4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
73 - అధ్యాయము
మూll.శ్రీనారాయణ ఉవాచ :
శ్రీభగవానువాచ :
అను శ్రీ నారాయణుడిట్లన్నాడు - ఇక బలవంతుడైన కృష్ణుడు ఆనందంతో ఉన్న తండ్రియైన, ఆ నందుని దుఃఖార్హుడైన వానిని దివ్యములైన ఆధ్యాత్మికాది విషయములతో ఇట్లా ఉద్బోధించసాగాడు. (1) గట్టిగా ఏడుస్తున్న, నిశ్చేష్టుడైన, పుత్రుడు విడిపోతాడని భయపడుతున్న ఆ తండ్రిని మణిశ్రేష్ఠమును ఇచ్చి జగత్పత్తి ఇట్లా చెప్పసాగాడు. (2) భగవంతుని వచనమీట్లా - ఓనందుడ! మేల్కో. ఆనందంగా ఉండు. దుఃఖాన్ని విడిచి పెట్టు. ఆనందాన్ని పొందు. నేనిచ్చే జ్ఞానాన్ని స్వీకరించు. ఈ జ్ఞానాన్ని ఇదివరలో బ్రహ్మకిచ్చాను. (3) శేషునకిచ్చాను. గణేశునకు, ఈశ్వరునకిచ్చాను. దినేశునకు, మునీశునకు, పుష్కరంలో యోగీశునకు ఇచ్చాను. (4) ఎవడు ఎవడికి కొడుకు. ఎవడు తండ్రి, తల్లెవరు. ఎవనికి ఎవడు ఎట్లా. కాని తాము చేసిన కర్మవల్ల వస్తున్నారు. సంసారంలో ప్రవేశిస్తున్నారు. (5) కర్మననుసరించి ప్రాణి స్థానభేదంతో పుడ్తోంది. కర్మవల్ల ఏప్రాణియైనా యోగీంద్రులకో, రాజస్త్రీలకో (6) బ్రాహ్మణపత్నియందో, క్షత్రియులకో, వైశ్య స్త్రీయందో, శూద్రయోనులయందో, తిర్యగ్ యోనులయందో ఎవడైనా, మరొకడు పశ్వాదియోనులయందో (7) పుట్టవచ్చును. నామాయవల్లనే అందరు విషయములయందు ఆనందంగా ఉన్నారు. బంధువులు విడిపోయినా, ప్రాణత్యాగమందును విషణులౌతున్నారు. (8) సంతానము, భూమి, ధనము మొదలగువాని విచ్ఛేదము మరణముకన్న అధికబాధాకరము. శుచిగా ఉన్నా, విద్వాంసుడు కావడం లేదు,నిత్యం మూడుడౌతున్నాడు. (9) నాభక్తుడు, భక్తికలవాడు, నన్నుపూజించేవాడు, జితేంద్రియుడు, నామంత్రోపాసకుడు, నా సేవాసక్తుడు, శుచికూడా విద్వాంసుడు కావటం లేదు. (10) గాలినాభయంతో వీస్తోంది. సూర్యుడు ప్రతిరోజు వెలుగుతున్నాడు, నాభయంవల్ల. అట్లే మహేంద్రుడు, చంద్రుడు వెలుగుతున్నారు. కాలభేదంలో ఇంద్రుడు వర్షిస్తున్నాడు. (11) అగ్నికాలుస్తోంది,ప్రాణులలో చలనం కలుగుతోంది. కాలమందు వృక్షము పూలు, పండ్లను ఇస్తోంది. (12) వాయువు నిరాధారము వాయువు ఆధారముగా గలది తాబేలు. కచ్చపము శేషునకాధారము, శేషుడు పర్వతములకాధారము. (13) అవి పాతాళములకాధారము, వరుసలో అవి ఏడు దాని నుండి జలము, నిశ్చలమైనది. భూమి జలముయందుండేది. (14) ఏడు స్వర్గములకు భూమి ఆధారము. జ్యోతిశ్చక్రముగ్రహముల నాశ్రయించినది. వైకుంఠము నిరాధారమైనది. బ్రహ్మాండములకన్న పరమైనది, వరమైనది.(15) ఆ పైన, ఏబదికోట్ల యోజనముల దూరంలో గోలోకమున్నది. అది నిరాశ్రయమైనది. రత్నముల సారములతో (వజ్రాలు) శ్రేష్ఠమైన) నిర్మింపబడింది. (16) దానికి ఏడు ద్వారములు. ఏడు నక్షత్రముల సారమిది. ఏడు పరిఖలుగలది. లక్షప్రాకారములుగలది. విరజానది గలది. (17) రత్న పర్వతంతో చుట్టబడింది. అందమైన నూరు శిఖరములుగలది. పదివేల యోజనముల పరిమాణముగలది, దాని ఒక శృంగము చాలా ఉజ్జ్వలంగా ఉంది. (18) నూరుకోట్ల యోజనముల పరిమాణము గలది పర్వతము చాలా ఎతైనది కూడా. దాని పొడవునూరురెట్లు ఎక్కువ. దాని వైశాల్యము లక్ష యోజనములు (19) పదివేల యోజనముల విశాలమైన రాసమండలము అక్కడే ఉంది. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడింది. చంద్రుని బింబమువలె గుండ్రముగా ఉంది.
