4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
38 - హరనిర్మాల్య శాప ప్రసంగము
ఓ రాధాదేవీ! జగద్గురువైన శంకరుని యొక్క గర్వభంగము వింటివి. ఇప్పుడు నా వలన దుర్గాదేవి యొక్క గర్వ విమోచనమును వినుము. ఆ జగన్మాత సర్వదేవతలయొక్క తేజస్సు వలన ఆవిర్భవించి (అవతరించి) మనోహరమును కోరదగినదియు ఐన స్త్రీ రూపమును ధరించెను. దానవేంద్రులను సంహరించి ఆమె దేవగణములను రక్షించెను. ఆ తరువాత దక్షుని భార్య గర్భమున సతీదేవిగా జన్మించెను. దేవకార్య నిర్వహణకు ఒక సాధనముగా నున్న పినాకపాణిని (శంకరుని) ఆ దేవి వివాహమాడెను. ఆమె భర్తను పరమ భక్తితో సేవించెను. పూర్వము ప్రయోజనమేమి లేకుండ వ్యర్థముగా దక్షునికి దైవయోగము వలన దేవసభలో శివునితో శత్రుత్వము ఏర్పడెను.
దక్షుడక్కడి నుండి శివుని మీది కోపముతో తన స్థానమునకు వచ్చీ ఒక యజ్ఞము చేయబూని శివుని దప్ప సర్వదేవతల నాహ్వానించెను. ఆ దేవతలందరు తమ స్త్రీలతో బాటు దక్షుని గృహమునకు వచ్చిరి. శంకరుడు కోపము, ఆత్మాభిమానముతో అక్కడకు పోకుండెను. సతీదేవి అజ్ఞానముతో (తండ్రి మీది వ్యామోహముతో) ప్రయత్నించి “పోవుదమని” భర్తకెంతగానో చెప్పిను. ఆ చంచల స్వభావురాలు భర్తను కదలించుటకు శక్తురాలు కాక పోయేసు. భర్త ఆజ్ఞలేకుండ గర్వముతో ఆమె తండ్రి గృహమునకు వచ్చెను. అక్కడ భర్త శాపము వలన ఆమెకు గర్వభంగపూయెను. తండ్రి దక్షుడామెతో మాటగూడ మాట్లాడలేదు. ఆమె భర్తను గురించి దక్షుడు పల్కిన నిందా వాక్యములు విని అభిమానముతో తన శరీరమును త్యజించెను.
ప్రియురాలా! ఇట్లు సతీదేవియొక్క గర్వము విమోచనమైన విషయము చెప్పితిని. ఆమె యొక్క వేరొక జన్మను నిత్యమైన (ఆ జన్మలోను సంభవించిన) దర్పభంగమును విందువు గాక. సతీదేవి వెంటనే హిమవంతుని భార్య యొక్క గర్భమందు చేరి రెండవ జన్మను పొందెను. శివుడు సతీదేవి యొక్క చితాభస్మమును ఎముకలను గ్రహించి భస్మమును శరీరమునకు పులుముకొనెను. ఎముకల మాలను ధరించెను. ప్రేమతో సతీదేవిని తలచుకొనుచు మరల మరల అంతట సంచరించుచుండెను.
హిమవంతుని భార్యయగు మేనాదేవి మిక్కిలి మనోహర రూపము గల ఆ దేవీనీ బిడ్డగా కనెను. బ్రహ్మ సృష్టిలో ఆమెను పోలిన వ్యక్తి ఎక్కడ లేదు. గుణములకు జన్మస్థానమైన అన్ని సద్గుణములను అన్ని రూపములను ఆమె భరించి యుండెను. దేవపత్నులందరు ఆమె గుణరూపములలో పదునారవ ఆంశకు గూడ అర్హులు కాకుండిరి. ఆమె హిమవంతుని గృహములో శుక్లపక్షములో చంద్రకళ వలె దినదినము (పోషింపబడుచు) పెరుగుచు మిక్కిలి యావనదశను పొందెను. ఆ జగన్మాత సుద్దేశించి ఆకాశవాణీ “ఓ శివే! కఠోర తపస్సులో శివుని పతిగా పొందుమా” అని బోధించేను.
