4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
17 - శ్రీబృందావన నగరవర్ణనములు
శ్రీనారాయణ ఉవాచ :
నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
ఆ బృందావనారణ్యములో రాత్రియందు గోపాలకులు సందుడు తల్పముల మీద (శయ్యలు మంచములు) నిద్రేశుడైన కృష్ణుడు తన తల్లియెద పై, గోపికలు తమ యువక భర్తల యొక్క సంయోగ సుఖాపేక్ష గల మనస్సులతో నిద్రించి యుండగా కొందరు గోపికలు శిశువులతో కొందరు గోపికలు సఖురాళ్లతో కొందరు గోపికలు శకటములందు కొందరు గోపికలు రథములందు నిద్రించి యుండగా.
నిండు చంద్రుడు వెన్నెల గాయుచుండగా స్వర్గము కంటే మనోహరమై నానావిధములైన పుష్పముల మీది నుండి వీచు గాలికి పరిమళవంతమై ఉన్న ఆ రాత్రి సర్వజీవులు చేష్టలుడిగి నీద్రించియున్న వేళలో ఐదవ ముహూర్తము గడచి పోవుచుండగా (అర్థరాత్రి) అక్కడికి శిల్పుల గురువులకు గురువగు విశ్వకర్మ వచ్చెను.
అతడు సన్నగా సుందరముగా నున్న దివ్య వస్త్రములు మనోహరమైన రత్నహారము ప్రకాశించెడి మకర కుండలములు సాటిలేని రత్నాభరణములు ధరించి యుండెను. జ్ఞానములో వయస్సులో పెద్దవాడైనను చిన్నపిల్లవానివలె చూడదగినవాడుగా నుండెను. మిక్కిలి సుందరుడైన అతడు కాంతిలో మన్మధుని వలె నుండెను. అతని వెంట మణులు బంగారము లోహాస్త్రములు (తాపీ వంటివి) పట్టుకొని విశేషమైన శిల్పమునందు నైపుణ్యము గల మూడుకోట్ల శిల్పులు వచ్చిరి.
కుబేరుని చైత్రవనమందలి సేవకులైన యక్ష గణములు స్ఫటికము వలె తెల్లనైన వారు రత్నములు ధరించినవారు - కొందరు దీర్ఘబాహువులు గలవారు పద్మరాగములు చేతబట్టుకొని కొందరు - ఇంద్రనీలమణులు చేతబట్టుకొని కొందరు - శ్యమంతక మణులు పట్టుకోనీ కొందరు - చంద్రకాంత మణులు పట్టుకొని కొందరు - సూర్యకాంతమణులు పట్టుకొని కొందరు - గండ్రగొడ్డళ్లు పట్టుకొని కొందరు పారలు పలుగులు వంటి ఉనుప పని ముట్లు పట్టుకొని కొందరు - సారవంతములైన సుగంధ వస్తువులు పట్టుకొని కొందరు - శ్రేష్ఠమైన మణులు మోయుచు కొందరు - చామరములు పట్టుకొని కొందరు - అద్దములు మోసుకొని కొందరు - స్వర్ణపాత్రలు బంగారు బిందెలు మోయువారు కొందరు అక్కడకు చేరవచ్చిరి.
విశ్వకర్మ ఆ సామగ్రిని చూచి శుభకరమైన చూపులు గల శ్రీకృష్ణుని ధ్యానించి మిక్కిలి మనోహరమైన నగరము నిర్మించుట కారంభించెను.
ఆ నగరము ఐదు యోజనముల ప్రదేశమున విస్తరింపబడినది. భరత వరమున శ్రేష్ఠమై ఉత్తమ పుణ్యక్షేత్రమే పవిత్రమైన తీర్థప్రదేశమై శ్రీహరికి మిక్కిలి ప్రియమైనదైనది. అక్కడ నివసించు ముముక్షువులకు (మో పేక్ష గలవారికి) మిక్కిలిగా మోక్షమునకు మూలమైనది. గోలోకమునకు సోపానము. కొందరు జీవుల వాంఛలు తీర్చునది. ఆ నగరమున మిక్కిలి మనోహరమైన చతుశ్శాలల భవనములు నాలుకోట్లు - శ్రేష్ఠమైన శిలలతో కవాటములు స్తంభములు సోపానములు నిర్మించబడినవి. చిత్రమైన బొమ్మలు పుష్పములు కలశములతో భవనముల శిఖరములు ప్రకాశించునట్లు - కొండరాళ్లతో ఆరుగులు, వాకిళ్ల నిర్మించబడినవి. శీలాప్రాకారములు వాటికి తగినట్లు సింహ ద్వారము దొడ్డి త్రోవ (ఇంటింటికీ) రెండు ద్వారములుండునట్లు స్ఫటిక మణులతో లీలగా సంతోషముతో విశ్వకర్మ చేత ఆ నగరము నిర్మింపబడినది.
మెట్లతోను శంకు ఆకారముగా నిర్మించబడిన శ్రీగంధపు స్తంభములతోను ఉక్కు కవాటములతోను వెండి కలశముల (కాంతితోనుండునట్లు)తోను శ్రేష్ఠమైన వజ్రముల ప్రాకారములతోను శోభించునట్లు ఆ గోపాలురందరకు తగిన ప్రదేశములందు వారి అధికార స్థితులకు తగినట్లు గృహములను (విశ్వకర్మ) నిర్మించెను.
ఆ తరువాత విశ్వకర్మ మరల వృషభానునికి రమ్యమైన భవనము నిర్మింప బూసుకొనెను. అగడ (నీటికందకము) ప్రాకారములను శ్రేష్ఠమైన నాలుగు ద్వారములు గల సుందరమైన ఇరువది నాలు శాలల భవనమును మహామణులతో నిర్మించేను. మంచీ మణులతో నిర్మించిన ఉత్తమ శయ్యలు మంచి వన్నె గల అతి సుందరములైన మణుల సోపానములు దృడమైన లోహకవాటములు శిఖరములపై ఉజ్వలముగా నున్న సువర్ణ కలశములు కృత్రిమ చిత్రములు సుందరమైన ప్రతి శాలా మందిరములో నిర్మించబడెను.
ఆ గృహములో నొక ఏకాంత ప్రదేశమున సుందరమైన సంపెంగ చెట్ల పూలతోట నడుము అతి మనోహరమైన చోట కలావతి భర్తతో సొసక్తిగా కలిసి ఆనందించుట కొరకు గాను మంచి మణుల మేడను నిర్మించెను. అది ఇంద్రనీల మణులతో నిర్మించిన తొమ్మిది అంతరములుగా శ్రీ గంధపు కట్టితో చేసిన స్తంభములు కవాటములు గలదిగా ఆనగరమంతటిలో మిక్కిలి ఎత్తై విలక్షణమై మనస్సుకింపుగా నుండెను.
నారద ఉవాచ :
నారదుడనెను :
ఓ భగవంతుడా ! దేవ శిల్పి ప్రయత్నించి ఏ స్త్రీ కొరకు రమ్యమైన గృహము నిర్మించెనో ఆ కలావతి ఎవతే? ఆ సుందరి ఎవని భార్య?
శ్రీనారాయణ ఉవాచ :
నారాయణ ముని పల్కెను :
కళావతి పితృదేవతల మానసకన్య. లక్ష్మియంశ గలది. ఆమె వృషభానుని భార్య. పతివ్రతమునందు మిక్కిలి ఆసక్తి గల సాధ్వి. ఏ దేవి పాదపద్మముల ధూళి వలన భూదేవి పవిత్రురాలయ్యెనో - నత్పురుషులు ఏ దేవియందు సుదృఢభక్తిని ఎల్లప్పుడు కోరుకొందురో - ఏ దేవి శ్రీకృష్ణుని అర్ధాంశతో జన్మించి తేజస్సుతో అతనికి సాటియై ప్రాణాధిక ప్రియురాలయ్యెనో - అట్టి రాధాదేవి కళావతి బిడ్డయే.
