4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

30 - రాధా ప్రశ్నము

నారద ఉవాచ - నారదుడు పలికెను :

ఓ మహామునీ! ఎంతటి అద్భుతము రహస్యమునైన కథ వింటిని! అష్టావక్రముని నిర్యాణము చెందగా భక్తులయందు వాత్సల్యము గల శ్రీకృష్ణుడేమీ చేసెను ?

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను :

శ్రీకృష్ణుడు మృతిచెందిన మునిని చూచి అగ్ని సంస్కారము చేయబూనెను. అతని శరీరమును తన వక్షస్థలమున చేర్చుకొని సామాన్య నరుని వలె భోరుమని ఏడ్చెను. చేతులతో ఆలింగనము చేసికొని పొంగిన వ్యామోహముతో గట్టిగా నలిపెను. అతని వజ్రాంగస్పర్శ వలన శవము నుండి బూడిద రాలేను. అష్టావక్రమహాత్ముని శరీరము ఆరవై వేల సంవత్సరముల నిరాహారము (ఉపవాసము) వలన రక్తమాంసములు ఎముకలు లేనిదిగా ఉండెను. అతనీ రక్తమాంసాస్టులు జఠరాగ్ని చేతనే కాల్చబడి ఉండెను. అతడు బ్రహ్మజ్ఞానము లేనివాడగుట వలన కేవల హరిపాద భక్తితో (ఉపవాసములు చేసి) అతడట్లయ్యెను.

మధుసూదనుడు శ్రీగంధపు కర్రలతో చితిని పేర్చి హోమము చేసి దుఃఖముతో ముని శరీరమును దాని పై పెట్టేను. శవముపై కట్టెలు పేర్చి చితికి అగ్ని ముట్టించెను. అది కాలుచుండగా క్షణకాలము స్వామీ మూర్ఛిల్లెను. ఆ మునీ దేహము భస్మము కాగా ఆకాశమున దేవ దుందుభులు మ్రోగెను. అప్పుడే ఆకాశము నుండి పుష్పవర్షము కురిసెను.

ఇంతలో ఆ ప్రదేశమునకు శ్రేష్ఠములైన రత్నములతో నిర్మించబడి వస్త్రములతో పుష్పమాలలతో అలంకరింపబడి మనోవేగముతో ప్రయాణము చేయునట్టి ఒక రథమక్కడ ఆవిర్భవించెను. దానీయందు శ్రీకృష్ణుని వంటీ రూప సౌందర్యము గల పారదులుండిరి. అది గోలోకము నుండి శ్రీహరి ముందు దిగెను. శ్రీకృష్ణునితో సమాన రూపము గల ఆ శ్రేషులైన పారదులు రథము నుండి త్వరగా స్వామి ముందు దిగి రాధాకృష్ణులకు ప్రణామములు చేసిరి. సూక్ష్మదేహమును ధరించిన ఆ మునీశ్వరునితో ఆ దంపతులకు నమస్కరింప జేసి ఆ మునీని రధమందుంచు కొని ఉత్తమమైన గోలోకమున కేగిరి.

ముని అట్లు గోలోకమున కేగగా బృందావనమున వినోదమనుభవించుచున్న ఆ సాధ్వి రాధాదేవి ఆశ్చర్యము పొంది జగదీశ్వరుని ఇటు ప్రశ్నించెను.

శ్రీరాధికోవాచ - రాధాదేవి ఇట్లనెను :

నాథా! అవయవములన్నియు వంకరగా నున్న ఈ మునీరాజెవ్వడు? మిక్కిలి పొట్టి రూపము గలవాడు తేజోవంతుడు చూచుటకసహ్యముగా నున్నాడే. అతని దేహము నుండి భస్మమెట్లు బయటకు వచ్చెను? ఎంత ఆశ్చర్యము! సాక్షాత్తుగా నీ పాద పద్మమునందు అగ్నివలె ప్రకాశించు ఆ తేజస్సు లీనమైనదే! రథమందు కూర్చుండి ఆ పుణ్యాత్ముడు వెంటనే గోలోకమున కేగినాడు కదా! ఆత్మారాముడవైన నీవతని కోసము భోరుమని ఏడ్చితివి. స్వయముగా కన్నుల నీరు నింపుకొని అతనిని సత్కరించితివి. ప్రభూ! వెంటనే ఈ విషయమంతయు నాకు వివరించి చెప్పుము.

