4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
97 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ :
అను!! శ్రీనారాయణుని వచన మిట్లా –
వెళ్ళిపోతున్న ఉద్దవుని చూచి' శ్రీహరి ప్రియురాలు భయపడింది. మనసులో బాధపడుతూ ఆసనం నుండి త్వరగా లేచింది. (1) ఉద్వేగం చెంది ఆమహాసతి గోపికలతో కూడి త్వరగా ఆతని తల పై చేతిని ఉంచి ఆతనికి శుభాశీస్సులను ఇచ్చింది, (2) నిగనిగలాడే గరికను అక్షతలను తెల్లని ధాన్యాన్ని, శుభకరమైన పుష్పాన్ని ఇచ్చింది. పండు, ఆకు, పెరుగు ఇచ్చింది. పేలాలు చల్లింది (3) అద్దాన్ని చూపింది. చిగుళ్ళతో కూడిన పూర్ణకుంభాన్ని చూపింది. పండు, గంధము, సిందూరము కస్తూరి, చందనములను ఇచ్చింది. (4) పూలమాలను, దీపాన్ని, ఎర్రని గంధాన్ని ఇచ్చింది, ఓ బ్రాహ్మణశ్రేష్ఠ. పతిపుత్రులు కల ఆ సాధ్వి బంగారము, వెండి ఇచ్చింది. (5) ఆమహాసాధ్వి హితకరమైన, సత్యమైన, శుభప్రదమైన మాటను ఆతనితో అంది. హృదయంలో బాధపడుతూ, పడుతున్న కన్నీళ్ళుగల కళ్ళు కన్పించకుండా దాచుకొని ఇట్లా అంది. (6) నీకు మేలు జరగని. నీకుదారి, అంతా ఎప్పుడూ మేలు జరగని. హరిదగ్గర జ్ఞానాన్ని పొందు. కృష్ణునకు ప్రీతిపాత్రుడవుకా. (7) కృష్ణభక్తి, కృష్ణ దాస్యము అనేవి శ్రేష్ఠమైన వాటిలో అతి శ్రేష్ఠమైనవి. శ్రేష్ఠత్వము ఐదు విధములు. ముక్తికి హరిభక్తి శ్రేష్టమైనది. (8) బ్రహ్మత్వము, దేవత్వము, ఇంద్రత్వము, అమరత్వము వీనికన్న అమృతము, సిద్ధి పొందటము వీనికన్న హరిదాస్యము చాలా దుర్లభమైనది. (9) అనేక జన్మల తపస్సుతో , భారతదేశ మందు బ్రాహ్మణుడుగా జన్మించి, హరిభక్తిని పొందితే అట్టి జన్మ (వాని జన్మ చాలా దుర్లభము. (10) వాని జన్మ సఫలమైనది. వాడు కర్మక్షయాన్ని చేసుకున్న వానిజన్మ సఫలము. జన్మ జన్మలలోని వేలకొలది పితరులకు, వాని తల్లికి, (11) మాతా మహులకు (పురుషులకు) నూరుగురు సోదరులకు, బాంధవులకు, పత్నికి, గురువులకు, శిష్యులకు భృత్యులకు (12) వాడు చేసిన, కృష్ణునకు తన్ను సమర్పించే కర్మ చాలామేలైనది శోభనమైనది. ఓవత్స! ఆకర్మశోభనమైనది, శుద్ధమైనది. ఎందుకంటే అది కృష్ణున్ని సంతోష పెడుతుంది. కనుక. (13) ప్రీతితో విధిపూర్వకంగా చేసే ఆకర్మ సంకల్పాన్ని సాధిస్తుంది. అదే మంగళమైనది. ధన్యమైనది. పరిణామంలో (చివర) సుఖాన్ని కల్గించేది. (14) అదే వ్రతము, అదే తపస్సు, అదేభక్తి, అదే పూజనము. ఇది సత్యము. ఆతని నుద్దేశించి ఉపవాసముండటము కేవలము దాస్యానికి కారణమౌతుంది. (15) భూమి నంతా దానం చేయటము, భూమికి ప్రదక్షిణ చేయటము, సమస్త తీర్థములందు స్నానము, సమస్తమైన వ్రతము తపస్సు.
