4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
107 - అధ్యాయము
మూII శ్రీనారాయణ ఉవాచ :
నారాయణుడిట్లా-
మహాబలుడైనబలరాముడు కోపంతో నిండిపోయినవాడై నాగలితో రుక్మిణి వెళ్ళుతున్న వాహనాన్ని పగులగొట్టాడు, ఓ ముని శ్రేష్ఠ (1) గుఱ్ఱములు, సారథిని చంపాడు ఆ జగతీపతి . భూమి పైనున్న ఆ పాపిని రుక్మిని చంపటానికి వెళ్ళాడు ఆతడు (2) రుక్మి తన బాణములతో అవలీలగా వాటినితొలగించసాగాడు. ఈశ్వరుడైన హలిని బంధించటానికి నాగాస్త్రమును కూర్చాడు. (3) బలరాముడు స్వయంగా గరుడాస్త్రముతో నాగాన్ని సంహరించాడు ఓ ముని! కోపంతో రుక్మి పరమైన పాశుపతాన్ని గ్రహించాడు. (4) అది వ్యర్థము కానిది. శత్రువులను మర్దించేది, నూరు సూర్యుల కాంతితో సమానమైనది.(5) బలరాముడు రుక్మికి చుట్టు జృంభాస్త్రముతో విజృంభించాడు. భూమి పై ఉండి రుక్మిరాయివలె నిద్రా స్త్రముతో నిద్రపోయాడు. శాల్వుడు నిద్రపోయిన వానిని చూచి నూరు బాణములను బలరాముని పై విడిచాడు. (6) పర్వతవృష్టిని, జలవృష్టిని, రాళ్ళవానను కురిపించాడాతడు. మండుతున్న అగ్ని వర్షాన్ని బాణవృష్టిని చేశాడతడు. (7) బలముతో అస్త్ర ములతో వాటన్నిటిని బలరాముడు తొలగించాడు. రణ మధ్యం నుండి నాగలితో వానిరథాన్ని చూర్ణం చేశాడు. (8) గుఱ్ఱములు,సారథిని అవలీలగాచంపాడు. కోపంతో బలరాముడు వాడిని చపంబోగా అశరీరవాణి విన్పించింది. (9) శాల్వుని వదులు కృష్ణుడు చంపుతాడు. యుద్ధంలో పౌరుషంతో నీకేంపని! నీ తల పై బ్రహ్మాండముంది చాటలో ఆవగింజలా. అట్టి నీకీ కోపమెందుకు. (10) అది విని బలదేవుడు నాగలితో వాని తలను పొడిచేశాడు, బాధపడుతూ వాడు, యుద్ధభూమిలో పడిపోయాడు. (11) శాల్వుడు (మూర్ఛ) చనిపోవటం చూచి మహాబలవంతుడైన శిశుపాలుడు భూమి పై బాణవృష్టిని, జలవృష్టినిచేశాడు. (12) నాగలితో బలరాముడు వాని రథాన్ని పొడిపొడిగా చేశాడు. అర్ధచంద్రముతో ఆ బాణములను అవలీలగా తొలగించాడు. (13) వాడిని చంపడానికి, శంకరుడు బలరాముని సాక్షాత్తుగా నిషేధించాడు. వాడు కృష్ణునితో చస్తాడు. వాడు హరికి ద్వార పాలకుడు. (ప్రక్కనుండేవాడు). బలరాముడ వాణ్ణి విడువు. (14) ఆతడు నాగలితో దంతవక్రుని దంతమును విరగగొట్టాడు. బాగా జరిగిన యుద్ధంతో వారందరు వాణ్ణి చూచి నవ్వారు. (15) బలరాముని ప్రతాపాన్ని చూసి వీరులంతా పరుగెత్తిపోయారు. ఈశ్రేష్ఠ యాత్రికులంతా కుండిన నగరాన్ని ప్రవేశించారు. (16) ఇంతలో శతానందుడనుమహాముని కోటిమంది మునులతో కూడి, హరి ముందుకు వచ్చాడు. (17)