రాధ మాట విని శ్రీహరి నవ్వి యుగాంతరమునకు చెందిన కథను చెప్పుటకారంభించేను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

ప్రియురాలా! అష్టావక్రునకు చెందిన ఈ రహస్యము అంతట విశేషముగా చెప్పుకోబడినదే. నీవు దీనిని మునుముందు ప్రసంగవశమున విద్వాంసుల ద్వారా వినగలవు. అష్టావక్రమునీంద్రుడు ముల్లోకముల యందు ప్రసిద్ధుడు. అతని జన్మకథచేత కీర్తిచేత జగత్రయము నీండినది.

శ్రీకృష్ణుని మాట విన్న వారికి ప్రియురాలైన రాధ మనస్సు చిన్న బుచ్చుకొని విచారముతో కంఠము పెదవులు దవడలు తడి ఆరిపోగా ప్రయత్నించి మధురముగా ఇట్లు పలికెను.

రాధికోవాచ - రాధ పలికెను :

దప్పిగొన్న వానీకి అమృతసముద్రము వలన మనస్సు తృప్తి చెందనప్పుడు ఇక గోష్పదమందలి ఉదకము (ఆవుడెక్క దిగబడి నంత గుంటలోని నీరు) ను పానము వలన తృప్తి కలుగునా! వేదములకు వేద పాఠకులకు చతుర్ముఖ బ్రహ్మకు ఆతని జనకుడైన మహావిష్ణువునకును నీవు ప్రభువువు. నీకన్న ఇంకొకడెవడు ఈ కథ చెప్పగలవాడున్నోడు? అన్న రాధ వాక్కులు విని కృష్ణుడు సంతసించి ప్రయత్నించి దాచదగిన పరమాద్భుతమైన ఆ రహస్యమును (కథను) ఇట్లు చెప్పెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

మనోహరీ! వినుము. చెప్పుట వలన వినుట వలన సర్వపాపములు నశించునట్టి పురాతనమైన ఇతిహాసమును నీకు చెప్పుదును. ముల్లోకములు జలముతో నిండి ఉన్న ప్రళయకాలమందు నా అంశయైన మహా విష్ణువు యొక్క నాభి కమలమునుండి నా అంశతోనే జగత్సృష్టికర్త యైన బ్రహ్మ ఉద్భవించెను. ఆ బ్రహ్మ మనసంకల్పము వలన మొదట అతనికీ నలుగురు పుత్రుల కలిగిరి. వారందరు బ్రహ్మతేజస్సుతో వెలుగుచు నారాయణ భక్తులైరి. ఐదు సంవత్సరముల వయస్సు గల ఆ శిశువులు అజ్ఞానుల వలె నగ్నముగా నుండి బాహ్యప్రపంచ జ్ఞానమెరుగక బ్రహ్మ తత్త్వ విశారదులుగా నుండిరి. సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు అను ఆ కుమారులను చూచీ బ్రహ్మ “కుమారులారా! సృష్టిచేయుడు” అని పలికెను. వారు పితృవాక్యముందు నిలువక నన్ను గూర్చి తపస్సు చేయుట కొరకు వనములకు వెళ్లిపోయిరి.

కుమారులట్లు వెళ్లిపోగా విధాత మనస్సులో విచారపడెను. పుత్రుడన్నవాడు తండ్రి చెప్పినట్లు చేయడేని తండ్రికి దుఃఖకారకుడగును.