పుష్పించిన పారిజాత వనంతో చుట్టబడింది. సహస్రముల కొలది కల్పవృక్షములతో, నూర్ల కొలది పుష్పోద్యానములతో చుట్టబడింది. (21) అందమైన, పుష్పించిన రకరకాల పుష్పవృక్షములతో కూడి ఉంది. లక్షల గోపికలతో రక్షించబడింది. త్రికోటిరత్న భవనమది. (22) రత్నదీపములు కలది, రత్నతల్పములు కలది. నానాభోగములు కలది.నూర్లకొలది తేనెబావులతో చుట్టబడింది. (23) అమృతపు బావులు కలది, ఇష్టమైన భోగములతో కూడినది, గోలోకములోని గృహములను లెక్కించుటలోకాని, వర్ణించుటలోకాని విశారదుడైనవాడు (24) తెలిసిన విద్వాంసుడు కాని లేడు. తెలిసిన విద్వాంసుడు వ్రజేశ్వరుడొక్కడే. అమూల్య రత్నములతో నిర్మింపబడిన మూడు శిఖరముల భవనములతో (25) శోభించునది, సుందరమైనది,రమ్యమైనది, ఉత్తమమైనది, రాధా శిబిరము. అమూల్యమైన రత్న కలశములతో,రత్న దర్పణములతో ఉజ్జ్వలమైనది. (26) అమూల్యమైన రత్నస్తంభముల సమూహముతో వెలిగిపోతోంది. రకరకాలైన, విచిత్రములైన, చిత్రములతో చిత్రింపబడింది. శ్వేత చామరములు కలది.(27) మాణిక్యములు, ముత్యములు పొదగబడింది, పచ్చదనంతో (సమూహం) కూడింది. రత్నదీపములు కలది, రత్నసోపానములతో సుందరమైనది. (28) అమూల్యమైన రత్నపాత్రములతో కూడినది. తల్పముల (పడకల) సమూహముతో వెలుగుతోంది. అమూల్యమైన రత్నచిత్రములు కలది. రకరకాలైన చిత్రములు గలవి ఆ మూడు భవనాలు. (29) మూడు పరిఖలు మూడు ద్వారాలు ప్రవేశింపవీలులేనట్టివి ఉన్నాయి. పదహారుకక్ష్యలున్నాయి. ప్రతిద్వారమందును తెరిపి ఉంది (కక్ష్య కక్ష్యకు మధ్య ఎడమ) (30) ఇటునటు నియోగింపబడిన పదహారు లక్షల గోపికలు కలది. వహ్నిశుద్ధమైన (ఉడకబెట్టి పిండిన) వస్త్రములు ధరించి, రత్నభూషణములు ధరించి (31) కాల్చిన బంగారంలా మెరిసిపోతున్న నూరు చంద్రులు కలవారి వలె ఉన్న, రాధికాకింకరుల సమూహంగల శ్రేష్ఠమైన అభ్యంతరమది. (32) అమూల్యరత్నములతో నిర్మింపబడిన ఆ ప్రాంగణము చాలా మనోహరమైనది. అమూల్యమైన రత్నస్తంభముల సమూహంతో వెలిగిపోతోంది. (33) పండు చిగురుటాకులుగల రత్నములు పొదిగిన మంగళకుంభములు గలది. రత్న వేదికలు గలది. యోగ్యులైన మనుజులతో కూడినది. (ఆయుక్తజనియమింపబడినవాడు) (34) అమూల్యమైన రత్నముల అద్దములతో నిర్మింపబడినది. భవనములలో శ్రేష్ఠమైన గృహమిది. (35) రత్నసింహాసనమందు కూర్చున్నది. లక్షమందిగోపికలతో సేవించబడుతోంది. ఉత్తమమైన (కోటి) వానితో నిండినది, మంచి శోభగలది, తెల్లని చంపకపువ్వువలె ఉంది. (36) అమూల్య రత్నములతో నిర్మింపబడిన భూషణములతో