4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
4 - గోలోక వర్ణనము
నారద ఉవాచ :
వేదవేత్తలకు శ్రేష్ఠుడవైన ఓ జగన్నాథ! కృష్ణుడు ఎవరిచేత ప్రార్థింపబడి ఏకారణముగా భూలోకమునకు వచ్చెను.
నారాయణ ఉవాచ :
నారాయణముని ఇట్లు చెప్పెను:
పూర్వము వారాహ కల్పమున పాపభారము అధికమై భూదేవి మిక్కిలి శోకార్తురాలై బ్రహ్మదేవుని శరణు పొందెను. రాక్షసుల బాధలకు తాళలేక భీతులైన దేవతలతో పాటు దుర్గమమైన బ్రహ్మ సభకు భూదేవి వెళ్లి అచ్చట బ్రహ్మ తేజస్సుతో వెలుచు ఋషులు, మునులు, సిద్ధగణములతో సేవించబడుచు అప్సరసల నృత్యమును చిరునవ్వుతో దర్శించుచు మనోహరమైన గంధర్వుల సంగీతమును ఏనుచు మంత్రరాజమైన కృష్ణ అను రెండక్షరములను జపించుచు భక్త్యానందములతో కన్నులనీరు నీండగా పులకలెత్తిన ఆకారము గల దేవేశుడగు చతురాననుని (నాలుగు ముఖములు గల బ్రహ్మ) భక్తితో తానును దేవతలును సమస్కరించిన పిదప తను పడుచున్న రాక్షసుల పాపభారమును గూర్చి నివేదించెను. ఆ పరమేష్టిని స్తుతించి కన్నీరు పెట్టి రోదించెను.
జగత్కర్త “ఓ మంగళమూర్తీ! నన్ను స్తుతించుచు ఏడ్చుచుంటివేమి? ఎందుకొరకు వచ్చితివో చెప్పుము. నీకు శుభము సమకూరును. ఓ కళ్యాణి! నేనుండగా నీకు భయమేమి? సుస్థిరవగుము” ఇట్లు భూదేవినోదార్చి బ్రహ్మ సాదరముగా దేవతలను ప్రశ్నించెను. “మీరు నా వద్దకు వచ్చుటకు కారణమేమీ”? ఆ పలుకులు విని దేవతలు ప్రజాపతితో “భూదేవి భారాక్రాంత అయినది. మేము దస్యుగ్రస్తులమైతిమీ. ఓ సృష్టికర్తా! శీఘ్రముగా మాకు నిష్కృతి (నివారణచర్య) నీ కళించుము” అనిరి. దేవతల వాక్కు విని బ్రహ్మ భూదేవితో “బిడ్డా! నీభయము తొలగించుకొని నావద్ద సుఖముగా ఉండుము. ఎవరి భారము చేయుటకు నీవశక్తురాలవైతివి వారిని నేను తొలగింతును. నీకు నిశ్చయముగా మంగళమగును” అని పలికెను. అతని మాట విని ఆమె ప్రసన్నమైన ముఖము కన్నులు కలదై ఎవరెవరి వలన ఏ విధముగా పీడితురాలయ్యెనో ఆ బాధలు తెలిపెను.
క్షితి రువాచ :
భూదేవి ఇట్లు పలికెను :
ఓ తండ్రీ! నా మనోవ్యధను తెలిపెదను వినుము. విశ్వసింపదగిన బంధువునకు తప్ప స్త్రీలు ఇతరులకు తమ బాధలు చెప్పకూడదు. అబలలైన స్త్రీలు తండ్రిచేతగాని భర్తచేతగాని కొడుకుల చేత గాని తపు బంధువుల చేత గానీ రక్షింపబడవలెనని నిశ్చయించబడినది. ఇతరులు ఆమెను రక్షించుట నిందింపబడినది. ఓ జగత్పతో! నీవడిగినప్పుడు ఎవరి పాపభారము చేత పీడింపబడితినో ఆ విషయము చెప్పుటకు నాకు సిగ్గేందుకు దానిని చెప్పేదను వినుము.
కృష్ణభక్తి లేనివారును కృష్ణభక్తులను నిందించువారును మహాపాతకులు. అట్టివారిని భరించుట నాకు శక్యమగుట లేదు. స్వధర్మమును పాటించనివారును శాస్త్రము విధించిన నిత్యకర్మలనాచరించక వదిలి వేసినవారును వేదమునందు శ్రద్ధాభక్తులు లేనివారును నాకు భారమై పీడితురాలనగుచున్నాను. తల్లిదండ్రులను గురువులను భార్యాపుత్రులను పోషింపవలసిన వారిని ఎవరు పోషింపరో అట్టి పాపుల భారమును నేను మోయలేకున్నాను. ఓ తండ్రీ! మిథ్యావాదులు (ఉన్న వస్తు తత్త్వమును లేదని వాదించువారు) దయా సత్యములను వదిలిపెట్టినవారును గురువులను దేవతలను నిందించువారునగు దుర్జనుల భారము చేత పీడింపబడుచున్నాను. మిత్రద్రోహులు, చేసిన మేలు మరచి కీడు తల పెట్టు కృతఘ్నులు, దొంగసాక్ష్యము చెప్పుచారు, నమ్మినవారికి ద్రోహము తల పెట్టువారు, ఇతరులు దాచిపెట్టిన ధనమును దిగమ్రింగువారు అగు పాపుల భారము చేత పీడితురాలనగుచుంటిని. లోక కల్యాణ కరములైన వేద భాగములను, సామవేద గానమును మిక్కిలి మంగళకరములైన హరి నామములను ధనము కొరకమ్ము కొను వ్యక్తులను భరింపలేక వ్యధ చెందుచుంటిని., జీవహింస చేయువాడు, గురుద్రోహి, గ్రామపురోహితుడు, లోభ, శవములను దహించు రాబడితో జీవించువాడు, శూద్రాన్నము భుజించువాడు అగు పాపుల భారముతో క్రుంగిపోవుచున్నాను. దేవతార్చనలను యజ్ఞములను ఉపవాసాది వ్రతములను వివిధ సత్కర్మలను భంగపరచు మూఢుల భారముచేత పీడింప బడుచున్నాను. ఏ పాపాత్ములు గోవులను బ్రాహ్మణులను దేవతలను విష్ణుభక్తులను శ్రీహరిని హరికథలను హరిభక్తిని ద్వేషింతురో వారి భాగము వలన క్రుంగి పోవుచున్నాను. శంఖచూడుడు మొదలగు వారి భారముచేత పీడితురాలగునగుచున్న నాకు ఓ విధీ! అంతకంటే అధిక దుర్జనులగు దైత్యుల భారము చేత పీడింపబడుచుంటిని, ఇట్లు నా వ్యథలన్నిటిని నీ ముందు నివేదించితిని. నేను నీచేత పాలింపబడుటకు పాత్రురాలనేని ఓ ప్రభూ తగిన ప్రతిక్రియ చేయుము”. ఇట్లు పలికీ భూదేవి మాటి మాటికీ దుఃఖించగా దయానీధియగు. బ్రహ్మ అది చూచీ ఆమెతో నిట్లనెను.