నారద ఉవాచ :
నారదుడనేను :
గోకులసాధుడగు వృషభానుడు మానవుడు. అతడు ప్రజములో నివసించుచు మిక్కిలి దుర్లభురాలైన పితృదేవతల మానస పుత్రిని ఎట్లు ఏ పుణ్యము చేత భార్యగా పొందెను ? ఓ మహామునీ ! ఈ వృషభానుడు పూర్వ జన్మలో ఎవడు ? ఏ తపస్సు వలన ఎవరి అనుగ్రహము వలన రాధ అతనికి పుత్రిక ఆయెను ?
సూత ఉవాచ :
సూతుడు పలికెను :
నారదుని మాట విని జ్ఞానులలో శ్రేష్టుడైన నారాయణ మహర్షి నవ్వి నారదుని మీది ప్రీతితో పురాతనమైన ఇతిహాసమును ఇట్లు చెప్పెను.
శ్రీనారాయణ ఉవాచ :
నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
పూర్వము పితృదేవతకు ముగ్గురు మానస పుత్రికలు జన్మించిరి. కలావతీ రత్నమాల మేనక అని, సామాన్యులకు వారు దుర్లభలు (లభించనివారు) వారిలో రత్నమాల జనక చక్రవర్తిని కామించి వరించెను. ఆమె పెంపుడు కూతురే శ్రీరామచంద్రుని భార్యయగు సీతాదేవి. ఆమె సాక్షాత్తుగా లక్ష్మీయే. ఆమె గర్భవాసము వంటి దశలు. గాని మనుష్య సంబంధముగాని లేనీ జన్మగలది. పితృదేవతల ఇంకోక కూతురగు మేనక శ్రీహరి అంశగల పర్వతరాజైన హిమవంతుని భర్తగా వరించెను. మొదట సతీదేవిగా నున్న పార్వతీదేవి మేనక కూతురే. పార్వతియు అయోనిసంభవయే. శ్రీహరి యొక్క సనాతనియైన మాయ ఆమె. పార్వతి తపస్సు చేసి నారాయణుడాత్మగా గల శంకరుని భర్తగా పొందెను.
పితృ దేవతల మూడవ పుత్రికయగు కళావతీ మనువంశమున జన్మించిన సుచంద్రుని భర్తగా వరించెను.
శ్రీహరి యంశతో జన్మించిన ఆ రాజు (సుచంద్రుడు) ఆమెను భార్యగా పొంది తనను తాను గుణవంతులలో శ్రేషునిగా అతిసుందరునిగా తలంచుకొనెను. ఆమెను గురించి బళీ ! ఏమి రూపమేమి వేషము ఏమి వయస్సు. ఆమె శరీరము మిక్కిలి కోమలము. ముఖము శరత్కాలచంద్రుని మించి యున్నది. ఇతర స్త్రీలలో దుర్లభమైన ఈమె నడక ఏనుగు యొక్క మందగమనమును తిరస్కరించును. ఆమె తన కడకంటి చూపులతో మునీంద్రుల మనస్సును మోహింపజేయు శక్తి గలది. అరటి బోదెల వంటి (తొడల) మీద నున్న పిరుదులు మిక్కిలి సుందరములు, స్తనములు పుష్టిగా కఠినముగా నున్నవి. నితంబములు (పిరుదులు) రథచక్రముల వలె సుందరముగా నిర్మించబడినవి. హస్తములు పాదములు మిక్కిలి ఎరుపు (అరిచేతులు అరికాళ్ళు). అందమైన పలువరుస పండిన దానిమ్మ గింజల రంగులో నున్నది. కన్నులు శరత్కాల మధ్యాహ్న మందలి పద్మ సౌందర్యమును దోచుకొన్నవి. భూషణముల చేత అలంకరింపబడిన ఈ రూపమే ఒక మంచి రత్నాల నగ.
ఆమె రూపమును చూచీ ఇట్లు తలచీ మన్మధ బాణ పీడితుడైన ఆకాముకుడు ఆ కాముకితో గూడి దేవతారథమెక్కి మనస్సునకిం పైన ప్రతి ప్రదేశము నందు ఏకాంతమున క్రీడించెను. శ్రీగంధము అగురు గాలులు వీచెడీ రమ్యమైన మలయపర్వతపు చరియలో రతిసుఖమునకు మూలమైన చంపక పుష్పముల సుందరయ్య ఫైనను - మాలతులు మల్లెలు నిలువెల్ల పుష్పించిన పుష్పోద్యానమందు - పుష్పభద్రానదీ తీరమందున్న ఏకాంతపు మొగిలీ తోటలలో - జంతు రహితమైన పశ్చిమ సముద్రతీరమందలి ఆరణ్యములో - నందనవనములో - మందర పర్వతపు చరియలో - కావేరీ తీరమందలి అడవిలో - సుందరమైన ప్రతి పర్వతము మీద - ప్రతీనదీ తీరమున - ప్రతినదము (పడమటికీ పారు ప్రవాహమునదము) ఒడ్డున - ప్రతి ద్వీపమున - అతడామెతో ఏకాంతమున రమించెను. క్రొత్తకూటమి తగులములోపడి అతడు రాత్రి పగలు ఎరుగకుండెను.
ఈ విధముగా ఆ రోజు చాల కాలము విహరించి ఒక చేయి సంవత్సరముల కాలమును ఒకముహూర్తమువలె గడిపి ఆ వెనుక వీరక్తుడయ్యెను.
అతడు తపస్సు చేయుట కొరకు భార్యతో బాటు భారతవర్షమున అతి ప్రశస్తమును పుణ్యతీర్థమునైన వింధ్య శైలమందలి పులహాశ్రమమునకు వెళ్లాను. అక్కడ కోరికలను త్యజించి మోక్షము మీది అపేక్షతో నిరాహారుడై (ఏ ఆహారము లేనివాడై) ఒక వేయి సంవత్సరములు తపస్సు చేసిను. ఓ నారదమునీ! బక్క చిక్కిన పొట్ట గలయతడు శ్రీకృష్ణపాద పద్మములను ధ్యానించుచు మూర్ఛపోయెను.
సాధ్వియైన కళావతి అతని శరీరము మీద పెరిగిన పుట్టను తొలగించి చూడగా ఏ మాత్రము కదలికలు లేక పంచప్రాణములు వదిలి మాంసము నెత్తురు శూన్యమైన అస్థిపంజరము మిగిలి యుండెను. నిర్జన ప్రదేశమున దుఃఖములో ఆరురాలై ఆమె పెద్ద ధ్వనితో ఏడెను.
ఆ పతివ్రత మిక్కిలి దీనురాలై కౌగిలించుకొని మూర్ఛచింది “ఓ నాథా ! ఓ నాధా !” అనీ ఆహారమేమి స్వీకరించక కృశించి నరములు తేలియున్న ఆ రాజును చూచి ఏడ్చెను. ఆమె రోదనము వీని సృష్టికర్తయు దయానిధియునగు బ్రహ్మ ఎదుట సాక్షాత్కరించెను.
భగవంతుడగు సృష్టికర్త త్వరగా ఆ రాజును ఓడిలోనికి తీసుకొని శోకించెను. ఆ రాజ శరీరమును కమండలు జలముతో తడిపి ఆ బ్రహ్మ వేత్త బ్రహ్మజ్ఞానముతో ఆ శరీరములోని జీవుని కదలించెను. రాజు చైతన్యము పొంది బ్రహ్మ దేవుని తనముందు చూచి నమస్కరించెను. మన్మధుని వంటి కాంతీ గల సుచంద్రుని జూచి బ్రహ్మ సంతృప్తి చెంది నీవు కోరిన వరము నిత్తును కోరుకొమ్ము అనెను.
రాజు వీధి పలుకులు విని ఓ దయానిధీ ! నీవు దయతో వరముగా మోక్షమిమ్ముని కోరుకొనెను. బ్రహ్మ ప్రసన్నముఖము పై చిరునవ్వు వెలుగగా వరమిచ్చుటకు పూనుకొనెను.
బ్రహ్మ వరమీయనున్నాడని మనస్సులో ఊహించి ఆ కళావతీ దేవీ భయముతో కంఠము పెదవులు దవడలు ఎండిపోగా బ్రహ్మతో నిట్లనెను.
