4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
21 - ఇంద్రయాగ భంజనము
శ్రీనారాయణ ఉవాచ - నారాయణమహర్షి ఇట్లనెను :
ఓ నారదమునీ! గోపవ్రజములో గోపాలకులు గోవులు నివసించిన పురము) ఆనందముగా నున్న నందుడొకసారి ఇంద్రుని గురించి ఒకయాగము చేయబూనినవాడై నగారా మ్రోగించి చాటింపు {ప్రకటన) చేయించేను. “ఈ పట్టణములో గోపాలురు గోపికలు బాలురు బాలికలు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు ఎవరెవరు నివసించుచున్నారో వారందరు పెరుగు పాలు నెయ్యి మజ్జిగ వెన్న బెల్లము తేనె అను పదార్థములను తెచ్చి భక్తితో ఇంద్ర పూజ చేయుదురు గాక” అని పలుకుచు స్వయముగా సంతోషముతో ఎల్లరకు.
మిక్కిలి విశాలముగా నున్న ఒక సుందర ప్రదేశమున చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు అను సుగంధ ద్రవ్యముల ద్రవముతో అలికి మనోహరముగా పూమాలలను ధ్వజదండము ఎత్తించెను (పట్టు వస్త్రమున ఇంద్ర ధ్వజమున్నగడను.
నందుడు స్నానము చేసి భక్తితో సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలు చేసి ఉతికిన వస్త్రములను రెంటిని ధరించి (ధోతీ ఉత్తరీయము} పాద ప్రక్షాళనము చేసికొని స్వర్ణపీఠముపై కూర్చుండెను. నానావిధ పదార్ధముల పాత్రలు తీసుకొని అచ్చటికి గోపాలురు గోపికలు బాలురు బాలికలు బ్రాహ్మణులు పురోహితులు వచ్చిరి. ఇంతలో గొప్పగా కూర్చి తెచ్చిన వస్తు సామగ్రితో అచ్చటికి నగరమున వసించు జనులు వచ్చి చేరిరి. పోరు నానావిధములైన ఉపాయనములను (కానుకలను తెచ్చిరి. వేదవేదాంగముల పారమును ముట్టిన (అంతుచూచిన) మునులు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచు శాంతులై శిష్యగణములతో బాటు అక్కడకు వచ్చిరి.
గర్గుడు గాలవుడు శాకల్యుడు శాకటియనుడు గౌతముడు కరుషుడు కణ్వుడు వాత్యుడు కాత్యాయనుడు సౌభరి వామదేవుడు యాజ్ఞవల్క్యుడు పాణీని ఋష్యశృంగుడు గౌరముఖుడు భరద్వాజుడు వామనుడు కృష్ణద్వైపాయనుడు శృంగి సుమంతుడు జైమినీ కచుడు పరాశరుడు మైత్రేయుడు వైశంపాయనుడు అను మునులును బ్రాహ్మణులును పలు విధముల భిక్షుకులును వందిజనమును, రాజులు వైశ్యులు శూద్రులును ఆ మహోత్సవమునకు చేరవచ్చిరి.
నందుడు అతని వారగు గోపాలురును వచ్చిన మునీంద్రులను బ్రాహ్మణులను రాజులను చూచి అతడు తన స్వర్ణపీఠము మీది నుండి లేవగా గోపాలురును లేచి నిలబడిరి, నందుడు వచ్చిన వారికి నమస్కరించి వారిని కూర్చుండబెట్టి వారి ఆజ్ఞతో. తాను కూర్చుండెను యష్టి సమీపమున ధ్వజము - గడ) వంటలో ప్రావీణ్యము గల నూరుగురు బ్రాహ్మణులను పిలిపించి ఆదరముగా వంటలు చేయుటకాజ్ఞాపించెను.
ఆ ధ్వజప్రదేశము పొగదినుసులు (ఊదు మొదలగు సుగంధపు పొడులు) కాల్చుట వలన ఏర్పడిన పొగతో సువాసనలు గలదై చిమ్మచీకట్లు క్రమ్మెను. అప్పుడంతట రత్నాల దీపములు వెలిగించబడెను. నానావిధములైన పుష్పములు రకరకముల పూలదండలు అపూర్వము మనోహరమైన రకరకముల నైవేద్యము సమకూర్చబడెను, నువ్వుల లడ్డుకములు మండకములు స్వస్తికములు వేలకొలది నింపిన పాత్రలు ఆయష్టి స్థానమున నిండెను. ఓ నారదా! శర్కరతో నింపిన కలశములు వేయి, జవ్వలపిండి గోధుమ పిండితో మధురముగా అందముగా బ్రాహ్మణులు నేతిలో వండిన లడ్డూలతో అనేక కలశములు నిండి యుండెను. చెట్ల మీదనే పండి అందముగా రుచిగా నున్న . అరటి పండు ఆయాకాలములలో ఆయాదేశములలో పంటపండి లభించెడి పరిపక్వ ఫలములు - లక్ష కడవల పాలు లక్ష కడవల పెరుగు నూరు కడవల తేనె వెయ్యి కడవల నెయ్యి మూడు లక్షల కడవల మజ్జిగ బెల్లము నింపిన ఘటములైదు లక్షలు నువ్వుల నూనె నింపిన వెయ్యి కడవలు {అక్కడ చేర్చబడెను).
భోగద్రవ్యములను మోసి తెచ్చు మంచి వృషభములు (ఎద్దులు) నానావిధములైన వెండి బంగారు పాత్రలను బంగారు పీటలను అక్కడకు తెచ్చెను, ధరింపయోగ్యమైన మంచి వస్త్రములు సుందర భూషణములు చేర్చబడెను. ఆ ఉత్సవ సమయమున కన్నులకింపుగా నున్న వివిధ వాద్యములను స్వరయంత్రములను వాదకులు (వాద్యమును మ్రోగించువారు) చెవికి మధురముగా మ్రోగించిరి.
వేలకొలది గొళె పొట్టేళ్లు, వందదున్నలు, లక్షల మేకపోతులు వందల దూడలు ఆ యష్టివద్దకు తేబడెను. వాటినన్నిటినీ చక్కగా చూచి రక్షకులు కాపాడుచుండిరి.
ఉత్సవమును చూచుటకై అక్కడికి చేరిన బాలురను బాలికలను యువతీ యువకులను వృక్షములను లతలను {అక్కడ వెలసినవాటిని) లెక్కించుట ఎవని తరము ? గాయకుల సంగీతమును విని నర్తకుల నర్తనము చూచి జనులందరు ఆ ఉత్సవములో వ్యామోహితులైరి.
ఆ ఉత్సవసమయములో అక్కడకు రంభ ఊర్వశి మేనక ఘృతాచి మోహిని, రతి, ప్రభావతీ, భానుమతి, విప్రచిత్త, తిలోత్తమ, చంద్రప్రభ, సుప్రభ, రత్నమాల, మదాలస, రేణుక, రమణీ అను నీ అప్పరసలు వచ్చిరి, వారి నృత్యమును గాసమును స్తనములను ముఖములను పిరుదులను రూపమును ఓరచూపులను చూచి వ్యామోహితులై మానవులు మూర్ఛిల్లిరి.
ఇంతలో శ్రీకృష్ణుడు గోపాల బాలకులు బలశాలియైన బలదేవుడు వెంటరాగా అక్కడికి వచ్చాను. అతనిని చూచి జనులందరు తొందరపాటు ఆనంద పారవశ్యము భయము ఏర్పడగా పులకరించిన శరీరములతో లేచి నిలబడిరి.