ఓ వసుంధరా! ఉపాయము వలన సర్వకార్యములు సిద్ధించును. కావున నీకు రాక్షసుల వలన ఏర్పడిన భారమును ఉపాయముతో తొలగింతును. నా ప్రభువగు భగవంతుడు కాలక్రమమున నీ భారమును తొలగించగలడు.
పూజింపదగిన యంత్రమును పూర్ణకుంభమును శివలింగమును కుంకుమ పువ్వును శ్రీగంధపు చెక్కను కస్తూరిని పవిత్రస్థానమునుండి తెచ్చిన మట్టిని (గంగమట్టి) ఖడ్గమును గండకీనది శిలను స్ఫటికమును పద్మరాగమణిని, ఇంద్రనీల సూర్యమణులను రుద్రాక్షను, సాలగ్రామ శిలను శంఖమును తులసీదళములను పూజావిగ్రహమును పూజ జలమును దీప హారతిని పూజించు శిలను పూజా ఘంటను నిర్మాల్యమును (విగ్రహాదులనుండి తీసివేసిన పుష్ప పత్రాదులు) నైవేద్యమును, మరకతమణిని, ముడివేసిన జందెమును పూజలోని అర్ధమును వింజామరను (చమరీమృగపు వెండ్రుకల చామరము) గోరోచనమును ముత్యమును ముత్యపు చిప్పను మణినీ, భాగవతాది పురాణ గ్రంధములను, అగ్నిని, కర్పూరమును, గండ్ర గొడ్డలిని (పూజలోనిది) వెండి బంగారము పగడము రత్నములను, కుశబీజమును, తీర్థజలము (అభిషేక జలము, గంగాజలము)ను పంచగవ్యములను (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రగోమయములు) ఎవరు వట్టి నేల పై పెట్టుదురో ఆ మూడులు పదివేల సంవత్సరములు ఘోరనరక బాధలనుభవించుట సత్యము. ఇట్లు సృష్టికర్తయగు బ్రహ్మ భూదేవి నోదార్చి దేవతలను ఆమెను వెంటబెట్టుకొని శంకరుని నివాసమగు కైలాసమున కేగెను.
బ్రహ్మ సుందరమైన ఆ శివుని ఆశ్రమమునకు పోయి ఆకాశ గంగాతటమున అక్షయ వటవృక్ష మూలమున నివసించి యున్న శంకరుని దర్శించెను. ఆ పరమేశ్వరుడు పులితోలు చుట్టుకొని దక్షకన్యయగు సతీదేవిని కపాలములను భూషణముగా ధరించీ త్రిశూలమును పట్టేశాయుధమును చేతబట్టి ఐదు ముఖములతో మూడు కన్నులతో ఒప్పుచు నానావిధ సిద్ధులు పరివేష్టించి యుండగా యోగీంద్ర గణములతో సేవింపబడుచు తన చుట్టు సాగుచున్న అప్సరసల నృత్యమును చిరునవ్వుతో సంతోషముతో దర్శించుచుండెను. ఆసక్తిగా గంధర్వుల సంగీతమును వినుచు, తృప్తిగా తననే చూచుచున్న పార్వతిని ఓరచూపులతో చూచుచు, జగన్మంగళమైన హరినామమును ఐదు ముఖములతో జపించుచు, మందాకిని (ఆకాశగంగ) లో జనించిన పద్మముల పూసలతో క్రుచ్చిన జపమాలతో లెక్కించుచు ఆనందముతో పులకాంకితుడగుచుండెను.
ఇంతలో భూదేవితోబాటు దేవగణములు శిరస్సులు వంచగా ధూర్జటి ముందు బ్రహ్మ నీలిచెను. సృష్టికర్త జగత్పితయగు బ్రహ్మను చూచి శంకరుడు భక్తితో త్వరగా లేచి ప్రీతితో తలను వంచి నమస్కరించి ఆశీస్సులు పొందెను. చంద్రుని తలపై దాల్చిన శంకరునకు భూదేవియును సర్వదేవతలును భక్తితో నమస్కరించిరి. హరుడు వారీకాశీస్సులు సమకూర్చెను.