కలావత్యువాచ :
కళావతి ఇట్లనెను :
ఓ బ్రహ్మదేవా ! రాజుకొకవేళ ముక్తినిత్తువేనీ దాని వలన ఈ అబలకు ఏది గతీయో చెప్పుము. ఓ చతుర్ముఖుడా ! భర్తలేనిచో స్త్రీలకు ఏమి శోభ ? పతివ్రతకు ప్రతము భర్తయే అని వేదమునందు చెప్పబడినది. గురువు, కోరికలు తీర్చు దైవము, తపోధర్మమయుడగు భర్తయే కదా ! అందరు చుట్టములలో భర్త కంటె శ్రేష్ఠమైన మిక్కిలి ప్రియమైన బంధువు ఉండడు. ఓ దేవా ! అన్ని ధర్మముల కంటె శ్రేష్టమైనది దుర్లభమైన పతిసేవయే.
వ్రతములు దానములు తపస్సు పూజ జపము హోమము సర్వతీర్థముల స్నానము భూ ప్రదక్షిణము సర్వవిధ యజ్ఞముల దీక్ష మహాదానములు సర్వవేదములు పఠించుట సర్వతపస్సులు వేదవేత్తలైన బ్రాహ్మణులకు భోజనము పెట్టుట దేవతా సేవనము ఇవియన్నియు పతీసేవా మహిమలో పదునారవ భాగమునకు సరిపోవు.
స్వామి (భర్త) సేవా విహీనలైన ఏ స్త్రీలు భర్తను కఠినముగా తిరస్కరింతురో వారు సూర్యచంద్రులున్నంతవరకు కాలసూత్ర నరకములో యాతనలనుభవింతురు. వారిని సర్పములంత శరీరములు గల పురుగులు (క్రీములు) రాత్రింబగళ్ళ కొరుకుచుండును. వారా బాధలకు విపరీతముగా అరచుచు మూత్రమును శ్లేష్మమును (తెమడ) మలమును భక్షింతురు. యమకింకరులు వారినోళ్లలో కొరువులు పెట్టుదురు. ఇట్లు వారు నరకములను అనుభవింతురు. ఈ విషయము వేదవాక్యములలో తెలుపబడినదని విద్వాంసుల ముఖతః వినియుంటిని.
అయ్యా ! అబలనైన నేను కొద్దిగా ఎరుగుదును. నీవు వేద జనకుడవు. విద్వాంసులకు, యోగులకు జ్ఞానులకు గురువులకు గురువువు. ఓ జన్మరహితుడా ! సర్వజ్ఞుడవగు నీకు నేనేమి తెలుపుదును. నాకు ప్రాణముల కంటే అధికుడును ప్రియుడగు నితడు ముక్తుడగునేని నాధర్మమునకు యావనమునకు రక్షకుడెవరు ? స్త్రీకి బాల్యదశలో తండ్రి రక్షకుడు. ఆ పుణ్యాత్ముడు యోగ్యునకు కన్యాదానము చేయగా ఇక ఎల్లప్పుడు స్త్రీకి రక్షకుడు భర్త. అతడు లేనప్పుడు ఆమెకు పుత్రుడు రక్షకుడు. ఇట్లు కౌమార యావన వార్ధక్యములను మూడు దశలలో రక్షకులు ముగ్గురుగా చెప్పబడినది. ఏ స్త్రీలు మేము స్వతంత్రులమనుకొనీరో వారు అన్నీ ధర్మములకు బహిష్కరింపబడిరి. దుష్కలములలో (వంశములు) జన్మించిన వారు దుష్ఠమనస్సులు గల కులటలైరి. వారునూరు జన్మలలో చేసిన పుణ్యములు నశించును.
బాల్యదశలో పుత్రునిపై ప్రేమయుండును. అట్లే యావన దశలోను ముసలి తనమందును పతివ్రతలకు భర్తయందు వాంఛ (ప్రేమ) సర్వకాలముందుండును. పాలు త్రాగు పుత్రునీ మీది ప్రేమ తల్లులకు మిక్కిలి శోభించును. కాని ఆ ప్రేమ సాధ్వీకీ భర్తయందు గల ప్రేమలో పదహారవంతునకును సరిపోలదు. పాలు త్రాగు శిశువు పై తల్లి ప్రేమ పాలిచ్చునంత వరకుండును. ఇష్టమైన పదార్థము మీద ప్రేమ దానిని తినునంత వరకుండును. సతీజనమునకు (పతివ్రతలకు) స్వప్నములోను మెలకువలోను ఎల్లప్పుడు భర్తమీద మనస్సుండును (ప్రేమ).
బంధువుల వియోగబాధ ఒకసారి దుఃఖించునంత వరకుండును. పుత్ర వియోగ దుఃఖము అంతకంటే అధికమైనది. అజ్ఞానురాలైన శ్రీ మండుచున్న అగ్నిలోను, విషమును తిని, ఎట్లు దగ్ధమై పోవునో అట్లే కార్యములందు నేర్పు ఉన్న స్త్రీ కూడ భర్త విరహాగ్నిలో కాలిపోవును. భర్త లేకుండా సాధ్వియైన స్త్రీకి అన్నమునందు గాని జలమందు గాని తృష్ణ (ఆశ - పొందవలెనన్న తహతహ) ఉండదు. అగ్ని లోపడి ఎండుగడ్డి కాలునట్లు విరహాగ్నిలో స్త్రీ మనస్సు కాలిపోవును.
స్త్రీకి భర్తకంటే వేరు బంధువుగాని ప్రియమైన వ్యక్తి గాని దైవము గాని గురువు గాని ధర్మము గాని ధనము గాని ప్రాణములు గాని లేవు (స్త్రీకి సర్వము భర్తయే).
విష్ణు భక్తుల మనస్సు శ్రీకృష్ణ పాదపద్మములందేట్లు నిమగ్నమైయుండునో, ఏకైక పుత్రుని యందు తల్లి మనస్సు, స్త్రీలయందు కాముకుల చిత్తము, చిరకాలము నుండి సంపాదించిన ద్రవ్యమునందు దీనుని మనస్సు. భయపడు వారికి భయకారణములందు, విద్వాంసులకు శాస్త్రముల మీద, శిశువులకు తల్లి చన్ను కుడుచుటయందు - శిల్పముల మీద శిల్చుల మనస్సు, జారిణులకు జారుని మీద ఎట్లు మనస్సు లగ్నమై యుండునో అట్లే పతివ్రతలకు భర్తయందు మనస్సు లగ్నమై యుండును.
ఓ బ్రహ్మా ! అట్టి భర్త లేని జీవనము ఒక్కక్షణము కూడ ఓర్చుకోదగినది గాదు. ఆ స్త్రీలకు భర్తలేని బ్రతుకు మరణము. ఇంకను మరణము కంటే మిక్కిలి బాధాకరము. ఉత్తముడైన భర్త లేని వారికి (భర్త మరణించిన వారికి) దుఃఖము వలన మనస్సు చచ్చిన వారికిని, ఇతర శోకములలో మునిగి కొంతకాలము తరువాత త్రాగుట తీనుటలు సంభవించును. వారి కంటే భర్తృ వియోగ శోకము వ్యతిరేకమైనది. ఆ పానముల వలన కూడ ఆ శోకము వర్ధిల్లుచుండును. సాధ్వీమణులకు కర్మ నీడవలె వెన్నంటియుండును. కర్మ సంగము గల వారి కంటే పతివ్రత శేష్ఠురాలు.
సాధారణ స్త్రీలు భర్తయొక్క భోగ దేహము చివరి వరకు కూడియుందురు. సాధ్వీ జన్మజన్మలనంటి యుండును.
ఓ జగత్కర్తా ! నేను వెంటనుండకుండ ఇతనిని నీవు ముక్తుని చేయుదువేని నిన్ను శపించి నీ యందు స్త్రీవధ దోషము పడవేతును.