క్రీడాస్థానము (ఆటలాడుకొన్న ప్రదేశము) నుండి వచ్చుచున్న శాంతసుందరమూర్తియగు శ్రీకృష్ణుడు వినోదముగా పిల్లన గ్రోవి బూరలు కొమ్ముల నూదుచున్నవారితో కూడి వచ్చుచుండెను. శ్రేష్ఠమైన రత్నాభరణములతో కౌస్తుభమణితో అలంకృతుడై శ్రీగంధము అగురుల యొక్క ద్రవము పులుముకొన్న శ్యామవిగ్రహముతో ఒప్పుచుండెను. శరదృతువులోని మధ్యాహ్న కాలపు పద్మము వలె (వికసించిన) ముఖమండలమును రత్నదర్పణమున - చూచుకొనుచున్నవాడును - ఆకాశములో కుందేలు మచ్చ గల చంద్రుని వలె ఫాలమధ్యమందు (నొసలు) సుందరమైన చందన తిలకము నడుమ కస్తూరి చుక్క బోట్టు గలవాడును - ఏ మబ్బులు లేని శరదృతువులోని నిర్మలాకాశములో కొంగల వరుస ఎగిరినట్లు నల్లనీ కంఠము వక్షః స్థలమున మాలతీ పుష్పహారము వీరాజిల్లుచున్నవాడును - మాటిమాటికి మెరుపులు మెరియుచున్న క్రొత్తమేఘము వలె సుందరమైన పీతాంబరముతో ప్రకాశించుచున్న నల్లని దేహము గలవాడును ఉదయకాలమున నక్షత్రములతో ఇంద్రధనుస్సుతో ఒప్పుచున్న ఆకాశము వలె మొల్లపూలతో ఎర్రని గురివింద పూసలతో బిగించబడిన వంకర కొండెకొప్పు గలవాడును శరదృతువులో సూర్యకిరణముల చేత వికసింపజేయబడిన రత్న కుండలముల (చెవి కమ్మల) కోంతితోను చిరునవ్వు నవ్వుచున్న ముఖముతోను - ఆ స్వామి మనోహరముగా నుండెను.
నారదా! బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మునులు గోపాలురు అందగతనికి నమస్కరించి శుభమైన రత్న సింహాసనము పైన కూర్చుండ బెట్టిరి.
ఆకాశములో గ్రహ నక్షత్రముల నడుమ శరత్కాల చంద్రుడు వెలిగినట్లు ఆ జగన్నాధుడాజనుల మధ్యమందు రత్నపీఠమున ప్రకాశించెను.
(పీరము ఫై విలసిల్లిన స్వామి కూర్చుండుటకు వారికి సెలవీయగా) అది విని వారు స్వేచ్ఛయే (తన సంకల్పమే) అవతారకారణమైనవాడు త్రిగుణముల కతీతుడు జ్యోతీరూపుడు సనాతనుడు జగత్తులకు పరమేశ్వరుడు అని స్వామిని గూర్చి ముచ్చటించుకొనిరి. నీతిశాస్త్ర విశారదుడైన శ్రీకృష్ణుడు ఆ మహోత్సవమును చూచి సర్వజనులకు దుర్లభమైన నీతిని తండ్రినుద్దేశించి పలికిను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
ఓయీ! గోపాల రాజేంద్రా! మంచివ్రతనిష్ఠగలవాడా! ఇక్కడేమి చేయుచున్నావు ? ఇదేమి పూజ ? పూజింపబడువాడెవడు ? ఈ పూజ వలన ఏ ఫలము కలుగును? ఆ ఫలము వలన ఏ సాధనము లభించును ? ఆ సాధనముతో సాధింపబడునదేమి? ఈ పూజకాటంకమేర్పడిన యెడల ఆ దేవత కోపించెనేని ఏమి జరుగును ? ఆ దేవత సంతృప్తి చెందినచో ఇహ పరములకు సంబంధించి ఏమి ఫలమిచ్చును ? ఒక దేవత ఇహలోక ఫలమే ఇచ్చును. మరొక దేవత పరలోక ఫలమే ఇచ్చును. ఒక దేవత రెంటినీయదు. మరొక దేవత రెండిచ్చును.
వేదమందు చెప్పబడని పూజ సర్వవిధములైన నష్టములకు మూలము. ఈ పూజ నీకు క్రొత్తదియా లేక పరంపరగా మీ పెద్దలాచరించుచున్నదీయా ! ఈ పూజ ఏ దేవుని గురించి ఆచరింపబడుచున్నదో అతనిని నీవు చూచితివా ? నీ దేవుడి పదార్థములను నేరుగా తాను భుజించునా? భుజించడా ? నేరుగా భుజించు దేవునర్చించుట చాల చాల ప్రశస్తముగా నుండును. బ్రాహ్మణ రూపమున నుండు జనార్దనుడు (విష్ణువు} నైవేద్యమును సాక్షాత్తుగా భుజించును.
బ్రాహ్మణుడు సంతోషించినయెడల సర్వదేవతలు సంతృప్తి చెందుదురు. దేవపూజయందు బ్రాహ్మణుల నర్చించుటకేవడు నియమింపబడునో వానికేమి లభించదు ? బ్రాహ్మణుల నెవడు పూజించునో వాడు సర్వదేవతలను పూజించినవాడగును. నివేదన పదార్థములను దేవునికి సమర్పించి దానిని బ్రాహ్మణులకర్పించనిచో. ఆ నైవేద్యము భస్మమై పోవును, ఆ పూజ నిష్ఫలమగును. దేవతానైవేద్యమును విప్రునకు దానమొనర్చిన యెడల అనంతమైన స్థిర పదము లభించును. సంతోషించిన దేవత వరమిచ్చి తన లోకమునకేగును. దేవతా నివేదన చేసి తానే భుజించిన అవివేకి దానమిచ్చిన సొత్తు నపహరించినవాడగును. ఆ దేవద్రవ్యము భుజించినచో వాడు నరకమును పొందును.
విష్ణువుకు నివేదించినది తప్ప ఇతర దేవతానైవేద్యము భుజింపగూడదు. సర్వదేవతల యందు విష్ణువునైవేద్యమును భుజించుట ప్రశస్తము. విష్ణువుకు నివేదించని అన్నము మలముతో సమానము జలము మూత్రముతో సమానము. ఎల్ల జనులకిదియే పాటీంపవలసిన క్రమము. విశేషించి బ్రాహ్మణులకు దాటరానీ నియమము. ఏ ప్రాజ్ఞుడు గాని పదార్ధమును దేవునికరించకుండ బ్రాహ్మణునకర్పించిన యెడల విప్రుని ద్వారా దేవతలు భుజించి సంతృప్తులగుట వలన స్వర్గమునకేగును. కాబట్టి అన్ని విధముల ప్రయత్నించి విప్రుల నారాధించుము.
ఇహ పరలోకములందు ప్రశస్తమైన ఫలమిచ్చువారు బ్రాహ్మణులు, జపము తపస్సు పూజ యజ్ఞము దానము మహోత్సవము అనెడి అన్ని కర్మల యొక్క సారము బ్రాహ్మణ సంతుష్టి మరియు ఈయబడునట్టి దక్షిణ. దక్షిణగా ఈయబడు దానియందు సర్వదేవతలు నివసింతురు.