అన్ని యజ్ఞాలు చేయటము, అన్ని దానముల ఫలము, సమస్త వేద వేదాంగముల పఠనము, చదివించుట, (17) భయపడ్డవాణ్ణి రక్షించుట సుదుర్లభమైన జ్ఞాన దానము, అతిథుల పూజ, శరణాగత రక్షణము (18) అందరు దేవతల పూజ, నమస్కారము, మంత్ర జపము, తానే సిద్ధము చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టడము. (19) గురువుల శుశ్రూష, తలిదండ్రుల పై భక్తి, వారిని పోషించుట, ఇవన్నీ కూడా శ్రీకృష్ణునకు దాసుడైన వాని కళలో పదహారవ భాగపు కళను కూడా సరిపోలవు. (20) అందువలన ఓ ఉద్ధవ! పరాత్పరుడైన కృష్ణుని శ్రద్ధతో సేవించు. ఆతడు నిర్గుణుడు, కోరికలు లేనివాడు, ఈశ్వరుడు, పరమాత్మ (21) నిత్యమైనవాడు, సత్యమైనవాడు, పరుడైన బ్రహ్మ, ప్రకృతికి పరుడైనవాడు, ఈశ్వరుడు, పరిపూర్ణతముడు, శుద్దుడు, భక్తులను అనుగ్రహించుటకై రూపం ధరించినవాడు. (22) కర్మచే సేవాళ్ళ కర్మలకు సాక్ష్యమిచ్చువాడు నిర్లిప్తుడు. జ్యోతిఃస్వరూపుడు,పరుడు, కారణములకు కారణమైనవాడు. (23) అన్నింటి రూపమైనవాడు, సర్వేశుడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, శుభుడు, తనయందు భక్తిని దాస్యాన్ని ఇచ్చువాడు, తన సంపత్తు నిచ్చే స్థానమును ఇచ్చేవాడు. (24) జ్ఞాతి బుద్దిని వదిలి, అశుభకారకమైన మాత్సర్యమును వదిలి, ఆపరమానందుడైన, సానందుడైన నందనందనుని సేవించు (25) వేదములలో కౌథుమిశాఖయందు అతని వేలకొలది పేర్లున్నాయి. విఘ్నములొనర్చిన వారికి చాలాదుర్లభమైన, నందనందననామముతో చెప్పబడ్డ పేర్లున్నాయి. (26) ఉద్ధవుడు అన్ని విని చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. సంపూర్ణ జ్ఞానాన్ని పొంది పరిపూర్ణుడైనాడు. (27) తన వస్త్రమును కంఠమున కట్టుకొని దండము వలె ఆమెకు నమస్కరించాడు. తలయందలి వెంట్రుకలతో ఆమె పాదములను మాటిమాటికి బంధించి (28) శరీరమంతా పులకరించగా, కళ్ళల్లో నీళ్ళు నిండగా, భక్తితో, ఆమె నుండి విడిపోయాననే (తున్నా) దుఃఖంతో, ప్రేమతో గొంతెత్తి ఏడిచాడు, ఓ నారద! (29) ఆతని పై ప్రేమతో రాధకూడా ఏడ్చింది. గొల్ల స్త్రీలంతా దుఃఖించారు. ఉద్ధవుని కంఠమును ధరించి, లోభముతో, ఆమె నిలువరించింది. (30) ఉద్ధవుడు మూర్ఛపోగా,ఆవులిస్తూ చైతన్యాన్ని (స్పృహను) కోల్పోగా, కృష్ణుని యందే మనస్సుగల ఆతనిని రాధిక త్వరగా లేపింది. (31) ముఖం పై నీళ్ళు చిలకరించి మేల్కొలిపింది. ఓ వత్స! క్షేమంగా ఉండు, అని శుభాశీస్సులను ఇచ్చింది, రాధిక, ఓ నారద.