కళావతి మాటలు విన్న బ్రహ్మ ఆశ్చర్యపడి భయముతో కలత చెందినవాడై ఆమెకు హితమైన అమృతము వంటి మాట పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ ఇట్లనెను:
బిడ్డా! నీవు లేకుండ నీ భర్తకు ముక్తి నీయను. నీతో పాటుగా నీతనిని ముక్తుని చేయుటకు ప్రస్తుతము నేను సమర్థుడను గాను. తల్లీ ! ముక్తి యన్నది కర్మఫలమునుభవించకుండ దుర్లభమనునది సర్వసమ్మతమైన మాట. కర్మఫలమనుభవించవలసిన జీవి ఆ బంధమును ఖండించుకొన్న తరువాతనే మోక్షము పొందును. నీవు నీ భర్తతో కలిసి కొంతకాలము స్వర్గ సుఖముననుభవించుము. ఆ తరువాత మీ యిద్దరికి భారత ఖండమున జన్మ ఏర్పడును. ఆ జన్మలో మీకు మహాసాధ్వియైన రాధాదేవీ స్వయముగా కూతురై జన్మించును. అప్పుడు మీరు జీవన్ముక్తులై ఆమెతో బాటు గోలోకమునకు వెళ్లగలరు. ఓ రాజేంద్రా ! సాధ్వీయును సత్వగుణము గలదియునగు ఈమెతో కొంతకాలము భోగములనుభవించుము. ఓ సతీ ! నీవు నన్ను శపింపదగదు. లోకములో నుండి కూడ జీవన్ముక్త స్థితిలోనుండు సాధువులు అన్నిట సమదృష్టి గలవారైనందున శ్రీకృష్ణ పాదపద్మములందే మనస్సు గలవారై దుర్లభమైన శ్రీహరి దాస్యమునే కోరుకొందురు గానీ మోక్షము న పేక్షింపరు.
ఇట్లు పలికి ఆ యిద్దరికి రెండు వరములిచ్చి (ఆమె కోరినట్లు భర్త ఎడబాటు లేకుండుట - అతడు కోరినట్లు ముక్తి దశ) నిలిచెను. వారాతనికి నమస్కరించి వెళ్లిపోయిరి. బ్రహ్మ తన లోకమునకేగెను.
ఆ దంపతులిద్దరు స్వర్గ భోగములనుభవించి కొంతకాలము తరువాత మిక్కిలి పుణ్యప్రదమై దీప్యమై బ్రహ్మాదులును కోరుకోనునట్టిదైన భారత వర్షమునకు వచ్చిరి (జన్మించిరి).
ఆ సుచంద్రుడే గోకులములో సురభానుని భార్యయగు పద్మావతి గర్భమున వృషభానుడుగా జన్మించెను.
హరి యంశతో అతడు శుక్లపక్షమున చంద్రుని వలె దినదినము గోకులములో పెరుగుచుండెను. అతడు నందునికి బంధువు. మంచి దానశీలుడు రూపవంతుడు సద్గుణవంతుడు పూర్వజన్మ స్మృతి గలవాడు మంచి బుద్ధి శక్తి గలవాడు సర్వజ్ఞుడైన మహాయోగి (పూర్వజన్మలో) కాపున శ్రీహరి పాదపద్మములందు మనస్సు గలవాడుగా నుండెను.
మహాసాధ్వీ కళావతీ దేవి కాన్యకు పట్టణములో లక్ష్మీదేవి అంశతో పూర్వజన్మ స్మృతి గల సుందరిగా అయోనిజగా జన్మించెను (గర్భవాసదశలేకుండ జన్మించుట).
కాన్యకుబ్జములో భనందనుడన్న వాడు పరాక్రమవంతుడగు రాజు. అతడొనర్చిన యజ్ఞములో చివరి రోజున యజ్ఞకుండము నుండి లేచి వచ్చిన స్త్రీ శిశువును చూచెను. ఆ బాలిక కరిగిన బంగారు వన్నెతో మంచి తేజస్సుతో వెలిగిపోవుచుండెను. మంచి రూపముతో నుండి నవ్వుచు పాలు త్రాగు బాలిక వలెనుండెను. (పుట్టిన శిశువు వలె) నగ్నముగా నున్న ఆ బాలికను రాజెత్తుకొని తెచ్చి సంతసముతో తన భార్యకిచ్చెను.
భనందుని భార్య మాలావతి మిక్కిలి సంతోషించి చను బాలిచ్చి ఆ శిశువును పోషించెను. ఆ శిశువునకు అన్నప్రాశనము చేయునాడు శంభమైన వేళలో సత్పురుషుల నడుమ నామకరణము చేయనుండగా “ఓ రాజా ! ఈ కన్యకు కళావతి యని పేరు పెట్టుము” అని అశరీరవాణి విన్పించెను.
ఆ వచనము విని ఆ రాజు కన్యకు అదే పేరు పెట్టెను. గొప్పగా ఉత్సవము చేసి బ్రాహ్మణులకు భిక్షులకు వంది జనమునకు ధనము దానమొనర్చి సర్వజనులకు భోజనములు పెట్టించెను.
కొంతకాలమునకు ఆ సుందరీ యావనవతి ఆయెను. మిక్కిలి సుందరియైన ఆ యువతి మునులమనస్సులనే మోహింపజేయునదిగా నుండెను. ఆమె దేహకాంతి సంపంగి పూలవర్ణము (పచ్చదనము) తో ప్రకాశించుచుండెను. ముఖము శరత్కాలచంద్రుని వలె నుండెను. వికసించిన పద్మముల వంటి కన్నులు చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖముతో స్తనభారము వలన వంగినట్లున్న శరీరము కలిగి ఆ యువతి ఉండెను.
ఆమె గజరాజు వంటి మేల్లని నడకతో ఒకనాడు రాజమార్గమున పోవుచుండగా జ్ఞానియగు నందుడు ఇంద్రియములను జయించినవాడైనప్పటికి ఆమెను చూచి మూర్ఛిల్లెను. వెంటనే స్మృతి తెచ్చుకొని భయగౌరవములతో ‘పోవుచున్న కన్య ఎవరి కూతురు’ అని రాజమార్గములో నడచువారినడిగెను. వారతనికి ఇట్లు చెప్సిరి.
ఆమె భనందన మహారాజు కూతురు. రాజమందిరములో లక్ష్మీదేవి అంశతో అవతరించిన ధన్యురాలు. క్రీడలయందలి ఆసక్తితో స్నేహితురాలి యింటికేగుచున్నది. ఓ గోకులనందరాజా ! నడువుము అని జనము చెప్పుచు పోయిరి.
ఆ మాటలు విన్న నందుడు మిక్కిలి సంతోషించి వెంటనే రథము దిగి రాజ సభలోనికేగెను. భనందన రాజు లేచి కుశల ప్రశ్నలు పలికి స్వర్ణపీఠమిచ్చెను. ఉభయులు చాలసేపు సరస సంభాషణలతో గడిపిరి. అప్పుడు నందుడు రాజును వినయముగా సంబోధించి ఇట్లు పలికెను.
నంద ఉవాచ – నందుడనెను:
“ఓ రాజేంద్రా! వినుము. శుభకరమైన ఒక విశేష వచనము చెప్పెదను. నీ బిడ్డకు ఒక విశేష లక్షణములు గల వరునితో సంబంధము కుదుర్చుము. సురభానుని కుమారుడు వృషభానుడు. అతడు తూ ప్రజములో సంపన్నుడైన నాయకుడు. సద్గుణవంతుడు. నారాయణాంశతో జన్మించిన సుందరుడు. మంచి పండితుడు. పూర్వజన్మ స్మృతి గల యోగీ స్థిరమైన యావనము గల యువకుడు. ఇక నీ కూతురు యజ్ఞకుండమందు లక్ష్మీ అంశతో జన్మించిన అయోనిజ. ముల్లోకములను మోహింపజేయు సుందరి. శాంత స్వభావురాలు కళావతి. వృషభానుడు నీ బిడ్డకు తగిన పరుడు. అతనికి తగిన వధువు ఈ కన్య. అన్ని విధముల నైపుణ్యము గల దాంపత్యసంబంధము శ్రేష్ఠముగానుండును.” ఇట్లు సభలో పలికి నందుడు ప్రసంగము చాలించెను.
