4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
40 - హరనిర్మాల్య శాప ప్రసంగము
శ్రీరాధికోవాచ - శ్రీరాధాదేవి పలికెను :
“ఆశ్చర్యము! అపూర్వము విచిత్రమును ఐన ఏమి చరిత్రను వింటిని!! ఇది సుందరముగా కర్ణముల కమృతముగా మిక్కిలి రహస్యమై జ్ఞాన సాధనముగా నున్నది. ఈ కథలోని విశేషాంశములను వివరముగా విననైతిని. మనస్సు కోరినంత విస్తారముగా లేదు. ప్రభూ! ఇప్పుడు సవిస్తరముగా వినగోరుచున్నాను. పార్వతి తానుగా ఏయే కఠోర తపస్సులు చేసెనో, ఏయే వరములను పొంది మహేశ్వరునెట్లు పొందగలెనో? రతీమన్మథుని ఏ విధముగా బ్రదికించుకొనెనో ! ప్రభూ! కృష్ణా! పార్వతీ శివుల వివాహమును వర్ణించవయ్యా! వారి యొక్క ఏకాంతమందలి సంభోగము పాపులకు పాపములనుండి విమోచనము కల్గించును. ఆది దుఃఖపడువారికి దుఃఖవిమోచనము. ఓ కరుణాసముద్రుడా! దానిని చెప్పుము. దంపతుల వీయోగకధ స్త్రీలకు చెవిపోటు వంటిది. కనుక కృష్ణా! ఆ దంపతుల (పార్వతీపరమేశ్వరుల) పునస్సమ్మేళనము (తిరిగి కలిసిపోవుట) ను వినుటకు ఆసక్తి కలిగినది. అగ్ని జ్వాలను గాని వీషజ్వాలను గాని ఓర్చుకొనుటకు స్త్రీకి శక్తియుండును కాని దంపతుల వియోగ జ్వాల నోర్చుకోనుటకు (విని సహించుకొనుటకు) క్షణము కూడ శక్తియుండదు”, అన్న రాధ వాక్యములను విని ఆశ్చర్యమును భయమును ప్రకటించు ముఖము గలవాడై బాధపడుచున్న మనస్సుతో వివరముగా చెప్పనారంభించెను. “ఏ దంపతుల వియోగ కథను రాధ వినశక్తురాలు కాదో అట్టి ఈమె యొక్క నూరేండ్ల వీయోగమునందు నాకేమీ సంభవించనున్నదో?” మాయతో కూడియున్న ఆ మాయానాథుడిట్లు మనస్సులో విచారించి కృపతో కథను చెప్పబూనెను.
శ్రీకృష్ణ ఉవాచ - కృష్ణుడు చెప్పెను :
ఓ రాధా! నీవు నా ప్రాణముల కన్న అధికమైన దానవు. ఓ నా ప్రాణముల కధిదేవతా! ప్రాణవల్లభా! ప్రాణ నాయకీ! నా ప్రాణములకాధారమైన మనోహరీ! వినుము. రుద్రుడు వటవృక్ష మూలము నుండి వెడలిపోగా పార్వతీదేవి తన తల్లిదండ్రులెంతగా నివారించినను ఆగక తపస్సు కొరకు వనములకేగెను. దేవనదీ తీరమునకు చేరి ముదముతో దినము మూడుపూటల శిరస్నానము చేయుచు సందేశరూపముగా నాచేత ఉపదేశింపబడిన మంత్రమును జపించెను. భక్తితో ఒక సంవత్సర కాలము సంపూర్ణముగా ఆహారము లేకుండ తపస్సు చేసి ఆ జగదంబ తిరిగి కఠోర తపస్సు చేయుచుండెను. గ్రీష్మఋతువులో రాత్రింబగళ్లు తన చుట్టు అగ్నిజ్వాలలు కూర్చుకొనీ ఆ నడుమ స్థిరముగా నిలిచి ఎడతెగకుండ మంత్రజపము చేయుచుండెను. వర్షాకాలమందు శ్మశాన ప్రదేశములో జలధారతో తడుపబడుచున్న శీలాతలమును చూచీ అక్కడ స్థిరమైన యోగాసనము బిగించి కూర్చుండి పార్వతి తపస్సు చేసెను. శీతకాలమున దిక్కులన్నియు భయంకరమైన మంచు కురియుచుండగా నీటిలో కూర్చుండి నిరాహారియై నిండు భక్తితో తపస్సు నాచరించెను. ఇట్లు రెండవ సంవత్సరము కూడ తపస్సాచరించి శివుని పొందజాలక ఆ సాధ్వి దుఃఖముతో అగ్నీ కుండము నిర్మించి అందులో ప్రవేశించుటకు పూనుకొనెను.