విప్రుల యొక్క పాదములయందు సర్వపుణ్యక్షేత్రములుండును. వారి పాదధూళిలో పుణ్యముండును. వారి పాద జలములో సర్వపుణ్య తీర్ధ జలములుండును. వీప్రపాద జలమును స్పృశించినంత మాత్రమున సర్వతీర్థములో స్నానమాడిన ఫలము లభించును. ఓ నందరాజా! భక్తితో వారి పాద జలము త్రాగిన యెడల రోగములు నశించును. ఏడు జన్మలలో చేసిన పాపముల నుండి కూడ వాడు - విముక్తుడగుననుటలో సంశయము లేదు. పంచవిధపాతకములు చేసినను బ్రాహ్మణునకు గోకులక్షేత్రమున నమస్కరించినట్లు సర్వతీర్థములలో స్నానమొనర్చినట్లు సర్వపాపముల నుండి విముక్తుడగును. బ్రాహ్మణునీ స్పృశించినంత మాత్రమున పాపి ముక్తుడగును. దర్శనము వలననే పాపవిముక్తుడగునని వేదమందు చెప్పబడినది. పండితుడు (జ్ఞాని) గాని అపండితుడు (ఏమి తెలియనివాడు) గానీ బ్రాహ్మణుడు, విష్ణువు యొక్క విగ్రహము. ఏ విప్రులు హరిని సేవించుచుందురో వారు విష్ణువునకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనవారు. హరి భక్తులైన బ్రాహ్మణుల మహిమ వేదమందును దుర్లభమని చెప్పబడినది. ఎవరి పాదపద్మముల ధూళితో వసుంధర (భూమి) అప్పటికప్పుడు పవిత్రయగునో ఆ బ్రాహ్మణుల పాద చిహ్నము (నేలమీద ముద్రితమైన అడుగు గుర్తు) పుణ్యతీర్థ ప్రదేశముగా చెప్పబడినది. ఆ పాద చిహ్నములను ముట్టుకోన్నంత మాత్రమున అజ్ఞానముతో పుణ్యతీర్ధములలో చేసిన పాపము నశించును. సద్వీప్రుని ఆలింగనము చేసికొన్నందువలన, అతనితో సంభాషించుట వలన వారి ఉచ్ఛిష్టము (తినగా మిగిలినది, ఎంగిలి పదార్థము) భుజించుట వలన, వారిని దర్శించుట వలన స్పృశించుట వలన కూడ సర్వపాపముల నుండి విముక్తుడగును. సర్వతీర్థయాత్రలు చేసి పుణ్యజలములలో స్నానము చేసినచో ఏ పుణ్యము లభించునో ఆ పుణ్యము హరి భక్తుడైన విప్రుని దర్శించినందు వలన లభించును, ఏ బ్రాహ్మణులు ప్రతిదినము శ్రీహరికి నివేదించిన యన్నమునే భుజింతురో వారి యుచ్ఛిష్టమును భుజించు నరుడు శ్రీహరి దాస్యముక్తిని పొందును.
ఏ నరుడు. భ్రమ ప్రమాదముల వలన నైనను శ్రీహరికి నివేదించకుండ భుజించినచో ఆ పదార్ధము మలముతో సమము ఆ జలము మూత్రముతో సమానమగును.
శూద్రుడు హరిభక్తుడై నైవేద్య పదార్థమే భుజించవలె నన్న ఆసక్తి కలవాడైనచో అమాన్నమును (పక్వము గాని - వండని పదార్థము) శ్రీహరికి నివేదించి తరువాత వండుకొని తినుచున్నాడు (తినవలెను అని ముందునుండి వచ్చుచున్న ఆచారమును చెప్పినాడు).
బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సాలగ్రామ శిలను పూజించునధికారము కలదు. సాలగ్రామ శిలనే కాదు హరిని నేరుగా పూజించుటకును శూద్రునకధికారము లేదు.
ఓ గోపాలనాధా! ఈ పదార్థములను బ్రాహ్మణులకు దానమీయకున్నచో ఇవి యన్నియు భస్మీభూతములగును. సంశయము లేదు. పుణ్యప్రాప్తి కొరకు సర్వజీవులకన్నము పెట్టదగును. అందులో విశిష్టజీవులకు దానమొనర్చినచో (అన్నము) విశేష ఫలము లభించును. అంతకంటే మనుష్యులకు పెట్టినయెడల ఎనిమిదింతలు పుణ్యము లభించును.
శూద్రుల కన్నము బెట్టినందువలన వచ్పు పుణ్యములో రెండింతల పుణ్యము వైశ్యులకన్నము పెట్టుట వలన వచ్చును. అంతకంటే ద్విగుణమైన పుణ్యము (రెండింతలు క్షత్రియులకు పెట్టుట వలన కలుగును. క్షత్రియులకు పెట్టుట వలన లభించు పుణ్యమునకు నూరంతలు పుణ్యము విప్రుల కన్నదానము చేయుట వలన కలుగును. బ్రాహ్మణులకు పెట్టినందు వలన వచ్చు దానీకంటే నూరంతలు పుణ్యఫలము శాస్త్రజ్ఞుడైన ఒక బ్రాహ్మణునకు పెట్టుట వలన కల్గును. శాస్త్రజ్ఞుల కంటే నూరంతలు పుణ్యఫలము భక్తుడైన విప్రున కన్న దానము చేసినందువలన - ఆయన్నము నాభక్తుడు భక్తితో హరికి నివేదించి భుజించును కనుక నీశ్చయముగా లభించును.
విష్ణువునకు విష్ణుభక్తునకు అన్నదానమొనర్చి దాత ఏ ఫలము పొందునో ఆ ఫలమునే భక్తుడైన బ్రాహ్మణుడు భుజించినందు వలన తప్పక పొందును. భక్తుడు సంతుష్టుడైనచో హరీ సంతుష్టుడగును. హరి సంతుష్టుడైనచో సర్వదేవతలు సంతుష్టులగుదురు, చెట్టు మొదట నీరుపోసినందు వలన కొమ్మలు రెమ్మలెట్లు ఏర్పడునో నవనవలాడునో ఇదియునట్లే జరుగును. ఈ పదార్థములన్నిటిని ఏ యొక దేవతకో నీవర్పింతువేని సర్వ దేవతలు కోపము పొందిన యెడల ఆ దేవతలతో ఎవడేమి చేయగలడు. కానీచో నీ పదార్ధములలో సగము గోవర్థన పర్వతమునకు సమర్పించుము.
గోవులనెప్పుడు వృద్ధి పొందించునది కనుక గోవర్ధనమని చెప్పబడినది. ఓ తండ్రి. గోవర్ధనముతో సమమైన పుణ్యాత్ముడీ భూమండలమున లేడు. ప్రతిదినము గోవులకీ పర్వతము లేతగడ్డినిచ్చుచున్నది కదా!
పుణ్యతీర్థములలో స్నానమాడుట వలన, బ్రాహ్మణునకు భోజనము పెట్టుట వలన, సర్వవిధవ్రతముల వలన, ఉపవాసముల వలన, సర్వవీధ తపస్సుల వలన, మహాదానము వలన, హరి సేవ వలస, భూప్రదక్షిణము వలన, సర్వవేదశాస్త్రములు వినుట వలన, సర్వవిధముల యజ్ఞదీక్షలు పూని నెరవేర్చుట వలన, మానవుడే పుణ్యమును పొందునో ఆ పుణ్యమును బుద్ధిమంతుడు గోజాతీకి గడ్డిమేపి {గడ్డి ఇచ్చి) పొందును. గడ్డిమేయుచున్న ఆవును కావలెనని కోరికతో నెవడు ఆటంకపరచునో (వారించునో వానికి బ్రహ్మహత్యాదోషము పచ్చును. ఆ పాపము ప్రాయశ్చిత్తములవలననే తీరిపోవును. వాడు శుదుడగును. గోవుల శరీరమున స్వయముగా లక్ష్మీదేవి ఎల్లప్పుడు నివసించును. ఓ తండ్రీ! గోవుల యడుగుల తొక్కుడు వడిన మట్టీనెవడు తిలకముగా ధరించునో వాడప్పుడే తీర్థజల స్నానమొనర్చినవాడగును. వాని కడుగడుగున జయము కలుగును. గోవులెక్కడ నివసించునో ఆ ప్రదేశము పుణ్యతీర్థముగా చెప్పబడినది, అక్కడ ప్రాణములు విడిచిన మానవుడు వెంటనే ముక్తి పొందుట నిశ్చయము. బ్రాహ్మణుని గోవును దండించిన మానవాధముడు బ్రహ్మహత్యతో సమమైన పాపము పొందుననుటలో సందేహము లేదు. నారాయణుని అంశగలవారైన విప్రులను గోవునేమానవులు పధింతురో వారు సూర్యచంద్రులున్నంత వరకు కాలసూత్ర నరకమును పొందుదురు. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించెను.