పిదప బ్రహ్మ తన జ్ఞాన శక్తితో తన శరీరావయవములందు బ్రహ్మ తేజస్సుతో జ్వలించువారును వేదవేదాంగ వేత్తలును ఐన తపోధనులగు పుత్రులను సృష్టించెను. వారు అత్రి పులస్త్యుడు పులహుడు మరీచి భృగువు అంగిరసుడు క్రతువు పసిష్ఠుడు వోడుడు కపిలుడు ఆసురీ కవి శంకువు శంఖుడు పంచశీఖుడు ప్రచేతసుడు అన్న తపోధనులు. వారు బ్రహ్మ ఆజ్ఞతో బహుకాలము తపస్సు చేసి సృష్టిచేసిరి. వారందరు భార్యలను స్వీకరించి సంసారము చేయుటకున్ముఖులైరి. ఆ తపస్వులకు అందరికీ పుత్రులు పౌత్రులు కలిగిరి. సుందరము పుణ్య స్వరూపము బహుముఖము ముని వంశములను తరముగా కీర్తించునది ఐన ఆ కథ అటులుండనిమ్ము. ఓ సుందరీ! ప్రస్తుతాంశము వినుము.

ప్రచేతసునీ పుత్రుడైన అసితుడను తేజశ్శాలియగు మునిపుంగవుడు భార్యతో గూడి వేయి దేవతాసంవత్సరముల కాలము తపస్సు చేసెను. ఐనను సుతుడు కల్గలేదు. అప్పుడా ఋషి ప్రాణత్యాగమునకు పూనుకొనేను. “అతనికీ బోధచేయుటకు సత్యమైన అశరీరవాణీ ఇట్లు విన్పించెను. “ఓయీ! ప్రాణములెందుకు వదిలుచుంటివి. శంకరుని సన్నిధికేగి అతని ముఖతః మంత్రోపదేశము పొంది నీ కోరికను సిద్ధపరచుకొనుము. ఆ మంత్రాదిషానదేవత వెంటనే నీకు సాక్షాత్కరించును. ఆ అభీష్టములు తీర్చు దేవి యొక్క వరము వలన నీకు పుత్రుడు కలుగును ఇది సత్యము”. ఆ వాక్కులు బ్రాహ్మణుడు వినీ యోగులకును పొంది సాధ్యము కానీది సంసార రోగములు లేనిది ఐన శివలోకమున కేగెను. భార్యతో గూడీ ఆ యోగి భక్తితో శిరస్సు వంచి అంజలిపుటము (దోసిలి) బూనీ యోగులగు గురువగు శివుని ఇటు స్తుతించెను.

అసిత ఉవాచ - ఆసితుడిట్లు పలికెను :

“ఓ జగద్గురూ! నీకు నమస్కారము. మంగళము నిచ్చు శివునకు యోగీంద్రులకు యోగీశ్వరుడవు గురువులకు గురువగు నీకు నమస్కారము. మృత్యువుకు మృత్యురూపుడవై మృత్యువును సంసారమును ఖండించువాడా! మృత్యువునకు ప్రభువా మృత్యువుకు మూలమైనవాడా! మృత్యుంజయా! నీకు నమస్కారమగు గాక. కాలరూపమును (నిమేషము నుండి పరాంతము వరకు) లెక్కించు (గణించు) వారికిని, కాలమునకు, కొలనాథులకు మూలమైనవాడా! కాలమునకతీతమైనవాడా! కాలమునకు కాలకాలుడా! నీకు నమస్కారము. త్రిగుణాతీతో! ఆ త్రిగుణముల కాధారమైన వాడా! పంచభూత గుణములకు బీజమైనవాడా! ఆణిమాద్యష్ట గుణములు మోక్ష దశయందలి అష్ట గుణముల స్వరూపమైన వాడా! యోగులకు ఈశుడా! అష్టసిద్ధులు లభించిన వారికి బీజమైనవాడా! గుణవంతులకు గురువగు నీకు నమస్కారము. బ్రహ్మాస్వరూపా! బ్రహ్మవేత్త! బ్రహ్మధ్యాన తత్పరా! బ్రహ్మమను బీజస్వరూపముతో విలసిల్లు బ్రహ్మా కారణమైనవాడా! నీకు నమస్కారము”. మునీశ్వరుడు (అసితుడు) ఇట్లు స్తుతించి శివునకు నమస్కరించి బాష్పములు నిండిన కన్నులతో పులకాంకురముల గల శరీరముతో దీనుని వలె ముందు నిలిచెను.

