4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

96 - అధ్యాయము

శ్రీనారాయణ ఉవాచ :

మాధవ్యువాచ :

ఉద్దవ ఉవాచ :

శ్రీరాధోవాచ :

నారాయణుడిట్లన్నాడు : శ్రీకృష్ణుని స్మరించి వెళ్ళటానికి సిద్దమైన ఉద్ధవుని, రాధ పాదపద్మముల పైబడి తలవంచి నమస్కరిస్తున్న, పులకాంకితుడైన వానినిచూచి (1) ప్రేమతో చంచలమై, ఏడుస్తూ మాధవి అనే గోపిక ఇలా అన్నది. రాధవలన వియోగం కలుగబోతున్నదని భయపడుతున్న, గట్టిగా ఏడుస్తున్న భక్తునితో ఇట్లా అన్నది. (2) మాధవిపచనమిట్లా - ఉద్ధవ నేను చెప్పేది విను. నీకనుకూలమైనట్లుగా కొద్ది సేపు ఉండు.నీ మనస్సులో కోరిన, నిగూఢమైన, పరమజ్ఞానాన్ని ఇస్తాను. (3) పురాణముల వల్ల లభించనిది, గోప్యంగా వేదములలో ఉన్నది, అట్టి దానిని గూర్చి, ముల్లోకములను సృజించే రాధికను ప్రశ్నించు, ఓ మహాభాగ! (4) అని పలికి ఆ గోపికల పెద్ద ఆ సభ యందు కూర్చున్నది. ఉద్ధవుడు రాధికతో శాంతంగా, మధురంగా ఇట్లా అన్నాడు. (5) ఉద్ధవుని వచనమిట్లా - జీవి ఒంటరిగానే సంసారంలోకి వస్తాడు. మళ్లీ మళ్ళీ ఒంటరిగానే తిరిగిపోతాడు. ప్రాణి తన కర్మననుసరించి (పురుషుడు) తన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు.(6) కర్మ వల్లనే ప్రాణి జన్మిస్తాడు. కర్మవల్లనే లీనమౌతాడు. కర్మవల్లనే సుఖదుఃఖములను భయశోకములను పొందుతాడు. (7) భోగం మిగిలినందు వల్ల ప్రాణి ఆయా జన్మలందు భోగాన్ని అనుభవిస్తాడు. తిరిగి కర్మానుభవం వల్ల వస్తాడు, పోతాడు (8) ఓసతి! నీవు రత్నాదికములు ఏవి ఇచ్చావో, నాకు, అవి నాతో పాటు రావు. అటువంటప్పుడు వాటితో నాకేమి పని (9) సంసార సాగరాన్ని దాటటానికిఓదేవి! నీవు ఉత్తమమైన తెప్పవు. కృష్ణుడు స్వయంగా నావను నడిపేవాడు. అందరిని అవతలి దరికి చేర్చేవాడు. (10) భవసాగరాన్ని దాటటానికి కారణమైన దానాన్ని (వస్తువును) నాకివ్వు, కొంచము. దానిని, ఆ ప్రసాదాన్ని తీసుకొని కృష్ణుని మూలస్థానమైన మధురకు వెళ్తాను. (11) సురలకు నరులకు ఏది ఏదికాలగతో, ఓ తల్లి! కొంచం చెప్పు. పితరులకు, బ్రహ్మ లోకమునకు ఆపై దానికినీ చెందిన కాలగతిని చెప్పు. (12) ఆదుస్తరమైన ఘోరమైన కాలగతిని దాటి హరిపదానికి చేరుతాను. ఇట్టి ఉపాయాన్నినాకివ్వు, ఓ కమలాలయ! (13) దూరం నుండే రాత్రింబగళ్ళు ఎవని పాదపద్మములను దేవతలు, బ్రహ్మ ఈశుడు, శేషుడు మొదలగువారు ధ్యానిస్తారో ఆతని వక్షఃస్థలమందు నివసించేదానివి నీవు. (14) ఉద్దవుని మాటవిని కమలాలయనవ్వింది. వస్త్రంతో, ఆతని కన్నీటిని తుడిచి ఆమె, ఆతనితో ఇట్లా అంది. (15) రాధ వచనమిట్లా - ఉద్దవ! మాధవి మాటను విని నీవు ఈ ప్రశ్నవేస్తున్నావు. స్త్రీ జాతి బలహీనురాలు, లోకమందు. నీకు నేనేమి జ్ఞానమిస్తాను. (16) ఓ వత్స! శుద్ధమైన కాలగతిని, భగవంతుడైన హరి తెలుసుకుంటాడు. బ్రహ్మ, మహేశుడు, శేషుడు నాలు వేదాలు (17) తెలుసుకుంటాయి. ఓ పుత్రక! వేదాన్ననుసరించి సజ్జనులు కొంచం తెలుసుకుంటారు. గోలోకంలో రాసమండలమందు కృష్ణుని నోటినుండి విను. (18) గోలోకమందు, వైకుంఠ బ్రహ్మలోకాలలో ఇప్పుడు ఏ కాలగతి ఉందో దానినినీకు చెబుతాను. (19) నరులకు,పితరులకు, దేవతలకు బ్రహ్మలోకం మొదలగువానికి, బ్రహ్మాండము నుండి బయట ఉన్న లోకాలకు పాతాళ లోకాలకు నిశ్చితమైన (20) దాటరాని కాలగతిని పండితులు ఏ ఉపాయంతో దాటుతారో చెబుతాను, విను, ఓ బుధశ్రేష్ఠుడ! (21) కాలమునకు కాలమైన, జగత్తునకు గురువైన, జగత్తునకు నాధుడైన వానినిభజిస్తారు. ఆతడు నిర్గుణుడు,నిరీహుడు, పరమాత్మ ఈశ్వరుడు (22) ఆ సదాత్ముడు లేకపోతే ఈశరీరం వెంటనే పడిపోతుంది. ఆకాలగతిని సేవించి మాత్రమే తరిస్తాడు తప్పక. (23) అందరి ప్రాణుల ఆయస్సును సూర్యుడే హరిస్తాడు. శ్రీహరికి శుద్ధభక్తులైనవారి, సజ్జనుల, పుణ్యవంతుల ఆయస్సును హరించడు. (24) ఓ పుత్రక విధికి మానసిక పుత్రులైన వారిని నలుగురిని చూడు. వారు సనకాది భాగవతులు. వారి వయస్సు సుస్థిరమైనది. (25) రుద్రాదులను వయస్సుతో ఆదిత్యులను, జ్ఞానుల గురువులకు గురువులను, బాలురను, అనుపనీతులను, ఐదు సంవత్సరాల శిశువులలా ఉన్నవారిని, (26) అంతర్గతంగా చాలా గొప్పవైన వారిని ఎప్పుడూ చిరునవ్వు గల వారిని, దిగంబరులను, శ్రీకృష్ణుని ధ్యానంతో పవిత్రులైన వారిని, తీర్థమువలె పవిత్రులైన వారిని, వైష్ణవులను, (27) వేదవేదాంగ శాస్త్రముల చింతలేని వారిని, మానసికంగా బాగా వికసించిన వారిని, రాత్రింబగళ్ళు ఎప్పుడూ, భక్తితో, హరి భావన యందు తత్పరులైన వారిని.