తపస్సు వలన మిక్కిలి కృశించి యున్న ఆ సాధ్వి అగ్ని కుండములో ప్రవేశింపనుండగా దయా సముద్రుడైన ఆ శివుడు చూచి కృపతో ఆమె వద్దకు పోయెను. ఆమె తపస్సుకు మనస్సులో మిక్కిలి హర్షము పొంది మిక్కిలీ వామను (పొట్టివాడు)డైన బ్రాహ్మణ బాలుని రూపముతో చేతిలో పాలాశ (మోదుగు) దండము గొడుగు ధరించి తెల్లనీ యజ్ఞోపవీతము తెల్లని వస్త్రములు తెల్లదామర పూసల జపమాల నుదుట వెలిగిపోవుచున్న తిలకములతో శిరమున జడలతో మిక్కిలి ధగధగమని మేయుచున్న తన తేజస్సుతో ఫార్వతి ముందు నిలిచెను. నిర్జన ప్రదేశములో ఆ బాలుని చూచి అతని తేజస్సు తనను కప్పివేయగా తపస్సు త్యజించి పార్వతి అతని యందు స్నేహభావము గలదై ఎదురుగానున్న చిన్నవానిని “ఎవరయ్యా నీవు?” అని ప్రశ్నించెను. మిక్కిలి ఆదరముగా అతని నాలింగనము చేయుటకు మనస్సున కోరుకొనుచున్న ఆ పర్వతపుత్రిక ప్రశ్నను వినీ పరమేశ్వరుడు నవ్వీ ఆమె చెవులలో అమృతమొలికించునట్లు మిక్కిలి మధురముగా ఆమెతోనిట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడనెను :
నేను బ్రాహ్మణ బ్రహ్మచారినీ, స్వేచ్ఛగా విహరించు తపస్విని, ఇంత దట్టమైన కాంతారములో తపస్సు చేయుచున్న ఓ సుందరీ! నీవెవరవు? ఏ కులమున జన్మించితివి? ఎవని కూతురువు? నీ నామమేమి? నీవే తపస్సుకు ఫలమిచ్చుటకు సమర్ధురాలవు. నీకు తపస్సు ఎందులకు? ఓ కమలనేత్రా! నీవు స్వయముగా రూపము ధరించిన తపోరాశీవలె నున్నావు. తపస్సీట్లు చేయవలయునని లోకులకు నేర్పుటకు చేయుచున్నావా? తేజస్స్వరూపిణియు ఈశ్వరియు ఐన మూలప్రకృతివీ భక్తులు తన నీరూపమున ధ్యానించవలెనని భారతవర్షమున స్వయముగా ఈ రూపము ధరించి జన్మించితివా? ముల్లోకములలో సంపద్రూపమున నున్న సనాతని వగు లక్ష్మీదేవివా? జగములను రక్షించుటకు సృష్టికర్త వద్దనుండి ఇక్కడికి వచ్చితివా? లేక స్త్రీరూపము ధరించి స్వయముగా వచ్చిన దేవమాతవా? భారత వర్షమున స్వేచ్ఛాజన్మనెత్తుటకు వచ్చిన సావిత్రీదేవతవా? సంగీత శాస్త్రమందలి రాగ సమూహమున కధిదేవతవైన సాక్షాత్పరస్వతీదేవివా? నీ ఇష్టముగా సర్వవిద్యలను ప్రకటించుట కవతరించి ఈ భారతమునలంకరించితివా? పైన చెప్పిన స్త్రీలలో నీవెవరో నేనూహింపలేకున్నాను. ఓ కల్యాణీ! పైవారిలో నీవెవరివో నన్నుద్దేశించి చెప్పి పూర్ణసంతోషవతివి కమ్ము. నీవు ప్రసన్నురాలవైనచో పరమేశ్వరుడు ప్రసన్నుడగును. పతివ్రత సంతుష్టురాలైనచో స్వయముగా నారాయణుడు సంతుష్టుడగును. దేవేశుడైన నారాయణుడు తుష్టినొందినచో ముల్లోకములు నిండుగా సంతసించును. ఓ ప్రియమైనదానా! చెట్టు మొదట నీరు పోసినప్పుడు శాఖలన్నియు నీటితో తడుపబడినట్లగును”. ఇట్లు పలికిన ఆ చిన్నవాని మాట విని పరమేశ్వరి నవ్వి చెవులకమృతము వలె సుందరమైన వచనములను పలికెను.
పార్వత్యువాచ - పార్వతి పలికెను :
ఆర్యా! నేను సావిత్రీదేవినిగాను, లక్ష్మీదేవిని గాను. వాగధిష్టాన దేవతయగు సరస్వతిని కాను, భారతవర్షమున నా జన్మ ఏర్పడినది. నేను హిమవత్పర్వతపుత్రికను. నా పూర్వజన్మ దక్షప్రజాపతి యింట శంకర పత్నినగు సతీదేవిగా గడచినది. నేనప్పుడు నా తండ్రి నా భర్తను నిందించిన కారణముగా శరీర త్యాగము యోగశక్తితో చేసితినీ, ఈ జన్మలో
శరీర త్యాగము యోగశక్తితో చేసితినీ, ఈ జన్మలో పుణ్య విశేషము వలన లభించిన శంకరుడు మన్మథుని భస్మము చేసి నన్ను వదిలి వెడలిపోయెను. శంకరుడు వెళ్లిపోగా సంతాపము సిగ్గు మూలమున పితృ గృహము వదిలి నా మనస్సు తపస్సుజేయ గోరినందున ఈ దేవనదీ తటమునకు వచ్చితినీ, చిరకాలము నా ప్రాణవల్లభుని గురించి కఠోర తపస్సు చేసియు అతనిని పొందలేక అగ్నియందు ప్రవేశింప పూనుకొని నిన్ను చూచి క్షణకాలము నీలిచితిని.