అసితుడొనర్చిన ఈ శంకర స్తోత్రమును ఒక సంవత్సరము భక్తియుక్తుడై కేవలము హవిషము తినుచు (పులగము - బియ్యము కడుగనిది) పఠించినవాడు జైనీయు చిరంజీవియు విష్ణుభక్తుడు ఐన పుత్రుని పొందును. దరిద్ర దుఃఖము గలవాడు పఠించిన ధనౌఢ్యుడగును. మూగవాడు పరించిన పండితుడగును. భార్యలేనివాడు సుశీలయు పతివ్రతయునగు భార్యను పొందును. ఈ లోకమున సుఖముననుభవించి జన్మాంతమున శివ సన్నిధిని పొందును. ఈ స్తోత్రము పూర్వము బ్రహ్మచేత ప్రచేతసునికి, అతని వలన అతని పుత్రుడైన అసితునికి ఉపదేశింపబడినది.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను 

భగవంతుడైన శంకరుడు ముని స్తోత్రమును విని భక్తవత్సలుడు కనుక తన భక్తుడు బ్రహ్మ సంతానమైన అసితుని గూర్చి ఇట్లు పలికేను.

శంకర ఉవాచ - శంకరుడనెను :

“ఓ మునివరా! మనస్సు స్థిరము చేసికొనుము. నీ కోరిక నెరుగుదును. నీకు నా అంశతో నాతో సమానుడైన పుత్రుడు నీకు కలుగును. సత్యము. ప్రపంచవాసులందరికి మిక్కిలి దుర్లభమైన సాటిలేని ఒక మంత్రమును నీకిత్తును” అని పలికి నీ యొక్క షోడశాక్షర మంత్రమును (రాధాదేవి మంత్రము) స్తోత్రము పూజావిధానములను, సంసార విజయమనెడి అద్భుతమైన కవచమును వాటిని పురశ్చరణ చేయవలసిన విధముతో బాటు మునికి శంకరుడిచ్చెను. “నీకిష్టమైన వరమిచ్చుటకు దేవి ప్రత్యక్షము కాగలదు” అని పలికి రుద్రుడు మాటలు చాలించెను. మునీ శివునకు నమస్కరించి వెడలి పోయెను.

ఆ అసితముని ఆ పరమ మంత్రము నూరు సంవత్సరముల కాలము జపించెను. అప్పుడు నీవు సాక్షాత్కారమై అతనికి వరమిచ్చి యుంటివి. “నీకు మహాజ్ఞానియైన పుత్రుడు జన్మించగలడు కుమారా!” అని పలికి నా సన్నిధికి గోలోకమునకు వచ్చితివి. కొంతకాలమునకు ఆ అసితమునికి శివాంశ గల పుత్రుడు పుట్టెను. వాడెప్పుడును బ్రహ్మము నందే మనస్సు గలవాడు మన్మథునితో సమానమైన సుందరుడు దేవలుడన్న నామముతో నుండెను.

ఆ దేవలుడు సుయజ్ఞనృపతి కన్యను రత్నమాలావతి యన్న సుందరిని సర్వలోకులను మోహింపజేయునట్టి దానిని వివాహము చేసికొనెను. స్త్రీల నానందపరచుటయందు నేర్చుగల దేవలుడొమెతో అనేక స్థానములందు విహరించుచు నూరు సంవత్సరములు ఏకాంతమున రమించెను. ఆ ముని కొంతకాలము తరువాత ధర్మిష్ఠుడై శ్రీహరిని స్మరించుచు సర్వ సుఖములను పరిత్యజించి సంసార జీవితమును విరమించెను. ఆ తపోధనుడు వీరుడై ఒకనాటి రాత్రీ శయ్య నుండి లేచి తపస్సు కొరకు మనోహరమైన గంధమాదన పర్వతమున కేగెను.