ప్రజాపతి (బ్రహ్మ) పార్వతీవల్లభునకు తాము వచ్చిన వృత్తాంతమును చెప్పెను. భక్తవత్సలుడైన శంకరుడు ఆ వార్త విని త్వరగా (విచారముతో) తలవంచెను. భక్త వర్గమునకు వచ్చిన అపాయమును విని పార్వతీపరమేశ్వరులు మిక్కిలి దుఃఖార్డులు కాగా బ్రహ్మవారిని ఓదార్చెను. అంతట బ్రహ్మయు శంకరుడును భూదేవిని సురగణములను ఓదార్చి భూదేవిని ఆమె లోకమునకు సాగనంపిరి.
ఆ పిదప బ్రహ్మరుద్రాది దేవేశ్వరులు త్వరగా ధర్మునీ మందిరమునకేగి అతనితో పై విషయ మాలోచించి శ్రీహరీ భవనమునకేగిరీ.
వైకుంఠమనేడి ఉత్తమ లోకము దేహధారుల జరామృత్యువులను (ముసలితనము-మరణము) హరించివేయునది. బ్రహ్మాండమునకు మిక్కిలి పైన బ్రహ్మలోకమున కంటే కోటి యోజనముల మీద వాయువు చేతనే ధరింపబడుచు సనాతనముగా వెల్గుచు ఊహాశాలులైన కవుల వర్ణనల కందక విచిత్రముగా ఒప్పునది. రత్ననిర్మితమగు ఆలోకము పద్మరాగ ఇంద్రనీల మయములైన రాజమార్గములతో అలంకరింపబడినది. మనస్సుతో ప్రయాణము చేయగల ఆ దేవేశ్వరులు మనోహరమైన శ్రీహరి లోకమును తరువాత అతని అంతఃపురమును చేరనేగి శ్రీహరిని దర్శించిరి.
రత్నసింహాసనమందు వేంచేసియున్నవాడును రత్నాలంకారముల చేత అలంకరింపబడినవాడును రత్నాల బాహపురులు (దండకడియములు) ముంజేతి కంకణములు రత్నాల కాలి అందెలతో శోభించుచున్నవాడును, రత్నాల కుండల (చెవుల కమ్మలు) ముల జంటతో వెలుగుచున్న చెక్కిళ్లు గలవాడును, పీతాంబరము (పసుపు వన్నె గల వస్త్రము) ధరించినవాడును, కంఠము నుండి పాదముల వరకు వ్రేలాడుచున్న వనమాలయను పూలదండతో అలంకృతుడును, శాంతస్వరూపుడును, సత్త్వగుణముచేత వేదవాణీకి ఇంపైనవాడును, లక్ష్మీదేవిచేత ధరింపబడిన పాదపద్మములు గలవాడును, కోటి మన్మధుల విలాసముచేత వెలుగువాడును, చతుర్భుజుడును, చిరునవ్వు చిందించు ముఖము గలవాడును, నంద సునంద కుముదులనెడి అంగరక్షకులచేత సేవింప బడువాడును, చందనము పులుపబడిన దివ్య విగ్రహము గలవాడును, శ్రేష్ఠరత్న కిరీటము చేత వెలుగుచున్నవాడును, పరమానంద రూపుడును, భక్తుల ననుగ్రహించువాడును అగు ఆ శ్రీహరిని బ్రహ్మాదిదేవతలు భక్తితో నమస్కరించి తమ శిరస్సులు భక్తిభావమున వంగగా స్వామిని దర్శించిన పరమానంద భారము చేత ఆర్తులై పులకరించిన శరీరములు గలవారై పరమ భక్తితో నిట్లు స్తుతించిరి.
బ్రహ్మోవాచ :
బ్రహ్మదేవుడిట్లు పల్కెను కమలానాథుడు శాంతస్వరూపుడు సమస్తమునకు ఈశ్వరుడును తన అత్యున్నత స్థితి నుండి జారుపాటు లేనివాడును అగు వానికి నమస్కరించుచున్నోను. ఓ నిరంజన స్వరూపా! మేము (బ్రహ్మరుద్రులు) నీ మహిమలోని ఒక కళారూపములుగా ఏర్పడితిమీ. ఒక కళలోని పదునారవ భాగపు అంశతో దేవతలేర్పడిరి. మనువులు, మునీంద్రులు, మనుష్యులు, చరాచర జీవకోటి నీ యొక్క ఒక కళ యొక్క పదునారవ భాగపు కళలోని అంశకళతో ఏర్పడిరి.
శంకర ఉవాచ :
శంకరుడిట్లు పలికెను :
నిన్ను నాశములేనివానిగాను మార్పులేనివానిగాను వ్యక్తస్వరూపుడవై గూడి అవ్యక్త మహిమ గల పరమాత్మగాను, అనాది లక్షణుడవును నీకంటే ఇతరమైన జగత్తునకు ఆది (కారణము) యైనవాడవును, ఆనందరూపుడవును సర్వరూపములు నీవైనవాడవును. అణిమాది సీదులకు మూలమైన వాడవును, సమస్త ప్రపంచమునకు కారణమైన వాటికీని కారణమైనవాడవును, సీదు లెరిగిన వాడవును సిద్ధులనొసగువాడవును తపోయోగాదుల ఫలస్వరూపుడవును అగు పరమేశ్వరుని నిన్ను స్తుతింపనెవడు సమర్థుడు?
ధర్మ ఉవాచ :
ధర్మదేవత ఇట్లు పల్కెను :
వేదమునందు నిరూపింపబడిన స్వరూపస్వభావములు గల వస్తువేదో విమర్శజ్ఞానము గల వారిచేత ఏ వస్తువు వర్ణింపబడునో, నిర్వికారములైన ఎవని గుణరూపములు సంభావనీయములో (భక్ష్యాదరములతో తలచదగినవి) ఆ నిరుణుని ఈ చెప్పబడిన లక్షణములకు భిన్నముగా ఏమని వర్ణించి స్తుతింతును.