ఇక నీవు పొమ్ము, ప్రళయాగ్ని శిఖల వలె వెలుగుచున్న అగ్నిలో ప్రవేశించి నా కోరికను మనసుననుంచుకొని కోరబడిన హరప్రాప్తిని పొందుదును. ప్రాణముల కంటే అధికప్రియుడైన మనోహరుడైన భర్తను ఎక్కడెక్కడ జన్మలెత్తుదునో ఆయా జన్మలయందు పరశివునే పొందగలను. అందరు స్త్రీలు తమ ప్రియుని పొందుటకే జన్మనెత్త గోరుదురు. అట్లే ప్రియునీ లభింతురు. ఆ సాధ్వులకు ఆ జన్మ పతిని లభించుట కొరకేయని వేదమందు వినిపించబడినది. పూర్వజన్మలో ఎవడు భర్తయో అతడే ప్రతిజన్మలో ఆ సతులకు భర్తయగును. ఏ స్త్రీ ఎవరికి భార్యగా దైవము చేత నియమించబడినదో ఆమెయే వారికి జన్మజన్మలకు భార్యయగును. అట్టి పతిలాభము గల దేహమిప్పుడు పొందక మిక్కిలి ఘోరమైన తపస్సు చేసి అగ్ని ప్రవేశము చేసి పరజన్మలో నైనను కోరుకొన్న అతనిని పొందగలను. ఇట్లుపలికి పార్వతి అక్కడ ఆ బ్రాహ్మణుని చేత నిషేధింపబడుచు కూడ అతని ముందే అగ్నిలో ప్రవేశించెను. ఓ పరమేశ్వరీ! బృందావన వినోదినీ రాధా! ఇట్లు పార్వతి అగ్ని ప్రవేశము చేయుచుండగా ఆమె తపస్సు మూలమున ఆ యగ్ని అప్పుడే చందనము వలె చల్లనయ్యెను. క్షణకాలమగ్నిలో నిలిచి ఆమె లేచివచ్చుచుండగా పార్వతి మధ్య, నిలబడి శివుడు హఠాత్తుగా మరల ప్రశ్నించెను.
శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడు పలికెను !
ఓ భద్రురాలా! ఏమి తపస్సు నీది? నేనే మాత్రము గూడ తెలిసికొనజాలకుంటిని. నీ తపస్సు వలన కోరినదీ లభించకపోయెను. అగ్నితో శరీరము దగ్గము కాకపోయెను. శివుని కల్యాణరూపునిగా (పెండ్లికొడుకుగా) నీకు భర్తగా చేసికొనగోరితివి. ఆకారము లేని వానిని భర్తగా జేసికొన్న నీ కోరిక ఏమి నెరవేరును? కాంతి గల చిరునవ్వు గలదానా! సంహారక కర్తను భర్తగా కోరుచుంటివేని ఈ లోకములో ఏ శ్రీ సర్వసృష్టిని సంహారమొనర్చుటకు మూలమైన వానిని ప్రియునిగా కోరుకొనునో చెప్పుము. ఒక వేళ నీవు మంచి స్వరూపము గలవానిని మనోహరునిగా జేసికొని మోక్షము కోరుకొనుచుంటివేని నీవే సర్వజనులకు ముక్తి ప్రదురాలివి. కనుక నీ తపస్సంతయు వ్యర్థమే. ఆత్మకు మంగళకరమైన మోక్ష విషయములో సంహారకర్తయగు శివుడు చెప్పబడినట్లు ఏ శాస్త్రమందు కనిపించదు. శివ శబ్దమునకు ఇంకొక అర్థము (మోక్ష ప్రదాత అని) వేదములో నిరూపించబడలేదు. ఓ సుందరీ! ఆ సంహారకర్తనే నీవు కోరుకొనుచుంటివేని. అతని పైననే నీకాసక్తి కలదేని సర్వలోక భయంకరుని పొందుదువు. నీకు అభీష్టమైన ఈ దేవుని (శివుని) సేవించుట వలన నీకు మోక్షము కలుగదు. నీకు కావలసినది చెప్పుదును వినుము. ఎల్లప్పుడు హరి స్మరణమన్నది ఎప్పుడు గూడ వ్యర్థము కానిది. సర్వమంగళములిచ్చునది.