పతివ్రత అగు అతని భార్య మేల్కొని తన భర్తను చూడక విరహాగ్నితో మిక్కిలి దగ్గురాలై శోకముతో మిక్కిలి దుఃఖించెను. శయ్యనుండి లేచుచు పడిపోవుచు మాటి మాటికి గొంతెత్తి ఏడ్చెను. ఆమె మనస్సు. కాలుచున్న పాత్రలోని ధాన్యము వలె (పేలపు గింజవలె) ఆయెను. ఆమె ఆహారము మానుకొని ప్రాణములను త్యజించెను. ఆమె తనయుడామెకు అగ్ని సంస్కారాది కర్మలు చేసెను.

భక్తుడగు దేవలముని జితేంద్రియుడై గంధమాదన పర్వత గుహలో వేయి దేవతా సంవత్సరముల కాలము తపస్సొనర్చెను. అప్పుడు దైవికముగా మన్మథుని వలె మిక్కిలి సుందరుడుగా నున్న అతనినీ కామాసక్తురాలైన రంభ చూచెను. ఆ జనరహిత ప్రదేశములో అతని వద్ద కేగిన రంభ ముల్లోకములందలి జనుల మనస్సులను మోహింపజేయునదే ప్రయత్న పూర్వకముగా - మంచి వేషము ధరించి అతనితో ఇట్లనెను.

రంభోవాచ - రంభ ఇట్లనెను :

ఓ సాధూ! కామినీ జనమునకు మనస్సును హరించునదైన నా వాక్యమును వినుము. ఈ కఠోర తపస్సును వదిలి సుఖదాయకురాలగు నన్ను భజింపుము. నీవు భూమి మీద వరింపదగిన పురుషులలో శ్రేష్టుడవు. స్వయముగా వరించి వచ్చిన సుందరిని నేను. మన్మథ తంత్రమునందు నేర్పు గల స్త్రీ పురుషుల యొక్క క్రొత్త కలయిక ప్రపంచమున దుర్లభము సుమా! భారత పర్వములో భూపాలుడు స్వర్గ ప్రాప్తికి మూలమైన యజ్ఞము చేయుచున్నారు. స్వర్గమందు భోగానుభవమే యజ్ఞమునకు కారణము. ఓ మునీ! భోగ సారభూతులము మేమే సుమా! నా స్తనముల జంటను నా ఊరువులను (తొడలను) సుందరమైన ముఖపద్మమును చిరునవ్వు బొమముడిపాటు గల దానిని చూచి ఎవడు సుఖము పొందడు ? స్త్రీరసమే (కలయిక) మునులకు కోరబడిన సుఖసారము. రసికురాలైన స్త్రీ యొక్క సుఖానుభవము అందున ఏకాంత ప్రదేశములో మిక్కిలి దుర్లభము. దేవజాతి గాని మనుష్యుడు గాని గంధర్వుడు రాక్షసుడు గాని రంభయొక్క సుఖమెరుగనివాడు రతీవంచితుడు (సుఖములో మోసగింపబడినవాడు).

ఎవడు ఇంద్రియ జయము గలవాడై ఏకాంతమున చేరవచ్చిన కాంతను భజించడో (పొందడో) పోడు శరీరమందున్న రోమముల సంఖ్య గల సంవత్సరముల కాలము కుంభీపాక నరకమున నివసించును. ఇది నిశ్చయము. ఆ స్త్రీని వధించిన ఫలమనుభవించువా ఆమె శాపము చేత నశించును. పూర్వము సృష్టికర్త మోహినీ శాపము వలన ముల్లోకములందు పూజింపదగని వాడయ్యెను. ఒక జారీణి కోరికతో పురుషుని జేరబోయి అతని చేత త్యజింపబడినచో (తిరస్కరింప బడినచో) భర్తను పుత్రులను బంధువులను హత్యజేసిన వానిని చూచినప్పటికంటే అధిక కోపముతో ఆ పురుషుని జూచును. జారిణి అందరిలో తాసు గోరిన జార పురుషునినే మిక్కిలి ప్రియునిగా దలంచును. ఒకవేళ వాని చేత పరిత్యక్తురాలైనచో వానిని చంపుటకును సమర్ధురాలగును. క్రొత్తగా హత్య చేయుటకు మరిగిన క్రూర జంతువుల కంటె జారిణి దుష్టురాలు. మాటి మాటికీ దయాహీనురాలు. జన్మజన్మకు దుష్పలితములు కల్గించునది. ఓ మునిరాజా! ధ్యానమును త్యజింపుము. ఇదిగో! నీ తపఃఫలమైన నన్ను ఏకాంతమున చేరవచ్చిన దానిని గ్రహించి చాలకాలము సుఖమనుభవించుము.