ఓ నారద మహామునీ! బ్రహ్మాదులు ఆరుశ్లోకములలో చెప్పిన ఈ స్తోత్రమును పఠించి మనుష్యుడు దుర్గమ బంధముల నుండి విడివడును. వాంఛిత ఫలమును పొందగల్గును. దేవతల స్తోత్రమును విని శ్రీహరి వారితో నిట్లనెను.
మీరు గోలోకమునకు వెళుడు. నేను లక్ష్మీదేవితోబాటు పీదపవత్తును. శ్వేతద్వీపమునందు నివసించు నరనారాయణు లిద్దరచ్చటనుందురు. సరస్వతీదేవియు కుమారస్వామియు గణపతియు సావిత్రీదేవియు వేదమాతయగు గాయత్రీదేవియు ఆద్యంతములు లేని నామాయయు వీరందరును గోలోకమునకు ఆ వెనుక వత్తురు. ఆ లోకమున నేను గోపికలతోను రాధతోను కూడి ద్విభుజ (రెండు చేతులు గల) కృష్ణుడనుగాను ఇక్కడ (విష్ణులోకమున) నేను కమలా (లక్ష్మి) యుక్తుడనై సునందాదులచేత పరివేష్టింపబడి ఉందును. శ్వేతద్వీపమున నివసించు నారాయణుడను కృష్ణుడను నేనే. ఆ రూపములన్నియు నా కళలు. బ్రహ్మాది దేవతలందరు నాకళల్లోని అంశమాత్రులు. సురలు అసురులు మానవులు మొదలగు జీవులందరు అంశాంశమాత్రులుగా చెప్పబడిరి. మీరు గోలోకమునకు పొండు మీకు కార్యసిద్ధియగును. అందరి కోరికలు సిద్ధించుటకు మేము ఆ వెనుక వత్తము. ఇట్లు వైకుంఠమున శ్రీహరి స్వయముగా సభామధ్యమున పలికి విరమించేను.
దేవతలందరు శ్రీహరికి నమస్కరించి జరామృత్యువులను హరించునదియు అత్యద్భుతమును శ్రేష్ఠమగు పరమ ధామమును, శ్రీహరి తన సంకల్పముతో సృష్టించినదియు, వైకుంఠమునకు పైన ఏబదికోట్ల యోజనముల తరువాత చేరదగినదియు వాయువుచేతనే ధరింపబడునదియునగు గోలోకమను అనిర్వచనీయ ప్రదేశమునకు పోవలెనన్న ఆసక్తి కలవారై మనస్సులే వాహనములుగా చేసికొని పయనించి ఆ దేవతలందరు విరజానదీ తీరమును చేరబోయిరి. ఆ నదీ తీరమును చూచి వారందరు పరమాశ్చర్యమును పొందిరి.
స్వచ్ఛమైన స్ఫటికమణుల కాంతి గలదియు మనోహరమై సువిశాలమైనదియు, ముత్యములు శ్రేష్ఠమైన మణిరత్నములకు. నెలవైనదియు, నలుపు తెలుపు ఆకుపచ్చ ఎరుపు వన్నెల మణి సమూహములతో విలసిల్లునదియు, ఒకచోట మనోహరముగా మొలచిన పగడాల మొలకలు గలదియు, మిక్కిలి అమూల్యమైన మేలుజాతి రత్నములతో వెలుగొందునదియు, సృష్టికర్తయగు బ్రహ్మయును ఇంతకుముందు చూడనట్టి ఆశ్చర్యకరమైన, శ్రేష్ఠములైన నిధుల సమూహముతో కూడినదియు, ఒకచోట పద్మరాగ ఇంద్రనీల మణులకు ఆకరమైనదియు, మరియొక చోట మరకత మణి సమూహములకు, ఇంకొక చోట శ్యమంతకమణులకు, వేరొక చోట రుచకమణులకు నివాసస్థానమైనదియు, అమూల్యమైన పసుపుపచ్చ రంగు గల మణిశ్రేణులు గలదియు, ఒకచోట రత్నములకు ఇంకోక చోట కౌస్తుభములకు వేరొక చోట వర్ణింపనలవిగాని మణులకు ఆకరమైనదియు, అచ్చటచ్చట సుందరములైన విహార స్థలములు గలదియు నగు ఆ విరజా తీరమును చూచి దేవతలు పరమాశ్చర్యము పొంది దానిని దాటిరి.
ఓ నారదమునీ! చూచువారి మనస్సుల నానందపరచునదియు, నూరు శిఖరములు గలదియు, పారిజాత వనములతో ఒప్పుచున్నదియు, కల్పవృక్షములు కామధేనువులతో కూడినదియు, కోటి యోజనముల ఎత్తుగలదియు, అంతకన్న పదింతలు పొడవు గలదియు ఏబది కోట్ల యోజనముల శైల ప్రస్థము (కొండమీది సమతలము) గలదియు అగు నొక శ్రేష్ఠపర్వతమును దేవాదులు చూచిరి. ఆ కొండ పైన పదియామడల విస్తీర్ణము గల గుండ్రనీ ప్రాకారము నడుమ ఆ శిఖరము పై రాసమండలమున్నది. పుష్పించి సువాసనలు విరజిమ్ముచు దట్టమైన గండు తుమ్మెద గుంపులతో గూడిన వేల పుష్పోద్యానములతోను, భోగద్రవ్యములతో గూడిన అనేక విలాస మందిరములతోను, రత్న సోపానములతో రత్న కలశములతో మరకత మణిస్తంభములతో శోభిల్లుచున్న వేలకోట్ల రత్నమంటపములతోను, సిందూర (ఎరుపు) వర్ణముణులు చుట్టును పొందుగబడి మనోహరములైన ఇంద్రనీలమణుల మధ్యవెలుగందుచున్న నవవిధ మణులతో నిర్మించిన ప్రాకారములతోను, మామిడి చిగుళ్ల తోరణములు అరటిబోదెలు అలంకరించిన నాలు కవాట ద్వారములతోను, తెల్లని బియ్యము పచ్చని ఆకులు ఫలములు గరికమొలకలు అలంకరించిన (గడపలతోను) చందనము, అగరు, కస్తూరి కుంకుమ పువ్వుల ద్రవము పులిమిన ముంగిళ్ళతోను, గుంపులు గుంపులుగా సున్న అనేక గోపకన్యల చేత పరివేష్ఠింపబడి ఆ రాసముండల మొప్పుచుండెను.