శ్రీకృష్ణుని మాటలు విని ఆనందము పొందిన నందుడు చిరునవ్వుతో నతనికిట్లనెను.
నంద ఉవాచ - నందుడనెను :
ఇది మహాశక్తి శాలియైన మహేంద్రుని పూజ. మంచి వర్షమునకిది సాధనము, సర్వవిధములైన సస్యములు చక్కగా పండుట మన లక్ష్యము (సాధ్యము} సస్యములే జీవకోటికి ప్రాణము కదా! భూమీ మీది జీవకోటి యంతయు సస్యము వలన జీవించును. అందుకొరకే ప్రజవాసులందరు పురుషక్రమముగా (వంశములో ప్రతి పురుషుడాచరించుట వంశాచారముగా తరతరముల నుండి మహేంద్రుని పూజించుచున్నారు. ఒక సంవత్సరము మొదలు చివరగా ఈ పూజ సాచరించవలయును. విఘ్నములు తొలగుటకు మంగళము కొరకుగాను ఇది ఆదిలో చేయు పూజ. సంవత్సరాంతమున మహోత్సవముండును.
ఇట్లు పలికిన తండ్రి మాట వినీ బలదేవునితో బాటు శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వెను. తరువాత, తండ్రితో మరల నిట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
ఆహా! విడ్డూరమైన నీ వాక్కును మిక్కిలి అద్భుతముగా వింటీని. లోక మర్యాదను బట్టి గానీ శాస్త్ర నియమమును బట్టి గాని ఇది నవ్వుకొనవలసిన మాట. వేదములలో మిక్కిలి గర్జించుకొన్న (అసహ్యించుకొన్న- నిందించిన మాట యిది. ఇంద్రుని వలన వర్షమేర్పడునన్న దానికి ఎక్కడ కూడ నీరూపణము (ఆధార వాక్యము) లేదు. ఈ దినము నీ ముఖము నుండి అపూర్వమైన నీతి వాక్యము వింటిని. ఓ తండ్రీ! వినుము. నేనధర్మము చెప్పను. నేను చెప్పునది వేదవేత్తల నీతి. దీనిని పండితులంతట ఎరుగుదురు. సామవేదముందు చెప్పబడిన మాట యిది.
ఈ సభలో ఆలోచించి చెప్పగలవారనేకులు (చాల విషయములు తెలిసినవారు) ఉన్నారు. వారినడుగుము. “అయ్యా! ఏమి? ఇంద్రుని వలన వర్షమేర్పడునా ? పరమార్ధము (వాస్తవము) చెప్పుడు” అని.
సూర్యుని వలన జలమేర్పడును, జలము వలన సస్యములు (పంటచేలు వృక్షములు} వర్ధిల్లును. పోటీ నుండి ధాన్యములు {అన్నము) ఫలములు ఏర్పడును. ప్రాణులు వాటిని భుజించీ బ్రతుకుచున్నారు. సూర్యునిచేత పీల్చబడిన నీటి వలన తగిన కాలములో మేఘమేర్పడును. సూర్యుడు మేఘములు మొదలైనవన్నియు విధాత (బ్రహ్మ -దైవము) చేత నిరూపింపబడినవే. మేఘము గజము సాగరము సస్యాధిపతి రాజు మంత్రి ఏ సంవత్సరమున ఎవరుందురో వారందరు విధాత చేత నిర్ణయించబడియున్నారు. నీరు మొదలైన . పంటలు గడ్డి మొదలు గాగల వన్నియు యుగయుగమున ప్రతికల్పములో ప్రతి సంవత్సరము నిర్ణయించబడియే ఉన్నవి.
గజము తనకిష్టమున్నంత జలము సముద్రము నుండి తొండముతో తీసుకొని మేఘమునకిచ్చును. (ఇంతకు ముందు జలము గ్రహించువాడు సూర్యుడని చెప్పి ఇక్కడ ఇట్లు చెప్పుట ఒక సంకేతమని భావించవలెను. సూర్యకిరణములు భూమి మీది జలము గ్రహించుట ఏనుగు తొండముతో పీల్చినట్లు అన్న పోలికను పురాణకర్త ఇట్లు చెప్పియుండవచ్చును). మేఘము గాలి వలన ప్రేరణ పొంది తగిన కాలములో భూమి మీద అచ్చటచ్చట తగినట్లు వర్షించును. భగవంతునీ ఇచ్ఛవలన ఏర్పడిన ఈ మేఘ వర్షములకు వేరేదో ఒకటి ప్రతిబంధకము (ఆటంకము) కాజాలదు. జరిగినది జరుగుచున్నది జరుగుబోవునది గొప్పది చిన్నది మధ్యస్థాయిది అన్నియు భగవదిచ్ఛ వలననే జరుగును. సృష్టికర్తచేత నిరూపితమైన కర్మను ఎవడు నివారించగలుగును?.
భగవంతుని ఆజ్ఞచేత ఆ సృష్టికర్త (బ్రహ్మ) మొత్తము చరాచర జగత్తును సృష్టించేను. మొదలే భోజన పదార్థమును నిర్మించి తరువాతనే జీవుని సృష్టించెనని చెప్పబడినది. ఒక ప్రాణికి ఒక కర్మ అభ్యాసమై అది స్వభావముగా మారును. స్వభావమును బట్టి కర్మ చేయబడును. జీవకోటికి సుఖదుఃఖముల రూపమున కర్మల భోగము సంభవించును. పాపకర్మ ఫలమనుభవించు యాతనా శరీరము (నరకములో) తరువాత భూమిపైన జన్మించుట మరణము రోగములు శోకము భయముల యొక్క ఉత్పత్తి ఆపదలు విద్యలు కవిత్వ రచన కీర్త్యపకీర్తులు పుణ్యము చేయుటస్వర్గవాసము పాపమొనర్చుట నరకవాసము కర్మఫలభక్తి సంసార విముక్తి శ్రీహరి దోస్యముక్తి ఇవియన్నియు మనుష్యులకు కర్మ వలన ఘటించును.
జీవుల యొక్క అభ్యాసము శీలము కర్మ అను వానిని జనింపజేయువాడు {ఉత్పత్తికారుడు) భగవంతుడే. బ్రహ్మకు ఫల ప్రదాత కూడ స్వామియే. కావున సర్వము భగవంతుని ఇచ్ఛను బట్టియే ఏర్పడును. ఏ పరాత్పరుని చేత విరాట్టు (విశ్వము) తత్వములు ప్రకృతి జగత్తు కూర్మము శేషుడు ధరణి బ్రహ్మ మొదలుకొని గడ్డి వేరు వరకు నిర్మింపబడినదో - ఎవనీ యాజ్ఞచేత వాయువు కూర్మమును {తాబేలు) ఆ కూర్మము శేషుని ఆ శేషుడు భూమిని తలలోను ఆ భూమి చరాచర జీవకోటిని మోయుచున్నారో - ఎవని యాజ్ఞచేత జగత్తునకు ప్రాణమైన వాయువు ముల్లోకములలో నెల్లప్పుడు వీచుచున్నాడో - ప్రభాకరుడు చుట్టు తిరుగుచు భూలోకమునకు తన వేడి వెలుగు నిచ్చుచున్నాడో - అగ్ని కాల్చుట సర్వ జంతువులందు మృత్యువు సంచరించుట వృక్షములకు తగిన కాలములో పుష్పములు ఫలములు ఉత్పత్తి యగుట జరుగుచున్నవో - ఇప్పటికిని తమతమ స్థానములోనే సముద్రములు త్వరగా జలమును తమ క్రింది భాగమునకే ప్రవహింపజేయుచున్నవో - ఆ పరమాత్మను భక్తితో భజించుము. ఇంద్రుడు నిన్నేమి చేయ సమర్దుడగును? ఎవని బోమముడి విలాసము చేత బహు విధములైన బ్రహ్మాండములుద్భవించుచు లయించుచున్నవో - ఎన్ని విధముల విధులేర్పడుచున్నవో ఆ భగవంతుడు మృత్యువునకే మృత్యువు కాలునికి కాలుడు వీధికి విధి కూడ. ఓ తండ్రీ! అతనిని శరణుబొందుము. అతడు నిన్ను రక్షించును. జగత్సృష్టి కర్తయైన బ్రహ్మ జీవితములోని ఒక పగలు రాత్రి కాలములో ఇరువది యెనిమిది మంది ఇంద్రులు తమ స్థానము నుండి రాలిపోదురు. అంత సుదీర్ఘకాలము జీవించు బ్రహ్మ శక్తి కంటే నూట యెనిమిది యంతలు అధికుడు కూడ నిరుణుడు ఆత్మలకు ప్రభువైన భగవంతుని యొక్క కనురెప్పపాటు వలన (అంతకాలములో) పడిపోవును. ఇటువంటి పరమాత్మ యుండగా ఇంద్రపూజ యనునది వ్యర్ధమైన కార్యము. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించగా అక్కడున్న సభలోని మునులు భగవంతుని (శ్రీకృష్ణుని) ప్రశంసించిరి.