బాహ్యపూజలేనివారు, మానసికంగా పవిత్రులైనవారు, మృత్యుంజయులు, మహాభాగులు, కాలమనువ్యాలము (పాము) జయించిన వారు. (29) వారేసనకుడు, సందుడు, సనాతనుడు, సనత్కుమారుడు వీరిని అన్ని విధములుగా స్మరించినవారు. (30) తీర్దమందు స్నానం చేసి నందువల్ల కలిగే ఫలమును పొంది చేసిన పాపం నుండి ముక్తులౌతారు. వీరికి హరిభక్తి కల్గుతుంది. హరిదాస్యాన్ని పొందుతారు. (31) మార్కండేయునిచూడు, కర్మవల్ల ద్విజోత్తముడు. పదిసంవత్సరాలవాడు బ్రహ్మతేజస్సుతో తీవ్రంగా వెలుగొందుచున్నాడు. (32) హరినే నమ్మినవాడు, సప్తకల్పముల చివరదాకా ఉంటాడు. ఐదు శిఖలు కలిగి తరింపదలచిన లోమకుడను ఆసురుణ్ణి చూడు, (33) ఏకర్మలులేనివాడు, హరి సేవనతత్పరుడు. శతకల్పముల కాలము హరిపదములను ధ్యానించేవాడు. (34) చిరజీవియైన జమదగ్ని సుతుడైన పరశురాముని చూడు. హనుమంతుని, బలిని, వ్యాసుని, అశ్వత్థామను చూడు. (35) కృపాళుడు, విప్రుడైన విభీషణుని, భల్లూకుడైన జాంబవంతుని చూడు. వీరంతా హరిభావనతో శుదులైనవారు, చిరజీవులు. (36)సిద్దేంద్రులు, మునీంద్రులు, ఇతర నరులు వీరిలో ఓ ఉద్దవ! హరిభావనతో శుదులైన వారంతా చిరంజీవులు(37) హిరణ్యకశిపు సుతుడైన ప్రహ్లాదుని దైత్యులలో చూడు. అంతములేని హరిద్వేషియైన హిరణ్యకశిపు సుతుని ప్రహ్లాదుని, హరిభావనతత్పరునిచూడు. (38) చిరాయుస్సు కల కాలమును జయించిన, పేరులేని ఇతరుని చూడు. అనేక జన్మల తపస్సువల్ల భారతదేశమందు జన్మపొందాడు. (39) హరిని సేవించని వారు మూడులు, పాపం చేసినవారు. వాసుదేవుని మరచి విషయములందు ఆసక్తిగల జనుడు. (40) అమృతాన్ని వదలి స్వేచ్ఛగా విషాన్ని భుజించే మహామూఢుని వంటివాడు. ఎవడి భార్య, ఎవని కొడుకు, ఎవని బంధువులు. (41) ఎవడు ఎవనికి బంధువు. భువిలో ఆపదలో శ్రీకృష్ణుడు తప్ప ఎవరులేరు. అందువల్ల సజ్జనులు రాత్రింబగళ్ళు ఎప్పుడూ కృష్ణుని భజిస్తారు. (42) జన్మ మృత్యుజర వ్యాధులను హరించేవాడు, అన్నిటిని హరించేవాడు, పరుడు, ఆ పరమాత్మ భజనము కాలాన్ని దాటటానికి చక్కని ఉపాయము. (43) పరిపూర్ణతముడైన ఆనందనందనుని కాలగతిని విను. ఓ వత్స! నాజ్ఞానమునకు తెలిసిన దానినిచెప్తాను. (44) నరులకు, పితరులకు, సురలకు, బ్రహ్మకు, నాగులకు,రాక్షసాదులకు, ఓ పుత్రక! తత్పరులైన వారికి (45) నిగూఢమైన అర్థమును చెబుతాను. సావధానంగా వినండి. అన్నింటికన్న పరమైన స్థానము. సర్వాధారుడు, మహావిరాట్టు. (46) ఆతని రోమములందు ఆ అసంఖ్యాకములైన విశ్వములున్నాయి. అన్నిటికన్న పరుడు, సూక్ష్ముడు, పరమాణువు, విను. (47) కాలారంభాత్మకుడు. సర్వుడు. ఊహకందనివాడు, పరుడు, ఈప్సితమైనవాడు. పరముడు. అనేక మంచివిశేషణములు కలవాడు. అనేకుడు, ఎప్పుడూ అసంయుతుడు (48) ఆతడు పరమాణువని తెలుసుకో. నరులకు ఐక్య భ్రమను కల్గించేవాడు. రెండు పరమాణువులు అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. (49) మూడు త్రసరేణువులతో ఒకత్రుటి. నూరుత్రుటులైతే ఒక వేధ. మూడు వేధలతో ఒక లవము.