ఓ నారదా ! ఆ మాటలు విని రాజు వినయముతో వంగి నందునితో పలికెను.
భనందన ఉవాచ - భనందనుడనెను:
“ఓ ప్రజరాజా! సంబంధమన్నది దైవాధీనమైనదే తప్ప నాకు సాధ్యమైనది కాదు. వధూవరులను కూర్చువాడు బ్రహ్మ. నేను కేవలము జన్మనిచ్చిన వాడను మాత్రమే. ఎవతి ఎవని భార్య? ఎవని బిడ్డ? వరుడెవడు? సాధనమేది? కర్మకు తగినట్లు ఫలమిచ్చువాడు అన్నిటికి మూలమైనవాడు దైవమే కదా! ఇంతకుముందు జరిగినది గాని ముందు జరుగవలసినది గాని విరాటంకముగా జరుగునదే అని వేదము చెప్పును. దానికి విరుద్ధముగా చేయబడు పని నిష్పలమగును. అసమర్థుని ప్రయత్నము నేరవేరునా? నా బిడ్డ వృషభానుని భార్య కావలేననీ బ్రహ్మ చేత లిఖింపబడియున్నచో అది జరిగి తీరును కదా! దానికి నేనెవడను? ఇక వేరెవ్వని చేత నీపొరింపబడును?” ఆ రాజిట్లు పలికి వినయముతో ఆదరముగా మంచి భోజనము తినిపించెను. సందరాజు భనందుని అనుమతి తీసుకొని గోకులమున కేగెను.
నందుడు పోయి సురభానుని సభలో ఈ విషయము చెప్పెను. వెంటనే సురభాసుడు అతని మాట మీదీ ఆదరముతో గర్ణుని ద్వారా కొడుకునకు ఆ సంబంధము కుదిర్చెను. భనందనుడు పుత్రిక వివాహ కాలమున మంచి ఏనుగులను జాతి గుఱ్ఱములను రత్నములను మణిభూషణములను స్త్రీ ధనమును విస్తారముగా నిచ్చెను.
వృషభానుడు ఆ కళావతిని వివాహమాడీ సంతోషయుక్తుడై ఏకాంత ప్రదేశమున ఆమెతో సుఖించెను. రాత్రి పగలు ఎరుగకుండెను. ఆమె కనురెప్ప పాటు కాలము భర్తలేనిచో విరహముతో వ్యాకులపడును. అతడామె క్షణము లేనిచో వ్యాకులుడగును. ఆమెకు పూర్వస్మృతియున్నది. విష్ణుమాయయే మనుష్యరూపమెత్తినది. అతనికి పూర్వ స్మృతీ యున్నది. అతడు హరి అంశయే. ఆ ఉభయుల ప్రేమ దీనదినము మరీ మరీ క్రొత్తగానై పెరుగుచుండెను. ఆ దంపతులకు కొంతకాలమునకు హఠాత్తుగా సంభవించిన సుదాముని శాపము కారణముగా శ్రీకృష్ణుని యనుమతితో గోలోకవాసియైన రాధాదేవి కూతురుగా జన్మించెను.
ఆ రాధాదేవినీ కని దర్శించి నంత మాత్రమున కలావతీ వృషభానులు జీవన్ముక్తులైరి. రాధ మానవ గర్భవాస సంబంధము లేకుండ జన్మించినదే. శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిక్కిలి ప్రియురాలు.
పాపములను ఇంధనములను (వంటచెరకు - కఱ్ఱ) కాల్చుటలో మండుచున్న అగ్నివంటి (పాపనాశకము) ఇతిహాసము చెప్పితిని. ఇక ప్రస్తుత కథవినుము.
శిల్పీ శ్రేష్ణుడైన విశ్వకర్మ వృషభానునీ ఆశ్రమమును నిర్మించి తన గణములతో బాటు వేరొక స్థానమునకేగెను.
శిల్పతత్త్వవేత్తయైన విశ్వకర్మ మనస్సుతో బాగుగా ఆలోచించి క్రోశమాత్ర స్థలము (ఎటుచూచినను కోసు దూరము గలది) అందమైనది గ్రహించి మహానుభావుడైన నందునకు భవన నిర్మాణము చేయుట కారంభించెను.
బుద్ధిశక్తిలో అతడాలోచించి అన్నిటికన్న విలక్షణముగా దాటరానంత నీరు నిండి ఉండునట్లుగా లోతుగా త్రవ్వి రాళ్ళతో నిర్మించిన నాలుగు అగడ్డలు (కందకములు) కంచెల (తోటహద్దులు) దాక నిండుగా పుష్పించిన పూలతోటలు కన్నులకింపై మనస్సును హరించునట్లు అందమైన సంపెంగలు పుష్పించే పరిమళవాయువులు నలువైపుల సువాసనలు వెదజల్లునట్లున్న ఉద్యాసములు.
మామిళ్ల ఇప్పులు పనస చెట్లు ఖర్జూరము కొబ్బరి చెట్లు దానిమ్మ మారేడు గజనిమ్మ నారింజ చెట్లు ఎత్తైన జీడి మామిడి చెట్లు అల్లనేరెళ్లు అన్ని పండ్లతోటలును.
అరటి గుంపులు మొగిలిపొదలు కడిమీ చెట్ల గుంపులు పండ్లు పండి పుష్పించి అంతట శోభించుచు రహస్య క్రీడలకు తగినట్లుగా కోరదగినవై చాటు మాటులు గలవిగానుండెను.
ఆ అగడ్తలకు మంచి త్రోవ రహస్య ప్రదేశములో (గృహములోనికి రాకపోకలకు తగినట్లు) శత్రువులకు చొరరాకుండ మిత్రులకు రాదగినట్లు నిర్మించబడెను.
ఆ రహస్య మార్గము గుర్తింపుగా మణిస్తంభముల చేత కప్పబడి పైన కొద్దినీరుండునట్లు నిర్మితమయ్యెను. ఆ స్తంభముల మధ్య దూరము మీక్కిలీ దూరముగా గాని దట్టముగా గాని లేకుండెను. అగర్త ఒడ్డున నూరు ధనుషుల ప్రమాణముతో మిక్కిలి ఎత్తుగా సుందరమైన ప్రాకారము (చుట్టుగోడ) నిర్మించబడెను.
ప్రాకారమునకున్న రాళ్లు ఇరువది ఐదు హస్తముల ప్రమాణము కలవి. సిందూర వర్ణ శిలలతో అతి సుందరముగా అది నిర్మించబడెను.
మణిశిలలతో నిర్మించిన చేరేడులు గల ద్వారము బయట రెండు, లోపల ఏడు కట్లు? ఉండునట్లు నిర్మించబడెను. అవి చక్కగా బిగించబడెను.
చిత్రములతో (ఆకార రేఖలు) గూడిన ఇంద్రనీలమణుల కలశములతోను మణిశిలలతో నిర్మించిన కవాటములతోను గోపురము మీద మేలిమి బంగారు కలశములతోను ప్రకాశించుచున్న నందభవనమును నిర్మించి విశ్వకర్మ నగరమునకు మరల పోయెను.
ఎఱ్ఱని సూర్యబింబము వంటి అరుగులతో వాటికి మెట్లతో - కొండ కొంత దూరములో పట్టణమంతట మనోహరములైన విశ్రాంతి స్థానములతో - వర్తకులు వర్తకము చేయుట కొరకు పట్టణమంతట కుడి ఎడమ ప్రక్కలలో ప్రకాశించెడి రత్నమంటపములతో సుందరముగా వివిధ పద్ధతులలో రాజవీధులను నిర్మించేను.
ఆ తరువాత నగరము దాటి బృందావనమునకేగి అచ్చట రాసమండలమును (రాధామాధవుల విహారస్థానము) నిర్మించేను.