రత్నాలంకారములు రత్నములహారములు గల సుందరీమణులు రాధికాదేవి ఆజ్ఞచేత ఆ ప్రదేశమును గుంపులు గుంపులుగా గూడి రక్షించుచుండిరి. వారు రత్న కంకణములు రత్నాల దండకడియములు రత్ననూపురములు (కాళ్ల అందెలు) అలంకరించుకొని యుండిరి. చెవులకు బెట్టుకొన్న రత్నకుండలములతో వారి చెక్కిళ్లు (చెంపలు) తళతళలాడుచుండెను. సుందరములైన వారి చేతివ్రేళ్లయందు రత్నాంగుళీయములు (ఉంగరములు) విరాజిల్లుచుండెను. ఆ స్త్రీల పాదముల వ్రేళ్లు రత్నాల మట్టెలతో వెలయుచుండెను. శిరస్సున అలంకరించుకున్న రతనాల నగలతోను మెరయుచున్న కిరీటములతోను, ముక్కు నడుమ మెరయుచున్న ఏనుగు ముతైపు (జాతిముత్యము) ఆభరణములతోను, ఎఱ్ఱని చుక్క తిలకములతో ప్రకాశించుచున్న ముంగురుల క్రింది ఫాలభాగములతోను కూడి సుందరమైన సంపెంగ పువ్వు వన్నె వంటి గంధములు పులుముకొన్నవారును, మనోహరములైన దొండపండువంటి క్రింది పెదవులు గల వారును పీతాంబరములు ధరించిన వారును, శరత్కాలపూర్ణీమనాటి చంద్రుల కాంతిని దోచుకోనుచున్న ముఖకాంతులు గలవారును, శరదృతువున వికసించిన పద్మ సౌందర్యమును దోచుకొనుచున్న కన్నులు గలవారును, కస్తూరీ పాత్రలు చేతబట్టి రేఖలుగా తీర్చిన కన్నుల కాటుక కాంతి గలవారును, నిండుగా విచ్చుకొన్న మాలతీ పుష్పహారములు కొప్పులయందు ధరించిన వారును, పూలతేనె కాశీంచిన తుమ్మెదల గుంపులు గలవారును, సుందరగమనము (నడక) తో ఏనుగులను కాటుక పిట్టలను తిరస్కరించుచున్నవారును, వక్రము సుందరమునైన బొమముడి గల స్వచ్ఛమైన చిరునవ్వుతో విరాజిల్లుచున్నవారును, పండిన దానిమ్మ పండులోని బీజముల వంటి పలువరుసలు గలవారును, పక్షిరాజగు గరుత్మంతుని ముక్కు అందమును మించిన ఉన్నత నాసికలతో (ముక్కు) ఒప్పుచున్నవారును, గజరాజు కుంభయుగము వంటి స్తనముల భారముతో వంగినట్లున్నవారును, మధ్యభాగమున కఠినములు పుష్టిగా నున్నవియునగు పిరుదుల భారముతో వంగినవారును, మన్మథ బాణ ప్రయోగముల వలన వణకుచున్నట్లున్న మనస్సులు గలవారును నిండు చంద్రుని వంటి తమ ముఖ సౌందర్యమును అద్దములలో చూచుకొను ఆసక్తి గలవారును, రాధాదేవి పాదపద్మములను సేవించుట యందాసక్తి గలవారును అగు గోపకన్యలు అనేకు లుండిరి.
అచ్చట లక్షలకొలది క్రీడా సరోవరములు తెలుపు ఎరుపు నలుపుతో గూడిన ఎరుపు రంగు గల పద్మములతో కూడి విస్తరించి యుండెను. గుంపులు గట్టి ఝంకారములు చేయుచున్న తుమ్మెదల సమూహములు గల పుష్పోద్యానములు వేలకొలది అలరారుచుండగా వాటిలో పూలశయ్యలతోను, కర్పూర తాంబూలాది భోగద్రవ్యములతోను మంచి వస్త్రములతోను శ్వేత చామరములు నిలువుటద్దములతోను చిత్ర విచిత్రములైన పూలమాలలతోను, చుట్టు వెలుగుచున్న రత్నదీపములతోను గూడిన కోటిసంఖ్య గల పొదరిండ్లు (లతా గృహములు) వెలసియున్న రాసమండపమును చేరి దేవతలు దానిని దర్శించి శతశృంగ పర్వతము దాటి వెళ్లిరి.