ఆ ఆకాశవాణిని విని యావనము చేత గర్వితురాలై యున్న ఆ దేవి “నేను ఈశ్వరుని ప్రమేయము లేకుండ తపస్సుతో అవసరము లేకుండ జన్మనెత్తగల్గితిని” అని నవ్వి తపస్సుకనీ పూనుకొనక అట్లే నిలిచెను. నా యొక్క పూర్వ జన్మకు చెందిన భస్మమును అస్థికలను ధరించిన అతడు (శివుడు) యవనముతో లౌడనై యున్న నన్ను చూచీ ఈ జన్మలో ఎట్లు వివాహ మాడకుండును? నా వీయోగ దుఃఖము వలన మీక్కిలి తపించి ఎవడు బ్రహ్మాణమంతయు భ్రమణము (తిరిగెనో) చేసెనో అట్టి శంకరుడు మిక్కిలి సుందరినైన నన్ను చూచి ఎట్లు గ్రహింపకుండును? ఆ దయానిధి నా కారణముగానే (నా కొరకే) దక్షయజ్ఞమును భగ్నము చేసెను కదా! అట్టివాడు జన్మజన్మలకు తన పత్నినైన నన్నెట్లు స్వీకరింపడు? ఆది నుండి పూర్వజన్మలయందు ఏ స్త్రీ ఎపనిభార్యయో ఏ పురుషుడెవతెకు భర్తయో ఆ ఉభయుల భేదము (దాంపత్యము సరిపోవుట) ఈ విశ్వమున ఎట్లు సంభవించును. గర్భధారణమున్నది ఇంకొక విధముగా (పూర్వజన్మల దాంపత్యమునకు భిన్నముగా) జరుగదు.
ఇట్లు సర్వరూపములకు సర్వ సద్గుణములకు తానే మూలమని అతి గర్వముతో నున్న ఆ సాధ్వి ఈశ్వరుని గూర్చి తెలిసికొనలేక (తమ వివాహము కొరకు ఆకాశవాణి చెప్పిన ప్రకారము) తపస్సు చేయకుండెను. మొత్తము సౌందర్యవతులలో నాకంటే మించి సుందరి ఎవ్వరు లేనే లేదని గర్వముతో ఆ శివ పార్వతి తపస్సు చేయలేదు. పురుషుడు తన భార్యల యొక్క రూపమును యౌవనమును అలంకారమును విశేషముగా గ్రహించును. ఇక శిపుడైతే నన్ను గూర్చి విన్నంతనే తపస్సు లేకుండనే నన్ను గ్రహించును. ఇట్లు భావించి పార్వతి హిమవంతుని గృహములో చెలికత్తెల నడుమ రాత్రింబగళ్లు మాటిమాటికి క్రీడోన్మత్తురాలై (ఆటల పిచ్చిలో మునిగి) నీలిచియుండెను.
ఇంతలో ఒకనాడు పర్వతరాజు సభలోనికి వేగముగా ఒక దూత వచ్చి అతని ముందు అంజలి జోడించి మధురముగా ఇట్లు పలికెను.
