4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
24 - తాళఫలభక్షణ, బలిపుత్ర మోక్షము
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను:
ఓ నారదా! దూర్వాస ముని యొక్క ఒక రహస్య వృత్తాంతము వినుము. ఆశ్చర్యము! ఊర్ధ్వరేతస్సు (వీర్యము స్కలనము కాని స్థితి) గల అతనికి భార్యా సంయోగమెట్లు సంభవించెనో దానిని చెప్పుదును. ముందు చెప్పిన ఆ యిద్దరు వ్యక్తుల యొక్క శృంగారమును చూచి జితేంద్రియుడుగా నున్న ఆ ముని కాముకుడయ్యెను. దుర్జనుల సంసర్గము (దుర్జనులను కూడి ఉండుట) వలన ఒక దోషము సంభవించును. దానిని సాంసర్గిక దోషమందురు. హఠాత్తుగా ఆ ముని మనస్సులో రతి వాంఛ కలిగెను. అతడు మదన బాధ ననుభవించుచు (అక్కడ తపస్సు చేసినవాడు) ఒక కామినియగు స్త్రీని తలంచుచుండెను.
ఇంతలో పూర్వకల్పమున తపస్సు చేయుచున్న బ్రహ్మయొక్క ఊరువు (తొడ) నుండి ఉద్భవించిన వాడును ఊర్ధ్వరేతస్సు గల యోగీంద్రుడై ఔర్వ నామముతో పిలువబడు మునీశ్వరుడు తగిన భర్తను కోరుకొనుచున్న తన బిడ్డతో గూడి ఆ మార్గమున వచ్చుచుండెను. “కందలి” అన్న ఆ కూతురౌర్వునికి జానువు (మోకాలు) నుండి జన్మించెను. ఆమె తనకు తగిన ప్రతిగా దూర్వాసుని ప్రార్థించుచున్నదే తప్ప ఇంకొక వ్యక్తిని మనస్సులో కూడ తలచుట లేదు. ప్రకాశించుచున్న అగ్నిజ్వాలవలె తేజస్విగా నున్న ఆ మునిరాజు బిడ్డతో గూడివచ్చి మహాప్రసన్నమైన మనస్సుతో దూర్వాసముని ముందు నిలిచెను.
దూర్వాసముని తన ముందున్న ముని రాజును చూచి సంభ్రమము (ఆశ్చర్యము) తో త్వరగా లేచి సంతోషము కలవాడై నమస్కరించెను. ఔర్వుడును సంతసించి అతనిని కౌగిలించుకొని తన కూతురు యొక్క మనోరథమును మునికిట్లు చెప్పెను.
ఔర్వ ఉవాచ - ఔర్వుడు పలికెను :
కందలి యన్న నామముతో ప్రసిద్ధి కెక్కిన నా బిడ్డ మిక్కిలి సుందరి. నిన్ను గూర్చి ఎవరో చెప్పగా విని నిన్నే మనస్సులో తలచుకొనుచు వివాహ వయస్సు కొంతమీరినను నీతలంపుతోనే ఉన్నది. ఈమె స్త్రీపురుష సంయోగము లేకుండ పుట్టిన కన్య. ముల్లోకములను మోహింపజేయుటకు సమర్థురాలు. సౌందర్యము, సద్గుణములకు ఈమె మూలము. ఈమెలో ఒక్క దోషమున్నది. తీవ్రమైన కోపముతో కయ్యమునకు పూని కటువుగా మాట్లాడును. ఐనను నానావిధములైన మంచి గుణములున్న ద్రవ్యమును ఒక్క దోషమును బట్టి విడువగూడదు కదా!
ఔర్వముని మాటలు విని హర్షము దుఃఖము రెండు లక్షణములు గలవాడైన దూర్వాసుడు తన ముందున్న కన్యను రూపగుణములతో కూడియున్న దానిని చూచెను. శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖము, శరత్కాలకమలముల వంటి లోచనములు, చిరునవ్వుతో వెలుగుచున్న మోము, పుష్టిగా నున్న స్తన నితంబములు (పిరుదులు) ప్రక్కచూపులు, రత్నాభరణముల శోభ, అగ్ని వర్ణమైన వస్త్రములు నవ యౌవనము గల ఆ కన్యను చూచి దూర్వాసముని మన్మధబాణపీడితుడై వ్యామోహము పొందెను. బాధపడుచున్న హృదయముతో ఔర్వమునితో ఇట్లు పలికెను.