రాధామాధవులకు ప్రియమై ఆ దంపతులకు క్రీడా స్థానమైన పరమ సుందర బృందావనమును దేవతలు దర్శించిరి. ఆ బృందావనము కల్చవృక్ష సమూహములతో కూడి, విరజా నదీ జలముచే తడిపబడిన పిల్లగాలులు వీచగా కంపించుచు, కస్తూరీ సహిత పద్మ పత్రముల యొక్క పుష్పముల యొక్క సువాసనలతో కూడి, క్రొత్త చివుళ్లకు మరిగిన కోకిలల ధ్వనులతో కూడి, ఒకచోట విలాసపు కడిమీ చెట్ల గుంపులతో కోరదగినదై, మందారముల చంపకముల చందన వృక్షముల సుగంధ పుష్పముల వాసనలతో పరిమళించునదై, మామిడి నారింజ పనస తాడి కొబ్బరి చెట్ల గుంపులతో దేవవనమై, అల్లనేరడి, రేగు, ఖర్జూర, గజనిమ్మ, అరటి, మారేడు, దానిమ్మ మొదలగు ఫలవృక్షముల మగ పండిన ఫలములతో నిండి గుంపులు గుంపులుగా మనోహరములై ఒప్పున, పిప్పలి మద్ధి రావి, వేప, బూరుగు మొదలగు మంగళ వృక్షములలో అనేక విధములు దట్టముగా గుంపులు గుంపులుగా విలసిల్లునదై, అంతట విస్తరించిన కల్పవృక్ష బృందములు గలదై, మల్లి, మాలతి, మొల్ల బండి గురివింద, మొగిలి మొదలగు పుష్పలతల పొదలు గలదై విరాజిల్లుచుండెను. ఆ బృందావనములో పొగదినుసుల పొగలతో పరిమళించుచు రత్నదీప మాలలతో వెలుగుచు సుగంధ వాయువులు సోకించిన శృంగార ద్రవ్యములతో అలరుచు, మంచి గంధములతో తడిపిన పుష్పశయ్యలు పూలమాలలు చేరులు పూలతావికీ లేనెకు ఆశీంచి వచ్చిన తుమ్మెదల రొదలు ధ్వనించుచు, మనోహరముగా నున్న పొదరిండ్లు ఏబది కోట్లుండెను. ఆ ప్రదేశమును రాధాదేవి ఆజ్ఞతో రత్నాలంకార శోభాడ్యలైన ఏబది కోట్ల గోపికా స్త్రీలు చుట్టు ముట్టి రక్షించుచుండిరి.
అచట బృందావనము లోపల ఉత్తమము మనోహరము పరమ సుందరమైన ఏకాంత ప్రదేశము ద్వాత్రింశల్కొనన మను పేరుతో గలదు. ఓ నారదమునీ! బాగుగా పండి తీయని రుచిగల ఫలములతో ఆవులతో నిండిన గోశాలల సమూహములతో తేనెనాళించి వచ్చిన లేనె టీగల గుంపులు గల నిలువెల్ల పుష్పించిన వేల పుష్పోద్యానములతో శ్రీకృష్ణుని సౌందర్యాదులకు తగిన పంచాశత్కోటి సంఖ్యగల సద్రత్నాలంకార ధారిణులైన గోపికారమణుల యొక్క విలాస చేష్టలతో కూడిన ఆ రమ్య వనమును దర్శించి లోకపాలకులు గోలోకమునకేగిరి.
ఆ గోలోకము వలయాకారముగా నుండీ అంతట కోటి యోజనముల వైశాల్యము గలదిగా నుండెను. చుట్టు రత్నప్రాకారము గలీకి గోపాలకులు ద్వారపాలకులు గల నాలు ద్వారములతో నుండెను. ఆ లోపల రత్నములు పొదిగిన, నానా భోగ వస్తువులతో కూడిన ఆశ్రమములు కృష్ణదాసీజనమైన గోపికల యొక్క నివాస స్థానములు ఏబది కోట్లుండెను. అంతకన్న సువిశాలములై సద్రత్నములు కూర్చిన భక్తులైన గోపాలక బృందముల ఆశ్రమములు శతకోట్లుండెను. అంతకంటే విశేషముగా అమూల్య రత్నముల చేత నిర్మించబడిన కృష్ణపార్షదుల పదికోట్ల ఆశ్రమములు ఉండెను. శ్రీకృష్ణుని వంటి రూపములు ధరించిన పార్టదనాయకుల యొక్క ఆశ్రమములోక కోటి, సద్రత్న నిర్మితములై ఉండెను. రాధికాదేవియందు శుద్ధభక్తి గల గోపికల యొక్క ఆశ్రమములు ముప్పది రెండు కోట్లు, మేలి రత్నములతో నిర్మించబడి అన్ని పదార్థములు గలవీయై యుండెను. భక్తురాండ్రైన ఆ గోపికల యొక్క దాసీజనము నివసించు భవనములు మణిరత్న నిర్మితములు పదికోట్లుండెను. భారత దేశమున (భూమండలములోని) నూరు జన్మల తపస్సు చేత పూతాత్ములైన భక్తులు, విశేషించి హరి భక్తులు, మోక్షము కొరకు కర్మాచరణ చేయు వారు స్వప్నమందును మెలకువ యందును శ్రీహరి ధ్యానములో లగ్నమైన మనస్సులు గలవారు రాత్రింబవళ్లు రాధాకృష్ణ “శ్రీకృష్ణ” అను మంత్రమును జపించుచున్న శ్రీకృష్ణ భక్తుల నివాస స్థానములు సుమనోహరములై యుండును. ఓ నారదమునీ! ఆ స్థానములు సద్రత్న నిర్మితములు నానాభోగములతో కూడినవి. పూలశయ్యలు పుష్పమాలలు శ్వేతచామరములు మరకత మణులు పొదిగిన రత్న దర్పణములు అందుశోభిల్లుచుండెను. అమూల్య రత్నకలశములు గోపుర శిఖరములపై ఒప్పుచుండగా సూక్ష్మ వస్త్రములు గప్పబడియుండు ఆ యాశ్రమములు నూరుకోట్లు అలరారుచుండెను. దేవతలందరు అద్భుతమైన ఆ గోలోకము దర్శించి ఆనందముతో కొంత దూరమేగిరి.