నీవు శీఘ్రముగా తండ్రి గృహమునకు పొమ్ము. శంకర దర్శనము సుదుర్లభమైనను నా ఆశీస్సుల వలన నీ తపస్సుల ఫలము వలన అక్కడ నీకు లభించును. ఇట్లు పార్వతీతో ఆ బ్రాహ్మణుడు పలికి అక్కడనే అంతర్ధానమయ్యెను. దుర్గాదేవి “మహాదేవా” అని పలుకుచు తండ్రి గృహమునకేగెను.
పార్వతి వనమునుండి నగరమునకు వచ్చుచున్న వార్తను మేనకా హిమవంతులు వినిరి. హిమవంతుడు హరపరవశుడై దివ్యమైన రథమును తీసుకొని ఎదురుగా పోయెను. ఓ రాధికా! రాజమార్గమునందు చందనము అగురు కస్తూరి యనెడి సుగంధ వస్తువులతో ఫలములు కొమ్మలతో అలంకరించిన మంగళ ఘటములను (పూర్ణకుంభములను) ఉంచి - పట్టు దారమునకు మామిడి చిగురాకులు క్రుచ్చి అంతట నిలబెట్టిన అరటిబోదెలతో నున్న ఆ మార్గములో సంతానవతులు సుమంగలులు ఐన బ్రాహ్మణ స్త్రీలు మంగళదీపములను చేతులలో ధరించి రాగా - వగ్గ పేలాలు పచ్చి గరిక ఫల పుష్పములు నిండుగా చల్లబడగా - పుణ్యవంతులైన బ్రాహ్మణులు మునులు బ్రహ్మచారులు నటీమణులు నర్తకీజనులు శ్రేష్ఠమైన గజరాజములు వీథులలో శోభించుచుండగా - పురోహితులు గుంపులుగా మంగళకరమైన వేదపఠనము చేయుచు - చక్కగా మాలతీ మాలలను చేతులలో పట్టుకొని నడచుచుండగా నానా ప్రకారములైన వాద్యములు - శంఖముల ధ్వని వ్యాపించుచుండగా - నేలమీద చిమ్ముబడిన సిందూర రేణువుతో (ఎర్రని సిందూర పొడితో) ను చందన ద్రవముతోను పంకిలమైన (బురదయైన) ఆ నగరవీధి శోభాయమానముగా నుండెను.
పార్వతీదేవి నగరమున ప్రవేశించి తల్లిదండ్రులను దర్శించేను. అప్పుడు ఆమె తల్లిదండ్రులు మనస్సులు తేటపడి ఆనందబాష్పములు పులకాంకురము గలవారై బిడ్డవైపు పరుగెత్తిరి. ప్రసన్నమైన ముఖము గల పార్వతి చెలులతో బాటు వారికి నమస్కరించెను. వారు ఆశీర్వాదములు చేసి పుత్రికను తమ వక్షస్థలమున చేర్చుకొనిరి. ప్రేమతో పరవశులై బిడ్డా బిడ్డా అనుచు ఏడ్చిరి. తరువాత కూతురును రథము పై కూర్చుండ బెట్టుకొని గృహమునకేగిరి. ముత్తైదువలు హారతులిచ్చి దిష్టిదోషము తొలగించిరి. బ్రాహ్మణులాశీర్వదించిరి. హిమవంతుడు బ్రాహ్మణులకు వందజనమునకు ధనము నొసగెను. తరువాత మంగళకరముగా స్వస్తివాచన పుణ్యాహమును చేసి వేదపఠనము చేయించెను. ఇట్లు మేనాహిమవంతులు తమ పుత్రికతో సంతోషపూర్ణమైన మనస్సులతో తమ మందిరమున సుఖముగా నివసించిరి.
ఒకసారి హిమవంతుడు తపస్సు చేయుటకు ఆకాశగంగ వద్దకేగెను. ఆ సమయములో మేనకాదేవి పుత్రికతో బాటు మందిరము ముందు భాగమున కూర్చుండియుండెను. ఇంతలో హఠాత్తుగా ఒక భిక్షుకుడు చక్కగా పాడుచు నాట్యము చేయుచు వారి వద్దకు వచ్చెను. మిక్కిలి ముసలి తనముతో బాధపడుచున్న వృద్ధుడతడు, ఎడమ చేత శృంగము (కొమ్ముబూర) కుడిచేత డమరు (ఒగ్గు) శరీరమంతట విభూతి వీపున బొంత ధరించి ఎర్రని వస్త్రములు కట్టుకొని యుండెను. ఎదుటి వారి మనస్సులనాకర్షించు రూపము చక్కని కంఠస్వరము గల ఆ భిక్షుకుడు మనోహరముగా నృత్యము చేయుచు నా (శ్రీకృష్ణుని యొక్క) గుణములను కథలను గానము చేసెను. కొద్ది సేపు కొమ్ముబూరనూదెను. క్షణకాలము డమరు వాద్యము చేసెను. అది విని నగరములోని బాలురు బాలికలు వృద్ధులు యువకులు యువతీజనము వృద్ధ స్త్రీలు హర్షపరవశులై అక్కడికి చేరవచ్చిరి. మంచి స్వరముతో రాగాలాపన చేయుచు పాడుచున్న అతని సుందర గీతమును (గానమును) విని వారందరు వెంటనే వ్యామోహము పొంది ఆనందముతో మూర్ఛిల్లిరి.