ఉద్దవ ఉవాచ :
ఉద్దవుడు మేల్కొని చక్కని సభయందు ఆమెతో ఇట్లన్నాడు : ఏడుస్తున్న గోపికల ఎదుట పరమార్థమైన మాట ఇట్లన్నాడు. (33) ఉద్ధవుని వచనమిట్లా: ద్వీపములలో జంబూ ద్వీపము ధన్యమైనది, కీర్తికరమైనది, మిక్కిలి దుర్లభమైనది. భారత వర్షము అందరికి కోరతగినది శ్రేష్ఠమైనది. (34) భారత వర్షంలో బృందావనమనెడి వనము పుణ్యమైనది. రాధపాదాబ్జసం స్పర్శగల ధూళితో పవిత్రమైనది. దేవతలు కోరేది. (35) పృథివి ధన్యమైనది, గౌరవించతగినది. ముల్లోకములలో పూజించబడినది. తీర్దమువలె పవిత్రమైన రాధపాదాబ్జరజస్సుతో శ్రేష్ఠమైనదది (36) అరువది వేలేండ్లు దేవవత్సరాలు పుష్కర క్షేత్రంలో ఇదివరలో బ్రహ్మ, వేదోక్తమైన భక్తి పూర్వకమైన తపమాచరించాడు. (37) గోలోకంలో రాధికాసహిత కృష్ణుని దర్శనం కొరకు ఆ కోరికతో తపస్సు చేశాడు. అప్పుడు కలలో కూడా గోలోకంలో రాధికాకృష్ణుని చూడలేదు. (38) అప్పుడు బ్రహ్మ లీలగా సత్యరూపమైన ఆకాశవాణిని విన్నాడు. వరాహకల్పమందు పుణ్యమైన భారతవర్షమందు బృందావన మందు (39) మహారమ్యమైన రాసోత్సవమందు అక్కడే రాసమండలమందు దేవతల మధ్య యందు చక్కగా వసించిన రాధాకృష్ణుని చూస్తావు అనుమానము లేదు, అని (40) ఆ మాట విని బ్రహ్మతపస్సు నుండి విరమించి తన ఇంటికి వెళ్ళాడు.కృష్ణుని చూచాడు, ఆనందించాడు. అతని కోరిక నెరవేరింది. (41) గోపాలుర, గోపికల జన్మ బ్రతుకు సఫలమైనది. బ్రహ్మాదులకు దుర్లభమైన కృష్ణుని పాదపద్మములను గొల్లలు, ప్రతినిత్యం చూస్తారు. (42) మానినియైన రాధికను ప్రతినిత్యము ఎల్లప్పుడు సజ్జనులు సేవిస్తారు. యోగీంద్రులు, మునీంద్రులు, సిద్ధేంద్రులు, వైష్ణవులు అట్లాగే చూస్తారు. (43) సతి, పుణ్యురాలు, తీర్థమువలె పవిత్రమైనది. సహజంగా శుద్ధురాలు, చాలా దుర్లభమైనది. ఆమె పాదపద్మములు బృందావనులకు సులభము. బ్రహ్మాదులకు చాలా దుర్లభము. (44) ఆమె పాదపద్మముల మీది గోళ్ళను ఎర్రరంగుతో అలంకరించాడు. పరమాత్మయైన కృష్ణుడే, సర్వేశ్వరేశ్వరుడే ఈ పని చేశాడు. (45) ఆమె పూజను కృష్ణుడు, చేశాడు. చాలా దుర్లభమైన స్తోత్రరాజముతో చేశాడు. స్వయంగా కృష్ణుడు శతశృంగమందు గోలోకమందు రాసమండల మందు (46) పారిజాతపు పూలదోసిలిని, వాసనగల చందనమును, నిగనిగలాడుతున్న దూర్వ అక్షతాలను ఆమె పాదారవిందముల యందు ఉంచాడు. (47) ఆమె ముప్పదివేల కోట్ల గోపికలకు ఆమె ఈశ్వరి. ముప్పది ఆరుమంది సఖులకు ఆమె ఈశ్వరి. ఆమె పేరు రాధిక. (48) ఆమెను ద్వేషించేవారు, తిట్టేవారు, నవ్వేపాపులు, కృష్ణునకు తన ప్రాణములకన్న మిన్నయైన, దేవతలకు దేవియైన శ్రేష్ఠమైన రాధికను తిట్టే పాపులు. (49) నూరు బ్రహ్మహత్యల పాపాన్ని వారు పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఆ పాపంతో వారు, రెరవకుంభీపాక నరకమందు బాధింపబడుతారు.