పుత్రుల చేతిలో ఓడిపోయిన మనుజులు పరుల చేతిలో ఓడిపోయినప్పుడు బాధపడినట్లుగాక) ఆనందపడుదురు కనుక నందుడు శరీరము పులకలెత్తగా కన్నుల నీరు గలవాడై ఆ నిండు సభలో హరము ప్రకటించెను.
శ్రీకృష్ణుని ఆజ్ఞను తెలిసికొని నందుడు స్వస్తి వాచసము చేసి క్రమముగా ఆ కార్యక్రమమునకు తగినట్లు బ్రాహ్మణవరణము (ఈ కార్యములు మీరు మీరు చేయుడు అని బాధ్యతలను ఆదర మర్యాదలతో అప్పగించుట) గావించెను. గోవర్ధన పర్వతమును మునీంద్రులను పండితులను బ్రాహ్మణోత్తములను గోజాతిని అగ్నిని భక్తి శ్రద్ధలతో పూజించెను. అగ్నీలో హోమము జరిపించెను. అట్లు పూజలు సమాప్తియైన తరువాత ఆ మహోత్సవములో నానావిధములైన మంగళ వాద్యములను మ్రోగించిన ధ్వని అంతట వ్యాపించెను. వెంట వెంట జయజయ అన్న శబ్దము శంఖములు మ్రోగించిన ధ్వని హరి హరీ అన్న శబ్దము ఏర్పడి విస్తరించేను. ముని పుంగవులు వేదములందలి మంగళకాండములను పఠించిరి. వందులలో శ్రేష్ఠుడు కంసునకిష్ట సచివుడైన డిండి యనువాడు ముందు నిలిచి మంగళకరమైన మంగళాష్టకమును గొంతెత్తి పఠించెను.
శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వత సమీపమునకు పోయి తన రూపము కన్న వేరైన ఒక రూపము ధరించి “ఓ నందరాజా! నీవర్పించిన వస్తువులను భుజించుచున్నాను. నేను గోవర్ధన పర్వతమును. నీకు నచ్చిన వరము కోరుకొనుము” అనెను. అపుడు తండ్రి ప్రక్కనున్న శ్రీకృష్ణుడు) “ఓ తండ్రీ! నీ ముందు నిలిచియున్న పర్వతమూర్తిని చూడుము. వరమును ప్రార్థించుము. నీకు మంగళమగును" అని నందునితో పలికెను.
ఆ గోపాలుడు (నందుడు} శ్రీహరి భక్తిని శ్రీహరి దాస్యముక్తిని వరముగా కోరుకొనెను. ఆ పర్వతమూర్తి నందుడర్పించిన పదార్థములను భుజించి అతనికి వరమిచ్చి అంతర్ధానము పొందెను. (అదృశ్యమయ్యెను).
గోపనాధుడైన నందుడు మునీంద్రులకు బ్రాహ్మణులకు వందీజనమునకు భోజనములు పెట్టించి అందరికి తగినంత ధనమును దానమిచ్చెను. ఇట్లందరికి దానమిచ్చి సంతోషముతో తన బంధువులను గోపాలురను రామకృష్ణులను తోడ్కొని తన గృహమున కేగెను. వందియైన డిండికి వస్త్రములను వెండి బంగారములను ఉత్తమాశ్వమును రత్నమును బహువిధములైన భోజన పదార్థములను ఇచ్చి సత్కరించెను.
ఆ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన మునులు బ్రాహ్మణులు. రామకృష్ణులను స్తోత్రమొనర్చి నమస్కరించి తిరిగి వెడలిపోయిరి. మొత్తము అప్సరసలు .గంధర్వులు కిన్నరులు రాజులు గోపాలురు (ఆహ్వానింపబడిన వారందరు) ఆదరముతో అందరు శ్రీకృష్ణునకు నమస్కరించి వెడలిపోయిరి.
నారదా! ఇంతలో ఇంద్రుడు తన పేరున ఆరంభించబడిన యజ్ఞము భంగమొనర్చి అనేక విధములుగా తనను నిందించిన శ్రీకృష్ణుని విషయము విని - దేవరాజు నన్న భావముతో కోపము వలన క్రింది పెదవి వణకుచుండగా రథమెక్కి మరుత్తులను మేఘములను వెంటబెట్టుకోనీ - మనోహరమైన బృందావనములో నున్న నందుని నగరమునకు పోయెను. యుద్ధము నందు విశారదులైన (నేర్పుగలవారు) సర్వదేవతలు శస్త్రములు అస్త్రములు చేత బట్టుకొని రథములెక్కి కోపముతో నింద్రుని వెనుక పోయిరి.
హోరుమని వీచుచున్న గాలి వలన ఏర్పడిన ధ్వనుల వలన, ఉరుముచున్న మేఘముల ధ్వని వలన భయము గల్గించు దేవతా సైన్యపు ధ్వని వలన నందుని నగరము గడగడలాడిను. ప్రజలందరును నందుడును మిక్కిలి భయపడిరి. తన వారికే ప్రమాదము సంభవించునో యన్న భయదుఃఖములతో నందుడు రహస్య ప్రదేశమునకు భార్యను పిలిచి నీతిశాస్త్రమునందు ఆరితేరిన వ్యక్తిగా ఈ తీరుగా పలికెను.
నంద ఉవాచ - సందుడిట్లు పలికెను :
ఓ యశోదా! ఇటురమ్ము, రోహిణీ! నామాట వినుము. ఓ ప్రియురాలా! (యశోదనుద్దేశించి అన్నమాట) బలరామకృష్ణులను తీసుకొని ఈ ప్రజము నుండి దూరముగా వెళుడు. భయముతో ఆందోళన పడుచున్న బాలురు బాలికలు స్త్రీలు అందరు వెడలిపొండు. - బలవంతులైన గోపాలురు మాత్రము నావద్ద నిలువుడు. ఈ ప్రాణసంకట ప్రదేశము నుండి వెనుక (తర్వాత) మేము కూడ బయలుదేరి
రాగలము. గోపాలనాధుడు (నందుడు) ఇట్లు పలికి భయముతో శ్రీహరిని స్మరించెను. చేతులు జోడించి భక్తితో తలవంచీ సామవేదములో కాణ్వశాఖలో చెప్పబడిన స్తోత్రముతో శచీపతిని (దేవరాజగు ఇంద్రుని) ఇట్లు స్తుతించెను.