దూర్వాసా ఉవాచ - దూర్వాసముని పలికెను :
ముల్లోకములలో స్త్రీరూపము ఎల్లప్పుడు మోహమునకు మూలము. తపస్సునకు విఘ్నము. ముక్తి మార్గములకు ఆటంకము. సంసారమును కారాగృహములో మోయరాని పెద్ద సంకెల గొప్పవారైన శంకరాదులు కూడ జ్ఞాన ఖడ్గములతో నారీ రూపమైన సంకెళ్లను నరకలేకుండిరి. శరీరపు నీడకంటె వేరైన స్త్రీసంగము, దేహచ్ఛాయకంటె బలమైనకర్మఫలానుభవము కంటె ఇంద్రియముల కంటె దేహము కంటె విద్యాబుద్ధులకన్న బలమైనది. శరీరచ్ఛాయ శరీరమున్నంత వరకుండును. కర్మఫలము అనుభవము వరకుండును. దేహేంద్రియము ఈ దేహములో జీవుడున్నంత వరకుండును. విద్యలు స్మరించుచున్నంత వరకుండును. మతి ఆలోచించునంత వరకుండును. ఆ తరువాత అంతమై పోవును. సాధ్వియైన స్త్రీ జన్మజన్మకు అనుసరించును. జీవునకు జన్మ (ఆయువు) ఉన్నంత వరకు స్త్రీ భోగము సుఖమునే కల్గించును. కాని జీవుడెంత కాలము (ఎన్ని జన్మలు) ఉత్తమ స్త్రీతో కూడియుండునో (ఆమె తన పాతివ్రత్య శక్తితో జన్మజన్మకు తన పతినే అనుసరించుట వలన) అంతకాలము జన్మపరంపర ఖండింపబడదు (ముక్తి లభించదు).
మునీంద్రా! అన్నిటికంటె శ్రీహరి పాద పద్మములను సేవించుట శ్రేష్ఠము. అట్టి శ్రీకృష్ణ పాద పద్మములను ధ్యానించు చుండగా నాకు విఘ్నమేర్పడెను. పూర్వజన్మకు చెందిన ఏకర్మదోషము వలన నాకది సంభవించెనో ఎరుగను. జారిణీ స్త్రీ రాక్షసుడొనర్చిన శృంగారమును చూచి నా మనస్సు కామముతో కూడినదయ్యెను. బ్రహ్మ ఆ ఫలమునిట్లిచ్చెను. ఐనను మహామునీ! నేను నీ బిడ్డ యొక్క వంద కటువాక్యములను నిశ్చయముగా క్షమింతును. ఆ సంఖ్య దాటిన పిదప దానికి తగిన ఫలమితును. అన్నిటికంటె స్త్రీ యొక్క పరుష వాక్యములను సహించుట అన్నది పెద్ద అవమానము. స్త్రీ చేత ఓడింపబడినవాడు (స్త్రీ నిందావాక్యములను సహించువాడు) ముల్లోకములలో సత్పురుషుల గోష్ఠిలో మిక్కిలి నిందితుడగును (నిందింపబడును, అవమానింపబడును). నీ ఆజ్ఞను శిరస్సున ధరించి నీ సుతను నేను స్వీకరింతును. కూడి వచ్చిన స్త్రీని త్యజించిన పురుషుడు కాలసూత్ర సరకము పొందును. జితేంద్రియుడైనవాడు కామాసక్తితో రహస్యముగా తనతో గూడ వచ్చిన జారిణిని ధర్మమునకు భయపడి పరిత్యజించవలయును. వివాహమాడిన స్త్రీకంటె ఇతర స్త్రీని పొందుట అధర్మము. అట్టి అధర్మము చేసినచో దాని వలన వాడు నరకము పొందును.