ఆ లోకపాలకులు అచ్చట ఐదుయోజనముల విస్తారమును అంతకు రెండింతల ఎత్తును కలిగి వేయి స్కంధములతోను (బోదెలు) శాఖోపశాఖలతోను గూడి ఎఱ్ఱగా పండిన ఫలములతోను మూలమున గత్న వేదికలతో విరాజిల్లుచున్న సుందరమైన అక్షయ వటమును దర్శించిరి. ఆ చెట్టు మొదట పీతాంబరములు ధరించి శ్రీగంధము పులిమిన సర్వాంగములు గలవారై రత్పభూషణముల చేత అలంకృతులై చూచువారికి మనోహరముగా బాల్యక్రీడా సక్తులై శ్రీకృష్ణరూపులై యున్న మోహన శిశువులను వారి సమీపమున విష్ణుపారదశ్రేష్టులను దర్శించిరి. అచ్చటికి సమీపముననే మనోహరమైన రాజమార్గమొకటి వారికి కన్పించెను. ఓ నారదా! ఆ మార్గమెర్రని మణులతో నిర్మితమై యుండెను. ఆ తరువాత ఇంద్రనీల, పద్మరాగ, వజ్ర రుచక మణులతో నిర్మితములైన ఆరుగులతో (తిన్నెలు) గూడిన రత్నమండపము కన్పించెను. ఆ మండపము చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవముతో అలుకబడి (పూయబడి) ఉండెను. ఆ రత్నమండపములో మేలిమి రతనాల పూర్ణకుంభములు మండలాకారముగా అమర్చబడియుండెను. ఆ కుంభములు కుంకువు ద్రవము పూయబడి శ్రీ గంధపు చిగురులతో గూడిన సన్నని సూత్రములచేత బంధింపబడి (కంకణ సూత్రములు) పెరుగు వరి పేలాలు ఫలములు పుష్పములు పచ్చిగరికలతో కూడి చుట్టు అరటిబోదెలు చుట్టియుండగా విరాజిల్లుచుండెను. ఎఱ్ఱని కుంకుమ ద్రవము చేత తడుపబడి శ్రీగంధ చందనమలదబడి పుష్పమాలాలంకృతములై యున్న వృక్షములు రత్నమండపము చుట్టునుండెను. అక్కడ క్రీడాసక్తలైన గోపికల నమూహములు పరివేష్టించి యుండిరి.
ఓ నారదా! రత్నమండపము దాటిన తరువాత దేవతలకు మనోహరములైన గృహములు కన్పించెను. అవి గొప్ప వెలగల రత్ననిర్మితములైన సోపానములతోను, అగ్నికాంతి గల సుందర వస్త్రములు వింజామరలు నిలువుటద్దములు విచిత్ర రత్న తల్పములు (శయ్యలు) పుష్పమాలలు మొదలగు భోగద్రవ్యములతోను, ద్వారపాలకులు రక్షించు పదహారు ద్వారములతోను చుట్టు అగడ్తలతోను రత్న ప్రాకారముతోను విరాజిల్లుచు చందనము అగరు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవములు పులుమబడి (పూయబడి) ఉండెను. ఆ గృహములను దర్శించి దేవతలు ప్రయాణాసక్తులై శీఘ్రముగా కొంత దూరమేగి ఇంతకు పూర్వము చూచిన వాటికన్న సుందరమైన ఆశ్రమమును చూచిరి. అది రాసేశ్వరియైన రాధికాదేవి యొక్క నిలయము.
దేవాధిదేవి గోపీగణ శ్రేష్ఠురాలు, కృష్ణునకు ప్రాణముల కన్న మిక్కిలి ప్రియురాలు ఐన రాధాదేవి కొరకు ఇం పైన ఉత్తమ ద్రవ్యములతో మనోహరముగా సుందరముగా నిర్మించబడిన ఆ యాశ్రమము ఎట్టివారికిని నిర్వచింపరానిదై పండితులచేతను నిరూపింప బడనిదై ఆరుగవ్యూతుల ప్రమాణము గలదై వర్తులాకారముగా నుండెను. (గవ్యూతి - ఎదురంకె వినబడునంత దూరము) అమూల్యము లైన శ్రేష్ఠమణులతో నిర్మించబడి రత్నకాంతులు విరజిమ్ముచున్న సూరు మందిరములు వేర్వేరుగానుండెను. ప్రతి మందిరము దాట శక్యము గాని లోతైన అగడ్డతో రత్నఖచిత ప్రాకారముతో పరివేష్టితమై కల్పవృక్షములు చుట్టుముట్టియున్న పుష్పోద్యానము నడుమ రతనాల తిన్నెలు (అరుగులు) గల ఏడేసి ద్వారములు విచిత్రములైన రత్నాల చిత్తరువులు వెలయుచుండగా ఆ గృహములను మండ లాకారముగా ప్రధాన సప్తద్వారములను వరుసగా చుట్టుముట్టి అక్కడ పదహారు ద్వారములు గల ఒక ప్రాకారముండెను.
వేయి ధనుస్సుల ఎత్తు కలిగి మేలి రత్నముల చిన్న చిన్న కలశములు తేజస్సుతో వెలుగుచుండగా రమ్యముగానున్న ఆ ప్రాకారమును దేవాధీశులు దర్శించి మిక్కిలి ఆశ్చర్యము పొందిరి.