దుర్గమమైన,నూరుద్వారములుగల నగరంలోనికి ప్రవేశ పెట్టాడు. శత్రువులకు ప్రవేశించరానిది. మిత్రులకు సుఖప్రవేశము కలది. (18) దేవకన్యలు, నాగకన్యలు, రాజకన్యలు, మునికన్యలు, వరుణ్ణి చూడటానికి నవ్వుతూ వచ్చారు. (19) ఆడవాళ్ళంతా రెప్పవేయకుండా అతనిని చూచారు. నవ్వుతూ చంద్రశేఖరుడు హరిని ప్రసన్నునిగా చేశాడు. (20) పరమేశ్వరుడు హరి, శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మితమైన రథమందున్నాడు. అందరికి పరమాత్మ భక్తులననుగ్రహించే కొరకు విగ్రహం ధరించాడు. (21) నవీనమైన మేముమువలే శ్యామలవర్ణుడు, పచ్చని వస్త్రముతో శోభిస్తున్నాడు. ఒంటినిండా చందనం, పూసుకున్నాడు, వనమాలతో అలంకరింపబడ్డాడు. (22) రత్నములతో చేసిన భుజాభరణములు, కడియములు, రత్నముల మాలలు వీనితో నిండి ప్రకాశిస్తున్నాడు. రెండు రత్నకుండలములు చెవులకున్నాయి, వాటితో చెక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయి. (23) శ్రేష్ఠరత్నములందు శ్రేష్ఠమైన వానితో నిర్మింపబడిన శబ్దిస్తున్న కాలి అందెలతో అలంకరింపబడినాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, చేతిలో మురళీ ఉంది. రత్నముల అద్దాన్ని చూస్తున్నాడు. (24) ఏడుగురు గోపకులు ప్రక్కన ఉన్నారు, శ్వేతచామరములతో విసురుతున్నారు. నవయౌవనంలో ఉన్నాడు. శరత్కాలమందలి కమలములతో సమానమైన కళ్ళు (25) శరత్కాలమందలి పూర్ణచంద్రునితో సమానమైన ముఖము కలిగి ఉన్నాడు. భక్తులను అనుగ్రహించుటకు కారణభూతుడు. కోటి మన్మథులంత సౌందర్యవంతుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు, (26) తీర్థమువలె పవిత్రుడు, కీర్తితో పవిత్రుడు, బ్రహ్మ, ఈశ, శేషులు నమస్కరిస్తారాతనిని, బాగా ఆనందం కలిగించే రూపము, కోటి చంద్రులంత కాంతి కలవాడు. (27) ధ్యానమునకు సాధ్యుడు కాడు, ఆరాధించుటకు కష్టమైనవాడు, పరముడు ప్రకృతికి పరుడు దూర్వ(గడ్డి)తో చేసిన పట్టసూత్రము. శ్రేష్ఠ రత్నములతో చేసిన దర్పణము. (28) కర్తృకకు (కత్తెర) సాధ్యమైన అరటి చెట్టు యొక్క విరిసిన పూగుత్తిని ధరించినవాడు, మాలతీ మాలతో అలంకరింపబడిన త్రివిక్రమాకారముగల చూడను ధరించినవాడు (తల పై) (29) స్త్రీలు ఇచ్చినపుష్పమును, తల పై ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించాడు. అట్టి ఈశ్వరుడైన హరిని చూచి యువతులు మూర్ఛపోయారు. (30) రుక్మిణి జీవనము ధన్యమైనది. కొనియాడతగినది, కోరతగినది, అని అన్నారు ఆ స్త్రీలు. భీష్ముని స్త్రీ ఆమె రాజి అల్లుని చూచింది. (31) రెప్పవేయకుండా చూచింది. ఆనందపడింది. ఆమె ముఖము, చూపులు ప్రసన్నమైనాయి. రాజు కూడా ప్రసన్నవదనుడైనాడు. మంత్రులు, పురోహితులు వీరితో కలసి రాజున్నాడు. (32) ఆతడు వచ్చి దేవతలను, బ్రాహ్మణులను, ఇతర ప్రాణులను నమస్కరించాడు. వారికి యోగ్యమైన ఆశ్రమమును, పూర్తిగా అమృతతుల్యమైన ఆహారపదార్థాములను ఇచ్చాడు. (33) రాత్రింబగళ్ళు పెట్టండి, ఇవ్వండి, అని చెబుతూ వచ్చాడు. దేవతలతో బాంధవులతో కలిసి రాత్రిని సుఖంగా గడిపాడు. (34)