పర్వతరాజా! లే లెమ్ము. అక్షయ వటవృక్షము వద్దకు పొమ్ము. మహాదేవుడు వృషభ వాహనమెక్కి తన గణములతో అక్కడికి వచ్చియున్నాడు. భక్తితో నీ శిరస్సు వంచి నమస్కరించి మధుపర్కము (పూజ్యుడైన అతిథికి పెరుగు తేనె కలిపి ఇచ్చుట) మొదలగునవి సమర్పించి సాధారణములైన ఇంద్రియములకు గోచరించని ఆ దేవదేవుని పూజించుము. ఆ స్వామి సిద్ధిస్వరూపుడు. సిద్ధులకు ఈశుడు. యోగీంద్రులకు పరమ గురువు. కాలునికి కాలపురుషుడు. మృత్యుంజయుడు. సనాతనమైన బ్రహ్మమును జ్యోతి అతడు. సగుణ నిర్గుణ లక్షణములు గల పరమాత్మ స్వరూపమతనిది. సర్వవ్యాపి. భక్తులు తనను ధ్యానించుటకని దోషరహితమైన ఆకారము ధరించిన ఈశ్వరుడాయన (అతనిని దర్శించబోమ్ము).
హిమవంతుడు దూత వాక్కు విని సంతోషముతో సింహాసనము నుండి లేచెను. మధుపర్కము మొదలగునవి తీసుకొని శంకరుని వద్ద కేగెను. పార్వతీదేవి దూత మాటవిని కలకలలాడు ముఖము నేత్రములు గలదై “మహేశ్వరుడు నాకొరకే ఇక్కడకు వచ్చా”నని తనలో అనుకొనెను. అప్పుడామె సాటిలేని విధముగా తన నలంకరించుకొనెను. ఉత్తమ వస్త్రమును శ్రేష్టమైన ఇంద్రనీల రత్నాభరణములను మనస్సును హరించెడి రత్నమాలను, శ్రీగంధము పులిమిన పారిజాత పుష్పముల మాలను ధరించెను. శంకరుని కొరకని మనోహరమైన పుష్పమాలను నిర్మించెను. అప్పుడు రత్నసింహాసనము పై కూర్చుండి అద్దములో తన ముఖమును చూచుకొనెను. నల్లని కస్తూరి చుక్కతో పాటు ఎర్రని సిందూరపు తిలకము ధరించెను. శరదృతువులోని పట్టపగటివేళలోని ఎఱదామరలు తుమ్మెదల బారులో చుట్టబడి ఉన్నట్లు ఎర్రచారికలు గల రెండు కన్నులకు చక్కని కొటుకదిద్ది తీర్చుకొనెను. మిక్కిలి కోమలములైన పెదవులకు తొంబూల రోగము దిద్ది మీక్కిలి సుందరమైన దొండపండును పోలునట్లు చేసెను.
రత్నకుండల (కర్ణాభరణములు)ముల కాంతితో చెక్కిళ్లు ప్రకాశించుచు సూర్యోదయము వలన సుమేరు (బంగారు కొండ) పర్వత శీఖరము వలె నున్న వివరించి చెప్పనట్టి మనోహరమైన పలువరుసతో వర్షఋతువులో జలముతో కూడియున్న ముత్యముల వలెనున్న - దేవనదియొక్క జలధారలో మిక్కిలి శోభించుచున్న మేరువు వలె ఏనుగు ముత్యములు పొదిగిన సుందరమైన నాసాభరణముతో (ముక్కునగ), కొంగబారుతో మిక్కిలి శోభించుచున్న కొత్త మేఘము వలె మాలతీ పుష్పమాల నలంకరించుకొన్న వెంట్రుకల ముడితో. మంచి బంగారు వన్నె గల కొంతి గల సుందరమైన వక్షస్థలమందు కస్తూరీ కుంకుమ ద్రవములు రత్నాల హారములు ప్రకాశించుచుండగా - అందమైన సంపంగి పూలరంగుతో ప్రకాశించుచు సుందరమైన నకరికా పత్రరేఖలతో శోభించుచు బదరీఫలముల వలె (పెద్దరేగుపండ్లు) నున్న మనోహర స్తనములు గల - సన్నని నడుము లోతైన నాభితో గుండ్రముగా నున్న మిక్కిలి అందమైన ఉదరము గల - వస్త్రము చేత ఆచ్ఛాదితములైన అరటి బోదెలను తిరస్కరించు తెరలు, కఠినమైన మన్మథ నివాస స్థానము, మెట్టతామరల కాంతిని దోచుకొని మనోహరములై లతుక పూతతో రత్నాల కడియాలతో ప్రకాశించుచున్న పాదములు గల - రాజహంసల ధ్వనివంటి రత్నాల అందాలు విశ్వకర్మ నిర్మితములైన ఇతరాభరణములు ధరించిన - రత్నకంకణములు దండకడియములు శంఖాభరణములతో అలంకరింపబడి బంగారు వన్నె గల కోమలకరములు గల - మనోహరములైన రత్నాంగుళీయములు (ఉంగరములు) ధరించిన హస్తములలో ఒకదానితో రత్నముకురమును (అద్దమును) మరియొక హస్తముతో విలాసముగా కమలమును ధరించియుండెను.