అలంకరింపబడింది, అమూల్యమైన రత్నములు పొదిగినవస్త్రము ధరించింది, రత్న దర్పణం ఎడమ చేతిలో ఉంది. (37) అందమైన రత్నపద్మము కుడిచేతిలో ఉంది. దాడిమపూవు వంటి ఆకారము గల మనోహరమైన సిందూరము (నొసట) ఉంది. (38) ఇష్టమైన చందన బిందువులతో, కస్తూరితో శోభిస్తోంది. మాలతీమాలలతో అలంకరింపబడిన కేశపాశము గలది (39) ఎడమభాగంలో (కొప్పు) ఉంచబడింది. మునీంద్రులకు మనోహరమైనది. ఇట్లా ఉంది. అక్కడ రాధ గోపికలతో సేవించబడుతోంది.
వారు తెల్లచామరములు చేత ధరించారు. అటువంటివే ధరించి అంతట ఉన్నారు. అమూల్య రత్నములతో నిర్మింపబడిన భూషణములతో అలంకరింపబడింది ఆమె. (41) నా ప్రాణమును అధిష్ఠించిన దేవి,దేవతా (త) స్త్రీలలో శ్రేష్ఠురాలు, ఉత్తమమైనది. ఆమె ఇప్పుడు సుదామునిశాపంతో వృషభానుని సుతగా పుట్టింది. (42) నాతో ఆమెకు విచ్చేదము నూరు సంవత్సరాల కాలము ఉంటుంది. ఓ తలిదండ్రులారా! దానితో భూభారాన్ని తొలగించగలను. (43) అప్పుడు ఆమెతో కలిసి గోలోకమునకు వెళ్తాను. ఇది నిశ్చయము. నీతో యశోదతో గోపకులతో గోపీజనంతో (స్త్రీలు) కలిసి వెళ్లాను. (44) వృషభానునితో, ఆతని భార్య కళావతితో, బాంధవులతో వెళ్తాను. ఈ విధంగా నందుని, యశోదను, ఆనంద పరవశులను చేస్తాను. (45) ఓ మహాభాగ! దుఃఖాన్ని వదలు, గొల్లలతో కలిసి ప్రజమునకు వెళ్ళు. నేను ఆత్మను, సాక్షిని, నిర్లిపుడనై అన్ని జీవుల యందును వర్తిస్తాను. (46) జీవుడు నా ప్రతిబింబము అని ఇట్లా అందరికి సమ్మతమైంది. ఆ ప్రకృతి నా వికారము. నేను స్వయంగా ప్రకృతిని (47) పాలల్లో తెలుపు ఎట్లా సహజమో, వాటిని విడదీయటం సాధ్యం కాదో నీటిలో చల్లదనమెట్లా సహజమో, అగ్నిలో కాల్చేగుణమెట్లాంటిదో (48) ఆకాశంలో శబ్దమెట్లాగో, భూమికి వాసనఎట్లా సహజమో ఓరాజ! చంద్రునిలో శోభ, సూర్యునిలో కాంతి ఎట్లా సహజమో (49) నాకు (ఆత్మ) జీవునకు అట్లాగే సహజబంధము. అట్లాగే రాధతో కూడాను. నీవు, రాధ, గోపిక అనే సాధారణ బుద్దిని విడిచి పెట్టు. నేను నీపుత్రుళ్లనే విషయాన్ని మరిచిపో. (50) నేను అన్నిటి పుట్టుకకు కారణమును. ఆప్రకృతి ఈశ్వరి. సుఖావహమైన, నా విభూతిని (గొప్పతనాన్ని) ఆనందంగా విను, ఓనందుడ! (51) ఇదివరలో వ్యక్తమైన (స్పష్టమైన) జన్మలో బ్రహ్మకు ఏది చెప్పానో, ఓ తండ్రి! అదే ఇది. దేవతలకు కృష్ణుణ్ణి. గోలోకంలో స్వయంగా రెండు చేతులవాణ్ణి. (52) వైకుంఠంలో నాలుగు చేతులవాణ్ణి. శివలోకంలో స్వయంగా శివుణ్ణి. బ్రహ్మలోకంలో బ్రహ్మను, తేజస్వంతులలో నేను సూర్యుణ్ణి. (53) పవిత్రమైన