అను ॥ వసుదేవుడు ప్రభాతమందే ప్రొద్దునచేయవలసినదానిని నిర్వర్తించాడు. స్నానము, సంధ్యాదులు చేసి, ఉతికిన వస్త్రాలు కట్టుకుని (35) వేదమంత్రములతో హరికి శుభమైన అధివాసము చేశాడు. (తేవటం) మాతృకలందరిని పూజించి, సాక్షాత్తుగా దేవతలందరిని పూజించి, (36) వసుధారను ఇచ్చి (అగ్నికి) వృద్ధి శ్రాద్ధాదులు చేసి, బ్రాహ్మణులకు, దేవతలకు, బంధువులకు భోజనం పెట్టాడు (37) వాద్యములను వాయింపచేశాడు. మంగళము చేయించాడు. అప్రతిముడైన వరునకు మంచివేషము వేయించాడు. (38) మంచిశోభ గల నరులు లాగే బండిని సిద్ధం చేయించాడు. ఈ విధంగా రాజు భీష్మకుడు వివాహమునకు తగిన మంగళకార్యము నిర్వర్తింపచేశాడు. (39) పురోహితులతో, వేదమంత్రములతో అంతా కార్యాన్ని ఆతడు చేశాడు. మణులలో శ్రేష్ఠమైన వానిని, ధనమును, ముత్యములు మాణిక్యములు వజ్రములను (40) తినే పదార్థాలను, వస్త్రములు, చాలా ఉత్తమమైన కానుకలను భట్టులకు బ్రాహ్మణులకు భిక్షుకులకు ఆనందంగా ఇచ్చాడు. (41) వాద్యమును వాయింపచేశాడు. మంగళమును చేయించాడు. రుక్మిణికి మనోహరమైన మంచివేషమును వేయించాడు. (42) రాణులతో మునిపత్నులతో తగిన విధంగా విధానమంతా చేయించాడు. ఆ పిదప శుభక్షణమురాగా, మా హేంద్రమందు (దినము యొక్క పదమూడవ భాగము) మంచి ఆరంభమందు (43) వివాహమునకు తగిన లగ్నమందు, లగ్నాధిపతిలగ్నంలో ఉండగా, మంచి గ్రహముల చూపులతో శుద్దమై ఉండగా, దుష్టగ్రహముల దృష్టి పడని కాలమందు, (44) శుభక్షణమందు శుభ నక్షత్రమందు, చంద్రబలము, తారాబలము శుద్ధంగా ఉండగా, వేధ దోషములు వగైరా లేని క్షణాన, శలాకాదులు (బొక్క, దోషము) లేని (45) దంపతులకు సంతోష యోగ్యమైన, పరిణామంలో సుఖప్రదమైన, ఇలాంటి సమయమందు భీష్మకుని ప్రాగణమందుహరి (46) ప్రవేశించాడు, సురలతో , మునులు విప్రులు పురోహితులతో సహా వచ్చాడు. జ్ఞాతులతో, బంధువులతో, తల్లి దండ్రులతో రాజులతో కూడి వచ్చాడు. (47) గోపాలకులతో పక్కనుండే పరివారముతో మనోహరులైన వయస్యులతో కూడి వచ్చాడు. భట్టులు, గణకులు, జ్యోతిః శాస్త్ర విశారదులు కూడావెంట ఉన్నారు. (48) రకరకాల వాద్యాలు, నర్తకులు, గాయకులు, రకరకాల శిల్పకారులు, మాలాకారులు ఇతరులు వెంట ఉన్నారు. (49) విద్యాధరులు, అప్సరులు, కిన్నరులు వీరితో కలిసి త్వరగా వచ్చాడు.దేవతలు, మునులు,రాజశ్రేషులు స్థలాన్నిచూచారు. (50) వివాహాన్ని చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చారు. పట్టుదారముతో అలంకరింపబడ్డ వేలకొలది అరటి స్తంభములు, (51) చంపక, చందన, రసాలముల చిగురాకులు, రకరకాల మాలలు, పచ్చవి, ఎరనివి,తెల్లనివి మాలలు ఉన్నాయి. (52) పండ్లు, చిగురాకులు గల మంగళ ఘటములు చుట్టూ ఉన్నాయి. వాటిలో కస్తూరి చందనము పూసారు. కుంకుమ పూశారు. వాటితో వెలిగిపోతున్నాయి. (53) ఆకులు, పేలాలు, పండ్లు, పూలు, గజిక వీనితో శోభిస్తున్నాయి. మునులు బ్రాహ్మణులు, రాజేంద్రులు చుట్టూ ఉన్నారు. (54)