ఆ ప్రదేశమునకు ప్రదక్షిణము చేసి వారు సంతసముతో ముందుకు కొంత దూరమగిరి. ముందుకేగుచున్న వారికి ఆ రాధాశ్రమము వెనుకగానుండెను.
అచ్చట వారు అమూల్య రత్నముల చేత నిర్మించబడిన శతకోటి సంఖ్య గల గోపికల యొక్కయు గోపాలకుల యొక్క ఆశ్రమ ములను దర్శించిరి. ఓ మునీ! అంతట విస్తరించి యున్న గోపాలుర ఆశ్రమములను పరమ సుందరములైన గోపికల క్రొంగొత్త ఆశ్రమములను ఇట్లు మొత్తము గోలోకమును చూచి దేవతలు పులకాంచితులైరి. అదియే వర్తులాకారమైన రమ్య బృందావనము. శతశృంగ పర్వతము. దానికి వెలుపల విరజానదీ. వీరజను దాటిన తరువాత అంతయు శూన్యమే కన్పించేను. ఆ గోలోకము వాయువే ఆధారముగా వెలయును. అది సద్రత్నమయము. అద్భుతము. రాధికాదేవి ఆజ్ఞననుసరించి పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పముతో నిర్మించబడిన ఆ లోకము వేల సరస్సులు కలిగే శుభములకు నిలయమై యుండెను.
ఆ దేవతలచ్చట ఇంపైన నృత్యమును మంచి మూర్చనలతో గూడిన, రాధాకృష్ణుల గుణములను వర్ణించు సుందర సంగీతమును వినిరి. ఈ గీతామృతమును విని వారు మూర్ఛ పొంది మరుక్షణములో తేలివికి వచ్చి ఆ కృష్ణ భక్తులు అడుగడుగున మిక్కిలి ఆశ్చర్యకరములు మనోహరములునైన దృశ్యములను చూచిరి.
ఆ లోకపాలకులు నానా వేషములు ధరించియున్న గోపికలనచ్చట దర్శించిరి. కొందరు మృదంగపాద్యములు ధరించి మరికొందరు వీణలను ధరించి ఇంక కొందరు చామరములు పట్టుకొని ఇంకొక కొందరు. తాళములు పట్టుకొని కొందరు చిమ్మున గొట్టములు వాద్యములను ధరించి-రత్ననూపురములతో (కాలి అందెలు) శోభిల్లుచు కొందరు, రత్నాల మొలనూలు లోని మువ్వల గుంపు ధ్వనించుచుండగా కొందరు, శిరస్సుల మీద కుంభములు (కడవలు) పెట్టుకొని వేర్వేరు నృత్యములు చేయు కోరికలు గల్గి కొందరు, పురుష వేషములు ధరించిన నాయికలు కొందరు వారికి నాయికలుగా మరికొందరు, కృష్ణవేషములు ధరించి కొందరు, రాధా వేషములు ధరించి ఇంక కొందరు, ప్రియసంయోగము చాలించిన వారు కొందరు, ప్రియుల నాలింగనము చేసికొను నాసక్తి గలవారు కొందరు ఇటు క్రీడాసక్తలైన యున్న గోపికలను చూచి ఆ దేవతలు చిరునవ్వుతో కొంతదూరము పోవుచు రాధాదేవి యొక్క ప్రధాన సఖుల ఆశ్రమములను అనేకములను చూచిరి.
రూపముచేతను గుణము చేతను, వేషము చేతను, యావనము చేతను, సౌభాగ్యము చేతను, వయస్సు చేతను ఒకే తీరుగా నుండి నిర్వచింప సాధ్యము గాని అలంకారములు గలవారై రాధికాదేవికి చెలికత్తెలైన గోపికలు ముప్పది ముగ్గురు అక్కడే ఉండిరి. వారి పేర్లివి. సుశీల, శశికళ, యమున, మాధవి, రతి, కదంబమూల, కుంతి, జాహ్నవి, స్వయంప్రభ, చంద్రముఖి, సావిత్రీ, గాయత్రి, సుముఖీ, సుఖ, పద్మాలయ, పారిజాత, గౌరి, సర్వమంగళ, కాళిక, కమల, దుర్గ, భారతీ, సరస్వతి, గంగ, అంబిక, మధుమతి, చంప, అపర్ణ, సుందరి, కృష్ణప్రియ, సతి, నందిని, నందన, వీరందరు రాధాదేవికి మిక్కిలి ఇష్టమైన సమాన సఖులు. ఇట్టి సమాన సుందరీమణుల ఆశ్రమములు అన్నియు సద్రత్న రచితములు, శుభ్రములు, రత్నములచేత బంగారము మొదలగు ధాతువులచేత మనోహరముగా నానావిధ చిత్ర చిత్రీతములు, విమాన గోపురముల ఫై మెరయుచున్న అమూల్య రత్నకలశములు గలవి. ఆ యాశ్రమములను దేవతలు దర్శించిరి. బ్రహ్మాండమునకు బయట పైన నున్న గోలోకమునకు పైగా వేరొక లోకము లేదు. ఆ పై అంతయు శూన్యమే. సృష్టి అంతవరకే. సప్తపాతాళములకు క్రింది సృష్టిలేదు. ఆరసాతలము క్రింద నీరు చీకటియే. పోరోనీది, చూడరానిది. ఓ నారదమునీ బ్రహ్మాండము చివరి వరకు దాని బయటున్న సమస్త విషయము నావలన వినుము.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములో శ్రీకృష్ణజన్మఖండమున నరనారాయణ సంవాదమున గోలోక వర్ణన అను నాల్గవ అధ్యాయము సమాప్తము.