మూడులవములతో నిమేషము. మూడు నిమేషములతో క్షణము. ఐదు క్షణములతో కాష్టము. పదికాష్టములతో లఘువు. (51) పది హేను లఘువులు ఒకదండం. దాని ప్రమాణము, విను. నాలుగు సార్లు నాలుగు వేళ్ళతో పద్దెనిమిది (ఆరు) పలములైతే (పరిమాణమైతే) అది మానము. (52) బంగారు మాషములతో ఛిద్రము చేయగా ఎంతవరకైతే జలపుతి వ్యాపిస్తుందో (అందు). రెండు దండలైతే ఒక ముహూర్తము. అరవైదండములు ఒకతిథి. (53) అందు ఎనిమిదవ భాగం ప్రహర, అని ప్రమాణం చెప్పబడింది. నాలుగు ప్రహరలైతే ఒకరాత్రి నాలుగు ప్రహరలైతే దినము. (54) పది హేను తిథులైతే ఒక పక్షము. రెండు పక్షములు మాసము. శుక్లము, కృష్ణ పక్షము అని. (55) రెండు నెలలకొక ఋతువు. ఆరు ఋతువులు ఒక వత్సరము. వసంతగ్రీష్మ వర్ష శరత్ హేమంత శీత (శిశర)ములని (56) కాలం తెలిసినవారు సంవత్సరాలు ఐదు విధాలన్నారు. అవి సంవత్సర, ప్రవత్సర, ఇలావత్సర (57) అనువత్సర, వత్సరమని ఐదు విధాలు. పన్నెండు నెలలు ఒక సంవత్సరము. (58) నెలల పేర్లు ఇవి. వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢ, శ్రావణ, భాద్ర, ఆశ్విన, కార్తీక, మార్గ, పౌష, మాఘపాలున (59) చైత్రములని, చైత్రము చివరిది. వర్షశేషము అన్నారు. చిత్రవైశాఖాలు వసంతం, (60) జ్యేష్ఠ ఆషాఢ గ్రీష్మం, శ్రావణ భాద్ర పదాలు వర్షము. ఆశ్విన కార్తికములు శరత్తు (61) మార్గశీర్ష పౌషములు హేమంతము. మాఘ పాలునములు శిశిరము. సంవత్సరానికి రెండు అయనాలు అవి ఉత్తర దక్షిణాయనాలు (62) మాఘ మొదలు ఆరుమాసాలు ఉత్తరాయణం, శ్రావణం మొదలు ఆరు మాసాలు దక్షిణాయనం (63) శ్రావణం నుండి పౌషం వరకు రాత్రి ఎక్కువ. ప్రతి పదనుండి పూర్ణిమ వరకు శుక్ల పక్షమనబడుతుంది. (64) పూర్ణిమ తరువాతి ప్రతిపదనుండి అమావాస్య వరకు కృష్ణ పక్షమని వేదవేత్తలు నిరూపించారు. (65) ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి (66) దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరకు లెక్కించాలి. (67) ఆశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర, పునర్వసు, (68) పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, (69) జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, అభిజిత్, ధనిష్ఠ, (70) శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఇది చివరిది. (71) ఇట్లా నక్షత్రాలు ఇరువది ఎనిమిది. ఇవి చంద్రునికి భార్యలు, క్రమంగా వాటితో కూడి చంద్రుడు రోజు ఉంటాడు.