పార్వతీదేవియు మూర్ఛను పొంది తన హృదయములో శంకరుని దర్శించెను. అతడు హస్తమున త్రిశూలమును పులితోలు వస్త్రమును ధరించి యుండెను. సుందరమైన భస్మము నలంకరించుకొని స్వచ్ఛమైన అస్థిమాలను (ఎముకల పేరు) ధరించి యుండెను. చిరునవ్వుతో ప్రసన్నముఖముతో త్రినేత్రములు ఐదుముఖములు పది హస్తములతో ప్రసన్నుడై ఉండెను. నాగయజ్ఞోపవీతము ధరించి నన్ను వరమడుగుమనీ పలుకుచు సుందరమూర్తిగా నున్న ఆ చంద్రశేఖరుని తన హృదయమున చూచి పార్వతీ మనస్సుతో నమస్కరించి “నీవే నాభర్తవు కమ్ము” అని మనస్సులో వరమడుగుకి నేను, సరే యనీ శివుడామెకు వరమిచ్చి అంతర్ధానమయ్యెను. తరువాత తన హృదయములోనతనిని చూడక పార్వతీ స్మృతిని పొంది కన్నులు తెరచి ఎదుట గానము చేయుచున్న భిక్షుకుని చూచెను.
ఆ భిక్షుకుని యొక్క నృత్య సంగీతములకు సంతృప్తి చెందిన మేనకాదేవి గృహములో స్వర్ణ పాత్రలోనున్న రత్నములను ఈయ బోయెను. ఆ భిక్షుకుడేమో దుర్గాదేవీనే భిక్షగా నీమ్మని కోరుచు ఇతర భిక్షను తీసుకోలేదు, కోరికతో మరల నర్తనము చేయుటకు పూనుకొనెను. మేనాదేవి అతని మాటవిని ఆశ్చర్యమును కోపమును పొంది "త్రిలోక నాథుడును పరమాత్మయు ఐన శివుని పత్నిని తన కిమ్మని యాచించు నీ భిక్షకునిని ఆకర్షణగా మాట్లుడువానిని దూరమును వెడలగొట్టుడు” అని బెదరించి బయటికి నెట్టి వేయుడని దోసజనముతో పలికెను.
ఇంతలో మనోహరమైన గంగాతీరములో నారాయణుని గూర్చీ తపస్సొనర్చిన హిమవంతుడు తన గృహమునకు తిరిగి వచ్చి తన గృహము ముందున్న సుందరుడైన భిక్షుకుని చూచెను. అతని మనస్సింతవరకు నారాయణుని ధ్యానములో ఆ మూర్తిని దర్శించి ఆనందించి హఠాత్తుగా దర్శనమోగిపోయిన వియోగదుఃఖముతో బాధపడుచుండెను. ఇంటికి రాగానే భార్య చెప్పిన భిక్షుకుని వార్తను విని ఒక్కసారి నవ్వి కోపము పొందెను. ఆ భిక్షుకుని బయటికి పెట్టుకుని తన అనుచరునికాజ్ఞాపించెను, తన తేజస్సుతో జ్వలించిపోవుచు ఆకాశము వలే తాకరాని వాడుగా నున్న ఆ భిక్షుకుని బయటికి పంపుటకు గానీ తుదకతని దగ్గరకు పోవుటకు గాని అనుచరుడశకుడయ్యెను.
అప్పుడు హిమవంతుడు భిక్షుకుని సుందరమైన చతుర్భుజములు గలవానిగా క్షణకాలము చూచెను. కిరీటమును మకర కుండలములను పీతాంబరమును గల మంచి వేషము ధరించిన సుందర శ్యాముడు నిలువెల్ల చందనము పులుముబడి చిరునవ్వుతో మనోహరముగా కనిపించెను. భక్తులననుగ్రహించవలెనన్న త్యర అతనీ యందు కనిపించుచుండెను. ఇంతకు ముందు తనకు దర్శన మిచ్చినప్పుడు ఆ గదాధారికి పూజా సమయములో అతని శిరస్సున శరీరమున సమర్పించిన పుష్పములు పూజాద్రవ్యములన్నియు ఈ భిక్షుకుని యందు కన్పించేను. మనోహరమైన ధూప దీప నైవేద్య పదార్ధములు కూడ భిక్షుకుని ముందు కన్పించెను.
మరు క్షణములో వినోదముగా మురళిని చేతబట్టుకొని గోపాలబాలక వేషముతో శ్యామసుందరుడై నెమలి యీక శిరస్సునధరించి చందనము పులిమిన సర్వావయవములందు రత్నాభరణములతో కంఠమున వనమాలను ధరించి చిరునవ్వుతో రెండు హస్తములు గలవాడుగా హిమవంతునికి ఆ భిక్షుకుడు కన్పించెను.