వానిలోనేను అగ్నిని, ద్రవపదార్థాలలో నేను జలమును. ఇంద్రియములలో మనస్సును. వేగంగా వెళ్ళే వాటిలో గాలిని నేను. (54) దండకర్తలలో (శిక్షించేవారు) నేను యముణ్ణి. తీసుకుపోయే వాళ్ళలో నేను కాలాన్ని (కాలుణ్ణి). అక్షరములలో అకారాన్ని సామములలో సామాన్ని. (55) పదునాల్గురు ఇంద్రులలో ఇంద్రుణ్ణి. ధనవంతులలో కుబేరుణ్ణి. దిగీశులలో ఈశానుణ్ణి. వ్యాపకులలో ఆకాశాన్ని నేను (56) జీవులలో సర్వాంతరాత్మను. ఆశ్రమములలో బ్రాహ్మణుడను. ధనములలో అమూల్యమైన, అందరికి దుర్లభమైన రత్నాన్ని (57) తైజసములలో బంగారాన్ని, మణులలో కౌస్తుభ మణిని స్వయంగా, పూజించ తగిన వానిలో సాలగ్రామాగ్ని నేను. పత్రములలో తులసిని (58) పుష్పములలో పారిజాతాన్ని నేను. తీర్థములలో స్వయంగా పుష్కరతీర్థాన్ని నేను. వైష్ణవులలో నేను కుమారుణ్ణి. యోగీంద్రులలో గణేశ్వరుణ్ణి (59) సేనాపతులలో నేను స్కందుణ్ణి. ధనుర్ధారులలో నేను లక్ష్మణుడను. రాజేంద్రులలో నేను రాముడను. నక్షత్రములలో నేను చంద్రుడను. (60)
అను!! మాసములలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంతర్తువునూ వారములలో ఆదివారాన్ని తిథులలో ఏకాదశి తిథిని (61) ఓర్పుగల వారిలో భూమిని బంధువులలో తల్లిని. తిన తగిన వానిలో అమృతాన్ని. ఆవుకు చెందిన వానితో, నెయ్యిని (62) వృక్షములలో కల్పవృక్షాన్ని. ధేనువులలో కామధేనువును. నదులలో గంగను. అది చేసిన పాపములను తొలగించేది. (63) పండితులలో వాణిని (వాక్కును). మంత్రములలో ఓంకారాన్ని, విద్యలలో బీజస్వరూపాన్ని. సస్యములలో ధాన్యాన్ని. (64) పండే చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని, గురువులలో మంత్రమిచ్చే గురువును. ప్రజలకు ఈశుడైన వారిలో కశ్యపుడను, పక్షులలో గరుడుడను. (65) పాములలో అనంతుడను. నరులలో నరాధిపుడను. బ్రహ్మరులలో భృగువును, దేతరులలో నారదుడను. (66) రాజర్పులలో జనకుడను, మహరులలో శుకుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని (67) బుద్ధిమంతులలో బృహస్పతిని, కవులలో శుక్రుడను, గ్రహములలో శనిని, శిల్పులలో విశ్వకర్మను. (68) మృగములలో మృగేంద్రమును, వృషభములలో శివుని వాహనమును గజేంద్రములలో ఐరావతమును, ఛందస్సులలో గాయత్రిని (69) సర్వశాస్త్రములలో వేదమును, యాదస్సులలో (జలజంతువులలో) వరుణుడను. అప్పరసలలో ఊర్వశిని. సముద్రములలో మంచినీటి సముద్రాన్ని. (త్రాగ తగిన నీరు) (70) పర్వతములలో సుమేరువును, రత్నములు కలవానిలో