నంద ఉవాచ - నందుడిట్లనెను :
ఇంద్రుడు సురపతి శక్రుడు దితిపుత్రుడు సప్తమరుత్తుల కగ్రజుడు, సహస్రాక్షుడు (వేయి కన్నులు గలవాడు) భగాంగుడు - కశ్యపాంగజుడు (కశ్యప ప్రజాపతి పుత్రుడు} బిడౌజుడు, సునాసీరుడు, మరుత్వంతుడు (మరుత్తులు గలవాడు) పాకశాసనుడు, జయంత జనకుడు(జయంతుడనువాని తండ్రి) శ్రీమంతుడు శచీ నాథుడు దైత్యసూదనుడు, వజ్రహస్తుడు, కామసఖుడు {మన్మథుని మిత్రుడు గౌతమీ వ్రత భంగము చేసినవాడు, వృత్ర సంహారము చేసినవాడు, వాసవుడు, దధీచి దేహమును భిక్షమెత్తినవాడు, విష్ణువు, వామనుని అన్న, పురుహూతుడు, పురందరుడు, దీవస్పతి (స్వర్గరాజు) శతమఖుడు సుత్రాముడు గోత్రభేదకుడు (పర్వతములు. చీల్చినవాడు) విభువు, లేఖర్షభుడు (దేవతలలో శ్రేష్ఠుడు) బలరాతి (బలరాక్షసుని శత్రువు) జంభభేది (జంభుని చీల్చినవాడు) సురల కాశ్రయమైనవాడు, సంక్రందనుడు దుశ్చ్యవనుడు, తురాషాట్టు, మేఘవాహనుడు, ఆఖండలుడు, హరిహయుడు (ఆకుపచ్చని గుర్రాలవాడు) నముచి ప్రాణనాశకుడు వృద్ధశ్రవుడు, వృషుడు, దైత్యులదర్పమును నశింప జేసినవాడు. ఈ నలుబది ఆరు నామములు పాపమును నశింపజేయునవి. కౌధుమ ఋషి ప్రోక్తమైన ఈ స్తోత్రమును ప్రతిదినము పఠించిన నరుడు మహాపదలో వజ్రహస్తుడైన ఇంద్రుని చేత రక్షింపబడును. అతివృష్టి శిలలపర్చము భయంకరమైన పిడుగుపాటు అను వాటి భయములు మానవునకేనాడు ఉండదు. స్వయముగా - ఇంద్రుడు వానీని రక్షించును. ఓ నారదా! ఎవనీ యింటిలో ఈ స్తోత్రముండునో ఎవడీ గోత్రమునేరుగునో ఆ పుణ్యాత్ముని ఇంటికి పిడుగుపాటు శిలావర భయము కలుగదు.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణమూర్తి పలికెను :
నందుడు పఠించిన స్తోత్రమును విని శ్రీకృష్ణుడు కోపము చెంది బ్రహ్మతేజస్సుతో వెలుగుచు తండ్రికి నీతిని చెప్పెను. “ఓ పిరికివాడా! ఎవనీనీ స్తుతించుచున్నావు ? ఎవడా యింద్రుడు ? నా వద్ద భయము వదిలి పెట్టుము. సగము క్షణములో వానీనీ లీలగా బూడిదగా చేయుటకు సమర్ధుడను నేను. ఆవులను ఎద్దులను దూడలను బాలబాలికలను స్త్రీలను భయబాధితులందరినీ గోవర్ధన పర్వతము యొక్క గుహలో చేర్చి నిర్భయముగా నుండుము”.
బాలుడైన కృష్ణుని మాట విని సంతోషముతో కూడిన నందుడు అట్లే చేసెను. అపుడు శ్రీహరి ఆ పర్వతమును కర్రను పట్టుకొన్నట్లు ఎడమచేతితో ఎత్తి పట్టుకొనెను.
ఓ నారదా! ఆ ప్రదేశము రత్నముల తేజస్సుతో ప్రకాశించుచున్నప్పటికిని, హఠాత్తుగా హోరుషుని వీచిన గాలితో ధూళిరేగి వ్యాపించి - ఆకాశమున మేఘములు క్రమ్ముకొని చిమ్మచీకటి ఏర్పడెను. ఆ బృందావనములో ఎడతెగని అతివృష్టి, రాళ్లతోన, పిడుగులు పడుట, చుక్కలు రాలుటతో అంతయు భయంకరముగా నుండెను. ఇంతటి వరము గోవర్ధన పర్వతమునకు లోకగనే దూరముగా చెల్లాచెదురయ్యెను, ఇంద్రుని మొత్తము ప్రయత్నము వ్యర్ధమయ్యెను. తన ప్రయత్నములో (తాను పూనిన కార్యములో) అతడు శక్తిచాలని వాడయ్యెను.
తన ప్రయత్నమంతయు వ్యర్థమగుట చూచి ఇంద్రుడు వెంటనే కోపించి దధీచిముని ఎముకలతో నిర్మించబడినదియు ఎన్నడెక్కడ వ్యర్థము కానిదియునగు వజ్రాయుధమును చేతిలోనికి {విసరుటకై తీసుకొనెను. వజ్రాయుధమును గ్రహించిన యింద్రుని జూచి శ్రీకృష్ణుడు నవ్వి అతి భయంకరమైన వజ్రముతో కూడిన ఇంద్రుని చేతిని స్తంభింపజేసెను. (కదలకుండ జేసెను}. ఎత్తి వచ్చిన దేవగణమంతయు వ్యర్థమగునట్లు అందరినీ స్తంభింపజేసెను. అప్పుడు వారందరు గోడమీది బొమ్మలవలె కదలకుండ నిలిచిపోయిరి. శ్రీహరి చేత భగ్నము చేయబడిన (కదలకుండ బిగుసుకపోయిన} ఇంద్రుడు అప్పటికప్పుడు బుద్ధి పనిచేయని మాంద్యము (చైతన్యము లేని జడస్థితి) పొందెను. ఆ దశలో అతనికి సర్వము కృష్ణమయముగా కన్పించెను.
రెండు హస్తములు గలవాడు మురళిని ధరించినవాడు రత్నాలంకారములతో అలంకరింపబడినవాడు పీతాంబరధారీ రత్నసింహాసనమున కొలువై యున్న వాడు చిరునవ్వుతో ప్రసన్నముగానున్న ముఖమండలము గలవాడు భక్తులననుగ్రహించవలెను త్వరలో నున్నవాడు సర్వాంగములందు చందనము గలవాడగు స్వామీ, కనుపించుచున్న చరాచర ప్రపంచమంతటను చంద్రునకు కన్పించగా పరమాద్భుతమైన ఆదృశ్యమును చూచి వెంటనే మూర్ఛ పొందెను. ఆ స్థితిలోనే పూర్వము గురువగు బృహస్పతి ఉపదేశించిన మంత్రమును జపించెను.