రాధికోవాచ :
నూనె కాగిన, మహాఘోరమైన చీకటిగల, పురుగులు గల యంత్రమందు పదునలుగురు ఇంద్రుల పాలనా కాలపరిమితి ఏడుగురు పితరులతో సహా ఉంటాడు. (51) ఆ పిదప ఒక జన్మ, లోకజన్మననుసరించి పుడ్డాడు. పాపం వల్ల దేవతల వేయి సంవత్సరాల కాలము మలమందు క్రిమిగా ఉంటాడు. (52) వ్యభిచారిణుల యోనిలోని పురుగు నుండి దాని రక్త మలముల భక్షకులౌతారు. అంతేమానము గల సంవత్సరాలు మలమందు కీటకములై మల భక్షకులౌతారు. (53) వేదంలో కాణ్వశాఖయందు బ్రహ్మ ఇట్లా చెప్పాడు. అని చెప్పి, పిదపవెళ్ళుచున్న ఉద్ధవునితో రాధ మళ్ళీ ఇట్లా అన్నది. ఏడుస్తున్న ఆతనితో ఏడుస్తున్న ఈమె, కృష్ణుని, వియోగం వల్ల భయపడి ఇట్లా అంది. (54) రాధవచనమిట్లా - వత్స! మధురాపురికి వెళ్ళు. మాధవునకు అంతా చెప్పు. (55) గోవిందుణ్ణి నేనెట్లా చూడగలుగుతానో అట్లా నీవు ప్రయత్నం చేయి. గత జన్మ అంతా నిష్ఫలము వెళ్ళు. మిథ్యా దురాశతో గడిచింది. (56) ఆశ మిక్కిలి దుఃఖకారి, నిరాశ మిక్కిలి సుఖకారి. ఆ పిదప గోవిందుణ్ణి గురించి ఆలోచించి ఆమె జీవన్ముక్తురాలైంది. (57) అని పలికి అక్కడ రాధ తిరిగి మిక్కిలి ఏడ్చింది. ఏడుస్తున్న ఆమెకు నమస్కరించి యశోద భవనమునకు వెళ్ళాడు. (58) ఉద్ధవుడు వెళ్ళాక రాధ మూర్ఛపోయింది ఓ నారద! చైతన్యాన్ని కోల్పోయింది. ఎప్పుడూ ధ్యానపరురాలైంది. (59) బురదయందున్న పద్మదళమందు, నీరుగల పడకయందు, ఓముని! గోపికలు, శ్రేష్ఠులైనవారు కన్నీళ్ళు కలిగిన నేత్రోత్పలములు గల, వారు ఆమెను ఉంచారు. (60) ఆమె శరీర స్పర్శ మాత్రం చేతనే ఆపడక భస్మమైంది. తిరిగి మృదువైనస్థలమందు మృదువైన దుప్పటి పరచినచోట, చందనం పూసిన చోట (61) విరహ జ్వరంతో బాధపడుతున్న ఆమెను తిరిగి ఉంచారు. మంచివాసనగల చందనపు నీరుతోందరగా ఎండిపోయింది. (62) ఉద్దవుడు లేనందువల్ల ఒక నిమిషము (రెప్పపాటు) నూరు యుగాలైందది. హా! హా! ఉద్దవ, ఉద్ధవ! హరి దగ్గరకు తొందరగా వెళ్ళి చెప్పు. (63) నా ప్రాణేశ్వరుడైన హరిని త్వరగా తీసుకురా అని పలికిన దీనురాలైన సంతాపంతో చైతన్యం కోల్పోయిన రాధను చూచి (64) గోపికలందరు రాధను తమ తమ వక్షములందుంచుకొని దుఃఖించారు. ఆమెను మేల్కొలిపారు. ఆమె కోరికను తెలిపారు. (65) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రాధోద్ధవ సంవాద మందు తొంబది ఏడవ అధ్యాయము.