ఔర్వముని ముందట్లు పలికి దూర్వాసుడు సంభాషణ ముగించెను. ఔర్వుడు వేదోక్త మార్గమున అతనికి కన్యాదానమొనర్చెను. శ్రీ ధనమును కొంత ఇచ్చెను. దూర్వాసుడు “స్వస్తి” యని అంగీకరించెను. కన్యనప్పగించి తన బిడ్డ ఎడబాటునకు తల్లడిల్లినముని వ్యామోహము (ప్రేమ)తో మూర్ఛిల్లెను. సంతానము నెడబాసిన శోక ప్రవాహము ఆత్మారాములగు జ్ఞానులను కూడ బాధింపకి విడువదు. ఔర్వముని ఒక క్షణములో చైతన్యము పొంది - తండ్రి యెడబాటునకు మూర్ఛిల్లి దుఃఖశోకములలో నున్న బిడ్డకిట్లు హితబోధ చేసెను.
ఔర్వ ఉవాచ - ఔర్వుడిట్లు పలికెను :
బిడ్డా! నీకు ఇతరత్ర మిక్కిలి దుర్లభమైన నీతిసారమును చెప్పెదను వినుము. ఇది నీకు హితమైనది. వేదోక్త సత్యమిది. మొదట కష్టముగా తోచినను పరిణామము (పరిపక్వ స్థితి) లో సుఖము కూర్చునది. కులస్త్రీలకు తన భర్తయే శ్రేష్ఠమైన బంధువు- ఈ లోకమున పరలోకమున భర్తను మించిన ప్రియమైనవాడు ఉత్తమ గురువు ఉండడు. దేవపూజ వ్రతములు దానములు తపస్సు ఉపవాసము మంత్రజపము సర్వతీర్థములందు స్నానము సర్వయజ్ఞముల దీక్ష భూప్రదక్షిణము బ్రాహ్మణులను అతిధులను సేవించుట యివి అన్నియు పతిసేవకు పదునారవ భాగముగా కూడ సరికావు, ఈ భరతఖండమున పతిభక్తురాలికి వీటితో పనిలేదు. పతిభక్తిలేని స్త్రీకిని ఇవియున్నను ఫలము లేదు కనుక ఆమెకు వీటిలోనవసరము లేదు. ఆరంభములో ఆచరణ సుఖమయమైనచో తరువాత దుఃఖదాయకమగును. ఆచరణారంభమున దుఃఖముగా నున్నపుడు తరువాత సుఖకరమగును. సర్వశాస్త్రములలో పతిసేవయే గొప్ప ధర్మమని చెప్పబడినది. తన ఆత్మజ్ఞానము చేత భర్తను నారాయణుని కంటె అధికునిగా చూచి ఎల్లప్పుడు అతని పాదసేవను సాధ్వి ఒనర్చుచుండును. ఆ సాధ్వి పరిహాసముతో గాని కోపముతో గాని భ్రమతో గాని తీరస్కారముతో గాని భర్తకెదురుగానైనను చాటుగానైనను కటువాక్యములు పలుకదు. ఈ భారత ఖండములో భర్తను నిందించి నోటిని మలినమొనర్చుకొన్న- వ్యభిచరించి శరీరమును మలిన మొనర్చుకొనిన స్త్రీకి ప్రాయశ్చిత్తము {పాపపరిహారకర్మ) వేద శాస్త్రములలో చెప్పబడలేదు. వందమంది బ్రహ్మల ఆయుష్యకాలము పర్యంతము నరకవాసము చెప్పబడినది. అన్ని విధముల ధర్మము లాచరించు స్త్రీ ఐనను భర్తను గూర్చి కటువాక్యములు పలికిన యెడల ఆమె నూరుజన్మలలో చేసిన పుణ్యమంతయు నశించుట సత్యము. నిశ్చయము.
ఔర్వమునిరాజు ఇట్లు కన్యాదానమిచ్చి కన్యకు హితము బోధించి వెడలిపోయెను. ఇంతవరకు ఆత్మారాముడుగా నున్న దూర్వాసుడు భార్యా సహితుడై ముదముతో నుండెను. మనస్సు శరీర సుఖాపేక్ష కలది కాగానే ఆ కోరుకొన్నవాడు కామినిని పొందెను. ఆశ్చర్యము. పుణ్యము చేసికొన్నవారి కోరిక మనస్సున సంకల్పించినంత మాత్రమున సిద్ధించును కదా!