అంతట ఒక యోజనము (ఆమడ) వెడల్పుండునట్లు మండలాకారముగా సుందరమైన రత్నాల ప్రాకారముతోను, రత్నవేదికల తోను, తొమ్మిది కోట్ల (వరుసల) మణి శిలానిర్మితములైన మంటపములతోను, శృంగార రసయోగ్యములైన చిత్తరువులు రతి తల్పములతోను (శయ్యలు) రత్నపు దీపస్తంభములతోను, ప్రకాశించెడి సువర్ణ కలశములతోను (శిఖరముల మీద) వానాజాతుల పుష్పముల మీది నుండి పీచు గాలి వలన పరిమళవంతములైన ప్రదేశములతోను, పుష్పించిన ఉద్యానములతోను, సరస్సులతోను రాసస్థలము సుందరముగా నిర్మించి విశ్వకర్మ అటనుండి ఇతర ప్రదేశమున కేగెను.
విశ్వకర్మ సుందర బృందావనమును చూచి సంతసించి ఆ బృందావనములో నడుమ నడుమ ఏకాంత ప్రదేశములో, వేరు వేరు లక్షణములు గల సుందరోద్యానములను ముప్పదింటిని (30) రాధామాధవుల యొక్క క్రీడా విలాసముల కొరకనియే, ప్రయత్నపడి మనస్సుతో ఆలోచించీ బుద్ధితో స్థలము విభజించి నిర్మించెను.
ఆ తరువాత మధువనము దగ్గర మనోహరమైన ఏకాంత ప్రదేశమున మఱ్ఱి చెట్టునకు సమీపమున గల సరస్పునకు పశ్చిమ తీరములో చంపక వనమునకు తూర్పున కేతకీవసము నడుమ రాధామాధవుల క్రీడకొరకని మరియొక రత్న మంటపము సతడు నిర్మించెను. ఆ రత్న మంటపము వర్తులాకారముగా నూరు హస్తముల వైశాలము నూరు ధనువుల ఎత్తు గలిగీ అగ్నిజ్వాలవలె ప్రకాశించుచుండెను. దాని చుట్టు అమూల్య రత్నరచితములైన నానావిధ చిత్రములు చెక్కబడినవి. రత్నసార నిర్మితములైన వందల మెత్తని ఆసనములు గల నాలుగు వేదికలు (వెడలైన ఎత్తు అరుగులు) నిర్మితములై ఉండెను. సుందరములైన తొమ్మిది కవాట ద్వారములతో భవనమును చుట్టి వచ్చు గోడమీద విచిత్రములు మణినిర్మితములైన కృత్రిమ కలశములు మూడు వరుసలుగా ప్రకాశించుచు శోభిల్లుచుండెను. ఆ మంటప (భవనము) ము మహామణులలో ఏడు అంతరములుగా నుండెను. శిఖరముల మీద రత్న కలశములు ఉజ్జ్వలముగా ప్రకాశించుచుండెను. పతోకములు తోరణద్వారములు తెల్లని చామరములతో అలంకరింపబడెను, అంతట వెలగట్ట రాని రత్న దర్పణములు ప్రకాశించుచుండెను.
రత్నమంటపములోని అభ్యంతర గృహములో (లోపలి గృహము) అగ్నివలె ప్రకాశించుచున్న ఎడ్డని పట్టు వస్త్రములతో పూమాలలతో పారిజాత పుష్పమాలలతలగడలతో, నవ శృంగారమునకు యోగ్యమైన, కామవృద్ధిని చేయునటువంటి, మాలతీ చంపక పుష్పమాలలు, రత్న పాత్రలందున్న కర్పూర తాంబూలములతోను కూడి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల సువాసనతో పరిమళించుచున్న రత్నశయ్యలు శోభిల్లుచుండెను. ఆ శయ్యలు వజ్రములు పొదుగబడి ముత్యాల చేరులు చుట్టు వ్రేలాడుచుండగా వెలుచుండెను. రత్నఘటములు (పానీయ పాత్రలు) రత్నపీఠములు రత్నసింహాసనములు చంద్రకాంతమణులు కరగగా వచ్చు నీటి బిందువులతో చక్కగా తడుపబడుచున్న ప్రదేశములు కల్గి ఆ భవనము శోభిల్లుచుండెను.
చల్లని సుగంధజలము భోగద్రవ్యములతో కూడియున్న ఆ విలాస గృహమును సుందరముగా నిర్మించీ విశ్వకర్మ మరల నగరమునకు వెళ్లెను.
ఎవరికేగృహమో ఆయా వ్యక్తుల పేరులను ఆ మందిరముల మీద అతడు వ్రాసి సంతోషముతో తన శిష్యులను యక్షగణములను వెంటబెట్టుకొని, నిద్రించిన నిద్రినాధునకు (శ్రీకృష్ణునకు) నమస్కరించి తన నివాసమునకేగెను. సుకృతాత్ములకు అంతట అన్ని ఇట్లు సమకూరుట భగవత్కృప. స్వామి ఇచ్ఛవలన భూమి మీద ఇట్టి నగరమేర్పడినది. ఈ విషయములో ఆశ్చర్యపడవలసినది లేదు. నారదా ! ఇట్లు నీకు పాతకహరము సుఖమిచ్చునదియైన శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్ర చెప్పితిని. ఇక మరల నేమి వినగోరుచున్నావు.
నారద ఉవాచ - నారదుడనేను :
ఓ మంచి తత్త్వమెరిగిన నారాయణ మహర్షీ ! భారత వర్షములోని ఈ అరణ్యమునకు బృందావనమన్న పేరెట్లు వచ్చినది. ఆ నామము యొక్క అర్థమేమి ? చెప్పుము.
సూత ఉవాచ - సూతుడనెను :
నారదుని మాటలకు నారాయణ మహర్షి సంతసముతో నవ్వి ప్రాచీనమైన తత్త్వమునంతయు ఇట్లు చెప్పెను.
నారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :
పూర్వము సత్యయుగములో (కృతయుగము) సత్యము ధర్మము లందాసక్తి గల కేదార నృపతి సప్తద్వీపములకు నాధుడుగా నుండెను. ఆ ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డలవలే పాలించుచు భార్యలతో సుఖములనుభవించుచు కొడుకులు మనుమలతో విలసిల్లెను. అతడు వంద యజ్ఞములు చేసి కూడ అందరు కోరెడి ఇంద్ర పదవి న పేక్షించలేదు. నిత్యములు (ఎల్లప్పుడు - దినదినము చేయు సంధ్యావందన జపహోమతర్పణాది కర్మలు) నైమిత్తికములు (ఒక పర్వ దినము నాడు చేయు వేదము చెప్పిన కర్మలు) అన్నియు నానావిధ పుణ్యకార్యములు పుణ్యము దానిఫలము రావలెనన్న కోరిక లేకుండ శ్రీకృష్ణునకు (శ్రీహరికి) ప్రీతికలుగవలెనన్న భావముతోనే చేయుచుండెను.
కేదార నృపతితో సాటివచ్చు రాజు ఇంతకు ముందు లేడు. ఇకముందుండ బోడు. ఆ రాజు జేగీషవ్యముని ఉపదేశము వలన త్రిలోక సుందరియైన భార్యను రాజ్యమును కుమారుల కప్పగించి తపస్సు కొరకడవులకు పోయెను. శ్రీహరి యందు ఏకాంతభక్తి గల (అన్ని సేవలు చేయవలెనన్న భక్తి) అతడు స్వామి నెల్లప్పుడు ధ్యానించుచుండెను. ఓ నారదా ! స్వామి యొక్క సుదర్శన చక్రమతని రక్ష కొరకు ఎల్లప్పుడతని సమీపముననే ప్రకాశించుచుండెను. ఆ రాజు అట్లు చాలకాలము తపస్సు చేసి మునులలో శ్రేష్ఠుడై గోలోకమును పొందెను.
కేదార తీర్థమతని పేరు వలన నేర్పడినదే. అక్కడ మరణించిన ప్రాణి నేటికిని వెంటనే ముక్తిపొందును. ఇది నిశ్చయము.