 

అతడు రంభ వచనము వీనీ భయముతో మనస్సు చెదరి సత్యమును హితమును చివరికి సుఖము కలిగించునట్టి నీతి సారమును ఆమెతో పలికెను.

దేవల ఉవాచ - దేవలుడనెను :

 “రంభా! వేద సారమైన ఉత్తమ వాక్యము చెప్పుచున్నాను వినుము. తపస్వులైన బ్రాహ్మణులకు కులధర్మమునకుచితమైన సత్యవాక్యమిది. యోగ్యమైన ఋతుకాలమందు మాత్రమే తన భార్యయందు బ్రాహ్మణుడు సుఖమనుభవించుట ధర్మము. అతడు ఇహపరలోకములందంతట మాటి మాటికీ పూజితుడగును. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు వీరిలో ఎవడు పరస్త్రీయందు ఆసక్తి కలవాడగునో ఆ అయోగ్యుని యందు లక్ష్మీ కోపము పొంది వాని గృహము నుండి వెళ్లిపోవును. ఈ లోకమున వాడతినింద్యుడు. స్వజాతి కర్మాచరణకును వాడధికారికాడు. పరలోకమున వాడు శతసంవత్సరముల వరకు అంధకూప నరకమున వసించును. కోరి వచ్చిన స్త్రీని గృహస్థుడు గ్రహించ వచ్చును గాని తపస్వీ స్వీకరింపరాదు. నీవు చెప్పిన కామినీ త్యాగదోషము శాపానుభవము పాపానుభవము గృహస్థునకే. జగత్కర్తయగు బ్రహ్మ విరక్తుడు గాడు భార్య గలవాడే. భార్యనే త్యజించి విరక్తులమైన మాకు నిన్ను త్యజించుట వలన ఎప్పుడును దోషము లేదు. తన భార్యను పరిత్యజించి ఎవడు పరస్త్రీని గ్రహించునో ఆ జీవన్మృతునకు (బ్రతికీ ఉండియు చచ్చినవానికి) యశస్సు ధనము ఆయుష్యముల యొక్క హాని జరుగును. భువిలో కీర్తిలేని వాని జీవితము నిష్ఫలము. ఇక తపస్వికి సంపదతో రాజ్యముతో శరీర సుఖముతో పనియేమి ? నిష్కాముడను వృద్ధుడను ఐన నాతో నీకేమి ప్రయోజనము? తల్లి! మంచివేషము సుందర రూపము గల యువకునీ చూచుకోమ్ము”. ఇటువంటి మాటలు విని అప్సరసలలో శ్రేష్టురాలైన రంభ కోపము పొంది భయపడి కదలుచున్న క్రింది పెదవి గలదై మరల ఇట్లు పలికెను.

రంభోవాచ - రంభ పలికెను :

సుందరమైన సంపెంగ పూవన్నెతో ప్రకాశించువాడు మన్మథుని వంటి అందగాడు తపో మహిమ వలన తేజస్సు గలవాడు మంచి వేషము గల పురుషుడు స్త్రీలకు నచ్చినవాడు. నిన్ను విడిచి ఎవని వద్దకు పోదును? నీకన్న వేరుగా పురుషుడెవడున్నాడు? మన్మధపీడితురాలైన జారిణీ నిన్ను విడిచి ఎవలె బ్రతుకును? ఓ బ్రాహ్మణా! కామాగ్ని దగ్గురాలనైన నన్ను త్వరగా భజించుము. అరటి చెట్టును మదగజము నశింపజేసినట్లు నీవలన నన్ను మన్మధుడు నశింపజేయును. ఓ వేదవేత్తలలో శ్రేష్ఠుడా! నా కోరిక తీర్చనిచో నిన్ను శపింతును. చెప్పుము. నన్ను గాని దారుణమైన శాపమును గాని త్వరగా గ్రహింపుము. ప్రాణములు దగ్ధమైనవి. మనస్సు దగ్ధమైనది. తన ఆత్మగానీ దగ్డమెల్లవేళల కానిమ్ము. క్రొత్త శృంగారమను అమృతపానము వలన పూర్ణానందమును మానవుడు పొందగలడు. మనో దుఃఖము చేత దుఃఖారుడైన వ్యక్తి నిశ్చయముగా ఒకనిని శపించిన యెడల ఆ శాపమును ఖండించుటకు సృష్టికర్తయైన విధాతకును శక్తిచాలదు.