భీష్మక ఉవాచ :
శ్రేష్ఠరత్నములలో ఉత్తమమైన వానితో నిర్మించిన వేదికగలది, మనోహరమైనది స్నిగ్ధచందనముతో పూయబడినది. కస్తూరి కుంకుమలతో కూడినది ఆ చందనము. (55) వాసనగల చల్లని, మెల్లని గాలులతో వాసనకలవి చేయబడినవి వేల కొలది రత్నములతో ప్రకాశిస్తున్న దీపములతో వెలిగి పోతున్నది. (56) రకరకాల ధూపాలతో సుగంధ ద్రవ్యముల వాసనతో వాసనగలదిగా చేయబడినది. మనోజ్ఞముగా చేసే శిల్పకారుల విచిత్రమైన రకరకాలైన చిత్రములు కలది. (57) అంతట చుట్టుముట్టి అలంకరణకు తగిన వానితో చాలా శోభనమైనది మధురమైన గంధర్వుల సంగీతముతో మధురముగా చేయబడినది (58) విద్యాధరుల నృత్యముతో, నర్తకుల నర్తనములతో శిల్పుల శిల్పములతో శోభిస్తున్నది వేదిక. కదలికలేని బొమ్మలతో, జనసమూహముతో వెలిగిపోతున్నది. (59) రహస్య ద్వారముల నుండి కిటికీల నుండి యువతులు చూస్తున్నారు మంగళరకరమైన ఘటముతో విద్వాంసుడైన పురోహితుడు (60) న్నాడు. రాజు, చేత కుశలు ధరించి, దానవస్తువులతో దానమివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి రాజును ప్రాంగణంలో చూచి రాజులు, దేవతలు, బ్రహ్మాదులు (61) రథము నుండి దిగి, త్వరగా ఆనందంతో ప్రాంగణంలో నిల్చున్నారు రాజేంద్రులు, దానవేంద్రులు, సనకాదిమునులు, (62) భగవాన్ శ్రీకృష్ణుడు, తన పక్కనుండే శ్రేష్ఠ పరివారముతో కూడా లేచాడు. వారిని చూచి త్వరగా లేచి వేగంతో భీష్మకుడు (63)తలవంచి దేవతలకు,మునులకు, రాజులకు నమస్కరించాడు. చాలా అందమైన రత్న సింహాసనములందు వారిని విడివిడిగా కూర్చోబెట్టాడు. (64) ఆదరంగా పూజించి క్రమంగా కూర్చోబెట్టాడు. భక్తిపూర్వకముగా రాజు వారినందరిని సేవిస్తూ (భక్తితో) సంతోషపరిచాడు. కళ్ళలో ఆనందబాష్పాలు రాగా, చేతులు జోడించి, వసుదేవుని వాసుదేవుని కూర్చోబెట్టాడు. సంతోషపరిచాడు. (65) భీష్మకుని వచనమిట్లా - ఇప్పుడు ఈవేళ నా జన్మ సఫలమైంది. నా జీవనము మంచి జీవనమైంది. (66) నేను కోటి జన్మలలో చేసిన కర్మలు మూలముతో సహఛేదించబడ్డాయి. స్వయంగా విధాత, జగత్తు కంతా అన్ని సంపదలనిచ్చేవాడు. (67) కలలో కూడా ఎవని పాదపద్మములను చూడటం సాధ్యంకాదో ఆ ప్రభువు, ఓ ప్రభువ! తపస్సులకు ఫలమునిచ్చేవాడు, అలాంటి స్రష్ట (బ్రహ్మ) ఇప్పుడు నా ప్రాంగణములో ఉన్నాడు. (68) పూర్ణులైన స్వాత్మారాములలో, మంగళకరుడు, అడుగ తగినవాడు, కోరతగినవాడు, యోగీంద్రులు, సిద్దేంద్రులు, మునీంద్రులు, సురేంద్రులు వీరంతా (69) ధ్యానం చేసినా కన్పించనివాడు అట్టి దేవుడు మంగళకరుడు (శివుడు) నా ప్రాంగణంలో ఉన్నాడు. ఆ ప్రభువు, కాలానికి కాలము, మృత్యువుకే మృత్యువు, ఆ భగవంతుడు (70) మృత్యుంజయుడు, సర్వేశుడు, నరులకు దృష్టిగోచరుడైనాడు. ఎవని వేయి తలల పై (శ్రేష్టుడు) చరాచరమైన విశ్వముంటుందో, ప్రధానంగా ఉంటుందో.(71)
అన్ని వేదములలో అంతములేనివాడు, ఆతడు నా ప్రాంగణంలో ఉన్నాడు. అన్ని కోరికలకు వశ్యము కావలసినవాడు, అందరికన్న మొదట ఎవనిని పూజిస్తామో, దేవగణములకు శ్రేష్ఠుడు అట్టిగణేశుడు నా ప్రాంగణమందున్నాడు. (72) మునులకు, వైష్ణవులకు శ్రేష్ఠుడు. జ్ఞానులకు గురువు ఐన భగవాన్ సనత్కుమారుడు నా ప్రాంగణంలో ప్రత్యక్షముగా ఉన్నాడు. (73) బ్రహ్మపుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, ఆవంశములో పుట్టినవారు వారంతా నా ఇంట్లో బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ ఇప్పుడే ఉన్నారు. (74) ఓహో! నా ఆశ్రమము కల్పము చివరిదాకా తీర్థప్రదేశమైంది. ఎవరి పాదోదకమువల్ల విశుద్ధమైన తీర్థమౌతుందో వారంతా ఇప్పుడు నా ఇంట్లో. అట్టి గృహమునాది (75) భూమి పై ఎన్ని తీర్థములున్నాయో అన్ని తీర్థములు సముద్రమందున్నాయి. సముద్రంలో ఎన్ని తీర్ధములున్నాయో బ్రాహ్మణపాదములందు అని తీర్థములున్నాయి. (76) విప్రపాదోదకముతో తడుస్తూ ఈభూమి ఎంత కాలముంటుందో అంతవరకు పితరులు పుష్కరపత్రములందు (తామర) నీటిని తాగుతారు. (77) విప్రుని పాదోదకమును తాగి, విప్రునకు దక్షిణనిచ్చిన, సర్వతీర్థముల స్నానం చేసిన వారికి కల్గేంత ఫలాన్ని పొందుతారు నిశ్చయము. (78) విపత్తును తొలగించేది వ్యాధులను నిర్మూలించేది, సుఖమునిచ్చేది, శుభమునిచ్చేది, సారమైనది, నరులకు విప్రపాదోదకము (79) గంగతో సమానమైన తీర్థములేదు, మాధవుని మించిన దేవుడు లేడు. సనత్కుమారుని మించిన భక్తుడు లేడు. కల్పతరువును మించిన వృక్షములేదు. (80) పారిజాతమును మించిన పుష్పము, హరివాసరమును మించిన వ్రతము (ఏకాదశి) లేదు. అర్చనమును మించిన పూజ్యతలేదు (గొప్పది). తులసి కన్న గొప్ప ఆకులేదు. (81) ప్రకృతిని మించిన దేవత, గాలిని మించిన ఆధారములేదు. విష్ణువును మించిన స్టూలపదార్థము, పరమాణువు కన్న సూక్ష్మ పదార్థములేదు. (82) బ్రాహ్మణున కన్న పవిత్రమైనది లేదు, ఆశ్రమమందున్న ప్రభువు కన్న పరుడు లేడు. మరో దేవుడు పరుడు మరొకడు లేడు, అని ఈ విధముగా కమలోద్భవుడు చెప్పాడు. (83) బ్రహ్మ విష్ణు శివాదుల కన్న ప్రకృతికన్న ప్రభువు పరుడు. ధ్యానముచే సాధింపబడడు, ఆరాధించుట మహాకష్టము, యోగులకు కూడా అందడు. నిశ్చయము. (84) నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూ పెత్తినవాడు. ఆతడే నరులకు దృష్టిగోచరుడైనాడు, ఆ దేవుడు సాక్షాత్తుగా మా ఇంట్లో ఉన్నాడు.(85)