ఆ కేదారనృపతి కూతురు బృంద. ఆమె లక్ష్మీ అంశతో జన్మించి తపస్సు చేసిన మహానుభావురాలు. యోగశాస్త్రము నందు ఆరితేరిన వ్యక్తి. వివాహ వయస్సులో ఏ మానవునిని భర్తగా వరించక విరక్తురాలయ్యెను. దుర్వాస మహర్షి ఆమెకు సుదుర్లభమైన శ్రీహరి మంత్రమునుపదేశించగా ఆమె ఇల్లు వదిలి తపస్సు చేయ నడపులకేగెను. అక్కడ నిర్జన ప్రదేశమున అరువది వేల సంవత్సరములు తీవ్ర తపస్సు చేసెను. భక్తులయందు వాత్సల్యము గలవాడగు శ్రీకృష్ణుడామె యందాసక్తి గలవాడై ప్రసన్నవదనము దివ్యకాంతి గలవాడై సాక్షాత్కరించి వరము కోరుకొమ్మని పల్కెను.
రాధావల్లభుని ఆ శాంత సుందరమూర్తిని బృంద చూచి మన్మధ బాణ పీడితురాలై అప్పుడే మూర్ఛిల్లి, నీవు నాకు భర్తవు కమ్మని ఆతురతతో వరము కోరెను. అందుకతడు సరే అని అంగీకరించీ చాలకాలమా అరణ్యములో ఏకాంత ప్రదేశములలో ఆమెతో ఆనందమనుభవించెను. బృందాదేవి కృష్ణుని మీది అసక్తితో ముక్తురాలై స్వామితో బాటు గోలోకమున కేగెను.
ఓ మునిశ్రేష్ఠా ! గోలోకమందలి ఒక గోపిక యగు బృందాదేవీ భాగ్యవశమున రాధతో సమానురాలయ్యెను. ఆమె తపస్సు చేసిన ప్రదేశము బృందావనమని చెప్పబడెను. బృందాదేవి శ్రీహరితో క్రీడించినందువలనను ఆ ప్రదేశము బృందావనమని చెప్పబడెను, ఓయీ ! పుణ్యప్రదమైన మరియొక ఇతిహాసము చెప్పెదను వినుము.
ఏకారణమున బృందావనమనునది ఏర్పడెనో అది నీకు చెప్పెదను వినుము.
కుశధ్వజునకిద్దరు బిడ్డలు. ధర్మశాస్త్రమందు ఆరితేరిన తులసి వేదవతి అనువారు సంసార కర్మలయందు విరక్తి బొందిరి. ఆ యిద్దరిలో వేదవతి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని భర్తగా పొందెను. ఆమెయే జనకుని కూతురగు సీతగా అంతట అందరిచే కీర్తింపబడినది.
తులసియు శ్రీహరియందు కోరిక పెట్టుకొని తపస్సు చేసి దైవికముగా ఏర్పడిన దుర్వాసమహర్షి శాపము వలన శంభాసురుని భర్తగా పొందెను. ఆ తరువాత తన మనస్సు హరించిన సుందరుడగు లక్ష్మీవల్లభునీ పొంది, ఆ సురనాయిక హరి శాపము వలన వృక్షరూపము తాల్చెను. శ్రీహరియు ఆమె శాపము వలన సాలగ్రామ శిల అయ్యెను. ఆ తీరుగా ఆ సుందరి సాలగ్రామ శిలపై తులసీ దళరూపమున ఎల్లప్పుడు నిలిచెను. ఓ తపోధనా ! నీకు తులసీ చరిత్రము వివరముగా గాక ప్రంగవశమున కొలదిగా చెప్పితిని. ఆ తులసి (బృంద) యొక్క తపస్సు స్థానము కూడ ఇదీయే. అందువలన పండితులు దీనిని బృందావనమనీ అందురు.
అదిగాకను భారత వరమున ఈ పుణ్యక్షేత్రమునకు బృందావనమని పేరు వచ్చిన ఇతర కారణము నీకు చెప్పెద వినుము. రాధాదేవి షోడశ నామములలో “బృందా” అనునది వేదములో విన్పించును. గోలోకమందలి రాధాదేవికి ప్రీతికరముగా ఆమె క్రీడార్ధము శ్రీకృష్ణుడు భూమియందీవనమును నిర్మించినందున ఆ పేరున బృందావనమని చెప్పబడినది.
నారద ఉవాచ - నారదుడనేను :
ఓ జగద్గురూ ! రాధాదేవి షోడశ నామము లేవియో పోటీని నీ శిష్యుడనగు నాకు చెప్పుము. నాకు వినవలెననీ కుతూహలమున్నది. సామవేదమందు నిరూపించబడిన సహస్రనామములు వినియుంటిని. ఐనను నీనుండి పదహారు నామములను వినగోరుచున్నాను. ఈ నామములు ఆ సహస్ర నామములలోనీవా ? పోటీకన్న ఇతరములా? భక్తుల చేత కోరబడునట్టి పుణ్య స్వరూపములైన ఆ నామములను ఎల్లరికి దుర్లభములైన ఆ సామముల వ్యుత్పత్యర్థములను (ఆ నామముల పుట్టుకను తెలుపు అర్థములు) సృష్టికి మూలమైన ఆ జగన్మాత పావననామములను తెలుపుము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనేను :
(1) రాధ (ఽ) రాసేశ్వరి (3) రాసవాసిని (4) రసికేశ్వరి (5) కృష్ణ ప్రాణాధిక (8) కృష్ణ ప్రియ (7) కృష్ణ స్వరూపిణి (8) కృష్ణవామాంగ సంభూత (9) పరమానంద రూపిణి (10) కృష్ణ (11) బృందావని (1ఽ) బృంద (13) బృందావన వినోదిని (14) చంద్రావతి (15) చంద్రకాంత (16) శరచ్చంద్ర నిభానన అను నీ నామములు సారభూతములు-సహస్ర నామముల లోనివే.
‘రా’ అను అక్షరము దానమును అర్ధమును చెప్పును. స్వయముగా నిర్వాణ (మోక్షము) ము నిచ్చునది కనుక ఆమె రాధ అని కీర్తింపబడినది. ఇట్లు రాధాశబ్దము ఏర్పడినది.
రాసేశ్వరుని పత్నియైనందున “రాసేశ్వరి” యనియు రాస (మండల) మందు నివసించునది కనుక “రాసవాసిని” యనియు చెప్పబడినది.
మొత్తము రసికురాండ్రు ఐన దేవీ గణములకు పరమేశ్వరియగుట వలన బుధజనులు ఆమెను “రసికేశ్వరి” అని పలికిరి.
కృష్ణ పరమాత్మకు ప్రాణముల కంటే అధికమైన ప్రియురాలు కనుక అతనిచేతనే “కృష్ణ ప్రాణాధిక” అని కీర్తింపబడినది.
కృష్ణునకు మిక్కిలి ప్రియమైన కాంత లేదా ఎల్లప్పుడును కృష్ణుడామెకు ప్రియుడు కనుక అందరు దేవగణములచేత “కృష్ణ ప్రియ” అని చెప్పబడినది.
అవలీలగా కృష్ణ రూపమును సమకూర్చుకోనుటకు శక్తి కలదో అన్ని అంశలలో కృష్ణునితో సాటిదియో - అకారణమున ఆమె “కృష్ణ స్వరూపిణి” అనబడినది.
ఏ శ్రేష్టురాలైన సతీమణి శ్రీకృష్ణుని యొక్క ఎడమభాగము నుండి సంభవించినదో, ఆ కారణము వలన ఆమె “కృష్ణ వామాంగ సంభూత” అని అతనిచేత కీర్తింపబడినది.
తనంతట తానుగా రూపము ధరించిన మహానందపు రాశి అగుటవలన వేదముల చేత “పరమానంద రూపిణి” అని కీర్తింపబడినది.
‘కృష్’ అన్న పదము మోక్షమను అర్ధము చెప్పునది. న కారము శ్రేష్ఠము అన్న అర్థము చెప్పును. ఆకారము దాత (ఇచ్చు) నన్న అర్థము తెల్పునది. ఈ కారణము వలన (ఆశ్రయించిన వారికి శ్రేష్ఠమైన ముక్తినిచ్చునది కనుక) “కృష్ణా” అని చెప్పబడినది.