మరుక్షణములో తెల్లని వర్ణము గల శంకరుడుగా కన్పించెను. శిరస్సున చంద్రరేఖతో, హస్తములలో పట్టిశము త్రిశూలములతో - పులి చర్మమునే శ్రేష్ఠ వస్త్రముగా ధరించి - స్వచ్చమైన శరీరమున భస్మము ధరించి - ఎముకల పేరులలంకరించుకొని - నాగరాజును జందెముగా ధరించి - స్వచ్ఛమైన బంగారు వన్నె గల జడలతో - డమరును శృంగమును (ఊదేడి కొమ్ము) చేతులలో పట్టుకొని - మనోహరముగా నుండి - తెల్లదామర పూసల జపమాలతో హరి నామమును జపించుచు - చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖ మండలము - తన తేజస్సుతో వెలిగిపోవుచున్న పరమ శివుడు ఐదు ముఖములలో త్రినేత్రములతో భక్తరక్షణ యందు త్వర గలవాడై హిమవంతునికి కన్పించెను.
తరువాత నోకక్షణమా భిక్షుకుడు చతుర్ముఖములతో జగత్సృష్టి చేయు బ్రహ్మగా హరీనామమును తెల్లని స్పటికములతో జపించుచు కనిపించెను.
హిమవంతుడట్లు దర్శించిన తరువాత క్షణములో త్రిగుణాత్మకుడైన బ్రహ్మతేజస్సుతో, శాంతముగా ప్రకాశించుచున్న సూర్యస్వరూపునిగాను అతి తేజస్సుతో వెల్లుచున్న అగ్ని స్వరూపునిగాను - దర్శించిన వారికి ఆహ్లాదము కళించు చంద్రస్వరూపునిగాను క్షణక్షణము వేర్వేరు రూపములు కలవానిగా దర్శించెను. తరువాతి క్షణము నిరంజన నిరాకారమై - సంసార మలినములంటని, ఏ కోరికలు లేనీ, తేజస్స్వరూపమైన పరమాత్మగా దర్శించెను. ఇట్లు స్వేచ్ఛతో నానా రూపములను ధరించువాడగు పరమాత్మను చూచీ పర్వతరాజు ఆనంద బాష్పములు పులకాంకురములు గలవాడై భక్తితో ప్రదక్షిణమాచరించి మరల మరల నమస్కారములు చేసి ఆ భిక్షుకుని ముందు సాష్టాంగ పడెను.
శైలేంద్రుడు లేచి సంతోషముతో తిరిగి వాస్తవ భిక్షుకుని చూచి విష్ణుమాయ కారణముగా నానారూపధారియైన ఆ పరమాత్మ దర్శనానుభవమును మొత్తము మరచిపోయెను.
రక్తవస్త్రము ధరించి బూరకొమ్మునూదుచు చేతి డమరును మ్రోగించుచున్న ఆ భిక్షుకుడు దుర్గాదేవినే (పార్వతినే స్వీకరించు ఆసక్తి కలవాడై ఇతర భిక్షను గ్రహింపనిష్టపడక తన భిక్షాపాత్ర ప్రక్కన నిలిచియున్న హిమవంతుని భిక్షను యాచించెను.
ఓ ప్రియురాలా! రాధాదేవీ! పర్వతరాజు విష్ణుమాయచేత వ్యామోహితుడై ఆ భిక్షుకుని కోరిక తీర్చుట కొప్పుకొనలేదు. వేరుగా ఏ భిక్షను గ్రహింపక ఆ భిక్షుకుడక్కడనే అంతర్ధానమయ్యెను. అప్పుడు మేనకా హిమవంతులకు జ్ఞానోదయమయ్యెను.
“ఈ రోజు స్వప్నములో వలె జగన్నాథుడు (శంకరుడు) మనిద్దరికి దర్శనమిచ్చెను. ఇప్పుడు మనిద్దరిని వంచించీ విభుడైన శివుడు స్వస్థానమున కేగెను కదా!” అని ఆ దంపతులు భావించిరి. ఆ దంపతులకు శివుని యందు గల భక్తిని చూచీ సర్వదేవత లిట్లు భావించిరి. ఇంద్రాదులు సుమేరు పర్వతము యొక్క భారము నుండి హిమవంతుని రక్షించు విషయమై ఒక యుక్తి చేసిరి. ఈ హిమ వంతుడు ఏకాంత భక్తితో తన కన్యను పరమేశ్వరునికి ఇచ్చినచో ఈ భారత వరమందు వెంటనే మోక్షదశను పొంది తీరునన్నది నిశ్చయము. అనంతరత్నములకు నివాసస్థానమైన హిమవంతుడు పృథ్విని వదిలిపోవునేని భూదేవికి రత్నగర్భ అన్న నామము మిథ్యయగుసన్నది నిశ్చయము. ఈ శైలరాజు తన కన్యను శూలపాణికి దానమిచ్చి పర్వతరూపమును త్యజించే దివ్యరూపమును గ్రహించి విష్ణులోకమును పొందగలడు. అతనికీ లీలగా సారాయణ సారూప్యము లభించి విష్ణు పారదులలో ఒకడై హరిదాసు కాగలడు.