ఓ నారదా! ఆ దూర్వాసముని సుఖకరమైన శయ్య నేర్పరచుకొని నిర్జన ప్రదేశములో తన ప్రియురాలిని తీసుకొనీ శుభకాలములో శయనించెను. స్త్రీ సుఖమెరుగని వాడైనను ఆజన్మ బ్రహ్మచారి ఐనను ఆవిజ్ఞుడు శృంగార క్రీడలో కామశాస్త్ర విశారదుడయ్యెను. నానావిధములుగా శృంగార విహారము చేయగా క్రొత్తదైన ఆ మొదటి కలయికతో కందలి సుఖానుభవము పట్టజాలక మూర్ఛిల్లెను. అతడును మూర్ఛపొందెను. ఇట్లా ముని రేబవళ్లు గుర్తించక ప్రతిదినమిట్లే ప్రవర్తించెను. అందులో నేర్పుగలవారైన ఆ ఉభయుల సంగమము సమానముగా నుండెను. ఇట్లు మునీశ్వరుడు తపస్సు త్యజించి సంసార సుఖమునందు మిక్కిలి ఆసక్తి గలవాడయ్యెను.
ఆ కందలి భర్తతో ప్రతిదినము కలహించుటకారంభించెను. ఆ మునీంద్రుడు భార్యకు నీతివాక్యములు బోధించుచుండెను. ఆమె ఏమాత్రము జ్ఞానము పొందక కలహమునే కోరుకొనుచుండెను. తండ్రిచేసిన జ్ఞానోపదేశము వలన ఆమె శాంతురాలు కాలేదు. స్వభావము దాట శక్యము గానిది కదా! ప్రబోధముచే అది త్యజింపబడదు. మనోహారుడైనను భర్తను ఆమె కారణము లేకుండగనే ఎల్లప్పుడు పరుష వాక్కులు పలుకుచుండెను. ఏ ముని లోకమును గడగడ లాడించెనో అతడామె కోపమునకు వణకి పోవుచుండెను. ఆమె మీద వ్యామోహము వలన ముని దయానిధియై కందలి పలుకు పరుషోక్తులను క్షమించుచు నిత్యము నీతిబోధను చేయుచుండెను. కొంతకాలమునకు ఆమె యొక్క కటువాక్యములు వందకు వంద నిండిపోయెను. అప్పటికిని కృపతో పరుషవాక్కులను శతాధికముగా క్షమించెను. అట్లే పరుషముగా మాట్లాడెడి కందలీ కర్మ పరిపూర్ణమయ్యెను. అప్పుడు పత్ని కటువాక్యములకతని మనస్సు ఒక్కసారి మిక్కిలి మండిపోయెను. ఎప్పుడును ఆత్మావలోకనముతో ఆనందపూర్ణుడై ఉండునట్టి- అంతవరకు దయాళువుగానున్న ముని పూర్తిగా కోపము త్యజించ లేకపోయెను. భస్మరాశి వగుము అని భార్యనతడు శపించెను.
ముని సంకల్పించినంతనే ఆమె భస్మరాశిగా మారెను. అది అంతే కదా! అవివేకముగా అతిగా పెరిగిపోయిన వారికి ముల్లోకములందును శుభము లేదు. కందళి శరీరమట్లు భస్మము కాగా అందలి జీవుడు ఆకాశమున నిలచి వినయముగా ఆ భర్తతో నిట్లు పలికెను.
జీవ ఉవాచ - జీవుడు పలికెను :
ఓ నాథా! ఎల్లప్పుడు జ్ఞాననేత్రముతో అన్ని చూచువాడవు నీవు. సర్వజ్ఞుడవు కనుక అన్ని ఎరుగుదువు. నీకు నేనేమి బోధింతును. మంచిమాటలు, కటువైన మాటలు, కోపము, దుఃఖము, లోభము, మోహము, కామము ఆకలిదప్పులు బలియుట, బక్కపడుట నాశము దృశ్యముగా అదృశ్యముగా జరుగునట్టి శరీర ధర్మములన్నియు ఆత్మకు సంబంధించినవి కావు. సత్త్వము రజస్సు తమస్సు అనెడి మూడు గుణములతో గూడినది శరీరము. అది నానావిధములుగా నుండును. నీకు తెలుపుదును. వినుము.