బృందావనము ఆమెకు చెందినది అగుట వలనను లేదా బృందావనమునకు నాయకురాలు (అధిష్టాన దేవత) అగుట వలన గాని “బృందావనీ” అని కీర్తింపబడినది.
సఖుల (చెలుల) సమూహమును “బృంద” అనియు పైనున్న ఆకారము ‘ఉన్నది’ అన్న అర్థము తెలుపు పదమనియు చెప్పబడినందువల్ల ఏ దేవికి సఖుల బృందము కలదో ఆమె “బృందా” అని కీర్తింపబడినదిగా చెప్పుదురు.
బృందావనములో వినోదము ఆమెకున్నందున వేదములామెను బృందావన వినోదిని యని చెప్పుచున్నవి.
ఏ దేవియందు ఎల్లప్పుడు నఖము లనెడి చంద్రుల సమూహము (చంద్ర - అవలి) ముఖమనెడి చంద్రుడు (చంద్రుని వంటి గోళ్లు - చంద్రుని వంటి ముఖము) కలరో - అట్టి దేవి కృష్ణుని చేత ఈ కారణము వలన “చంద్రావతి” అని కీర్తింపబడినది.
ఏ దేవికి రాత్రింబవళ్లు చంద్రునితో సమానమైన కాంతి గలదో అదేవి పారిచే సంతోషాతిశయముతో “చంద్రకాంతా” అని కీర్తింపబడినది.
ఏ దేవి ముఖమందు శరదృతువునందలి చంద్రుని వెలుగు (కాంతి) రాత్రింబవళ్లున్నదో ఆమె ఆ పురాణముని చేత ఆకారణము వలన “శరచ్చంద్రనిభానన” అని కీర్తింపబడినది.
ఈ షోడశ నామములను అర్ధవివరణముతో తన నాభికమలమున పుట్టిన బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు ఉపదేశించెను. బ్రహ్మ పూర్వము మా తండ్రియగు ధర్మఋషికుపదేశించెను. సూర్యగ్రహణ పర్వకాలములో పుణ్యదినమున పుష్కర క్షేత్రమందు దేవతల సభలో రాధాదేవి ప్రభావము ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్నమైన హృదయము గల మా తండ్రి (ధర్మఋషి) దయతో నాకిది ఉపదేశించెను. మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రమును నేను నీకిచ్చితిని. ఓ మహామునీ ! విష్ణుభక్తుడు కాని వానీకి దైవనింద చేయు వానికి ఇది ఉపదేశించగూడదు. తన జీవితమున్నంతవరకు ఏ నరుడు దీనిని మూడు సంధ్యలలో పఠించునో వానికి రాధామాధవుల పాదభక్తి సిద్ధించును. అంతమందు వారి “దాస్య” ముక్తియు - అణిమాద్యష్టసిద్ధులును పొంది వారికి సహచరుడై శాశ్వత సారూప్యమును పొందును.
నియమముతో ఆచరించబడిన వ్రతములు, ఉపవాసములు, దానములు - అర్థముతో బాటు నాల్గు వేదముల పఠనము - అన్ని విధముల యజ్ఞములు శాస్త్రము చేత చెప్పబడిన తీర్థయాత్రలు చేయుట - మొత్తము భూమిని ఏడుమార్లు ప్రదక్షిణములు చేయుట - శరణాగతులను రక్షించుట - అజ్ఞానులకు జ్ఞాన దానము చేయుట - దేవతలను వైష్ణవులను దర్శించుట. అను సత్కార్యముల వలన ఏ ఫలము లభించునో అది ఈ రాధాషోడశ నామస్తోత్రమును పఠించుట వలన కలుగు ఫలమునకు పదునారవ వంతు కూడ కాజాలదు. ఈ స్తోత్ర ప్రభావము వలన మనుష్యుడు జీవన్ముక్తుడగును.
నారద ఉవాచ - నారదుడనెసు :
ఎల్లరకు మిక్కిలి దుర్లభమైన పరమాశ్చర్యము కలిగించు స్తోత్రము లభించినది. స్వామీ ! సుయజ్ఞుడు చేసిన దేవీ కవచము సంసారము జయింపజేయునది. దుర్లభమైన ఆ స్తోత్రము కూడ నాకు లభించినది. మీ పాదపద్మముల అనుగ్రహము వలన ఆశ్చర్యము కల్గించు కృష్ణ కథను విని ఇప్పుడు దానిలోని రహస్య విశేషములను వినగోరుచున్నాను. ఉదయమున ఆ సగరమును చూచి గోపాలకులేమి పల్కిరో అది తెలుపుము.
శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
విశ్వకర్మ వెడలి పోయిన తరువాత రాత్రి గడచి తూర్పున ఎఱ్ఱబారిన అరుణోదయ వేళకు జనులందరు నీద్రనుండి మేల్కొనిరి. వారు లేచి ఇతర నగరముల కన్న విశేషముగా నున్న ఆ నగరమును చూచి “ఇదేమి ఆశ్చర్యము! ఎంత ఆశ్చర్యము!” అని ఇంత వరకు గోకులములో (ప్రజము) నివసించిన వారు అనుకొనిరి. గోపాలకులు “ఎక్కడినుండి ఎట్లు ఈ నిర్మాణము జరిగినది? ఏ రూపము తో ఎవడిట్లు ఈ భూమి మీద చేయగలును ? నాకు తెలియదు నాకు తెలియదు” అని ఒకరితో నొకరు పలుకుచుండిరి.
సందుగానగరమును చూచి గర్గమహర్షి చెప్పిన మాటలను తలచుకొని మనస్సులో ఇట్లనుకొనెను. “బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు ఈ చరాచర జగత్తు మొత్తము ఎవని కనుబొమ కదలికలతో ఆవిర్భవించుట లయము చెందుట (పుట్టుట - చచ్చుట) అను దశలను పొందుచున్నదో ఆ శ్రీహరి ఇచ్చకు అసాధ్యమేది ? ఏ స్వామి రోమకూపములలో బ్రహ్మాండములన్నియు ఇమిడియున్నవో ఆ మహావిష్ణువుకు సాధ్యము కానిదేమి యుండును! బ్రహ్మరుద్రుడు అనంతుడు ధర్మదేవత మొదలుగా గల దేవతలందరు ఎవని పాద పద్మములనే ధ్యానింతురో అట్టి పరమేశునికి సాధ్యము కానిదేది ? మాయనాశ్రయించి మనుష్య రూపము ధరించిన ఈ శ్రీహరి యొక్క (బాలకృష్ణుడు) సంకల్పము వలననే ఈ నగరమేర్పడినది” అని అనుకొనెను.
నందుడు నగర మంత తిరిగి తిరిగి ఇల్లిల్లు చూచి చూచి ఆయా వ్యక్తుల నామములను ఇండ్ల మీదున్న వాటిని చదివి చదివి అందరికి నివాస గృహముల నిచ్చెను.
నందుడు, ఆశ్చర్యపడిన వృషభానుడు శుభమైన ప్రవేశోత్సవము జరిపి సంతోషముగా తమ తమ బంధుగణములతో బాటు తమ ఆశ్రమములలో (నివాసస్థానములైన భవనములు) కాపురముండిరి.
బృందావనములో నున్న వారందరు వికసించిన ముఖములతో కన్నులతో సంతోషముగా ఉత్తమమైన తమ తమ గృహములలో ప్రవేశించిరి. గోపాలకులందరు మనోహరముగా నున్న తమ స్థానములలో చేరి ఆనందించిరి. బాలబాలికలు సంతోషముతో ఆటలాడుకొనిరి. శ్రీకృష్ణుడును బలదేవుడును తమతోడి బాలకులతో కలిసి ఆసక్తితో ఆ నగరములో సుందరమైన ప్రతి ప్రదేశములోను బాలక్రీడలాడుకొనిరి. ఓ నారదా ! ఈ విధముగా ఆ బృందావనములోని స్త్రీలయొక్కయు రాసమండలము యొక్కయు నగర నిర్మాణము యొక్కయు వృత్తాంతములను నీకు తెల్పితిని.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శ్రీ బృందావన నగర నిర్మాణ మనెడి పదునేడవ అధ్యాయము సమాప్తము.
