4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
108 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ :
శ్రీనారాయణుని వచనమిట్లా –
ఇంతలో దేవి, మహాలక్ష్మి, రుక్మిణి, మునులు దేవతలు మొదలగు వారితో కూడి సభ మధ్యలోకి వచ్చింది. (1) రత్నసింహాసనంలో ఉన్నట్టిది, రత్నాలంకారములతో అలంకరింపబడ్డది, వహ్నిశుద్ధమైన వస్త్రాన్ని ధరించింది, కొప్పులో బరువయ్యేంత ఆభరణాలు ధరించింది. (2) నవ్వుతూ, ఆసాధ్వి అమూల్యమైన రత్నదర్పణాన్ని చూస్తోంది. కస్తూరి బిందువులతో కూడినది, మృదువైన చందనముతో పూయబడింది, (3) ఎప్పుడూ సిందూర బిందువుతో నొసటిమధ్య భాగము వెలిగిపోతోంది. పుటం పెట్టిన బంగారం వంటి రంగు గలది, నూరు చంద్రులతో సమానమైన కాంతి గలది. (4) శరీరం నిండా చందనమలదుకొన్నది. మాలతి మాలతో శోభిస్తున్నది. ఏడుగురు రాకుమారులు బాలురు ఆమెను తెచ్చారు. (5) దేవేంద్రులు, మునీంద్రులు సిద్ధేంద్రులు, రాజశ్రేష్ఠులు, వీరంతా మహాలక్ష్మి పతివ్రత ఐన రుక్మిణి దేవిని చూచారు. (6) ఏడు ప్రదక్షిణాలు చేసి, ఆసతి తన పతికి నమస్కరించి, చల్లని నీటితో మృదువైన చందనపు ఆకులతో చిలకరించింది. (7) మనోహరమైన, శాంతురాలైన, చిరునవ్వు నవ్వుతున్న ఆమె పై జగత్కాంతుడు నీరు చిలకరించాడు. కాంతుడు, కాంతను చూచాడు, శుభక్షణమందు కాంతకాంతుణ్ణి చూసింది. (8) ఆ పిదప దేవి, శుభానన, తండ్రి ఉరమందు ఉన్నది. సిగ్గుతో తలవంచుకున్నది. తన కాంతితో వెలిగిపోతోంది. (9) రాజు, దేవేశ్వరిని పరిపూర్ణతముడైన ఆతనికి, వేదమంత్రములతో, దానపూర్వకంగా ఇచ్చాడు, ఓ నారద! (10) వసుదేవుని ఆజ్ఞతో,కృష్ణుడు, 'స్వస్తి' అని పలికి ఆనందంగా ఉన్నాడు. భవుడు భవానిని స్వీకరించినట్లు దేవుడు దేవిని స్వీకరించాడు. (11) ఐదు లక్షల సువర్ణములను పరమాత్మయైన కృష్ణునకు, పరిపూర్ణతమునకు, రాజు దానిని దక్షిణగా ఇచ్చాడు, ఆమెను ఇచ్చాడు. (12) శుభకర్మ జరిగినప్పుడు, కన్యను వక్షమందుంచుకొని, మునులు దేవేంద్రులున్న సభలో రాజు, మోహంతో ఏడ్చాడు. (13) పరిహారపు మాటలతో, ఆతనికి, ఆమెను సమర్పించి, కనుల నుండి వచ్చిన నీటితో ధన్యమైన కన్యను తడిపాడు. (14)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రుక్మిణి వివాహమందు నూట ఎనిమిదవ అధ్యాయము.