హిమాలయాన్ని, ప్రకృతులలో దుర్గను, దేవిలలో (స్త్రీలు) కమలాలయను (లక్ష్మిని) (71) స్త్రీలలో శతరూపను (బ్రహ్మకూతురు). నాకిష్టమైన ప్రియతమలలో రాధికను. సాధ్వులలో సావిత్రిని, వేదమాతను నేను నిశ్చయము. (72) దైత్యులలో ప్రహ్లాదుడను బలిషులలో బలిని. భగవాన్ నారాయణ ఋషిని. జ్ఞానుల మధ్యలో ఉంటాను. (73) కోతులలో హనుమంతుడను, పాండవులలో ధనంజయుడను. నాగకన్యలలో మనసను. వసులలో (మూలికలలో) ద్రోణమును (74) మేఘములలో (జలధరం) ద్రోణనామక మేఘమును. వరములలో (దేశం) భారత(దేశము)ను. కాములలో కామదేవుడను. కాముకులలో (స్త్రీలలో) రంభను. (75) లోకములలో గోలోకమును, ఉత్తమమైన, అన్నిటికన్న పరమైన లోకాన్ని, మాతృకలలో శాంతిని, సుందరీమణులలో రతిని (76) సాక్షులలో ధర్మాన్ని వాసరములలో సంధ్యను, దేవతలలో మహేంద్రుడను, రాక్షసులలో విభీషణుడను (77) రుద్రలలో కాలాగ్ని రుద్రుడను, సంహారులలో భైరవుడను. శంఖములలో పాంచజన్యాన్ని అవయవాలలో తలను. (78) పురాణ సూత్రములలో పరమైన, వరమైన భాగవతాన్ని నేను. ఇతిహాసములలో భారతాన్ని, పాంచరాత్రములలో కపిలునికి చెందినవాడను. (79) మనువులలో స్వాయంభువమనువును, మునులలో వ్యాసదేవుడను. పితృపత్నులలో స్వధను, వహ్ని ప్రియలలో స్వాహాను.
అను ॥ యజ్ఞములలో రాజసూయమును, యజ్ఞపత్నులలో దక్షిణను, శస్త్రాస్త్రములు తెలిసిన వారిలో రాముడను, గొప్పనైనవాణ్ణి జమదగ్ని సుతుడను, (81) పౌరాణికులలో సూతుడను, నీతిమంతులలో అంగిరస మహర్షిని వ్రతములలో విష్ణువుకు చెందిన వ్రతాన్ని, బలములో దైవబలాన్ని (అదృష్టం) (82) ఓషధులలో దూర్వను, తృణములలో కుశగడ్డిని (దర్బ), ధర్మకర్మలలో సత్యాన్ని స్నేహ పాత్రులలో పుత్రుణ్ణి (83) నేను శత్రువులకు వ్యాధిని, అట్లాగే వ్యాధులలో జ్వరాన్ని - నాభక్తు (కలవారి) లలో నాదాస్యము శ్రేష్ఠమైన వానిలో శ్రేష్టమైనది. (84) ఆశ్రమములలో గృహస్థాశ్రమాన్ని, వివేకులలో సన్యాసిని. శస్త్రములలో సుదర్శనాన్ని శుభాశీస్సులలో కుశలవార్తను (85) ఐశ్వర్యములలో మహాజ్ఞానాన్ని, సుఖములలో వైరాగ్యాన్ని, ప్రీతిని ఇచ్చే వాటిలో మథురమైన వాక్యాన్ని, దానములలో ఆత్మదానాన్ని, (86) సంచయములలో (సంపాదించినది), ధర్మకర్మను, కర్మలలో నాపూజను నేను. కఠోరమైన వానిలో తపస్సును, ఫలములలో మోక్షఫలాన్ని (87) అష్టసిద్ధులలో ప్రాకామ్యాన్ని (కోరికలు స్వేచ్ఛ), పురములలో కాశీపురిని, నగరములలో కాంచి నగరాన్ని, వైష్ణవుడున్న ప్రదేశాన్ని నేను, (88) స్థూలమైన సర్వ ఆధారములలోను, నేనే మహా