ఆ ద్విజుడు రంభ వాక్కులు విని మౌనముగా నుండి ఏమీ పలుక లేదు. భగవద్ధ్యానములో మగ్నుడయ్యెను. అప్పుడామె కోపముతో అతనిని శపించెను. “ఓయీ! వంకర బుద్ధిగలవాడా! నీ శరీరము అన్ని అవయవములందు వంకరదనము గలదియు కాటుకవంటి రంగు గలదియు రూపయౌవనములు లేనిదియు, మీక్కిలి వికార రూపముతో ముల్లోకములలో అసహ్యించుకోనునదియు అగుగాక. నీ పూర్వ తపస్సు వెంటనే నశించుగాక” అనీ ఆ జారిణి కామముతో పలికి కోరిన లోకమునకు (మన్మధలోకము) వెళ్లిపోయెను.

వెంటనే మునీంద్రుడు ధ్యానములో శ్రీహరి పాదములను దర్శించలేకపోయెను. నా పాదరవిందముల ఎడబాటు వలన ఉద్వేగము పొంది పూర్వపుణ్యముల చేత వర్ణితమై వికారమైన తన అంగమును చూచుకొని దుఃఖముతో అగ్నికుండము సిద్ధము చేసి అందులో పడి మరణించుటకు పూనుకొనెను. అప్పుడు నేను దర్శనమిచ్చి దివ్యజ్ఞానము బోధించి వరమిచ్చితిని. ప్రేమతో ఓదార్చితిని. అప్పుడతడు శాంతిపొందెను. ఆ మహాముని యొక్క అష్టాంగములు వక్రముగానుండుట చూచి ఆసక్తితో వెంటనే “అష్టావక్రా!” అని సంబోధించి నామకరణము చేసితినీ. నా వాక్యముననుసరించి ఇతడు త్వరగా మలయద్రోణికి వచ్చి అరవై వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను. ఓ ప్రియురాలా! (రాథా!) తపస్సు ముగిసిన తరువాత నా భక్తుడు నాతో కూడియున్నవాడుగా చేయబడెను.

ప్రళయకాలమున మొత్తము సృష్టి నశించినను నా భక్తుడు నశించడు. సుదీర్ఘకాల తపస్సు వలనను మండుచున్న జఠరాగ్ని వలనను ఆ ముని యొక్క గర్భము ఆహారము త్యజించుట వలన భస్మముతో నిండినది. ప్రియురాలా! నేనిప్పుడు ఈ ముని కారణముగానే మలయద్రోణికి వచ్చితిని. అష్టావక్రుని కంటే వేరొకడంతటి భక్తుడు నాకింతకు ముందు లేడు. ఇక ముందుండబోడు. బ్రహ్మయొక్క మునిమనుమడగు ఈ ముని ఇంతటి తపోనిష్ఠుడు. పూర్వము జారిటీ శాపము వలన బ్రహ్మ కూడ పూజానర్హుడి నిష్ఫలుడయ్యెను. ఇట్లు ఆ మహాత్ముని మొత్తము రహస్యము నీకు చెప్పితిని. ఇది సుఖమును పుణ్యములను ఇచ్చును. ఈ చరిత్ర గూడమైనది. ఇంకేమి వినగోరుచున్నావు?

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధా ప్రశ్న అసు ముప్పదియవ అధ్యాయము సమాప్తము.