ఓ మునీ! ఒకటి కొంత సత్త్వముధికముగా గలది మరియొకటి కొంత రజోగుణమధికముగా గలది మరియొకటి తమోగుణము అధికముగా గలది ఇట్లు శరీరము నానా ప్రకారముగా నుండును తప్ప. అన్ని గుణములు సమానముగా నుండునది ఎక్కడ లేదు. సత్త్వగుణముతో ఉదయించిన ప్రాణికి ముక్తివాంఛ, రజోగుణముతో జన్మించిన ప్రాణికి కర్మలు యజ్ఞయాగాదులు చేయవలెనను కోరిక, తమోగుణమధికముగా నుండిన వారికి జీవహింసా వాంఛ కోపము అహంకారము ఉండును. ఇట్లు త్రిగుణములలో ఒక్కొక్క దాని పాలు అధికముగా నున్న వారి స్థితి యుండును. కోపము వలన కటువాక్కులు పలుకుట పరుషభాషణము వలన శత్రుత్వము దాని వలన ఎవనికి ప్రియమైన వ్యక్తి కాకపోవుట సంభవించును. కానిచో ఈ భూమి మీద ఎవనికెవడు శత్రువు? ఎవడు ప్రియుడు? ఎవడు అప్రియుడు? మిత్రుడెవడు? శత్రువెవడగును ? అంతట ఈ శత్రుత్వ మితృత్వములకు జ్ఞానేంద్రియములే విత్తనములు సుమా.
స్త్రీకి ఆమె ప్రియుడు ప్రాణముల కంటె అధికుడు. ఆ భర్తకు ఆమె ప్రాణముల కన్న ఎక్కువ ప్రియురాలు. దుష్ట వాక్యముల వలన అప్పటికప్పుడా క్షణములో ఇద్దరికి పగ ఏర్పడును. అంతయు కామ దోషము వలన దేనికి సంబంధించినది దానియందుండును. నాథా! నా అపరాధములన్నిటిని క్షమించుము. ఇప్పుడేమి చేయవలెనో చెప్పుము. నేనెక్కడికి పోవలెను? ఏమి చేయవలెను? నా జన్మ ఎక్కడ ఏర్పడును? ఈ ముల్లోకములలో నీకు తప్ప ఇంకొకనికి భార్యను కాజాలను. ఇట్లు పలికి ఆ జీవుడు మౌనము వహించెను.
దూర్వాసముని ఆ మాటలను విని దుఃఖము చేత దెబ్బతిన్నవాడై, మహాజ్ఞాని ఆత్మారాముడై కూడ స్మృతిని పోగొట్టుకొని మూర్ఛిల్లెను. ఆశ్చర్యము, ఎంతటి పండితులకైనను స్త్రీ నాశము (భార్య మరణము) అన్ని శోకముల కంటె గొప్పది కదా ! కొద్ది సేపటికి అతడు తేరుకొని ప్రాణములను త్యజింపబూనుకొని యోగాసనమున కూర్చుండి వాయువును కుంభింపజేసెను (ఊపిరిని ఆపివేసెను).
ఇంతలో అక్కడకొక బ్రాహ్మణ బాలుడు వచ్చెను. శ్యామ వర్ణముతో నున్ననతడు ఎర్రని వస్త్రములను నుదుట మంచి తిలకమును చేతిలో దండము ఛత్రమును (గొడుగు) ధరించి యుండెను. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోవుచుండెను. చిన్న వయస్సులో నున్నను శాంతుడు జ్ఞాని వేదవేత్తలలో శ్రేష్ఠుడుగా నుండెను. చిరునవ్వు చిందించుచున్న అతనిని చూచి దూర్వాసముని ఆశ్చర్యముతో లేచి నమస్కరించి ఆసనము మీద కూర్చుండబెట్టి భక్తితో పూజించెను. ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మునిని ఆశీర్వదించెను. అతని దర్శనము ఆశీర్వాదముల వలన దూర్వాసమునికి సర్వ దుఃఖములు తొలగిపోయెను. అట్లు శిశువుగా కొంతసేపుండి ఆ బాలుడు సదసద్విచక్షణ గల నీతిశాస్త్ర విశారదుడైనందున అమృతముతో సమానమైన నీతి సారమును మునికి వినిపించెను.
