించిన ఆ స్వామి యొక్క దశాక్షరీ మంత్రమును జపించెను.
నారదా! స్వామి పాదపద్మములను ధ్యానించి ధ్యానించి ఒక ఐదు గడియలకాలము జపము చేసి బ్రహ్మ తన హృదయకమలము . నందు సర్వతేజస్సులొకముద్దయైనట్టి తేజో రాశిని చూచెను. ఆ తేజస్సు నడుమ మిక్కిలి మనోహరముగా నున్న ఒక దివ్యరూపమును దర్శించెను. పీతాంబరధారియై రెండు బాహువులతో - మురళిని ధరించిన హస్తముతో - కర్ణమూలములందు వెలుగుచున్న మకరకుండలములతో - చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలముతో - భక్తులననుగ్రహించుటకు త్వరపడుచున్న ఆ రూపమును. - మొదట బ్రహ్మరంధ్రమున ఆ తరువాత హృదయ కమలమున దర్శించిన దానినే - బయట అంతటను ఆశ్చర్యకరమైన ఆ రూపమునే చూచి ఆ పరమేశ్వరుని స్తుతించెను (3ఽ-35).
ఓ నారదా! సృష్టియంతయు ఒకే సముద్రముగా నున్న కాలములో ఆ మధ్యప్రదేశమున శ్రీహరి తనకేస్తోత్రముపదేశించెనో - ఆ పరమేశుని ఆ స్తోత్రవిధితోనే భక్తితో వంగిన శిరస్సు గలవాడై బ్రహ్మ స్తుతించెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను :
కనిపించుచున్న ఈ సర్వసృష్టి తన స్వరూపమైన వాడును సర్వమునకు ఈశుడును ఈ ప్రపంచమునకు మూలమైన దానికిని మూలమైన వాడును, (సృష్టికి మూలమైన వాటిని కూడ సృష్టించిన వాడు) సర్వజ్ఞాన జీవులచేతను ఇట్లని నిర్వచింపరానివాడును, మంగళరూపుడును, క్రొత్తమేఘము వలె తాపమును పోగొట్టు ఆకారము గలవాడును నల్లని వన్నెయైనను సుందరమైన విగ్రహము (మూర్తి) గలవాడును, సర్వజీవులలో అంతరాత్మగా నుండియు వారి సుఖదుఃఖములు పుణ్యపాపములు అంటకుండ వారు చేయు కర్మలకు సాక్షిరూపమున నుండువాడును, తనయందే తానానందించుచుపూర్ణకాముడైన వాడును (వాంఛలు తీరినవాడు - సత్యకాముడు) జగత్తంతట వ్యాపించినవాడైనను జగత్తుకంటే ఇతరుడును, అన్నిరూపములు తానైన వాడును సర్వము చరాచర ప్రపంచకోటికి బీజము వంటివాడును సనాతనుడును, సర్వమునకు తాను ఆధారమైనవాడును సర్వజ్ఞానులలో శ్రేష్ఠుడును, సర్వశక్తులతో కూడినవాడును, సర్వులకు ఆరాధ్యుడు (ఆరాధించపదగినవాడు)ను, సర్వజీవకోటి అజ్ఞానము పోగొట్టు గురువును, సర్వశుభములకు మూలమైన వాడును, సర్వమంత్రములు తన స్వరూపమైనవాడును, సర్వ సంపదలు కల్గించు శ్రేష్ఠుడును, శక్తి యుక్తుడును, తనయందు లేని దొకటి వచ్చి చేరవలసిన స్థితి లేని వాడును తన స్వేచ్ఛారూపమున అంతట ఆవరించి యుండువాడగు స్వామికి నమస్కరించుచున్నాను. స్తుతించుచున్నాను. సర్వశక్తులకు ప్రభువును, ఆ శక్తులకు బీజమైన వాడును, ఆశక్తి రూపములను ధరించువాడును, వాటికన్న శ్రేష్ఠుడును, ఘోరమైన సంసార సముద్రమున శక్తియను ఓడతో గూడినవాడును, దయావంతుడును భక్తులయందలి వాత్సల్యముతో ఆ ఓడను నడపు కర్ణధారుడును, ఆత్మలు తన స్వరూపమైనవాడును, రహస్యమైనవాడును, అన్నిటికి తాకియుండియు ఏది అంటని వాడునగు వానికి నమస్కరించుచున్నాను.