భీష్మక ఉవాచ :
దేవతలు బ్రహ్మ, ఈశుడు, శేషుడు వీరు ఎవని పాదపద్మముల ధ్యానిస్తారో, ధనేశునకు, గణేశునకు, దినేశునకు లభించవో అట్టివాడు నా ఇంట్లో ఉన్నాడు (86) అని పలికి భీష్మకుడు, స్వయంగా కృష్ణుని ముందుకు తెచ్చి, పరమేశ్వరుని సామవేదోక్త స్తోత్రముతో ఆనందపరిచాడు. (87) భీష్మక వచనమిట్లా - అందరి అంతరాత్మలలో ఉండేవాడ! అందరికి సాక్షిభూతుడ! నిర్లపుడ! కర్మచేసే వారి కర్మలకు, సాక్షి! కారణములకు కారణభూతుడ! (88) కొందరు నిన్ను ఒక్కడివి, జ్యోతిస్వరూపుడవు, సనాతనుడవు అని అంటారు. కొందరు నిన్ను పరమాత్మవని, జీవుడు నీ ప్రతిబింబమని అంటారు. (89) కొందరు భ్రమించిన బుద్దిగలవారు సగుణుడవు ప్రాకృతిక జీవుడవు అని అంటారు. తెలిసిన సూక్ష్మబుద్దులు కొందరు నిత్య శరీరుడవంటారు. (90) నీవు శరీరంలో జ్యోతివి, నిత్యుడవు, దేహరూపుడవు సనాతనుడవంటారు, సాకారుడైన ఈశ్వరుడు లేకుండ తేజస్సు ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు. (91) ఓ నారద! ఇట్లా స్తుతించి మాటలు ముగిశాక ఆతడు విష్ణువును స్మరించి, ఆతడు, ఆనందంతో పద్మ అర్చించిన పాదపద్మమందు పాద్యమిచ్చాడు. (92) దూర్వ, పుష్పములు, జలము వీటితో కూడిన ఆర్ష్యాన్ని ఇచ్చాడు, సురభిని, మధుపర్కమును, అన్ని అవయవములందు గంధ చందనాన్ని ఇచ్చాడు. (93) శుభకర్మయందు అరణంగా మహేంద్రుడిచ్చిన పారిజాత పూలమాలను అల్లుని మెడలో వేశాడు రాజు. (94) కుబేరుడిచ్చిన అమూల్యరత్న భూషణాన్ని, భక్తిపూర్వకముగా ఆరాజు ఆతని మెడలో వేసి వరున్ని చేశాడు. (కోరుకున్నాడు). (95) అగ్ని ఇదివరలో ఇచ్చిన వహ్నిశుద్ధమైన రెండు వస్త్రములను, పరిపూర్ణతముడైన కృష్ణునకు దానినే ఇచ్చాడు. (96) విశ్వకర్మ ఇచ్చిన వెలిగిపోతున్న రత్న కిరీటాన్ని పరమాత్మయైన కృష్ణుని తలలో రాజు, దానిని ఉంచాడు. (97) ధూపము, రత్నదీపము, మనోహరమైనవైవేద్యము, రకరకాల పూలు, రత్న సింహాసనము ఇచ్చాడు. (98) తిరిగి ఆచమనం కొరకు ఏడు తీర్థములనీటినిచ్చాడు. కర్పూరాది వాసనగల, కోరతగిన, రమ్యమైన తాంబూలము నిచ్చాడు. (99) రతిని కలిగించే శయ్యను, రమ్యమైన దానిని, తాగటానికి సువాసనగల జలమును ఇచ్చాడు. రాజు ఆతని, వరణము చేసి, ఆతనిని విడిగా చేసి (అందరి నుండి) నాడు. (100) రాజు చేతులు జోడించి ఆతనికి పుష్పాంజలిని ఇచ్చాడు (101)
అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ, శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రుక్మిణి వివాహ మందు నూట ఏడవ అధ్యాయము.