కన్య పదిదిగుడు బావులు నిర్మించిన పుణ్యముతో సమానమైనది. వేదజ్ఞుడును పవిత్రుడును ఇతరుల నుండి దానములు స్వీకరించని వాడును, సంధ్యావందనమును, యజ్ఞమును వేద పాఠమును చేయువాడును సత్యవాదియు ఐన ఉత్తమ బ్రాహ్మణునకు దానమీయబడిన కన్య వలన దశవాపీ పుణ్యఫలము లభించును. త్రిసంధ్యలాచరించువాడు సత్యవాది గృహస్తుడు వేదజ్ఞుడు ఐన సద్రాహ్మణునకు కస్యొదానము చేసినచో మంచి ఫలము లభించును. ఇక సంధ్యావందన కర్మహీనుడై పరుడు వివాహమాడిన స్త్రీని ఎట్లో తన భార్యగా జేసికొని ఇతరుల చేత మాత్రమే యజ్ఞయాగములు చేయించుచు జీవించు బ్రాహ్మణునకు అట్టి నీచునకు కన్యాదానము చేసినచో ఒక దిగుడు బావిని నిర్మించిన ఫలము లభించును. బ్రాహ్మణస్త్రీ యందు వైశ్యుని వలన జన్మనెత్తి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్ర జపము గాని లేనట్టి నీచునకు కన్యాదానము చేసినచో దిగుడు బావి నిర్మించిన ఫలములో సగము పుణ్యఫలము లభించునని చెప్పబడినది. బ్రాహ్మణ స్త్రీ యందు శూద్రుని వలన జన్మించిన చండాలునితో సమానుడైన పాపాత్మునకు కన్యాదానము చేసినచో నరకము లభించును.
విద్వాంసుడు సత్యవాది జితేంద్రియుడు విష్ణుభక్తుడు ఐన బ్రాహ్మణునకు దానము చేయబడిన కన్య ఇరువది దిగుడు బావుల పుణ్యఫలమిచ్చును. అట్టివానికి కన్యాదానము చేసినవాడు దివ్యరూపమును ధరించి అరువది వేల సంవత్సరములు విష్ణుమందిరములో ఆనందమనుభవించును. సుశీలయైన కన్యను హరునకు గానీ హరికి గాని ఇచ్చినచో అట్టి దాత నారాయణ స్వరూపమును పొందునని వేదముందు చెప్పబడినది, విష్ణుభక్తుడు విష్ణుప్రీతికోరకని కన్యాదన మొనర్చినచో - ఆ దానము సద్రాహ్మణునకీయబడినప్పుడు - దాత “హరిదాస్య” ముక్తిని తప్పక పొందును. - ఇది నిశ్చయము. ఓ ప్రియరాధా! దేవతలందరిట్లు విచారించి మంత్రాలోచనము చేసి హిమవంతునింటికి తమ గురువగు బృహస్పతిని పంపించుట కొరకు పోయిరి.
దేవతలందరును పోయి గురువైన బృహస్పతికి నమస్కరించి ఇట్లు నివేదించిరి, “హిమవంతుని గృహమునకు పోయి పరమేశ్వరుని నిందించుము. దుర్గాదేవి (పార్వతి) శివుని దప్ప ఇతరుని తన వరునిగా స్వీకరించదు. తనకిష్టము కాకున్నను హిమవంతుడు బిడ్డను పరమేశ్వరుని కిచ్చి త్వరగా దానఫలమును పొందగలడు. అతడు కొంతకాలమున కట్లు ముక్తిని పొందుగాక. ప్రస్తుతము భూమియందే ఉండుగాక. అనంత రత్నములకాధారమైన హిమవంతుని భారత వర్షములో నీవే రక్షింపుము" అని.
దేవతల మాట విని వారి గురువగు బృహస్పతి చేతులతో చెవులు మూసుకొని “నారాయణ నారాయణ” అని వినగూడని మాట వీన్న దోషము పోవుటకు స్మరించుచు వారి మాట నంగీకరించక దేవ వర్గములను మాటి మాటికి బెదరించి హరి హరుల యందు మహాభక్తి గల ఆ వేదవేదాంత వేత్త ఇట్లు పలికెను.
బృహస్పతిరువాచ - బృహస్పతి ఆనెను :
మీ స్వార్ధమును సాధించుకొను ఓ దేవతలారా! నా మాట వినుడు. నేను చెప్పునది వేదము చేత చెప్పబడిన నీతిసారము. ఫలరూపమున సుఖము కళించునది. శివకేశవుల భక్తుని ఏ పాపులు నిందింతురో - బ్రాహ్మణులను తమ గురువును, పతివ్రతలను, భర్తను, భిక్షుకుని, బ్రహ్మచారులను సృష్టికి బీజముల వంటి దేవతలను నిందింతురో వారు రాత్రింబవళ్లు తెమడ, (శ్లేష్మము) మల మూత్రములలో పడియుండి చంద్ర సూర్యులున్నంత కాలము కొలసూత్ర నరక బాధలనుభవింతురు. అటు కర్మఫలమనుభవింతురు.
ఎవరు సృష్టికర్త జగత్తులకు తండ్రియైన బ్రహ్మను నిందింతురో వారు క్రిమికీటకముల చేత భక్షింపబడుచు భయ దుఃఖములతో పెద్దగా అరచుచుందురు. దేవతాశ్రేష్ఠుడైన శివుని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీనీ, భగవద్గీతను, తులసీ వృక్షమును, గంగానదిని, చతుర్వేదములను, వేదమాతయైన గాయత్రీ మంత్రమును, వ్రతకర్మలను, తపస్సును, దేవపూజను, మంత్రమును, మంత్రముపదేశించిన గురువును నిందించిన పాపాత్ములు బ్రహ్మదేవుని ఆయుష్యములో సగము కాలము అంధకూప నరకములో బాధలనుభవింతురు.
ఎవరు శ్రీవిష్ణువును సామాన్య దేవతలతో సమానము చేసి నిందింతురో వారు సర్పగణములచేత భక్షింపబడుచు ఎల్లప్పుడు ఆక్రందన చేయుచుందురు. శ్రుతీ కంటే శ్రేష్ఠమై విష్ణుభక్తినీ కల్గించునట్టి పురాణమును, రాధాదేవిని, ఆమె అంగమున జన్మించిన గోపికలను సత్పురుషుల చేత పూజింపబడు బ్రాహ్మణులను ఎవరు నిందింతురో వారు బ్రహ్మ దేవుని ఆయువుతో సమానమైన సుదీర్ఘకాలము క్రిందికి ముఖములు గల వారుగా పైకి ముఖములు గలవారుగా నుండి సర్పగణముల చేత చుట్టబడి వికారమైన ఆకారములు గలవీయు సర్పముల వంటి ఆకారములు గలవియు ఐన క్రిమి కీటకముల చేత భక్షింపబడుచు మిక్కిలి భయభీతులై ఎల్లప్పుడు ఆక్రందనము (ఏడుపు బొబ్బలు) చేయుచుందురు.
అట్టి పాపాత్ములు మిక్కిలి క్షోభింపబడినవారై శ్లేష్మ మూత్ర పురీషములను (మలము భక్షించుట నిశ్చయము, వారి నోళ్లలో యమకింకరులు మండుచున్న కొరువులను పెట్టుదురు. ముప్పూటల భయ పెట్టుచు కర్రలతో కొట్టుదురు. ఆ దెబ్బలు తిని భయముతో దప్పిగొన్న ఆ పాపులను యమదూతలు మూత్రపానము చేయింతురు.
ఓ దేవతలారా! శివనింద చేసినవారు నరకమునకు పోవుదురు. ఓ కుమారులారా! నేను చెప్పబోవు నీ ఉపకారమునే చేయుటకు మీరు తగుదురు.
పూర్వము బ్రహ్మా ప్రోత్సాహము చేత దక్షప్రజాపతి తన కూతురును (సతీదేవిని) శంకరునీ కిచ్చి - తరువాత ఆ హరనిందకుడు పాపము పొందక గొప్ప ఐశ్వర్యమును పొందెను. తన మనస్సంకల్పము లేకుండనే శివునికి కన్యనిచ్చినందున దానికి సాటియైన సారూప్య ముక్తిని పొందక (నిందకారణముగా) తుచ్ఛమైన స్వర్గమునే ఆ దక్షుడు పొందెను.
“ఓ దేవతలారా! మీలో నొకడు హిమవంతుని గృహమునకు పోయి ప్రయత్నించి అతడు మీ మతమున కనుకూలించునట్లు చేయవలెను. తన కిష్టము కాకుండనైనను తన బిడ్డను పరమేశ్వరుని కిచ్చి ఈ భారత వరములో సుఖముగా నుండుగాక. లేదా భక్తితో కన్యాదానము చేసినచో నిశ్చయముగా మోక్షము పొందగలడు. మీ తరువాత సప్తర్షులు అరుంధతితో గూడి హిమవంతునింటికి పోయి అతనికి కర్తవ్యమును బోధింతురు. పార్వతీదేవి పినాకపాణిని తప్ప ఇంకొక వరునిగా వరించదు. ఆ పర్వతరాజు తన ఇష్టముతో నిమిత్తము లేకుండ బిడ్డ ఆజ్ఞ ప్రకారము శివునకు కూతురునిచ్చును. ఇట్లు నా అభిప్రాయము మొత్తము మీకు చెప్పితిని. దేవతలారా! ఇక మీ మందిరములకేగుడు" అని బృహస్పతి పలికి ఆకాశగంగకు తపస్సుకై పోయెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండముందు నారాయణ నారదసంవాదరూపమైన నలుబదియవ అధ్యాయము సమాప్తము.