ఆను॥ ఇరువది ఏడు నక్షత్రాలని, భార్యలని శ్రుతియందు చెప్పబడింది. అభిజిత్తను నది శ్రవణ నక్షత్రపుఛాయ. అందువలన ఇరువది ఎనిమిది నక్షత్రాలు అన్నారు. (73) ఒకసారి వసంత ఋతువులో చంద్రుడు, సౌందర్యవతియైన రోహిణితో, ప్రతిరోజు రాత్రింబగళ్ళు రమించాడు. అప్పుడు శ్రవణకోపించింది. (74) చంద్రునకు ఛాయను ఇచ్చి (అభిజిత్తును) భయంతో తండ్రి దగ్గరకు వెళ్ళింది. పిదవ తండ్రిని తెచ్చి విభాగం చేసింది. (75) అందువల్ల ఇదివరలో అభిజిత్తనే నక్షత్ర మేర్పడింది. శత శృంగపర్వతమందు కృష్ణుని ముఖం నుండి దీన్ని విన్నాడు. (76) ఓవత్స! నక్షత్రమెప్పుడు తిథితో కలిసి తిరుగుతుందని చెప్పారు. యోగకరణములను నానోటి నుండి విను. (77) విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము. అతిగండము, సుకర్మ, ధృతి, శూల (78) గండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము వరీయము, పరిఘ, శివము, (79) సిద్ధి, సాధ్యము, శుభము, శుక్లము, బ్రహ్మ, ఐంద్రము, వైధృతి ఇవి యోగములని చెప్పబడ్డాయి. ఇక కరణములు - (80) బవ, బాలవ, కౌలవ,తైతిల, గర, వణిజ, విష్టి శకుని (81) చతుష్పాత్, నాగము, కింస్తుఘ్నము, అని. నరులకు ఒక మాసమైతే పితరులకు, పగలు రాత్రి. (82) శుక్లపక్షం పగలు, కృష్ణ, పక్షంరాత్రి. నరులకు సంవత్సరమైతే సురలకు ఒక పగలు రాత్రి (83) ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల డెబ్బది ఒక్క యుగాలు ఒక మనువు కాలం, (84) మనువు ఆయువు, పరిమితమైనది. శక్రుని ఆయువు ఇరువది ఐదువేల ఐదువందల పరమైనది, అని (85) అక్కడ సూర్యుని గమనం లేదు. శక్రుని పాతముననుసరించి బ్రహ్మలోక నివాసులు రాత్రింబగళ్ళేరుగుదురు. (86) నరపలము దండద్వయము అట్లా శక్రుని పాతంతో ఏర్పడ్డపలము. ఇట్లా ముప్పది. దినములైతే ధాతయొక్క మాసంగా చెప్పబడింది. (87) పన్నెండు మాసములైతే ఒక సంవత్సరము. అట్లా బ్రహ్మకు నూరు సంవత్సరాలు. బ్రహ్మ పతనంతో శ్రీహరికి, నిమేషము, (88) ధాతువు పాతముననుసరించి, వైకుంఠములోపగలు రాత్రి ఉండదు. అక్కడ సూర్యగతి లేదు. ఇట్లా గోలోకమని తెలిపారు. (89) వైకుంఠవాసులకు పగలు రాత్రి తెలియదు. అక్కడ చంద్రుని, గ్రహముల గమనం లేదు. (90) రాశిఇచ్ఛననుసరించి అక్కడ రాశి చక్రము తిరుగదు. పరమాత్ముడైన కృష్ణుని తేజస్సుతో వెలిగేదిదనము. (91) హరిమందిరంలోకి వెళ్ళినప్పుడు, హరి తేజస్సు ఉండనిచో రాత్రి. ఇట్లా విష్ణులోకంలో ఎప్పుడు కాలగమనము ఉంటుంది. (92) భగవంతుడు కాలస్వరూపుడు, పరమాత్మ, ఆకారరహితుడు. ఏడు పాతాళ లోకములందు చంద్ర సూర్యుల గమనం లేదు.