సాటిలేని ఇట్టి తన స్వరూపమును పార్వతి చూచుకొని తన భర్తయగు శంకరుని తలచుకొనెను. విశేషించి భర్త పాదపద్మములను మనసా స్మరించెను.
ఆమె తన మనస్సులో శివుని దప్ప తండ్రిని గానీ తల్లిని గాని బంధువులను గాని తన చెలులను గాని సోదరుని గాని ఏ మాత్రమప్పుడు స్మరించలేదు.
పర్వత రాజైన హిమవంతుడక్కడ అక్షయపటవృక్ష సమీపమున ఆకాశ గంగానదీ పులిన ప్రదేశము (ఇసుక తిన్నెలు గల స్థలము) నుండి ఎగురుచు చిరునవ్వుతో వచ్చుచున్న చంద్రశేఖరుని దర్శించెను. ప్రాణ ప్రతినిధితో సంస్కరించబడిన జపమాలను ధరించి నానామమును జపించుచు - కరిగించిన బంగారు వన్నె గలిగిన జడలతో విరాజిల్లుచున్న ఆ శూలపాణి వృషభము మీద నుండెను. సర్వాభరణములను నాగ (సర్పము) యజ్ఞోపవీతమును అలంకరించుకొని తెల్లని స్ఫటిక వర్ణము గలిగి వ్యాఘ్రచర్మమును వస్త్రముగా ధరించి శరీరమున భస్మము పులముకొని ఆస్థిమాలను ధరించిన ఆ దిగంబరుని, ఐదుముఖములు (ప్రతి ముఖమున) మూడు నేత్రములతో కోటిసూర్యులతో సమానమైన తేజస్సు గల పరమ శివుని పర్వతరాజు చూచెను.
అతని చుట్టు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవుచున్న రుద్రులను, వామ భాగమున మహాకాలుని, దక్షిణమున నందీశ్వరుని, భూతప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షసులను, భేతాళులను, క్షేత్రపాలకులను భయంకరమైన పరాక్రమము గల భైరవులను పర్వతరాజు దర్శించెను.
సనక సనందన సనత్కుమారులను జైగీషవ్య దేవలులను కాణాదగౌతములను పిప్పలాదుని కణఖునీ వోడుపంచ శిఖులను కఠ జాజలులను కరఖకర్ణులను సూర్యతేజన్సు గల పంచశీఖునీ కాత్యాయనుని పాణిని శంఖ దుర్వాససులను శాతాతపపారిభద్రులను అష్టావక్ర మరుద్గవులను శివుని ముందున్న ఈ పరీవార ముని గణములను చూచి నమస్కరించి హిమవంతుడు శివునికి ప్రణమిల్లెను.
హిమవంతుడు భూమీయందు దండము వలె పడి చేతులు అంజలిగా పట్టి నేలమీద నమస్కరించి అధిక భక్తితో శివుని పాద పద్మములను శిరస్సున ధరించి శరీరమున పులకలేర్పడగా కన్నుల నాసందబాష్పములు జారగా నమస్కరించెను. సూర్యగ్రహణ సందర్భమున పుష్కర క్షేత్రములో బ్రాహ్మీ ముహుర్తము దాటిన వేళ (సూర్యోదయానంతరము) ధర్మఋషి తనకుపదేశించిన స్తోత్రముతో హిమవంతుడు పరమేశ్వరుని స్తుతించెను.