మంత్రము జపించుచున్న సందర్భములో ఇంద్రునకు వేయి రేకుల పద్మము దాని నుండి తీవ్రముగా ఉప్పొంగి వచ్చిన ప్రకాశము కన్పించెను. ఆ జ్యోతిర్మండలము నడుము మీక్కిలీ మనోహరమైన దివ్యరూపము కన్పించెను. క్రిక మేఘమును మించిన శ్యామ సుందరమూర్తి శ్రేష్ఠ రత్నములతో నిర్మించబడిన ధగధగలాడు మకరకుండలములను ప్రభలు విరజిమ్ముచున్న మకర ముఖము గల మణి కిరీటమును ధరించినవాడు, కౌస్తుభమణితేజస్సుతో ప్రకాశించుచున్న కంఠము వక్షస్మలము గలవాడు మణుల కేయూరములు {భుజకీర్తులు) కంకణములు మణినూపురములు {కాలియందెలు) ధరించినవాడు అగు పరమాత్మను. తన అంతరాత్మలోను బయటను సమానముగా దర్శించి ఇంద్రుడిట్లు స్తుతించెను.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను :
అక్షరుడు (నాశరహితుడు) అన్ని లక్షణముల చేత అతిశయించినపరబ్రహ్మయైన వాడు - జ్యోతిరూపమున భాసించువాడు - అనాదిగానున్న వాడయ్యును నిత్యనూతనుడు – త్రిగుణములకతీతుడు నిరాకారుడనుపించుకోనీయు భక్తులు ధ్యానించుటకొరకు వారిసేవలందుకొనుట కొరకు తన సంకల్పము వలన నానారూపములు ధరించు అనంతమూర్తి - నాలు యుగములందు క్రమముగా తెలుపు.. ఎరుపు పసుపు నలుపు వన్నెలు గలవాడు - సత్య (కృత యుగమున తెల్లని తేజోమయ రూపముతో సత్యస్వరూపియు, త్రేతాయుగమున కుంకుమవర్ణముతో బ్రహ్మతేజస్సుతో వెలుగువాడును, ద్వాపరయుగమున పీత (పసుపుపచ్చ) వర్ణముతో పీతాంబరముతో శోభించువాడును, కలియుగమున నల్లనివన్నెతో కృష్ణరూపమున నున్న పరిపూర్ణతముడు (సర్వమంగళ గుణములు సర్వశక్తులు నిండుగా గలవాడు) నైన ప్రభువును సేవించితిని, క్రొత్తగా వర్షించు మేఘము వలె శ్రేష్ఠమైన శ్యామ వర్ణముతో సుందర విగ్రహము గలవాడు, నందుగోపుని ఏకైక పుత్రుడు యశోదనానంద పరచు సుపుత్రుడైన ప్రభువునకు నమస్కరించుచున్నాను.
గోపికల మనస్సులను దొంగిలించినవాడును, రాధాదేవికి ప్రాణముల కన్న మిక్కిలి ఇష్టుడైన స్వామియు, ఆసక్తితో వినోదముగా ధరించిన మురళిని మ్రోయించుచున్నవాడును, రత్నాలంకారములతో అలంకరింపబడిన సాటిలేని రూపముతో కోటిమన్మధుల సౌందర్యమును ధరించియున్న శాంతుడును అగు ప్రభువునకు నమస్కరించుచున్నాను. బృందారణ్యములో నొకచోట రాధతో క్రీడించుచున్నవాడును, ఇంకొకచోట జనులు లేని అరణ్యమున రాధ వక్షస్థలమున విలసిల్లువాడును, వేరొక చోట రాధతో జలక్రీడలాడుచున్నవాడును, ఒకచోట రాధాదేవి కొప్పుముడుచు చున్నవాడును, ఇంకొక చోట రాధాదేవి పాదములకు లత్తుకు పారాణిగా అలంకరించుచున్నవాడును, ఇంకొక చోట సంతోషముతో నమిలెడి తాంబూలము స్వీకరించుచున్న వాడును, ఇంకొక చోట పుష్పమాల యల్లి రాధాదేవి కర్పించుచున్నవాడును, ఒక చోట రాధాదేవితో రాసమండలమున కేగుచున్నవాడును, ఇంకొక చోట రాధాదేవి అర్పించిన పుష్పమాలను కంఠమున ధరించువాడును, - . ఒకచోట గోపికలతో బాటుగా విహరించుచున్నవాడును, రాధను చేతబట్టుకోని ఒకచోట ఆమెను విడిచి మరియొక చోట నొంటరిగాను విరహించుచున్న స్వామికి నమస్కరించుచున్నాను.
(ఇంతవరకు రాధాదేవితో విహరించిన విధము స్తుతించి ఇప్పుడు బాల్యలీలలను స్తుతించుచున్నాడు). బ్రాహ్మణపత్నులు తెచ్చి అర్పించిన అన్నమునోకచోట భుజించువాడును, మరియొకచోట గోపబాలురతో కలిసి తాళఫలములు {తాటిపండ్లు) భుజించుచున్నవాడును, ఇంకొకచోట సంతసముగా గోపికల వస్త్రములపహరించుచున్న వాడును, బాలకులతో బాటు ఒకచోట గోబృందమును మేతకు పిలుచున్నవాడును, ఒకచోట కాళీయుని తలమీద పాదము పెట్టుచున్నవాడును {పడగలపై నాట్యమాడుచున్నపాడు సంతోషముతో నొకచోట వినోదార్థము చేత బట్టిన మురళీనీ మ్రోయించుచున్నవాడును, ఒకచోట గోపబాలకులతో కూడి రమ్యుమైన సంగీతము పాడుచున్నవాడును అగు శ్రీహరిని దర్శించి స్తుతించుచున్నాను. ఇట్లు భయభక్తులతో నింద్రుడు స్తోత్రరాజము పఠించి స్తుతించి శ్రీకృష్ణునికి నమస్కరించెను.
ఏకాదశాక్షరములు గల (ఇంద్రుడు జపించిన) మంత్రమును సర్వలక్షణములు గల కవచమును పూర్వము తపస్సొనర్చుచున్న బ్రహ్మకు కృపతో కృష్ణుడుపదేశించెను. దానిని బ్రహ్మ పుష్కరక్షేత్రమున తన పుత్రుడైన ప్రజాపతికుపదేశించెను. అతడు ఆంగిరసునకు ఆంగిరసుడు బృహస్పతికి ఉపదేశించెను. ఓ నారదా! అట్టి మహామంత్రమును ఇంద్రునకు వృత్రాసురునితో యుద్ధము సంభవించినపుడు బృహస్పతి ఇంద్రునకుపదేశించెను.
ఇంద్రుడొనర్చిన ఈ స్తోత్రమును నీత్యము భక్తితో నెవడు పఠించునో వాడు శ్రీహరి యందు దృఢమైన భక్తిని పొంది అంత్యమందు శాశ్వతమైన దాస్యముక్తిని పొందును. జన్మము మరణము ముసలితనము వ్యాధులు శోకములు అను సంసార బంధముల నుండి మానవుడు విడుదల పొందును. కలలో గూడ యమదూతలు యమలోకమును చూచుట సంభవించదు.
నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ఇంద్రుని స్తోత్రవాక్యములను విని లక్ష్మీదేవికి నివాసస్థానమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై (దయదలచి) ప్రీతితో నతనికి వరమిచ్చి గోవర్ధన పర్వతమును భూమిపై నిలిపెను. ఇంద్రుడు శ్రీహరికి నమస్కరించి తన గణములతో వెడలిపోయెను. పర్వతగుహలో నింతవరకు నివసించిన గోపాలాదులందరు గుహనుండి బయటకు వచ్చి తమతమ గృహములకు పోయిరి. వారందరీఅద్భుత కర్మతో శ్రీకృష్ణుని , పరిపూర్ణతముడైన ప్రభువుగా {పరమాత్మగా భావించిరి. శ్రీకృష్ణుడును ప్రజములోని వారినందరిని ముందుంచుకొని అందరినీ బయలుదేరదీసి తన గృహమున కేగెను. అపుడు సందుడు సనాతనుడైన పరబ్రహ్మయే తనకు కుమారుడైనాడనీ భక్తి ఆనందములతో శరీరమంతయు పులకలెత్తగా కన్నులలో ఆనంద బాష్పములు నిండగా ఇట్లు స్తుతించెను.