శిశురువాచ - బ్రాహ్మణ శిశువు ఇట్లనెను :
ఓ సర్వజ్ఞుడా! గురువు యొక్క మంత్రరూపమైన అనుగ్రహము వలన నీవన్ని ఎరుగుదువు. ఓ బ్రాహ్మణా! దుఃఖమునకు బెదరిన నిన్ను నేనేమి తత్త్వమడుగవలెను? బ్రాహ్మణులకు తపస్సే ధర్మము. తపస్సు వలన ముల్లోకములు సాధింపబడును. నీ స్వధర్మము వదిలి పెట్టి ఇప్పుడేమి చేయుచుంటివి ? ఈ ముల్లోకములలో ఎవనికెవతె భార్య ? ఎవతకెవడు భర్త ? మూర్ఖులను మోసపుచ్చుటకు శ్రీహరి ఇటువంటి మాయలు పన్నును. ఈ నీ పత్ని మిథ్య. అందువలన మిథ్యారూపయైన ఆమె వెళ్లిపోయినది. ఎక్కడ మిథ్యయొక్క ఉనికి కొద్దికాలమై ఆ వెనుక అదృశ్యమగునో అది సత్యము కాదు కదా !
పూర్ణురాలైన మాయాదేవి శ్రీకృష్ణునకు చెల్లెలిగా వసుదేవునికి పుత్రికగా పార్వతి యొక్క అంశతో జన్మించినది. ఆమె చిరంజీవిని. సచ్ఛీలవతి. ఆ సుందరియే ప్రతికల్పములో నీకు భార్య అగును. నీవిక సంతోషముతో కొంతకాలము తపస్సులో మనస్సు కుదుట పరచుకొనుము. ఈ భూమి మీద కందలి కదలీ జాతి (అరటి} కాగలదు. శుభకరము ఇతర జాతికి (వృక్షములకు) దుర్లభమైన ఒకే కాతతో మంచి ఫలము లిచ్చి మనోహరముగా నుండును. మరల కల్పాంతరములో శాంతరూపురాలైన భార్యగా నీకు లభించును. ఇట్లు చెప్పి విప్రరూపమునవచ్చిన జనార్దనుడు (విష్ణువు) దూర్వాసునకు జ్ఞానోపదేశము చేసి శీఘ్రముగా అంతర్థాన మొందెను.
దూర్వాసుడు అన్ని భ్రమలు వదిలి తపస్సు మీద మనస్సునిలిపెను. కందలి భూమండలములో కదలీ వృక్షజాతి అయ్యెను. సాహిసిక రాక్షసుడు తాలవనమునకు పోయి గార్దభాకారము పొంది విష్ణుచక్రము చేత ప్రాణములు వదిలి తాను మిక్కిలి వాంఛించు దుర్లభమైన శ్రీహరి పాదపద్మములను పొందెను. నారదా! తగిన సమయములో తిలోత్తమ బాణపుత్రికగా జన్మించి కృష్ణపౌత్రుని (మనుమని) ఆలింగన సుఖము పొంది తన కోరికలు నిండుగా తీర్చుకొని ఆ దేహాంతమున మరల తీలోత్తమయై తన నివాసమునకేగెను. ఇట్లు ఉత్తమమైన శ్రీకృష్ణాఖ్యానము వింటివి. ఇది ప్రతిపదమున రమణీయము. ఇకనేమి వినగోరుచున్నావు?
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన తాళఫలభక్షణ ప్రసంగమున చెప్పిన బలిపుత్రుని మోక్ష మనెడి ఇరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