హిమాలయ ఉవాచ – హిమవంతుడనెను:
సృష్టినీ చేయు బ్రహ్మవు నీవే. పరిపాలించు విష్ణువు నీవే. మంగళముల నిచ్చు అనంతుడవు సర్వప్రళయ కారుడవగు శీవుడవు నీవే. గుణాతీతుడవు ఈశ్వరుడవు సనాతనుడవు జ్యోతిరూపముననున్నవాడవు నీవే. ప్రకృతికి నాథుడవు ప్రకృతికి చెందిన ప్రకృతుడవు అట్టి ప్రకృతికతీతుడవు నీవు. భక్తుల యొక్క ధ్యాన మూలమైన నానా రూపములను సృష్టించువాడవు నీవు. ఈ రూపమందే భక్తునికి ప్రీతియో ఆయారూపమును నీవు ధరించుచున్నావు, సర్వలేజస్సులకు అధారమైన - సృష్టి జనకుడవైన సూర్యుడవు నీవే. ఎల్లప్పుడు చల్లని కాంతిలో సస్యములను రక్షించుసోముడవు (చంద్రుడు) నీవే. పాయువు వరుణుడు సర్వము గొల్చు అగ్నీ దేవరాజగు ఇంద్రుడు కాలపురుషుడు మృత్యువు యముడు అందరు నీవే. మృత్యువును జయించి మృత్యువుకు మృత్యువై యమునికి అంతకుడైన వాడవు నీవే. వేదము వేదకర్త వేద వేదాంగముల ఆవలి తీరమును పొందినవాడవు. విద్వాంసులకు జనకుడవు. విద్యావేత్తలకు గురువువు ఐన విద్వాంసుడవు నీవే. మంత్ర జప తపములు వాటి ఫలమిచ్చువాడు నీవే. వాక్కువు వాక్కుకు అధిదేవతవు వాగ్దేవిని సృష్టించినవాడవు. ఆమె గురువువు నీవే. ఆశ్చర్యము. సరస్వతీ (విద్య) బీజమే నీవు. ఇక నిన్ను స్తుతించుటకెవడు సమర్థుడు? ఇట్లు పలికి పర్వతరాజు శివునీ పాదపద్మములను పట్టుకొని నిలిచెను.
శివుడు వృషభవాహనము నుండి దిగి హిమవంతుని లేపి అక్కడ కూర్చుండెను. మహాపుణ్య ప్రదమైన ఈ స్తోత్రము నెవడు మూడు సంధ్యలలో పఠించునో ఈ సంసార సాగరమున సర్వపాపముల నుండి భయముల నుండి విముక్తి పొందును. ఒక మాసమిట్లు పరించినచో సంతానము లేని పాడు పుత్రుని పొందును. భార్యలేనివాడు సుశీలయు మిక్కిలి సుందరియైన భార్యను పొందును. చాలకాలము క్రింద పోగొట్టుకున్న వస్తువును వెంటనే పొందును. శంకరానుగ్రహము వలన రాజ్యభ్రష్టుడు రాజ్యము పొందును. కారాగారమందున్నను, శ్మశానమందున్నను శత్రువులకు పట్టుబడి సంకటదశలో ఉన్నను లోతైన నీటిలో చిక్కుకొని పడవ పగిలిన దుఃఖస్థితిలో ఉన్నను, మిక్కిలి భయంకరమైన యుద్దమధ్యమందున్నను, క్రూరజంతువుల నడుమనున్నను, ఈ స్తోత్రముతో స్తుతించి శంకరుని అనుగ్రహము వలన అన్ని విధముల ఆపదల నుండి విముక్తుడగును.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ముప్పది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