నంద ఉవాచ - నందుడనెను :
గోజాతికిని బ్రాహ్మణులకును హితము కూర్చువాడును జగత్తునకు (జగతిలోని సర్వజీవకోటికి) హీతరూపుడును, గోవిందుడును (వేదాంతవాక్యముల చేత తెలియబడువాడు, వేదములను, పాతాళగత భూమిని పొందినవాడు! ఆగు కృష్ణునకు, తపస్సులకు వేదములకు విప్రులకు జ్ఞానమునకు హితము గూర్చువాడు గాన బ్రహ్మణ్యుడని కీర్తింపబడు వానికి మరల మరల నమస్కారములు.. అనంత కోటులు గానున్న బ్రహ్మాండములు నివాస స్థానములుగా నున్న వాడును విస్తారమైన గొప్పనైన ఆకారము గలవాడును బ్రహ్మణ్య దేవుడన బడుచున్న నీకు నమస్కారము. చేప మొదలగు సర్వ దేహములు ధరించు జీవకోటికి తద్రూపుడవై జీవుల కర్మలకు సాక్షిరూపుడిపై అంతట నిండియు కర్మాదులంటనివాడవై త్రిగుణాతీతుడవై నిరాకారుడవగు నీకు నమస్పులు, సూక్ష్మమున కన్న సూక్ష్మము స్థూలము కన్న మిక్కిలి స్థూలమునగు స్వరూపము గలవాడును సర్వేశ్వరుడు నత్ అనత్ రూపమైన నర్వ పదార్థములకు ఉత్పత్తి స్థానము లయస్థానమును - సర్వజ్ఞానము కలవాడును తేజోరూపుడవగు నీకు నమస్కారము. విశ్వరూపమున మిక్కిలి ప్రత్యక్షమూర్తియు యోగులకు ధ్యానగోచరుడును బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు నమస్కరింపదగీన నిత్యరూపియు నాలు యుగములందు క్రమముగా తెలుపు ఎరుపు పసుపు నలుపు వర్ణములు నామములు గుణములు గలవాడును బ్రహ్మ క్షత్రీయాది చతుర్వర్ణములకు నిలయమైన వాడును యోగియు యోగ (ధ్యాన) రూపుడును యోగులకును గురువైన వాడును అణిమాద్యష్ట సిద్ధులకు ప్రభువును సర్వము సిద్ధించిన వాడును సిద్ధులకు గురువునగు నీకు నమస్కారము.
వేదపాఠకుడగు బ్రహ్మయు, పాలన దక్షుడగు విష్ణువును, జ్ఞానప్రదాతయగు రుద్రుడును వేయి తలల శేషుడును, ధర్మపాలకుడగు ధర్మదేవతయు, తేజోమూర్తియగు సూర్యుడును, విఘ్ననాశకుడగు గణపతియు, యోగియగు షణ్ముఖుడును, ననక సనందనాదులు బ్రహ్మ మానసపుత్రులందరును, సాంఖ్య దర్శన ప్రవక్త సిద్ధేంద్రులకు పరమ గురువగు కపిలుడును, నర నారాయణ మహరులును ఏ పరాత్పరుని స్తుతించుటకు సమర్థులు కారో అట్టి పరమాత్మను ఇతరులైన జడబుధులెవరు స్తుతించగలరు.
నాలు వేదములు లక్ష్మీ సరస్వతులు రాధాదేవియు స్తుతింప నశక్తులైనప్పుడిక వారి దయ వలన కొద్దీ జ్ఞానము పొందిన విద్వాంసులేమీ స్తుతింతురు.
ఓ పరబ్రహ్మ! దీనబంధూ! కరుణా సముద్రుడా! క్షణక్షణము చేయుచున్న నాయపరాధములన్నిటిని క్షమించుము. ఈ సంసార సముద్రమున పుణ్యతీర్థమునందు నేనొనర్చిన తపస్పులకు ఫలముగా సనాతనుడవగు నీవు నాకు పుత్ర రూపమున లభించితివి. ఇక నాకు నీ పాద పద్మములందు దృఢభక్తిని దాస్యముక్తిని నాకు ప్రసాదింపుము.
సృష్టికర్త పదవి గాని దేవస్థితి గాని సాలోక్యాది ముక్తులు గానీ నీ పాదపద్మ దాస్యము యొక్క పదహారవ భాగమునకును సరిరావు. ఆ స్థితిలో విజ్ఞులు ఇంద్ర పదవినో దేవత్వమునో సిద్ధులను గాని స్వర్గమును గాని రాజపదవి గాని చిరంజీవ స్థితినిగాని పొందదగినవిగా లెక్కింతురా??
ఓ ఈశ్వరా! పైన చెప్పబడిన బ్రహ్మత్వము మొదలగునవి అన్నియు కలిసి కూడ నీ భక్తునితో కలిసియుండు కాలములోని సగము క్షణమునకును సరి వచ్చునా?! నీ భక్తుడు నీయంతవాడు. అతని మహిమ నూహింపనవడు సమర్థుడు ? ఆ భక్తునితో సగము క్షణము సేపు మాట్లాడినచో దానితో నతడు సంసార సాగరపు నొడ్డునకు చేర్ప సమర్థుడు. భక్త సంగము వలన నిన్ను గూర్చి అనేక విధములుగా భక్తి క్రియలు చేయగల్గుదుము. నీ భక్తుడను మేఘము యొక్క సంభాషణమను నీరు తడుపుట చేత { వీభక్తుడొక మేఘము, అతని సంభాషణము జలము. ఆ జలము తడుపుట చేత) నీ యందలి భక్తి మాకు వర్ధిల్లును. భక్తులు కాని వారితో కలిసి మాట్లాడుటయను తాపము చేత మా లోని భక్తి యన్న మొలక ఆ క్షణము లోనే ఎండిపోవును.
మనస్సులో జనించి విస్తరించిన శ్రేష్ఠమైన నీ పాదభక్తి యను అంకురము (మొలక) భక్తుల సంభాషణ వలన తెలియవచ్చిన నీ కల్యాణగుణముల స్మృతి (జలము) చేత తడుపబడీ ఆ క్షణముననే స్ఫుటముగా వృద్ధి పొందును. ఆ భక్తియను అంకురము ప్రతిదినము క్షణక్షణము పెంచదగినదే గానీ నశింపనీయరాదు. ఆ గుణ స్మృతి వలన బ్రహ్మభావన పొందిన భక్తుని ఉజ్జీవనము కొరకు హరీదాస్యమనెడి అత్యుత్తమ ఫలము నా గుణస్మృతి ఇచ్చును. దుర్లభమైన దాస్యముక్తిని పొంది హరీదాసుడాయెనా నిశ్చయముగా అతని చేత సర్వసంసార భయములు జయింప బడినవే సుమా!
ఇట్లు పలికి నందుడు శ్రీకృష్ణుని ముందట భక్తితో నిలిచెను. ఆ స్తోత్రమునకు ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు తన ముఖమున ప్రసన్నత స్పష్టమగుచుండగా నందుని వాంఛితమును వరముగా నతనికిచ్చెను.
ఇట్లు నందుడొనర్చిన స్తోత్రమును నిత్యము భక్తితో పఠించిన వ్యక్తి సుదృఢమైన హరి భక్తిని పొంది అప్పుడే హరిదాస్యమను ముక్తిని పొందును. ధరాదేవితో బాటు ద్రోణుడు తీర్ధ ప్రదేశమున తపస్సు చేయగా దుర్లభమైన హరి షడక్షర మంత్రమును సర్వవిధ భయముల నుండి రక్షించు కవచమును స్తోత్రమును బ్రహ్మ అతనికుపదేశించెను. ఆ స్తోత్ర మంత్ర కవచములనే బ్రహ్మాంశతో నున్న సౌభరీముని పుష్కర క్షేత్రమున తపస్సు చేయుచున్న నందుని పై.దయతో అతని కుపదేశించెను. ఏ వ్యక్తికి ఏ విద్య (మంత్రము) పరంపరగా గురూపదేశమున లభించునో ఆ మంత్రమును స్తోత్రమును కవచమును అతడు విడువడు. (మంత్రము, స్తోత్రము కవచము గురువు ఇష్టదైవము పరంపరగా వచ్చువానిని విడువ గూడధు). ఇట్లు ఈ స్తోత్రము అద్భుతమై ఆత్మకు సుఖమిచ్చునది మోక్షమిచ్చునది సంసార బంధములను విడిపించునది, సారమైనదీ ఐన శ్రీకృష్ణ చరిత్రము చెప్పబడినది.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన, ఇంద్రయాగ భంజసమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.