అక్కడి వారు కూడా రాత్రింబగళ్ళు తెలుసుకుంటారు. పగటి పూట ఎప్పుడూ నాగుల తల పై మణి వెలుగుతుంది. (94) సంధ్యా కాలమందు అగ్నిమండుతుంది. రాత్రి చీకటి ఆవరిస్తుంది. అక్కడ ఉన్నవాళ్ళు కాలమును తామ్ర ప్రమాణంతో (ఎరుపులోని హెచ్చు తగ్గుల బట్టి) తెలుసుకుంటారు. (95) భూమి పై పరిమాణం ఎట్లో అక్కడ కూడా అట్లాగే. కృతవ్రేతద్వాపర కలి అని నాలుగు యుగాలు. (96) పన్నెండు వేల దేవ వత్సరాల కాలమది. నాలుగు వేల ఎనిమిది వందల (97) దేవ సంవత్సరాల కాలం కృతయుగము. అది పది హేడు లక్షల ఇరువది ఎనిమిది వేల మానవ ప్రమాణంగా చెప్పారు. ఒక లక్ష ఆరువందల సంవత్సరాల కాలము. (98, 99) దేవ వరమైతే త్రేతాయుగమని కాలవిదులన్నారు. పన్నెండు లక్షల తొంబది ఆరువేల (100) మానవ సంవత్సరాలు త్రేతాయుగమన్నారు. రెండు వేల నాలుగు వందల (101) దేవవరములు ద్వాపరమని కాలజులన్నారు. ఎనిమిది లక్షల అరువది నాలుగు వేల (102) మానవ వత్సరములు ద్వాపరయుగమని కాలజ్ఞులన్నారు. దేవతల ఒక వేయి రెండు వందల సంవత్సరాలు పరిమితిగలది కలియుగమని ప్రాజ్ఞులన్నారు. నాలుగు లక్షల ముప్పది రెండు వేల నరమానము సంవత్సరములు కలియుగమని కాలకోవిదులన్నారు. (103, 104) నలుబది రెండు లక్షల ఇరువదివేల నరమాన సంవత్సరములు నాలుగు యుగములని కాలజ్ఞులన్నారు. (త్రేత మూడు వేల ఆరువందల దేవ) సంవత్సరాలు అయ్యుండాలి. మొత్తం నరవత్సరాలు నలుబది మూడు లక్షల రెండు వందలు కావాలి అట్లైతే సరిపోతుంది. దేవతలది 12 వేలు నరులది 43 లక్షలు చిల్లర) (105) ఓవత్స! ఈ విధంగా కాలసంఖ్యానిరూపణాన్ని నీకు చెప్పాను. నేను విన్నట్లు నాకు తెలిసినట్లు చెప్పాను. ఓవత్స! హరిపురానికి వెళ్ళు (106) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రాధ ఉద్ధవ సంవాదమందు కాలనిరూపణమనేది తొంబది ఆరవ అధ్యాయము.