విరాట్ స్వరూపుడిని. విశ్వంలో నేను పరమాణు రూపుడను మహాసూక్ష్మమైన వాటిలో ఎప్పుడూ ఉంటాను. (89) వైద్యులలో అశ్వినీ పుత్రులుగా నేనే, ఓషధులలో రసాయనాన్ని, మంత్ర విదులలో ధన్వంతరిని క్షయకారులలో విషాదాన్ని (90) రాగములలో మేఘమల్పారాన్ని ఆతని ప్రియమైన వానిలో, కామ(మో) దుడను, నా పారదులలో శ్రీరాముడను, నాబంధువులలో ఉద్దవుడను. (91) పశు జంతువులలో గోవును, కాననమందు చందన వృక్షాన్ని. పవిత్రమైన వానిలో తీర్థపవిత్రుడను, నిఃశంకులలో (శంకలేని వాడు) వైష్ణవుడను. నామంత్రము నుపాసించే ప్రాణి వైష్ణవుడెవడున్నాడో వానిని మించిన ప్రాణి లేదు. వృక్షములలో అంకురరూపుణ్ణి. అన్ని వస్తువులలో ఆకారాన్ని (93) అన్ని ప్రాణులలో, నేనున్నాను. నాలో అన్ని ఎల్లప్పుడున్నాయి. వృక్షమందు పండ్లు. పండ్లలో వృక్షమునకు కావలసిన మొలక ఉన్నట్లే నేనున్నాను. (94) అన్నిటికి కారణరూపుణ్ణి నేను. నాకు పరమైనకారణం లేదు. నేనందరికి ఈశుడను. నాకు అధీశుడు లేడు. నేను కారణానికి కారణాన్ని. (95) అందరికి, అన్ని బీజములకు బీజంగా మనీషులు చెప్తారు. నా మాయతో మోహింపబడ్డ జనులు, పాపులు నన్ను తెలుసుకోలేరు. (96) పాపగ్రస్తమైన దుర్జుద్ధితోగాని, విధితో వంచింపబడికాని నన్ను తెలుసుకోలేరు. అన్ని ప్రాణులకు ఆత్మను నేను, స్వామిని నేను స్వయంగా ఆదరింపబడలేదు. (97) నేనున్న చోట శక్తులుంటాయి, ఆకలిదప్పులు మొదలైన వుంటాయి. నేను వెళ్లే అవీ వెళ్తాయి. నరదేహమందు, అనుసరించిన వాళ్ళు వెళ్ళినట్లుగా (98) ఓప్రజేశ! నంద! తండ్రి! జ్ఞానాన్ని తెలుసుకొని ప్రజమునకు వెళ్ళు. ఆ రాధకు, యశోదకు జ్ఞానాన్ని బోధించు. (99) జ్ఞానాన్ని తెలుసుకొని ప్రజేశుడు తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. వెళ్లి శ్రేష్ఠులైన ఆ ఇద్దరు స్త్రీలకు చెప్పాడు. (100) వారంతా శోకాన్ని విడిచారు, మహాజ్ఞానం కలవారైనారు, ఓ నారద! కృష్ణుడు నిర్లిప్తుడు ఐనా మాయకు ఈశుడు, మాయారతుడు. (101) యశోదతో ప్రేరేపింపబడి, తిరిగి మాధవుని దరికి వచ్చి, పరమానందుడైన నందనందనుని, నందుడు సంతోషింపచేశాడు. (102) సామవేదంలో చెప్పిన స్తోత్రంతో, బ్రహ్మ ఇదివరలో చేసిన (స్తోత్రంతో) దానితో, పుత్రుని ఎదురుగా నిలబడి మాటిమాటికి రోదించాడు. (103) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు ఉత్తరార్ధంలోని నారాయణ నారద సంవాదమందు నందాదుల -- శోకమును తగ్గించట (తొలగించడం) మనునది (ఓదార్పు) డెబ్బది మూడవ అధ్యాయము. (73)