తన ఇచ్ఛను బట్టి సగుణముగాను నిర్గుణముగాను స్వరూపము గలవాడుగా నుండు పరబ్రహ్మను నేను స్తుతించుచున్నాను. దేహధారుల యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియములపై అధికారము గల దేవుడును (అధి దేవత) ఆ ఇంద్రియములను తన ఉనికిగా చేసుకొనువాడును అన్ని యింద్రియముల స్వరూవము తానే ఐనవాడును అంతటను వ్యాపించు మహారూపుడగు వానికి నమస్కరించుచున్నాను. వేదరూపుడు వేదజనకుడు సర్వవేదాంగ రూపుడు సర్వమంత్రములు తన స్వరూపమైనవాడు అగు పరమేశ్వరునకు నమస్కరించుచున్నాను. సారము కంటె మిక్కిలి సారవంతమైన ద్రవ్యమైన వాడును తన కన్న ముందుకాలము గాని ఆ కాలమందుండు వాడు గాని లేనట్టి వాడును (అపూర్వుడు) ఇట్టివాడని నిరూపించబడనివాడును తనను శాసించు వారు లేనందున స్వతంత్రుడు జ్ఞానులు భక్తుల విషయమున వారికి పరతంత్రుడును సర్వశరీరములందుండు వాడును ఐనను చూడబడనివాడు ఇట్టివాడని ఊహింపబడనివాడును ధ్యానమునకసాధ్యుడైనను ఉన్నవాడును యోగిరాజులకు గురువును అగు యశోదానందనుని భజింతును. రాసమండల మధ్యమున నుండువాడును రాసక్రీడవలన కలుగు ఉల్లాసము నందు మిక్కిలి ఉత్సుకత (కావలెనని ఆసక్తి) గలవాడునగు స్వామిని భజింతును.
గోపికల చేత సేవింపబడువాడును భూదేవికి భర్తయు నగు స్వామికి నమస్కరించుచున్నాను. సజ్జనులకు (సాధుపురుషులకు) ఎల్లప్పుడుండువాడును దుర్జనులకు లేని వాడును యోగీశుడును యోగమునకు. సాధ్యుడును శివుని చేత సేవింపబడినవాడునగు వానికి నమస్కరింతును. మంత్రములకు బీజమైనవాడును మంత్రములకు రాజును, మంత్రప్రదాతయు ఫలదాతయు ఫలమైనవాడును, మంత్రసిద్ధి స్వరూపుడును అగు పరాత్పరునకు నమస్కరింతును. సుఖదుఃఖరూపుడను సుఖదుఃఖదాతయు పుణ్యరూపుడును పుణ్య మిచ్చువాడును శుభము లిచ్చువాడును శుభములకు బీజమునైన వానికి నమస్కరింతును. ఓ నారదా! జగత్తులను సృష్టించు బ్రహ్మ ఇట్లు సోత్రము చేసి కన్నులు తెరచి చూచి భోరున (తాను చేసిన పనికి పశ్చాత్తపుడై) నేడ్చెను. దండము (కజ్జి) వలె నేలమీదపడి (సాష్టాంగముగా) నమస్కారమొనర్చెను. (ఆనపహరించి ఏడాదిగా దాచియుంచిన) బాలకులతో బాటు మొత్తము గోగణమును సమర్పించెను.
బ్రహ్మయొనర్చిన ఈ స్తోత్రమును నిత్యము భక్తి తోనెవడు పఠించునో వాడు ఈ లోకమున సుఖమనుభవించి అంత్యమున (ఈ దేహము వదిలిన తరువాత) శ్రీహరి పాదములను పొందును. సాటిలేని దాస్యమును ఈశ్వర సన్నిధిలో స్థానమును పొందును. ఇట్లు కృష్ణ సాన్నిధ్యముక్తి పొంది స్వామిని సేవించు పార్షదులలో ముఖ్యుడగును.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
జగత్కర్తయైన బ్రహ్మ తన లోకమునకు పోయిన తరువాత శ్రీకృష్ణుడు బాలకులతో బాటు తన గృహమునకు పోయెను. ఆవులు దూడలు గోపబాలకులు ఒక సంవత్సరము తరువాత తమ తమ గృహములకేగిరి. ఐనను శ్రీకృష్ణుని మాయాశక్తి వలన వారందరిది ఒక పగటి వేళలోని భాగముగా భావించిరి (ఆనాడు ఉదయముననే అడవికి వచ్చి సాయంకాలమున తిరిగి ఇండ్లకు పోయినట్లు భావించిరి). గృహములందున్న గోపాలురు గాని గోపికలు గాని యోగియైన స్వామి యొక్క ఈ కృత్రిమ సృష్టి మొత్తమును (మాయాకల్పితమైన గోపాల గోసమూహమును) క్రొత్తదని గాని పాతదియని గాని కొద్దిగానైనను తెలిసికొన సమర్థులు కాలేదు. ఇట్లు శ్రీకృష్ణుని శుభచరిత్రము సుఖమిచ్చునది మోక్షమిచ్చునది పుణ్యమైనది సర్వకాలములలో సుఖము కూర్చునది, అట్టి దానిని మొత్తము నీకు చెప్పితిని.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన గోవత్స బాలక హరణ ప్రస్తావమనెడి ఇరువదియవ అధ్యాయము సమాప్తము.
